సాక్షి,హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దోషులకు శిక్ష పడేవరకు బీజేపీ పోరాటం చేస్తుందని, ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ చరిత్రలో రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే ఫోన్ ట్యాపింగ్ సీబీఐకి అప్పగించాల్సిందేననన్నారు.
ఫోన్‌ట్యాపింగ్ కేసులో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద శుక్రవారం జరిగిన ధర్నాలో లక్ష్మణ్ మాట్లాడారు. ‘కాంగ్రెస్ మోసాన్ని గ్రహించి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మరోసారి ప్రజలు పట్టం కడ్తారు. తెలంగాణలో కాంగ్రెస్ కంటే అత్యధిక ఎంపీ సీట్లు సాధిస్తాం. కేసీఆర్ అవినీతిని అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావించారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం, ధరణి పేరుతో దోచుకున్నదాన్ని కక్కిస్తాం అన్నారు. కేసీఆర్ అవినీతి, కుంభకోణాల మీద రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అధికారాన్ని శాశ్వత పరుచుకునేందుకు నిఘా వ్యవస్థను కేసీఅర్ దుర్వినియోగం చేశారు.
ఉప ఎన్నికల్లో ఓటర్లను కొనుగోలు చేయడానికి, ప్రత్యర్ధులను దెబ్బ కొట్టడానికి ఫోన్ ట్యాపింగ్ వాడారు. అరెస్ట్ అయిన వాళ్ళు వాంగ్మూలం ఇచ్చినా మిగిలిన వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. టెలికాం రెగ్యులేటరీ నిబంధనలకు భిన్నంగా, కేంద్రం అనుమతి లేకుండా కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసింది.
తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినని చెప్పుకున్న రేవంత్‌రెడ్డి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కేసీఆర్ లోపాయికారీ ఒప్పందం చేసుకుందా..? రేవంత్ రెడ్డికి ఏ మాత్రం పౌరుషం ఉన్నా.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులను శిక్షించాలి. రేవంత్ రెడ్డి కుర్చీ కోసం అధిష్టానానికి లొంగిపోతారా స్పష్టం చేయాలి.
బీజేపీ సీనియర్‌నేత బీఎల్ సంతోష్ మీద కేసీఆర్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది. లిక్కర్ కేసు నుంచి కవితను తప్పించడం కోసమే బీజేపీ నేతలపై కేసులు పెట్టడం దుర్మార్గం. బీఆర్‌ఎస్ నీచ రాజకీయాలకు పాల్పడింది. బీఆర్ఎస్ నేతలను ఏ మాత్రం కాపాడినా రేవంత్ రెడ్డికి కూడా అదే గతిపడుతుంది’అని లక్ష్మణ్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment