సోమవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పిస్తున్న తెలంగాణ శాసనసభ
శాసనసభలో తీర్మానం పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశానికి మన్మోహన్‌సింగ్ చేసిన విశిష్ట సేవలెన్నో..
విప్లవాత్మక ఉపాధి హామీ, సమాచార హక్కు, విద్యాహక్కు చట్టాలు తెచ్చారు
60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేశారు
రాష్ట్ర అసెంబ్లీ తరఫున మన్మోహన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటన
హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మన్మోహన్ విగ్రహం పెడతామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం దేశ సర్వోన్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి రాష్ట్ర శాసనసభ తరఫున విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ఆర్థికవేత్త అయిన మన్మోహన్‌సింగ్.. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా, ఆర్బీఐ గవర్నర్‌గా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా వివిధ హోదాల్లో దేశానికి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. మన్మోహన్‌కు నివాళి అర్పించేందుకు సోమవారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి మాట్లాడారు. మాజీ ప్రధాని కుటుంబ సభ్యులకు సభ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. సభలో రేవంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్. 1991–96 మధ్య మన పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించారు. ఆర్థిక స్థితిగతుల దశదిశను మార్చిన సంస్కరణల అమల్లో కీలక పాత్ర పోషించారు. ఆ పునాదులతోనే నేడు భారతదేశం ప్రపంచంతో పోటీపడుతోంది. ఆయన దార్శనికత, కృషిని అంతా స్మరించుకోవాలి.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మన్మోహన్ విగ్రహం
మన్మోహన్‌సింగ్ దేశానికి, ప్రత్యేకంగా తెలంగాణకు చేసిన సేవలకు శాసనసభ అపార కృతజ్ఞతలు తెలియజేస్తోంది. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆయనకు రుణపడి ఉన్నారు. తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ ఇచ్చిన మాటను పార్లమెంటరీ ప్రక్రియలో నెరవేర్చిన గొప్ప నేత మన్మోహన్. రాజ్యసభలో రాజ్యాంగ సవరణపై వచ్చిన చర్చలో తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతుందన్న గందరగోళ పరిస్థితి ఏర్పడినప్పుడు మన్మోహన్ వ్యూహాత్మకంగా ప్రకటన చేయడంతోనే తెలంగాణ ఏర్పడింది.
నాటి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ఆయనతో మాట్లాడి సమన్వయపర్చారు. రాష్ట్రానికి పురుడు పోసిన డాక్టర్‌గా, తెలంగాణ బిల్లును ఉభయ సభల్లో ఆమోదింప జేసిన సారథిగా ఆయనను తెలంగాణ సమాజం ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటుంది. తెలంగాణ ప్రజల తరఫున రాజకీయాలు, పార్టీలకు అతీతంగా కృతజ్ఞతలు తెలపడమే కాకుండా ఘన నివాళి అర్పించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు సోనియాకు ఎంత రుణపడి ఉంటారో మన్మోహన్‌కూ అంతే రుణపడి ఉంటారు. గొప్ప ఆర్థికవేత్త అయిన మన్మోహన్‌సింగ్ విగ్రహాన్ని హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆవిష్కరించుకుందాం. ఆయన వర్ధంతి, జయంతి కార్యక్రమాలు చేసుకుందాం.
తెలంగాణ పట్ల ప్రత్యేక అభిమానం..
నేను మన్మోహన్ మరణవార్త తెలిసి హుటాహుటిన ఢిల్లీ వెళ్లి ఆయన కుటుంబాన్ని కలిసి తెలంగాణ సీఎంగా పరిచయం చేసుకున్నాను. మన్మోహన్ సతీమణి నాతో మాట్లాడారు. ‘మన్మోహన్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇచ్చారు. ఆయనకు తెలంగాణ పట్ల ప్రత్యేక అభిమానం ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి, ఆయన ఆశీస్సులు మీకు ఉంటాయి.’ అని ఆమె చెప్పారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన మన్మోహన్.. తన కుటుంబాన్ని అత్యంత నిరాడంబరంగా నడిపించారు.
ఆయనను కోల్పోవడం వారి కుటుంబానికే కాదు యావత్ దేశానికి, ప్రపంచానికి తీరని లోటు. మౌనంగా ఉంటారని, మౌన ముని అని, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని రకరకాలుగా విమర్శించినా సహనాన్ని కోల్పోకుండా పనినే ధ్యాసగా, జీవిత లక్ష్యంగా చేసుకున్న గొప్ప వ్యక్తి మన్మోహన్. నేను, ఉత్తమ్, కోమటిరెడ్డి ఎంపీలుగా ఉన్నప్పుడు పార్లమెంట్‌లో ధర్నా చేస్తుంటే.. మన్మోహన్ కూడా మా మధ్య కూర్చుని నిరసన తెలిపారు. మాకు జీవితకాలం గుర్తుండిపోయే ఘటన అది.
గొప్ప మానవతావాదం చూపారు
ఉపాధి హామీ, సమాచార హక్కు, విద్యా హక్కు, ఆహార భద్రత వంటి నిర్ణయాలతో మన్మోహన్ చరిత్ర సృష్టించారు. గతంలో ప్రభుత్వాలు యజమానులతో సంబంధం లేకుండా భూములను తీసుకునేవి. కానీ కేవలం భూమి కోల్పోయేవారికే కాకుండా కులవృత్తులు, చేతువృత్తులపై ఆధారపడిన వారు, ఇళ్లు లేనివారికి సహాయ పునరావాసం అందేలా 2013లో భూసేకరణ చట్టం తెచ్చి గొప్ప మానవతావాదం చూపించారు.
2006లో అటవీ హక్కుల చట్టాన్ని తీసుకురావడంతో ఆదివాసులు, గిరిజనులకు పోడుభూములకు పట్టాలు ఇవ్వగలుగుతున్నాం. గొప్ప పరిపాలన అందించడానికి అంబేడ్కర్ రాజ్యాంగం ఇచ్చి పునాదులు వేయగా.. ఆ స్ఫూర్తితో మన్మోహన్ చట్టాలు తెచ్చి ప్రజలకు మేలు చేశారు..’’ అని సీఎం రేవంత్ కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment