రెడీమేడ్స్‌లోకి బాంబే డైయింగ్‌ | Bombay Dyeing to launch premium, functional textile products | Sakshi
Sakshi News home page

రెడీమేడ్స్‌లోకి బాంబే డైయింగ్‌

Published Wed, Dec 28 2016 12:49 AM | Last Updated on Sat, Aug 11 2018 7:28 PM

రెడీమేడ్స్‌లోకి బాంబే డైయింగ్‌ - Sakshi

రెడీమేడ్స్‌లోకి బాంబే డైయింగ్‌

రిటైల్‌లో మరిన్ని విభాగాల్లోకి...
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బాంబే డైయింగ్‌.. పెద్దగా పరిచయం చేయక్కరలేని టెక్స్‌టైల్‌ బ్రాండ్‌. 137 ఏళ్ల ప్రస్థానంలో కోట్లాది మంది కస్టమర్లను చూరగొన్న ఈ సంస్థ ఇప్పుడు రిటైల్‌ రంగంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగానే తయారీ నుంచి పూర్తిగా వైదొలిగింది.  కేవలం టెక్స్‌టైల్‌ రిటైల్‌ బ్రాండ్‌గా కొనసాగాలని నిర్ణయించింది. వ్యవస్థీకృత రంగ విపణిలో పట్టు సాధించాలన్నది సంస్థ వ్యూహం. ఇందుకు దేశవ్యాప్తంగా తనకున్న నెట్‌వర్క్‌ను సద్వినియోగం చేసుకోనుంది. వచ్చే నాలుగేళ్లకుగాను బ్రాండింగ్, మార్కెటింగ్‌కు రూ.100 కోట్లు వ్యయం చేస్తోంది. వాడియా గ్రూప్‌లో ఇప్పటికే బ్రిటానియా, గో ఎయిర్‌ వాటివాటి రంగాల్లో దూసుకెళ్తున్నాయి.

రెడీమేడ్స్‌లోకి కంపెనీ..
2020 నాటికి దేశవ్యాప్తంగా రిటైల్‌ విభాగాన్ని పటిష్టం చేస్తోంది. బ్రాండ్‌ స్టోర్ల సంఖ్యను ప్రస్తుతమున్న 230 నుంచి 500లకు చేర్చాలని నిర్ణయించింది. అలాగే టచ్‌ పాయింట్లను రెండింతలు చేసి మొత్తం 10,000ల మార్కును దాటాలని భావిస్తోంది. తద్వారా రిటైల్‌ విపణిలో కంపెనీ బ్రాండ్‌ను విస్తృతం చేయనుంది. ప్రస్తుతం బెడ్‌ షీట్లు, బ్లాంకెట్స్, టవల్స్‌ను కంపెనీ విక్రయిస్తోంది. ఇవేగాక టెక్స్‌టైల్‌ రంగంలో మరిన్ని కొత్త విభాగాలను పరిచయం చేయాలన్నది ఆలోచన. ముందుగా రెడీమేడ్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. టెక్స్‌టైల్‌ రంగంలో ఉన్న విదేశీ దిగ్గజ బ్రాండ్లను భారత్‌లో మార్కెట్‌ చేసేందుకూ సంసిద్ధంగా ఉన్నామని సంస్థ రిటైల్‌ విభాగం సీఈవో నగేష్‌ రాజన్న సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. కంపెనీకి ఉన్న నెట్‌వర్క్‌ బలం కొత్త విభాగాలు సులభంగా విజయవంతం కావడానికి దోహదం చేయనుందన్నారు.

ఫోకస్‌ సడలకుండా..: ఉత్పత్తులను థర్డ్‌ పార్టీకి చెందిన ప్లాంట్ల నుంచి కంపెనీ కొనుగోలు చేస్తోంది. బ్రాండింగ్, మార్కెటింగ్, పరిశోధన, అభివృద్ధిపై బాంబే డైయింగ్‌ ఇక నుంచి దృష్టి పెడుతుంది. రిటైల్‌పై ఫోకస్‌ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. ‘చైనా నుంచి చకవ ఉత్పత్తుల దిగుమతులతో మార్కెట్‌పై ఒత్తిడి ఉంది. వస్త్రాల తయారీలో ప్రధాన ముడి సరుకు అయిన పత్తి ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి.

తయారీ అంటే భారీ పెట్టుబడితో పాటు కార్మికులపై ఆధారపడాల్సిందే’ అని నగేష్‌ తెలిపారు. ఈ పరిస్థితులతో పెద్ద బ్రాండ్లు తయారీ నుంచి తప్పుకుని, కేవలం మార్కెటింగ్‌ పైనే దృష్టిసారిస్తున్నాయని గుర్తు చేశారు. తయారీ నుంచి తప్పుకోవడం ద్వారా రిటైల్‌ లక్ష్యంగా పెట్టుబడి చేసేందుకు వీలవుతుందన్నారు. యూత్‌ను దృష్టిలో పెట్టుకుని మరింత ట్రెండీ డిజైన్స్‌ తీసుకొస్తామని, ఇందుకోసం విదేశీ డిజైనర్లతో చేతులు కలుపుతామన్నారు.

ప్రీమియం బ్రాండ్‌గానే..
బాంబే డైయింగ్‌కు పుణే సమీపంలో తయారీ ప్లాంటు ఉంది. ప్రస్తుతం ఈ ప్లాంటులో కార్యకలాపాలు పూర్తిగా మూసివేశారు. బ్రాండ్‌కు కావాల్సిన బెడ్‌ షీట్లు, బ్లాంకెట్స్, టవల్స్‌ను పలు ప్రైవేటు తయారీ కంపెనీల నుంచి కొనుగోలు చేస్తోంది. అయితే ప్రతి ప్లాంటులోనూ ఉత్పత్తుల నాణ్యతను మూడు దశల్లో బాంబే డైయింగ్‌ ప్రతినిధులు పర్యవేక్షిస్తారు. ఇక అన్ని ధరల శ్రేణిలో కంపెనీ పోటీ పడాలని నిర్ణయించింది. అంటే తక్కువ ధరల ఉత్పత్తులను విక్రయించబోమని, ప్రీమియం బ్రాండ్‌గానే కొనసాగుతామని సీఈవో స్పష్టం చేశారు. ఫ్యాబ్రిక్‌ విషయంలో మరింత నూతనత్వం తీసుకొస్తామని చెప్పారు.  బాంబే డైయింగ్‌లో రిటైల్‌ వాటా ప్రస్తుతం 17 శాతముంది. నాలుగేళ్లలో దీనిని 30 శాతానికి చేరుస్తామన్నారు.

వ్యవస్థీకృత రంగంలో..
కంపెనీ పోటీపడుతున్న విపణి పరిమాణం భారత్‌లో వ్యవస్థీకృత రంగం కేవలం రూ.1,000 కోట్లకు పరిమితం అయింది. అదే అవ్యవస్థీకృత రంగంలో రూ.45,000 కోట్లుంది. 50 శాతం మార్కెట్‌ రూ.1,000–2,000 ధరల శ్రేణిదే. వచ్చే 10 ఏళ్లు మార్కెట్‌ 8–10 శాతం వృద్ధి ఉంటుందని బాంబే డైయింగ్‌ అంటోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement