2025–26 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
2047 కల్లా వికసిత భారతే లక్ష్యం
పది రంగాల్లో ప్రగతిపై ప్రత్యేక దృష్టి
సాగు, ఎంఎస్‌ఎంఈ, పెట్టుబడులే గ్రోత్ ఇంజన్లు
ఆర్థికం సహా ఆరు కీలక రంగాల్లో భారీ సంస్కరణలు
వేతన జీవులపై అనూహ్య కరుణ
గమ్యస్థానం: వికసిత భారత్
దారిదీపం: సమష్టి కృషి
ఇంధనం: కొత్త తరం సంస్కరణలు
స్థూలంగా చెప్పాలంటే 2025–25 కేంద్ర బడ్జెట్లో నిర్మలమ్మ( Nirmala Sitharaman) ఆవిష్కరించిన పంచ రంగుల చిత్రం సారాంశమిదే! మధ్య తరగతి కొనుగోలు శక్తిని, తద్వారా అంతిమంగా ఆర్థిక వృద్ధి రేటును ఇతోధికంగా పెంచడం, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను విస్తృతపరచడమనే మోదీ ప్రభుత్వ లక్ష్యాలను బడ్జెట్లో ఘనంగానే ఆవిష్కరించారు విత్త మంత్రి. ‘‘ఇది సామాన్యుల బడ్జెట్. 2047 నాటికి వికసిత భారత్ కల సాకారం దిశగా ఇదో పెద్ద ముందడుగు’’ అని చెప్పుకున్నారు.
పౌరులందరి ప్రగతే (సబ్ కా వికాస్) లక్ష్యంగా పలు పథకాలను, చర్యలను ప్రతిపాదించారు. ‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అన్న తెలుగువారి అడుగుజాడ గురజాడ పంక్తులతో ప్రసంగం మొదలు పెట్టారు. ‘పేదరికం లేని సమాజం, అందరికీ అందుబాటులో ఉండే నాణ్యమైన, పాఠశాల విద్య, వైద్య సదుపాయాలు, నైపుణ్యంతో కూడిన కార్మిక శక్తి–వారికి మెరుగైన ఉపాధి, మహిళల్లో కనీసం 70 శాతం మందికి ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వామ్యం, భారత్‌ను ప్రపంచ ఆహార పాత్రగా తీర్చిదిద్దేలా రైతన్నకు వెన్నుదన్నుగా నిలవడం’ తమ ప్రభుత్వ లక్ష్యాలని పేర్కొన్నారు.
వాటి సాధనకు ‘ఆర్థిక వృద్ధి–ఉత్పాదకత, గ్రామీణ స్వావలంబన, వృద్ధి పథంలో సమష్టి అడుగులు, మేకిన్ ఇండియా ద్వారా నిర్మాణ రంగానికి పెద్దపీట, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మరింత తోడ్పాటు, ఉద్యోగిత ఆధారిత వృద్ధి, మానవ వనరులపై భారీ పెట్టుబడులు, రక్షిత ఇంధన సరఫరాలు, ఎగుమతులు, ఇన్నోవేషన్లకు ఇతోధిక ప్రోత్సాహం’... ఇలా పది రంగాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రస్థానంలో వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, పెట్టుబడులు, ఎగుమతులను నాలుగు ప్రధాన చోదక శక్తులుగా పేర్కొన్నారు.
పన్నులు, ఇంధన, పట్టణాభివృద్ధి, గనులు, ఆర్థికం, నియంత్రణ... ఈ ఆరు కీలక రంగాల్లో వచ్చే ఐదేళ్ల పరిధిలో భారీ సంస్కరణలను ప్రతిపాదించారు. కాకపోతే లక్ష్యాలను ఘనంగా విధించుకున్న మంత్రి, వాటి సాధనకు ఏం చేయనున్నారనేది మాత్రం ఇదమిత్థంగా చెప్పకుండా పైపై ప్రస్తావనలతోనే సరిపెట్టారు. వేతనజీవికి వ్యక్తిగత వార్షిక ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని ఏకంగా రూ.12 లక్షలకు పెంచేశారు. తద్వారా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మధ్య తరగతిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కొత్త ఆదాయ పన్ను బిల్లును వారంలో ప్రవేశపెడతామని తెలిపారు. పన్నుల రంగంలో భారీ సంస్కరణలకు తెర తీస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. మోదీ సర్కారు మానస పుత్రికలైన స్టార్టప్‌లు, డిజిటల్ ఇండియా తదితరాలకు నామమాత్రపు కేటాయింపులతోనే సరిపెట్టారు.
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం 2025–26 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.50,65,345 కోట్లతో కూడిన పద్దును పార్లమెంటుకు సమర్పించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు 4.4 శాతం ఉండొచ్చని మంత్రి జోస్యం చెప్పారు. జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతానికే పరిమితం కావచ్చన్న అంచనాల నేపథ్యంలో సంక్షేమాన్ని, సంస్కరణలను పరుగులు పెట్టించేలా పలు చర్యలను ప్రతిపాదించారు. 74 నిమిషాల బడ్జెట్ ప్రసంగంలో ఆమె ఏమేం చెప్పారంటే...
పరిశ్రమలకు మహర్దశ
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)ల్లో పెట్టుబడులను రెట్టింపునకు పైగా పెంచనున్నట్టు మంత్రి వివరించారు. ‘‘ప్రస్తుతం కోటికి పైగా ఎంఎస్‌ఎంఈల ద్వారా 7.5 కోట్ల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. వాటికి ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లకు పైగా రుణ సదుపాయం అందనుంది. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు రుణ పరిమితి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు, స్టార్టప్‌లకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెరగనుంది. తయారీ రంగంలో మేకిన్ ఇండియాకు మరింత ప్రాధాన్యం దక్కనుంది’’ అని చెప్పారు.
చదువుకు జేజే
ఈ ఏడాది మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో 10 వేల అదనపు సీట్లు, ఐఐటీల్లో కనీసం 6,500 అదనపు సీట్లు అందుబాటులోకి రానున్నట్టు విత్త మంత్రి ప్రకటించారు. ‘‘రూ.500 కోట్లతో సాగు, ఆరోగ్యం తదితర రంగాల్లో కృత్రిమ మేధలో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటవుతాయి. భారత్‌నెట్ ప్రాజెక్టు కింద గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటికీ బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం అందుబాటులోకి తేనున్నాం. బాలల్లో శాస్త్రీయ జిజ్ఞాసను పెంపొందించేందుకు సర్కారీ స్కూళ్లలో వచ్చే ఐదేళ్లలో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబులు ఏర్పాటవుతాయి. ‘భారతీయ భాషా పుస్తక్’ పథకంతో స్థానిక భాషల్లోని ప్రభుత్వ పాఠ్య పుస్తకాలన్నీ డిజిటల్ రూపంలో అందుబాటులోకి వస్తాయి’’ అని తెలిపారు.
పట్టణాలకు ప్రాధాన్యం
పట్టణాలను గ్రోత్ హబ్‌లుగా తీర్చిదిద్దడానికి రూ.లక్ష కోట్లతో అర్బన్ చాలెంజ్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా అమలు చేసే ప్రతి పథకంలోనూ నాలుగో వంతు నిధులను కేంద్రం అందజేస్తుంది. 2047 కల్లా కనీసం 100 గిగావాట్ల అణు విద్యుదుత్పత్తే లక్ష్యంగా న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.
మెడికల్ టూరిజానికి ఊపు
మెడికల్ టూరిజంలో భాగంగా రూ.20 వేల కోట్లతో ‘హీల్ ఇన్ ఇండియా’ పథకాన్ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా మరో 50 పర్యాటక ప్రాంతాలను స్థానిక ఉపాధి కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. మరో 120 పట్టణాలను ఉడాన్ పథకం పరిధిలోకి తేవడం ద్వారా వచ్చే పదేళ్లలో మరో 4 కోట్ల మందికి విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెస్తామని మంత్రి చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి సింగిల్ విండో సదుపాయంగా ‘భారత్ ట్రేడ్‌నెట్’ను అందుబాటులోకి తెస్తామన్నారు.
సాగుకు పట్టం...
వ్యవసాయ రంగానికి పట్టం కట్టేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మల ప్రకటించారు. ‘‘7.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నాం. అసోంలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంలో భారీ యూరియా ప్లాంటు ఏర్పాటవనుంది. వ్యవసాయోత్పత్తి, నిల్వ సామర్థ్యం పెంపు తదితర లక్ష్యాలతో రాష్ట్రాల భాగస్వామ్యంతో 100 జిల్లాల్లో ప్రధానమంత్రి ధనధాన్య కృషీ యోజన అమలవనుంది.
రూరల్ ప్రాస్పరిటీ అండ్ రెజీలియన్స్ పథకంతో ఈ పథకంతో గ్రామీణ మహిళలు, యువ రైతులు, చిన్న, సన్నకారు రైతులకు బాగా లబ్ధి చేకూరుతుంది. వంట నూనెల ఉత్పత్తి తృణధాన్యాల సాగులో ఆత్మనిర్భరత సాధనకు ప్రాధాన్యమిస్తున్నాం. కూరగాయ లు, పళ్ల సాగుకు సమగ్ర పథకం తేనున్నాం. జన్యు బ్యాంకుల ద్వారా విత్తన నిల్వ సా మర్థ్యం పెంపొందిస్తాం’’ అని వివరించారు.
ఇది ప్రజల బడ్జెట్: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రజల బడ్జెట్‌గా అభివర్ణించారు. ఇది ప్రతి భారతీయుడి కలలను నెరవేరుస్తుందని అన్నారు. బడ్జెట్‌లో తీసుకున్న చర్యలవల్ల ప్రజల మధ్య మరింత డబ్బు చలామణి అవుతుందని, ఆయా రంగాల్లో పెట్టుబడులకు ఊతం ఇస్తుందని, ఇది దేశ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
మరిన్ని రంగాల్లో యువతకు అవకాశాలు కల్పిస్తున్నామని, దీని ద్వారా ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లవచ్చని అన్నారు. పొదుపు, పెట్టుబడులు, వినియోగం, అభివృద్ధి వంటి అంశాలకు ఈ బడ్జెట్ ఊతం కల్పిస్తుందని చెప్పారు. దేశాభివృద్ధికి దోహదపడేలా బడ్జెట్‌ను రూపొందించినందుకు ఆర్థిక మంత్రి నిర్మలతోపాటు దీని రూపకల్పనలో పాలుపంచుకున్న ఆర్థిక శాఖ బృందాన్ని ప్రధాని అభినందించారు. సాధారణంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేలా బడ్జెట్‌లు ఉంటాయని, కానీ ఈ సారి అందుకు భిన్నంగా ప్రజల చేతుల్లో డబ్బులు ఎక్కువ చెలామణి అయ్యేలా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని కొనియాడారు.
రాష్ట్రాలకు 1.5 లక్షల కోట్ల వడ్డీ రహిత రుణాలు
న్యూఢిల్లీ: మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రాలకు మద్దతుగా నిలిచేందుకు కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కీలక ప్రకటన చేశారు. వడ్డీ లేకుండా రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేకుండా ఈ రుణాలు కేంద్రం ఇస్తుంది. ఈ నిధులను వివిధ రంగాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చుచేయాల్సి ఉంటుంది. దేశంలో మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు కేంద్రం 2021లో మొదటి అసెట్ మానిటైజేషన్ వ్యూహాన్ని ప్రకటించింది.
తాజా బడ్జెట్‌లో 2025–30 కాలానికి సంబంధించి రెండో అసెట్ మానిటైజేషన్ ప్లాన్‌ను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్లాన్‌లో భాగంగా మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.10 లక్షల కోట్ల మూలధన సహకారం అందిస్తారు. ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ ఫండ్ మద్దతుతో రాష్ట్రాలను కూడా ప్రోత్సహిస్తామని మంత్రి తెలిపారు.
బడ్జెట్ హైలైట్స్
⇒ కొత్త పన్నువిధానంలో రూ.12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయపు పన్ను ఉండదు. వేతన జీవులకు రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి రూ.12.75 లక్షల వరకు పరిమితి ఉంటుంది. దీంతో ప్రభుత్వానికి రూ.లక్ష కోట్ల రెవెన్యూ తగ్గిపోతుంది.
⇒ ఏడు టారిఫ్ రేట్ల తొలగింపు
⇒ 82 టారిఫ్ లైన్లపై ఉన్న సామాజిక సంక్షేమ సర్‌చార్జి రద్దు.
⇒ అప్పుల ద్వారా ఆదాయం రూ. 34.96 లక్షల కోట్లు, మొత్తం వ్యయం రూ.50.65 లక్షల కోట్లు
⇒ జీడీపీ రెవెన్యూ లోటు 4.4 శాతం
⇒ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రధాన్‌మంత్రి ధన్ ధాన్య యోజనకృషి యోజన ఏర్పాటు. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లోని 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం
⇒ కంది, మినుములు, పెసర రైతుల ప్రోత్సాహకం కోసం పప్పుధాన్యాల ఆత్మనిర్భర మిషన్ ఏర్పాటు. దీనిద్వారా నాఫెడ్, ఎన్‌సీపీఎఫ్‌లు రైతులనుంచి వచ్చే నాలుగేళ్లలో పప్పుధాన్యాలను సేకరిస్తాయి.
⇒ కూరగాయలు, పండ్లు పండించే రైతుల కోసం సమగ్ర పథకం
⇒ మఖానా విత్తనాల ఉత్పత్తిని పెంచేందుకు బిహార్‌లో మఖానా బోర్డు స్థాపన. అస్సాంలో ఏడాదికి 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉత్పత్తిచేసే యూరియా ప్లాంట్.
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యలతో దేశప్రజలు ఇబ్బంది పడుతుంటే బడ్జెట్‌తో ప్రజలను మోసగించే యత్నం చేశారు. పదేళ్లలో మధ్యతరగతి నుంచి రూ.54.18 లక్షల కోట్లను ఆదాయపు పన్నుకింద వసూలు చేసి, ఇప్పుడు రూ.12 లక్షలు సంపాదించే వారికి మినహాయింపులు ఇస్తోంది. –– ఖర్గే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు
అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడంలో ప్రధాని మోదీ విజన్‌కు ఈ బడ్జెట్ అద్దం పడుతోంది. ప్రధాని ఆలోచనంతా మధ్యతరగతి ప్రజల బాగోగులపైనే. రైతులు మొదలుకొని మధ్యతరగతి ప్రజల వరకు.. అన్ని వర్గాల సంక్షేమంపై ఈ బడ్జెట్ దృష్టిపెట్టింది. –– అమిత్‌షా, కేంద్ర హోం మంత్రి
బిహార్ అభివృద్ధికి ఈ బడ్జెట్ ఎంతగానో తోడ్పాటునందిస్తుంది. మఖానా బోర్డ్ ఏర్పాటు, గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు.. రాష్ట్ర భవిష్యత్ అవసరాలను తీరుస్తాయి. పట్నా ఐఐటీని విస్తరించాలన్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో సాంకేతిక విద్యకు ఊతం లభిస్తుంది. –– నితీశ్‌కుమార్, బిహార్ సీఎం
కోటీశ్వరులకు రుణాలు మాఫీ చేసే విధానానికి స్వస్తి చెప్పి, అలా ఆదాచేసిన డబ్బులను మధ్యతరగతి ప్రజలు, రైతుల సంక్షేమానికి వాడాలని నేను చేసిన సూచనను బడ్జెట్‌లో పరిగణనలోకి తీసుకోకపోవడం నిరుత్సాహపరిచింది. కోటీశ్వరుల రుణమాఫీ కింద పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని వెచ్చించడం సరికాదు. –– కేజ్రీవాల్, ఆప్ జాతీయ కన్వీనర్
బడ్జెట్‌లో అంకెలకన్నా, కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో ఎంత మంది మరణించారు, ఎంత మంది గల్లంతు అయ్యారన్న విషయమే నాకు ముఖ్యం. తొక్కిసలాటలో ఎంతమంది మరణించారన్న విషయాన్ని ప్రభుత్వం చెప్పలేకపోతోంది. బాధితులు ఇంకా తమ కుటుంబ సభ్యులకోసం వెతుక్కుంటున్నారు. –– అఖిలేశ్ యాదవ్, ఎస్పీ అధినేత
వరుసగా 8వసారి
దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అన్న గురజాడ హితోక్తే మా సర్కారుకు స్ఫూర్తి
జీవకోటి వానల కోసం ఎదురు చూసినట్టే పౌరులు సుపరిపాలనను అభిలషిస్తారన్న తిరుక్కురళ్ హితవును పన్ను విధానాల రూపకల్పనలో దృష్టిలో ఉంచుకున్నాం
ఇది సామాన్యుల బడ్జెట్. 2047 నాటికి వికసిత భారత్ కలను సాకారం చేసుకునే దిశగా ఇదో పెద్ద ముందడుగు
– బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Comments
Please login to add a commentAdd a comment