Bombay Dyeing
-
ముంబై బిగ్గెస్ట్ ల్యాండ్ డీల్.. 22 ఎకరాలు రూ.5200 కోట్లు
ముంబై: ముంబై మార్కెట్లో అతిపెద్ద భూ విక్రయ లావాదేవీ నమోదైంది. బాంబే డైయింగ్ వర్లి ప్రాంతంలో తనకున్న 22 ఎకరాల భూమిని జపాన్‌కు చెందిన సుమిటోమోకు రూ.5,200 కోట్లకు విక్రయించనుంది. ప్రస్తుతం ఈ ప్రదేశంలో వాడియా ఇంటర్నేషనల్ సెంటర్ ఉంది. మూడు శతాబ్దాల చరిత్ర కలిగిన వాడియా గ్రూప్ ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఉంది. ఇదొక పెద్ద లావాదేవీ అని, దీంతో తమకున్న ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయని బాంబే రియల్టీ సీఈవో రాహుల్ ఆనంద్ ప్రకటించారు. లిస్టెడ్ కంపెనీ బోంబే డైయింగ్‌కు సబ్సిడరీయే బాంబే రియల్టీ. రుణ భారం నుంచి బయటపడి, బ్యాలన్స్ షీట్‌ను బలోపేతం చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 2022–23 సంవత్సరానికి గాను బాంబే రియల్టీ రూ.517 కోట్ల నష్టాన్ని చవిచూడడం గమనార్హం. తాజా లావాదేవీకి సంబంధించిన చెల్లింపులు తమకు రెండు విడతల్లో లభిస్తాయని.. మొదటి దశలో రూ.4,675 కోట్లు అక్టోబర్ నాటికి, మిగిలిన రూ.525 కోట్లు 2024 మార్చి నాటికి అందుతాయని రాహుల్ ఆనంద్ వెల్లడించారు. జపాన్‌కు చెందిన సుమిటోమో రియల్టీ అండ్ డెవలపర్మెంట్ సబ్సిడరీ అయిన గోయిసు రియల్టీ ఈ భూమిని కొనుగోలు చేయనుంది. గ్రూప్ చైర్మన్ నుస్లీ వాడియా ఈ లావాదేవీ కుదరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. -
బాంబే డైయింగ్‌కు సెబీ భారీ షాక్, కంపెనీ స్పందన ఇది!
సాక్షి, ముంబై: ఆర్థిక నివేదికల వెల్లడిలోఅవకతవకలు, అక్రమాల ఆరోపణలపై మార్కెట్ రెగ్యులేటరీ సెబీ నిషేధాన్ని ఎదుర్కొంటున్న ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ బాంబే డైయింగ్ న్యాయ పోరాటానికి దిగింది. సెబీ ఆర్డర్‌పై అప్పీల్ చేయడానికి తన చట్టబద్ధమైన హక్కును వినియోగించు కుంటుందని బాంబే డైయింగ్ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (సాట్)ని ఆశ్రయించనున్నట్లు బాంబే డైయింగ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ తెలిపింది. తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. సెబీ ఆర్డర్‌ను తాను పరిశీలించామని, అయితే దశాబ్దం క్రితం నాటి ఖాతాలపై సెబీ చర్యలు చేపట్టిందని తెలిపింది. 2011-12 ఆర్థిక సంవత్సరం, 2018-19 ఆర్థిక సంవత్సరం నాటి చెల్లుబాటు కాని ఖాతాలను, ఆమోదించని, లేదా సరిగా లేని వివరాలను అన్వయించడానికి ప్రయత్నించిందని కంపెనీ పేర్కొంది. కాగా ఫైనాన్సియల్ స్టేట్మెంట్స్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న అభియోగంపై సెబీ సెక్యూరిటీస్ మార్కెట్లో ప్రవేశించకుండా సెబీ రెండు సంవత్సరాల పాటు నిషేధం విధించింది. అలాగే వాడియా గ్రూప్‌పై సెబీ 157.5 మిలియన్ రూపాయల జరిమానా కూడా విధించింది. 2011-12, 2018-19 సంవత్సరాల్లో కంపెనీ కార్యకలాలపై నిశితంగా పరిశీలించినట్లు సెబీ తెలిపింది. అంతేకాదు వాడియా గ్రూప్‌నకు చెందిన బొంబే డైయింగ్ ప్రమోటర్స్ నుస్లీవాడియా, ఆయన ఇద్దరు కుమారులను కూడా సెక్యూరిటీ మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహించకుండా రెండేళ్ల పాటు బ్యాన్ చేసింది. దీంతోపాటు వాడియా గ్రూప్‌కు చెందిన మరో కంపెనీ స్కేల్ సర్వీసెస్‌పైనా నిషేధం విధించింది. ఈ కంపెనీకి చెందిన మాజీ డైరెక్టర్లు డీఎస్ గగ్‌రాత్, ఎన్‌హెచ్ దంతేవాలా, శైలేష్ కార్నిక్, ఆర్ చంద్రశేఖరన్, బొంబే డైయింగ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ దర్గేష్ మెహతాపై కూడా సెబీ నిషేధం విధించింది. ఈ లాభాలకు కంపెనీ రియల్ ఎస్టేట్ విభాగం బాంబే డైయింగ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ మాత్రమే బాధ్యత వహిస్తుందని ఆర్డర్ పేర్కొంది. స్కేల్‌తో కలిసి బీడీఎంసీఎల్ ఉద్దేశపూర్వకంగా ఆర్థిక నివేదికల తారుమారు చేసి, లాభాలను చూపించిన మార్కెట్ నిబంధలను ఉల్లఘించడమే కాకుండా షేర్ ధరలపై తప్పుదారి పట్టించేలా వ్యవహరించిందని సెబీ హోల్‌టైమ్ సభ్యుడు అనంత బారువా ఉత్తర్వులో పేర్కొన్నారు. బాంబే డైయింగ్ కంపెనీ పాలిస్టర్,టెక్స్టైల్స్, రియల్ ఎస్టేట్‌తో పాటు పది రంగాల్లో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
గుజరాత్ పిపా‘వావ్’- బాంబే డయింగ్ బోర్లా
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో అంచనాలకు అనుగుణమైన ఫలితాలు సాధించడంతో నౌకాశ్రయ సేవల కంపెనీ గుజరాత్ పిపావవ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ఇదే కాలంలో పనితీరు నిరుత్సాహపరచడంతో టెక్స్టైల్స్ కంపెనీ బాంబే డయింగ్ కౌంటర్లో అమ్మకాలకు తెరలేచింది. వెరసి గుజరాత్ పిపావవ్ కౌంటర్ భారీ లాభాలతో సందడి చేస్తోంటే.. బాంబే డయింగ్ షేరు నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. గుజరాత్ పిపావవ్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ప్రయివేట్ రంగ కంపెనీ గుజరాత్ పిపావవ్ రూ. 54 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇది 9 శాతం క్షీణతకాగా.. మొత్తం ఆదాయం సైతం 10 శాతం తక్కువగా రూ. 162 కోట్లకు చేరింది. అయితే పూర్తిఏడాదికి(2019-20) కంపెనీ నికర లాభం 35 శాతం ఎగసి రూ. 319 కోట్లను అధిగమించింది. అమ్మకాలు సైతం 5 శాతం పెరిగి రూ. 735 కోట్లను తాకాయి. వాటాదారులకు షేరుకి రూ. 3.5 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో గుజరాత్ పిపావవ్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 8 శాతం జంప్‌చేసి రూ. 71.7 వద్ద ట్రేడవుతోంది. బాంబే డయింగ్ లిమిటెడ్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో టెక్స్టైల్ రంగ కంపెనీ బాంబే డయింగ్ లిమిటెడ్ రూ. 49 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇది 96 శాతం క్షీణతకాగా.. మొత్తం ఆదాయం సైతం 89 శాతం తక్కువగా రూ. 313 కోట్లకు చేరింది. కాగా.. పూర్తిఏడాదికి(2019-20) కంపెనీ నికర లాభం 73 శాతం పడిపోయి రూ. 329 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 57 శాతం నీరసించి రూ. 1895 కోట్లను తాకింది. ఈ కాలంలో రూ. 25 కోట్ల ఇబిటా నష్టం వాటిల్లింది. వాటాదారులకు షేరుకి రూ. 0.2 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో బాంబే డయింగ్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6 శాతం పతనమై రూ. 64 వద్ద ట్రేడవుతోంది. -
టాటాపై వాడియా కేసు వెనక్కి
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాతో పాటు పలువురిపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులను బాంబే డైయింగ్ చైర్మన్ నుస్లీ వాడియా ఉపసంహరించుకున్నారు. రూ. 3,000 కోట్ల నష్టపరిహారం దావా కూడా వీటిలో ఉంది. వాడియా ప్రతిష్టకు భంగం కలిగించే ఉద్దేశమేదీ తమకు లేదంటూ టాటా సహా మిగతా వర్గాలు న్యాయస్థానానికి తెలియజేశారు. హైకోర్టు విచారణలో కూడా ఇదే తేలినందున పరువు నష్టం దావాను ఉపసంహరించుకోవడానికి వాడియాను అనుమతిస్తూ చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే సారథ్యంలోని బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. 2016లో టాటా గ్రూప్ కంపెనీ బోర్డుల నుంచి తనను తొలగించడాన్ని సవాల్ చేస్తూ రతన్ టాటాతో పాటు టాటా సన్స్‌లోని పలువురు డైరెక్టర్లపై వాడియా క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. దీనిపై 2018 డిసెంబర్ 15న ముంబైలోని మేజిస్ట్రేట్ కోర్టు.. టాటా, తదితరులకు నోటీసులు జారీ చేసింది. అయితే, ఆయన ప్రతిష్టకు భంగం కలిగించాలనే ఉద్దేశమేదీ లేదంటూ టాటా, తదితరులు ముంబై హైకోర్టును ఆశ్రయించగా.. వారికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. దీన్ని సవాల్ చేస్తూ వాడియా సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే, ఇరు వర్గాలు కూర్చుని విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలంటూ జనవరి 6న సుప్రీం కోర్టు సూచించింది. దీనికి అనుగుణంగా వాడియా తాజాగా కేసును ఉపసంహరించుకున్నారు. -
రెడీమేడ్స్‌లోకి బాంబే డైయింగ్
రిటైల్‌లో మరిన్ని విభాగాల్లోకి... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బాంబే డైయింగ్.. పెద్దగా పరిచయం చేయక్కరలేని టెక్స్టైల్ బ్రాండ్. 137 ఏళ్ల ప్రస్థానంలో కోట్లాది మంది కస్టమర్లను చూరగొన్న ఈ సంస్థ ఇప్పుడు రిటైల్ రంగంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగానే తయారీ నుంచి పూర్తిగా వైదొలిగింది. కేవలం టెక్స్టైల్ రిటైల్ బ్రాండ్‌గా కొనసాగాలని నిర్ణయించింది. వ్యవస్థీకృత రంగ విపణిలో పట్టు సాధించాలన్నది సంస్థ వ్యూహం. ఇందుకు దేశవ్యాప్తంగా తనకున్న నెట్‌వర్క్‌ను సద్వినియోగం చేసుకోనుంది. వచ్చే నాలుగేళ్లకుగాను బ్రాండింగ్, మార్కెటింగ్‌కు రూ.100 కోట్లు వ్యయం చేస్తోంది. వాడియా గ్రూప్‌లో ఇప్పటికే బ్రిటానియా, గో ఎయిర్ వాటివాటి రంగాల్లో దూసుకెళ్తున్నాయి. రెడీమేడ్స్‌లోకి కంపెనీ.. 2020 నాటికి దేశవ్యాప్తంగా రిటైల్ విభాగాన్ని పటిష్టం చేస్తోంది. బ్రాండ్ స్టోర్ల సంఖ్యను ప్రస్తుతమున్న 230 నుంచి 500లకు చేర్చాలని నిర్ణయించింది. అలాగే టచ్ పాయింట్లను రెండింతలు చేసి మొత్తం 10,000ల మార్కును దాటాలని భావిస్తోంది. తద్వారా రిటైల్ విపణిలో కంపెనీ బ్రాండ్‌ను విస్తృతం చేయనుంది. ప్రస్తుతం బెడ్ షీట్లు, బ్లాంకెట్స్, టవల్స్‌ను కంపెనీ విక్రయిస్తోంది. ఇవేగాక టెక్స్టైల్ రంగంలో మరిన్ని కొత్త విభాగాలను పరిచయం చేయాలన్నది ఆలోచన. ముందుగా రెడీమేడ్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. టెక్స్టైల్ రంగంలో ఉన్న విదేశీ దిగ్గజ బ్రాండ్లను భారత్‌లో మార్కెట్ చేసేందుకూ సంసిద్ధంగా ఉన్నామని సంస్థ రిటైల్ విభాగం సీఈవో నగేష్ రాజన్న సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కంపెనీకి ఉన్న నెట్వర్క్ బలం కొత్త విభాగాలు సులభంగా విజయవంతం కావడానికి దోహదం చేయనుందన్నారు. ఫోకస్ సడలకుండా..: ఉత్పత్తులను థర్డ్ పార్టీకి చెందిన ప్లాంట్ల నుంచి కంపెనీ కొనుగోలు చేస్తోంది. బ్రాండింగ్, మార్కెటింగ్, పరిశోధన, అభివృద్ధిపై బాంబే డైయింగ్ ఇక నుంచి దృష్టి పెడుతుంది. రిటైల్‌పై ఫోకస్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. ‘చైనా నుంచి చకవ ఉత్పత్తుల దిగుమతులతో మార్కెట్‌పై ఒత్తిడి ఉంది. వస్త్రాల తయారీలో ప్రధాన ముడి సరుకు అయిన పత్తి ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. తయారీ అంటే భారీ పెట్టుబడితో పాటు కార్మికులపై ఆధారపడాల్సిందే’ అని నగేష్ తెలిపారు. ఈ పరిస్థితులతో పెద్ద బ్రాండ్లు తయారీ నుంచి తప్పుకుని, కేవలం మార్కెటింగ్ పైనే దృష్టిసారిస్తున్నాయని గుర్తు చేశారు. తయారీ నుంచి తప్పుకోవడం ద్వారా రిటైల్ లక్ష్యంగా పెట్టుబడి చేసేందుకు వీలవుతుందన్నారు. యూత్‌ను దృష్టిలో పెట్టుకుని మరింత ట్రెండీ డిజైన్స్ తీసుకొస్తామని, ఇందుకోసం విదేశీ డిజైనర్లతో చేతులు కలుపుతామన్నారు. ప్రీమియం బ్రాండ్‌గానే.. బాంబే డైయింగ్‌కు పుణే సమీపంలో తయారీ ప్లాంటు ఉంది. ప్రస్తుతం ఈ ప్లాంటులో కార్యకలాపాలు పూర్తిగా మూసివేశారు. బ్రాండ్‌కు కావాల్సిన బెడ్ షీట్లు, బ్లాంకెట్స్, టవల్స్‌ను పలు ప్రైవేటు తయారీ కంపెనీల నుంచి కొనుగోలు చేస్తోంది. అయితే ప్రతి ప్లాంటులోనూ ఉత్పత్తుల నాణ్యతను మూడు దశల్లో బాంబే డైయింగ్ ప్రతినిధులు పర్యవేక్షిస్తారు. ఇక అన్ని ధరల శ్రేణిలో కంపెనీ పోటీ పడాలని నిర్ణయించింది. అంటే తక్కువ ధరల ఉత్పత్తులను విక్రయించబోమని, ప్రీమియం బ్రాండ్‌గానే కొనసాగుతామని సీఈవో స్పష్టం చేశారు. ఫ్యాబ్రిక్ విషయంలో మరింత నూతనత్వం తీసుకొస్తామని చెప్పారు. బాంబే డైయింగ్‌లో రిటైల్ వాటా ప్రస్తుతం 17 శాతముంది. నాలుగేళ్లలో దీనిని 30 శాతానికి చేరుస్తామన్నారు. వ్యవస్థీకృత రంగంలో.. కంపెనీ పోటీపడుతున్న విపణి పరిమాణం భారత్‌లో వ్యవస్థీకృత రంగం కేవలం రూ.1,000 కోట్లకు పరిమితం అయింది. అదే అవ్యవస్థీకృత రంగంలో రూ.45,000 కోట్లుంది. 50 శాతం మార్కెట్ రూ.1,000–2,000 ధరల శ్రేణిదే. వచ్చే 10 ఏళ్లు మార్కెట్ 8–10 శాతం వృద్ధి ఉంటుందని బాంబే డైయింగ్ అంటోంది. -
ఈ–కామర్స్‌లోకి బాంబే డైయింగ్..
• రిటైల్ బ్రాండ్‌గా కొనసాగుతాం • తయారీ పూర్తిగా నిలిపివేత • కంపెనీ సీఈవో నగేశ్ రాజన్న హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్స్టైల్ రంగంలో ఉన్న బాంబే డైయింగ్ సొంతంగా ఈ–కామర్స్ విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇప్పటికే పలు ఈ–కామర్స్ సంస్థలు కంపెనీ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయిస్తున్నాయి.ఫిబ్రవరికల్లా ఈ–కామర్స్‌లోకి అడుగు పెడుతున్నట్టు బాంబే డైయింగ్ రిటైల్ సీఈవో నగేశ్ రాజన్న సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. తయారీ పూర్తిగా నిలిపివేశామని, థర్డ్ పార్టీకి చెందిన ప్లాంట్ల నుంచిఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. రిటైల్ పైన ఫోకస్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 30 దాకా సబ్ బ్రాండ్లలో 5,000 రకాల బెడ్ షీట్లు, బ్లాంకెట్లు, టవల్స్ విక్రయిస్తున్నట్టు చెప్పారు.ఏటా 400 కొత్త రకాలను ప్రవేశపెడుతున్నట్టు వివరించారు. అంతర్జాతీయ డిజైనర్లతో చేతులు కలపడం ద్వారా వినూత్న ఉత్పత్తులను తీసుకొస్తామన్నారు. ఈ ఏడాది రిటైల్ విభాగం లాభాల్లోకి వస్తుందని తెలిపారు. భారీ లక్ష్యంతో ముందుకు..: కంపెనీకి దేశవ్యాప్తంగా 30 సొంత, 200 ఫ్రాంచైజీ ఔట్లెట్లు ఉన్నాయి. 5,000లకు పైగా దుకాణాల్లో బాంబే డైయింగ్ ఉత్పత్తులు లభిస్తున్నాయి. 2020 లక్ష్యంలో భాగంగా బ్రాండ్ స్టోర్ల సంఖ్య500లకు, టచ్ పాయింట్లను 10 వేలకు చేర్చనున్ననట్టు నగేశ్ వెల్ల డించారు. ‘వచ్చే నాలుగేళ్లలో బ్రాండ్ ప్రమోషన్‌కు రూ.100 కోట్లు వ్యయం చేస్తాం. 10% ఆదాయం సమకూరుస్తున్న ప్రధాన మార్కెట్లయిన తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లో 20% ఖర్చు పెడతాం. సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో నియామకాలు ఉంటాయి. రిటైల్ ద్వారా 2015–16లో రూ.305 కోట్ల ఆదాయం సమకూరింది. 2020 నాటికి దీనిని రూ.1,000 కోట్లకు చేరుస్తాం’ అనివివరించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత మార్కెట్లో 50% అమ్మకాలు తగ్గాయని... చైనా నుంచి దిగుమతులూ పడిపోయాయని గుర్తు చేశారు.