ఢిల్లీ కోట చిక్కింది! | BJP Won In Delhi Assembly Elections 2025 | Sakshi
Sakshi News home page

ఢిల్లీ కోట చిక్కింది!

Published Sun, Feb 9 2025 4:31 AM | Last Updated on Sun, Feb 9 2025 4:31 AM

BJP Won In Delhi Assembly Elections 2025

27 ఏళ్ల తర్వాత హస్తినలో బీజేపీకి అధికారం

అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌పై ఘనవిజయం

ఓటమి పాలైన కేజ్రీవాల్, సిసోడియా 

కనాకష్టంగా గట్టెక్కిన సీఎం ఆతిషి 

ముగ్గురు మినహా మంత్రులందరికీ ఓటమే 

వరుసగా మూడోసారీ సున్నా చుట్టిన కాంగ్రెస్‌ 

అయినా ఆప్‌ కొంప ముంచిన హస్తం పార్టీ 

14 చోట్ల బీజేపీ మెజారిటీ కంటే ఎక్కువ ఓట్లు 

ఆప్‌ ఓడింది కూడా సరిగ్గా 14 సీట్ల తేడాతోనే

న్యూఢిల్లీ: 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హస్తిన అసెంబ్లీపై కాషాయ జెండా ఎగిరింది. దేశ రాజధానిలో పదేళ్లుగా కంట్లో నలుసుగా, కొరకరాని కొయ్యగా మారిన ఆమ్‌ ఆద్మీ పార్టీని బీజేపీ ఎట్టకేలకు చిత్తు చేసింది. ఆ పార్టీ చేతిలో రెండు వరుస పరాభవాల అనంతరం ముచ్చటగా మూడో ప్రయత్నంలో ఘనవిజయం సాధించింది. సరిగ్గా పోలింగ్‌కు ముందు మోదీ సర్కారు గురిచూసి సంధించిన ఆదాయపన్ను మినహాయింపు పరిమితి పెంపు అస్త్రం బీజేపీ పాలిట రామబాణంలా పని చేసింది. 

కేజ్రీవాల్‌పై అవినీతి మరకలు, పదేళ్ల పాలన నేపథ్యంలో ఆప్‌పై ప్రభుత్వ వ్యతిరేకత అందుకు తోడయ్యాయి. దాంతో శనివారం వెల్లడైన ఫలితాల్లో బీజేపీ ఏకంగా మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను 48 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా ఆప్‌ 22 సీట్లకు పరిమితమైంది. మెజారిటీ మార్కుకు 14 స్థానాల దూరంలో నిలిచి తన పురిటిగడ్డ అయిన ఢిల్లీలో తొలిసారి ఓటమిని రుచిచూసింది. 

కాంగ్రెస్‌తో పొత్తు వద్దనుకోవడం ఆప్‌ భాగ్యరేఖలనే పూర్తిగా తలకిందులు చేసింది. ఎందుకంటే 14 అసెంబ్లీ స్థానాల్లో ఆప్‌పై బీజేపీ అభ్యర్థులు సాధించిన మెజారిటీ కంటే కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు రావడం విశేషం. స్వయానా ఆప్‌ సారథి కేజ్రీవాల్‌ కూడా న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో పరాజయం పాలయ్యారు. ఆయన పరాభవానికీ కాంగ్రెసే కారణంగా నిలిచింది. అక్కడ బీజేపీ అభ్యర్థి పర్వేశ్‌ వర్మ మెజారిటీ కంటే కాంగ్రెస్‌ అభ్యర్థి సందీప్‌ దీక్షిత్‌కు ఎక్కువ ఓట్లొచ్చాయి. 

అలా కాంగ్రెస్‌తో కటీఫ్‌ నిర్ణయం కేజ్రీవాల్‌తో పాటు మొత్తంగా ఆప్‌ పుట్టినే ముంచేసింది. బీజేపీ హవాలో ఆప్‌ నేత, సీఎం ఆతిషి కనాకష్టంగా గట్టెక్కగా ముగ్గురు మినహా ఆప్‌ మంత్రులంతా ఓటమి బాట పట్టారు. ఆప్‌ దిగ్గజ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా కూడా ఓటమి చవిచూశారు. అయితే ఆప్‌కు కోలుకోలేని షాకివ్వడం మినహా కాంగ్రెస్‌ కూడా బావుకున్నదేమీ లేదు. ఢిల్లీలో వరుసగా మూడోసారి కూడా ఖాతాయే తెరవలేక చెత్త హ్యాట్రిక్‌ను మూటగట్టుకుంది. 

ఆ పార్టీ అభ్యర్థులు చాలాచోట్ల ఏకంగా డిపాజిట్లే కోల్పోయారు! బీజేపీకి 45.56 శాతం ఓట్లు రాగా ఆప్‌కు 43.57 శాతం వచ్చాయి. కాంగ్రెస్‌ 6.34 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. 2020 ఎన్నికల్లో ఆప్‌ 53.57 శాతం ఓట్లతో 62 సీట్లు కైవసం చేసుకోగా బీజేపీ 38.51 శాతం ఓట్లతో కేవలం 8 సీట్లతో సరిపెట్టుకుంది. 2015లో ఆప్‌ ఏకంగా 67, బీజేపీకి కేవలం 3 సీట్లొచ్చాయి. 2013లో ఆప్‌ తన తొలి ఎన్నికల్లోనే ఢిల్లీ అసెంబ్లీలో 28 సీట్లు నెగ్గి సత్తా చాటింది. 

బీజేపీ ఢిల్లీలో చివరగా 1993 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. కానీ ఐదేళ్లలోనే ముగ్గురు సీఎంలను మార్చి అప్రతిష్ట మూటగట్టుకుంది. దాంతో 1998లో కాంగ్రెస్‌ చేతిలో పరాజయం పాలైంది. అప్పట్నుంచి 2013 దాకా 15 ఏళ్లపాటు షీలా దీక్షిత్‌ సారథ్యంలో హస్తినలో సాగిన కాంగ్రెస్‌ హవాకు ఆప్‌ ఆవిర్భావంతో తెర పడింది. 

ఆద్యంతం బీజేపీదే పైచేయి 
అటు బీజేపీ, ఇటు ఆప్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు ఈసారి ఆద్యంతం హోరాహోరీగా సాగింది. ఫిబ్రవరి 5న పోలింగ్‌ జరిగింది. శనివారం ఫలితాలు వెల్లడయ్యాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. కాసేపటికే ట్రెండ్స్‌ వెలువడ్డాయి. వాటిలో మొదటినుంచీ బీజేపీ హవాయే కొనసాగుతూ వచ్చింది. అడపాదడపా ఒకట్రెండు రౌండ్లలో మినహాయించి కేజ్రీవాల్‌ మొదటినుంచీ వెనుకంజలోనే కొనసాగుతూ వచ్చారు. 

మధ్యలో రెండు పార్టీల మధ్య అంతరం తగ్గినట్టు కన్పించినా చూస్తుండగానే బీజేపీ దూసుకెళ్లింది. దాంతో ఆ పార్టీ కార్యాలయంలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. నేతలు, కార్యకర్తలు, అభిమానులు బాణసంచా పేలుళ్లు, వాయిద్యాల హోరుతో హోరెత్తించారు. ఆప్, కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయాలు బోసిపోయి కన్పించాయి. ఇటీవలే హరియాణాతో పాటు కీలకమైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయంతో దూకుడు మీదున్న బీజేపీ అదే ఊపులో ఇప్పుడు ఢిల్లీనీ చేజిక్కించుకుంది. 

దాంతో దేశవ్యాప్తంగా కాషాయశ్రేణులు సంబరాల్లో మునిగిపోగా ఆప్, కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ డీలాపడ్డాయి. తాజా ఫలితాలతో విపక్ష ఇండియా కూటమి ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. బీజేపీ విజయాన్ని చరిత్రాత్మకంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివరి్ణంచగా ప్రజాతీర్పును అంగీకరిస్తున్నామని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని కేజ్రీవాల్‌ ప్రకటించారు. గెలుపోటములతో నిమిత్తం లేకుండా ప్రజల తరఫున తమ పోరాటం కొనసాగుతుందని ఆతిషి పేర్కొన్నారు. ఈ ఎన్నికలు ఆప్‌కే అగి్నపరీక్షగా నిలిచాయని తప్ప తమకు కాదని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు రాహుల్‌గాం«దీ, ప్రియాంకగాంధీ వద్రా చెప్పుకొచ్చారు. 

పర్వేశే సీఎం! 
బీజేపీ ఘనవిజయం నేపథ్యంలో ఢిల్లీకి కాబోయే సీఎం ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. అయితే కేజ్రీవాల్‌ను మట్టికరిపించిన జెయింట్‌ కిల్లర్‌గా మారిన పర్వేశ్‌సింగ్‌ పేరే ఈ జాబితాలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన తండ్రి సాహెబ్‌సింగ్‌ వర్మ కూడా 1993–98 మధ్య ఢిల్లీ సీఎంగా చేయడం విశేషం. సీఎం ఎవరన్నది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని పర్వేశ్‌తో పాటు ఢిల్లీ బీజేపీ చీఫ్‌ వీరేంద్ర సచ్‌దేవ కూడా చెప్పుకొచ్చారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement