![Constable Sudhakar Reddy remanded in a case](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/police.jpg.webp?itok=CGnb46B3)
కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులకు బాధితురాలి ఫిర్యాదు
కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు
మేడ్చల్ రూరల్: సమస్య చెప్పుకునేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన యువతిని.. న్యాయం చేస్తానని లోబర్చుకుని గర్భవతిని చేశాడో కానిస్టేబుల్. ఆపై బెదిరింపులకు దిగాడు. బాధితురాలు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా కేసు నమోదు చేసిన పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా సదరు కానిస్టేబుల్‌ను రిమాండ్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్ ఇందిరానగర్ కాలనీలో ఉండే యువతి (31) డబ్బుల విషయమై తనను కొందరు ఇబ్బంది పెడుతున్నారంటూ ఫిర్యాదు చేసేందుకు గతేడాది మార్చి 21న తన తల్లితో కలిసి మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. క్రైమ్ విభాగం కానిస్టేబుల్ సుధాకర్‌రెడ్డి వారి సమస్య పరిష్కరిస్తానంటూ హామీఇచ్చి తన సెల్‌ఫోన్ నంబర్‌ను యువతికి ఇచ్చాడు.
ఇంటికి పిలిచి అఘాయిత్యం
మర్నాడు తన కేసు విషయమై యువతి కానిస్టేబుల్‌కు ఫోన్ చేసింది. లాయర్‌తో మాట్లాడదామంటూ ఆమెను తన ఇంటికి రప్పించి ఆమెను మాటల్లో పెట్టి, తనకు పెళ్లి కాలేదని మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడ్డాడు. మరోసారి కూడా ఇంటికి రప్పించుకుని ఇలాగే చేశాడు. యువతి గతేడాది జూలైలో గర్భం దాల్చడంతో ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించాడు.
ఈ క్రమంలో ఆగస్టు 15న యువతి సుధాకర్‌రెడ్డికి ఫోన్ చేయగా అతని భార్య ఫోన్ లిఫ్ట్ చేసింది. దీంతో అతడికి పెళ్లయిన విషయం తెలియడంతో యువతి కానిస్టేబుల్‌ను నిలదీసింది. ఆమె కారణంగా తన కుటుంబంలో గొడవలు తలెత్తాయని భావించిన సుధాకర్‌రెడ్డి యువతి అడ్డు తొలగించుకునేందుకు మేడ్చల్‌లోని ఆమె ఇంటికి వెళ్లి బలవంతంగా ఫినాయిల్ తాగించాడు.
అనంతరం సుధాకర్‌రెడ్డి దంపతులు సదరు యువతిని ఇంటికి పిలిపించుకుని దాడి చేశారు. అలాగే, తన మిత్రుడైన మరో కానిస్టేబుల్ ద్వారా సుధాకర్‌రెడ్డి యువతిని బెదిరింపులకు గురిచేశాడు. డిసెంబర్ 16న సుధాకర్‌రెడ్డి తన బండిపై యువతిని తీసుకెళ్లి గిర్మాపూర్ సమీపంలో కిందికి తోసేయడంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది.
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు
కానిస్టేబుల్ వ్యవహారం గురించి తెలిసి మేడ్చల్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ.. అతడిని సైబరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ చేయించారు. అయినా బెదిరింపులు ఆగకపోవడంతో ఆ యువతి ఈ నెల 3న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేసింది. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి సుధాకర్‌రెడ్డిని రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment