రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పకుండా మాట్లాడతారా?
కోల్ కతా: భారత్-బంగ్లాదేశ్ ల తీస్తా నదీ జలాల వివాదం త్వరలోనే పరిష్కారమవుతుందన్న కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ మండిపడింది. తీస్తా నదీ జలాల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంపద్రించకుండా రాజ్ నాథ్ మాట్లాడటం ఎంతమాత్రం సరికాదని పశ్చిమబెంగాల్ విద్యాశాఖ మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పార్ధ చటర్జీ విమర్శించారు. గత నాలుగు సంవత్సరాలక్రితం భారత్ -బంగ్లాదేశ్ ల తీస్తా నదీ జలాల పంపిణీ ఒప్పందాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై రాజ్ నాథ్ సింగ్ మంగళవారం పెదవి విప్పారు. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటన ఉన్నందున తీస్తా నదీ జలాల పంపిణీ వివాదానికి ముగింపు దొరుకుతుందని తెలిపారు.
దీనిపై మమతా బెనర్జీ సర్కారు మండిపడింది. ఆ అంశంపై తమతో చర్చించనప్పుడు ఆయన బహిరంగంగా మాట్లాడటం ఎందుకని చటర్జీ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న రాజ్ నాథ్ .. పార్టీ నాయకుడిలా మాట్లాడుతున్నారన్నారు. పార్టీ కార్యకర్తలను సంతోష పెట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్నారా? అంటూ చటర్జీ నిలదీశారు.