strategic agreement
-
India-Oman Relations: సరికొత్త మలుపు
న్యూఢిల్లీ: భారత్–ఒమన్ల మధ్య వ్యూహాత్మక సంబంధాల్లో మరో ముందడుగు పడింది. సుమారు 10 కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకునేందుకు రూపొందించిన దార్శనిక పత్రంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఒమన్ సుల్తాన్ హయితమ్ బిన్ తారిఖ్ ఏకాభిప్రాయానికి వచ్చారు. రెండు దేశాల సంబంధాల్లో ఇది సరికొత్త మలుపు కానుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. త్వరలోనే రెండు దేశాల మధ్య కుదిరే సమగ్ర వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం(సీఈపీఏ)కి ఇది దోహదప డుతుందని భావిస్తున్నారు. మొట్టమొదటి సారిగా భారత్లో పర్యటిస్తున్న ఒమన్ సుల్తాన్ హయితమ్ బిన్ తారిఖ్ శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. శనివారం ఆయన ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు హమాస్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో ఉత్పన్నమైన పరిస్థితులపై చర్చలు జరిపారు. పాలస్తీనా సమస్యకు పరిష్కారమైన రెండు దేశాల సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు సాగించాలని వారు అభిప్రాయపడినట్లు విదేశాంత శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా చెప్పారు. అదేవిధంగా, ఇద్దరు నేతలు ఒమన్–భారత్ సంయుక్త పెట్టుబడి నిధికి మూడో విడతగా రూ.2,500 కోట్లు సమకూర్చుతామని ప్రకటించారు. ఈ మొత్తాన్ని భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత వేగంగా అభివృద్ధి నమోదు చేసుకున్న రంగాల్లో పెట్టుబడులుగా వినియోగిస్తారు. భారత్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ భాగస్వామ్యం కింద ఇప్పటి వరకు రెండు విడతల్లో రూ.2,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్థిక నేరాలపై పోరు, సాంస్కృతిక సంబంధాలతోపాటు ఒమన్లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ కార్యాలయంలో హిందీ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించిన ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశాయని విదేశాంగ శాఖ తెలిపింది. -
శాటిలాజిక్తో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ జట్టు
బెంగళూరు: టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (టీఏఎస్ఎల్), అమెరికాకు చెందిన శాటిలాజిక్ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం భారత్లో లో ఎర్త్ ఆర్బిట్ (లియో) ఉపగ్రహాలను తయారు చేయనున్నట్లు ఇరు సంస్థలు తెలిపాయి. ఇందుకోసం కర్ణాటకలోని తమ వేమగల్ ఫ్యాక్టరీలో టీఏఎస్ఎల్ ఉపగ్రహాల అసెంబ్లీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ (ఏఐటీ) ప్లాంటును ఏర్పాటు చేనుంది. దేశ రక్షణ బలగాలు, వాణిజ్య అవసరాల కోసం ఉపగ్రహాల తయారీ, ఇమేజరీ డెవలపింగ్ మొదలైన వాటిపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో వివరించాయి. పేలోడ్లు, ఇతర టెక్నాలజీ కోసం స్థానికంగా చిన్న, మధ్య తరహా సంస్థలతో (ఎస్ఎంఈ) కలిసి పని చేయనున్నట్లు టీఏఎస్ఎల్ సీఈవో సుకరణ్ సింగ్ తెలిపారు. వేగంగా వృద్ధి చెందుతున్న భారతీయ డిఫెన్స్, కమర్షియల్ మార్కెట్లోకి ప్రవేశించడం తమకు ఒక మైలురాయి కాగలదని శాటిలాజిక్ సీఈవో ఎమిలియానో కార్గీమ్యాన్ పేర్కొన్నారు. -
మంగోలియా, జపాన్లలో నేటి నుంచి రాజ్నాథ్ పర్యటన
న్యూఢిల్లీ: మంగోలియా, జపాన్లలో ఐదు రోజుల పర్యటనకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం బయలుదేరి వెళ్లారు. మారుతున్న ప్రపంచ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ రెండు దేశాలతో వ్యూహాత్మక, రక్షణ సంబంధాల బలోపేతమే లక్ష్యంగా పర్యటన సాగనుందని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. 5 నుంచి 7 వరకు మంగోలియాలో ఆయన పర్యటన ఉంటుంది. భారత రక్షణ మంత్రి ఒకరు మంగోలియాలో పర్యటించడం ఇదే ప్రథమం. అనంతరం 8, 9 తేదీల్లో జపాన్ పర్యటన సందర్భంగా జరిగే 2+2 విదేశాంగ, రక్షణ మంత్రుల సమావేశాల్లో రాజ్నాథ్తోపాటు జై శంకర్ కూడా పాల్గొంటారు. -
టర్కీ ఫార్మా కంపెనీతో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టర్కీకి చెందిన బయె సిమిలర్ తయారీ సంస్థ టీఆర్ ఫార్మాతో డాక్టర్ రెడ్డీస్ వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం డాక్టర్ రెడ్డీస్కి చెందిన మూడు బయోసిమిలర్ ప్రోడక్టులను టీఆర్ ఫార్మా టర్కీలో వాణిజ్యపరంగా తయారు చేసి విక్రయించనుంది. అంతర్జాతీయంగా బయోసిమిలర్ వ్యాపారంలో విస్తరించడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని డాక్టర్ రెడ్డీస్ వైస్ ప్రెసిడెంట్ ఎం.వి.రమణ తెలిపారు.