![Election Commission to begin counting of Delhi election votes 8 feb 2025](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/alla-p.jpg.webp?itok=-8OweAW4)
ఓట్ల లెక్కింపునకు పూర్తయిన ఏర్పాట్లు
వరుసగా మూడోసారి విజయంపై ‘ఆప్’ ధీమా
అధికారం బీజేపీదేనని వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
న్యూఢిల్లీ: హస్తిన అధికార పీఠం ఎవరికి దక్కుతుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడి కానున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. 19 కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 5న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
ఈసారి ఎన్నికల్లో 60.54 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తాము వరుసగా మూడోసారి విజయం సాధించడం తథ్యమని ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆ పార్టీ 2015లో 67 సీట్లు, 2020లో 62 స్థానాలు గెలుచుకుంది. అయితే, ఈసారి బీజేపీకి విజయావకాశాలు అధికంగా ఉన్నట్లు మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు స్పష్టంచేశాయి. ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత కమలం పార్టీ మళ్లీ అధికారంలోకి రాబోతోందని అంచనా వేశాయి. వరుసగా రెండుసార్లు ఘోర పరాజయం మూటగట్టుకున్న కాంగ్రెస్ ఈసారి ఆప్, బీజేపీలతో గట్టిగానే తలపడింది. అధికారం దక్కకపోయినా కొన్ని సీట్లయినా వస్తాయని కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు.
కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ అధికారులు
ఓట్ల లెక్కింపునకు ఒక్కరోజు ముందు ఢిల్లీలో హైడ్రామా చోటుచేసుకుంది. బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ ప్రారంభించిందని, తమ అభ్యర్థులను ప్రలోభపెట్టడానికి ప్రయతి్నస్తోందని, ఒక్కొక్కరికి రూ.15 కోట్ల చొప్పున నగదు, మంత్రి పదవులు ఇవ్వజూపిందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించడం సంచలనం సృష్టించింది. అధికారం సొంతం చేసుకోవడానికి బీజేపీ అడ్డదారులు తొక్కుతోందని ఆయన మండిపడ్డారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని, లేకపోతే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనాకు సైతం ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై వి.కె.సక్సేనా స్పందించారు. నిజాలు నిగ్గుతేల్చడానికి ఏసీబీ దర్యాప్తు జరపాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఫిరోజ్‌షా రోడ్డులోని కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన అందుబాటులోకి రాలేదు. దాంతో అధికారులు లీగల్ నోటీసు జారీ చేశారు. ఆరోపణలకు ఆధారాలు సమరి్పంచాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment