![Delhi Elections 2025: Most exit polls give BJP edge but AAP says This](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/AAP_On_Delhi_Exitpolls%5D.jpg.webp?itok=-9ckttQb)
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ చాలావరకు బీజేపీకే అనుకూలంగా వచ్చాయి. సుమారు 27 ఏళ్ల తర్వాత హస్తినలో కమలం వికసించబోతోందని, నాలుగోసారి ముఖ్యమంత్రి ప్రమాణం చేయాలనుకుంటున్న అరవింద్ కేజ్రీవాల్‌కు నిరాశ తప్పదని అంచనా వేశాయి. అయితే.. ఆప్ మాత్రం ‘హ్యాట్రిక్’ విజయంపై ధీమాతోనే ఉంది.
ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్(Delhi Exit Polls)ను ఆప్ తిరస్కరిస్తోంది. ప్రజాభిప్రాయాన్ని ఎగ్జిట్‌పోల్స్ ప్రతిబింబించవని చెబుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఆప్ విషయంలో ఎప్పుడూ తప్పాయని, కాబట్టి ఈసారి కూడా అదే జరగబోతోందని చెబుతోంది. అంతేకాదు.. గతంలో ఆ అంచనాలు తప్పిన సందర్భాలనూ సైతం ప్రస్తావిస్తోంది.
‘‘ఈ ఎగ్జిట్ పోల్స్(Exit Polls)ను మా పార్టీ ఖండిస్తోంది. గత నాలుగు ఎన్నికల్లోనూ ఢిల్లీలో ఆప్ అధికారానికి దూరంగా ఉంటుందంటూ పేర్కొన్నాయి. ఎన్నడూ కేజ్రీవాల్ పార్టీ అధికారం చేపడుతుందని చెప్పలేదు. కానీ, వాస్తవానికి జరిగింది ఏంటి?. రెండుసార్లు ఆప్ అధికారాన్ని చేపట్టింది’’ అని ఆప్ నేత సుశీల్ గుప్తా వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ మాత్రం ఎగ్జిట్‌పోల్స్ నివేదికలతో ఫుల్ జోష్‌లో ఉంది.
బుధవారం(ఫిబ్రవరి 5వ తేదీన) ఢిల్లీ అసెంబ్లీ 70 స్థానాలకు పోలింగ్ జరిగింది. దాదాపు సర్వే సంస్థలన్నీ బీజేపీదే విజయమని చెబుతున్నాయి. అయితే.వీప్రిసైడ్(Weepresie), మైండ్ బ్రింక్‌లు మాత్రం ఆప్ గెలవొచ్చని అంచనా వేస్తున్నాయి. ఇక.. కాంగ్రెస్ సున్నా నుంచి 3 సీట్లలోపే పరిమితం కానుందని చెప్పాయవి. అయితే ఎగ్జిట్‌పోల్స్‌పై కాంగ్రెస్ స్పందించాల్సి ఉంది.
అధికారంపై బీజేపీ ఆశలు
1993లో బీజేపీ తొలిసారి మదన్ లాల్ ఖురానా నేతృత్వంలో ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండేళ్ల తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలోఆయన్ని తప్పించి.. సాహిబ్ సింగ్ వర్మ ముఖ్యమంత్రిని చేసింది కమల అధిష్టానం. రెండున్నరేళ్ల తర్వాత.. చివర్లో సుష్మా స్వరాజ్‌ను సీఎం చేశారు. ఆ తర్వాత ఆమె నేతృత్వంలో 1998లో ఎన్నికలకు వెళ్లిన బీజేపీకి ఘోర పరాజయం ఎదురైంది. అప్పటి నుంచి మూడు పర్యాయాలు షీలా దీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగింది.
ఆ తర్వాత 2013 ఎన్నికల్లో ఆప్(AAP) విజయం కైవసం చేసుకోగా.. 48 రోజుల కేజ్రీవాల్ పాలన తర్వాత రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. ఏడాది తర్వాత.. 2015 ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తిరిగి ఆప్ ఘన విజయం సాధించింది. అప్పటి నుంచి అధికారంలో ఆప్ కొనసాగుతూ వచ్చింది. అయితే.. ఎన్నికల్లో కేజ్రీవాల్ మద్యం కుంభకోనం ఆరోపణలు రావడం, కేంద్రంలోని బీజేపీ కక్ష సాధింపుతో వేధిస్తుందని ఆప్ పదే పదే విమర్శించడం, రాష్ట్రంలో పరివర్తన్ వచ్చి ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ రావాలని బీజేపీ పిలుపు ఇవ్వడం.. ఈసారి ఎన్నికలపై ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కౌంటింగ్.. అదే రోజున ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment