
కరపత్రాలను ఆవిష్కరిస్తున్న హరీశ్‌రావు. చిత్రంలో యాదవరెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులు
మాజీ మంత్రి హరీశ్‌రావు
గజ్వేల్: ‘యంగ్ ఇండియా’పాఠశాలలు తన బ్రాండ్ అని ప్రకటించుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డికి ఆ మాట వర్తించదని, మాట తప్పడమే తన బ్రాండ్‌గా ఆయన చెప్పుకోచ్చని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో, బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు.
దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ కేసీఆర్ ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.1.20 లక్షలను ప్రభుత్వం తరఫున ఖర్చు చేసి గురుకుల పాఠశాలలు తీసుకొస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ‘యంగ్ ఇండియా’పేరిట పాఠశాలలు తీసుకొస్తూ, ఏటా రూ.1.50 లక్షల ఫీజు, బస్సు ఫీజు చెల్లించాలని సూచిస్తున్నారని విమర్శించారు. చెట్లు నరికితే సామాన్యులపై వాల్టా చట్టాన్ని ప్రయోగించి శిక్షిస్తున్న అధికారులు.. హెచ్‌సీయూ భూముల్లో చెట్లను నరికేసి, నాలుగు జింకల మరణానికి కారణమైన సీఎం రేవంత్‌రెడ్డిపై ఎన్ని కేసులు పెట్టాలో చెప్పాలన్నారు.
400 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల అప్పులు తెచ్చి, బ్రోకర్ ఫీజు కింద రూ.170 కోట్ల లంచం చెల్లించారని ఆరోపించారు. చట్టాన్ని ఉల్లంఘించి తప్పులు చేస్తున్న అధికారులు రాబోయే రోజుల్లో జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో వరంగల్ బహిరంగ సభకు సంబంధించిన కరపత్రాలను హరీశ్ ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.