విశ్లేషణ
భారతదేశ మధ్య తరగతి బహుశా గడచిన మూడు దశాబ్దాల్లో ఇలాంటి బడ్జెట్ చూడ లేదు. ఆదాయ పన్నులో ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తుందని మోదీ సర్కారుపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇంత భారీ ఊరట లభిస్తుందని మాత్రం ఊహించలేదు. నగరాల్లో నెలకు కనీసం లక్ష రూపాయల ఆదాయం ఉన్నవారిని మాత్రమే మధ్య తరగతిగా పరిగణించాలని నేను గతంలో వాదించాను. అయితే, ఇలాంటి వాళ్లు దేశం మొత్తమ్మీద నాలుగైదు శాతం మాత్రమే ఉంటారు. ఇంత మొత్తం ఆర్జిస్తున్నవాళ్లు కూడా పన్నులు కట్టే పని లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.
ఎందుకీ ఉపశమనం?
ఫలితంగా ఈ స్థాయి ఆదాయమున్న వారి జేబుల్లోకి ప్రతి నెల ఆరు వేల రూపాయలు అదనంగా వచ్చి చేరుతుంది. ఈ డబ్బును ఇంటికి కావాల్సిన వస్తువుల కొనుగోలుకు వాడుకోవచ్చు. లేదంటే దాచుకుని చిరకాలంగా ఆశపడుతున్న స్మార్ట్‌ఫోన్ నైనా సొంతం చేసుకోవచ్చు.
మీ ఆదాయం నెలకు రెండు లక్షల రూపాయలనుకుంటే, మారిన పన్ను రేట్ల కారణంగా మీకు నెల నెలా రూ. 9,000 అదనంగా ఆదా అవుతుంది. దీన్ని రోజువారీ ఖర్చుల కోసం వాడు కోవచ్చు. ఫ్యాన్సీ రెస్టారెంట్‌కు వెళ్లి భోంచేయొచ్చు. ఏడాదిలో రూ. 1.10 లక్షలు మిగులుతుంది. ఈ డబ్బుతో 55 అంగుళాల టీవీ, అత్యాధునిక వాషింగ్ మెషీన్ కొనుక్కోవచ్చు.
ఇంకోలా చెప్పాలంటే, పన్నుల మినహాయింపు పొందిన మధ్య తరగతి విరగబడి కొనుగోళ్లు చేస్తుందనీ, తద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమొస్తుందనీ మోదీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇదే జరిగితే దేశంలో, ముఖ్యంగా నగర మధ్యతరగతి వినియోగం తగ్గుతోందన్న ఫిర్యాదులకు ఫుల్‌స్టాప్ పడుతుంది.
2022–23లో దేశంలో దాదాపు 7 కోట్ల మంది ఏడాదికి రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించారని దాఖలైన ఆదాయ పన్ను రిటర్న్స్ చెబుతున్నాయి. వీరిలో దాదాపు రెండు కోట్ల మంది పన్నులు చెల్లించారు. ప్రస్తుతం వేతనాల్లో పెంపును పరిగణనలోకి తీసుకున్నా, పన్ను రేట్లలో వచ్చిన మార్పుల కారణంగా సుమారు 1.5 కోట్ల మంది పన్ను పరిధిలోంచి జారిపోతారు. అంటే, పన్ను చెల్లింపుదారుల సంఖ్య సుమారు 1.4–1.6 కోట్లకు పడిపోనుంది. వీరిలో ఏడాదికి రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించే వారూ ఉంటారు. ఇది మొత్తం మన శ్రామిక శక్తిలో కేవలం 4 శాతం మాత్రమే.
ప్రభుత్వ అంచనా వేరే!
పరిస్థితి ఇలా ఉంటే, ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ పన్ను రాబడుల లెక్కలు ఇంకోలా ఉన్నాయి. 2025 బడ్జెట్ అంచనాల ప్రకారం, ఆదాయపు పన్ను రూపంలో వచ్చే మొత్తం రూ.1.8 లక్షల కోట్లు ఎక్కువ కానుంది. ఇంకోలా చెప్పాలంటే ప్రస్తుత ఆర్థిక సంవ త్సరం వచ్చిన దానికంటే రానున్న సంవత్సరం వచ్చే మొత్తం 14 శాతం ఎక్కువ. గతేడాది ప్రభుత్వ అంచనాలతో పోలిస్తే ఇది 21 శాతం ఎక్కువ. దీన్నిబట్టి చూస్తే ఆర్థిక మంత్రి చెప్పినట్లుగా పన్ను రేట్లలో మార్పుల వల్ల ప్రభుత్వానికి ఒక లక్ష కోట్ల రూపాయల నష్టం జరగడం లేదు. పాత రేట్లు, శ్లాబ్స్ కొనసాగి ఉంటే ప్రభుత్వం 22 శాతం వరకూ ఎక్కువ ఆదాయపు పన్నులు వసూలు చేసి ఉండేది.
ఆదాయ పన్ను రాబడి పెరిగేందుకు ఒకే ఒక్క మార్గం... వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రజల వ్యక్తిగత ఆదాయం బాగా పెరగడం! ఇలా జరిగే సూచనలైతే లేవు. నిజానికి కృత్రిమ మేధ, వేర్వేరు ఆటో మేషన్ పద్ధతుల ప్రాచుర్యం పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగాల సంఖ్య తగ్గేందుకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా జీతాలు కూడా స్తంభించిపోతాయి. తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఇప్పుడు ఏడాదికి రూ.12 లక్షల ఆదాయం ఆర్జిస్తున్న వ్యక్తి గురించి ఆలోచిద్దాం. ఆదాయపు పన్ను కొత్త విధానాన్ని ఎంచుకుంటే ఇతడికి రూ.70 వేల వరకూ మిగులుతుంది. ఇంత మొత్తాన్ని వస్తు, సేవల కోసం ఖర్చు పెట్టగలడు. ఒకవేళ ఆదాయం పది శాతం తగ్గితే? అప్పుడు పన్ను మినహాయింపులు అక్కరకు రావు. వాస్తవికంగా ఖర్చు పెట్టడం ఇప్పటికంటే మరింత తక్కువైపోతుంది.
ఇంకో పెద్ద ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఖర్చు చేయడం తగ్గించుకుంటోంది కాబట్టి ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారనుంది. గత ఏడాది కంటే ఈసారి ప్రభుత్వం పెట్టిన ఖర్చు 6.1 శాతం మాత్రమే ఎక్కువ. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇంకో 5 శాతమే అదనంగా ఖర్చు పెట్టాలని యోచిస్తోంది. ద్రవోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే ఈ పెంపుదల కేవలం 1.5 శాతమే అవుతుంది.
పెట్టుబడులు తగ్గించుకుంటున్న ప్రభుత్వం
రోడ్లు, హైవేలు, ఇతర మౌలిక వసతుల కోసం ప్రభుత్వం గతంలో ఖర్చు పెట్టినదానికి ఇది పూర్తి భిన్నం. ఆ ఖర్చులో పెరుగుదల జీడీపీ పెంపునకు దారితీసింది. ఈసారి మూలధన వ్యయం గత ఏడాది కంటే కేవలం ఒకే ఒక్క శాతం ఎక్కువ ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ద్రవ్యోల్బణాన్ని పరిగణిస్తే అసలు మొత్తం ఇంకా తక్కువగా ఉంటుంది కాబట్టి... ఈ ఏడాది మౌలిక వసతులపై పెట్టే ఖర్చు తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదు.
అంటే, మౌలిక వసతుల రంగానికి అనుబంధమైన స్టీల్,సిమెంట్, తారు, జేసీబీల్లాంటి భారీ యంత్రాలు, బ్యాంకులు కూడా డిమాండ్‌లో తగ్గుదల నమోదు చేయవచ్చు. ఇదే జరిగితే ఆయా రంగాల్లో వేతనాల బిల్లులు తగ్గించుకునే ప్రయత్నం అంటే... వేత నాల్లో కోతలు లేదా ఉద్యోగాల కుదింపు జరుగుతుంది. ఇది మధ్య తరగతి వారి ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ప్రభుత్వం ఈ ఏడాది కార్పొరేట్ కంపెనీల ద్వారా ఎక్కువ ఆదా యపు పన్ను ఆశించడం లేదని అంచనా కట్టింది. జీడీపీ విషయంలోనూ ఇంతే. వృద్ధి నామమాత్రమేనని ప్రభుత్వం భావిస్తోంది.
పెట్టుబడులు పెరగకపోతే?
ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తాను లక్ష్యించుకున్న కార్పొరేట్ పన్నులు కూడా పూర్తిగా వసూలు చేయలేకపోయింది. మొత్తం 10.2 లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీల ద్వారా వస్తుందని ఆశిస్తే వసూలైంది రూ.9.8 లక్షల కోట్లు మాత్రమే. అదే సమయంలో ఆదాయపు పన్ను రాబడులను మాత్రం రూ.11.9 లక్షల కోట్ల నుంచి రూ.12.6 లక్షల కోట్లకు సవరించింది. అంటే ప్రభుత్వం కార్పొరేట్ పన్నుల కంటే 28 శాతం ఎక్కువ ఆదా యపు పన్ను రూపంలో వసూలు చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా కార్పొరేట్ పన్నుల కంటే ఆదాయపు పన్నులు 33 శాతం ఎక్కువ వసూలు చేస్తామని చెబుతోంది. ఇది ఆర్థిక వ్యవస్థ బాగు పడుతోందనేందుకు ఏమాత్రం సూచిక కాదు.
ప్రభుత్వం లేదా ప్రైవేట్ రంగం నుంచి ఎక్కువ పెట్టుబడుల్లేకుండా... కేవలం ఆదాయపు పన్ను రాయితీలతోనే వినియోగం పెరిగిపోతుందని ఆశించడంలో ఉన్న సమస్య ఇది. మధ్య తరగతి ప్రజల జేబుల్లో కొంత డబ్బు మిగిల్చితే, కొన్ని రకాల వస్తు సేవలకు తాత్కాలిక డిమాండ్ ఏర్పడవచ్చు. కానీ, ఆర్థిక వ్యవస్థ విస్తృత స్థాయిలో ఎదగకపోతే ఆ డిమాండ్ ఎక్కువ కాలం కొనసాగదు.
ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌పై మరింత పెట్టుబడి పెట్టేందుకు కంపెనీలు సిద్ధంగా కనిపించడం లేదు. వీరి ప్రాజెక్టుల్లో అధికం ప్రభుత్వ మౌలిక వసతుల కల్పనకు సంబంధించినవే. అవే తగ్గిపోతే, కార్పొరేట్ కంపెనీలు కూడా తమ పెట్టుబడులను కుదించుకుంటాయి. దీంతో పరిస్థితి మొదటికి వస్తుంది. ఆదాయపు పన్ను రిబేట్లు ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం సాయం చేయనివిగా మిగిలిపోతాయి!
అనింద్యో చక్రవర్తి
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, ఆర్థికాంశాల విశ్లేషకులు
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment