ప్రభుత్వ మూలధన వ్యయాలు తగ్గుతాయ్!
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో మూలధన వృద్ధికి కోత పెట్టే అవకాశం ఉందని విదేశీ బ్రోకరేజ్ గోల్డ్మన్ శాక్స్ అంచనా వేసింది. మార్చితో ముగిసే 2024–25 వార్షిక బడ్జెట్లో మూలధన వృద్ధి రేటు 17 శాతం అయితే, రానున్న 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 7 శాతానికి పరిమితం కావచ్చని విశ్లేషించింది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును 4.5 శాతానికి (2024–25లో 4.9 శాతం) కట్టడి చేయడమే లక్ష్యంగా కొత్త బడ్జెట్లో మూలధన వ్యయాలకు కోత పెట్టే వీలుందని పేర్కొంది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..ఇదీ చదవండి: ఎలాన్ మస్క్ చేతికి టిక్టాక్..?లోక్సభలో బీజేపీకి మెజారిటీ సీట్లు రాని నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు, సంక్షేమ పథకాలకు బడ్జెట్ నిధులు కేటాయింపు పెరిగే అవకాశం ఉంది. సెప్టెంబరు త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 11 త్రైమాసిక కనిష్ట స్థాయి 5.4 శాతం తగ్గుదలకు ప్రభుత్వ మూలధన వ్యయాల్లో తగ్గుదల ఒక కారణం. ఆర్బీఐ ద్రవ్య పరపతి కఠిన విధానమూ ఇందుకు దారితీసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తవనున్న నేపథ్యంలో వచ్చే బడ్జెట్ దీర్ఘకాలిక ఆర్థిక విధానం గురించి కూడా విస్తృత స్థాయిలో చర్చించే వీలుంది. ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించే తయారీ, సూక్ష్మ, లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఆయా రంగాలకు రుణ లభ్యత, గ్రామీణ గృహ నిర్మాణాలకు ప్రోత్సాహం, ధరల స్థిరత్వానికి ఫుడ్ చైన్ పటిష్టత వంటి అంశాలపై బడ్జెట్ దృష్టి సారించే వీలుంది.