
పెద్ద ఎత్తున సందర్శిస్తున్న వాహనప్రియులు
దేశ రాజధానిలోని భారత్ మండపంలో నిర్వహిస్తున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో తమ ఫేవరెట్ కొత్త కార్లు, బైక్‌లను చూసేందుకు వాహన ప్రియులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆదివారం నుంచి సాధారణ ప్రజానీకాన్ని కూడా అనుమతిస్తుండటంతో ఎంట్రీ పాయింట్లు, సెక్యురిటీ చెక్ పాయింట్ల దగ్గర ప్రజలు బారులు తీరారు. సమీప ప్రాంతాల నుంచి కూడా వాహన ప్రియులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారీ జన సందోహాన్ని ఊహించిన కంపెనీలు కూడా డిస్‌ప్లే ఏరియాల్లో మరింత మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నాయి. పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు వాహనాల తయారీ సంస్థల సమాఖ్య డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో సత్వరం స్పందించేందుకు పెద్ద ఎత్తున ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు, వైద్య సదుపాయాలు మొదలైనవి ఏర్పాటు చేసినట్లు వివరించారు. జనవరి 17 నుంచి 22 వరకు జరిగే ఆటో ఎక్స్‌పోలో తొలి రెండు రోజులు మీడియా, వ్యాపార వర్గాలకు కేటాయించగా.. మిగతా రోజుల్లో సందర్శకులను అనుమతిస్తున్నారు. ఆటోమొబైల్ కంపెనీలు తొలి రెండు రోజుల్లో 90 పైచిలుకు కొత్త వాహనాలను ఆవిష్కరించాయి. పలు కాన్సెప్ట్‌లు, సరికొత్త ఆటోమోటివ్ టెక్నాలజీల మొదలైన వాటిని కూడా ప్రదర్శిస్తున్నాయి.
ఇదీ చదవండి: స్మాల్‌క్యాప్ ఫండ్ పరిమాణం పెరిగితే..?
భారత్‌లో తయారీకి సిద్ధం: బీవైడీ
అన్నీ కలిసి వస్తే భారత్‌లో తయారీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చైనాకి చెందిన బీవైడీ ఇండియా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల విభాగం హెడ్ రాజీవ్ చౌహాన్ తెలిపారు. ప్రణాళికలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వివరించారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో తమ ప్రీమియం ఎలక్ట్రికి ఎస్‌యూవీ సీలయన్7ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. భారత్‌లో తమకు ప్రస్తుతం ఏ కంపెనీతోనూ తయారీ కాంట్రాక్టులు లేవని ఆయన చెప్పారు. దేశీయంగా కంపెనీ కార్యకలాపాలు సాగించడానికి సంబంధించి చైనీయులపై భారత్ వీసా ఆంక్షల ప్రభావమేదేనా ఉందా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని చౌహన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment