
న్యూఢిల్లీ: ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. ప్రస్తుతం అన్ని పార్టీలు జోరుగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ నాల్గవసారి అధికారంలోకి రావాలని ఆశిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా తమ సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), ఢిల్లీ ఎలక్షన్ వాచ్‌లు ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం 699 మంది అభ్యర్థులకు సంబంధించిన ఒక నివేదికను విడుదల చేశాయి.
పార్టీల పరంగా చూస్తే నేరచరిత్ర కలిగిన అభ్యర్థులకు ఆమ్ ఆద్మీ పార్టీ అధికంగా టిక్కెట్లు కేటాయించింది. దీని తరువాత ఇటువంటి జాబితాలో కాంగ్రెస్, బీజేపీలున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 46 శాతం మంది 5 నుండి 12వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. 29 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులు. మొత్తం 132 మంది అభ్యర్థులు (19శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రకటించుకున్నారు. 81 మంది అభ్యర్థులు (12శాతం) తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులలో ఐదు శాతం మంది అత్యంత ధనవంతులు. వీరిలో బీజేపీకి చెందినవారు ముగ్గురున్నారు. కాంగ్రెస్ ఒక కోటీశ్వరునికి టికెట్ ఇచ్చింది. ఆప్ కూడా ఎన్నికల బరిలో ఒక బిలియనీర్‌ను నిలబెట్టింది. బీజేపీ నుంచి పోటీచేస్తున్న అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ అత్యంత ధనవంతుడు. అతని ఆస్తుల విలువ 2019లో రూ. 3.2 కోట్లు ఉండగా, అది నుండి 2025 నాటికి 96.5 కోట్లకు పెరిగిందని అతను సమర్పించిన అఫిడవిట్ ద్వారా వెల్లడయ్యింది.
ఇది కూడా చదవండి: ఎవరెస్ట్ ఎక్కాలంటే రూ. 21 లక్షలు కట్టాల్సిందే