భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామీణ గృహనిర్మాణ పథకం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G)కు 2025 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదిత వ్యయం కంటే తక్కువ ఖర్చు చేయనున్నట్లు అంచనా. ఈ పథకం అమలుకు గతంలో అంచనా వేసిన దానికంటే రూ.20,000 కోట్లు కోత విధించబోతున్నట్లు తెలిసింది. ఈ పథకానికి సంబంధించి 2025-26 ఏడాదికి వాస్తవ వ్యయం సుమారు రూ.35,000 కోట్లు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీని గత బడ్జెట్(Budget) అంచనా రూ.54,500 కోట్ల కంటే చాలా తక్కువ.
2025 నుంచి వచ్చే ఐదేళ్లలో రెండు కోట్ల ఇళ్లను నిర్మించాలని, గ్రామీణ కుటుంబాలకు అందుబాటు ధరల్లో గృహాలను అందించాలని పీఎంఏవై-జీ లక్ష్యంగా పెట్టుకుంది. పక్కా గృహాల నిర్మాణానికి యూనిట్‌కు రూ.2.39 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. అయితే, రాబోయే ఆర్థిక సంవత్సరానికి ముందుగా అనుకున్న మేరకు ఖర్చు చేయలేరనే అంచనాలు వెలువడుతున్నాయి. దాంతో ఈ పథకం లక్ష్యం నీరుగారినట్లువుతుందని లబ్ధిదారులు, మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పథకం రెండో దశ ప్రారంభంలో ఆర్థిక సాయం అందించడంలో తీవ్రంగా జాప్యం జరగడమే ఈ అంచనాకు ప్రధాన కారణం. అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు సర్వే కొనసాగుతోందని, 2025 మార్చి వరకు ఈ సర్వే జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. దాంతో సర్వే పూర్తై, నిధులు విడుదలై, ఇళ్ల నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందనే ప్రశ్నలు వస్తున్నాయి. పైగా 2025-26లో పథకం అమలు వ్యయంలో కోత విధిస్తారనే అంచనాలతో ఇళ్ల నిర్మాణం ప్రశ్నార్థకంగా మారుతుంది.
ఇదీ చదవండి: చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలి
పీఎం జన్‌మన్‌కు రూ.3.06 లక్షల కోట్లు
2025 ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్లలో 20 లక్షల పక్కా గృహాలను నిర్మించాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి జన్‌జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (PM JANMAN)ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం పీఎంఏవై-జీ 2.0లో భాగంగా ఉంది. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం రూ.3.06 లక్షల కోట్లు కేటాయించింది. ఇలా ప్రధానంగా పీఏంఏవై-జీ అమలులో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అదే తరహా కొత్త పథకాలు ప్రవేశపెట్టి లబ్ధిదారులను తగ్గిస్తుండడం పట్ల విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment