మన సైన్యం తగిన బుద్ధి చెప్పింది..
న్యూఢిల్లీః ఉగ్రవాదులకు మన సైనికులు తగిన బుద్ధి చెప్పారంటూ హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. ఆదివారం రాత్రి బారాముల్లా సరిసర సైనిక శిబిరాలపై భారీగా సాయుధ తీవ్రవాదులు దాడులు జరిపిన నేపథ్యంలో హోం మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల ప్రయత్నాలకు భారత సైన్యం గట్టి బుద్ధి చెప్పిందంటూ సైన్యానికి అభినందనలు తెలిపారు. లేహ్, కార్గిల్ ప్రాంతాల్లో రాజ్ నాథ్ రెండు రోజులపాటు పర్యటించనున్నారు.
మన భద్రతా దళాలు ఉగ్రవాదులను ఎంతో చాకచక్యంగా ఎదుర్కొంటున్నారని, దాడులకు తగిన జవాబు ఇస్తున్నారని హోం మంత్రి అన్నారు. జమ్మూ కాశ్మీర్ బారాముల్లా ప్రాంతంలోని ఆర్మీ, పారా మిలటరీ శిబిరాలపై ఆదివారం రాత్రి తీవ్రవాదులు జరిపిన దాడిపై మీడియాకు ప్రశ్నకు హోం మంత్రి ఆ విధంగా సమాధానం ఇచ్చారు. బారాముల్లా 46 రాష్ట్రీయ రైఫిల్స్ క్యాంపుపై ఆదివారం రాత్రి ఆత్మాహుతి దాడికి దిగిన ఉగ్రవాదులను బీఎస్ ఎఫ్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టిందని రాజనాథ్ వివరించారు.
శ్రీనగర్ లోని 46 రాష్ట్రీయ రైఫిల్స్ ప్రధాన కార్యాలయం వద్ద ఉగ్రవాదులు సృష్టించిన బీభత్సంలో సైనికులకు ఉగ్రవాదులకు మధ్య సుమారు నాలుగు గంటలపాటు హోరాహోరీ పోరాటం జరిగింది. ఈ నేపథ్యంలో జరిగిన కాల్పుల్లో ఓ జవాన్ వీరమరణం పొందగా.. మరో ఇద్దరు జవాన్లకు గాయాలైనట్లు భారత ఆర్మీ వెల్లడించింది. కాల్పుల్లో ఇద్దరు పాక్ మిలిటెంట్లను ఆర్మీ మట్టుబెట్టింది. మరో నలుగురు ఉగ్రవాదులు తప్పించుకున్నారు.
పీవోకే లోని తీవ్రవాదుల శిబిరాలపై భారత ఆర్మీ దళాలు సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన పక్షం రోజుల తర్వాత మొదటిసారి బారాముల్లాలో ఉగ్రవాదులు విరుచుకు పడ్డారు. భారత ఆర్మీ శిబిరాలపై ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలను కలసి వారి యోగ క్షేమాలను తెలుసుకోవడంతో పాటు, కాశ్మీర్ సమస్య పరిష్కారానికి వారి సలహాలను తీసుకునేందుకు రాజ్ నాథ్ లేహ్, కార్గిల్ ప్రాంతాల్లో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. శ్రీనగర్ తో పాటు ఇతర ప్రాంతాల్లో ఆందోళనలకు పరిష్కారం కనుగొనే దిశగా రాజనాథ్ పర్యటన కొనసాగుతుంది. అలాగే లఢక్ పర్యటనలో ప్రజలతో సంభాషించడం వల్ల వారు ఎదుర్కొనే సమస్యలను తెలుసుకుని, వాటిని త్వరలో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. హిజ్బుల్ ముజాహిదీన్ మిలిటెంట్ బుర్హాన్ వని మరణం అనంతరం జమ్ము కాశ్మీల్లో అశాంతి తలెత్తిన నేపథ్యంలో హోమ్ మినిస్టర్ ఆ ప్రాంతంలో పర్యటించడం ఇది నాలుగోసారి.