బీజేపీ గెలిస్తే అవన్నీ ఆగిపోతాయి: కేజ్రీవాల్‌ కొత్త ట్విస్ట్‌ | Kejriwal Says If BJP wins welfare schemes will stop In Delhi | Sakshi
Sakshi News home page

బీజేపీ గెలిస్తే అవన్నీ ఆగిపోతాయి: కేజ్రీవాల్‌ కొత్త ట్విస్ట్‌

Published Sat, Feb 1 2025 12:53 PM | Last Updated on Sat, Feb 1 2025 1:11 PM

Kejriwal Says If BJP wins welfare schemes will stop In Delhi

ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వేళ దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయం రసవత్తరంగా మారింది. ముఖ్యంగా బీజేపీ, ఆప్‌ నేతలు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇప్పటికే యమునా నది నీటి విషయమై రెండు పార్టీల నేతలు వాదనలకు దిగారు. ఇక, తాజాగా ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి సంచలన కామెంట్స్‌ చేశారు. ఢిల్లీలో ఆప్‌ ఓడిపోతే.. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు మూతపడతాయి అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు దారి తీశాయి.

ఆప్‌ జాతీయ కన్వీనర్‌, మాజీ సీఎం కేజ్రీవాల్‌ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో కేజ్రీవాల్‌ మాట్లాడుతూ..‘ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల నేను ఒక బీజేపీ కార్యకర్తను కలిశాను. ఈ క్రమంలో అతడు నాతో మాట్లాడుతూ ఎన్నికల్లో మీరు ఓడిపోతే ఏం చేస్తారని అడిగారు. దీనికి మీకు సమాధానం తెలుసుకోవాలి. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌ ఓడిపోతే.. ఉచిత కరెంటు, నీరు, నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు అన్నీ ఆగిపోతాయి. 

బీజేపీ వీటన్నింటిని ఆపేస్తుంది. అంతేకాక.. మీకు నెలకు రూ.25 వేల ఖర్చు పెరిగిపోతుంది. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయో, 24 గంటల కరెంటు ఉందో, లేదో మీకు తెలుసు. బీజేపీ ప్రయోజనాల గురించి కాకుండా.. మీ కుటుంబాల గురించి ఆలోచించండి. బీజేపీ వీడతారా, లేదా అనేది మీ ఇష్టం. కానీ, ఈ ఎన్నికల్లో మాకు ఓటు వేయండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, కేజ్రీవాల్‌ వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

ఇదిలా ఉండగా.. కొద్దిరోజులు యమునా నది నీటి విషయంలో హర్యానా, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. యమునలో విషం కలిపారని ఆప్‌ నేతలు కామెంట్స్‌ చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. దీనికి బీజేపీ నేతలు ఆప్‌కు కౌంటరిచ్చారు. దీంతో, ఎన్నికల్లో యమునా నది విషయం కొత్త చర్చకు దారి తీసింది. ఇక, మొత్తం 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 8న  ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement