
జగ్గీ సోదరులపై నిషేధం
కీలక పదవులు చేపట్టకుండా చెక్...
సెక్యూరిటీ మార్కెట్లలోనూ నో ఎంట్రీ
లిస్టెడ్ కంపెనీని సొంత సంస్థలా మార్చారన్న నియంత్రణ సంస్థ
న్యూఢిల్లీ: లిస్డెడ్ కంపెనీ జెన్సోల్ ఇంజినీరింగ్‌ను ప్రమోటర్లు జగ్గీ బ్రదర్స్ సొంత (ప్రొప్రయిటరీ) సంస్థలా వాడుకున్నట్లు క్యాపిటల్‌మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించింది.కంపెనీ ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీపై నిషేధ అ్రస్తాన్ని ప్రయోగించింది. వెరసి వీరిరువురూ జెన్సోల్ సహా ఏ ఇతర లిస్టెడ్ కంపెనీలోనూ డైరెక్టర్లుగా లేదా కీలక యాజమాన్య స్థానంలో బాధ్యతలు చేపట్టేందుకు వీలుండదు. అంతేకాకుండా తదుపరి నోటీసు జారీ చేసేటంతవరకూ సెక్యూరిటీల మార్కెట్లో కార్యకలాపాలకూ అనుమతించమని సెబీ పేర్కొంది. నిధుల మళ్లింపునకుతోడు పాలనా సంబంధ అక్రమాలను గుర్తించడంతో సెబీ తాజా చర్యలకు ఉపక్రమించింది.
ఏం జరిగిందంటే..?
లిస్టెడ్ కంపెనీ జెన్సోల్ ఇంజినీరింగ్‌కు చెందిన కార్పొరేట్ నిధులను జగ్గీ బ్రదర్స్ అక్రమ మార్గంలో వినియోగించినట్లు 29 పేజీల మధ్యంతర ఆదేశాలలో సెబీ పేర్కొంది. వీటి ప్రకారం గుర్గావ్‌లోని డీఎల్‌ఎఫ్ కామెలియాస్‌లో హైఎండ్ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేశారు. విలాసవంత గోల్ఫ్ సెట్‌ను సొంతం చేసుకున్నారు. క్రెడిట్ కార్డుల బిల్లుల చెల్లింపు, దగ్గరి బంధువులకు నిధుల బదిలీ తదితరాలను చేపట్టారు. తద్వారా దగ్గరి బంధువుల వ్యక్తిగత ప్రయాణాలు, విలాసాలకు సైతం నిధులు వెచ్చించారు. వెరసి లిస్టెడ్ కంపెనీని పిగ్గీ బ్యాంకులాగా మార్చుకున్నారు.
ఇవికాకుండా ఫైనాన్షియల్ పీఎస్‌యూ దిగ్గజాలు ఇరెడా, పీఎఫ్‌సీల నుంచి ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) కొనుగోళ్ల కోసం తీసుకున్న రూ. 978 కోట్ల రుణాలను అక్రమంగా వినియోగించారు. 6,400 ఈవీ కొనుగోళ్లకు రూ. 664 కోట్లు వెచి్చంచనున్నట్లు పేర్కొనగా.. 4,704 వాహనాలను మాత్రమే ప్రొక్యూర్ చేసినట్లు ఫిబ్రవరిలో సెబీకి వెల్లడించింది. ఈవీలను బ్లూస్మార్ట్‌కు లీజుకిచ్చారు. అయితే 4,704 ఈవీలకు రూ. 568 కోట్లు మాత్రమే చెల్లించినట్లు గో ఆటో టెడ్ వెల్లడించింది. అయితే 20% అదనపు ఈక్విటీ చెల్లింపులతో కలిపి ఈవీలకు జెన్సోల్ రూ. 830 కోట్లు కేటాయించింది. అంటే వీటిలో రూ. 262 కోట్లు లెక్కతేలాల్సి ఉంది. కాగా.. జెన్సోల్, గో ఆటో బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే గో ఆటోకు చెల్లించిన నిధులు తిరిగి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జెన్సోల్ సంబంధిత సంస్థలలోకి చేరడం గమనార్హం! కాగా, బ్లూస్మార్ట్ క్యాబ్ సర్వీసులు 3 మెట్రో నగరాల్లో నిలిచిపోయాయి.
షేర్ల విభజనకు చెక్...
జెన్సోల్ ఇంజనీరింగ్ ప్రతిపాదించిన 1:10 నిష్పత్తిలో షేర్ల విభజనను సెబీ నిలిపివేసింది. 1 షేరుకి 10 షేర్లుగా విభజించడం ద్వారా మరింతమంది రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు కంపెనీ ప్రతిపాదించింది. ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో లిస్టయిన కంపెనీ సోలార్ కన్సల్టింగ్, ఈపీసీ సర్వీసులు, ఈవీల లీజింగ్ తదితర కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కాగా.. స్టాక్ ఎక్సే్ఛంజీలలో షేరు 5 శాతం డౌన్ సర్క్యూట్‌తో రూ. 124 వద్ద నిలిచింది. బీఎస్‌ఈలో 2024 జూన్ 24న రూ. 1,125 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది!