వీడియో: కన్నీళ్లను దిగమింగుకున్న ఆప్‌ నేత | AAP Leader Turns Emotional After Delhi Poll Defeat Video Viral | Sakshi
Sakshi News home page

వీడియో: కన్నీళ్లను దిగమింగుకున్న ఆప్‌ నేత

Published Tue, Feb 11 2025 1:34 PM | Last Updated on Tue, Feb 11 2025 2:45 PM

AAP Leader Turns Emotional After Delhi Poll Defeat Video Viral

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాభవంపై ఆప్‌ నేత, ఆరోగ్య శాఖ మంత్రి(కాబోయే మాజీ) సౌరభ్‌ భరద్వాజ్‌ భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీ గ్రాండ్‌ విక్టరీ కైవసం చేసుకోగా, అరవింద్‌ కేజ్రీవాల్‌ సహా ఆప్‌ దిగ్గజాలంతా ఈ ఎన్నికలో ఓడిన సంగతి తెలిసిందే. అయితే..  ఓటమిని అంగీకరిస్తున్నట్లు చెబుతూనే సౌరభ్‌ భదర్వాజ్‌ కన్నీళ్లను దిగమింగుకున్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భరద్వాజ్‌ బీజేపీ అభ్యర్థి షికా రాయ్‌ చేతిలో ఓడారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘ఆటలో గెలుపోటములు సహజమే. అలాగే రాజకీయాల్లో కూడా. నా.. పార్టీ ఓటమిని నేను అంగీకరిస్తున్నా. కానీ, కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకుంటుంటే మాత్రం భరించలేకపోతున్నా’’ అంటూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టబోయారాయన. అయితే వెంటనే పక్కకు వెళ్లి.. ఆ కన్నీళ్లను దిగమింగుకున్నారు.ఢిల్లీలో ఆప్‌ కోసం ప్రతీ కార్యకర్త కష్టపడ్డారని, వాళ్లను చూస్తే గర్వంగా ఉందని అన్నారాయన.  ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతోంది. 

 గ్రేటర్‌ కైలాష్‌ నియోజకవర్గం నుంచి గత రెండుసార్లు  జరిగిన ఎన్నికల్లో సౌరభ్‌ భరద్వాజ్‌ నెగ్గారు. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి.. బీజేపీ షికా రాయ్‌ చేతిలో మూడు వేల ఓట్ల ఆధిక్యంతో ఓడారు. షికా రాయ్‌కు 49,594 ఓట్లు పోలవ్వగా, భరద్వాజ్‌కు 46,406 ఓట్లు పడ్డాయి. అలాగే.. కాంగ్రెస్‌ అభ్యర్థి గర్విత్‌ సింఘ్వీకి 6,711 ఓట్లు పోలయ్యాయి. 2015 ఎన్నికల్లో బీజేపీ రాకేష్‌ కుమార్‌పై 14 వేల ఓట్లు, 2020 ఎన్నికల్లో 16 వేల ఓట్ల ఆధిక్యంతో భరద్వాజ్‌ గెలుపొందడం గమనార్హం. 

70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో.. బీజేపీ 48 సీట్లు దక్కించుకుని అద్భుత విషయం సాధించింది. గత రెండు ఎన్నికల్లో 67, 62 సీట్లు సాధించిన ఆప్‌.. ఈసారి 22 స్థానాలకు పడిపోయింది. ఇక.. కాంగ్రెస్‌ జీరోకి పరిమితమైంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక.. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరే అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement