2024–25పై ఇక్రా అంచనా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతీయ దుస్తుల ఎగుమతిదారులు 9–11 శాతం ఆదాయ వృద్ధి నమోదు చేస్తారని ఇక్రా రేటింగ్స్ అంచనా వేస్తోంది. ప్రధాన మార్కెట్లలో నిల్వలు తగ్గిపోవడం, వివిధ దేశాలు భారత్ నుంచి కొనుగోళ్లను పెంచడం ఇందుకు కారణమని తెలిపింది. ‘భారతీయ దుస్తుల ఎగుమతులకు దీర్ఘకాలిక అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి.
రిటైల్ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకు అంగీకారం, అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల పోకడలు, ఉత్పత్తి–సంబంధిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం, ఎగుమతి ప్రోత్సాహకాలు, యూకే, ఈయూతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం ఇందుకు కారణం. అధిక రిటైల్ ఇన్వెంటరీ, కీలక మార్కెట్ల నుండి మందగించిన డిమాండ్, ఎర్ర సముద్ర సంక్షోభం, పొరుగు దేశాల నుండి పెరిగిన పోటీతో సహా సరఫరా సమస్యల కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 2 శాతం క్షీణించాయి.
మూలధన వ్యయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, 2025–26లో టర్నోవర్‌లో 5–8 శాతం మధ్య ఉండే అవకాశం ఉంది. స్థూల ఆర్థిక వాతావరణం ఒత్తిడి, భౌగోళిక రాజకీయ సమస్యల మధ్య కొన్ని కీలక మార్కెట్లలో డిమాండ్ అనిశ్చితి చుట్టూ సవాళ్లు కొనసాగుతున్నాయి. అధికం అవుతున్న కార్మిక వ్యయాలు, సరుకు రవాణా ఖర్చులు, ఇతర నిర్వహణ ఖర్చుల పెరుగుదలతో పరిశ్రమ యొక్క నిర్వహణ మార్జిన్లు 2024–25లో 30–50 బేసిస్ పాయింట్లు తగ్గుతాయని అంచనా.
బంగ్లాదేశ్‌లో ఇటీవలి భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత్‌సహా పలు దేశాల్లో సామర్థ్యం జోడించే అవకాశం ఉంది. పీఎల్‌ఐ పథకం కింద తాజా సామర్థ్య జోడింపుల నుండి పొందే ప్రయోజనాలతో పాటు, పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్, అపారల్ స్కీమ్ ద్వారా మానవ నిర్మిత ఫైబర్ ఉత్పత్తిలో దేశ ఉనికిని బలోపేతం చేయడంతో.. ప్రపంచ దుస్తుల వ్యాపారంలో భారత్ దూసుకెళ్తుందని పరిశ్రమ భావిస్తోంది’ అని నివేదిక వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment