
కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర మాజీ అద్యక్షుడు బండి సంజయ్‌కు సడన్‌గా ఆంధ్ర ప్రాంత పూర్వ నేతలపై అభిమానం పుట్టుకువచ్చినట్ల అనిపిస్తోంది. ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, 1953లో అప్పటి మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్రుల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో 58 రోజులపాటు దీక్ష చేసి అసువులు బాసిన పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సంజయ్ చేసిన వ్యాఖ్యలు అంత చిత్తశుద్దితో చేసినట్లు కనిపించడం లేదు..
.. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ పేరును సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్శిటీగా మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం బిల్లు పెట్టిన నేపథ్యంలో సంజయ్ ఈ అవకాశాన్ని తన రాజకీయ అవసరాలకు వాడుకున్నట్లు అనుమానం కలుగుతోంది. దీనికి ప్రతిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగానే సమాధానం ఇచ్చారని చెప్పాలి. ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో యూనివర్శిటీ ఉందని, విభజన కారణంగా ఈ మార్పులు చేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు ఈయన పేరు పెడితే ఇంకా సమున్నతంగా ఉంటుందని బీజేపీ నేతలకు సూచించారు. అదే టైమ్ లో మాజీ సీఎం కొణిజేటి రోశయ్య పేరును ప్రకృతి వైద్యశాలకు పెడుతున్నామని, ఆయన విగ్రహం కూడా ఏర్పాటు చేసి జయంతి, వర్ధంతి నిర్వహిస్తామని, ఆర్యవైశ్యుల పట్ల తమకు పూర్తి గౌరవం ఉందని అన్నారు.
👉పొట్టి శ్రీరాములు పేరుతో ఉన్న యూనివర్శిటీ పేరును తొలగిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టవలసిన అవసరం ఏముందని సంజయ్ ప్రశ్నిస్తున్నారు. శ్రీరాములు గొప్ప దేశ భక్తుడు, గాంధేయవాది, స్వాతంత్ర సమర యోధుడని, ఆర్యవైశ్యులకు ఆరాధ్య నాయకుడని సంజయ్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ ఆర్యవైశ్య పట్టణ సంఘం ఈ జయంతి సభను నిర్వహించింది. తెలంగాణలో ఆయా చోట్ల వైశ్య సామాజిక వర్గ ప్రభావం కూడా గణనీయంగానే ఉంటుంది. దానిని దృష్టిలో ఉంచుకుని సంజయ్ ఈ ప్రసంగం చేసి ఉండవచ్చు. సురవరం ప్రతాపరెడ్డి అంటే తమకు గౌరవం ఉందని, తెలుగు భాష అభివృద్దికి కృషి చేశారని, దీనికి సంబంధించిన కార్యక్రమాలకు ఆయన పేరు పెట్టవచ్చని బండి సలహా ఇచ్చారు. బాగానే ఉంది. అక్కడితో ఆగి ఉంటే అదో తరహా అనిపించేది.
.. ఇక్కడే సంజయ్ తన రాజకీయ ఆలోచనను అమలు చేసే యత్నం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన ఒక ఆరోపణ చేస్తూ, తన కులాభిమానంతోనే పొట్టి శ్రీరాములు పేరు తొలగించి, ప్రతాపరెడ్డి పేరు ప్రతిపాదించారని అన్నారు. ఇందులో నిజం ఎంత ఉందన్నది ఒక ప్రశ్న. పొట్టి శ్రీరాములు పేరు మార్చకుండా ఉండాలని కోరవచ్చు. అంతవరకు ఓకే. కారణం ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం పేరు మార్చాలని ప్రతిపాదించింది. దీనిని శాసనసభలో కూడా బీజేపీ వ్యతిరేకించింది. ఇందులో కూడా కులం కోణమే ఉందన్న భావన కలుగుతుంది.
👉ప్రతాప్ రెడ్డి పేరును తెలుగు యూనివర్శిటీకి పెడితే రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి కులం ఆపాదించడం ఏమిటి? రేవంత్ ను విమర్శించే క్రమంలో సురవరం ప్రతాపరెడ్డి వంటి ప్రముఖుడిని కూడా ఒక కులానికి పరిమితం చేసినట్లు అనిపించదా! అంతేకాదు.. ముఖ్యమంత్రి తీరు దేశభక్తులు, స్వాతంత్ర్య సమర యోధులతోపాటు, ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని అనడం ద్వారా బండి సంజయ్(Bandi Sanjay) ఎజెండా ఏమిటో తెలిసిపోతుంది కదా! అంటే ఆర్యవైశ్యుల ఓట్లు తనవైపు ఉండేందుకు, కాంగ్రెస్‌కు నష్టం చేసేందుకు ఈ వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తుంది. అదే టైమ్ లో పొట్టి శ్రీరాములును కూడా ఒక కులానికి పరిమితం చేసినట్లు అనిపించదా! ఇది దురదృష్టకరం.
శ్రీరాములు అయినా, ప్రతాపరెడ్డి అయినా కులాలకు అతీతం అన్న సంగతిని విస్మరించరాదు. నేతలు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యలు చేస్తే బాగుండనిపిస్తుంది. వర్తమాన సమాజంలో అలాంటి ఆశించడం అత్యాశే కావచ్చు. ఈ అంశాన్ని తొలుత చేపట్టి, అక్కడ నుంచి ఆయన తన విమర్శలను కాంగ్రెస్ పై ఎక్కుపెట్టారు.మహనీయులను అవమానించడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని ఆరోపించారు. బీఆర్ అంబేద్కర్ ను కూడా అడుగడుగునా అవమానించిందని సంజయ్ విమర్శించారు. అంబేద్కర్ ను ఆయా పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం.
👉అంబేద్కర్ పై అంత అభిమానం ఉంటే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ అంబేద్కర్ విగ్రహ స్థలాన్ని బీజేపీ నేతలు ఎన్నిసార్లు సందర్శించారో తెలియదు. అదే టైంలో.. సంజయ్ మరో వివాదాస్పద ప్రశ్న సంధించారు. హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ పార్కు పేరు మార్చే దమ్ముందా? అని ఆయన అంటున్నారు. అలాగే కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి పేర్లు ఉన్న పార్కులకు వాళ్ల పేర్లను తొలగించగలరా? కోట్ల విజయ భాస్కరరెడ్డి పేరుతో ఉన్న స్టేడియంకు కొత్త పేరు పెట్టే దమ్ము ఉందా? అని ఆయన అడగడంలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకోవడం కష్టం కాదు.
👉పొట్టి శ్రీరాములు మీద గౌరవం ప్రకటిస్తూనే, ఈ మాజీ ముఖ్యమంత్రుల పేర్లు తొలగించగలరా అని అడగడంలో అర్థం ఏమైనా ఉందా? సంజయ్‌కు తెలుసో లేదో కాని.. కాసు, నీలం, కోట్ల వంటివారు కూడా దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్లే.. జైళ్లకూ వెళ్లొచ్చిన వాళ్లే. మరి వారి పేర్లు మార్చగలరా అని అనడంలో ఆయనలో కుల కోణం కనిపిస్తుందే తప్ప సహేతుకత కనిపించదు. ఎన్టీఆర్ ప్రముఖ నటుడు , రాజకీయాలలోకి వచ్చి ప్రాంతాలకు అతీతంగా తెలుగు ప్రజల అభిమానం చూరగొన్నారు. ఆయన పేరు మార్చగలరా? అని అడగడం ఏమిటి. పరోక్షంగా వారి పేర్లు తీసివేయాలని సూచించడమా? అనే అనుమానం కూడా కలుగుతోంది. లేదంటే.. వీరు రెడ్డి,కమ్మ వర్గానికి చెందినవారు కనుక వాటి జోలికి వెళ్లడం లేదని పరోక్షంగా చెప్పదలిచారా! టాంక్ బండ్ పై అనేకమంది ఆంధ్రుల విగ్రహాలు ఉన్నాయని ,వాటిని తొలగిస్తారా అని ప్రశ్నించడం కూడా రాజకీయ ప్రేరితంగానే కనిపిస్తుంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో కొన్నిచోట్ల కాసు, నీలం ఎన్టీఆర్ విగ్రహాలను కొంతమంది ధ్వంసం చేసినప్పుడు బీజేపీ పెద్దగా అభ్యంతరం చెప్పినట్లు కనిపించదు. అలాగే టాంక్ బండ్‌పై ఉన్న ఆంధ్ర ప్రముఖుల విగ్రహాలను ఉద్యమ సమయంలో ఇప్పటికే ఒకసారి కూల్చారు. ఆ రోజుల్లో కూడా ఈ అంశంపై బీజేపీ గట్టిగా స్పందించినట్లు కనబడలేదు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి విగ్రహాలను వెంటనే పునరుద్దరించారు. బండి సంజయ్ కులపరమైన ఆలోచనలతో కాకుండా చిత్తశుద్దితో పేర్ల మార్పుపై మాట్లాడితే స్వాగతించవచ్చు. కాని ఆర్యవైశ్యులకు, దేశభక్తులకు రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంలోని ఆంతర్యం తెలుస్తూనే ఉంది. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి.
👉అసలు పేర్లు మార్చడంలో బీజేపీకి ఉన్న ట్రాక్ రికార్డు మరెవరికి ఉండకపోవచ్చు. పేర్ల మార్పిడి అన్నది కొత్త విషయం కాదు. కాని బీజేపీ కేంద్రంలోను, ఆయా రాష్ట్రాలలో పవర్‌లోకి వచ్చాక అవసరం ఉన్నా, లేకపోయినా తమ విధానాలను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేసిందన్న విమర్శలు ఉంది.ఇంకో సంగతి చెప్పాలి. ఏపీలో బీజేపీ భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) కొన్ని ప్రాజెక్టులకు రెడ్డి ప్రముఖుల పేర్లు ఉంటే వాటిని తొలగించింది. మాజీ మంత్రులు గౌతం రెడ్డి, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకటరెడ్డి పేర్లను తొలగించారు. అంటే దాని అర్థం అక్కడ ప్రభుత్వం రెడ్లకు వ్యతిరేకమని.. ఆ విధానానికి బీజేపీ సమర్థిస్తోందన్న భావన కలగదా?. కొంతమంది తెలుగుదేశం వారు విశాఖలోని స్టేడియంకు ఉన్న వైఎస్ పేరును తీసివేసే యత్నం చేశారు. వారిది కుల జాఢ్యమని బీజేపీ చెబుతుందా!
సంజయ్ తెలంగాణలో కులపరమైన ఆరోపణలు చేస్తే, బీజేపీ దేశంలో మతపరమైన విమర్శలు ఎదుర్కుంటోంది. మతాన్ని దృష్టిలో ఉంచుకుని, ఢిల్లీలో పలు రోడ్ల పేర్లు మార్చింది. ఉత్తరప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వానికి ఇందులో ఒక రికార్డు ఉంది. ఏకంగా 24 నగరాలు, పట్టణాల పేర్లను మార్చడానికి ప్రతిపాదించింది. వాటిలో పలు నగరాల పేర్లను మార్పు కూడా చేసింది.వీటికి ఉన్న గత ముస్లిం పాలకుల పేర్లను తొలగించి హిందూ పేర్లను పెట్టడం స్పష్టంగా కనిపిస్తుంది.సెక్యులర్ దేశంగా ఉన్న భారత్ లో ఇలా చేయడం సరైనదేనా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. వీటిలో కొన్నిటికి అభ్యంతరాలు వచ్చినా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎప్పటి నుంచో ఉన్న అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్ గా మార్చారు. ఫైజాబాద్ ను అయోధ్యగా మార్చారు. అంటే బీజేపీ ఎక్కడ అవసరం అయితే అక్కడ మతం లేదంటే కులం ప్రాతిపదికన రాజకీయం చేయడానికి వెనుకాడడం లేదని అనిపించదా?

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment