సాక్షి,హైదరాబాద్:వికసిత్ భారత్ 2047 విజన్ లక్ష్యంగానే కేంద్రం 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం(ఫిబ్రవరి2) లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణలో మూడు ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేశాం. ఆర్‌ఆర్‌ఆర్‌కు కేంద్రమే నిధులు ఇస్తోంది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మోదీ ప్రభుత్వమే పునరుద్ధరించింది
కరోనా లాంటి గడ్డు పరిస్థితి తర్వాత కఠిన నిర్ణయాలు తీసుకుని దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ గాడిలో పెట్టారు. 2014లో 2 లక్షలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటే ఇప్పుడు ఏకంగా 12 లక్షల వరకు మినహాయింపు ఇచ్చారు. ఇదొక మైల్ స్టోన్. దశాబ్ద కాలంలో మోదీ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
మధ్య తరగతి ప్రజలతో దేశ ఆర్థిక ప్రగతి సాధ్యమని భావించి మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాల హక్కులకు ప్రాధాన్యం కల్పిస్తూనే చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సామాన్యుడు కూడా నాణ్యమైన విద్య, వైద్యం అందుకునేలా వ్యవస్థను తీర్చిదిద్దారు
ప్రతిపక్షపార్టీలు కళ్లు లేని కబోదులుగా మారి విమర్శలు చేస్తున్నాయి. నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు కాంగ్రెస్‌కు కంచుకోటలాగా మెదక్‌ను చెప్పుకున్నారు.. కానీ అన్ని ఏండ్లు అధికారంలో ఉన్నా రైలు మార్గం వేయలేదు. కానీ మేము వేశాం. త్వరలో రైలు ప్రారంభమవుతుంది. ధర్నా చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్..మా హయాంలో పదేండ్లలో మేమేం చేశాం.. మీరేం చేశారు అనే అంశంపై చర్చకు సిద్ధమా?’అని లక్ష్మణ్ సవాల్ విసిరారు.
కాగా శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌లో 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్‌లో తెలంగాణకు ఎప్పటిలాగే సున్నా నిధులు కేటాయించారని ఇటు కాంగ్రెస్ అటు బీఆర్‌ఎస్ విమర్శలు చేస్తున్నాయి. ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉండి బీజేపీ తెలంగాణకు మొండి చెయ్యి చూపించిందని రెండు పార్టీలు ఆరోపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment