gdp growth rate
-
ఆర్థిక మాంద్యం భయాలు..రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరి
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం రాబోతుందనే భయాలు అధికమవుతున్నాయి. ఇటీవల గ్లోబల్‌గా స్టాక్‌మార్కెట్ ట్రెండ్ గమనిస్తే ఆ అనుమానం మరింత బలపడుతుంది. అంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, పెరిగిన వడ్డీరేట్లు, తగ్గిన ఆర్థిక శక్తి వెరసి మాంద్యం భయాలు అధికమవుతున్నాయి. దాంతో ఇటీవల ప్రపంచ స్టాక్‌మార్కెట్లు భారీగా పడుతున్నాయి. అభివృద్ధి చెందిన అమెరికా మార్కెట్లకుతోడు యూరప్, ఆసియా మార్కెట్లు భారీగా క్షీణిస్తున్నాయి. మార్కెట్ సోమవారం(మధ్యాహ్నం 1:21 వరకు) నిఫ్టీ దాదాపు 713 పాయింట్లు, సెన్సెక్స్ అయితే ఏకంగా 2300 పాయింట్లు పడిపోయింది. అంటే సుమారు రూ.8 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది.మాంద్యంలోకి జపాన్..జపాన్ ఆర్థిక వృద్ధి రేటు 2023 చివరి త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్ మధ్య)లో 0.4%, అంతకుముందు జులై–సెప్టెంబర్‌లో 2.9%, 2024 మొదటి త్రైమాసికంలో 0.5 శాతం క్షీణించింది. వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వృద్ధి మందగిస్తే ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుందని గుర్తుగా భావిస్తారు. దీంతోపాటు, జపాన్ కరెన్సీ యెన్ కూడా బలహీనపడింది. ఫలితంగా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న జపాన్ క్రమంగా దాని స్థానాన్ని కోల్పోతోంది.బ్రిటన్‌లో ఇలా..పెరుగుతున్న వడ్డీ రేట్లు, నిరుద్యోగం బ్రిటన్ను కలవరపెడుతున్నాయి. దేశం మాంద్యంలోకి వెళ్లిపోతోందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. పెరుగుతున్న వడ్డీ రేట్లు, అధికమవుతున్న నిరుద్యోగం కారణంగా బ్రిటన్ ఇప్పటికే మాంద్యంలో ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ గతంలో నివేదించింది. 2023 సెప్టెంబర్ త్రైమాసికంలో బ్రిటన్ జీడీపీ 0.1 శాతం పడిపోయింది. దేశంలో ప్రస్తుతం నిరుద్యోగం 4.7 శాతం ఉండగా 2026 నాటికి ఇది 5.1 శాతానికి పెరుగుతుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ అంచనా వేసింది.ఆర్థిక సంక్షోభంలో చైనా..చైనా ఆర్థిక వ్యవస్థ కోలుకోలేనంతగా దెబ్బతిందనే వార్తలు వినిపిస్తున్నాయి. చైనాలో ఇప్పటికే విపరీతమైన నిరుద్యోగం ఉంది. ఇటువంటి పరిస్థితిలో చైనా నేపాల్ నుంచి శ్రీలంక వరకు తన ఉనికిని విస్తరిస్తోంది. ఇందుకు ఆర్థిక సహకారాన్ని అందించడమే కాకుండా, తన ప్రత్యర్థి అమెరికా వైపు స్నేహాన్ని నటిస్తోంది. చైనా ప్రాపర్టీ రంగంలో భారీగా క్షీణించింది. మీడియా నివేదికల ప్రకారం దేశంలో కోట్లాది ఇళ్లు ఖాళీగా ఉన్నాయని చైనా నేషనల్ బ్యూరో ఆప్ స్టాటిస్టిక్స్(ఎన్బీఎస్) సీనియర్ అధికారి హె కెంగ్ గతంలో తెలిపారు. ఈ సంఖ్య ఎంత ఉందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరని, కానీ ఈ ఇళ్లలో కోట్ల మంది ప్రజలు నివసించవచ్చన్నారు. చైనాలోని డాంగ్-గ్వాన్ అనే నగరంలో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య కోట్లుల్లో ఉందని కెంగ్ తెలిపారు. ఎన్బీఎస్-చైనా గతంలో విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో 64.8 కోట్ల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఇళ్లు అమ్మకానికి ఉన్నాయి. ప్రాజెక్టులు పూర్తయినా, వాటిని కొనుగోలు చేసే శక్తి ప్రజలకు లేదు.ఇదీ చదవండి: రూ.652 కోట్లతో మొండి బాకీల కొనుగోలు!మన మార్కెట్లపై ప్రభావం ఎంతంటే..భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీగా గుర్తింపు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా ఎదుగుతున్న దేశాలను నిరుద్యోగం, శ్రామికశక్తి, వనరులు, ముడిసరుకులు..వంటి ఎదోఒక సమస్య ప్రధానంగా వెంటాడుతోంది. అయితే భారత్‌లో ఇలాంటి సమస్యలున్నా వాటి ప్రభావం చాలా తక్కువ. ఇది ఇండియా ఆర్థిక వృద్ధికి బలం చేకూరుస్తోంది. తాత్కాలికంగా దేశీయ మార్కెట్లు పడినా దీర్ఘకాలికంగా రెట్టింపు లాభాలను తీసుకొస్తాయి. ఇలా మార్కెట్లు పడిన ప్రతిసారి మదుపర్లు నష్టాలను పట్టించుకోకుండా మంచి కంపెనీలను ఎంచుకుని పెట్టుబడిని కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత్ జీడీపీ మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 7.8 శాతం వృద్ధి నమోదు చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అది 8.2 శాతం వృద్ధి నమోదు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
వృద్ధి అంచనా 7.1 శాతం నుంచి 7.5 శాతానికి అప్
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) వృద్ధికి సంబంధించి ప్రస్తుత 7.1 శాతం అంచనాలను 7.5 శాతానికి పెంచుతున్నట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్–రా) తాజా నివేదికలో పేర్కొంది. వినియోగ డిమాండ్ క్రిత అంచనాలకన్నా మెరుగ్గా ఉండడం తాజా నిర్ణయానికి కారణమని వివరించింది. ప్రభుత్వ మూలధన పెట్టుబడులు, కార్పొరేట్లు, బ్యాంకుల చక్కటి బ్యాలెన్స్ షీట్లు, ప్రారంభమైన ప్రైవేట్ కార్పొరేట్ మూలధన పెట్టుబడుల ప్రక్రియ, వృద్ధి ఊపందుకోవడం వంటి అంశాలకు కేంద్ర ప్రభుత్వ తాజా బడ్జెట్ మరింత ఊపునిస్తున్నట్లు విశ్లేíÙంచింది. వ్యవసాయ, గ్రామీణ వ్యయాలను బడ్జెట్ పెంచుతుందని, సూక్ష్మ లఘు చిన్న మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) రంగానికి రుణ మంజూరులను మెరుగుపరుస్తుందని ఆర్థిక వ్యవస్థలో ఉపాధి కల్పనను ప్రోత్సహిస్తుందని పేర్కొంది. ఆర్బీఐ, అర్థిక సర్వే అంచనాలకన్నా అధికం.. 2024–25 భారత్ జీడీపీ పురోగతిపై ఆర్బీఐ (7.2 శాతం), ఆర్థిక మంత్రిత్వశాఖ సర్వే (6.5 శాతం నుంచి 7 శాతం మధ్య) వృద్ధి అంచనాలకన్నా... ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ తాజా అంచనాలు అధికంగా (7.5 శాతం) ఉండడం గమనార్హం. సాధరణంకన్నా అధిక స్థాయిలో వర్షపాతం, తాజా బడ్జెట్లో ప్రోత్సాహకాలు వంటి అంశాలు ఇచ్చే ఫలితాలు జీడీపీ వృద్ధిని ఊహించినదానికన్నా పెంచుతాయని ఇండ్రా అభిప్రాయపడింది. ఆహార ద్రవ్యోల్బణం ప్రమాదంగా కొనసాగుతున్నప్పటికీ మొత్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం 2023–24 కంటే, 2024–25లో తక్కువగా ఉంటుందని సంస్థ అంచనావేసింది. ఇది వాస్తవ వేతన వృద్ధికి తోడ్పడుతుందని పేర్కొంది. -
ఈసారి 15 శాతం రుణ వృద్ధి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆరి్థక వృద్ధి రేటును బట్టి చూస్తే ఈ ఆరి్థక సంవత్సరంలో (2024–25) రుణాల వృద్ధి 14–15 శాతం స్థాయిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా తెలిపారు. ‘సాధారణంగా జీడీపీ వృద్ధి రేటుకు ద్రవ్యోల్బణాన్ని కలిపి, దానికి 2–3 శాతం అదనంగా రుణ వృద్ధి ఉండగలదని అంచనా వేస్తుంటాం. దానికి అనుగుణంగా ప్రస్తుత పరిస్థితుల్లో అవకాశాలను బట్టి ఇది 14–15 శాతం ఉండొచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు. ఇక డిపాజిట్ల విషయానికొస్తే గతేడాది 11 శాతం వృద్ధి నమోదైనట్లు చెప్పారు. ఈసారి 12–13 శాతం స్థాయిలో ఉండగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. తమ చట్టబద్ధ లిక్విడిటీ నిష్పత్తి (ఎస్ఎల్ఆర్) నిర్దేశిత స్థాయికన్నా అధికంగానే ఉన్నందున డిపాజిట్ల రేట్లను పెంచి మరీ నిధులు సమీకరించాల్సిన ఒత్తిళ్లేమీ లేవని ఖారా వివరించారు. -
నాలుగేళ్లలో రూ.400 లక్షల కోట్లు..?
రానున్న నాలుగేళ్లల్లో భారత్ జీడీపీ ఐదు ట్రిలియన్ డాలర్లకు(దాదాపు రూ.400 లక్షల కోట్లు) చేరి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవరించనుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో నిర్మలా సీతారామన్ పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం 50 కోట్ల మందికి పైగా భారతీయులకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, ఈ సంఖ్య 2014 నాటికి 15 కోట్లగా ఉండేదని పేర్కొన్నారు. గత తొమ్మిదేళ్లలో భారతదేశం 595 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టబడులను పొందినట్లు మంత్రి తెలిపారు. 2027-28 ఆర్థిక సంవత్సరం నాటికి దేశ జీడీపీ ఐదు ట్రిలియన్ డాలర్లు మించిపోతుందని ఆమె అన్నారు. ప్రస్తుతం భారతదేశం దాదాపు 3.4 ట్రిలియన్ల డాలర్ల జీడీపీతో ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందన్నారు. అమెరికా, చైనా, జపాన్, జర్మనీలు మనకన్నా ముందున్నాయన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధి రేటును అంచనా వేయగా 7.2 శాతం వృద్ధి నమోదైందని చెప్పారు. ఇదీ చదవండి: యూట్యూబ్‌కు కేంద్ర సంస్థ సమన్లు.. విస్తుపోయే కారణం.. గడిచిన 23 ఏళ్లలో భారత్‌కు 919 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని.. ఈ ఎఫ్డీఐలో 65శాతం అంటే 595 బిలియన్ డాలర్లు గత 8-9 ఏళ్లలో వచ్చినవేనని తెలిపారు. బ్యాంకు ఖాతాలు ఉన్న వారి సంఖ్య 50 కోట్లకు పెరిగిందని, అయితే 2014లో 15 కోట్ల మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలుండేవని వివరించారు. -
భారత్ వృద్ధి అంచనాకు ఏడీబీ కోత
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023 ఏప్రిల్–24మార్చి) జీడీపీ వృద్ధి రేటు తొలి అంచనాలను ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ స్వల్పంగా తగ్గించింది. 2023 ఏప్రిల్ అవుట్‌లుక్ 6.4 శాతం అంచనాలను తాజాగా 10 బేసిస్ పాయింట్లు తగ్గి స్తున్నట్లు తెలిపింది. దీనితో ఈ అంచనా 6.3 శాతానికి తగ్గినట్లయ్యింది. ఎగుమతుల్లో మందగమనం, తగిన వర్షపాతం లేక వ్యవసాయంపై ప్రభావం వంటి అంశాలు తమ అంచనాల కోతకు కారణ మని తన 2023 సెపె్టంబర్ అవుట్‌లుక్‌లో తెలిపింది. కాగా 2024–25 అంచనాలను 6.7 శాతంగా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రైవేటు పెట్టుబడులు, దేశీయ వినియోగం, ప్రభ్తువ మూలధన వ్యయాలు వృద్ధికి భరోసాను ఇస్తున్నట్లు తెలిపింది. 5.9 శాతం నుంచి 6.2 శాతానికి అప్: ఇండియా రేటింగ్స్ మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 5.9 శాతం వృద్ధి అంచనాలను 6.2 శాతానికి పెంచుతున్నట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ మూలధన పెట్టుబడులు పెరగడం, బ్యాంకులు, కార్పొరేట్ల మెరుగైన బ్యాలెన్స్ షీట్లు, గ్లోబల్ కమోడిటీ ధరలు తగ్గడం, ప్రైవేటు పెట్టుబడుల్లో ఉత్తేజం తన రేటింగ్ మెరుగుదలకు కారణమని ఈ మేరకు విడుదలైన ఒక నివేదికలో ఇండియా రేటింగ్స్ ప్రధాన ఎకనమిస్ట్ సునిల్ కుమార్ పేర్కొన్నారు. (రూ.400 కోట్లకు అలనాటి మేటి హీరో బంగ్లా అమ్మకం: దాని స్థానంలో భారీ టవర్?) మన ఎకానమీకి ఢోకా లేదు: అషీమా గోయెల్ ఇదిలావుండగా, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లోనూ భారత్ ఎకానమీ చక్కని పనితీరు ప్రదర్శిస్తోందని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధన కమిటీ (ఎంపీసీ) సభ్యుల్లో ఒకరైన అషీమా గోయెల్ పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు సంస్కరణాత్మక చర్చలు, ఆర్బీఐ విధానాలు దేశ ఎకానమీకి తగిన బాటన నడుపుతున్నట్లు వివరించారు. -
సానుకూలతలు కొనసాగొచ్చు
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఈ వారమూ సానుకూలతలు కొనసాగొచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు, ద్రవ్య విధానంపై ఆర్బీఐ వైఖరి.., స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు ట్రేడింగ్ ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. అలాగే విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కార్యకలాపాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుందంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి, వర్షపాత నమోదు, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించొచ్చంటున్నారు నిపుణులు. ‘‘మార్చి త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటు అంచనాలకు మించి నమోదైంది. మే తయారీ రంగ పీఎంఐ మెప్పించింది. తాజాగా అమెరికా ‘రుణ పరిమితి పెంపు’ చట్టంపై నెలకొన్న సందిగ్ధత సైతం తొలగింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్న ఈ పరిణామాల ప్రభావం మరికొంత కాలం కొనసాగొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ ఎగువ స్థాయిలో 18,650 – 18,800 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు నెలకొంటే దిగువ స్థాయి 18,450–18,500 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీస్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహన్ తెలిపారు. అమెరికా అప్పుల పరిమితి పెంపు బిల్లుకు ఎగువ సభ ఆమోదం తెలుపుతుందో లేదో అనే ఆందోళనల నడుమ ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫలితంగా గతవారం సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడాయి. సెన్సెక్స్ 45 పాయింట్లు, నిఫ్టీ 35 పాయింట్లు చొప్పున స్వల్పంగా లాభపడ్డాయి. మంగళవారం ఆర్బీఐ పాలసీ సమావేశం ఆర్బీఐ ద్రవ్య విధాన పాలసీ కమిటీ సమావేశం మంగళవారం ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జరుగనున్న ఈ భేటీ నిర్ణయాలు గురువారం (జూన్ 8న) వెలువడనున్నాయి. ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం దిగిరావడం, మార్చి జీడీపీ వృద్ధి రేటు అంచనాలకు మించి నమోదవడం తదితర పరిణామాల నేపథ్యంలో ద్రవ్య విధాన కమిటీ వడ్డీరేట్ల యథాతథ కొనసాగింపునకే మొగ్గుచూపొచ్చని ఆర్థిక వేత్తలు అంచనావేస్తున్నారు. ఊహించినట్లే ఆర్బీఐ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోతే సూచీలు మరింత బలంగా ర్యాలీ చేయోచ్చంటున్నారు. అలాగే పాలసీ ప్రకటన సందర్భంగా ఆర్బీఐ ఛైర్మన్ శక్తికాంత దాస్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిగణలోకి తీసుకొనే వీలుంది. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం ఇవాళ భారత మే నెల సేవారంగ తయారీ గణాంకాలు విడుదల కానున్నాయి. అలాగే అమెరికా, యూరోజోన్, చైనా, పీఎఎంఐ డేటా సైతం ఇవాళ వెల్లడి కానుంది. బుధవారం మే నెల చైనా బ్యాలె న్స్ ఆఫ్ ట్రేడ్, గురువారం అమెరికా ఉద్యోగ గణాంకాలు, యూరోజోన్, జపాన్ క్యూ1 జీడీపీ వృద్ధి, శుక్రవారం చైనా మే ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి. శుక్రవారం జూన్ తొలి వారంతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఏప్రిల్ 28న ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావం చూపగలవు. నైరుతి రుతుపవనాల వార్తలపై దృష్టి స్టాక్ మార్కెట్ కదలికపై నైరుతి రుతుపవనాల వార్తలూ ప్రభావం చూపే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల సీజన్లో ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడినప్పటికీ భారత్‌లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దేశంలో సాధారణ రుతుపవనాలు ద్రవ్యోల్బణాన్ని తగ్గించగలవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఎఎంసీజీ, ఎరువులు, వ్యవసాయం, వినియోగ, ఆటో రంగాల షేర్లలో కదలికలు గమనించవచ్చు. 9 నెలల గరిష్టానికి విదేశీ పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్లు ఈ మే నెలలో రూ.43,838 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఇది తొమ్మిది గరిష్టమని మార్కెట్ నిపుణులు తెలిపారు. బలమైన ఆర్థిక గణాంకాలు, ఆకర్షణీయమైన వాల్యుయేషన్ల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఎఫ్‌పీఐలు 2022 ఆగస్టులో అత్యధికంగా రూ. 51,204 కోట్ల పెట్టుబడులు పెట్టారు. గత నెలతో పాటు ప్రస్తుత నెలలోనూ ఎఫ్‌పీఐల ధోరణి సానుకూలంగానే ఉన్నారు. జూన్ నెలలో ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు రూ. 6,490 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారని డిపాజిటరీ గణాంకాలు వెల్లడించాయి. ‘‘గతవారం విడుదలైన జీడీపీ వృద్ధి రేటు, వృద్ధిపై పలు రేటింగ్ ఏజెన్సీల సానుకూల ప్రకటనల మద్దతు ఉన్నందున ఈ నెలలోనూ ఎఫ్‌పీఐల ధోరణి అదే స్థాయిలో కొనసాగుతుంది’’ జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయకుమార్ అన్నారు. -
వృద్ధి రేటు 6.9 శాతం
న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి అంచనాలను మరో అంతర్జాతీయ సంస్థ ఓఈసీడీ సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.9 శాతంగా కొనసాగించింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు పట్ల ‘ఆర్థిక సహకార, అభివృద్ధి సమాఖ్య’ (ఓఈసీడీ) సానుకూలంగా స్పందించింది. కాకపోతే ఆర్బీఐ అంచనా అయిన 7.2 శాతానికంటే ఓఈసీడీ అంచనాలు తక్కువగా ఉండడం గమనార్హం. ‘‘వెలుపలి (అంతర్జాతీయ) డిమాండ్ మృదువుగా ఉండడం వల్లే భారత జీడీపీ వృద్ధి 2021–22లో ఉన్న 8.7 శాతం నుంచి, 2022–23లో సుమారు 7 శాతానికి తగ్గిపోవచ్చని అంచనా వేస్తున్నాం. ఇది 2023–24కు 5.75 శాతంగా ఉండొచ్చు. అయినా కానీ బలహీన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఈ మాత్రం వృద్ధి అన్నది వేగవంతమైనదే అవుతుంది’’అని ఓఈసీడీ తన తాజా నివేదికలో ప్రస్తావించింది. జూన్ నాటి నివేదికలోనూ ఓఈసీడీ భారత వృద్ధి అంచనాలను 6.9 శాతంగా పెర్కొనడం గమనార్హం. యుద్ధం వల్లే సమస్యలు.. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తన వృద్ధి జోరును కోల్పోయినట్టు ఓఈసీడీ పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడం ప్రపంచ వృద్ధి రేటును కిందకు తోసేసిందని, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగేందుకు దారితీసిందని తన తాజా నివేదికలో ఓఈసీడీ పేర్కొంది. ఈ ఏడాదికి అంతర్జాతీయ వృద్ధి రేటు 3 శాతంగా ఉంటుందని, 2023కు ఇది 2.2 శాతానికి తగ్గిపోతుందని అంచనా వేసింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముందు వేసిన అంచనాలకు ఇది తక్కువ కావడం గమనించాలి. 2023 సంవత్సరానికి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ 2.8 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందన్నది ఓఈసీడీ పూర్వపు అంచనా. చైనా ఆర్థిక వ్యవస్థ సైతం ప్రతికూలతలు చూస్తోందంటూ.. 2022 సంవత్సరానికి 3.2 శాతానికి పరిమితం అవుతుందని తెలిపింది. 2020 కరోనా సంక్షోభ సంవత్సరాన్ని మినహాయిస్తే 1970 తర్వాత చైనాకు ఇది అత్యంత తక్కువ రేటు అవుతుందని పేర్కొంది. జీ20 దేశాల్లో ద్రవ్యోల్బణం ఈ ఏడాది 8.2%గాను, 2023లో 6.6 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. భారత్‌కు సంబంధించి ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటుందని పేర్కొంది. -
13 నుంచి 15.7 శాతం వృద్ధికి చాన్స్
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 13 శాతం నుంచి 15.7 శాతం మధ్య ఉండే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నెలాఖరున అధికారిక గణాంకాలు వెలువడుతున్న నేపథ్యంలో పలువురు ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు వృద్ధి తీరుపై తమ అంచనాలను వెలువరిస్తున్నారు. మహమ్మారి కరోనా మొదటి వేవ్ కారణంగా 2020 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీలో అసలు వృద్ధి లేకపోగా 23.9 శాతం క్షీణించింది. ఇక 2021 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో భారీగా 20.1 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. ఇదే కాలంలో చోటుచేసుకున్న రెండవ వేవ్‌లో మొదటి వేవ్‌కన్నా ప్రాణనష్టం అపారంగా ఉన్నప్పటికీ ఈ స్థాయి వృద్ధి రేటు (20.1 శాతం) నమోదుకు లో బేస్ కూడా ఒక కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఆగస్టు 5వ తేదీ పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ 16.2 శాతం వరకూ క్యూ1 వృద్ది రేటు ఉండవచ్చని అంచనావేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ముగిసిన త్రైమాసికంపై (2022 ఏప్రిల్–జూన్) అంచనాలు, అభిప్రాయాలను పరిశీలిస్తే... 15.7 శాతం దాటినా దాటచ్చు... మొదటి త్రైమాసికంలో జీడీపీ 15.7 శాతం దాటిపోతుందని భావిస్తున్నాం. తుది గణాంకాలు ఇంతకు మించి కూడా నమోదుకావచ్చు. ఇది వాస్తవరూపం దాల్చితే ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఆర్బీఐ అంచనాలకు (7.2 శాతం) మించి జీడీపీ వృద్ధి రేటు నమోదుకావచ్చు. 41 రంగాలకు సంబంధించి 41 హై ఫ్రీక్వెన్సీ లీడిండ్ ఇండికేటర్స్ ప్రకారం, వృద్ధి విస్తృత ప్రాతిపదిక ఉంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో జూన్ త్రైమాసికంలో కరోనా సవాళ్లతో రూ.4.77 లక్షల కోట్ల వరకూ గణనీయంగా పడిపోయిన వినియోగ వ్యయం 2021–22 మొదటి త్రైమాసికంలో 46 శాతం వరకూ రికవరీ అయ్యింది. 2022–23 క్యూ1లో మిగిలిన 54 శాతం రికవరీ అయ్యిందని సూచీలు తెలుపుతున్నాయి. సేవల రంగం రికవరీ ఇందుకు దోహదపడింది. ప్రత్యక్ష వాణిజ్యాన్ని యుద్ధం ప్రభావితం చేస్తున్న మాట వాస్తవమే. ఇంధనం, వస్తువుల ధరలు, వినియోగ విశ్వాసం, పాలసీ చర్యలకు సంబంధించి కొంత అనిశ్చితి ఉన్న మాట నిజమే. అయినప్పటికీ ఈ సవాళ్లను తట్టుకోగలిన ఫండమెంటల్స్ పటిష్టతను భారత్ ఆర్థిక వ్యవస్థ కలిగి ఉంది. – సౌమ్య కాంతి ఘోష్, ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ 13 శాతానికి పరిమితం అవుతుందని భావిస్తున్నాం... అధిక బేస్ ఎఫెక్ట్‌తో పాటు (2021 ఇదే కాలంలో 20.1 శాతం వృద్ధి) గోధుమల ఉత్పత్తిపై వేసవి ప్రభావం, భౌగోళిక–రాజకీయ సమస్యలు, డిమాండ్–మార్జిన్లపై పెరిగిన కమోడిటీ ధరల ప్రభావం క్యూ1లో వృద్ధి వేగాన్ని 13 శాతానికి తగ్గిస్తాయి. ఇక ఉత్పత్తి స్థాయి వరకూ సంబంధించిన ఉత్పత్తి (జీవీఏ) స్థూల విలువ జోడింపు విధానంలో వృద్ధి 12.6 శాతానికి పరిమితం కావచ్చు. జీడీపీలో మెజారిటీ షేర్ ఉన్న సేవల రంగంలో 17 నుంచి 19 శాతం వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నాం. 9 నుంచి 11 శాతం వృద్ధితో పారిశ్రామిక రంగం రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఆరవ నెలలోకి ప్రవేశించిన రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటోంది. ఇటీవల కమోడిటీ ధరలు కొంత తగ్గాయి. ఇదే పరిస్థితి కొనసాగితే, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు కొంత తగ్గవచ్చు. ఈ పరిస్థితిలో రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్)లో ద్రవ్యోల్బణం 6.5 శాతం నుంచి 7 శాతం వరకూ ఉండవచ్చు. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ అంచనా (6.2 శాతం) ఇది ఎక్కువే కావడం గమనార్హం. – అదితీ నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ -
రికార్డు స్థాయిలో పెరిగిన దేశ జీడీపీ
మన దేశ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) రికార్డు స్థాయిలో పెరిగినట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) రికార్డు స్థాయిలో 20.1 శాతంగా పెరిగినట్లు కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఏప్రిల్-జూన్ 2020 కాలంలో భారతదేశం ప్రధానంగా మొదటి కరోనా వైరస్ కారణంగా జీడీపీ భారీగా దెబ్బతింది. జీడీపీ వృద్ది రేటు -24.4 శాతానికి పడిపోయింది. "క్యూ1ఎఫ్ వై22లో స్థిరమైన(2011-12) ధరల వద్ద జీడీపీ వృద్ది రేటు క్యూ1 ఎఫ్ వై21లో 24.4 శాతం సంకోచంతో పోలిస్తే 20.1 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు" అని మంత్రిత్వ శాఖ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా వివిధ ఆర్థిక సంస్థలు ఏప్రిల్-జూన్ 2021 త్రైమాసికంలో జీడీపీ రికార్డు స్థాయిలో రెండంకెల వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేశాయి. ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఇఏ) కె సుబ్రమణియన్ భారతదేశ స్థూల ఆర్థిక మౌలికాంశాలు చాలా బలంగా ఉన్నాయని చెప్పారు. "క్యూ1 జిడిపి భారత ఆర్థిక వ్యవస్థ వి-ఆకారంలో రికవరీని పునరుద్ఘాటిస్తుంది. భారత దేశం తీసుకున్న సంస్కరణలు ఆర్థిక రికవరీ సమన్వయ వేగాన్ని పెంచినట్లు'' అని ఆయన అన్నారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీడీపీ వృద్ధి రేటు 21.4 శాతంగా అంచనా వేసింది. ఎస్బీఐ రీసెర్చ్ తన తాజా ఎకోర్ప్ నివేదికలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి సుమారు 18.5 శాతం పెరుగుతుందని తెలిపింది. అలాగే, క్యూ1 ఎఫ్ వై22లో జీవిఏ 15 శాతంగా ఉంటుందని పేర్కొంది.(చదవండి: జీ-మెయిల్ యూజర్లకు అలర్ట్.. ఆ మెయిల్స్‌తో జాగ్రత్త!) -
6.5 నుంచి 7 శాతం శ్రేణిలో వృద్ధి
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ 2022–23 ఆర్థిక సంవత్సరం నుంచీ వరుసగా 6.5 శాతం నుంచి 7 శాతం సుస్థిర వృద్ధి బాటన సాగుతుందని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణియన్ అంచనావేశారు. కేంద్రం చేపట్టిన వివిధ ఆర్థిక సంస్కరణలు ఇందుకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియ పురోగతిలో ఉందని కూడా వివరించారు. కోవిడ్–19 సెకండ్ వేవ్ ఎకానమీపై అంతగా ప్రభావం చూపకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ దిగ్గజ విశ్లేషణా సంస్థ– డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీఅండ్‌బీ) నిర్వహించిన ఒక వర్చువల్ కార్యక్రమంలో సుబ్రమణియన్ వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో ముఖ్యమైనవి... ► గడచిన ఏడాదిన్నరగా కేంద్రం పలు సంస్కరణాత్మక చర్యలను తీసుకుంటోంది. వచ్చే దశాబ్ద కాలంలో ఆయా చర్యలు మంచి వృద్ధి ఫలాలను అందిస్తాయని నేను భావిస్తున్నాను. ► 2020–21 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి–మార్చి)లో రికవరీ బాగుంది. అయితే ఊహించని రీతిలో సవాళ్లు వచ్చిపడ్డాయి. ముఖ్యంగా ఆరోగ్య మౌలిక రంగం తీవ్ర ఒత్తిడికి గురయ్యింది. అయితే మొదటి వేవ్‌తో పోల్చితే ఎకానమీపై ప్రభావం పరిమితమే. ► వ్యవసాయం, కార్మిక రంగాల్లో సంస్కరణలు, ఎగుమతుల పీఎల్ఐ స్కీమ్, సూక్ష్మ లఘు మధ్య చిన్న తరహా పరిశ్రమల నిర్వచనం మార్పు, మొండిబకాయిలకు సంబంధించి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ వంటి పలు అంశాలు భవిష్యత్‌లో దేశాభివృద్ధిని సుస్థిర బాటన నడపనున్నాయి. ► మహమ్మారి నుంచి దేశం రికవరీ సాధించడానికి వ్యాక్సినేషన్ చాలా కీలకం. తద్వారా కోవిడ్–19ను సాధారణ ఫ్లూ కింద మార్చి, దాని తీవ్రతను గణనీయంగా తగ్గించడానికి వీలవుతుంది. రెండేళ్ల పురోగతికి దూరమయ్యాము: వివేక్ దేవ్రాయ్ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) చైర్మన్ వివేక్ దేవ్రాయ్ అంతకుముందు కార్యక్రమంలో మాట్లాడుతూ, 2021–22లో భారత్ ఎకానమీ వృద్ధి 10 శాతం ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఇది బేస్ మాయగా (పోల్చుతున్న నెల లేదా ఏడాదిలో అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెల లేదా ఏడాదిలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్) ఆయన అంగీకరించారు. మహమ్మారి వల్ల దేశం రెండేళ్లు ఆర్థిక పురోగతిని కోల్పోయిందన్నారు. ప్రస్తుతం కన్నా దాదాపు రెట్టింపై 2024–25 ఆర్థిక సంవత్సరం నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ఆవిర్భావం కల దూరమయ్యిందన్నారు. దీనితోపాటు 2030 నాటికి సుస్థిర ఆర్థికవృద్ధి (ఎస్డీజీ) లక్ష్యాలనూ భారత్ చేరుకోలేని పరిస్థితి ఎదురవుతోందని అన్నారు. -
వేలాడుతున్న కరువు కత్తి
కరోనాని మించిన మరో మహమ్మారి తరుముకొస్తోంది దీనికి వ్యాక్సిన్ కూడా ఉండదు. ఇబ్బంది పడేది బీదాబిక్కీ జనమే. దేశాల జీడీపీలు కూడా తల్లకిందులవుతాయి ఈ శత్రువు మనకి ఎప్పట్నుంచో తెలుసు. అదే కరువు. ఇక ముందున్నది కరువు కాలమనే వివిధ అధ్యయనాలు తేల్చేశాయి. కోవిడ్–19తో గత ఏడాదిన్నరగా కనీవినీ ఎరుగని రీతిలో ఆరోగ్య, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాలపై మరో కత్తి వేళ్లాడుతోంది. వాతావరణంలో వస్తున్న మార్పులు, అడ్డూ అదుçపూ లేకుండా పెరిగిపోతున్న జనాభా, నీటి సంరక్షణ విధానంలో లోపాలు, ప్రపంచ దేశాలపై దాడి చేస్తున్న వైరస్లు మరో ముప్పు ముంగిట్లో మనల్ని నెట్టేస్తున్నాయి. సమీప భవిష్యత్తులో ప్రపంచ దేశాలు కరువుతో అల్లాడిపోతాయని ఐక్యరాజ్యసమితి సహా వివిధ అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. కరువు పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి సమగ్ర ప్రణాళికను ఇప్పట్నుంచే రూపొందించాల్సిన అవసరం ఉందని ఆ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. భారత్ సహా వివిధ దేశాలు ఇప్పటికే కరువు ముప్పుని ఎదుర్కొంటున్నాయి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో నీటి చుక్క దొరక్కపోవడంతో ఒక ఊరు ఊరంతా ఖాళీ అయింది. కేవలం ఆ గ్రామంలో 10–15 కుటుంబాలు మాత్రమే మిగలడం భవిష్యత్ కరువు పరిస్థితులకి అద్దం పడుతోంది. వేడెక్కుతున్న భూగోళం మన భూగోళం ప్రమాదకర స్థాయిలో వేడెక్కిపోతోంది. సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్‌తో గత పదిహేనేళ్లలో భూ ఉపరితలం, సముద్రాలు రెట్టింపు వేగంతో వేడెక్కిపోతున్నాయి. ఏ స్థాయిలో వేడెక్కుతోందంటే హిరోషిమాను ధ్వంసం చేసిన నాలుగు అణుబాంబుల్ని ప్రతీ సెకండ్ పేలిస్తే పుట్టేంత వేడి. అర్థం కావడం లేదా ..? భూమ్మీద ఉన్న 730 కోట్ల మంది ఒకేసారి 20 వేర్వేరు ఎలక్ట్రిక్ పరికరాల్ని వాడితే పుట్టేంత రేడియో ధార్మికతని సూర్యుడి నుంచి పుడమి సంగ్రహిస్తోందని నాసా శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో తేలింది. దీని వివరాలను జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ జర్నల్ వెల్లడించింది. ఈ స్థాయిలో భూమి వేడెక్కడం వల్ల పసిఫిక్ మహాసముద్రంలో తరచూ లానినా, ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడి అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి పరిస్థితులు ఎదురవుతాయని ఆ అధ్యయనం హెచ్చరించింది. లానినా, ఎల్‌నినో పరిస్థితులు 3–7 ఏళ్ల మధ్య ఏర్పడి 9–12 నెలల పాటు ఉంటాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఏళ్ల తరబడి సాగుతాయి. దీని వల్ల కరువు కాటకాలు ఏర్పడతాయి. భూగోళం వేడెక్కడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడి తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. కరువు భూతాన్ని తరిమికొట్టడానికి కరువు పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి వివిధ దేశాలకు ప్రపంచ బ్యాంకు సహకారం అందిస్తోంది. పశ్చిమ బెంగాల్లో నీటి సంరక్షణ, దీర్ఘకాలంలో భూగర్భ జలాల్ని సుస్థిరంగా కొనసాగడానికి ఒక ప్రాజెక్టుని మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్టు వల్ల అయిదు జిల్లాల్లోని 27 లక్షల మంది రైతులకి లబ్ధి చేకూరుతుంది. 3,93,000 హెక్టార్ల భూమి సాగులోని వస్తుంది. సోమాలియాలో కరువు పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వ వ్యవస్థల్ని, విపత్తు సంసిద్ధతను పెంచే ప్రయత్నాలు చేస్తోంది. అఫ్గాన్‌లో కరువుతో అల్లాడిపోతున్న 22 లక్షల మంది పౌరులకు ఆహార భద్రతను కల్పిస్తోంది. కరువు ముప్పుని ముందుగా గుర్తించి ప్రణాళికను రచించే ప్రాజెక్టుని ప్రారంభిస్తోంది. అధ్యయనాలు చెబుతున్నదేంటంటే.. ► 5 వేల ఏళ్లుగా కరువు అంటే మానవాళికి తెలుసు. కానీ ఇప్పుడు ఈ కరోనా వేళ పులి మీద పుట్రలా భారత్, ఉక్రెయిన్, మాల్డోవా, బంగ్లాదేశ్, సెర్బియా దేశాలు కరువు ముప్పులో ఉన్నాయి. ► భారత్ స్థూల జాతీయోత్పత్తిపై కరువు ఏడాదికి 2–5% మేర ప్రభావం చూపిస్తుంది. మన లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది పెద్ద దెబ్బ. ► కరువు పరిస్థితులు అగ్రరాజ్యం అమెరికాలో ఏడాదికి 640 కోట్ల డాలర్ల నష్టాన్ని కలుగజేస్తాయి. యూరప్‌లో ఏడాదికి 900 కోట్ల యూరోల నష్టం కలుగుతుంది. ► గత 150 ఏళ్లకాలంలో దక్కను పీఠభూముల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు ఎదురయ్యా యి. 1876–1878, 1899–1900, 1918– 1919, 1965–67, 2000–2003, 2015– 18లలో భారత్ కరువుని ఎదుర్కొంది. ► ప్రపంచ జనాభాలో అయిదో వంతు నీటి ఎద్దడి ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ► దక్షిణార్ధ గోళాల దేశాల్లో వర్షపాతం 30% తగ్గిపోనుంది. ► 92 ఏళ్లలో బ్రెజిల్ కనీవినీ ఎరుగని కరువు పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది. ► అమెరికాలోని కాలిఫోర్నియా ప్రతీ ఏడాది కరువుకి హాట్‌స్పాట్‌గా మారుతోంది. భరించలేనంత ఎండవేడిమితో కార్చిచ్చులు ఏర్పడుతున్నాయి ► మరి కొద్ది ఏళ్లలో ప్రపంచంలో అత్యధిక దేశాలు నీటి కొరతతో అల్లాడిపోతాయి. ప్రపంచాన్ని కబళించే మరో మహమ్మారి కరువు. దీనికి చికిత్సనివ్వడానికి ఎలాంటి వ్యా క్సిన్ ఉండదు. ఈ శతాబ్దంలో కరువు పరిస్థితులు 150 కోట్ల మందిపై ప్రభావం చూపించాయి. 12,400 కోట్ల డాలర్లకి పైగా నష్టం వాటిల్లింది. ప్రభుత్వాలు చర్యలు చేపట్టకపోతే ఎప్పుడూ ఉండే కారణాలతో పాటు కరోనా మహమ్మారి తోడు కావడం కరువుని మరింత పెంచేస్తుంది. – మామి మిజుతొరి, యూఎన్‌డీఆర్‌ఆర్ చీఫ్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇలా అయితే వృద్ది అంచనాకు కోత తప్పదు
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి రికవరీకి సెకండ్‌వేవ్ కేసుల పెరుగుదల తీవ్ర అవరోధంగా మారుతున్న నేపథ్యంలో తమ తొలి వృద్ధి రేటు అంచనాలను తగ్గించే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం- స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్&పీ) పేర్కొంది. ఈ మేరకు సంస్థ ఒక ప్రకటన చేసింది. కరోనా కేసుల తీవ్రతతో భారత్ ఎకానమీకి సవాళ్లు పొంచి ఉన్నాయని తెలిపింది. వ్యాపార కార్యకలాపాల్లో తీవ్ర అవరోధాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22) భారత్ 11 శాతం వృద్ధి సాధిస్తుందన్నది ఎస్అండ్పీ తొలి అంచనా. తీవ్ర అనిశ్చితి కోవిడ్-19 తాజా కేసుల పెరుగుదల భారత్ వృద్ధి అవకాశాలను అనిశ్చితిలో పడేస్తున్నట్లు ఎస్అండ్పీ పేర్కొంది. దీనితో రికవరీకి అవరోధాలు ఎదురవుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో మహమ్మారి కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తిరిగి తీసుకుంటే, అది వృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావానికి దారితీస్తుందని వివరించింది. ‘‘ఇదే జరిగితే మా తొలి అంచనా 11 శాతం వృద్ధిని సవరించే అవకాశం ఉంది’’ అని ఎస్అండ్పీ ప్రకటన తెలిపింది. మహమ్మారి వల్ల ఇప్పటికే ఉత్పత్తి, వృద్ధిలో తీవ్రంగా నష్టపోయిందని వివరించింది. దీర్ఘకాలంలో చూస్తే,జీడీపీలో 10 శాతానికి సమానమైన ఉత్పత్తి విలువను కోల్పోతున్నట్లు తెలిపింది. సెకండ్‌వేవ్‌లో పెద్ద ఎత్తున్న ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడం చాలా తీవ్ర విషయమని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక కేసులు కూడా భారీగా పెరుగుతుండడం ఎకానమీకి ప్రతికూలంగా మారుతోందని తెలిపింది. ఆయా అంశాలు ఆరోగ్య మౌలిక రంగాన్ని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నట్లు విశ్లేషించింది. రుణ పరిస్థితిపై ప్రభావం ఎస్అండ్పీ ఆర్థిక రంగానికి సంబంధించి విశ్లేషిస్తూ, 2021-22 బడ్జెట్ లక్ష్యాలను నెరవేర్చాలంటే భారీ వృద్ధి తప్పనిసరని తెలిపింది. తద్వారానే స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇప్పటికే అధికంగా రుణ భారాన్ని స్థిరీకరించవచ్చని అంచనావేసింది. ఆయా అంశాలన్నీ సార్వహౌమ క్రెడిట్ రేటింగ్‌పై ప్రభావాన్ని చూపుతాయని తెలపింది. ప్రస్తుతం భారత్ ఎకానమీకి స్టేబుల్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ మైనస్’ను కొనసాగిస్తోంది. చెత్త (జెంక్)కు ఇది ఒక్క అంచ మాత్రమే ఎక్కువ. ఉపాధిపై ప్రతికూలత రాష్ట్రాల్లో స్థానికంగా విధిస్తున్న లాక్డౌన్లు రోజూవారీ ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఎస్అండ్పీ పేర్కొంది. ఆయా అంశాలన్నీ ఎకానమీ రికవరీకి అలాగే కార్పొరేట్ ఆదాయ, వ్యయాలకు గండి కొడుతున్నాయని పేర్కొంది. ఇక బ్యాంకులు సైతం భారీ మొండిబకాయిల స్థితిలోకి జారే ప్రమాదముందని హెచ్చరించింది. మరిన్ని ‘వేవ్స్’కు అవకాశం భారత్‌లో ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 వేరియెంట్లు పాకడం నుంచి ఆసియా-పసిఫిక్ ప్రాంతం తప్పించుకోలేకపోచ్చన్న అనుమానాన్ని ఎస్అండ్పీ వ్యక్తం చేయడం గమనార్హం. కొన్ని వైరెస్ మ్యుటేషన్స్‌పై పోరులో కొన్ని వ్యాక్సినేషన్ల సామర్థ్యం పరిమితంగా ఉందని పేర్కొంటూ, ఈ కారణంగా ఆసియా పసిఫిక్ దేశాలు మరిన్ని వేవ్స్‌ను ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషించింది. ఫిచ్, మూడీస్ ఇలా... గత వారం మరో గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ- ఫిచ్ భారత్ ఎకానమీ 2021-22 వృద్ధి రేటును 12.8 శాతంగా అంచనావేసింది. మరో సంస్థ-మూడీస్ తన నివేదికలో భారత్ వృద్ధిపై సెకండ్‌వేవ్ ప్రభావం ఉంటుందని పేర్కొంది. చదవండి: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్! -
దూసుకెళ్తున్న ఇండియా వృద్ధిరేటు!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి 2021-22 ఆర్థిక సంవత్సరం (2021 ఏప్రిల్-2022 మార్చి) అంచనాలను అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఫిచ్ బుధవారం గణనీయంగా మెరుగు పరచింది. గత 11 శాతం వృద్ధి అంచనాలను 12.8 శాతంగా పేర్కొంది. కరోనా ప్రేరిత సవాళ్ల నుంచి ఆర్థిక వ్యవస్థ ఊహించినకన్నా వేగంగా పురోగమిస్తోందని, తమ అంచనాల మెరుగుకు ఇదే ప్రధాన కారణమనీ వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బేస్ ఎఫెక్ట్ ప్రభావమూ ఉందని పేర్కొంది. ఫిచ్ గ్లోబల్ ఎకనమిక్ అవుట్‌లుక్ (జీఈఓ)నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను గమనిస్తే... 2020 చివరి ఆరు నెలల కాలంలో భారత్ ఎకానమీ గణనీయమైన పురోగతి సాధించింది. ఆర్థిక వ్యవస్థ పటిష్ట తీరుతో 2021లోకి ప్రవేశించింది. తయారీ, సేవలు పురోగతి బాటన పయనిస్తున్నాయి. వినియోగ డిమాండ్ బాగుంది. అలాగే రవాణా వ్యవస్థ పుంజుకుంది. అయితే తాజాగా పెరుగుతున్న కేసులు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదే విధంగా సమస్య కొనసాగితే 2021-22 తొలి త్రైమాసికంలో కొన్ని రాష్ట్రాల్లో వృద్ధిపై ప్రభావం చూపే వీలుంది. అలాగే అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి భారత్ వృద్ధి తీరుపై ప్రభావితం చూపే వీలుంది. ఫైనాన్షియల్ సెక్టార్ పరిస్థితి కొంత క్లిష్టంగా ఉంది. ప్రత్యేకించి రుణాలు, పెట్టుబడి వ్యయాల విషయంలో కఠిన పరిస్థితులు నెలకొన్నాయి. 2022-23లో మాత్రం జీడీపీ వృద్ధి 5.8 శాతానికి పరిమితమవుతుంది. నిజానికి గత అంచనాలకన్నా 0.5 శాతం అంచనాలను తగిస్తున్నాం. ద్రవ్యోల్బణం తగ్గుదల లేకపోవడం, స్వల్ప కాలంగా చూస్తే, వృద్ధి అవుట్‌లుక్ మెరుగ్గా వుండటం వంటి అంశాల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు- రెపో ప్రస్తుత స్థాయి(4 శాతం) నుంచి మరింత తగ్గించే అవకాశం లేదు. అయితే వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్యలభ్యత) సమస్యలు రాకుండా ఆర్బీఐ తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటుంది. బ్యాంకింగ్ రంగం అవుట్‌లుక్ ఏప్రిల్ 1వ తేదీ నుంచీ ప్రారంభమయ్యే వచ్చే ఆరి్థక సంవత్సరం అంత బాగుండకపోవచ్చు. కోవిడ్-19 నేపథ్యంలో ఎకానమీలో చోటుచేసుకున్న ప్రతికూల పరిస్థితులు, చిన్న వ్యాపారాలకు జరిగిన నష్టాలు, నిరుద్యోగం, ప్రైవేటు వినియోగంలో తగ్గుదల వంటి అంశాలు ఇంకా పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్స్‌లో ప్రతిబింబించడంలేదు. చదవండి: సూయజ్‌కు అడ్డంగా నౌక.. గంటకు రూ.3వేల కోట్ల నష్టం -
ఫిబ్రవరిలో ఎఫ్‌పిఐ పెట్టుబడులు వెల్లువ
భారత మార్కెట్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్ఐఐ) ఫిబ్రవరిలో ఇప్పటి వరకు రూ.24,965 కోట్లు పెట్టుబడి పెట్టారు. కోవిడ్ -19 వ్యాక్సిన్ పై ఆశావాదం, దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడం వంటి కారణంగా పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తుంది. డిపాజిటరీస్ డేటా గణాంకాల ప్రకారం.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్ (ఎఫ్‌పిఐ) భారతీయ ఈక్విటీల్లోకి రూ.24,204 కోట్లు, రుణ విభాగంలోకి రూ.761 కోట్లు పెట్టుబడులుగా వెళ్లినట్లు తెలిపింది. గత నెలలో ఎఫ్‌పిఐలు ద్వారా నికరంగా రూ.14,649 కోట్లు భారత్‌కు వచ్చాయి. 2021లో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) అంచనా వేసినందున ఎఫ్‌పిఐలు భారత మార్కెట్లపై సానుకూలంగా ఉన్నాయని ఎల్కెపి సెక్యూరిటీల పరిశోధన విభాగాధిపతి ఎస్. రంగనాథన్ తెలిపారు. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు భారత వృద్ధి రేటు అంచనాలపై సానుకూలంగా ఉండడంతో ఎఫ్‌పీఐల పెట్టుబడులు ఫిబ్రవరిలోనూ కొనసాగుతున్నాయని గ్రో సంస్థ సీవోవో హర్ష జైన్ తెలిపారు. ఒక అంతర్జాతీయ ఏజెన్సీ భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు 2022లో 11.5 శాతంగా ఉంటుంది అని అంచనా వేసింది. గతంలో పేర్కొన్న8.8 శాతం వృద్ధి రేటు అంచనాను సవరించింది. దీనితో కరోనావైరస్ మహమ్మారి మధ్య రెండంకెల వృద్ధిని నమోదు చేసిన ఏకైక ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారతదేశం నిలవనుంది. చదవండి: పెట్రోల్ ధరలను తగ్గించిన నాలుగు రాష్ట్రాలు! -
‘2011’ పరిస్థితి పునరావృతం అవుతుందా?!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తూ వచ్చిన ఆర్థిక విధానాల వల్లనైతేనేమీ, ఆ తర్వాత ప్రాణాంత కరోనా వైరస్ మహమ్మారి విజంభణ వల్ల అయితేనేమీ దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దిగజారింది. గడచిన రెండు దశాబ్దాలుగా జీడీపీ పురోభివద్ధితో ప్రపంచ పది బలమైన ఆర్థిక దేశాల్లో ఒకటిగా దూసుకుపోతోన్న భారత్‌కు హఠాత్తుగా కళ్లెం పడింది. మున్నెన్నడు లేని విధంగా ఈ ఆర్థిక త్రైమాసంలో ప్లస్‌లో దూసుకుపోతోన్న జీడీపీ వద్ధి రేటు అనూహ్యంగా మైనస్ 24 శాతానికి పడిపోయింది. ఇది మరింత దిగజారి మైనస్ 35 శాతానికి కూడా పడిపోయే ప్రమాదం ఉందని భారత మాజీ చీఫ్ స్టాటిస్టిసియన్ ప్రణబ్ సేన్ అంచనా వేస్తున్నారు. ప్రైవేటు పారిశ్రామీకరణ లేదా లైసెన్స్ రాజ్యాన్ని రద్దు చేస్తూ 1991లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు తీసుకరావడంతో దేశాభివద్ధి రూటు మార్చుకుంది. అప్పటి నుంచి అనుసరిస్తూ వచ్చిన ఆర్థిక సంస్కరణల వల్లన ప్రధానంగా మధ్య తరగతి ప్రజలు లబ్ధి పొందుతూ వచ్చారు. అవకతవక ఆర్థిక విధానాలకు కరోనా మహమ్మారి లాక్డౌన్ పరిస్థితులు తోడవడంతో దేశ ఆర్థిక పరిస్థితులు పతనమవుతూ వచ్చాయి. లాక్డౌన్ పరిస్థితులు కొనసాగడం వల్ల దేశంలో 1.80 కోట్ల మంది నెలసరి వేతన ఉద్యోగాలను కోల్పోయారని ‘సీఎంఐఈ’ నివేదిక తెలియజేస్తోంది. ఫలితంగా దేశంలో నిరుద్యోగుల శాతం మున్నెన్నడు లేనివిధంగా 7.1 శాతానికి చేరుకుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల మొదటిసారిగా దేశ మధ్యతరగతి ప్రజల్లో అసంతప్తి వ్యక్తం అవుతోంది. కేంద్ర ప్రభుత్వ దిగువ గ్రేడు ఉద్యోగుల నియామకం కోసం నిర్వహించిన ‘స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్’ ఫలితాల ఆలస్యంపై ఆన్లైన్లో మధ్యతరగతి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతికేతర సిబ్బంది నియామకం కోసం ‘రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు’ నిర్వహించాల్సిన పరీక్షలు జాప్యం జరగడం పట్ల కూడా ప్రజలు తమ అసహనం వ్యక్తం చేశారు. ‘పెన్నులు పట్టుకోవాల్సిన విద్యార్థులు ఏకే–47 గన్లు పట్టుకోవాల్సి వస్తుంది’ అన్న ఘాటైన హెచ్చరికులు కూడా మొదలయ్యాయి. అండర్ గ్రాడ్యువేట్ ఇంజనీరింగ్, వైద్య ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలనే ప్రజల డిమాండ్‌ను కేంద్రం ఖాతరు చేయక పోవడం కూడా ప్రజల ఆగ్రహానికి కారణం అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ వారం వారం రేడియో ద్వారా మాట్లాడే ‘మన్ కీ బాత్’లకు డిస్‌లైక్‌లు మొదలయ్యాయి. ఈ పరిస్థితులు చూస్తుంటే 2011లో అప్పటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మధ్యతరగతి ప్రజల్లో వ్యక్తమైన ఆగ్రహ జ్వాలలు పునరావతం అవుతాయా?! నాడు టెలికామ్ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో జరిగిన అవకతవకలు, బొగ్గు గనుల కేటాయింపుల్లో చోటుచేసుకున్న అవినీతికి వ్యతిరేకంగా నాడు ప్రజల నుంచి ఆగ్రహ జ్వాలలు వ్యక్తమైన విషయం తెల్సిందే. మధ్యతరగతి ప్రజలు ప్రధాని మోదీని, ఆయనకన్నా ఆయన పార్టీ బీజేపీని ఇష్టపడతారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 38 శాతం మంది మధ్యతరగతి వారు, 44 శాతం మంది ఉన్నత మధ్యతరగతి వారు మోదీ ప్రభుత్వానికి ఓటేశారు. ఆ ఎన్నికల్లో మొత్తం 61 శాతం మంది ఉన్నత హిందూ కులాలకు చెందిన ప్రజలు మోదీకి అండగా నిలిచారు. నేటి పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వ విధానాల పట్ల అసంతప్తి వ్యక్తం అవుతున్నా అది మోదీని కాదనుకునే స్థాయికి చేరుకోవడం లేదు. వారికి ఆర్థిక విధానాల పట్ల అసంతప్తికన్నా మోదీ ప్రభుత్వం పట్ల వారికి సైంద్ధాంతిక కట్టుబాటే ఎక్కువగా ఉంది. -
ఆర్బీఐ... బంగారం భరోసా!
ముంబై: కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఆర్థిక రంగానికి ఊతం అందించడానికి తన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక రేట్లను పావుశాతం తగ్గిస్తుందన్న అంచనాలకు భిన్నంగా గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయం తీసుకుంది. కీలక రేట్లను యథాతథంగా కొనసాగించాలని మూడు రోజుల పాటు జరిగిన సమావేశం గురు వారం నిర్ణయించింది. అయితే వృద్ధికి ఊపును అందించే క్రమంలో సరళతర ఆర్థిక విధానాలకే మొగ్గుచూపుతున్నట్లూ ప్రకటించింది. తద్వారా భవిష్యత్తులో రేటు కోతలు ఉండవచ్చని సూచించింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే, రిటైల్ ద్రవ్యోల్బణం 2020–21 ద్వితీయార్థంలో పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయని పేర్కొంటూ, ధరల స్పీడ్‌ను కేంద్రం నిర్దేశిత 4 శాతం కట్టడే లక్ష్యంగా (2 ప్లస్ లేదా 2 మైనస్) ప్రస్తుతానికి కీలక రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4%) యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఇక కరోనా పరిస్థితుల నేపథ్యంలో డబ్బు అందక ఇబ్బందులు పడుతున్న చిన్న సంస్థలు, వ్యాపారులు, మధ్య, సామాన్యుని కి ఊరట కల్పించే నిర్ణయాన్ని ఆర్బీఐ తీసుకుంది. దీనిప్రకారం... తన వద్ద ఉన్న పసిడిని బ్యాంకింగ్‌లో హామీగా పెట్టి రుణం తీసుకునే వ్యక్తులు ఇకపై ఆ విలువలో 90% రుణాన్ని పొందగలుగుతారు. తాజా నిర్ణయం 2021 మార్చి వరకూ అమల్లో ఉంటుంది. ఇప్పటి వరకూ (పసిడి రుణాలకు లో¯Œ టు వ్యాల్యూ నిష్పత్తి) ఇది 75 శాతంగా ఉంది. పాలసీలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► ఏకగ్రీవ నిర్ణయం: ఫిబ్రవరి నుంచి 115 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) రెపో రేటును ఆర్బీఐ తగ్గించింది. తాజాగా ఈ రేటు యథాతథ స్థితిలో కొనసాగించాలని పరపతి విధాన కమిటీలోని మొత్తం ఆరుగురు సభ్యులూ ఏకగ్రీవంగా నిర్ణయించారు. జూ¯Œ లో ద్రవ్యోల్బణం 6.09 శాతం నమోదయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉన్నా... అటు తర్వాత తగ్గవచ్చనే అభిప్రాయాన్ని పరపతి కమిటీ వ్యక్తం చేసింది. ► 20 యేళ్ల కనిష్ట స్థాయిలోనే రేట్లు: రేట్లను యథాతథంగా కొనసాగిస్తుండడంతో రెపో రేటు (4 శాతం) 20 ఏళ్ల (2000 తర్వాత) కనిష్ట స్థాయిలోనే కొనసాగుతోంది. ఇక రివర్స్ రెపో రేటు (బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఉంచే అదనపు నిధులపై లభించే వడ్డీరేటు) 3.35 శాతంగా కొనసాగుతుంది. వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్లలో ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన కనీస మొత్తం నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) 3 శాతంగా కొనసాగనుంది. ► ధరల పెరుగుదలకు అవకాశం: కోవిడ్–19 నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ధరల పెరుగుదల అవకాశాలు, ఇందుకు సంబంధించి అనిశ్చితి ధోరణి నెలకొందని ఆర్బీఐ అభిప్రాయపడింది. సరఫరాల సమస్య ఇందుకు సంబంధించి ప్రధానంగా ఉందని పేర్కొంది. పలు దేశాల ఆర్థిక వ్యవస్థల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్న విషయాన్ని ఆర్బీఐ ప్రస్తావించింది. ప్రత్యేకించి ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల తీవ్రంగా ఉందని వెల్లడించింది. 4 శాతం వద్ద ద్రవ్యోల్బణం కట్టడికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్న పాలసీ, మధ్య కాలికంగా ద్రవ్యోల్బణం శ్రేణిపై అంచనాలను మాత్రం వెలువరించలేదు. ► నాబార్డ్, ఎన్‌హెచ్‌బీకి వెసులుబాటు: వ్యవసాయ రంగానికి సాయం అందించే క్రమంలో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)కు రూ.5,000 కోట్ల లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ను ఆర్బీఐ కల్పించింది. అలాగే హౌసింగ్ సెక్టార్ విషయంలో ద్రవ్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎ¯Œ హెచ్‌బీ)కి కూడా రూ.5,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ సౌలభ్యత కల్పిస్తున్నట్లు పేర్కొంది. తద్వారా ఆయా రంగాలకు రుణాలను అందించే విషయంలో నా¯Œ –బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ద్రవ్య లభ్యత విషయంలో కొంత వెసులుబాటు కలుగుతుంది. ► డిజిటల్ లావాదేవీలకు దన్ను: కార్డుల ద్వారా జరిపే చెల్లింపుల పరిమాణాన్ని పెంచడానికి ఆర్బీఐ చర్యలు తీసుకోనుంది. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ, భద్రతా చర్యలే ధ్యేయంగా ఈ దిశలో డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించడానికి ఒక పైలట్ స్కీమ్‌ను తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. త్వరలో ఇందుకు సంబంధించి విధివిధానాలు వెలువడతాయని తెలిపింది. ఇంటర్నెట్ కనెక్టివిటీ, స్పీడ్ తక్కువగా ఉండడంసహా ఇప్పటివరకూ డిజిటల్ పేమెంట్లలో నెలకొంటున్న ఇబ్బందులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ విభాగంలో మరింత ముందుకు వెళ్లడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఆ¯Œ లై¯Œ డిస్ప్యూట్ రిజల్యూష¯Œ (ఓడీఆర్) ఏర్పాటు ప్రతిపాదన కూడా ఈ విభాగంలో తీసుకుంటున్న నిర్ణయాల్లో ఒకటి. రుణ గ్రహీతకు వరం అటు కార్పొరేట్లకు, ఇతర వ్యక్తులకు వ¯Œ టైమ్ రుణ పునర్వ్యవస్థీకరణకు బ్యాంకింగ్‌కు ఆర్బీఐ అనుమతినిచ్చింది. 7 జూ¯Œ 2019లో ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా రుణ పునర్వ్యవస్థీకరణ జరపాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామ¯Œ కూడా ఈ మేరకు బహిరంగంగానే సూచనలు చేశారు. అకౌంట్లను ‘స్టాండర్డ్’గా వర్గీకరించిన లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకూ రుణ పునర్వ్యవస్థీకరణ వర్తిస్తుందని పేర్కొంది. లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పరంగా ఆయా సంస్థలకు ఎటువంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా చూడాలని సూచించింది. రుణాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రంగాల వారీగా అవసరాల పరిశీలన, ప్రణాళికలకు బ్రిక్స్ బ్యాంక్ మాజీ చైర్మన్, బ్యాంకింగ్ నిపుణులు కేవీ కామత్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు మరో ముఖ్యాంశం. ► ఇన్నోవేష¯Œ హబ్ ఏర్పాటు: అందరినీ ఆర్థిక ప్రగతిలో భాగస్వాములను చేయడం, బ్యాంకింగ్ సేవలు అందరికీ అందుబాటులోకి తేవడం, బ్యాంకింగ్ సేవల పటిష్టత లక్ష్యంగా ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని (ఇన్నోవేష¯Œ హబ్) ఏర్పాటు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఎప్పటికప్పు డు తీసుకోవాల్సిన తగిన చర్యలను నియంత్రణా వ్యవస్థల దృష్టికి తీసుకువెళ్లడం ఈ హబ్ ప్రధాన బాధ్యతల్లో ఒకటి. ► స్టార్టప్స్‌కు ప్రాధాన్యత: ఇక స్టార్టప్స్ విషయానికి వస్తే, వీటికి ప్రాధాన్యతా రంగం హోదాను కల్పిస్తున్నట్లు పేర్కొంది. తద్వారా ఈ తరహా యూనిట్లు తగిన రుణ సౌలభ్యతను సకాలంలో అందుకోగలుగుతాయి. ► పునరుత్పాదకతకు ‘ఇంధనం’: ప్రాధాన్యతా రంగాలకు రుణం కింద (పీఎస్ఎల్) పునరుత్పాదకత ఇంధన రంగాలకు రుణ పరిమితులను పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. సోలార్ పవర్, కంప్రెస్డ్ బయోగ్యాస్ వంటి రంగాలు ఇందులో ఉన్నాయి. ► చిన్న రైతులు, బలహీన వర్గాలకూ ఊరట: ప్రాధాన్యతా రంగాలకు రుణం కింద (పీఎస్ఎల్) పరిధిలో చిన్న, సన్నకారు రైతులకు, అలాగే బలహీన వర్గాలకు కూడా రుణ పరిమితులను పెంచాలని ఆర్బీఐ పరపతి విధాన కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ► అకౌంట్ల విషయంలో భద్రతా ప్రమాణాలు: కస్టమర్లకు కరెంట్ అకౌంట్లు, ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్ల ప్రారంభంలో భద్రతా ప్రమాణాలు మరింత పెంపు. బహుళ బ్యాంకుల నుంచి ఆయా కస్టమర్లకు క్రెడిట్ సౌలభ్యం పొందేందుకు అవకాశాల కల్పన వంటి ప్రతిపాదనలు పాలసీ నిర్ణయాల్లో ఉన్నాయి. కరోనాతో కష్టాలే.. కరోనా వైరస్ విస్తరిస్తుండడం, దీనిపై నెలకొన్న అస్పష్టత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) దేశ ఆర్థిక వ్యవస్థను క్షీణబాటలోకి తీసుకువెళుతుందని భావిస్తున్నాం. ఆర్థిక వ్యవస్థలో రికవరీ జాడలు కనిపిస్తున్నా... కోవిడ్–19 ప్రభావం దీనిని అనిశ్చితి వాతావరణంలోకి నెడుతోంది. వృద్ధి అవుట్‌లుక్ చూస్తే, ఖరీఫ్ సాగు పురోగతి బాగుంది. అందువల్ల స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 15 శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగం కొంత పురోగతి కనబరుస్తుందని భావిస్తున్నాం. ఇక తయారీ సంస్థల విషయానికి వస్తే, ఫార్మా మినహా అన్ని తయారీ సబ్–సెక్టార్లూ ప్రస్తుతానికి ప్రతికూలతలోనే ఉన్నాయి. 2021–22 మొదటి త్రైమాసికం నాటికి పరిస్థితిలో కొంత పురోగతి లభించవచ్చు. నిర్మాణ రంగం మెరుగుపడాల్సి ఉంది. సేవల రంగం విషయానికి వస్తే, మే, జూ¯Œ లలో కొంత రికవరీ ఉన్నా... గత ఏడాది స్థాయికన్నా ఎంతో దిగువనే ఆయా సూచీలు కదలాడుతున్నాయి. ప్యాసింజర్ వాహన విక్రయాలు క్షీణతలోనే కొనసాగుతున్నాయి. దేశీయ ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్, రవాణా క్షీణతలోనే ఉన్నాయి. ఆర్బీఐ సర్వే ప్రకారం, వినియోగదారువైపు నుంచి చూస్తే, జూలైలో ఇంకా వినియోగ విశ్వాసం ప్రతికూలతలోనే ఉంది. అంతర్జాతీయ డిమాండ్ కూడా అంతంతమాత్రంగానే కనబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మందగమన పరిస్థితులు, వాణిజ్య క్షీణత వంటి అంశాలు నెలకొని ఉన్నాయి. పరపతి విధాన కమిటీ అంచనా ప్రకారం, ప్రపంచ ఆర్థిక క్రియాశీలత ఇంకా బలహీనంగానే ఉంది. సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్ ఆర్థిక వ్యవస్థ మూల స్తంభాలు పటిష్టంగా ఉన్నాయి. తగిన ద్రవ్యపరమైన చర్యలతో ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి సెంట్రల్ బ్యాంక్ చర్యలు కొనసాగుతాయి. అదే సమయంలో ద్రవ్యోల్బణం లక్ష్యాలను మీరకుండా తగిన చర్యలు ఉంటాయి. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ వివేకవంతమైన నిర్ణయం ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బ ణం, డిమాండ్‌పై అనిశ్చితి కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో పాలసీ రేట్లను యథాతథంగా ఉంచాలని ఆర్బీఐ వివేకవంతమైన నిర్ణయం తీసుకుంది. రుణ పునర్‌వ్యవస్థీకరణపరమైన ఊరట చర్యలను తగు రక్షణాత్మక విధానాలతో .. భారీ కార్పొరేట్లు, ఎస్ఎంఈలు, వ్యక్తిగత రుణగ్రహీతలకు కూడా వర్తింపచేయడం స్వాగతించతగ్గది. – రజనీష్ కుమార్, చైర్మన్, ఎస్బీఐ లిక్విడిటీ బాగున్న నేపథ్యం... ఇప్పటికే రెపో రేటును గణనీయంగా తగ్గించేయడం వల్ల లిక్విడిటీ పెరిగిపోయిన నేపథ్యంలో ఆర్బీఐ తాజా సమీక్షలో పాలసీ రేటును యథాతథంగా ఉంచడాన్ని అర్థం చేసుకోవచ్చు. – ఉదయ్ కొటక్, ప్రెసిడెంట్, సీఐఐ రుణ పునర్వ్యవస్థీకరణ హర్షణీయం ఎంఎస్ఎంఈ రుణాల పునర్వ్యవస్థీకరణ, కేవీ కామత్ సారథ్యంలో కమిటీ ఏర్పాటు తదితర అంశాలు స్వాగతిస్తున్నాం. వీటి అమలు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. – సంగీతా రెడ్డి, ప్రెసిడెంట్, ఫిక్కీ కుటుంబాలకు ఊరట రుణాల పునర్వ్యవస్థీకరణను ప్రకటించడంతో పాటు ఈ క్రమంలో బ్యాంకర్లకు కూడా తోడ్పాటునిచ్చేటటు వంటి చర్యలతో ఆర్బీఐ పరిస్థితులకు తగ్గట్లుగా వ్యవహరించింది. బంగారం రుణాలపై పరిమితి పెంచడం వల్ల ఆదాయాలు నష్టపోయి తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న కుటుంబాలకు గణనీయంగా ఊరట లభించగలదు. – దీపక్ సూద్, సెక్రటరీ జనరల్, అసోచాం రేటు ప్రయోజనం బదలాయించాలి... గడిచిన నాలుగు నెలలుగా రెపో రేటును ఆర్బీఐ 115 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించాలి. – డీకే అగర్వాల్, ప్రెసిడెంట్, పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. -
చైనా ఆర్థిక వ్యవస్థకు 6.8 శాతం నష్టం
బీజింగ్ : చైనాలో కరోనా వైరస్ కారణంగా దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోవడంతో ఆర్థిక వ్యవస్థకు గతేడాదితో పోలిస్తే జీడీపీలో 6.8 శాతం నష్టం వాటిల్లింది. మార్చి నెల నాటికి త్రైమాసిక ఫలితాలు వెలువడడంతో ఈ నష్టం వివరాలు స్పష్టమయ్యాయని అధికార వర్గాలు శుక్రవారం తెలిపాయి. దేశంలో మార్కెట్ తరహా ఎకానమీ విధానాలు ప్రవేశపెట్టిన 1979 సంవత్సరం నుంచి ఇంతటి నష్టం వాటిల్లడం ఇదే మొదటి సారి. దేశంలోని వుహాన్ పట్టణంలో ఉద్భవించిన కరోనా వైరస్ కట్టడికి చైనా అంతట లాక్డౌన్ ప్రకటించడం, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, మాల్స్,మార్కెట్లను మూసివేసిన విషయం తెలిసిందే. (భార్యలను వేధించే భర్తలకు షాక్..) దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టాన్ని ముందే ఊహించిన చైనా, ఒక్క వుహాన్‌లో మినహా మార్చి నెలలోనే లాక్డౌన్ ను పూర్తిగా ఎత్తివేసింది. దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మూడో వారం లేదా నాలుగోవారంలో కోలుకుంటుందని భావిస్తున్నట్లు బీజీంగ్‌లోని రుషి ఫైనాన్స్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన ఝూ జెక్‌క్సిన్ తెలిపారు.దీంతో పెట్టుబడిదారుల్లో కొత్త ఆశలు చిగురించడంతో ఈ రోజు ఆసియా స్టాక్ మార్కెట్ లాభాల దిశగా దూసుకుపోయింది. చైనా రిటేల్ అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 19 శాతం పడిపోగా, ఎప్పుడూ వద్ధి రేటును మూటగట్టుకునే ఫ్యాక్టరీల్లో పెట్టుబడులు, రియల్ ఎస్టేట్, ఫిక్స్›్డలతో కూడిన ప్రధాన రంగం 16.1 శాతం పడి పోయింది. మరో పక్క పర్యాటక రంగం కూడా దెబ్బతిన్నది. సినిమాలు, హేర్ సాలూన్లు, ఇతర వినోద కార్యకలాపాలు ఇప్పటికీ నిలిచిపోయే ఉన్నాయి. చైనాలో మొత్తం కరోనా వైరస్ బారిన 82,367 మంది పడగా, 3,342 మంది మరణించారు. -
సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆర్థిక చేయూత కావాలి...
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం చేయూతనివ్వాలని దేశీయ పరిశ్రమలు కేంద్రాన్ని కోరాయి. రుణ చెల్లింపులపై మారటోరియం విధించడం, పన్నుల తగ్గింపు, ప్రజలకు రూ.2లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనలు అందించాలని సూచించాయి. మన దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా వైరస్ రాకముందే మందగమనంలో ఉంది. గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఏడేళ్ల కనిష్ట స్థాయి 4.7 శాతానికి పడిపోయింది. తాజాగా కరోనా వైరస్‌తో దేశవ్యాప్తంగా అన్నీ మూతేయాల్సి వస్తుండడంతో ఆర్థిక వృద్ధి మరింత పడిపోయే ప్రమాదం ఉంది. విధానపరమైన చర్యలను ప్రభుత్వం వెంటనే అమల్లోకి తీసుకురాకపోతే 2020–21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 5 శాతం లోపునకు పడిపోవచ్చంటూ దేశీయ పరిశ్రమలు ఆందోళన వ్యక్తం చేశాయి. ద్రవ్య, పరపతి పరమైన ఉద్దీపన చర్యలను తక్షణమే ప్రకటించాలని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ కోరారు. దేశ జీడీపీలో ఒక శాతానికి సమానమైన రూ.2 లక్షల కోట్లను పేదలకు ఆధార్ ఆధారిత ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో అందించాలని సీఐఐ కోరింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. స్టాక్ మార్కెట్లలో అస్థిరతలను తగ్గించేందుకు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును తొలగించడాన్ని పరిశీలించాలని.. అలాగే, డివిడెండ్ పంపిణీ పన్నును 25 శాతంగా నిర్ణయించాలని కోరింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడంతోపాటు, వసూలు కాని రుణాలను ఎన్పీఏలుగా గుర్తించడానికి ప్రస్తుతమున్న 90 రోజుల గడువును తాత్కాలికంగా అయినా 180 రోజులకు పెంచాలని సీఐఐ సూచనలు చేసింది. ఏడాది చివరి వరకు విరామం.. కార్పొరేట్ కంపెనీలు, వ్యక్తులకు రుణ చెల్లింపులపై ఈ ఏడాది చివరి వరకు మారటోరియం (విరామం) ప్రకటించాలని అసోచామ్ కోరింది. ఎల్ఐసీ ద్వారా వెంటనే ఎన్‌బీఎఫ్‌సీలకు నిధులను అందించాలని సూచించింది. మన దేశంపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న అసోచామ్.. దురదృష్టవశాత్తూ దేశ రుణ మార్కెట్ బలహీనంగా ఉన్న, ఆర్థిక వ్యవస్థ మందగమనం సమయంలో ఈ సంక్షోభం వచ్చిందని వ్యాఖ్యానించింది. -
వాహన అమ్మకాలు.. బే‘కార్’!
గ్రేటర్ నోయిడా: దేశీయంగా వాహన విక్రయాల్లో మందగమనం కొనసాగుతోంది. కొత్త ఏడాదిలోనూ అమ్మకాలు పుంజుకోలేదు. జనవరిలో దేశీయంగా ప్యాసింజర్ వాహన విక్రయాలు 6.2 శాతం క్షీణించాయి. వాహనాల కొనుగోలు భారం పెరగడం, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి మందగించడం తదితర అంశాలు ఇందుకు కారణంగా నిల్చాయి. ఆటోమొబైల్ సంస్థల సమాఖ్య సియామ్ సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తున్న కొత్త బీఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉండే వాహనాల రేట్లు అధిక స్థాయిలో ఉండటం, ముడివస్తువుల ధరల పెరగడంతో జనవరిలో కొన్ని ఆటోమొబైల్ కంపెనీలు వాహనాల రేట్లను పెంచడం కూడా అమ్మకాలపై ప్రతికూల ప్రభావాలు చూపాయి. ‘జీడీపీ వృద్ధి మందగమనం, వాహన కొనుగోలు వ్యయాలు పెరగడం వంటి అంశాల ప్రతికూల ప్రభావాలు వాహన విక్రయాలపై కొనసాగుతున్నాయి‘ అని అని సియామ్ ప్రెసిడెంట్ రాజన్ వధేరా తెలిపారు. ‘ఇన్ఫ్రా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ప్రభుత్వం ఇటీవలచేసిన ప్రకటనలతో వాహనాల అమ్మకాలు మళ్లీ పుంజుకోగలవని ఆశిస్తున్నాం. ముఖ్యంగా వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాల సెగ్మెంట్ మెరుగుపడగలదని భావిస్తున్నాం‘ అని ఆయన చెప్పారు. త్రిచక్ర వాహనాలు కాస్త ఊరట.. జనవరి గణాంకాలను ప్రస్తావిస్తూ.. త్రిచక్ర వాహనాలు మినహా అన్ని విభాగాల్లోనూ అమ్మకాలు పడిపోయాయని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ చెప్పారు. పరిశ్రమ ఇంకా నెగటివ్‌లోనే ఉన్నప్పటికీ.. పండుగల సీజన్ తర్వాత విక్రయాల క్షీణత తీవ్రత కాస్త తగ్గిందని ఆయన తెలిపారు. ‘ప్రస్తుతం కొనసాగుతున్న ఆటో ఎక్స్‌పోలో సందర్శకుల స్పందనను బట్టి చూస్తే.. వినియోగదారుల సెంటిమెంటు మరింత మెరుగుపడగలదని ఆశిస్తున్నాం. ఇందులో ఇప్పటిదాకా దాదాపు 70 వాహనాలను ఆవిష్కరించారు‘ అని ఆయన చెప్పారు. విక్రయాల తీరిదీ.. ► గతేడాది జనవరిలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2,80,091 యూనిట్లు. ఈ ఏడాది జనవరిలో 2,62,714 యూనిట్లకు తగ్గాయి. ► కార్ల అమ్మకాలు 8.1% క్షీణించి 1,79,324 యూ నిట్ల నుంచి 1,64,793కి పరిమితమయ్యాయి. ► ద్విచక్ర వాహనాల అమ్మకాలు 16 శాతం పడిపోయాయి. 15,97,528 యూనిట్ల నుంచి 13,41,005 యూనిట్లకు తగ్గాయి. మోటార్ సైకిళ్ల అమ్మకాలు 15 శాతం తగ్గి 10,27,766 నుంచి 8,71,886కి క్షీణించాయి. స్కూటర్లు 16 శాతం క్షీణించి 4,97,169 యూనిట్ల నుంచి 4,16,594కి పరిమితమయ్యాయి. ► వాణిజ్య వాహనాల అమ్మకాలు 14 శాతం పడిపోయాయి. 87,591 యూనిట్ల నుంచి 75,289 యూనిట్లకు తగ్గాయి. ► వివిధ కేటగిరీల్లో అన్ని వాహనాల విక్రయాలు 13.83 శాతం తగ్గి.. 20,19,253 యూనిట్ల నుంచి 17,39,975 యూనిట్లకు క్షీణించాయి. ► కంపెనీలవారీగా చూస్తే కార్ల విభాగంలో మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ ఇండియా అమ్మకాలు మాత్రం 0.29% పెరిగి 1,39,844 యూనిట్లుగా నమోదయ్యాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా విక్రయాలు 8% క్షీణించి 42,002 యూనిట్లకు పరిమితమయ్యాయి. ► ద్విచక్ర వాహనాల విభాగంలో హీరో మోటోకార్ప్ విక్రయాలు 14 శాతం పడిపోయాయి. -
‘లోటు’ పెరిగినా.. వృద్ధికే ఓటు!
న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరం 2020–21లో 6–6.5 శాతానికి పుంజుకోవచ్చని 2019–20 ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇందుకోసం ద్రవ్యలోటు లక్ష్యాల విషయంలో పట్టువిడుపుగా వెళ్లాలని.. ప్రజలు ఓటుతో ఇచ్చిన బలమైన తీర్పును సంస్కరణలను వేగంగా అమలు చేసేందుకు వినియోగించుకోవాలని.. భారత్‌ను ప్రపంచానికి తయారీ కేంద్రంగా (అసెంబుల్ ఇన్ ఇండియా ఫర్ వరల్డ్) మార్చాలని.. ఆహార సబ్సిడీలను తగ్గించుకోవాలని.. నాణ్యమైన మౌలిక సదుపాయాలకు భారీగా పెట్టుబడులు అవసరమని.. సంపద, ఉద్యోగ సృష్టికర్తలు అయిన వ్యాపారస్తులను గౌరవంగా చూడాలనే సూచనలు కేంద్ర ప్రభుత్వానికి చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020–21 ఆర్థిక బడ్జెట్‌ను శనివారం పార్లమెంట్చు సమర్పించనున్న విషయం తెలిసిందే. దీనికి ఒక రోజు ముందు శుక్రవారం ఆర్థిక సర్వే నివేదికను ఆమె పార్లమెంటు ముందుంచారు. ద్రవ్యలోటు పరంగా.. 2019–20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో ద్రవ్యలోటు 3.3 శాతానికి పరిమితం చేస్తామని గత బడ్జెట్లో ఆర్థిక మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. కానీ, కార్పొరేట్ పన్ను కోత, ఇతర పన్నుల వసూళ్లు తక్కువగా ఉండడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ద్రవ్యలోటు 3.8 శాతానికి చేరుతుందన్నది నిపుణుల అంచనాగా ఉంది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో వృద్ధి రేటును బలంగా పైకి తీసుకురావడమే ప్రాధాన్యమైన అంశంగా ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. ఇందుకోసం ద్రవ్యలోటు లక్ష్య సవరణను పరిశీలించొచ్చని సూచించింది. రూ.1.84 లక్షల కోట్ల మేర ఉన్న ఆహార సబ్సిడీలను తగ్గించుకోగలిగితే ద్రవ్యలోటు విషయంలో ప్రభుత్వానికి ఎంతో వెసులుబాటు లభిస్తుందని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నాక ప్రభుత్వం తన ఖర్చులను స్థీరీకరించుకోవచ్చని, పలు దేశాలు గతంలో ఇదే మార్గాన్ని అనుసరించాయని పేర్కొంది. మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు.. రెవెన్యూ వ్యయాలను తగ్గించుకోవడంతోపాటు మూలధన వ్యయాలను పెంచుకోవడం ద్వారా ఆస్తులను సృష్టించుకోవాలని ఆర్థిక సర్వే సూచించింది. పెద్ద ఎత్తున పెట్టుబడుల ద్వారా ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల పునరుద్ధరణకు సాయంగా నిలవడం ద్వారా పెట్టుబడుల ఆధారిత వృద్ధి సాధ్యపడుతుందని అంచనా వేసింది. వ్యాపార నిర్వహణను సులభంగా చేసేందుకు వీలుగా.. పోర్టుల్లో ఎగుమతులు పెంచేందుకు రెడ్ టేపిజం (అధిక నియంత్రణలతో కూడిన విధానాలు)ను తొలగించాలని సూచించింది. 2024–25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.350 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థ స్థాయికి చేరేందుకు మౌలిక రంగంలో కనీసం 1.4 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరమని తెలిపింది. ‘‘మౌలిక రంగంలో పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థకు ఎంతో అవసరం. విద్యుత్ కోతలు, చాలీ చాలని రవాణా సదుపాయాలు అధిక వృద్ధి సాధన దిశగ అవరోధంగా నిలుస్తాయి. సాఫీగా, వేగవంతమైన వృద్ధి కోసం భారత్ నాణ్యమైన సదుపాయాల కల్పనకు సకాలంలో తగినన్ని పెట్టుబడులు పెట్టాలి’’ అని ఆర్థిక సర్వే తెలియజేసింది. ప్రభుత్వరంగ బ్యాంకులు పటిష్టం కావాలి.. అధిక మార్కెట్ వాటా కలిగిన ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) దేశ ఆర్థిక వ్యవస్థలో పరిణామ పరంగా చిన్నగా ఉండడాన్ని సర్వే ప్రస్తావించింది. దేశ ఆర్థిక వ్యవస్థ స్థాయికి వాటిని పటిష్టం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. పీఎస్‌బీలు మరింత సమర్థవంతంగా మారడం ద్వారా ఆర్థిక వృద్ధికి చేయూతగా నిలవాల్సిన అవసరాన్ని తెలియజేసింది. ప్రభుత్వరంగ బ్యాంకులు సమర్థంగా లేకపోతే అది ఆర్థిక వ్యవస్థను వినూత్నమైన అవకాశాలను అందుకోలేని వైకల్యంగా మార్చేస్తుందని హెచ్చరించింది. బ్యాంకుల్లో అన్ని కార్యకలాపాలకు ఫైనాన్షియల్ టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించింది. అన్ని స్థాయిల్లోనూ ఉద్యోగులకు ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లు (ఈసాప్) ఇవ్వడం ద్వారా సమర్థతను పెంచొచ్చని అభిప్రాయపడింది. ‘‘రుణాలకు సంబంధించి నిర్ణయాల్లో, ముఖ్యంగా పెద్ద రుణాల జారీలో బిగ్ డేటా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్ను వినియోగించుకునేందుకు జీఎస్టీఎన్ తరహా సంస్థను ఏర్పాటు చేయాలి. రుణ గ్రహీతలను సమగ్రంగా తెలుసుకునేందుకు పీఎస్బీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలి’’ అని సర్వే సిఫారసు చేసింది. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణతో మెరుగైన ఫలితాలు.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో (సీపీఎస్ఈలు) పెట్టుబడుల ఉపసంహరణను పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరాన్ని కూడా ఆర్థిక సర్వే ప్రస్తావించింది. గతంలో ప్రైవటీకరించిన సీపీఎస్ఈల పనితీరు ఆదాయం, లాభాలు, నికర విలువ పరంగా ఎంతో అభివృద్ధి చెందిన విషయాన్ని గుర్తు చేసింది. గతంలో ప్రైవేటీకరించిన సీపీఎస్ఈల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు ముందు పదేళ్లు, ఆ తర్వాత పదేళ్ల కాలంలో వాటి పనితీరును సర్వే అధ్యయనం చేసింది. హిందుస్తాన్ టెలీ ప్రింటర్స్, ఎంఎఫ్ఐఎల్, టాటా కమ్యూనికేషన్స్ వంటి కొన్ని కంపెనీలు మినహా మిగిలిన వాటి నికర విలువ, స్థూల ఆదాయం, నికర లాభాల మార్జిన్, ఆదాయాల వృద్ధి అన్నది ప్రైవేటీకరణకు ముందు నాటి కాలంలో పోలిస్తే ప్రైవేటీకరణ అనంతరం కాలంలో ఎంతో మెరుగుపడినట్టు సర్వే వెల్లడించింది. పెట్టుబడుల ఉపసంహరణ అన్నది మొత్తానికి వాటి పనితీరు, ఉత్పాదకతను గణనీయంగా మార్చేసినట్టు తెలిపింది. అధిక లాభదాయకత, సమర్థత పెంపు, మరింత పోటీతత్వం కోసం వేగంగా వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంరహరణను చేపట్టాలని సూచించింది. పన్ను కోతతో లాభం పెద్ద కంపెనీలకే.. కార్పొరేట్ పన్నులో గణనీయమైన తగ్గింపుతో ఎక్కువ ప్రయోజనం పెద్ద కంపెనీలకేనని, చిన్న కంపెనీలు అప్పటికే తక్కువ పన్ను రేటు చెల్లిస్తున్న విషయాన్ని ఆర్థిక సర్వే పేర్కొంది. కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లో నిర్ణయం తీసుకున్న విషయం గమనార్హం. ఈ నిర్ణయం తీసుకునే నాటికే రూ.400 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న కంపెనీలు (దేశంలో 99.1 శాతం ఈ పరిధిలోనివే) 25 శాతం కార్పొరేట్ పన్ను పరిధిలో ఉన్న విషయాన్ని సర్వే ప్రస్తావించింది. అంటే కేవలం 0.9 శాతం కంపెనీలు (4,698 కంపెనీలు) రూ.400 కోట్ల టర్నోవర్ పైగా ఉన్నవి. ఇవి చెల్లించే రేటు 30.9 నుంచి 34.61 శాతం మధ్య (సెస్సులు కూడా కలుపుకుని) ఉంది. దీంతో కార్పొరేట్ పన్ను తగ్గింపు చిన్న కంపెనీలకు 3.2 శాతం నుంచి 13.5 శాతం మేర ప్రయోజనం కలిగిస్తే, పెద్ద కంపెనీలకు 18.5 శాతం నుంచి 27.3 శాతం మధ్య లాభం చేకూర్చినట్టు ఆర్థిక సర్వే వివరించింది. ఇళ్ల ధరలను తగ్గించడం పరిష్కారం! అమ్ముడుపోని ఇళ్లు అధిక సంఖ్యలో ఉండడంతో వీటిని తగ్గించుకునేందుకు నిర్మాణదారులు కొంత మేర ధరలను తగ్గించాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే సూచించింది. రియల్ఎస్టేట్ డెవలపర్లు కొంత మేర హేర్‌కట్ (నష్టం) భరించి ధరలను తగ్గిస్తే త్వరగా అమ్ముడుపోతాయని పేర్కొంది. బిల్డర్లు ఈ విధంగా చేసినట్టయితే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల బ్యాలెన్స్ షీట్లు సానుకూలంగా మారతాయని తెలిపింది. 2015–16 నుంచి వృద్ధి నిలిచిపోయినప్పటికీ, ఇళ్ల ధరలు అధిక స్థాయిల్లోనే ఉన్నట్లు పేర్కొంది. సంపద సృష్టి ద్వారానే.. సంపదను సృష్టించినప్పుడే దాన్ని పంచడం సాధ్యపడుతుందని ఆర్థిక సర్వే రూపకల్పన బృందానికి నేతృత్వం వహించిన కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ అన్నారు. అనుమానంగా చూడడం, సంపద సృష్టికర్తలను (వ్యాపారవేత్తలు) అమర్యాదగా చూడడం మంచిది కాదన్నారు. జీడీపీ వృద్ధి నిదానించడాన్ని వృద్ధి సైకిల్లో భాగంగానే చూడా లన్నారు. 2011 తర్వాత జీడీపీ రేటును 2.7 శాతం అధికం చేసి చూపిస్తున్నారన్న మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. బలమైన సంస్కరణలు కావాలి 2019–20లో జీడీపీ అంచనా వృద్ధి రేటు 5 శాతం నుంచి 2020–21లో 6–6.5 శాతానికి బలంగా పుంజకుంటుందని తాజా ఆర్థిక సర్వే అంచనా వేసింది. సరైన మోతాదులో సంస్కరణలు, ప్రభుత్వ పెట్టుబడులతో ఈ లక్ష్యం సాధించతగినదే. ఆర్థిక సర్వే అన్నది యూనియన్బడ్జెట్కు ముందస్తు సూచిక. కనుక బలమైన సంస్కరణల చర్యలను ఈసారి బడ్జెట్లో అంచనా వేస్తున్నాం. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ 6–6.5 శాతం వృద్ధి రేటు సవాలే... డిమాండ్ సైకిల్ ఇంకా పుంజుకోవాల్సి ఉంది. కరోనా వైరస్ ప్రభావం భారత్ సహా అంతర్జాతీయ వృద్ధిపై ప్రభావం చూపిస్తుంది. ఇందుకు గతంలో సార్స్ వైరస్ ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని చూడాలి. – రణేన్ బెనర్జీ, పీడబ్ల్యూసీ ఇండియా రికవరీ ఆవశ్యకతను చెప్పింది.. బలమైన ఆర్థిక మందగమనం నుంచి వ్యవస్థ రికవరీ అయ్యేందుకు బలమైన సంస్కరణలను ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరాన్ని సర్వే ప్రస్తావించింది. –నిరంజన్ హిరనందాని, అసోచామ్ ప్రెసిడెంట్ -
భారత్ కలలు కల్లలేనా!
సాక్షి, న్యూఢిల్లీ : 2020 సంవత్సరం నాటికల్లా వర్దమాన దేశమైన భారత్, అభివృద్ధి చెందిన దేశంగా మారడమే కాకుండా ప్రపంచంలో సూపర్ పవర్‌గా అవతరిస్తుందని ఎంతో మంది శాస్త్రవేత్తలు, ఆర్థిక వేత్తలు, రాజకీయ నిపుణలు ఆశించారు, అంచనాలు వేశారు. భారత మాజీ రాష్ట్రపతి, ఇస్రో మాజీ శాస్త్రవేత్త అబ్దుల్ కలామ్, తోటి ప్రభుత్వ శాస్త్రవేత్త వైఎస్ రాజన్‌తో కలసి ఏకంగా ‘భారత్ 2020’లో అంటూ ఓ పుస్తకమే రాశారు. 2020లో ఆర్థికంగా చైనాను అధిగమించి అమెరికానే సవాల్ చేస్తామని, అప్పుడు వచ్చే దీపావళిని దేశభక్తులుగా గొప్పగా జరుపుకోవచ్చని బీజేపీ నేత సుబ్రమణియం స్వామి వ్యాఖ్యానించారు. 2020 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే తన ప్రభుత్వ విధానమని 2002లో అప్పటి దేశ ప్రధాని అటల్ బిహారి వాజపేయి స్వాతంత్య దినోత్సవ సందేశంలో ప్రకటించారు. వాస్తవానికి ఎంతో నిరాశ, నిస్పృహలతో భారత్ 2020లోకి అడుగుపెట్టింది. అభివృద్ధి ఫలాలను ఆస్వాదించాల్సిన చోట దేశవ్యాప్తంగా ఆందోళనలను చూడాల్సి వస్తోంది. ‘ఇండియా 2020 : ఏ విజన్ ఫర్ ది న్యూ మిలీనియం’ పుస్తకాన్ని కలామ్, వైఎస్ రాజన్‌లు 1998లో రచించారు. 2007–8 సంవత్సరం నాటికి దేశంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా వారు ఆ పుస్తకంలో పేర్కొన్నారు. 2020 నాటికి ప్రతి భారతీయుడు దారిద్య్ర రేఖకు ఎగువనే ఉంటారని కూడా ఆశించారు. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం భారత జనాభాలో ఇప్పటికీ 30 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువనే బతుకుతున్నారు. దారిద్య్ర నిర్మూలనుకు అంచనా వేసిన సంవత్సరం గడిచిపోయి 12 సంవత్సరాలు గడిచిపోయినా పేదరిక నిర్మూలన జరగకపోగా పెరిగింది. జీవన ప్రమాణాలు మరింతగా పడిపోయాయి. ఐక్యరాజ్యసమతి అభివృద్ధి విభాగం అంచనాల ప్రకారం 2019 మానవ అభివృద్ధి సూచికలో 189 దేశాల్లో భారత్ స్థానం 129 స్థానానికి పరిమితమైంది. దేశ కార్మిక శక్తిలో మహిళా భాగస్వామ్యం పెరుగుతుందని అబ్దుల్ కలామ్ అంచనా వేయగా, మహిళా భాగస్వామ్యం 2017–18 సంవత్సరంలో మున్నెన్నడు లేనివిధంగా అత్యంత దిగువకు పడిపోయింది. మహిళ కార్మిక భాగస్వామ్యం విషయంలో ప్రపచంలో భారత్‌కన్నా ఎనిమిదంటే ఎనిమిది దేశాలే వెనకబడి ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తోంది. 2020 సంవత్సరం నాటికి భారత్ దిగువ–మధ్య ఆదాయంగల దేశం స్థాయి నుంచి ఎగువ– మధ్య ఆదాయ దేశంగా ఆవిర్భవిస్తుందని ప్రపంచ బ్యాంకకు కూడా తన నివేదికలో అంచనా వేసింది. భారత్ ఇంకా ఆ దిగువ స్థాయిలో ఉండిపోగా, పొరుగునున్న శ్రీలంగా దిగువ–మధ్య ఆదాయంగల స్థాయి నుంచి ఎగువ స్థాయికి ఎగబాకింది. 2020 నాటికి దేశంలో ఉద్యోగావకాశాలు భారీగా పెరిగి నిరుద్యోగ సమస్య పూర్తిగా తుడిచిపెట్టుకు పోతుందని కూడా అంచనా వేశారు. వారి అంచనాలకు విరుద్ధంగా 2017–2018 సంవత్సరంలో నిరుద్యోగ సమస్య గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 6.1 శాతానికి చేరుకుంది. భారత్ ప్రణాళికా సంఘం ప్రతిపాదించిన లక్ష్యాల్లో ఏ ఒక్కటి కూడా ఇంతవరకు నెరవేరలేదు. 2020 నాటికి మహిళల్లో అక్షరాస్యతను 94 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 65 శాతం దాటలేదు. శిశు మరణాలను వెయ్యికి 22కు పరిమితం చేయాలనుకున్నారు. 2017 లెక్కల ప్రకారం అది వెయ్యికి 33 కొనసాగుతోంది. పిల్లల్లో పోషక పదార్థాల లోపాన్ని ఎనిమిది శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ప్రస్తుతం అది 32.7 శాతానికి చేరుకుంది. దేశంలో ఆటోమొబైల్ రంగం వృద్ధి రేటు గణనీయంగా పడిపోయింది. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా జీడీపీ వృద్ధి రేటు కూడా కనిష్ట స్థాయికి పడిపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీని మరోసారి ప్రధాన మంత్రిగా ఎన్నుకుంటే 2024 నాటికల్లా భారత్‌ను సూపర్ పవర్‌గా మారుస్తారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించగా, అబ్దుల్ కలాం ‘విజన్ 2020’ మోదీ నెరవేరుస్తారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించడంలో భారత్ 20 ఏళ్లు వెనకబడిందని పలువురు ఆర్థికవేత్తలు ఇప్పుడు చెబుతున్నారు. తోటి ఆసియా దేశాలైనా బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకకన్నా భారత్ వెనకబడిపోయిందని ప్రముఖ భారత ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్యసేన్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటప్పుడు భారత్ కలలు కల్లలేగదా! -
మరో విడత రేట్ల తగ్గింపునకు అవకాశం
న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటు సెప్టెంబర్ త్రైమాసికంలో మరింతగా క్షీణించి 4.5%కి పరిమితం అయిన నేపథ్యంలో.. ఆర్బీఐ ఎంపీసీ మరో విడత పావు శాతం వరకు కీలక రేట్ల తగ్గింపును చేపట్టొచ్చనేది నిపుణుల అంచనా. శక్తికాంతదాస్ ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్బీఐ ఇప్పటిదాకా ప్రతీ భేటీలోనూ రేట్లను తగ్గిస్తూనే వచ్చింది. ఇప్పటి వరకు గత ఏడాది కాలంలో 135 బేసిస్ పాయింట్లను తగ్గించింది. దేశ వృద్ధి రేటును ప్రగతి బాట పట్టించేందుకు తాము మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు కూడా. అయితే, ఇప్పటి వరకు ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం ఆర్బీఐ రేట్ల కోతకు సాయపడింది. మరి తాజాగా ద్రవ్యోల్బణం ఎగువవైపు పరుగును ఆరంభించింది. అక్టోబర్‌లో ఆర్బీఐ లకి‡్ష్యత స్థాయి (4.5%)ని దాటుకుని 4.6%కి చేరింది. దీంతో మరో విడత రేట్లపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే, అక్టోబర్‌లో రేట్ల కోత సమయంలో సర్దుబాటు ధోరణిని ఆర్బీఐ కొనసాగించినందున, ఆర్థిక పరిస్థితులు ఇలానే బలహీనంగా ఉంటే మరో విడత రేట్ల కోతకు అవకాశం ఉంటుందని ఐహెచ్ఎస్ మార్కిట్ ముఖ్య ఆర్థికవేత్త రాజీవ్ బిశ్వాస్ తెలిపారు. ఆర్బీఐ ఎంపీసీ భేటీ ఈ నెల 3న ప్రారంభం కానుంది. 5న విధాన ప్రకటనపై నిర్ణయం వెలువడుతుంది. -
జీడీపీ.. పల్టీ
భారత్ ఆర్థిక వ్యవస్థకు గణాంకాల షాక్ తగిలింది. మూడు కీలక అంశాలకు సంబంధించి... శుక్రవారం ఆందోళన కలిగించే గణాంకాలు వెల్లడయ్యాయి. రెండవ త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ట స్థాయి 4.5 శాతానికి పడిపోయింది. ఇక ప్రభుత్వ ఆదాయాలు– వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు... అక్టోబర్ ముగిసే నాటికే బడ్జెట్ అంచనాలు దాటిపోయింది. మరోవైపు మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో (ఐఐపీ) దాదాపు 44 శాతం వాటా ఉన్న 8 పారిశ్రామిక రంగాల గ్రూప్ అక్టోబర్‌లో అసలు వృద్ధి నమోదుచేసుకోకపోగా, –5.8 శాతం క్షీణతలోకి జారింది. న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వృద్ధి తీవ్ర మందగమనంలోకి జారినట్లు తాజా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి గణాంకాలు మరింత స్పష్టం చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019 ఏప్రిల్– 2020 మార్చి) రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) కేవలం 4.5 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. గడచిన ఆరు సంవత్సరాల్లో వృద్ధి వేగం ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. 2012–13 జనవరి–మార్చి త్రైమాసికంలో 4.3 శాతం వృద్ధి నమోదయ్యింది. 2018–19 రెండవ త్రైమాసికంలో వృద్ధి రేటు 7 శాతం నమోదయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ మధ్య ఈ రేటు 5 శాతం. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎస్ఎస్ఓ) విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... - ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) వృద్ధి రేటు 4.8%గా నమోదయ్యింది. 2018–19 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వృద్ధి రేటు 7.5%. - ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా జీడీపీ వృద్ధి రేటు 6.1% ఉంటుందన్నది రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అంచనా. తాజా గణాంకాలు చూస్తే, ఆ స్థాయి వృద్ధి రేటయినా సాధ్యమేనా అన్న సందేహం కలుగుతోంది. - క్యూ2లో వృద్ధిరేటు కనీసం 4.7 శాతమే ఉంటుందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ ఫిచ్ దేశీయ విభాగం ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఇటీవలే విశ్లేషించింది. అంతకన్నా తక్కువ రేటు నమోదుకావడం గమనార్హం. - 2018–19 మొదటి త్రైమాసికంలో 8 శాతం వృద్ధి రేటు నుంచీ చూస్తే, వరుసగా ఆరు త్రైమాసికాల నుంచీ భారత్ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతోంది. అంటే ఎప్పటికప్పుడు తగ్గుతూ వస్తోంది. 2012 తరువాత ఇలాంటి పరిస్థితి ఇదే మొదటిసారి. - ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశం హోదాను గత ఆర్థిక సంవత్సరం (5 శాతం) వరకూ భారత్ పొందుతోంది. అయితే ప్రస్తుత జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి 7.3 శాతం వృద్ధి రేటుతో వియత్నాం మొదటిస్థానంలో ఉంది. చైనా వృద్ధి రేటు 6 శాతంగా (27 సంవత్సరాల కనిష్టం) ఉంది. తరువాత వరుసలో ఈజిఫ్ట్ (5.6 శాతం), ఇండోనేషియా (5 శాతం)లు ఉన్నాయి. దీనితో క్యూ2కు సంబంధించి ‘వేగవంతమైన వృద్ధి’ హోదాను వియత్నాం దక్కించుకున్నట్లు అయ్యింది. కాగా అమెరికా వృద్ధి రేటు ఈ కాలంలో 2.1 శాతం. రంగాల వారీగా చూస్తే... - జీడీపీలో దాదాపు 16 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగంలో అసలు వృద్ధిలేకపోగా క్యూ2లో ఒకశాతం క్షీణతను (మైనస్) నమోదుచేసుకుంది. 2018 ఇదే కాలంలో ఈ రంగంలో 6.9 శాతం వృద్ధిని సాధించింది. 2019–20 క్యూ1లో కనీసం 0.6 శాతం వృద్ధి నమోదయ్యింది. - వ్యవసాయ రంగంలో 4.9% వృద్ధి రేటు 2.1%కి పడిపోయింది. అయితే క్యూ1కన్నా (2%) కొంచెం మెరుగుపడ్డం గమనార్హం. - ఇక నిర్మాణ రంగం విషయానికి వస్తే, వృద్ధి రేటు 8.5% నుంచి 3.3%కి పడిపోయింది. - మైనింగ్ అండ్ క్వారీయింగ్ కొంత బాగుంది. 2018–19 క్యూ2లో వృద్ధిలేకపోగా –2.2 శాతం క్షీణత నమోదయితే, తాజా గణాంకాల్లో కొద్దిపాటి మెరుగుదలతో 0.1 శాతం వృద్ధిలోకి మళ్లింది. అయితే క్యూ1 కన్నా (2.7 శాతం) వృద్ధి భారీగా పడిపోవడం గమనార్హం. - విద్యుత్, గ్యాస్, నీటి పారుదల ఇతర యుటిలిటీ సర్వీసుల విషయంలో వృద్ధి రేటు 8.7% నుంచి 3.6%కి పడిపోయింది. క్యూ1లో ఈ వృద్ధి మరింత మెరుగైన స్థితిలో 8.6%గా ఉంది. - వాణిజ్యం, హోటెల్స్, రవాణా, కమ్యూనికేషన్లు, సేవల రంగంలో వృద్ధి రేటు 6.9 శాతం నుంచి 4.8 శాతానికి పడిపోయింది. - ఫైనాన్షియల్, రియల్టీ, బీమా ప్రొఫెషనల్ సర్వీసెస్ విషయంలో వృద్ధి రేటు 7 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గింది. ఆందోళనకరం... జీడీపీ వృద్ధి రేటు 4.5%గా నమోదుకావడం ఆందోళనకరం. ఆమోదనీయంకాని అంశం. వృద్ధిరేటు 8 నుంచి 9 శాతం మేర వృద్ధి చెందాలని భారత్ ఆకాంక్షిస్తోంది. కేవలం ఆర్థిక విధానాల్లో మార్పు వల్ల ఆర్థిక పునరుత్తేజం జరగదు. ముందు వ్యవస్థను భయాందోళనల నుంచి విశ్వాసం వైపునకు నడిపించాలి. అలాంటప్పుడే అధిక వృద్ధి రేటు బాటకు మళ్లుతాం. ఇప్పుడు జరగాల్సింది ఇదే. – మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని ఆర్థిక మూలాలు పటిష్టం... భారత్ ఆర్థిక మూలాలు పటిష్టంగానే ఉన్నాయి. 2019–20 మూడవ త్రైమాసికం నుంచీ వృద్ధి పుంజుకుంటుంది. వృద్ధి రేటు 2019–20లో 6.1 శాతం, 2020–21లో 7 శాతం ఉంటుందని తన అక్టోబర్ వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్‌లో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొనడం ఇక్కడ గమనార్హం. – అతనూ చక్రవర్తి, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి పతనానికి ఇక అడ్డుకట్టే ప్రస్తుత గణాంకాలు కొంత నిరాశపరుస్తున్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థ మందగమనానికి ఇక ముగింపు పడినట్లేనని భావిస్తున్నాం. ప్రైవేటు వినియోగం పెరుగుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న పలు ప్రగతిశీల చర్యలు ఫలితాలను ఇస్తాయని విశ్వసించవచ్చు. రానున్న త్రైమాసికాల్లో గణాంకాలు వృద్ధి బాటలో ఉండే వీలుంది. – పారిశ్రామికవర్గాలు కట్టుతప్పిన ద్రవ్యలోటు... ద్రవ్యలోటు విషయానికొస్తే, 2019–20 ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ పరిమాణం రూ.7.03 లక్షల కోట్లుగా ఉండాలన్నది (జీడీపీలో 3.3 శాతం) బడ్జెట్ లక్ష్యం. కానీ అక్టోబర్ ముగిసే నాటికే ఈ మొత్తం రూ.7,20,445 కోట్లకు చేరింది. అంటే బడ్జెట్ అంచనాల్లో 102.4 శాతానికి చేరిందన్నమాట. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. సెప్టెంబర్‌లో కేంద్రం కార్పొరేట్ పన్నులను తగ్గించడంతో మొత్తం వసూళ్ల అంచనాలపై రూ.1.45 లక్షల కోట్లమేర ప్రతికూల ప్రభావం పడుతుందనేది అంచనా. మౌలిక రంగం నేలచూపు... పారిశ్రామిక ఉత్పత్తి(ఐఐపీ)లో దాదాపు 44 శాతం వాటా ఉన్న ఎనిమిది కీలక మౌలిక పారిశ్రామిక రంగాల గ్రూప్ అక్టోబర్‌లో అసలు వృద్ధి నమోదుచేసుకోకపోగా –5.8 శాతం క్షీణతకు పడింది. ఎనిమిది రంగాల్లో ఎరువులు, రిఫైనరీ ప్రొడక్టుల మినహా మిగిలిన ఆరు మైనస్‌లోనే ఉండడం గమనార్హం. 2018 ఇదే నెలలో ఈ గ్రూప్ వృద్ధి రేటు 4.8 శాతం. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనూ ఈ గ్రూప్ క్షీణతనే (–5.1 శాతం) నమోదు చేసుకుంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య ఈ గ్రూప్ వృద్ధి రేటు 5.4 శాతం నుంచి 0.2 శాతానికి పడిపోయింది. -
ఆర్థిక పునరుజ్జీవానికి మరో అస్త్రం!
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ మళ్లీ జీవం పోసుకునేందుకు గాను కేంద్ర ప్రభుత్వం మరో విడత ప్రోత్సాహక చర్యల ప్యాకేజీని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. జూన్ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే. ప్రోత్సాహక చర్యల బ్లూప్రింట్ సిద్ధమైందని, కొన్ని రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటిస్తారని ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. అంతకుమించి ఆయన వివరాలు తెలియజేయలేదు. ఇప్పటికే కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ మూడు సార్లు ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించారు. రియల్ ఎస్టేట్ రంగానికి ప్రత్యేక నిధి, ఎగుమతుల రంగాలకు రూ.50,000 కోట్ల పన్ను రాయితీలు, ఆటోమొబైల్ రంగానికి ప్రోత్సాహకాలు ఇప్పటి వరకు ప్రకటించిన వాటిల్లో ఉన్నాయి. తొలిసారి ఆగస్ట్ 23న ప్రకటనలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై పెంచిన సర్‌చార్జీని ప్రభుత్వం ఉపసంహరించుకుంది కూడా. అంతకుముందు బడ్జెట్లో ఈ ప్రకటన చేసిన నాటి నుంచి ఎఫ్‌పీఐలు అదే పనిగా పెద్ద ఎత్తున మార్కెట్లో విక్రయాలు చేస్తుండడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. కాగా, ప్రభుత్వం నుంచి మరిన్ని చర్యలు ఉంటాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సైతం ఇటీవలే అభిప్రాయపడ్డారు. ‘‘సరైన చర్యలు తీసుకుంటే కచి్చతంగా పరిస్థితులు మెరుగుపడతాయి. ప్రభుత్వం వేగంగా స్పందిస్తుండడం సానుకూలం. ఆరి్థక పరిస్థితులను చక్కదిద్దే విషయంలో ప్రభుత్వం నుంచి ఇవే చివరి చర్యలని భావించడం లేదు. ఇవి కొనసాగుతూనే ఉంటాయి. తప్పకుండా సవాళ్లను వారు పరిష్కరిస్తారు’’ అని దాస్ ఇటీవలే పేర్కొన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆరి్థక వ్యవస్థగా రానున్న ఐదేళ్లలో అవతరించేందుకు, ప్రభుత్వరంగ బ్యాంకులను మరింత బలోపేతం చేయాలని భావించిన సర్కారు భారీ విలీనాల దిశగా కూడా అడుగు వేసింది. -
జీడీపీలో 7కు తగ్గిన భారత్ ర్యాంక్
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంకు 2018 జీడీపీ ర్యాంకుల్లో భారత్ ఒక ర్యాంకు కోల్పోయి ఏడో స్థానానికి దిగజారింది. 2018లో జీడీపీ పరంగా 2.72 ట్రిలియన్ డాలర్ల పరిమాణంతో బ్రిటన్, ఫ్రాన్స్‌ల తర్వాత స్థానానికి వెళ్లింది. టాప్ 6 దేశాల్లో... అమెరికా (20.5 ట్రిలియన్ డాలర్లు), చైనా (13.6 ట్రిలియన్ డాలర్లు), జపాన్ (4.9 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (3.9 ట్రిలియన్ డాలర్లు), బ్రిటన్ (2.82 ట్రిలియన్ డాలర్లు), ఫ్రాన్స్ (2.77 ట్రిలియన్ డాలర్లు) భారత్ కంటే ముందున్నాయి. 2024 నాటికి జీడీపీని 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరికి 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలని లక్ష్యాన్ని పెట్టుకుంది. 2017లో భారత్ ఫ్రాన్స్‌ను అధిగమించి ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. స్వల్ప తేడాతో బ్రిటన్ను కూడా దాటేసింది. 2017లో భారత జీడీపీ 2.65 ట్రిలియన్ డాలర్లుగా ఉంటే, బ్రిటన్ జీడీపీ 2.64 ట్రిలియన్ డాలర్లు, ఫ్రాన్స్ జీడీపీ 2.59 ట్రిలియన్ డాలర్లకే పరిమితం కాగా, తిరిగి 2018లో భారత్‌ను దాటి ఈ రెండు దేశాలు ముందుకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో దేశ జీడీపీ ఐదేళ్ల కనిష్ట స్థాయికి( 5.8%) పడిపోవడం గమనార్హం. 2018–19 సంవత్సరానికి కూడా జీడీపీ 6.8%కి క్షీణించింది. కరెన్సీ విలువల్లో హెచ్చుతగ్గులు, జీడీపీ వృద్ధి నిదానించడం అంతర్జాతీయ జీడీపీ ర్యాంకుల్లో భారత్ కిందకు రావడానికి కారణాలుగా ఈఅండ్‌వై ముఖ్య విధాన సలహాదారు డీకే శ్రీవాస్తవ తెలిపారు. ఎగుమతులు తగ్గడం, డిమాండ్ పడిపోవడం వంటి పరిస్థితులను గుర్తు చేశారు. వృద్ధి తిరిగి గాడిన పడాలంటే ద్రవ్య ప్రోత్సాహకాలు అవసరమని అభిప్రాయపడ్డారు.