ఫిబ్రవరి(2025)లో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. వ్యూహప్రతివ్యూహాలతో ముందుకుసాగుతున్నాయి. అయితే అటు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ఇటు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్.. ఈ పార్టీల కళ్లన్నీ దళిత ఓటర్లపైనే ఉన్నాయి. ఢిల్లీ రాజకీయాల్లో దళితుల ఓట్లు అధికారాన్ని నిర్ణయిస్తాయి. వీరి మద్దతు ఎవరికి ఉంటే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని గత ఎన్నికల గణాంకాలు చెబుతున్నాయి.
రాష్ట్రంలో 12 సీట్లు షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేశారు. అయితే దళితుల ఆధిపత్యం 20 సీట్లలో కొనసాగుతోంది. ఢిల్లీలో దళిత ఓటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఈ మూడు పార్టీలు దళితులను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఢిల్లీలోని 70 సీట్లలో 12 సీట్లు షెడ్యూల్డ్ కులాలకు (ఎస్‌సీ) రిజర్వ్ చేశారు. ఢిల్లీ జనాభాలో దాదాపు 17 శాతం మంది దళితులున్నారు. వీరిలో 38 శాతం మంది జాట్‌లు, 21 శాతం మంది వాల్మీకి సమాజానికి చెందినవారు.
ఈసారి ఢిల్లీలో బీజేపీ 14, కాంగ్రెస్ 13, ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) 12 మంది దళిత అభ్యర్థులను నిలబెట్టాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రిజర్వ్డ్ సీట్ల కంటే ఎక్కువమంది దళిత అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టాయి. బీజేపీ జనరల్ స్థానాల నుండి ఇద్దరు దళిత అభ్యర్థులను నిలబెట్టింది. వారు మాటియా మహల్ నుండి దీప్తి ఇండోరా, బల్లిమారన్ నుండి కమల్ బాగ్డి. కాంగ్రెస్ కూడా నరేలా జనరల్ స్థానం నుండి దళిత అభ్యర్థి అరుణ కుమారిని నిలబెట్టింది.
ఎస్సీ సీట్లపై ఆధిపత్యం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీలు
2020: ఆప్ 12 సీట్లు గెలుచుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది
2015: ఆప్ 12 సీట్లు గెలుచుకుంది.
2013: ఆప్ 9 సీట్లు గెలుచుకుంది.
2008: కాంగ్రెస్ 9 సీట్లు గెలుచుకుంది.
2003: కాంగ్రెస్ 10 సీట్లు గెలుచుకుంది.
1998: కాంగ్రెస్ 12 సీట్లు గెలుచుకుంది.
1993: బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది.
ఈ లెక్కలను అనుసరించి చూస్తే ఈసారి కూడా అధికారానికి షెడ్యూల్డ్ కులాల ఓట్లు కీలకంగా మారనున్నాయనే అంచనాలున్నాయి. అందుకే వివిధ పార్టీలు షెడ్యూలు కులాల సమస్యలను పరిష్కరిస్తామని చెబుతూ, వారిని తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. 20 దళిత ప్రాబల్య స్థానాల విషయానికి వస్తే 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 56 శాతం ఓట్లతో 19 సీట్లను సొంతం చేసుకుంది. నాడు బీజేపీ ఖాతాలోకి ఒకే ఒక సీటు వచ్చింది. కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు.
2015, 2020లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షెడ్యూల్డ్ కులాలకు(Scheduled Castes) రిజర్వ్ చేసిన 12 నియోజకవర్గాలలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. గత ఎన్నికల్లో కూడా బీజేపీ ఈ స్థానాల్లో రెండు లేదా మూడు కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోలేదు. ఢిల్లీలోని 12 సీట్లలో దళిత సమాజ ఓటర్లు 17 నుండి 45 శాతం వరకు ఉన్నారు. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఇది కూడా చదవండి: Delhi Election 2025: 14 బహిరంగ సభలకు సీఎం యోగి
Comments
Please login to add a commentAdd a comment