న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ నూతన పథకాల ద్వారా (ఎన్‌ఎఫ్‌వో) నిధుల సమీకరణ ఈ ఏడాది అనుకున్నంత ఆశాజనకంగా లేదు. మొదటి ఆరు నెలల్లో (జనవరి–జూన్) ఎన్‌ఎఫ్‌వోల రూపంలో సమీకరించిన నిధులు రూ.25,712 కోట్లుగా ఉన్నా యి. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో ఎన్‌ఎఫ్‌వోలు సమీకరించిన రూ.38,929 కోట్లతో పోలిస్తే 34 శాతం తగ్గాయి.
ఈక్విటీ, డెట్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితులు ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. ఒకే విభాగంలో ఒకటికి మించిన పథకాలు ఆవిష్కరించకూడదంటూ సెబీ విధించిన ఆంక్షలు పెద్ద మ్యూచువల్ ఫండ్స్ సంస్థలపై ప్రభావం చూపించింది. జనవరి నుంచి జూన్ వరకు మొత్తం 115 ఎన్‌ఎఫ్‌వోలు నిధుల సమీకరణ కోసం మార్కెట్లోకి వచ్చాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన 160 ఎన్‌ఎఫ్‌వోలతో పోలిస్తే క్షీణత కనిపిస్తోంది.
ఈక్విటీ ఫండ్స్
జనవరి నుంచి జూన్ వరకు ఈక్విటీ ఎన్‌ఎఫ్‌వోలు రూ.14,917 కోట్లు సమీకరించాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈక్విటీ కొత్త పథకాలు సమీకరించిన రూ.16,370 కోట్లతో పోలిస్తే 9 శాతం క్షీణత కనిపిస్తోంది. మొత్తం నూతన పథకాల ఆవిష్కరణ కూడా క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 22 నుంచి 17కు పరిమితమయ్యాయి.
అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ, దేశీ ఈక్విటీలు అదే పనిగా పెరుగుతూ వెళుతుండడంతో చాలా మంది ఇన్వెస్టర్లు నూతన పథకాల్లో ఇన్వెస్ట్ చేయడానికి బదులు, ఇప్పటికే ఉన్న పెట్టుబడులపై లాభాల స్వీకరణకు మొగ్గు చూపి ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెద్ద మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు రిస్క్‌తో కూడిన థీమ్యాటిక్ పథకాల ఆవిష్కరణకు మొగ్గు చూపించారు.
హైబ్రిడ్ ఫండ్స్
హైబ్రిడ్ (ఈక్విటీ, డెట్ కలిసిన) న్యూ ఫండ్ ఆఫర్‌ల రూపంలో సమీకరించిన నిధులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 22 శాతం తగ్గి, రూ.2,141 కోట్లుగా ఉన్నాయి. డెట్ ఫండ్స్ ఎన్‌ఎఫ్‌వోలపై ప్రభావం ఎక్కువగా పడింది. ఇవి రూ.6,235 కోట్లను రాబట్టాయి. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో డెట్ ఎన్‌ఎఫ్‌వోల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.12,649 కోట్లుగా ఉన్నాయి.
డెట్ ఎన్‌ఎఫ్‌వోల సంఖ్య 51 నుంచి 38కి తగ్గింది. ఇక ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు, ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌వోఎఫ్) విభాగంలోనూ ఎన్‌ఎఫ్‌వోల నిధుల సమీకరణ 66 శాతం క్షీణించి రూ.2,419 కోట్లుగా ఉంది. ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని (ద్రవ్యోల్బణం మినహాయింపు) ఎత్తివేయడం డెట్ ఫండ్స్ సమీకరణపై ప్రతికూల ప్రభావం చూపించింది. దీంతో ప్యాసివ్ లిక్విడ్, గిల్ట్ ఫండ్స్, టార్గెట్ మెచ్యూరిటీ పథకాలు ఆకర్షణ కోల్పోయాయి.
మారిన పరిస్థితులు..
ఈ పరిణామంపై నిప్పన్ ఇండియా మ్యూ చువల్ ఫండ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సౌగతా ఛటర్జీ స్పందిస్తూ.. ‘‘కొత్తగా ప్రవేశించిన సంస్థలు మిన హాయిస్తే చాలా వరకు ఫండ్‌హౌస్‌ల ఉత్పత్తుల ఆఫర్ అనేది పరిమితికి చేరింది. దీంతో కొన్ని థీమ్యాటిక్ ఫండ్స్‌తో మార్కెట్లోకి వస్తున్నాయి. నిప్పన్ మ్యూచువల్ ఫండ్ మాత్రం ఎన్‌ఎఫ్‌వోల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇన్వెస్టర్లకు వినూత్న మైన ప్రతిపాదనలు ఉన్నాయని అనిపించినప్పుడే కొత్త పథకాలను తీసుకొస్తోంది.
గడిచిన రెండేళ్లలో రెండే పథకాలను ఆవిష్కరించాం’’అని సౌగతా ఛటర్జీ తెలిపారు. ఇన్వెస్టర్లు కొత్త పథకాల్లో యూనిట్ ఎన్ ఏవీ రూ.10కే లభిస్తుందన్న ఉద్దేశ్యంతో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తుంటారని స్మార్ట్ వెల్త్ అడ్వైజర్స్ సీఈవో రమేశ్ పవార్ తెలిపారు. ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధులను ఇన్వెస్ట్ చేసినప్పు డే యూ నిట్ల అసలు విలువ ప్రతిఫలిస్తుందన్నారు. పెద్ద సంస్థలు కాకుండా కొత్తగా ప్రవేశించిన సంస్థలు తెచ్చే ఎన్‌ఎఫ్‌వోలకు స్పందన పెద్దగా ఉండడం లేద మరోవైపు తక్షణ లాభాల కోసం ఇన్వెస్టర్లు ఐపీవోల పట్ల మొగ్గు చూపిస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment