![Memes galore as BJP defeats AAP to win Delhi elections](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/M-4.jpg.webp?itok=ICvNx9VU)
బీజేపీ విజయంతో ఆప్, కాంగ్రెస్‌లపై వెల్లువెత్తిన మీమ్స్
న్యూఢిల్లీ: కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ గత రెండు పర్యాయాలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన సందర్భాల్లో బీజేపీని విమర్శిస్తూ మీమ్స్ వెల్తువెత్తగా ఈసారి మీమ్స్ సృష్టికర్తల దృష్టంతా ఆప్ మీదనే పడింది. దీనికి తగ్గట్లు ఆప్‌ను, కేజ్రీవాల్ నేతగణాన్ని విమర్శల జడివానలో ముంచేస్తూ కుప్పలు తెప్పలుగా మీమ్స్.. సామాజిక మాధ్యమ సంద్రంలోకి కొట్టుకొచ్చాయి.
ముఖ్యంగా 2023లో ఆప్ చీఫ్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానికి కాస్తంత హాస్యం జోడించి వాట్సాప్, ఇన్‌స్టా గ్రామ్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్‌లో జనం షేర్ చేసి ఆనందాన్ని పంచుకుంటున్నారు. ‘‘ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు బీజేపీ పలు రకాల కుట్రలు పన్నుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తెగ కలలు కంటున్నారు. ఎన్ని కుట్రలు పన్నినా దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆప్‌ను ఓడించలేరని బీజేపీ నేతలకు సైతం తెలుసు.
ప్రధాని మోదీకి నేను ఒక విషయం చెప్పదల్చుకున్నా. ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లో ఆయన మా పార్టీని ఈ జన్మలో ఓడించలేరు. దానికోసం ప్రధాని మోదీ మరో జన్మ ఎత్తాల్సి ఉంటుంది’’అని కేజ్రీవాల్ అన్నారు. 2017లోనూ కేజ్రీవాల్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘‘ఢిల్లీ రాష్ట్రానికి రాజకీయ పెద్దలం అంటే మేమే. మీమిచ్చే ఆదేశాలనే ఇక్కడి ప్రజలు పాటిస్తారు. ఢిల్లీని మేమే పరిపాలిస్తాం’’అని కేజ్రీవాల్ ఆనాడు అన్నారు. ఇంత బీరాలు పోయిన కేజ్రీవాల్‌నే బీజేపీ మట్టికరిపించిందంటూ కొత్త మీమ్స్ పుట్టుకొచ్చాయి.
ఆప్ అటు, కాంగ్రెస్ ఇటు
పరుగు పోటీలో అభ్యర్థులకు బీజేపీ, ఆప్, కాంగ్రెస్ ఎన్నికల గుర్తులు తగిలించి కొందరు నెటిజన్లు కొత్త మీమ్ సృష్టించారు. అందులో బీజేపీ, ఆప్ ముందుకు దూసుకుపోయేందుకు సిద్ధమైతే కాంగ్రెస్ వెనక్కు దూసుకుపోయేందుకు రెడీ అవుతున్నట్లు సరదా ఫొటోను సిద్ధంచేసి సామాజిక మాధ్యమాల్లోకి వదిలారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాలు సున్నాగా నమోదవడం తెల్సిందే.
దీనిని గుర్తుతెచ్చేలా పెట్రోల్ బంక్ వద్ద వాహనదారునికి సిబ్బంది ‘‘పెట్రోల్ కొడుతున్నా. ముందు మీటర్ రీడింగ్ సున్నా వద్దే ఉంది. చెక్‌చేసుకోండి సర్’’అన్నట్లు ఒక ఫొటోను రూపొందించారు. అయితే ఆ పెట్రోల్‌లో రాహుల్‌గాంధీ పనిచేస్తున్నట్లు సరదా మీమ్‌ను సృష్టించారు. ఆప్ వైఫల్యాలకు తగు కారణాలను పేర్కొంటూ ఇంకెన్నో మీమ్స్ వచ్చాయి. ఆప్ మాజీ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌ను కేజ్రీవాల్ సహాయకుడు చితకబాదగా ఓటర్లు ఆప్‌ను చావుదెబ్బ తీశారని మరో మీమ్ వచి్చంది.
ఐక్యత సున్నా
విపక్షాల ‘ఇండియా’కూటమి అంటూ ఘనంగా ప్రకటించిన కాంగ్రెస్, ఆప్ తదితర పార్టీలు తీరా ఢిల్లీ ఎన్నికల్లో బాహాబాహీగా విమర్శలు చేసుకోవడంపైనా మీమ్స్ వచ్చాయి. రెజ్లింగ్ రింగ్‌లోకి కేజ్రీవాల్ యమా హుషారుగా దూసుకొచ్చి తొడ కొడుతుంటే ఒక్క దెబ్బతో మోదీ ఆయనను మట్టి కరిపించి బరి ఆవలికి విసిరేసినట్లు చూపే మరో మీమ్ వీడియో ఇప్పుడు తెగ వైరల్‌గా మారింది.
బీజేపీ గెలుపు సంబరాలు చేసుకుంటుంటే అక్కడే ఉన్న తనను ఎవరూ మెచ్చుకోవట్లేదని స్వాతి మలివాల్ బాధపడుతుంటే దూరంగా నిల్చుని చూస్తున్న మోదీ వెంటనే అభినందనలు తెలుపుతున్నట్లు ఒక మీమ్ వీడియోను సృష్టించారు. ఎన్నికల క్రీడలో బీజేపీ, ఆప్‌సహా అన్ని పారీ్టలు గెలుపు కోసం ఆడుతుంటుంటే కాంగ్రెస్ మాత్రం తనకేం అక్కర్లేదన్నట్లు ఒక బెంచీపై కూర్చుని సరదాగా చూస్తున్నట్లు మరో మీమ్‌ను సృష్టించారు.
మాకే ఎక్కువ ఆనందం
ఈసారి గెలిచినందుకు మాకు ఆనందంగా ఉందని మోదీ, అమిత్ షా ఇద్దరూ నవ్వుకుంటుంటే.. మీ కంటే ఎక్కువ ఆనందం మాకే ఉందని అన్నా హజారే, స్వాతి మలివాల్, మరో మాజీ ఆప్ నేత కుమార్ విశ్వాస్ శర్మ చెబుతున్నట్లు ఉన్న మరో మీమ్ సైతం బాగా షేర్ అవుతోంది. ఇప్పటికే వేర్వేరు ఎన్నికల్లో ఓడిన ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, ఆప్ నేత సంజయ్ సింగ్‌లు బాధతో బనియన్, టవల్ మీద ఉన్న కేజ్రీవాల్‌కు పర్లేదులే అంటూ ఆనందంగా తీసుకొస్తున్న మీమ్ తెగ నవి్వంచేలా ఉంది.
అనార్కలీలాగా ఆప్ నాయకురాలు అతిశీ సింగ్ నేలపై పడిపోతే సలీమ్‌లాగా కేజ్రీవాల్ వచ్చి లేపుతూ.. ‘‘లే అనార్కలీ. ఇప్పుడు మనం మన ఓటమికి ఈవీఎంలో అక్రమాలే కారణం అని కొత్త పల్లవి అందుకోవాలి’’అని ఆమెను తట్టిలేపుతున్నట్లు మరో మీమ్ ఇప్పుడు బాగా నవ్వు తెప్పిస్తోంది. గతంలో జనాన్ని కేజ్రీవాల్ తన చీపురుతో తరిమికొడితే, ఇప్పుడు జనం చీపురుకు నిప్పు పెట్టి కేజ్రీవాల్‌ను కొడుతున్నట్లు రూపొందించిన మరో మీమ్ ఇప్పుడు సోషల్‌మీడియాలో ఎక్కువగా షేర్ అవుతోంది. పార్టీ ఓటమితోపాటు ఆప్ అగ్రనేతలూ ఓటమిని చవిచూశారంటూ.. ‘‘గుడిలో ప్రసాదంగా ఏమైనా పెడతారని లోపలికి వెళితే అప్పటికే పొంగళి అయిపోయింది. సర్లే అని బయటికొస్తే అప్పటికే చెప్పులూ పోయాయి’’అంటూ ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ చెబుతున్నట్లు మరో వ్యంగ్య వీడియోను నెటిజన్లు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌చేశారు.
Comments
Please login to add a commentAdd a comment