Apparel
-
దుస్తుల ఎగుమతుల్లో 9–11 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతీయ దుస్తుల ఎగుమతిదారులు 9–11 శాతం ఆదాయ వృద్ధి నమోదు చేస్తారని ఇక్రా రేటింగ్స్ అంచనా వేస్తోంది. ప్రధాన మార్కెట్లలో నిల్వలు తగ్గిపోవడం, వివిధ దేశాలు భారత్ నుంచి కొనుగోళ్లను పెంచడం ఇందుకు కారణమని తెలిపింది. ‘భారతీయ దుస్తుల ఎగుమతులకు దీర్ఘకాలిక అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి. రిటైల్ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకు అంగీకారం, అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల పోకడలు, ఉత్పత్తి–సంబంధిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం, ఎగుమతి ప్రోత్సాహకాలు, యూకే, ఈయూతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం ఇందుకు కారణం. అధిక రిటైల్ ఇన్వెంటరీ, కీలక మార్కెట్ల నుండి మందగించిన డిమాండ్, ఎర్ర సముద్ర సంక్షోభం, పొరుగు దేశాల నుండి పెరిగిన పోటీతో సహా సరఫరా సమస్యల కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 2 శాతం క్షీణించాయి. మూలధన వ్యయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, 2025–26లో టర్నోవర్‌లో 5–8 శాతం మధ్య ఉండే అవకాశం ఉంది. స్థూల ఆర్థిక వాతావరణం ఒత్తిడి, భౌగోళిక రాజకీయ సమస్యల మధ్య కొన్ని కీలక మార్కెట్లలో డిమాండ్ అనిశ్చితి చుట్టూ సవాళ్లు కొనసాగుతున్నాయి. అధికం అవుతున్న కార్మిక వ్యయాలు, సరుకు రవాణా ఖర్చులు, ఇతర నిర్వహణ ఖర్చుల పెరుగుదలతో పరిశ్రమ యొక్క నిర్వహణ మార్జిన్లు 2024–25లో 30–50 బేసిస్ పాయింట్లు తగ్గుతాయని అంచనా. బంగ్లాదేశ్‌లో ఇటీవలి భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత్‌సహా పలు దేశాల్లో సామర్థ్యం జోడించే అవకాశం ఉంది. పీఎల్ఐ పథకం కింద తాజా సామర్థ్య జోడింపుల నుండి పొందే ప్రయోజనాలతో పాటు, పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్, అపారల్ స్కీమ్ ద్వారా మానవ నిర్మిత ఫైబర్ ఉత్పత్తిలో దేశ ఉనికిని బలోపేతం చేయడంతో.. ప్రపంచ దుస్తుల వ్యాపారంలో భారత్ దూసుకెళ్తుందని పరిశ్రమ భావిస్తోంది’ అని నివేదిక వివరించింది. -
క్విక్ కామర్స్..ఫ్యాషన్ షో!
కిరాణా సరుకులు.. కూరగాయలు.. మిల్క్ ప్రోడక్టులు.. ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను 15 నిమిషాల్లో గుమ్మంలోకి చేరుస్తూ... శరవేగంగా దూసుకుపోతున్న క్విక్ కామర్స్ మరిన్ని ఉత్పత్తులను కార్ట్‌లోకి చేరుస్తోంది. నగరాల్లో సూపర్ సక్సెస్ నేపథ్యంలో అపారెల్, ఫుట్‌వేర్ కంపెనీలు దీనిపై ఫోకస్ చేస్తున్నాయి. ఫాస్ట్ సెల్లింగ్ జాబితాలో ముందున్న దుస్తులు, షూస్ ఇతరత్రా ఫ్యాషన్ ప్రోడక్టులను సైతం క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా విక్రయించేందుకు సై అంటున్నాయి.జొమాటో బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో.. ఈ క్విక్ కామర్స్ స్టార్టప్‌లు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. తమ ప్లాట్‌ఫామ్‌లలో ఇటీవలే ఫ్యాషన్ ప్రోడక్టుల అమ్మకాలు మొదలు పెట్టడంతో కస్టమర్లకు మరిన్ని రకాలు ప్రోడక్టులు అందుబాటులోకి వస్తున్నాయి. జాకీ, అడిడాస్ బ్రాండ్స్‌కు చెందిన బేసిక్ కలర్ టీ–షర్టులు, ఇన్నర్‌వేర్ వంటి ఉత్పత్తులను ఇన్‌స్టామార్ట్ సేల్ చేస్తోంది. ఇక బ్లింకిట్ జాకీ, పెపే, అడిడాస్ టీ–షర్ట్స్, కొన్ని రకాల ఫుట్‌వేర్, ట్రాక్ ప్యాంట్లతో పాటు లోదుస్తులను ఆఫర్ చేస్తోంది. జెప్టో కూడా నేను సైతం అంటూ రంగంలోకి దూకింది. దీంతో మరిన్ని ఆపారెల్, ఫుట్‌వేర్ బ్రాండ్స్ క్విక్ కామర్స్ అండతో అమ్మకాలు పెంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి. అరవింద్ ఫ్యాషన్స్, ఫ్యాబ్ ఇండియా, ఉడ్ల్యాండ్తో పాటు ప్యూమా తదితర దిగ్గజాలు క్విక్ కామర్స్ కంపెనీలతో జరుపుతున్న చర్చలు కొలిక్కి వచి్చనట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. దేశంలోని 15 టాప్ నగరాల్లో కస్టమర్లు తమ నిత్యావసరాల కోసం క్విక్ కామర్స్ బాట పడుతున్నారు. దీంతో మరింత మందిని బుట్టలో వేసుకోవాలని చూస్తున్న ఈ ప్లాట్‌ఫామ్‌లు గ్రాసరీలు, ఎఫ్ఎంసీజీకి మించి తమ పరిధిని విస్తరించడంపై ఫోకస్ చేస్తున్నాయి. ఆ రెండు విభాగాలపై గురి... ప్రస్తుతం భారత ఈ–కామర్స్‌లో మార్కెట్లో ఎల్రక్టానిక్స్–స్మార్ట్ ఫోన్స్ తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్నది ఫ్యాషన్ ఉత్పత్తులే. మొత్తం అమ్మకాల్లో వీటి వాటా 20–25 శాతంగా అంచనా. దీంతో ఫ్యాషన్ ప్రోడక్టుల అమ్మకం అటు బ్రాండ్లతో, ఇటు క్విక్ కామర్స్ సంస్థలకు ఉభయతారకంగా నిలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. కాగా, ఎల్రక్టానిక్స్–స్మార్ట్ ఫోన్స్ విభాగంలోకి కూడా దూకేందుకు ఈ స్టార్టప్‌లు ఉవి్వళ్లూరుతున్నాయి. యారో, కాలి్వన్ క్లీన్, టామీ హిలి్ఫగర్, యూఎస్ పోలో వంటి టాప్ బ్రాండ్లను విక్రయించే అరవింద్ ఫ్యాషన్స్.. క్విక్ కామర్స్ ద్వారా ముందుగా టీ–షర్ట్లు, ఇన్నర్వేర్తో పాటు బెల్టులు, సాక్స్‌ల వంటి యాక్సెసరీలను క్విక్ కామర్స్‌లో విక్రయించనుంది. ఐపీఎల్ సీజన్లో టీమ్ జెర్సీలను ఈ ప్లాట్‌ఫామ్‌లలో జోరుగా విక్రయించిన ప్యూమా... ఇతర ప్రోడక్టులకు సైతం తమ భాగస్వామ్యాన్ని విస్తరించే సన్నాహాల్లో ఉంది. ‘ఇన్స్టంట్ డెలివరీని ఎంచుకుంటున్న వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఫ్యాషన్ రంగంలో కూడా క్విక్ కామర్స్ సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ–కామర్స్‌లో మా కంపెనీ సేల్స్ 30 శాతానికి చేరుకున్నాయి’ అని ఉడ్‌ల్యాండ్ ఇండియా సీఈఓ హర్కీరత్ సింగ్ చెప్పారు. రిటర్న్‌లు చాలా తక్కువగా ఉండే బేసిక్ ప్రోడక్టులను తాము ఈ ప్లాట్ఫామ్లో విక్రయించనున్నట్లు ఫుట్‌వేర్ సంస్థ లిబర్టీ వెల్లడించింది. బాటా కూడా క్విక్ కామర్స్ రూట్లో వెళ్తోంది. ’10–15 నిమిషాల్లో డెలివరీ చేసేలా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో చర్చలు జరుపుతున్నాం. త్వరలోనే దీన్ని అమల్లోకి తీసుకొస్తాం’ అని బాటా ఇండియా సీఈఓ, ఎండీ గుంజన్ షా వెల్లడించారు. నో రిటర్న్ పాలసీ...ఈ–కామర్స్ మాదిరిగా క్విక్ కామర్స్‌లో ప్రోడక్టులు నచ్చకపోతే వెనక్కి తిరిగిచ్చేందుకు రిటర్న్ పాలసీ లేదు. తయారీపరమైన లోపాలకు మాత్రమే నగదును రీఫండ్ చేస్తున్నాయి. ఫ్యాషన్ రంగంలో సైజ్, రంగులు ఇతరత్రా కారణాలతో రిటర్న్ చేసే కస్టమర్లు ఎక్కువ. దీంతో ఉడ్‌ల్యాండ్ వంటి బ్రాండ్లు తమ స్టోర్స్ ద్వారా రిటర్న్ పాలసీని అమలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నాయి. కాగా, వివిధ ప్రదేశాల్లోని రిటైల్ స్టోర్లలో స్టాక్‌ను తమ ప్లాట్‌ఫామ్‌లకు లింక్ చేసి, ఎక్కువ ప్రోడక్టులను కస్టమర్లకు అందించాలనేది క్విక్ కామర్స్ సంస్థల వ్యూహం. ఎందుకంటే ఫ్యాషన్ ఉత్పత్తులను తమ డార్క్ స్టోర్లలో (వేగంగా డెలివరీ చేసేందుకు ఏర్పాటు చేసే భారీ గోదాములు) నిల్వ చేసేందుకు తగినంత స్థలం లేకపోవడం వాటికి పెద్ద సమస్య అవుతుందనేది పరిశ్రమ వర్గాల అభిప్రాయం. అయితే, ఫాస్ట్ సెల్లింగ్ ఉత్పత్తులైన ఇన్నర్‌వేర్, సాక్సులు, వైట్, సాలిడ్ కలర్ టీ–షర్ట్లు, బ్లాక్ ట్రౌజర్లు, బ్లూజీన్స్, కుర్తాలు, ఫార్మల్ బ్లాక్ షూస్, స్కూల్ షూస్, ఇంట్లో వాడే స్లిప్పర్స్, వాకింగ్ స్నీకర్స్ వంటివి తమ డార్క్ స్టోర్లలో నిల్వ చేయడం ద్వారా 15 నిమిషాల్లోనే డెలివరీ చేయొచ్చనేది క్విక్ కామర్స్ కంపెనీల యోచన.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
దుస్తుల ఎగుమతులు పెరిగాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దుస్తుల ఎగుమతులు దేశం నుంచి నవంబరులో 11.7 శాతం వృద్ధి చెందాయి. అంతర్జాతీయంగా ఉన్న సవాళ్ల నేపథ్యంలో గడిచిన కొన్ని నెలలుగా ఎగుమతులు తిరోగమనం చెందాయని అపారెల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ తెలిపింది. ‘యూకే, ఈయూ, యూఎస్ వంటి సంప్రదాయ మార్కెట్లు మాంద్యం, ఎదురుగాలులు చవిచూస్తున్నందున దేశం నుంచి రెడీమేడ్ దుస్తుల ఎగుమతులు దారుణంగా పడిపోయాయి. ద్రవ్యోల్బణం, ముడిసరుకు, రవాణా ఖర్చులు పెరగడంతోపాటు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఎగుమతిదారులపై భారం పెరిగింది. కొన్ని నెలల తర్వాత ఎగుమతులు సానుకూలంగా మారాయి. ప్రబలంగా ఉన్న సవాళ్లను ఎదుర్కోవడానికి పరిశ్రమకు ఉన్న స్థితిస్థాపకతను ఇది సూచిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దుస్తుల ఎగుమతి లక్ష్యం రూ.1.45 లక్షల కోట్లు. ఏప్రిల్–నవంబరులో రూ.82,740 కోట్లకుపైగా ఎగుమతులు నమోదయ్యాయి’ అని కౌన్సిల్ వివరించింది. చదవండి: ఆర్థిక మాంద్యంలోనూ అదరగొట్టిన మల్టీబ్యాగర్ స్టాక్.. కలలో కూడా ఊహించని లాభం! -
సామాన్యులకు కేంద్రం షాక్..! భారీగా పెరగనున్న దుస్తులు, చెప్పుల ధరలు
Central Government Increased GST on Apparel and Textiles & Footwear: సామాన్యులకు కేంద్రం మరో షాకిచ్చింది. గార్మెంట్స్, ఫుట్‌వేర్, టెక్స్టైల్స్ ప్రొడక్ట్‌లపై 5శాతం నుండి 12శాతం వరకు జీఎస్స్టీ(వస్తువులు మరియు సేవల పన్ను)ని వసూలు చేయనుంది. కొత్తగా వసూలు చేయనున్న జీఎస్టీ జనవరి 1, 2022 నుండి అమల్లోకి రానుంది. దీంతో బట్టలు, చెప్పులు ఇతర ఉత్పుత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) నవంబర్ 18న గార్మెంట్స్, ఫుట్‌వేర్, టెక్స్టైల్స్ గార్మెంట్‌పై జీఎస్టీ విధిస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే, నోటిఫికేషన్ ప్రకారం కొన్ని సింథటిక్ ఫైబర్లు, నూలుపై జీఎస్టీ రేట్లను 18శాతం నుండి 12శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. అదే మసయంలో ఫ్యాబ్రిక్స్‌పై జీఎస్టీ రేటు 5శాతం నుండి 12శాతానికి పెంచి సమం చేసింది. జీఎస్టీ బ్రాండెడ్ దుస్తులపై జీఎస్టీ 12శాతానికి వసూలు చేయనుంది. నేసిన వస్త్రాలు, సింథటిక్ నూలు, పైల్ ఫ్యాబ్రిక్స్, దుప్పట్లు, టెంట్లు, టేబుల్క్లాత్లు, సర్వియెట్‌లు, రగ్గులు, టేప్‌స్ట్రీస్ వంటి ఉపకరణాలతో కూడిన వస్త్రాలు, వాటి రేట్లు 5% నుండి 12% వరకు పెరిగాయి. బ్రాండెండ్ చెప్పులు 5శాతం నుండి 12శాతం వరకు పెరిగాయి. సీఎంఎఐ అసంతృప్తి జనవరి1,2022 నుండి దుస్తులపై జీఎస్టీ పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల భారత దుస్తుల తయారీదారుల సంఘం (సీఎంఎఐ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ముడిసరుకు ధరలు, ముఖ్యంగా నూలు, ప్యాకింగ్ మెటీరియల్, సరకు రవాణా పెరగడంతో పరిశ్రమ ద్రవ్యోల్బణ ఒత్తిడిని ఎదుర్కొంటున్నందున ఖర్చుల పెంపు ప్రధాన ప్రభావాన్ని చూపుతుందని పరిశ్రమ సంఘం పేర్కొంది. చదవండి: GST: ఐస్‌క్రీమ్ పార్లర్లు, స్టోర్ల నిర్వాహకులకు షాక్ -
చిన్న నగరాలకు రిటైల్ బ్రాండ్ల క్యూ...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా నేపథ్యంలో ప్రజలకు ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. పండ్లు, కూరగాయలు, గ్రాసరీ ఏ నిత్యావసరాలైనా సరే నాణ్యమైనవే ఎంచుకుంటున్నారు. ఇదే బహుళ జాతి రిటైల్ కంపెనీలకు వ్యాపార అవకాశంగా మారింది. ఇప్పటివరకు చిన్న పట్టణాలలో నాణ్యమైన రిటైల్ కేంద్రాలు లేకపోవటం కార్పొరేట్ బ్రాండ్లకు కలిసొచ్చింది. ద్వితీయ, తృతీయ, నాల్గో శ్రేణి పట్టణాలలో పెద్ద కార్పొరేట్ చెయిన్స్, రిటైల్ బ్రాండ్లు విస్తరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మే మధ్యకాలంలో ప్రముఖ రిటైల్ బ్రాండ్స్ 120కి పైగా లీజు లావాదేవీలను నిర్వహించాయి. 400 చ.అ. నుంచి 35 వేల చదరపు అడుగులు విస్తీర్ణాలలో ఎఫ్అండ్బీ, క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్‌ను ఏర్పాటు చేశాయి. బిబా, రిలయన్స్ ట్రెండ్స్, ప్యాంటలూన్స్, లెన్స్‌కార్ట్, వెస్ట్‌సైడ్, జుడియో, మ్యాక్స్ వంటి అపెరల్స్, లైఫ్ స్టయిల్ బ్రాండ్స్, స్టార్‌బక్స్, పిజ్జా హట్, కేఎఫ్‌సీ వంటి క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ (క్యూఎస్ఆర్), క్రోమా, రిలయన్స్ డిజిటల్ వంటి రిటైలర్లు హైస్ట్రీట్‌లో స్టోర్లను ఏర్పాటు చేశాయి. మోర్ రిటైల్ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, ఫైజాబాద్, సీతాపూర్, ముజఫర్ నగర్, ఒరిస్సాలోని భువనేశ్వర్‌లో స్టోర్ల ఏర్పాటు కోసం 14–30 వేల చ.అ. స్థలాలను లీజుకు తీసుకుంది. తృతీయ, నాల్గో శ్రేణి పట్టణాల్లో సూపర్ మార్కెట్లు.. కార్పొరేట్ రిటైలర్లు బెంగళూరు, పుణే, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ముంబై, గుర్గావ్ ప్రధాన నగరాలతో పాటు లక్నో, అహ్మదాబాద్, చంఢీఘర్, పాటియాలా వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, భోపాల్, గ్వాలియర్ వంటి చిన్న పట్టణాలల్లోనూ విస్తరిస్తున్నాయి. హైపర్, సూపర్ మార్కెట్ బ్రాండ్లు ద్వితీయ, తృతీయ, నాల్గో శ్రేణి పట్టణాల్లోని హైస్ట్రీట్‌లో స్థలాలను లీజుకు తీసుకుంటున్నాయి. హైస్ట్రీట్ లీజు లావాదేవీలలో 23 శాతం వాటాతో అపెరల్ బ్రాండ్స్ అగ్రస్థానంలో నిలవగా.. ఈ తర్వాత 15 శాతం వాటాతో ఎఫ్అండ్బీ బ్రాండ్లు, 12 శాతంతో జువెల్లరీ బ్రాండ్లు నిలిచాయి. పట్టణాల్లో ఎందుకంటే.. ఇప్పటికే హైస్ట్రీట్లలో వినియోగదారులు రద్దీ గణనీయంగా ఉంది. ఇలాంటి చోట్ల రిటైలర్లు విస్తరణకు ప్రణాళికలు చేస్తున్నాయి. తక్కువ సమయం, వ్యయంతో తక్షణమే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించే వీలుండటం రిటైలర్లు కలిసొస్తుందని అనరాక్ రిటైల్ జాయింట్ ఎండీ అండ్ సీఓఓ పంకజ్ రెంజెన్ తెలిపారు. మెట్రో నగరాలలో కొంతమంది రిటైలర్లు ఖరీదైన హైస్ట్రీట్లలో విస్తరణకు బదులుగా మంచి కనెక్టివిటీ, రోడ్ ఫేసింగ్ సైట్లలో విస్తరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా టైర్–2, 3 పట్టణాలు బ్రాండ్లకు అధిక ఆదాయ వనరులను అందిస్తున్నాయి. నిధులు, మూలధన పెట్టుబడులున్న రిటైలర్లు పోటీతత్వ ప్రయోజనాన్ని పొందేందుకు, మార్కెట్ వాటాలను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. చదవండి: 2025 నాటికి మార్కెట్లోకి 10 టాటా ఎలక్ట్రిక్ వాహనాలు -
సగం ధరకే ఫ్యాషన్ దుస్తులు
సాక్షి, ముంబై: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూపు తన భాగస్వామ్య సంస్థకు ధీటుగా తన సొంత వస్త్ర సామ్రాజ్యాన్ని స్థాపించుకునేందుకు సమాయత్తమవుతోంది. అదీ అతి చౌక ధరలకే ఫ్యాషన్ దుస్తులను భారత వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. పదేళ్ల క్రితం దక్షిణాఫ్రికా అపారెల్ సంస్థ ‘జారా’తో జట్టుకట్టిన టాటా సంస్థ..ఇప్పుడు సొంతంగానే దేశీయంగా వస్త్ర దుకాణాలను ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది. ప్రధానంగా ప్రపంచంలోనే అతిపెద్ద వస్త్ర దుకాణాల సముదాయం జారాలో దొరికే దుస్తుల కంటే సగం ధరకే కస్టమర్లను ఆకట్టుకోనుంది. వినియోగదారులకు జారా అందించే దానికంటే సగం ధరలకే దుస్తులను అందించనున్నట్లు టాటాకు చెందిన రీటెయిల్ సంస్థ ట్రెంట్ లిమిటెడ్ ఛైర్మన్ నోయల్ టాటా చెప్పారు. ఏడాదికి దేశవ్యాప్తంగా 40 వెస్ట్‌సైడ్ ఔట్లెట్లను ప్రారంభించనున్నట్లు నోయల్ తెలిపారు. 12 రోజుల్లో "ఎక్స్ట్రీమ్ ఫాస్ట్ ఫ్యాషన్’’ దుస్తులను వినియోగదారులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, వారి ఆదాయం క్రమేపీ పెరుగుతోంది. వారు దుస్తుల విషయంలో ట్రెండీ గా మారుతున్నారు. కానీ వారికి జారా లాంటి చోట్ల తక్కువ ఆదాయ వర్గాలైన వీరికి తక్కువ ధరల్లో ఫ్యాషన్ దుస్తులు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలోనే తక్కువ ధరకే ట్రెండీ దుస్తులను వారికి అందుబాటులోకి తేన్నామని తెలిపారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో కస్టమర్లను ఆకట్టుకుని మార్కెట్లో త్వరగా ఎదిగేందుకు ప్రయత్నిస్తామని నోయల్ చెప్పారు. దేశీయ వస్త్ర దుకాణాల నుంచి వచ్చే మోడల్స్ ధీటుగా ట్రెంట్ సప్లై చైన్‌ను వేగవంతంగా వృద్ది చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. -
బాహుబలి టీం మరో ప్లాన్
సినిమా ప్రమోషన్ విషయంలో సరికొత్త పాఠాలను నేర్పిన ఘనత బాహుబలి టీందే. గతంలో ఎన్నాడూ లేని విధంగా బాహుబలి సినిమాను మీడియా నెత్తికెత్తుకునేలా చేశారు రాజమౌళి టీం. అలా వచ్చిన పబ్లిసిటీ కారణంగానే బాహుబలి సినమాకు ఇంతటి భారీ వసూళ్లు సాధ్యమయ్యాయి. అయితే తాజాగా బాహుబలి ద కంక్లూజన్ విషయంలో కూడా సరికొత్త పబ్లిసిటీ యాక్టివిటీస్‌ను డిజైన్ చేస్తున్నారు. అందులో భాగంగా త్వరలో బాహుబలి థీంతో దుస్తులను మార్కెట్ లోకి ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నారు. అనుపమా దయాల్, సౌరబ్ కాంత్ శ్రీవాస్తవ్, మృణాలినీ గుప్తా, యోగేష్ చౌదరి, అప్రజితా తూర్, సెలెక్స్ వంటి ప్రఖ్యాత డిజైనర్లు ఈ దుస్తులను డిజైన్ చేస్తున్నారు. త్వరలోనే ఆన్లైన్లో అందుబాటులోకి రానున్న ఈ దుస్తులను ఏప్రిల్ 7న ఫ్యాషన్ షోను నిర్వహించనున్నారు. ఈ షోలో తమన్నా, రానాలు త్వరలో మార్కెట్లోకి రానున్న ఈ దుస్తులను ప్రదర్శించనున్నారు. -
50 కోట్ల డాలర్లకు స్నాప్‌డీల్ అమ్మకాలు !
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 50 కోట్ల డాలర్లకు చేరువ అవుతాయని దేశీయ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్, స్నాప్‌డీల్ తెలిపింది. ఈ -కామర్స్ సెగ్మెంట్ జోరు కారణంగా 2015 మార్చి కల్లా తమ అమ్మకాలు వంద కోట్ల డాలర్లకు పెరుగుతాయని ఈ సంస్థ అంచనా వేస్తోంది. గత కొన్ని నెలలుగా అమ్మకాల్లో భారీ వృద్ధి కనిపిస్తోందని స్నాప్‌డీల్‌డాట్‌కామ్ వైస్ ప్రెసిడెంట్ (బిజినెస్ డెవలప్మెంట్) టోనీ నవీన్ చెప్పారు. వినియోగదారులు ఇప్పుడు మరింత నమ్మకంగా ఆన్లైన్ ద్వారా కొనుగోళ్లు చేస్తున్నారని, ఫలితంగా తమ అమ్మకాలు 4-5 రెట్ల వృద్ధిని సాధించాయని పేర్కొన్నారు. అన్ని కేటగిరి వస్తువులు బాగా అమ్ముడవుతున్నాయని, అయితే ఎలక్ట్రానిక్స్, దుస్తుల అమ్మకాలు మరింత జోరుగా ఉన్నాయని వివరించారు. 2010, ఫిబ్రవరిలో కార్యకలాపాలు ప్రారంభించామని దాదాపు 2 కోట్ల మంది సభ్యులయ్యారని పేర్కొన్నారు. దాదాపు 500 రకాల కేటగిరిల్లో 20 వేల మంది విక్రయదారులు ఉత్పత్తులను ఆఫర్ చేస్తున్నారని, 4,000 నగరాల్లో డెలివరీలు ఇస్తున్నామని వివరించారు. రెండేళ్లలో అమెరికా స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.