Delhi Election: కుటుంబ ప్రతిష్టకు అగ్నిపరీక్ష | Delhi Election bjp aap congress Family members of leaders and mlas Contesting | Sakshi
Sakshi News home page

Delhi Election: కుటుంబ ప్రతిష్టకు అగ్నిపరీక్ష

Published Sat, Feb 8 2025 7:20 AM | Last Updated on Sat, Feb 8 2025 7:21 AM

Delhi Election bjp aap congress Family members of leaders and mlas Contesting

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన మూడు రోజుల తర్వాత, ఈరోజు(ఫిబ్రవరి 8)న ఓట్ల లెక్కింపు  జరగనుంది. ఈ ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతల కుటుంబాలకు అగ్నిపరీక్షగా మారాయి. ఈ మూడు పార్టీల నేతలు తమ కుటుంబ సభ్యులను, బంధువులను ఎన్నికల బరిలోకి దింపడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.  

ఈ మూడు పార్టీల నేతలు తాము బంధుప్రీతికి వ్యతిరేకమని చెబుతూనే తమ కుటుంబ సభ్యులను ఎన్నికల రణరంగంలోకి దించారు. ఈ కేటగిరీలో మొత్తం 22 మంది అభ్యర్థులున్నారు. ఏ పార్టీ ఎంతమంది అభ్యర్థులను నిలబెట్టింది? 
ఏ పార్టీ ఎందరు నేతల బంధువులకు టిక్కెట్లు ఇచ్చిందనే వివరాల్లోకి వెళితే..

మీడియాకు అందిన డేటా ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party)  రాజకీయ వారసుల జాబితాలో 11 మంది అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ ఎనిమిది మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. ఈ కేటగిరిలో ముగ్గురు అభ్యర్థులకు బీజేపీ అవకాశం ఇచ్చింది.

కాంగ్రెస్
న్యూఢిల్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న అభ్యర్థి సందీప్ దీక్షిత్‌(Sandeep Dixit) పేరు ఈ జాబితాలో ముందుగా వస్తుంది. ఆయన ఢిల్లీకి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ కుమారుడు.

మరో పేరు మాజీ ఎంపీ జై ప్రకాష్ అగర్వాల్ కుమారుడు ముదిత్ అగర్వాల్, అతను చాందిని చౌక్ స్థానం అభ్యర్థి.

మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి(Lal Bahadur Shastri) మనవడు ఆదర్శ్ శాస్త్రిని కూడా కాంగ్రెస్ తమ అభ్యర్థిగా నిలబెట్టింది. అతనికి ద్వారక అసెంబ్లీ స్థానం టికెట్ ఇచ్చింది.

కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే మంగత్ రామ్ సింఘాల్ కుమారుడు శివంక్ సింఘాల్‌ ఆదర్శ్ నగర్ నుండి పోటీకి దిగారు.

ఫరీదాబాద్ మాజీ ఎంపీ(కాంగ్రెస్‌) అవతార్ సింగ్ భదానా కుమారుడు అర్జున్ భదానాకు హర్యానా సరిహద్దులోని బదర్‌పూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై జంగ్‌పురా స్థానం నుంచి ఫర్హాద్ సూరికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఆయన ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ తాజ్‌దర్ బబ్బర్ కుమారుడు.

కాంగ్రెస్ పార్టీ అరిబా ఖాన్ కు ఓఖ్లా  స్థానం టికెట్ ఇచ్చింది. ఆమె కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆసిఫ్ మహ్మద్ ఖాన్ కుమార్తె.

ఇదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అలీ మొహమ్మద్‌ను ముస్తఫాబాద్ అభ్యర్థిగా నిలిపింది. ఆయన మాజీ ఎమ్మెల్యే హసన్ మెహందీ కుమారుడు.

ఆమ్ ఆద్మీ పార్టీ
ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బంధుప్రీతిని కనబరిచింది. ఈ జాబితా కింద పార్టీ మొత్తం  ఏడుగురు అభ్యర్థులను నిలబెట్టింది. ఇంతే కాకుండా ఆప్  తమ పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్ల భర్తలకు కూడా టిక్కెట్లు ఇచ్చింది. మొత్తం 11 మందికి ఆప్  ఈ కేటగిరీ కింద టిక్కెట్లు ఇచ్చింది.

ఆప్ పార్టీ మతియా మహల్ స్థానం నుంచి ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్ కుమారుడు అలే ఇక్బాల్‌ను బరిలోకి దింపింది.

సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్.కె. బగ్గా కుమారుడు వికాస్ బగ్గాకు కృష్ణ నగర్ సీటు టికెట్ ఇచ్చారు.

ఆమ్ ఆద్మీ పార్టీ చాందినీ చౌక్ స్థానం నుండి ఎమ్మెల్యే ప్రహ్లాద్ సింగ్ సాహ్ని కుమారుడు పురందీప్ సింగ్ సాహ్నిని పోటీకి దింపింది.

సీలంపూర్ స్థానం నుండి, మాజీ ఎమ్మెల్యే మతీన్ అహ్మద్ కుమారుడు చౌదరి జుబైర్ అహ్మద్‌ను అభ్యర్థిగా నిలబెట్టింది.

ఆప్ మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మహాబల్ మిశ్రా కుమారుడు వినయ్ కుమార్ మిశ్రాకు ద్వారక స్థానం నుంచి టికెట్ ఇచ్చింది.

ప్రస్తుత ఉత్తమ్ నగర్ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్‌కు బదులుగా ఈసారి ఆప్ ఆయన భార్య పోష్ బల్యాన్‌కు టికెట్ కేటాయించింది.

బీజేపీ
బీజీపీ ఈ ఎన్నికల్లో మిగిలిన పార్టీలతో పోల్చి చూస్తే, బంధుప్రీతి కాస్త తక్కువే చూపినట్లు కనిపిస్తోంది.

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీకి దిగారు.

మోతీ నగర్ స్థానం నుండి హరీష్ ఖురానాను పార్టీ నిలబెట్టింది. ఆయన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మదన్‌లాల్ ఖురానా కుమారుడు.

ఈ జాబితాలో మూడవ పేరు ఢిల్లీ కాంట్  బీజేపీ అభ్యర్థి భువన్ తన్వర్. ఆయన మాజీ ఎమ్మెల్యే కరణ్ సింగ్ తన్వర్ కుమారుడు.

ఇది కూడా చదవండి: Delhi Election: ఆ సీట్లలో ఆప్‌కు చుక్కలే..
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement