ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ నివేదిక
వాస్తవ వేతన వృద్ధి ఉంటుందన్న అభిప్రాయం
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) వృద్ధికి సంబంధించి ప్రస్తుత 7.1 శాతం అంచనాలను 7.5 శాతానికి పెంచుతున్నట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్–రా) తాజా నివేదికలో పేర్కొంది. వినియోగ డిమాండ్ క్రిత అంచనాలకన్నా మెరుగ్గా ఉండడం తాజా నిర్ణయానికి కారణమని వివరించింది.
ప్రభుత్వ మూలధన పెట్టుబడులు, కార్పొరేట్లు, బ్యాంకుల చక్కటి బ్యాలెన్స్ షీట్లు, ప్రారంభమైన ప్రైవేట్ కార్పొరేట్ మూలధన పెట్టుబడుల ప్రక్రియ, వృద్ధి ఊపందుకోవడం వంటి అంశాలకు కేంద్ర ప్రభుత్వ తాజా బడ్జెట్ మరింత ఊపునిస్తున్నట్లు విశ్లేíÙంచింది. వ్యవసాయ, గ్రామీణ వ్యయాలను బడ్జెట్ పెంచుతుందని, సూక్ష్మ లఘు చిన్న మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) రంగానికి రుణ మంజూరులను మెరుగుపరుస్తుందని ఆర్థిక వ్యవస్థలో ఉపాధి కల్పనను ప్రోత్సహిస్తుందని పేర్కొంది.
ఆర్‌బీఐ, అర్థిక సర్వే అంచనాలకన్నా అధికం..
2024–25 భారత్ జీడీపీ పురోగతిపై ఆర్‌బీఐ (7.2 శాతం), ఆర్థిక మంత్రిత్వశాఖ సర్వే (6.5 శాతం నుంచి 7 శాతం మధ్య) వృద్ధి అంచనాలకన్నా... ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ తాజా అంచనాలు అధికంగా (7.5 శాతం) ఉండడం గమనార్హం. సాధరణంకన్నా అధిక స్థాయిలో వర్షపాతం, తాజా బడ్జెట్‌లో ప్రోత్సాహకాలు వంటి అంశాలు ఇచ్చే ఫలితాలు జీడీపీ వృద్ధిని ఊహించినదానికన్నా పెంచుతాయని ఇండ్‌రా అభిప్రాయపడింది. ఆహార ద్రవ్యోల్బణం ప్రమాదంగా కొనసాగుతున్నప్పటికీ మొత్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం 2023–24 కంటే, 2024–25లో తక్కువగా ఉంటుందని సంస్థ అంచనావేసింది. ఇది వాస్తవ వేతన వృద్ధికి తోడ్పడుతుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment