సాక్షి, ముంబై: ఆర్థిక నివేదికల వెల్లడిలోఅవకతవకలు, అక్రమాల ఆరోపణలపై మార్కెట్ రెగ్యులేటరీ సెబీ నిషేధాన్ని ఎదుర్కొంటున్న ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ బాంబే డైయింగ్ న్యాయ పోరాటానికి దిగింది. సెబీ ఆర్డర్‌పై అప్పీల్ చేయడానికి తన చట్టబద్ధమైన హక్కును వినియోగించు కుంటుందని బాంబే డైయింగ్ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (సాట్)ని ఆశ్రయించనున్నట్లు బాంబే డైయింగ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ తెలిపింది. తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.
సెబీ ఆర్డర్‌ను తాను పరిశీలించామని, అయితే దశాబ్దం క్రితం నాటి ఖాతాలపై సెబీ చర్యలు చేపట్టిందని తెలిపింది. 2011-12 ఆర్థిక సంవత్సరం, 2018-19 ఆర్థిక సంవత్సరం నాటి చెల్లుబాటు కాని ఖాతాలను, ఆమోదించని, లేదా సరిగా లేని వివరాలను అన్వయించడానికి ప్రయత్నించిందని కంపెనీ పేర్కొంది.
కాగా ఫైనాన్సియల్ స్టేట్‌మెంట్స్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న అభియోగంపై సెబీ సెక్యూరిటీస్ మార్కెట్‌లో ప్రవేశించకుండా సెబీ రెండు సంవత్సరాల పాటు నిషేధం విధించింది. అలాగే వాడియా గ్రూప్‌పై సెబీ 157.5 మిలియన్ రూపాయల జరిమానా కూడా విధించింది. 2011-12, 2018-19 సంవత్సరాల్లో కంపెనీ కార్యకలాలపై నిశితంగా పరిశీలించినట్లు సెబీ తెలిపింది.
అంతేకాదు వాడియా గ్రూప్‌నకు చెందిన బొంబే డైయింగ్ ప్రమోటర్స్ నుస్లీవాడియా, ఆయన ఇద్దరు కుమారులను కూడా సెక్యూరిటీ మార్కెట్‌లో కార్యకలాపాలు నిర్వహించకుండా రెండేళ్ల పాటు బ్యాన్ చేసింది. దీంతోపాటు వాడియా గ్రూప్‌కు చెందిన మరో కంపెనీ స్కేల్ సర్వీసెస్‌పైనా నిషేధం విధించింది. ఈ కంపెనీకి చెందిన మాజీ డైరెక్టర్లు డీఎస్ గగ్‌రాత్, ఎన్‌హెచ్ దంతేవాలా, శైలేష్ కార్నిక్, ఆర్ చంద్రశేఖరన్, బొంబే డైయింగ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ దర్గేష్ మెహతాపై కూడా సెబీ నిషేధం విధించింది.
ఈ లాభాలకు కంపెనీ రియల్ ఎస్టేట్ విభాగం బాంబే డైయింగ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ మాత్రమే బాధ్యత వహిస్తుందని ఆర్డర్ పేర్కొంది. స్కేల్‌తో కలిసి బీడీఎంసీఎల్ ఉద్దేశపూర్వకంగా ఆర్థిక నివేదికల తారుమారు చేసి, లాభాలను చూపించిన మార్కెట్ నిబంధలను ఉల్లఘించడమే కాకుండా షేర్ ధరలపై తప్పుదారి పట్టించేలా వ్యవహరించిందని సెబీ హోల్‌టైమ్ సభ్యుడు అనంత బారువా ఉత్తర్వులో పేర్కొన్నారు. బాంబే డైయింగ్ కంపెనీ పాలిస్టర్,టెక్స్‌టైల్స్, రియల్ ఎస్టేట్‌తో పాటు పది రంగాల్లో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment