న్యూఢిల్లీ: తాము కార్యకలాపాలు నిర్వహించే ప్రతి విభాగంలోనూ దిగ్గజంగా అవతరించడమే లక్ష్యమని ఐటీసీ చైర్మన్ సంజీవ్ పురి ప్రకటించారు. ‘ఐటీసీ నెక్ట్స్ స్ట్రాటజీ’ కింద పోటీతత్వాన్ని పెంచుకోవడం, ఆవిష్కరణ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. భవిష్యత్‌కు అనుగుణంగా సంస్థను మార్చడం కోసం ఈ విధానాన్ని కంపెనీ చేపట్టడం గమనార్హం. డిజిటలైజేషన్, సుస్థిరత, ఆవిష్కరణలు, సరఫరా వ్యవస్థ సామర్థ్యం పోటీతత్వం పెంపునకు కీలకంగా గుర్తించినట్టు, వీటిలో ప్రత్యేక జోక్యం అవసరమని సంజీవ్ పురి తెలిపారు. ‘మా వరకు ఐటీసీ నెక్ట్స్ స్ట్రాటజీ అన్నది ఓ ప్రయాణంలో అడుగు మాత్రమే. ఎన్నో విభాగాల్లో చెప్పుకోతగ్గ పురోగతి సాధించాం. ఈ ప్రయాణం ముగింపు దశలో ఉందని చెప్పడం లేదు. మేము పనిచేసే ప్రతి విభాగంలో పెద్ద సంస్థగా అవతరించడమే లక్ష్యం. కొన్ని విభాగాల్లో మేము ఇప్పటికే ప్రముఖ సంస్థగా ఉన్నాం’అని వివరించారు.
ఇదీ చదవండి: ఆటో ఎక్స్‌పో.. స్పందన అదరహో
చురుగ్గా ఉండాల్సిందే..
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాతావరణ సంక్షోభాల నేపథ్యంలో ప్రపంచం ఇప్పుడు అనిశి్చత వాతావరణంలో ఉన్నట్టు సంజీవ్ పురి చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఐటీసీ మాదిరి బడా సంస్థలు చురుకుగా, వినియోగదారు కేంద్రీకృతంగా మసలుకోవడం అవసరమన్నారు. ‘‘భారత్‌లో తలసరి ఆదాయం, తలసరి వినియోగం దృష్ట్యా భారీ అవకాశాలున్నాయి. మా ప్రధాన వ్యాపారాన్ని పెంచుకుంటూనే, అనుబంధ వ్యాపారాల్లోకి విస్తరించడంతోపాటు, భవిష్యత్ విభాగాలను సృష్టించాల్సి ఉంది’’అని తమ వ్యూహాలను వెల్లడించారు. ప్రస్తుతం ఐటీసీ వ్యాపారంలో 70 శాతం మేర ఒక్క సిగరెట్ల నుంచే వస్తుండడం గమనార్హం. నెక్ట్స్ స్ట్రాటజీలో భాగంగా వివిధ వ్యాపారాలపై మధ్య కాలానికి రూ.20,000 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్టు ఐటీసీ ఇప్పటికే ప్రకటించింది. పేపర్ బోర్డ్ తయారీ సామర్థ్యాన్ని గత కొన్నేళ్లలో 33 శాతం మేర పెంచుకుంది. పేపర్ బోర్డ్‌తో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాల తయారీ అవకాశాలను గుర్తించినట్టు సంజీవ్ పురి తెలిపారు. మొక్కల ఆధారిత మౌల్డెడ్ ఫైబర్‌తో సుస్థిర ప్యాకేజింగ్ నూతన వృద్ధి విభాగంగా పేర్కొన్నారు. రూ.8,000 కోట్ల విలువైన ఆశీర్వాద్ బ్రాండ్ పోర్ట్‌ఫోలియో కింద.. ఆశీర్వాద్ ఫ్రోజెన్ ఫుడ్, ఫ్రోజన్ స్నాక్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు పురి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment