
భారత్, ఈయూల సహకారం
ఆర్థిక సంబంధాల బలోపేతానికి, చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారత్, యూరోపియన్ యూనియన్ (EU) వ్యూహాత్మక కార్యక్రమాలపై కలిసి పనిచేయడానికి అంగీకరించాయి. ఈ సహకారం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని(Technology) అభివృద్ధి చేయడం, కీలకమైన ముడి పదార్థాల(Raw Material) సరఫరాలను భద్రపరచడం, వస్తువుల సరఫరా గొలుసులను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది.
బ్రస్సెల్స్‌లో ఇటీవల జరిగిన సమావేశంలో భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, యూరోపియన్ కమిషనర్ ఫర్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ సెక్యూరిటీ మారోస్ సెఫ్కోవిక్ పరస్పర ఆర్థిక వృద్ధికి ఫ్రేమ్‌వర్క్‌ను వివరించారు. వాణిజ్య సరళీకరణకు, సుంకాల సమస్యను పరిష్కరించేందుకు చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. న్యాయమైన, సమాన అవకాశాలు ఉండేలా వాణిజ్య ఎజెండాను సృష్టించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జూన్ 2022 నుంచి పురోగతిలో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై చర్చలను వేగవంతం చేయడం ఈ భాగస్వామ్యం కీలక అంశాలలో ఒకటిగా ఉంది. వాణిజ్యంలో దూకుడు వైఖరిని కొనసాగిస్తుండటం, కీలకమైన ఖనిజాలు, సాంకేతిక పరిజ్ఞానాల ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో పరోక్షంగా చైనాను ప్రస్తావిస్తూ ప్రత్యేకంగా కొన్ని ఆర్థిక వ్యవస్థలపైనే ఆధారపడటాన్ని తగ్గించాలని ఇరు పక్షాలు తెలిపాయి.
ఇదీ చదవండి: వంతారాకు కొత్త అతిథులు
ఇండియా-ఈయూ ట్రేడ్ కౌన్సిల్
2023 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఇండియా-ఈయూ ట్రేడ్(India-EU Trade) అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సైతం ఇరు ప్రాంతాల మధ్య సులభతర వాణిజ్య పద్ధతులను సిద్ధం చేయడానికి కృషి చేస్తోంది. భారత్- ఈయూ మధ్య సహకారాన్ని పెంపొందించడం, వాణిజ్యం, పెట్టుబడులను పెంచడం, భాగస్వామ్య విలువలను పరిరక్షిస్తూ సాంకేతిక, పారిశ్రామిక నాయకత్వాన్ని పెంపొందించేందుకు ఈ కౌన్సిల్ పని చేస్తోంది.