విద్యా రంగానికి రూ.1.28 లక్షల కోట్లు
ప్రాంతీయ భాషల్లో డిజిటల్ పాఠ్య పుస్తకాలు
ఐఐటీలు, ఐఐఎస్‌సీలో ఐదేళ్లలో పది వేల ఫెలోషిప్స్
కొత్తగా ఐదు నేషనల్ సెంటర్స్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్
50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్
రూ.500 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి రూ.1.28 లక్షల కోట్లను కేటాయించారు. ఇందులో ఉన్నత విద్యకు రూ.50,067 కోట్లు, పాఠశాల విద్యకు రూ.78,572 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఐఐటీలు, వైద్య విద్య, పాఠశాల విద్య, స్కిల్లింగ్‌కు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ.500 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నెలకొల్పనున్నట్లు బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
2024–25 బడ్జెట్‌లో విద్యా రంగం సవరించిన అంచనాలు రూ.1.14 లక్షల కోట్లుగా ఉన్నాయి. మానవ వనరుల అభివృద్ధి దిశగా కేటాయింపులు చేశారని, ఉద్యోగాల ఆధారిత అభివృద్ధి బ్రాండ్ ఇండియా సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బడ్జెట్‌ను స్వాగతించారు.
భారతీయ భాషా పుస్తక్ స్కీమ్..
ఈ ఏడాది కొత్తగా భారతీయ భాషా పుస్తక్ స్కీమ్‌ను ప్రకటించారు. దీని ద్వారా పాఠశాల విద్య, ఉన్నత విద్యలో ప్రాంతీయ భాషల్లోని పుస్తకాలను డిజిటలైజ్ చేయనున్నారు. దీనివల్ల విద్యార్థులు సులభంగా అన్ని అంశాలను అవగతం చేసుకునే వీలుంటుంది.
ఐఐటీల విస్తరణ..
2014 తర్వాత ఏర్పాటు చేసి న ఐదు ఐఐటీల్లో మౌలిక వసతులు విస్తరించి మరో 6,500 మంది విద్యార్థులకు సరిపడా సదుపాయాలు కల్పించనున్నారు. ఐఐటీ పాట్నాను పూర్తి స్థాయిలో విస్తరిస్తారు. గత పదేళ్లలో దేశంలోని 23 ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య 65 వేల నుంచి 1.30 లక్షలకు చేరిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మొత్తంగా ఐఐటీలకు రూ.11,349 కోట్లు కేటాయించారు. ఐఐటీలు, ఐఐఎస్‌సీ–బెంగళూరులో టెక్నాలజీ రీసెర్చ్ అభ్యర్థుల కోసం ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్స్‌ను వచ్చే ఐదేళ్లలో పది వేల మందికి అందిస్తారు.
నైపుణ్యాల పెంపు..
విద్యార్థులకు ఆయా వృత్తులు, విభాగాల్లో క్షేత్ర నైపుణ్యాలు అందించేలా గ్లోబల్ నైపుణ్యాలు, పార్ట్‌నర్íÙప్స్ కోసం కొత్తగా ఐదు నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. పాఠశాల స్థాయిలో ప్రభుత్వ స్కూళ్లలో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌ను నెలకొల్పనున్నారు. సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేలా గ్రామీణ ప్రాంతాల్లోని సెకండరీ పాఠశాలల్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ కల్పిస్తారు.
ఐఐఎంలకు పెరిగిన కేటాయింపులు..
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లకు గతేడాది రూ.227 కోట్లు కేటాయించగా ఈదఫా రూ.251 కోట్లను కేటాయించారు. ఐఎస్‌సీ, ఐఐఎస్‌ఈఆర్‌లకు కేటాయింపుల్లో రూ.137 కోట్ల మేర కోత విధించడం గమనార్హం. అంతర్జాతీయ స్థాయి కలిగిన ఇతర ఉన్నత విద్యా సంస్థలకు కేటాయింపుల్లో 50 శాతం మేర కోత పడింది.
ఏఐ ఆవశ్యకతకు గుర్తింపు
విద్యా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవశ్యకతను గుర్తించినట్లు తాజా బడ్జెట్ స్పష్టం చేస్తోంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఏఐ ఏర్పాటుతో విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. – వి. రాజన్న, టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్ (టెక్నాలజీ – సాఫ్ట్‌వేర్ సర్విసెస్)
రీసెర్చ్ ఔత్సాహికులు పెరుగుతారు
ఐఐటీలు, ఐఐఎస్‌సీలో రీసెర్చ్ ఫెలోషిప్స్‌ను పెంచడం వల్ల పీహెచ్‌డీ ఔత్సాహికుల సంఖ్య పెరుగుతుంది. మరిన్ని పరిశోధనలకు, ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుంది. – ప్రొఫెసర్. బి.ఎస్.మూర్తిఐఐటీ–హైదరాబాద్ డైరెక్టర్
స్పష్టత ఇవ్వాల్సింది
సర్వ శిక్ష అభియాన్, రీసెర్చ్ ఫెలోషిప్స్‌కు కేటాయింపులు పెంచడం హర్షణీయం. ఐఐటీల్లో సీట్ల పెంపు, మెడికల్ సీట్ల పెంపు విషయంలో స్పష్టత లేదు. బీటెక్ స్థాయిలో ఎన్ని సీట్లు, వైద్య విద్యలో ఎంబీబీఎస్ సీట్ల పెంపులో ప్రైవేట్, ప్రభుత్వ సీట్ల సంఖ్యను వేర్వేరుగా స్పష్టం చేస్తే బాగుండేది. ఉన్నత విద్యకు కేటాయింపులు తగ్గాయి. ఐఐఎస్‌సీ, ఐఐఎస్‌ఈఆర్‌లకు బడ్జెట్ కేటాయింపులు తగ్గించడం సరికాదు. – మహేశ్వర్ పేరి, ఫౌండర్, కెరీర్స్360
జాతి వృద్ధికి ఊతం
ప్రభుత్వ పాఠశాలలకు బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ, 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటుతో ప్రతి విద్యార్థికి ఇన్నోవేషన్ దిశగా ప్రోత్సాహం లభిస్తుంది. – నిపుణ్ గోయెంక, ఎండీ, జీడీ గోయెంక గ్రూప్
ఏటా కుదింపులు..
ఇది మరోసారి ప్రభుత్వ విద్యారంగాన్ని బలహీన పరిచే చర్యే. రూ.50.65 లక్షల కోట్ల బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయించిన నిధులు రూ.1,28,650 కోట్లు మాత్రమే. ఇది మొత్తం బడ్జెట్‌లో 2.53 శాతం. గత పదేళ్లలో 3.16 నుంచి 2.53 శాతానికి నిధులు తగ్గాయి. – ముత్యాల రవీందర్‌టీపీటీఎఫ్ అదనపు ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment