కీలక నేతలంతా హస్తినలోనే
ప్రచారంలో పలు రాష్ట్రాల సీఎంలు
5న పోలింగ్, 8న ఫలితాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. సోమవారం సాయంత్రంతో ప్రచార గడువు ముగియనుంది. దాంతో ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు.
అగ్రనేతలంతా ఢిల్లీ ప్రచారంలోనే
ఈసారి ఢిల్లీ పీఠం నీదా నాదా అన్నట్లు బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ సాగుతోంది. ప్రధాని మోదీ బహిరంగ సభల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆప్‌పై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ఢిల్లీ అభివృద్ధికి ఆప్ అడ్డుపడుతోందంటూ దుయ్యబడుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మొదలు బీజేపీ రాష్ట్రాల సీఎంలు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామీ, హరియాణా సీఎం నయాబ్‌సింగ్ సైనీలు భారీ బహిరంగ సభలతో పాటు, మూడేసి నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే ఢిల్లీ అభివృద్ధి చెందుతుందంటూ ప్రచార సభల్లో వ్యాఖ్యలు చేస్తున్నారు. పేదల ప్రభుత్వంగా పేరొందింన ఆప్ మరోసారి ఢిల్లీ పీఠం మాదేనంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. ఎవరెన్ని హామీలు ఇచ్చినా, గెలిచేది మాత్రం తామేనంటూ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, సీఎం అతిషి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నారు.
ఆప్‌కు మద్దతుగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ ప్రచారం నిర్వహించారు. ఓటర్లతో మమేకం అవుతూ.. పదేళ్లలో ఆప్ ఇచ్చిన ప్రతి వాగ్థానాన్ని అమలు చేసిందని గుర్తు చేస్తూ, మరోసారి ఆప్‌కు అవకాశం ఇవ్వాలని భగవంత్‌మాన్ అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ నడుంబిగించారు. పదేళ్లలో ఢిల్లీ అభివృద్ధి చెందలేదని, బీజేపీ వచ్చినా అభివృద్ధి సూన్యమేనంటూ ప్రచారసభల్లో వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలోనే మాత్రమే ఢిల్లీ అభివృద్ధిలో పరుగులు తీసిందని గుర్తు చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు.
సోషల్ మీడియాలో హోరాహోరీ
బీజేపీ, ఆప్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్దాలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. ఢిల్లీ అభివృద్ధిని ఆప్ అడ్డుకుంటుందని ప్రధాని మోదీ చేసిన కామెంట్లకు ఆప్ నేతలు ధీటైన సమాధానాలు ఇస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చే వరకూ బలహీన వర్గాల వారిని పట్టించుకున్న వారు లేరని, ఢిల్లీ లాంటి మహానగరంలో పాఠశాలల రూపురేఖలు మార్చి ప్రైవేటుగా ధీటుగా విద్యను అందిస్తున్నామంటూ ఆప్ బదిలిస్తుంది.
మెట్రో, తదితర అభివృద్ధి కార్యక్రమాలన్నీ తమ కాంగ్రెస్ హయాంలోనే ఢిల్లీలో జరిగిందని కాంగ్రెస్ చెప్పుకుంటుడగా.. బీజేపీ, ఆప్‌లు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. దేశాన్ని కాంగ్రెస్ దోచుకున్నది చాలంటూ బీజేపీ ఆరోపిస్తుండగా.. అంతుపట్టని అవినీతి, ఈవీఎంల ట్యాంపరింగ్, మతకల్లోహాలకు బీజేపీ కేరాఫ్ అంటూ ఆప్, కాంగ్రెస్‌లు సోషల్ మీడియా ద్వారా ప్రతిఘటిస్తున్నాయి.
నేటితో ఆఖరు
5వ తేదీన ఢిల్లీ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సొమవారంతో ప్రచారం పర్వం ముగియనుంది. దీంతో దేశంలోని జాతీయ కీలకనేతలంతా ఢిల్లీలోనే మకాం వేశారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.
బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రచారంలో దూసుకుపోతున్నారు. సోమవారం సాయంత్రంతో ప్రచారం ముగియడంతో.. బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌లకు చెందిన పార్టీల నేతలంతా వారి వారి బాధ్యతలలో నిమగ్నమైయ్యారు. సుమారు 50కి పైగా జాతీయ నేతలు ఢిల్లీలో మకాం వేసి మరీ ఎన్నికల హీట్‌ను పెంచుతున్నారు. ఎన్నికల ఫలితాలు 8న వెల్లడవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment