
దుబ్బాక: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు దుబ్బాక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ప్రజలు తన వద్ద అన్నమాటలే తాను చెప్పానని అన్నారు. తాను చేసిన దాంట్లో తప్పేముంది.. కావాలంటే తనపై కేసులు పెట్టుకోవాలని సవాల్ చేశారు కొత్త ప్రభాకర్ రెడ్డి. ప్రజలు చందాలు వేసుకుని బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని చూస్తున్నారని మరోసారి ఉద్ఘాటించారు.
అవి నా వ్యాఖ్యలు కావు.. ప్రజలు మాటలు
తాను ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు తన సొంత మాటలు కావని, రాష్ట్రంలో ఉన్న చాలామంది ప్రజలు తమ వద్దకు వచ్చి అంటున్న మాటలు అని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం మారాలి అని రైతులు.. రియల్టర్లు, పారిశ్రామిక వేత్తలు కోరుకుంటున్నారన్నారు.
కేసీఆర్ లేకుంటే పొంగులేటి ఉన్నాడా?
మంత్రి పొంగులేటి తనను కేసీఆర్ ఆత్మ అని అంటున్నారని, కేసీఆర్ లేకుంటే పొంగులేటి ఎక్కడ ఉండేవాడు అని కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. నేడు పొంగులేటి మంత్రి పదవిలో ఉన్నాడు అంటే.. అది కేసీఆర్ వల్లే అనే విషయం గుర్తించుకోవాలన్నారు. నార్కోటిక్ టెస్ట్ లు చేయడం తనకు కాదు అని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలకు నార్కోటిక్ టెస్ట్ లు చేయాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కు కౌంటర్ ఇచ్చారు.
అలా చేస్తే ఈ ప్రభుత్వం పై వాళ్ల మనసులో ఏముందో తెలుస్తోందన్నారు..ఇక కాంగ్రెస్ వాళ్లకు వాళ్ళ ప్రభుత్వం పై నమ్మకం లేకనే తమ పార్టీ నుండి ఎమ్మెల్యే లను తీసుకేళ్లరని, ఇప్పుడు కాకపోయిన ఇంకొద్ది రోజులు కైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం పక్క అని కొత్త ప్రభాకర్ రెడ్డి మరోసారి వ్యాఖ్యానించారు.