నిఫ్టీ ఇండెక్స్‌ ఫండ్స్‌లో మంచి పథకం కోసం ముఖ్య అంశాలు | How to Choose Good Scheme in Nifty Index Funds | Sakshi
Sakshi News home page

నిఫ్టీ ఇండెక్స్‌ ఫండ్స్‌లో మంచి పథకం కోసం ముఖ్య అంశాలు

Published Mon, Oct 2 2023 7:08 AM | Last Updated on Mon, Oct 2 2023 7:08 AM

How to Choose Good Scheme in Nifty Index Funds - Sakshi

నిఫ్టీ ఇండెక్స్‌ ఫండ్స్‌లో మంచి పథకం ఎంపిక చేసుకోవడం ఎలా?  – స్వామినాథన్‌

ఇండెక్స్‌ ఫండ్‌ను ఎంపిక చేసుకునే విషయంలో పరిశీలించాల్సిన ముఖ్య అంశాలు రెండున్నాయి. ఒకటి ఎక్స్‌పెన్స్‌ రేషియో. ప్రస్తుతం ఇండెక్స్‌ ఫండ్స్‌ మధ్య చాలా పోటీ ఉంది. 10–15 బేసిస్‌ పాయింట్ల (0.1–0.15 శాతం) ఎక్స్‌పెన్స్‌ రేషియోకే ఇండెక్స్‌ ఫండ్స్‌ డైరెక్ట్‌ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కనుక యాక్టివ్‌ ఫండ్స్‌ను ఎంపిక చేసుకుంటే ఎక్కువ ఎక్స్‌పెన్స్‌ రేషియో చెల్లించాల్సిన అవసరం ఉండదు. 

రెండోది ట్రాకింగ్‌ ఎర్రర్‌. ఒక ఇండెక్స్‌ ఫండ్‌.. తాను పెట్టుబడులను అనుసరించే ఇండెక్స్‌తో పోలిస్తే రాబడుల విషయంలో ఎంత మెరుగ్గా పనిచేసిందో చెబుతుంది. ఇండెక్స్‌ ఫండ్‌ నిర్వహణ బృందం సామర్థ్యాన్ని ఇది ప్రతిఫలిస్తుంది. తక్కువ ఎక్స్‌పెన్స్‌ రేషియోతోపాటు.. ట్రాకింగ్‌ ఎర్రర్‌ తక్కువగా ఉన్న పథకం మెరుగైనది అవుతుంది. ఈ రెండు అంశాలను ప్రామాణికంగా చేసుకుని చూస్తే ఎస్‌బీఐ, యూటీఐ, హెచ్‌డీఎఫ్‌సీ సంస్థల పథకాలు మెరుగ్గా పనిచేస్తున్నాయి.

నేను పెట్టుబడులు పెట్టిన మ్యూచువల్‌ ఫండ్‌ వరుసగా రెండేళ్లపాటు చెత్త పనితీరు చూపించినట్టయితే, నా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం సరైనదేనా? – మునావర్‌

ఏదైనా ఒక మ్యూచువల్‌ ఫండ్‌ పథకం నుంచి వైదొలగేందుకు, ఆ పథకం తక్కువ రాబడులను ఇస్తుండడం అన్నది ముఖ్యమైన అంశం అవుతుంది. తక్కువ పనితీరు అంటే ఇతర పథకాలతో పోలిస్తే తక్కువ రాబడులు ఇవ్వడం. వైదొలిగే నిర్ణయానికి ముందు.. మీరు పెట్టుబడులు పెట్టిన మ్యూచువల్‌ ఫండ్‌ పథకం విభాగంలోని ఇతర పథకాల పనితీరు కూడా విశ్లేషించాలి. వాటి పనితీరు కూడా తగ్గిందా..? లేక మీరు ఇన్వెస్ట్‌ చేసిన పథకం పనితీరు మాత్రమే తగ్గిందా? చూడాలి. 

మీరు ఇన్వెస్ట్‌ చేసిన ఫండ్‌ ఎన్‌ఏవీ క్షీణించడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. స్టాక్‌ మార్కెట్‌ పడిపోయినా రాబడులు తగ్గుతాయి. అన్ని పథకాలు ఏదో ఒక సమయంలో కొన్ని ప్రతికూలతలను ఎదుర్కొంటూ ఉంటాయి. అది చూసి ఒక పథకం నుంచి మరో పథకంలోకి మారిపోవడం సరైన నిర్ణయం కాబోదు. ఈ ప్రతికూల, తక్కువ పనితీరు అనేది ఒక పథకంలో కనీసం నిరంతరాయంగా రెండేళ్లపాటు కొనసాగాలి. అప్పుడు ఆ పథకంలో పెట్టుబడులను సమీక్షించుకోవచ్చు. 

మీరు ఇన్వెస్ట్‌ చేసిన పథకం తక్కువ పనితీరు చూపించడం వెనుక కారణాన్ని గుర్తించాలి. ఫండ్‌ మేనేజర్‌లో మార్పు జరిగిందా? అందుకే పనితీరు మందగించిందా? అని చూడాలి. అదే నిజమైతే ఆ పథకం నుంచి మీ పెట్టుబడులను తీసుకుని బయటకు రావచ్చు. ఒకవేళ ఫండ్‌ మేనేజర్‌లో మార్పు లేకపోతే.. రాబడులు మందగించడానికి గల కారణాన్ని సాధారణంగా వారు మీడియాకు వెల్లడించే ప్రయత్నం చేస్తుంటారు. లేదంటే ఆయా ఫండ్‌ సంస్థ నెలవారీ న్యూస్‌లెటర్‌లోనూ సమాచారాన్ని వెల్లడిస్తుంటారు. 

పథకం పెట్టుబడుల విధానం వల్ల కూడా తాత్కాలికంగా రాబడులు మెరుగ్గా ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో పథకం పనితీరును తప్పుబట్టడం సరైనది కాకపోవచ్చు. ఉదాహణకు గ్రోత్‌ ఆధారిత విధానంతో పోలిస్తే వ్యాల్యూ ఆధారిత పెట్టుబడుల విధానం కాస్త ఆలస్యంగా ఫలితాలను ఇస్తుంది. 

అటువంటప్పుడు మీరు పెట్టుబడులను దీర్ఘకాలం పాటు కొనసాగించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క ఇన్వెస్టర్‌ తాను ఎంపిక చేసుకున్న పథకం అన్ని కాలాల్లోనూ అద్భుత పనితీరు చూపించాలని ఆశిస్తుంటారు. కానీ, ఆచరణలో ఇది సాధ్యం కాదు. అన్ని పథకాలు సానుకూల, ప్రతికూల సందర్భాలను ఎదుర్కొంటూ వెళుతుంటాయి. కనుక పెట్టుబడులను వెనక్కి తీసుకునే ముందు ఈ అంశాలన్నింటినీ చూడాలి.

-ధీరజ్‌ కుమార్‌, సీఈవో వాల్యూ రీసెర్చ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement