టెక్స్‌టైల్స్, అప్పారెల్ (వస్త్రాలు, దుస్తులు) ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) తొలి ఏడు నెలల కాలంలో (ఏప్రిల్–అక్టోబర్) 21.35 బిలియన్ డాలర్లకు (రూ.1.82 లక్షల కోట్లు) వృద్ధి చెందాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఎగుమతులు 20 బిలియన్ డాలర్లతో పోల్చి చూస్తే ఏడు శాతం వృద్ధి నమోదైంది. 8,733 మిలియన్ డాలర్ల(USD) ఎగుమతులు (మొత్తం ఎగుమతుల్లో 41 శాతం) రెడీమేడ్(readymade) వస్త్ర విభాగంలోనే నమోదయ్యాయి.
కాటన్ టెక్స్‌టైల్స్ విభాగం నుంచి 7,082 మిలియన్ డాలర్లు (33 శాతం), మనుషుల తయారీ టెక్స్‌టైల్స్ ఎగుమతులు 3,105 మిలియన్ డాలర్లు (15 శాతం) చొప్పున ఉన్నట్టు కేంద్ర టెక్స్‌టైల్స్(Textile) శాఖ గణాంకాలు విడుదల చేసింది. వూల్ విభాగంలో 19 శాతం, హ్యాండ్లూమ్ విభాగంలో 6 శాతం చొప్పున ఎగుమతులు క్షీణించగా, మిగిలిన అన్ని విభాగాల్లో ఎగుమతుల వృద్ధి నమోదైనట్టు వెల్లడించింది. మరోవైపు ఇదే కాలంలో టెక్స్‌టైల్స్, అప్పారెల్ దిగుమతులు ఒక శాతం క్షీణించి 5,425 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ప్రకటించింది. అత్యధికంగా మ్యాన్ మేడ్ టెక్స్‌టైల్స్ దిగుమతులు 1,859 మిలియన్ డాలర్లు (34 శాతం)గా ఉన్నాయి. కాటన్ టెక్స్‌టైల్స్ విభాగంలో, ప్రధానంగా కాటన్ ఫైబర్(Cotton Fiber) దిగుమతులు పెరిగినట్టు టెక్స్‌టైల్స్ శాఖ నివేదిక వెల్లడించింది. ఇది దేశీ తయారీ సామర్థ్యం పెరగడాన్ని సూచిస్తున్నట్టు పేర్కొంది.
ఇదీ చదవండి: ప్రపంచంలో అధిక వేతనం ఈయనకే..!
అంతర్జాతీయంగా 3.9 శాతం వాటా..
2023–24లో టెక్స్‌టైల్స్, అప్పారెల్ దిగుమతులు 8.94 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 15 శాతం తగ్గాయి. 2023 సంవత్సరం టెక్స్‌టైల్స్ ఎగుమతుల్లో భారత్ అంతర్జాతీయంగా ఆరో అతిపెద్ద దేశంగా నిలిచింది. ‘టెక్స్‌టైల్స్, అప్పారెల్ అంతర్జాతీయ మార్కెట్లో మన దేశ వాటా 3.9 శాతంగా ఉంది. యూఎస్‌ఏ, ఈయూ 47 శాతం వాటాతో భారత్‌కు అతి పెద్ద ఎగుమతి కేంద్రాలుగా ఉన్నాయి. టెక్స్‌టైల్స్, అప్పారెల్ పరంగా వాణిజ్య మిగులుతో మన దేశం ఉంది.’అని టెక్స్‌టైల్స్ శాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment