జీడీపీ.. పల్టీ | Huge Shock To Economy of India | Sakshi
Sakshi News home page

జీడీపీ.. పల్టీ

Published Sat, Nov 30 2019 3:16 AM | Last Updated on Sat, Nov 30 2019 3:16 AM

Huge Shock To Economy of India - Sakshi

భారత్‌ ఆర్థిక వ్యవస్థకు గణాంకాల షాక్‌ తగిలింది. మూడు కీలక అంశాలకు సంబంధించి... శుక్రవారం ఆందోళన  కలిగించే గణాంకాలు వెల్లడయ్యాయి. రెండవ త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ట స్థాయి 4.5 శాతానికి పడిపోయింది. ఇక ప్రభుత్వ ఆదాయాలు– వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు... అక్టోబర్‌ ముగిసే నాటికే బడ్జెట్‌ అంచనాలు దాటిపోయింది. మరోవైపు మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో (ఐఐపీ) దాదాపు 44 శాతం వాటా ఉన్న 8 పారిశ్రామిక రంగాల గ్రూప్‌ అక్టోబర్‌లో అసలు వృద్ధి నమోదుచేసుకోకపోగా, –5.8 శాతం క్షీణతలోకి జారింది.  

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వృద్ధి తీవ్ర మందగమనంలోకి జారినట్లు తాజా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి గణాంకాలు మరింత స్పష్టం చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019 ఏప్రిల్‌– 2020 మార్చి) రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్‌) కేవలం 4.5 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. గడచిన ఆరు సంవత్సరాల్లో వృద్ధి వేగం ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. 2012–13 జనవరి–మార్చి త్రైమాసికంలో 4.3 శాతం వృద్ధి నమోదయ్యింది. 2018–19 రెండవ త్రైమాసికంలో వృద్ధి రేటు 7 శాతం నమోదయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జూన్‌ మధ్య ఈ రేటు 5 శాతం. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎస్‌ఎస్‌ఓ) విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... 
- ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) వృద్ధి రేటు 4.8%గా నమోదయ్యింది. 2018–19 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వృద్ధి రేటు 7.5%.  
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా జీడీపీ వృద్ధి రేటు 6.1% ఉంటుందన్నది రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) అంచనా. తాజా గణాంకాలు చూస్తే, ఆ స్థాయి వృద్ధి రేటయినా సాధ్యమేనా అన్న సందేహం కలుగుతోంది. 
క్యూ2లో వృద్ధిరేటు కనీసం 4.7 శాతమే ఉంటుందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజ సంస్థ ఫిచ్‌ దేశీయ విభాగం ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇటీవలే విశ్లేషించింది. అంతకన్నా తక్కువ రేటు నమోదుకావడం గమనార్హం.  
2018–19 మొదటి త్రైమాసికంలో 8 శాతం వృద్ధి రేటు నుంచీ చూస్తే,  వరుసగా ఆరు త్రైమాసికాల నుంచీ భారత్‌ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతోంది. అంటే ఎప్పటికప్పుడు తగ్గుతూ వస్తోంది.  2012 తరువాత ఇలాంటి పరిస్థితి ఇదే మొదటిసారి. 
ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశం హోదాను గత ఆర్థిక సంవత్సరం (5 శాతం) వరకూ భారత్‌ పొందుతోంది. అయితే ప్రస్తుత జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి  7.3 శాతం వృద్ధి రేటుతో వియత్నాం మొదటిస్థానంలో ఉంది. చైనా వృద్ధి రేటు  6 శాతంగా (27 సంవత్సరాల కనిష్టం) ఉంది. తరువాత వరుసలో ఈజిఫ్ట్‌ (5.6 శాతం), ఇండోనేషియా (5 శాతం)లు ఉన్నాయి. దీనితో క్యూ2కు సంబంధించి ‘వేగవంతమైన వృద్ధి’ హోదాను వియత్నాం దక్కించుకున్నట్లు అయ్యింది. కాగా అమెరికా వృద్ధి రేటు ఈ కాలంలో 2.1 శాతం.  
రంగాల వారీగా చూస్తే... 
జీడీపీలో దాదాపు 16 శాతం వెయిటేజ్‌ ఉన్న తయారీ రంగంలో అసలు వృద్ధిలేకపోగా క్యూ2లో ఒకశాతం క్షీణతను (మైనస్‌) నమోదుచేసుకుంది. 2018 ఇదే కాలంలో ఈ రంగంలో 6.9 శాతం వృద్ధిని సాధించింది. 2019–20 క్యూ1లో కనీసం 0.6 శాతం వృద్ధి నమోదయ్యింది.  
వ్యవసాయ రంగంలో 4.9% వృద్ధి రేటు 2.1%కి పడిపోయింది. అయితే క్యూ1కన్నా (2%) కొంచెం మెరుగుపడ్డం గమనార్హం.  
ఇక నిర్మాణ రంగం విషయానికి వస్తే, వృద్ధి రేటు 8.5% నుంచి 3.3%కి పడిపోయింది.  
మైనింగ్‌ అండ్‌ క్వారీయింగ్‌ కొంత బాగుంది. 2018–19 క్యూ2లో వృద్ధిలేకపోగా –2.2 శాతం క్షీణత నమోదయితే, తాజా గణాంకాల్లో కొద్దిపాటి మెరుగుదలతో 0.1 శాతం వృద్ధిలోకి మళ్లింది. అయితే క్యూ1 కన్నా (2.7 శాతం) వృద్ధి భారీగా పడిపోవడం గమనార్హం.  
విద్యుత్, గ్యాస్, నీటి పారుదల ఇతర యుటిలిటీ సర్వీసుల విషయంలో వృద్ధి రేటు 8.7% నుంచి 3.6%కి పడిపోయింది.  క్యూ1లో ఈ వృద్ధి మరింత మెరుగైన స్థితిలో 8.6%గా ఉంది.  
వాణిజ్యం, హోటెల్స్, రవాణా, కమ్యూనికేషన్లు, సేవల రంగంలో వృద్ధి రేటు 6.9 శాతం నుంచి 4.8 శాతానికి పడిపోయింది.   
ఫైనాన్షియల్, రియల్టీ, బీమా ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌ విషయంలో వృద్ధి రేటు 7 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గింది.

ఆందోళనకరం... 
జీడీపీ వృద్ధి రేటు 4.5%గా నమోదుకావడం ఆందోళనకరం. ఆమోదనీయంకాని అంశం.  వృద్ధిరేటు 8 నుంచి 9 శాతం మేర వృద్ధి చెందాలని భారత్‌ ఆకాంక్షిస్తోంది. కేవలం ఆర్థిక విధానాల్లో మార్పు వల్ల ఆర్థిక పునరుత్తేజం జరగదు. ముందు వ్యవస్థను భయాందోళనల నుంచి విశ్వాసం వైపునకు నడిపించాలి. అలాంటప్పుడే అధిక వృద్ధి రేటు బాటకు మళ్లుతాం. ఇప్పుడు జరగాల్సింది ఇదే. 
– మన్మోహన్‌ సింగ్, మాజీ ప్రధాని

ఆర్థిక మూలాలు పటిష్టం... 
భారత్‌ ఆర్థిక మూలాలు పటిష్టంగానే ఉన్నాయి. 2019–20 మూడవ త్రైమాసికం నుంచీ వృద్ధి పుంజుకుంటుంది. వృద్ధి రేటు 2019–20లో 6.1 శాతం, 2020–21లో 7 శాతం ఉంటుందని తన అక్టోబర్‌ వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌లో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) పేర్కొనడం ఇక్కడ గమనార్హం.  
– అతనూ చక్రవర్తి, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి 

పతనానికి ఇక అడ్డుకట్టే 
ప్రస్తుత గణాంకాలు కొంత నిరాశపరుస్తున్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థ మందగమనానికి ఇక ముగింపు పడినట్లేనని భావిస్తున్నాం. ప్రైవేటు వినియోగం పెరుగుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న పలు ప్రగతిశీల చర్యలు ఫలితాలను ఇస్తాయని విశ్వసించవచ్చు. రానున్న త్రైమాసికాల్లో గణాంకాలు వృద్ధి బాటలో ఉండే వీలుంది.    
    – పారిశ్రామికవర్గాలు 

కట్టుతప్పిన ద్రవ్యలోటు...
ద్రవ్యలోటు విషయానికొస్తే, 2019–20 ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ పరిమాణం రూ.7.03 లక్షల కోట్లుగా ఉండాలన్నది (జీడీపీలో 3.3 శాతం) బడ్జెట్‌ లక్ష్యం. కానీ అక్టోబర్‌ ముగిసే నాటికే ఈ మొత్తం రూ.7,20,445 కోట్లకు చేరింది. అంటే బడ్జెట్‌ అంచనాల్లో 102.4 శాతానికి చేరిందన్నమాట. కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. సెప్టెంబర్‌లో కేంద్రం కార్పొరేట్‌ పన్నులను తగ్గించడంతో మొత్తం వసూళ్ల అంచనాలపై రూ.1.45 లక్షల కోట్లమేర ప్రతికూల ప్రభావం పడుతుందనేది అంచనా.

మౌలిక రంగం నేలచూపు...  
పారిశ్రామిక ఉత్పత్తి(ఐఐపీ)లో దాదాపు 44 శాతం వాటా ఉన్న ఎనిమిది కీలక మౌలిక పారిశ్రామిక రంగాల గ్రూప్‌ అక్టోబర్‌లో అసలు వృద్ధి నమోదుచేసుకోకపోగా –5.8 శాతం క్షీణతకు పడింది. ఎనిమిది రంగాల్లో ఎరువులు, రిఫైనరీ ప్రొడక్టుల మినహా మిగిలిన ఆరు మైనస్‌లోనే ఉండడం గమనార్హం. 2018 ఇదే నెలలో ఈ గ్రూప్‌ వృద్ధి రేటు 4.8 శాతం. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనూ ఈ గ్రూప్‌ క్షీణతనే (–5.1 శాతం) నమోదు చేసుకుంది. ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ మధ్య ఈ గ్రూప్‌ వృద్ధి రేటు 5.4 శాతం నుంచి 0.2 శాతానికి పడిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement