ఒక స్మాల్‌క్యాప్ ఫండ్ పరిమాణం (నిర్వహణలోని ఆస్తులు/ఏయూఎం) పెరిగే కొద్దీ దాని పనితీరుపై ప్రభావం పడుతుందా? – ఊర్మిళా సాను
స్మాల్‌క్యాప్ పథకాలు పెద్దగా మారే క్రమంలో.. బలమైన పనితీరు కారణంగా అవి మరింత పెట్టుబడులను ఆకర్షించడం సహజంగానే చూస్తుంటాం. ఈ పరిణామం వినూత్నమైన సవాళ్లను తెచ్చి పెడుతుంది. దీనిపై ఇన్వెస్టర్లలో అవగాహన ఉండాలి. స్మాల్‌క్యాప్ ఫండ్స్ రూ.1,000–2,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన కంపెనీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటాయి. రూ.100–200 కోట్ల ఏయూఎం నిర్వహించే స్మాల్‌క్యాప్ ఫండ్స్ తమకు ఆకర్షణీయం అనిపించిన కంపెనీల్లో చెప్పుకోతగ్గ మేర ఎక్స్‌పోజర్ తీసుకుంటాయి. కానీ, వాటి ఏయూఎం సైజు పెరుగుతున్న కొద్దీ అదే మాదిరి పెట్టుబడులు సవాలుగా మారతాయి. ఉదాహరణకు రూ.200 కోట్ల ఏయూఎం నిర్వహించే ఒక స్మాల్‌క్యాప్ ఫండ్ రూ.1,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన కంపెనీలో ఏకంగా 5 శాతం పెట్టుబడులు పెట్టగలదు. లేదా రూ.10 కోట్లు ఇన్వెస్ట్ చేయగలదు. ఇలా రూ.10 కోట్ల పెట్టుబడితో తన పనితీరుపై, లిక్విడిటీపై పెద్దగా ప్రభావం లేకుండా చూసుకోగలదు. ఒకవేళ స్మాల్‌క్యాప్ ఫండ్ ఏయూఎం రూ.2,000 కోట్లకు పెరిగితే, అప్పుడు ఒక కంపెనీలో 5 శాతం ఎక్స్‌పోజర్ కోసం రూ.100 కోట్లు కేటాయించాల్సి వస్తుంది. రూ.1,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన చిన్న కంపెనీల్లో రూ.100 కోట్ల పెట్టుబడి అంటే 10 శాతానికి సమానం. అంత చిన్న కంపెనీలో 10 శాతం సమానమైన వాటాలను విక్రయించాల్సి వచ్చినప్పుడు కొనుగోలుదారులను గుర్తించడం కష్టం (లిక్విడిటీ సమస్య) కావచ్చు. ఎందుకంటే స్మాల్‌క్యాప్ కంపెనీలు తక్కువ వ్యాల్యూమ్‌తో ట్రేడ్ అవుతుంటాయి.
మితిమీరిన వైవిధ్యం కాబట్టి లిక్విడిటీ సమస్య రాకుండా ఫండ్ మేనేజర్లు మరిన్ని స్టాక్స్‌లో పెట్టుబడులను వైవిధ్యం చేస్తుంటారు. దీనివల్ల రిస్క్ తగ్గుతుంది. కానీ, మొత్తం మీద రాబడులు ప్రభావితం అవుతాయి. స్మాల్‌క్యాప్ ఫండ్స్ అసాధారణ రాబడుల పనితీరుతో ఇన్వెస్టర్ల నుంచి మరింత భారీగా పెట్టుబడులు వచ్చి పడుతుంటాయి. దీంతో ఆయా పథకాల సైజు మరింత పెరిగే రిస్క్ ఉంటుంది. ఇది భవిష్యత్ పనితీరుపై ప్రభావం చూపించొచ్చు. అదే సమయంలో స్మాల్‌క్యాప్ ఫండ్ పెట్టుబడులు రాబట్టుకోవడంలో విఫలమైతే, కోల్పోయే రిస్క్ కూడా ఉంటుంది. స్మాల్‌క్యాప్ ఫండ్ ఏయూఎం పెరగడాన్ని ప్రతికూలంగా చూడక్కర్లేదు. పెరిగిపోతున్న ఏయూఎం విషయమైన వాటికంటూ ప్రత్యేకమైన పెట్టుబడుల వ్యూహం ఉండొచ్చు. కనుక ఇన్వెస్టర్లు ఫండ్స్ ఏయూఎం కాకుండా, వాటి పనితీరుపై దృష్టి సారించడమే నయం.
సిప్ ద్వారా దీర్ఘకాల పెట్టుబడుల్లో 50% నుంచి 60% మేర స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా..? – ఉమేష్
ఈక్విటీల్లో దీర్ఘకాల పెట్టుబడులకు (సిప్) పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం అనుకూలం. అయితే, 50–60 శాతం పెట్టుబడులను మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు కేటాయించుకోవడం సూచనీయం కాదు. దీనికి బదులు ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఇలా చేస్తే మిడ్, స్మాల్‌క్యాప్ పెట్టుబడులు 25–30 శాతానికి పరిమితం అవుతాయి. లార్జ్‌క్యాప్ పెట్టుబడులు 70 శాతం మేర ఉంటాయి. వృద్ధికితోడు, స్థిరత్వాన్ని ప్రదర్శించే స్టాక్స్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి. రిస్క్ ఎక్కువగా ఉండే సాధనాలకు తక్కువ కేటాయింపులు చేసుకోవాలి. మిడ్, స్మాల్‌క్యాప్ కంపెనీలు తీవ్ర అస్థిరతల మధ్య చలిస్తాయి. అధిక అస్థిరతలు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో అధిక రాబడులు కోరుకుంటే అప్పుడు ఫ్లెక్సీక్యాప్‌తోపాటు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
ధీరేంద్ర కుమార్, సీఈఓ, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment