Telangana Legislative Assembly
-
మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం దేశ సర్వోన్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి రాష్ట్ర శాసనసభ తరఫున విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ఆర్థికవేత్త అయిన మన్మోహన్సింగ్.. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా, ఆర్బీఐ గవర్నర్‌గా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా వివిధ హోదాల్లో దేశానికి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. మన్మోహన్‌కు నివాళి అర్పించేందుకు సోమవారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి మాట్లాడారు. మాజీ ప్రధాని కుటుంబ సభ్యులకు సభ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. సభలో రేవంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్. 1991–96 మధ్య మన పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించారు. ఆర్థిక స్థితిగతుల దశదిశను మార్చిన సంస్కరణల అమల్లో కీలక పాత్ర పోషించారు. ఆ పునాదులతోనే నేడు భారతదేశం ప్రపంచంతో పోటీపడుతోంది. ఆయన దార్శనికత, కృషిని అంతా స్మరించుకోవాలి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మన్మోహన్ విగ్రహం మన్మోహన్సింగ్ దేశానికి, ప్రత్యేకంగా తెలంగాణకు చేసిన సేవలకు శాసనసభ అపార కృతజ్ఞతలు తెలియజేస్తోంది. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆయనకు రుణపడి ఉన్నారు. తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ ఇచ్చిన మాటను పార్లమెంటరీ ప్రక్రియలో నెరవేర్చిన గొప్ప నేత మన్మోహన్. రాజ్యసభలో రాజ్యాంగ సవరణపై వచ్చిన చర్చలో తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతుందన్న గందరగోళ పరిస్థితి ఏర్పడినప్పుడు మన్మోహన్ వ్యూహాత్మకంగా ప్రకటన చేయడంతోనే తెలంగాణ ఏర్పడింది. నాటి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ఆయనతో మాట్లాడి సమన్వయపర్చారు. రాష్ట్రానికి పురుడు పోసిన డాక్టర్‌గా, తెలంగాణ బిల్లును ఉభయ సభల్లో ఆమోదింప జేసిన సారథిగా ఆయనను తెలంగాణ సమాజం ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటుంది. తెలంగాణ ప్రజల తరఫున రాజకీయాలు, పార్టీలకు అతీతంగా కృతజ్ఞతలు తెలపడమే కాకుండా ఘన నివాళి అర్పించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు సోనియాకు ఎంత రుణపడి ఉంటారో మన్మోహన్‌కూ అంతే రుణపడి ఉంటారు. గొప్ప ఆర్థికవేత్త అయిన మన్మోహన్సింగ్ విగ్రహాన్ని హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆవిష్కరించుకుందాం. ఆయన వర్ధంతి, జయంతి కార్యక్రమాలు చేసుకుందాం. తెలంగాణ పట్ల ప్రత్యేక అభిమానం.. నేను మన్మోహన్ మరణవార్త తెలిసి హుటాహుటిన ఢిల్లీ వెళ్లి ఆయన కుటుంబాన్ని కలిసి తెలంగాణ సీఎంగా పరిచయం చేసుకున్నాను. మన్మోహన్ సతీమణి నాతో మాట్లాడారు. ‘మన్మోహన్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇచ్చారు. ఆయనకు తెలంగాణ పట్ల ప్రత్యేక అభిమానం ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి, ఆయన ఆశీస్సులు మీకు ఉంటాయి.’ అని ఆమె చెప్పారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన మన్మోహన్.. తన కుటుంబాన్ని అత్యంత నిరాడంబరంగా నడిపించారు. ఆయనను కోల్పోవడం వారి కుటుంబానికే కాదు యావత్ దేశానికి, ప్రపంచానికి తీరని లోటు. మౌనంగా ఉంటారని, మౌన ముని అని, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని రకరకాలుగా విమర్శించినా సహనాన్ని కోల్పోకుండా పనినే ధ్యాసగా, జీవిత లక్ష్యంగా చేసుకున్న గొప్ప వ్యక్తి మన్మోహన్. నేను, ఉత్తమ్, కోమటిరెడ్డి ఎంపీలుగా ఉన్నప్పుడు పార్లమెంట్లో ధర్నా చేస్తుంటే.. మన్మోహన్ కూడా మా మధ్య కూర్చుని నిరసన తెలిపారు. మాకు జీవితకాలం గుర్తుండిపోయే ఘటన అది. గొప్ప మానవతావాదం చూపారు ఉపాధి హామీ, సమాచార హక్కు, విద్యా హక్కు, ఆహార భద్రత వంటి నిర్ణయాలతో మన్మోహన్ చరిత్ర సృష్టించారు. గతంలో ప్రభుత్వాలు యజమానులతో సంబంధం లేకుండా భూములను తీసుకునేవి. కానీ కేవలం భూమి కోల్పోయేవారికే కాకుండా కులవృత్తులు, చేతువృత్తులపై ఆధారపడిన వారు, ఇళ్లు లేనివారికి సహాయ పునరావాసం అందేలా 2013లో భూసేకరణ చట్టం తెచ్చి గొప్ప మానవతావాదం చూపించారు. 2006లో అటవీ హక్కుల చట్టాన్ని తీసుకురావడంతో ఆదివాసులు, గిరిజనులకు పోడుభూములకు పట్టాలు ఇవ్వగలుగుతున్నాం. గొప్ప పరిపాలన అందించడానికి అంబేడ్కర్ రాజ్యాంగం ఇచ్చి పునాదులు వేయగా.. ఆ స్ఫూర్తితో మన్మోహన్ చట్టాలు తెచ్చి ప్రజలకు మేలు చేశారు..’’ అని సీఎం రేవంత్ కొనియాడారు. -
నేడు శాసనసభ ప్రత్యేక భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ నేడు ప్రత్యేకంగా సమావేశం కానుంది. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ మృతికి నివాళులర్పించే ఎజెండాతో సోమవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. సంతాప ప్రతిపాదనను ప్రవేశపెట్టి, మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలను ఉటంకించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన పాత్రను విశదీకరిస్తూ ప్రసంగించనున్నారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఈ సమావేశంలో మన్మోహన్ సింగ్ సేవల గురించి ప్రసంగించనున్నారు.సంతాప తీర్మానాన్ని ఆమోదించాక సభ వాయిదా పడనుంది. కాగా, సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు ఆదివారం పరిశీలించారు. సభ నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సిబ్బందిని స్పీకర్ ఆదేశించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్లతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడిన స్పీకర్.. సమావేశాల నిర్వహణకు అవసరమైన సహకారాన్ని అందించాలని కోరారు. అది మన బాధ్యత.. ఎంపీ మల్లురవి: మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను స్మరించుకోవడం మన బాధ్యత అని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి అభిప్రాయపడ్డారు. ఆయనను గుర్తు చేసుకునేందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినందుకు మల్లు రవి.. సీఎం రేవంత్‌రెడ్డికి ఆదివారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. గొప్ప మేధావికి తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న నివాళిగా ఈ సమావేశం నిలిచిపోతుందని మల్లు రవి పేర్కొన్నారు. -
తెలంగాణ తల్లి.. మన అమ్మ రూపమే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ ప్రతీక, భావన, అస్తిత్వం ఉట్టిపడేలా తెలంగాణ తల్లి రూపం ఉండాలని కవులు, కళాకారులతోపాటు తెలంగాణ సంస్కృతి పట్ల అంకితభావం కలిగిన వారందరితో చర్చించాం. తెలంగాణ మూర్తి దేవతలా వజ్ర వైఢూర్యాలు, భుజకీర్తులు, కిరీటాలతో ఉండాలా? మన అమ్మలా ఉండాలా? అనే ప్రస్తావన వచ్చింది. దేవత గుడిలో ఉంటుంది. తల్లి ఇంట్లో ఉంటుంది. తల్లి ప్రతిరూపమే ఉండాలని మేధావులు సూచించారు. తెలంగాణ తల్లిని చూస్తే సొంత మాతృమూర్తిని చూసిన భావన కలుగుతుంది’’అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై సోమవారం ఉదయం శాసనసభలో ఆయన ప్రకటన చేశారు. రేవంత్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ దురదృష్టవశాత్తూ కొందరికి నచ్చలేదు. ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక పార్టీ ఆలోచనే 4 కోట్ల ప్రజల ఆలోచన అనుకోవడం సమంజసం కాదు. మధ్యయుగాల నాటి చక్రవర్తుల ఆలోచనతో ప్రజాప్రభుత్వం నడవదు. రాష్ట్రానికి గుండెకాయ లాంటి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాం. ఎలాంటి రాజకీయ వివాదాలకు తావులేకుండా 4 కోట్ల ప్రజలు ఏకమై జరుపుకొంటే బాగుంటుంది. బిడ్డల భావోద్వేగానికి నిండైన రూపం.. నాలుగు కోట్ల మంది బిడ్డల భావోద్వేగానికి నిండైన రూపం తెలంగాణ తల్లి. మన సాంప్రదాయాలు, సంస్కృతులు, చారిత్రక నేపథ్యాలను పరిగణనలోకి తీసుకుని ఒక నిండైన రూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ప్రశాంత వదనం, సాంప్రదాయ కట్టూ»ొట్టు, మెడకు కంఠె, గుండు పూసల హారం, చెవులకు బుట్ట కమ్మలు, ముక్కు పుడకతో బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీరలో, చేతికి గాజులు, కాళ్లకు కడియాలు, మెట్టెలతో, చాకలి ఐలమ్మ, సమ్మక్క – సారలమ్మ పోరాట స్ఫూర్తితో, హుందాతనంతో కూడిన ఆహార్యంతో మన తెలంగాణ తల్లి రూపుదిద్దుకుంది. కుడిచేతితో జాతికి అభయమిస్తూ, ఎడమ చేతిలో తెలంగాణ మాగాణంలో పండే వరి, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్నతో... మన సంస్కృతి, సాంప్రదాయానికి నిలువెత్తు రూపంగా తెలంగాణ తల్లి రూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది. తెలంగాణ తల్లి నిలబడిన పీఠం మన చరిత్రకు దర్పణంగా రూపొందించాం. ఉద్యమాలు, పోరాటాలు, అమరుల ఆత్మ బలిదానాలకు సంకేతంగా బిగించిన పిడికిళ్లను పీఠంలో పొందుపరిచాం. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని ప్రపంచంలోనే సమున్నతంగా నిలబెట్టాలన్న లక్ష్యాన్ని గుర్తు చేస్తూ.. చేతులన్నీ కలిపి పీఠాన్ని మోస్తున్న తీరు తెలంగాణ పునర్నిర్మాణ రీతిని తెలియజేస్తుంది. ఆ వర్ణాలకు గొప్ప తాత్వికత ఉంది.. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో వాడిన వర్ణాలకు గొప్ప తాత్వికత ఉంది. ‘గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిను తడుపంగ’అనే అందెశ్రీ గీతంలోని తెలంగాణ జలదృశ్యానికి పీఠంలోని నీలం వర్ణం ప్రతీకగా నిలుస్తుంది. ‘పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగ’అనే తెలంగాణ సస్యశ్యామల వ్యవసాయ కీర్తికి సంకేతంగా ఆకుపచ్చ వర్ణం కనిపిస్తుంది. మార్పుకు, ప్రగతికి, చైతన్యానికి ప్రతీకగా ఎరుపు వర్ణం నిలుస్తుంది. శుభానికి, ఐశ్వర్యానికి, సమృద్ధికి నిదర్శనంగా బంగారు వర్ణం నిలబడుతుంది. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగంగా ఉద్యమకాలం నాటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ సంక్షిప్త నామంగా ‘టీజీ’ని.. రాష్ట్ర అధికారిక గీతంగా ‘జయ జయహే తెలంగాణ..’ను ఇప్పటికే ప్రకటించాం. సోనియా పుట్టినరోజు కావడంతో.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని 2009 డిసెంబర్ 9న నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరడానికి పునాది పడిన రోజు అది. సోనియా గాంధీ జన్మదినం ఇదే రోజు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపి తెలంగాణ ప్రజలు కృతజ్ఞత చూపాల్సిన అవసరం ఉంది. తెలంగాణ కోసం శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య, ఇషాన్‌రెడ్డి ఆత్మబలిదానాలు చేశారు. కళ్ల ముందే ఇందిరా గాందీ, రాజీవ్ గాంధీ నేలకొరగడంతో.. బలిదానాల బాధ ఆమెకు తెలుసు. అందుకే ఎన్ని అడ్డంకులొచ్చినా తెలంగాణ ఇచ్చారు. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు స్వరాష్ట్ర పోరాటంలో సకల జనులు, సబ్బండ వర్గాలను ఐక్యం చేసి లక్ష్యసాధన వైపు నడిపించిన శక్తి స్వరూపిణి తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లికి సంబంధించి పలు రూపాలు జనబాహుళ్యంలో ఉన్నా దేనికీ అధికారిక గుర్తింపు లేదు. మాతృమూర్తిని గౌరవించుకునేందుకు ప్రజాప్రభుత్వం ‘తెలంగాణ తల్లి’కి రూపకల్పన చేసింది. తెలంగాణ ఏర్పడ్డాక 10 ఏళ్లు రాష్ట్ర అధికారిక గీతం, అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం లేకపోవడం ఒక లోటు. ఇక ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించాం. -
నాన్న ప్రోత్సాహంతో ముందుకెళ్తున్నా..
పాలకుర్తి: నా జీవిత ప్రయాణంలో నాన్న ప్రోత్సాహం ఎంతో ఉంది. మేం ఇద్దరం అక్కాచెల్లెళ్లం. నాన్న హైదరాబాద్‌లో బీటెక్ వరకు చదివించారు. వివాహం తర్వాత అమెరికాలో మేనేజర్‌గా పనిచేశా. మా అత్తమ్మ ఝాన్సీరెడ్డి ఆహ్వానంతో రాజకీయాల్లోకి వచ్చా. ఇందులో మా నాన్న మామిడాల తిరుపతిరెడ్డి ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాన్న వెన్నంటి ఉండి నడిపించారు. ఆయన ప్రోత్సాహంతో సభలు, సమావేశాల్లో పాల్గొన్నా. ఘన విజయం సాధించా. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా.– మామిడాల యశస్వినిరెడ్డి, ఎమ్మెల్యే, పాలకుర్తి -
అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తోంది : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో రైతులు దర్జాగా పంటలు పండిస్తున్నారని తెలిపారు. శాసనసభలో ప్రతిపక్ష సభ్యుల తీరుపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. సభలో చర్చోపచర్చలు ఉంటాయని.. ప్రతిపక్షాలు హుందాగా వ్యహరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంచడంపై దృష్టి సారించామని తెలిపారు. రైతుబంధు పథకాన్ని ఐకరాజ్యసమితి అభినందించిందని గుర్తచేశారు. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో విజయ డెయిరీని నాశనం చేశారమని మండిపడ్డారు. అప్పుల్లో ఉన్న విజయ డెయిరీని తాము లాభాల్లోకి తెచ్చామని చెప్పారు. ఇది తెలంగాణ సాధించిన ప్రగతి కాదా అని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతను మోసం చేయడం మానుకోవాలని ప్రతిపక్షాలకు హితవుపలికారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలో కోత.. కందుల కొనుగోలుకు ప్రభుత్వం రూ. 300 కోట్లు విడుదల చేసి కంది రైతులను ఆదుకుందని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో 34 శాతం వృద్ధి సాధించామని చెప్పారు. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. ఎన్నికల హామీ కాకపోయిన కళ్యాణలక్ష్మి అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ. 2 లక్షల కోట్లకు పైగా వెళ్లాయని.. కానీ కేంద్రం నుంచి లక్షా 12 వేల కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయని అన్నారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాల్లో కోత పెట్టారని విమర్శించారు. దేశాన్ని నడిపించే నాలుగైదు రాష్ట్రాల్లో తెలంగాణ మొదటిది అని అన్నారు. రెండేళ్లల్లో సగానికి సగం అప్పులు తీరిపోతాయి.. నీటిపారుదల శాఖపై లక్షల కోట్ల రూపాయలు పెట్టామని చెప్పారు. రైతులు పంటలు పండిస్తే రెండేళ్లలోనే సగానికి సగం అప్పులు తీరిపోతాయని అన్నారు. రాష్ట్రంలో 2 లక్షల టన్నులకు పైగా సన్న బియ్యం పంట పండబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే సంక్షేమ పథకాలను ఎలా కొనసాగిస్తున్నామని ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘతన తమదేనని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్య రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. పాతబస్తీలో మెట్రో ఏర్పాటును పరిశీలిస్తున్నామని అన్నారు. అవసరమైతే మళ్లీ మద్యం ధరలు పెంపు.. కాంగ్రెస్ ఎప్పుడైనా మద్య నిషేధం చేసిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హాయాంలో వీధివీధికి సారా తయారు ఉండేదన్నారు. మద్యపానాన్ని తగ్గించేందుకే రెట్లు పెంచామని.. అవసరమైతే మళ్లీ మద్యం ధరల పెంపు నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంపు అనేది ఉంటుందన్నారు. తెలంగాణ ఏర్పడితే లక్ష కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయని చెప్పామని అన్నారు. 70 ఏళ్ల చరిత్రలో గత ప్రభుత్వాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతను మోసం చేయడం మానుకోవాలని ప్రతిపక్షాలకు హితవుపలికారు. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. -
4 సవరణ బిల్లులకు సభ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: లాభదాయక పదవుల జాబితా నుంచి 29 చైర్మన్ పదవులను మినహాయిస్తూ సవరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. ఈ చట్టం నుంచి హెచ్ఎండీఏ చైర్మన్, వైస్ చైర్మన్, మెంబర్స్, డైరెక్టర్లు, రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ ప్రాంతీయ బోర్డుల డైరెక్టర్లు, రాష్ట్ర రైతు సమన్వయ సమితి, ఎంబీసీ, మూసీ రివర్ ఫ్రంట్, కార్మిక సంక్షేమ బోర్డు, సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్లు, యాదగిరిగుట్ట, వేములవాడ దేవాలయ అభివృద్ధి సంస్థలు తదితరాల చైర్మన్లను మినహాయిస్తూ ప్రతిపాదించిన సవరణ బిల్లుకు ఆదివారం సభ ఆమోదం తెలిపింది. తెలంగాణ పేమెంట్ ఆఫ్ శాలరీస్, పెన్షన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్, 1953 (యాక్ట్ 2 ఆఫ్ 1954) సెక్షన్ 10లో పొందుపరిచిన మేరకు.. వివిధ సంస్థల చైర్మన్లుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటే వారు లాభదాయక పదవులు కలిగి ఉన్నందుకు అనర్హత వేసే నిబంధన వర్తించకుండా గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా గతంలో 23 చైర్మన్ పదవులుండగా, తాజాగా ఆ జాబితాలో మరో 29 చైర్మన్ పదవులను అదనంగా కలుపుతూ సవరణ చట్టం చేశారు. ఇంకా జాబితాలోకి తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు, తెలంగాణ స్టేట్ రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్, కులీ కుతుబ్‌షా అర్బన్ డెవలప్మెంట్ అ«థారిటీ, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్, స్పోర్ట్స్ అ«థారిటీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ స్టేట్ షీప్, గోట్ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్, హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ, తెలుగు అకాడమీ, హాకా, తెలంగాణ అధికార భాషా సంఘం, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, స్టేట్ హజ్ కమిటీ, తెలంగాణ ఫుడ్ కమిషన్, సెట్విన్, తెలంగాణ సాహిత్య అకాడమీ, టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కమ్స్, తెలంగాణ స్టేట్ యోగాధ్యయన పరిషత్ చైర్మన్ పదవులున్నాయి. ఈ మేరకు ఆర్థికమంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టిన సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. మరో మూడు సవరణ బిల్లులకు ఆమోదం... వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సవరణ, అభయహస్తం పథకం, మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) కో కాంట్రిబ్యూటరీ పింఛను చట్టం రద్దు, తెలంగాణ లోకాయుక్త–2020 సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. కేంద్రం ఆదేశించిన మేరకు సీజీఎస్టీ చట్టానికి అవసరమైన సవరణలు చేసుకోవడంలో భాగంగా ఈ చట్ట సవరణ చేపడుతున్నట్టు సీఎం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సభలో తెలిపారు. ఇందులో భాగంగా టీడీఎస్ సమయం పొడిగింపు అధికారం కమిషనర్‌కు ఇవ్వడం, రిజిస్ట్రేషన్‌కు తప్పనిసరిగా ఆధార్ కార్డు చూపడం, తదితరాలను చేర్చారు. లోకాయుక్త చట్టంలో ఏపీ ఉన్న చోట తెలంగాణగా మార్పు చేస్తూ 2019లో తెలంగాణ చట్టం తీసుకురాగా, గతంలో లోకాయుక్త పదవికి మాజీ చీఫ్ జస్టిస్‌ను నియమించాలని ఉంటే ఆ స్థానంలో రిటైర్డ్ జడ్జిని నియమించుకునేలా చట్ట సవరణ చేశారు. ఈ చట్ట సవరణను హరీశ్‌రావు ప్రతిపాదించగా సభ ఆమోదించింది. అభయహస్తం కింద 60 ఏళ్లకు పైబడిన వారికి నెలకు రూ.500 చొప్పున పింఛన్లు ఇస్తుండగా, ప్రస్తుతం ఆసరా వృద్ధాప్య పించన్లను 57 ఏళ్ల వారికి కూడా రూ.2,016కు పెంచి ఇస్తున్నందున గతంలోని అభయహస్తం పథకం రద్దుకు ఈ చట్టసవరణ ప్రతిపాదించిన పీఆర్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. అదేవిధంగా ఎస్‌హెచ్‌జీ ఉమెన్ కో కాంట్రిబ్యూటరీ పింఛన్ చట్టం రద్దుకు చట్ట సవరణ ద్వారా ప్రతిపాదించినట్టు తెలియజేశారు. ఈ చట్ట సవరణలకు శాసనసభ ఆమోదం తెలిపింది. -
మన వ్యవసాయ కేటాయింపులు జాతీయసగటు కంటే ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం గత ఐదేళ్లలో మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో పది శాతాన్ని దీనికే కేటాయించటం గొప్ప పరిణామమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి శనివారం శాసనసభలో వెల్లడించారు. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. జాతీయ స్థాయిలో వ్యవసాయానికి కేటాయించిన మొత్తం బడ్జెట్ పద్దులో కేవలం 6.5% మాత్రమేనన్నారు. బడ్జెట్ పద్దులపై చర్చ అనంతరం ఆయన సమాధానమిచ్చారు. ‘రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు కేటాయింపులు గొప్పగా ఉన్నాయి. నాడు బోరుబావి వేసి బాగుపడినవాడు లేడు, నేడు చెరువుల కింద సాగు చేసి చెడిపోయిన వాడు లేడు. అమెరికాలాంటి అగ్రరాజ్యాల్లో కూడా సాగుకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన దాఖలాలు కనిపించవు. సంక్షోభం నుంచి వ్యవసాయరంగాన్ని గట్టెక్కించాలంటే రైతుబంధు అమలు ఉత్తమ మార్గమని నీతిఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేశ్‌చంద్ అన్నారు. పంటల బీమా విషయంలో కేంద్రం చొరవ చూపనందున రాష్ట్ర రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. కౌలు రైతులకు కూడా రైతుబంధులాంటిది వర్తింప చేయాలని కొందరు సభ్యులు చేసిన సూచనపై ఆయన స్పంచారు. రాష్ట్రంలో కౌలు రైతు విధానం స్థిరంగా లేదని, తరచూ కౌలుదారులను మార్చటం వల్ల ఎప్పుడు ఎవరు కౌలు చేస్తారో తెలియని స్థితి ఉంటోంది. మాంద్యాలు వచ్చినప్పుడు తట్టుకునే శక్తి సహకార రంగాలకు ఉంటుంది. కేరళలో అన్ని సహకార సంఘాలకు కలిపి రూ.60 వేల కోట్ల నిధులున్నాయి. తెలంగాణలో అలాంటి పటిష్ట విధానాలను రూపొం దించి అంతకు రెట్టింపు నిధులు సమకూరేలా చేసే అవకాశం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. -
బడ్జెట్ సమావేశాలు కుదింపు!
సాక్షి, హైదరాబాద్: ‘కోవిడ్’పై అనేక ముందు జాగ్రత్తలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలనూ కుదించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ నెల 6న ప్రారంభమైన శాసనసభ సమావేశాలు 20న ముగియాల్సి ఉంది. కోవిడ్‌పై అసెంబ్లీ కమిటీ హాల్లో శనివారం మధ్యాహ్నం సీఎం.. ప్రభుత్వ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం, రాత్రి ప్రగతి భవన్లో మంత్రి మండలి సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను కుదించాలని శనివారం ఉదయమే ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాలను 16వ తేదీతో ముగించాలని నిర్ణయించారు. దీంతో సభ కార్యకలాపాల షెడ్యూలులోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 8న రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2020–21ను ప్రవేశ పెట్టారు. 2 రోజుల సాధారణ చర్చ అనంతరం, శుక్ర, శనివారాల్లో శాఖల వారీగా బడ్జెట్ పద్దులపై చర్చలు జరిగాయి. ఇప్పటి వరకు 15 పద్దులపై చర్చించి శాసనసభ ఆమోదించింది. 16 నుంచి 19 వరకు మరో 25 పద్దులౖ పె చర్చించేలా బీఏసీలో తొలుత షెడ్యూలు సిద్ధం చేశారు. తాజాగా సమావేశాలను కుదించాలని నిర్ణయించడంతో 15, 16 తేదీ ల్లోనే సమావేశాలు జరగనున్నాయి. బీఏసీ షెడ్యూలులో 15న, ఆదివారం విరామం ప్రకటించగా, ప్రస్తుత పరిస్థితుల్లో నేడు కూడా పద్దులపై చర్చిస్తారు. 25 పద్దులకు గాను నీటిపారుదల, విద్య, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్ వంటి కీలక పద్దులకే చర్చను పరిమితంచేసే అవకాశం ఉంది. చర్చకు నోచుకోని మిగతా పద్దులను గిలొటిన్ చేసే అవకాశముంది. 20న ప్రవేశ పెట్టాల్సిన ద్రవ్య వినిమయ బిల్లును 16న ప్రవేశపెట్టి ఆమోదించి, సభను నిరవధిక వాయిదా వేస్తారు. సోమవారం మండలి సమావేశం ఈ నెల 6 నుంచి 14 వరకు జరిగిన శాసన మండలి.. బీఏసీ నిర్ణయం మేరకు తిరిగి 20న సమావేశం కావాల్సి ఉంది. తాజాగా మండలి షెడ్యూల్లోనూ మార్పులు చేశారు. ఈ నెల 16న సమావేశమయ్యే శాసన మండలి ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించిన తర్వాత నిరవధికంగా వాయిదా పడనుంది. ఈ మేరకు శాసనమండలిని సోమవారానికి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వాయిదా వేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. కాగా బీఏసీ సభ్యుల అభిప్రాయం తీసుకున్నాకే అసెంబ్లీ సమావేశాలను కుదించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాగా, ఆది, సోమవారాల్లో ప్రశ్నోత్తరాలను శాసనసభ నిబంధన 38 కింద రద్దు చేస్తున్నట్టు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు శనివారం రాత్రి బులెటిన్ విడుదల చేశారు. -
త్వరలోనే విద్యుత్ చార్జీల పెంపు : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : త్వరలోనే విద్యుత్ చార్జీల పెంపు ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. విద్యుత్ చార్జీలు పెంచకుంటే ఆ సంస్థల మనుగడ ఎలా అని ప్రశ్నించారు. దళితులు, గిరిజనులకు 101 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నామని.. వాళ్లకు ఎలాంటి పెంపు ఉండదన్నారు. పేదలకు ఇబ్బంది కలిగించబోమని స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో పల్లె ప్రగతిపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ చట్టాన్ని కఠిన తరం చేశామని చెప్పారు. జవాబుదారీతనం లేని ఉద్యోగులను తీసేస్తామన్నారు. గ్రామ పంచాయతీలకు సక్రమంగా నిధులు విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. తక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు కూడా నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి చాలా మంది విరాళాలు ఇచ్చారని.. వారికి తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. గ్రామ కార్యదర్శుల సంఖ్య పెంచామని గుర్తుచేశారు. పల్లెప్రగతి ద్వారా గ్రామీణ తెలంగాణ స్వరూపం మారుతోందన్నారు. 3 వేలకు పైగా గిరిజన ప్రాంతాలను పంచాయతీలుగా మార్చామని అన్నారు. గిరిజనుల సెంటిమెంట్లను గౌరవిస్తున్నట్టు తెలిపారు. -
కేసీఆర్ ప్రకటన.. కరెంట్ చార్జీల పెంపు
-
‘కేసీఆర్ రైతుబంధు’గా పేరు పెట్టాలి
సాక్షి, హైదరాబాద్ : సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, పంట సీజన్ రాగానే రైతుల అకౌంట్లలో పెట్టుబడి సాయం పడుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. దీంతో రైతులు బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లడం మానేశారని, వ్యవసాయాన్ని వదిలేసిన వారు కూడా ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతగానో ఆలోచించి ఇలాంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చారని, ఈ పథకం స్ఫూర్తితోనే కేంద్రం కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తెచ్చిందన్నారు. ఇలా దేశానికి స్ఫూర్తిదాయకమైన ఈ పథకానికి ‘కేసీఆర్ రైతుబంధు’గా నామకరణం చేయాలని పేర్కొన్నారు. ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టు కావడంతో తమ నియోజకవర్గమైన భూపాలపల్లికి 31 ఏళ్ల కిందట కాలువలు తవ్వినా ఒక్క రోజు కూడా నీళ్లు రాలేదన్నారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుతో కాకతీయ కాలువలో 150 రోజుల నుంచి నీళ్లు పారుతున్నాయన్నారు. విమర్శలు చేసే వారంతా ఈ ప్రాజెక్టును చూస్తే వారి అభిప్రాయం మారిపోతుందన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ ఎమ్మెల్యేలు ఓసారి ప్రాజెక్టును చూసి రావాలని సూచించారు. ధాన్యం ఇతర పంటలను ఎక్స్‌పోర్టు చేసేందుకు రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికలు ముగిశాక కూడా కొత్త పథకాలు బడ్జెట్లో గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట వేశారని, పట్టణాభివృద్ధికి చర్యలు వేగవంతం చేశారన్నారు. వరంగల్ లాంటి పట్టణాల్లో ఐటీ విస్తరణకు మంత్రి కేటీఆర్ విశేష కృషి చేస్తున్నారు. ఏ ప్రభుత్వాలైనా ఎన్నికల ముం దు పథకాలు తీసుకురావడం సాధారణమని, కేసీఆర్ మాత్రం ఎన్నికలు పూర్తయ్యాక కూడా కొత్తపథకాలు తెస్తున్నారన్నారు. సరిపడా విద్యుత్, నీరు అందుబాటులో ఉండటం వల్ల భూములు అమ్మకుండా వ్యవసాయం చేస్తు న్నారని పేర్కొన్నారు. అందుకే ఎస్సీ, ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా భూమి లభించట్లేదన్నారు. -
ఇది వాస్తవిక బడ్జెట్ : అక్బరుద్దీన్
సాక్షి, హైదరాబాద్ : దేశం ఆర్థిక తిరోగమనం వైపు పయనిస్తోన్న దశలో సొంత ఆదాయ వనరులపై ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా ఉందని, ఇది వాస్తవిక బడ్జెట్ అని ఎంఐఎం పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి తగినంత సహకారం అందడం లేదని, అందుకే రాష్ట్రంపై అప్పుల భారం పెరిగిపోతోందని ఆయన విమర్శించారు. 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ నెల 8న ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చను బుధవారం అక్బరుద్దీన్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రాలు ఆశించినంతగా నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి నిరాశ కలిగించే బడ్జెట్ కేంద్ర బడ్జెట్ అని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు స్పెషల్ గ్రాంటు ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసినా కేంద్రం ఇవ్వలేదని, కాళేశ్వరం నిర్వహణ ఖర్చులు ఇవ్వాలని, జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరినా పట్టించుకోలేదన్నారు. కేంద్ర పన్నుల వాటా, గ్రాంటులు కలిపి రాష్ట్రానికి పెరిగింది రూ.513 కోట్లేనన్నారు. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పలేదని, ఇప్పుడు కరెంటు చార్జీలు పెరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయన్నారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. గృహ వినియోగదారులపై చార్జీల పెంపు ప్రభావం ఉంటుందా లేదా అన్న దానిపై స్పష్టత ఇవ్వాలన్నారు. మోటారు వాహనాల రంగం సంక్షోభంలో ఉన్న దశలో మోటారు వాహనాల పన్ను పెంచుకుంటా మని ఎలా ప్రతిపాదించారో అర్థం కావట్లే దన్నారు. భూముల విక్రయాల ద్వారా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు సఫలం కాలేదన్నారు. గత ఐదేళ్లలో దీనిపై రూ.3,987 కోట్లు మాత్రమే వచ్చాయని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. వడ్డీలు రెండున్నర రెట్లు పెరిగాయి.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు రూ.2.29 లక్షల కోట్లకు చేరాయని, అప్పులు ఎఫ్ఆర్బీఎం చట్టానికి అనుగుణంగానే ఉన్నప్పటికీ వడ్డీ చెల్లింపులు రెండున్నర రెట్లు పెరిగాయని అక్బరుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించినందుకు ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో రూ.2 వేల కోట్లు పాతబస్తీ అభివృద్ధి కోసం కేటాయించాలని కోరారు. ఏటా ఇచ్చే రూ.10 వేల కోట్లను ఎలా ఖర్చు చేయాలనే దానిపై నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులతో మున్సిపల్ మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందించాలని కోరారు. గతంలో వైఎస్సార్ అధి కారంలో ఉన్నప్పుడు పాతబస్తీకి ప్రత్యేకంగా రూ.2 వేల కోట్ల నిధులు కేటాయించారని, ఆ తర్వాత పట్టించుకున్న వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఉర్దూ లేకుండా పోతోందని, ఖాళీలు భర్తీ చేయడం లేదని పేర్కొన్నారు. ఐటీని ఓల్డ్ సిటీ వైపు విస్తరించాలని, డబుల్ బెడ్రూం ఇళ్లను మైనారిటీలకు కూడా కేటాయించాలని కోరారు. రేషన్ కార్డులు ఇవ్వాలని, పీఆర్సీ అమలు చేయాలని, వక్ఫ్ బోర్డు బలోపేతానికి చర్యలు చేపట్టాలని కోరారు. -
‘ఆ రూట్లో.. ట్రామ్ లేదా బీఆర్టీఎస్ ఏర్పాటు’
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి జేఎన్టీయూ నుంచి హైటెక్‌సిటీ వరకు ఎలివేటెడ్ పద్ధతిలో బీఆర్టీఎస్ కారిడార్ గాని ట్రామ్ ట్రాన్స్‌పోర్టు విధానాన్ని కాని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన శాసనసభకు తెలిపారు. జేఎన్టీయూ నుంచి హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో కారిడార్ నిర్మించాలని, తీవ్ర రద్దీ పెరిగిన సుచిత్ర కూడలి నుంచి కూడా ఈ తరహా ఏర్పాటు అవసరమని, కానీ అక్కడ మెట్రో నిర్మాణానికి వీలుగా స్థలం లేనందున కనీసం ఎంఎంటీఎస్నైనా ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ సభ్యుడు వివేకానంద కోరారు. జేఎన్టీయూ నుంచి హైటెక్‌సిటీ వైపు రద్దీ తీవ్రంగా ఉన్నందున అక్కడ ప్రత్యేక వ్యవస్థ అవసరమని, అయితే ట్రామ్ మార్గాన్ని గాని ఎలివేటెడ్ కారిడార్ ద్వారా బీఆర్టీఎస్ విధానాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి పేర్కొన్నారు. మెట్రో రైళ్లలో పాస్‌ను ప్రవేశపెట్టే అంశం కూడా పరిశీలనలో ఉందని, ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా రాత్రివేళ వాటి సమయాన్ని పొడిగించే యోచనలో ఉన్నామన్నారు. ప్రస్తుతం 20 వేల ద్విచక్రవాహనాలు, 400 కార్లు నిలిపేందుకు వీలుగా వివిధ ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లలో పార్కింగ్ సౌకర్యం కల్పించామని, త్వరలో 20 ప్రాంతాల్లో మల్టీలెవల్ పార్కింగ్ టవర్లు నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు వ్యయం రూ.14,500 కోట్లు కాగా, వయబిలిటీ గ్యాప్ ఫండ్‌గా 10 శాతం మొత్తాన్ని కేంద్రప్రభుత్వం భరించిందని, అందులోనూ ఇంకా రూ.2 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. ఎంజీబీఎస్ నుంచి 5 కి.మీ. దూరంలో ఉన్న ఫలక్‌నుమా వరకు వీలైనంత త్వరలో మెట్రో రైలు కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. -
రాష్ట్రానికి క్షేమం కాదు : భట్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2020–21 బడ్జెట్ ఏమాత్రం క్షేమకరం కాదని, బడ్జెట్లో సామాజిక స్పృహ లోపించిందని కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. అభూత కల్పనలతో సాధ్యాసాధ్యాలను అంచనా వేయకుండా రూ. 1.82 లక్షల కోట్ల బడ్జెట్‌ను పెట్టి ప్రభుత్వం సభను, ప్రజలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. కేవలం అప్పులు, మద్యం విషయంలోనే బడ్జెట్లో అభి వృద్ధి కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఇది రాష్ట్ర ఆరోగ్యానికి మంచిది కాదన్నారు. బడ్జెట్‌పై బుధవారం అసెంబ్లీలో జరిగిన సాధారణ చర్చలో ఆయన ప్రసంగిం చారు. ప్రభుత్వం చూపిన ద్రవ్యలోటు రూ. 33 వేల కోట్లను పూడ్చుకొని మరో రూ. 30 వేల కోట్ల పన్నేతర ఆదాయాన్ని రాబడితే కానీ బడ్జెట్ వాస్తవ రూపంలోకి రాదన్నారు. రూ. 1.82 లక్షల కోట్ల బడ్జెట్లో ద్రవ్యలోటు, పన్నేతర ఆదాయం కింద చూపిన రూ. 63 వేల కోట్ల రాబడి ప్రశ్నార్థకం కానుందన్నారు. మద్యం అమ్మకాలు నియంత్రించాలి... గత బడ్జెట్లో మద్యం అమ్మకాల ద్వారా రూ. 12 వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం... ఈసారి దానికి అదనంగా రూ. 16 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకోవడం ఏమిటని భట్టి ప్రశ్నించారు. ఏ ప్రభుత్వమైనా మద్యం అమ్మకాలను తగ్గించాలని ప్రయత్నిస్తుంది కానీ ఈ ప్రభుత్వం మాత్రం ‘తాగండి.. తాగండి.. తాగండి, అమ్మండి..అమ్మండి..అమ్మండి’ అనే రీతిలో వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే వెంటనే మద్యం అమ్మకాలను నియంత్రించాలని, బెల్టు షాపులను ఎత్తివేయాలని భట్టి డిమాండ్ చేశారు. రాజీవ్ స్వగృహ ఇళ్లు అమ్మొద్దు... పన్నేతర ఆదాయం కింద చూపిన రూ. 30 వేల కోట్లను ఎక్కడి నుంచి తెస్తారని భట్టి ప్రశ్నించారు. భూములు అమ్ముతారా? రాజీవ్ స్వగృహ ఆస్తులు అమ్ముతారా? దిల్ భూములు అమ్ముతారా... ఏ మార్గంలో పన్నేతర ఆదాయం వస్తుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పేద, మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ఉద్దేశించిన రాజీవ్ స్వగృహ ఇళ్లను అమ్మొద్దని, వాటిని పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల కింద కేటాయించాలని కోరారు. 2007–08లో ప్రభుత్వం వేలం వేసిన భూములను కొన్ని సంస్థలు కొని నిరర్ధకంగా వదిలివేశాయని, ఆ భూములను మళ్లీ తీసుకొని వాటిని ప్రస్తుత ధరల్లో అమ్మడం ద్వారా అదనపు ఆదాయాన్ని రాబట్టుకోవచ్చని సూచించారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల్లో వివక్ష.. ప్రభుత్వం గత ఆరేళ్లలో ఏ ఒక్కరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదని భట్టి ఆరోపించారు. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన మౌలిక సౌకర్యాల వల్ల ఐటీ రంగం అభివృద్ధి చెందిందే తప్ప ఇందులో టీఆర్ఎస్ సాధించిందేమీ లేదన్నారు. పరిశ్రమల స్థాపనలో సర్కారు వివక్ష చూపుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ పెద్దలతో సంబంధాలున్న వారికి, ప్రజాప్రతినిధులకు వాటాలున్న కంపెనీలకు ప్రత్యేక జీవోలిచ్చి ప్రోత్సాహకాలిస్తున్నారని, మిగిలిన మధ్య, చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పౌల్ట్రీ రంగంలో పెద్ద అవినీతి జరిగిందని, పౌల్ట్రీ రైతుకు సబ్సిడీపై ఇవ్వాల్సిన మొక్కజొన్నలను బడా కంపెనీలు గంపగుత్తగా టన్ను రూ. 18 వేలకు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రూ. 26 వేలకు బయట అమ్ముకుంటున్నాయని, దీనిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని భట్టి డిమాండ్ చేశారు. విద్యకు కేటాయింపులు పెంచాలి... యూనివర్సిటీలకు కేటాయించిన మొత్తం జీతాలు, ఇతర ఖర్చులకు సరిపోవని భట్టి అభిప్రాయపడ్డారు. పీహెచ్డీ విద్యార్థులు కేటరింగ్ పనులకు వెళ్లి చదువుకోవాల్సి వస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో 58.71 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో కేవలం 5.14 శాతం అంటే 3.02 లక్షల మంది మాత్రమే చదువుకోగలుగుతున్నారని చెప్పారు. 46.82 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారని, విద్యకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలని కోరారు. ప్రాజెక్టుల నిర్మాణం ఎంత కాలం? బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు చూపినా వాటిని ఎలా ఖర్చు పెడతారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వ అప్పులు, గ్యారంటీలు కలపి రూ. 3.19 లక్షల కోట్లకు చేరాయని, బడ్జెట్లో రూ. 22 వేల కోట్ల వరకు అప్పులు, వడ్డీలకే కట్టాల్సి వస్తోందని, భవిష్యత్‌లో అవి మోయలేని స్థితికి చేరుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు తిరిగి చెల్లించే గడువు కూడా 40 ఏళ్లు పెట్టారని తెలుస్తోందని, దీనిపైనా ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు. ప్రాజెక్టుల వ్యయాన్ని రూ. లక్షల కోట్లు చూపుతూ కేటాయింపులు మాత్రం ఈసారి రూ. 11 వేల కోట్లకే పరిమితం చేశారని, ఈ కేటాయింపులతో ప్రాజెక్టులు ఎన్నేళ్లు కడతారని భట్టి ప్రశ్నించారు. పదేపదే రుణాలు తీసుకునేందుకే ప్రభుత్వం ఇలా తక్కువ బడ్జెట్ కేటాయిస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఈ స్థాయిలో అప్పులు చేయలేదన్నారు. మిషన్ భగీరథను పెద్ద ఫ్రాడ్‌గా అభివర్ణించిన భట్టి... గ్రామాల్లో ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వకుండానే ఇచ్చినట్లు అధికారులు సంతకాలు చేయించుకొని వెళ్తున్నారని ఆరోపించారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలతో విభేదిస్తున్నానని, ప్రజలకిచ్చిన హామీలకు అనుగుణంగా, వాస్తవానికి దగ్గరగా ఉండేలా బడ్జెట్ కేటాయింపులను సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీ పేరు చెప్పేటప్పుడు అనుమతి తీసుకున్నారా? పౌల్ట్రీ రంగంపై భట్టి మాట్లాడుతున్న సమయంలో మార్క్‌ఫెడ్ నుంచి మొక్కజొన్న కొనుగోలు చేసిన పెద్ద కంపెనీలు, వాటి యజమానుల పేర్లు చెబుతూ రంజిత్‌రెడ్డికి చెందిన రాజరాజేశ్వరి హేచరీస్ పేరును ప్రస్తావించారు. దీంతో కలగజేసుకున్న ఆర్థిక మంత్రి హరీశ్‌రావు... సభలో లేని వ్యక్తి పేరు ప్రస్తావించే ముందు స్పీకర్ అనుమతి తీసుకోవాలని, ఒకవేళ తీసుకోకపోతే రికార్డుల నుంచి ఆ పేరును తొలగించాలని స్పీకర్‌ను కోరారు. ఆ తర్వాత భట్టి మాట్లాడుతూ రంజిత్‌రెడ్డి ఎంపీ అని తనకు ఇంతవరకు తెలియదని, కానీ తాను ఎంపీ అని సంబోధించలేదన్నారు. కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్‌కు సంబంధించిన అంశంపై భట్టి మాట్లాడుతుండగా ప్రభుత్వ విప్ సునీత కలగజేసుకొని సభ నుంచి భట్టిని సస్పెండ్ చేయలేదని కామెంట్ చేసి నాలుక కరుచుకున్నారు. మద్యం, యూనివర్సిటీలు, మిషన్ భగీరథపై భట్టి మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పేవన్నీ అబద్ధాలంటూ అధికార టీఆర్ఎస్ సభ్యులు వ్యాఖ్యానించడం కనిపించింది. -
ప్రాజెక్టుల నిర్వహణకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ నుంచి ప్రధాన ఎత్తిపోతల పథకాలన్నీ నిర్వహణలోకి వస్తున్నందున వాటి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌కు వీలుగా ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధుల కేటాయింపులు చేసిం ది. తొలిసారిగా సాగునీటి శాఖకు నిర్వహణ పద్దు కింద రూ. 7,446.97 కోట్లు కేటాయించింది. ఎత్తిపోతల పథకాల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే చూడాలని, దీనికి ప్రత్యేక బడ్జెట్ ఉండాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో ఆ మేరకు ప్రగతి పద్దుకు మించి నిర్వహణకు నిధుల కేటాయింపు భారీగా జరిగినట్లు నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎత్తిపోతల పథకాలకు ఈ ఏడాది నుంచి విద్యుత్ వినియోగం పెరగనుంది. దానికనుగుణంగా విద్యుత్ చార్జీలు తడిసిమోపెడు కానున్నాయి. ఇప్పటివరకు 1,400 మెగావాట్ల మేర విద్యుత్ అవసరాలు ఉండగా ఈ ఏడాది జూన్ నుంచి 7 వేల మెగావాట్లకు చేరే అవకాశం ఉందని లెక్కగట్టారు. వాటికి రూ. 7,000–8,000 కోట్ల వరకు బిల్లులు చెల్లించే అవకాశం ఉంటుంది. మొత్తంగా కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో 700 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రణాళిక ఉంది. ఇందులో కాళేశ్వరం ద్వారానే 360 టీఎంసీలు ఎత్తిపోయనుండగా దానికి 6 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరానికి నిర్వహణ పద్దు కింద ఏకంగా రూ. 5,219 కోట్లు కేటాయించారు. పాలమూరు–రంగారెడ్డి నిర్వహణకు రూ.18.40 కోట్లు, సీతారామ ఎత్తిపోతలకు రూ. 21.04 కోట్లు, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా పథకాలకు మరో రూ. 62.93 కోట్లను నిర్వహణ పద్దు కింద కేటాయించారు. -
ఖాకీ బడ్జెట్ ఓకే
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం కారణంగా గతేడాది బడ్జెట్ కేటాయింపుల్లో పోలీసు శాఖకు కోతపడినా.. ఈసారి కేటాయింపులు ఫర్వాలేదనిపించాయి. గతేడాది బడ్జెట్లో ప్రగతిపద్దు రూ.167 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ. 4,788 కోట్లు కేటాయించింది. కోతల బడ్జెట్ కారణంగా స్టేషన్ల నిర్వహణ కూడా సరిగా జరగలేదు. గడిచిన 6 నెలల్లో పోలీసు స్టేషన్లలో పెన్నూ, పేపర్లకూ దిక్కులేకుండా పోయింది. ఈసారి బడ్జెట్లో నిర్వహణ పద్దుకు రూ. 5,179.22, ప్రగతి కింద రూ. 672.74 కోట్లుగా మొత్తం రూ. 5,852 కోట్లు కేటాయించింది. ఈసారి ప్రగతి పద్దు, నిర్వహణ పద్దులు కలిపి గతేడాది ప్రతిపాదించిన బడ్జెట్ కంటే దాదాపుగా రూ.890 కోట్ల (ప్రగతి పద్దులో రూ.500 కోట్లు, నిర్వహణ పద్దులో రూ. 390 కోట్లు)కుపైగా పెరగడంతో నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు తలెత్తవని ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది దసరా అనంతరం దాదాపు 11 మంది ఐపీఎస్‌లు, 15 వేల మంది కొత్త కానిస్టేబుళ్లు, 12 వందల మంది ఎస్సైలు డిపార్ట్‌మెంటులోకి చేరుతున్నారు. ధరలు పెరుగుతున్న నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహణ వ్యయాన్ని పెంచారు. మరోవైపు కొత్త జిల్లాల్లో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (డీపీవో) కార్యాలయాలు పూర్తికావొచ్చాయని బడ్జెట్లో పేర్కొంది. ఈ ఏడాది పలు డీపీవోలు ప్రారంభించే అవకాశాలున్నాయని పోలీసు ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. గ్రేటర్లో మహిళలు, పిల్లల భద్రత, కమిషనరేట్ భవనాల నిర్మాణం, సేఫ్‌సిటీ ప్రాజెక్టు, కమాండ్ కంట్రోల్ రూం నిర్మాణాల కోసం మొత్తం రూ.125 కోట్లు కేటాయించింది. నగరంలో సీసీటీవీల ఏర్పాటు కోసం రూ.50 లక్షలు ఇవ్వనుంది. చిన్న పరిశ్రమల ప్రోత్సాహకాలు భారీగా పెంపు గ్రామీణ, చిన్న పరిశ్రమలకు మంచి రోజులు రానున్నాయి. తాజా బడ్జెట్లో వీటికి రూ.1132.39 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. గతేడాది కేవలం రూ.21.90 కోట్లు మాత్రమే కేటాయించగా, ఈసారి భారీగా పెంచింది. ప్రధానంగా రాష్ట్రంలో నీటిపారుదల సదుపాయం పెరిగి కోటి ఎకరాలకుపైగా ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఫలితంగా భారీగా పెరగనున్న పంటల దిగుబడులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్వహణ పద్దు కింద తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు పెట్టుబడి రుణం కింద కేటాయింపులను రూ.87.90 కోట్ల నుంచి రూ.257 కోట్లకు పెంచింది. ఈ నేపథ్యంలో గ్రామీణ, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు భారీగా కేటాయింపులు జరిపింది. పరిశ్రమలకు రాయితీలను 38.98 కోట్ల నుంచి 16.71 కోట్లకు తగ్గించింది. గోదావరి తీరం సుందరీకరణకు రూ.250 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా వివిధ ప్రాంతాల్లో రూపుదిద్దుకున్న పంప్‌హౌస్‌లను ఆసరా చేసుకుని గోదావరి నదీ తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయిలో సమీక్ష నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సుందర ఉద్యానవనాలు అభివృద్ధి చేయాలని, కశ్మీర్ తరహాలో ఎత్తయిన చెట్లను పెంచాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. దానికోసం తాజా బడ్జెట్లో పర్యాటక శాఖకు ప్రభుత్వం నిధులను కేటాయించింది. కన్నేపల్లి వద్ద ఉన్న లక్ష్మీ పంప్‌హౌస్ ప్రాంతానికి రూ.80 కోట్లు, మేడిగడ్డ వద్ద అభివృద్ధి పనులకు రూ.105 కోట్లు, కన్నేపల్లి నుంచి అన్నారం బ్యారేజీ మధ్య పనులకు రూ.40 కోట్లు, అన్నారం బ్యారేజీ వద్ద పనులకు రూ.25 కోట్లు కేటాయించారు. ఇక కళాకారుల వృద్ధాప్య పింఛన్ల కోసం రూ.6.75 కోట్లు, సాంస్కృతిక సారధికి రూ.16 కోట్లు కేటాయించారు. -
పేదల చేతికే డబుల్ బెడ్రూమ్ నిధులు
సాక్షి, హైదరాబాద్: ఇకనుంచి రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం వేగం పుంజుకునే దిశగా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా వార్షిక బడ్జెట్ 2020–21లో రూ.11,917 కోట్లను కేటాయించింది. పేదల చేతికే డబుల్ బెడ్రూమ్ నిధుల్ని అందిస్తామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రకటించడంతో ఈ ఆర్థిక ఏడాదిలో ఈ ప్రాజెక్టు పరుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇదివరకు ప్రత్యేక కాలనీలుగా నిర్ధారిత ప్రాంతంలో ఇళ్లను నిర్మించేవారు. యూనిట్ కాస్ట్ సరిపోవటం లేదని కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవటంతో ఈ ప్రాజెక్టు పనులు పడకేశాయి. ప్రస్తుతం తాముంటున్న ఇల్లు ఒక చోట ఉండటం, కొత్తగా మంజూరై నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరోచోట ఉండటాన్ని లబ్ధిదారులు ఇష్టపడలేదు. ఈ అంశాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులనే సొంతంగా తమ స్థలంలో ఇళ్లను నిర్మించుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతోపాటుగా డబుల్బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయింపులు చేసింది. 2020–21 ఆర్థిక ఏడాదికి గాను బడ్జెట్లో ప్రభుత్వం రూ.11,917 కోట్లను ప్రతిపాదించింది. సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకునేవారు వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్షమంది ఉంటారని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. బడ్జెట్ కేటాయింపుల్లో ప్రగతి పద్దుకు సంబంధించి పట్టణ ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రూ.3,850 కోట్లు కేటాయించారు. మిగతా మొత్తం గ్రామ ప్రాంతాల్లో లబ్ధిదారులకు కేటాయించారు. ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రూ.750 కోట్లు ఖర్చు చేయనున్నారు. -
పరిశోధన, అభివృద్ధికి శూన్యం!
సాక్షి, హైదరాబాద్: ఎప్పటిలాగే యూనివర్సిటీల్లో పరిశోధన, అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో పెద్దగా నిధులను కేటాయించలేదు. ఇంటర్మీడియట్ విద్యను మినహాయిస్తే ఉన్న త, సాంకేతిక విద్యలో నిర్వహణ, ప్రగతి ప ద్దు కింద గతేడాది కంటే ఈసారి నిధులను ప్రభుత్వం తగ్గించింది. యూనివర్సిటీలకు నిర్వహణ పద్దులో గతేడాది కంటే ఈసారి నిధులను పెంచింది. అయితే పెరిగిన నిధులు యూనివర్సిటీల్లో యూజీసీ సవరించిన వేతనాల చెల్లింపునకే సరిపోనున్నాయి. సెంట్రల్ పీఆర్సీ సిఫారసు మేరకు యూజీసీ ప్రకటించిన వేతనాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ మేరకు ఆ వేతనాల చెల్లింపులకు అయ్యే అదనపు నిధులను మాత్రమే నిర్వహణ పద్దులో కేటాయించింది. ఈసారి ఉన్నత, సాంకేతిక విద్యకు మొత్తంగా రూ.1,723.28 కోట్లు కేటాయించగా, అందులో నిర్వహణ పద్దు కింద రూ.1,638.04 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.85.24 కోట్లు కేటాయించింది. అదే గతేడాది మొత్తంగా రూ.1,690.79 కోట్లు కేటాయించగా, అందులో నిర్వహణ పద్దు కింద రూ.1,632.85 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.57.94 కోట్లు కేటాయించింది. యూనివర్సిటీల్లో ఇంక్యుబేటర్ల ఏర్పాటు, పరిశోధనలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు మొత్తంగా రూ.2,500 కోట్ల వరకు బడ్జెట్ కావాలని అడిగినా రూ.1,723.27 కోట్లకే పరిమితం చేసింది. ఇక ఇంటర్మీడియట్ విద్యాశాఖకు నిర్వహణ పద్దులో గతేడాది కంటే రూ.30 కోట్ల వరకు కోత పెట్టగా, ప్రగతి పద్దులో రూ.28.53 కోట్లు అదనంగా ఇచ్చింది. సాంకేతిక విద్యలో భారీ కోత.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో క్రీడా పరికరాల సామగ్రి కొనుగోలు కోసం గతేడాది రూ.5.78 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.34.27 కోట్లు కేటాయించింది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి గతేడాదిలాగే ఈసారి కూడా రూ.3 కోట్లు, ఉస్మానియా యూనివర్సిటీ సెంటినరీ బిల్డింగ్ నిర్మాణం కింద రూ.3 కోట్లు, వివిధ పథకాల కింద రూ.3.22 కోట్లు ప్రగతి పద్దు కింద కేటాయించింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటా కింద గతేడాదిలాగే నిధులను కేటాయించింది. గతేడాది రూ.14.95 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.15.04 కోట్లు కేటాయించింది. మరోవైపు సాంకేతిక విద్యలో నిర్వహణ పద్దులో భారీగా కోత పెట్టింది. గతేడాది రూ.320.29 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.265.08 కోట్లకే పరిమితం చేసింది. జేఎన్టీయూ అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీల్లో సుల్తాన్పూర్ కాలేజీకి రూ.5.10 కోట్లు, మంథని కాలేజీకి రూ.63 లక్షలు, కరీంనగర్లో కొత్త ఇంజనీరింగ్ కాలేజీలకు రూ.5.59 కోట్లు కేటాయించింది. అయితే జగిత్యాల ఇంజనీరింగ్ కాలేజీ గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదు. పాలిటెక్నిక్ కాలేజీలకు గతేడాదితో పోల్చితే భారీగా బడ్జెట్‌ను తగ్గించింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.142.83 కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.98.99 కోట్లు మాత్రమే కేటాయించింది. -
గ్రేటర్ ఎన్నికలకు వేళాయే!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు హైదరాబాద్‌కు నిధుల పంట పండింది. ‘హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్’అనే కొత్త పద్దు కింద ఏకంగా రూ.7,547 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. హైదరాబాద్ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల కోసం ఈ నిధులు వినియోగించనున్నారు. హైదరాబాద్‌కు ఇంత పెద్దమొత్తంలో నిధులు కేటాయించడం ఇదే తొలిసారి. భారీగా పెరిగిన పుర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ 2020–21లో పురపాలక శాఖకు ప్రగతిపద్దు కింద రూ.11,020.37 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.1,261.98 కోట్లు కలిపి మొత్తం రూ.12,282.35 కోట్లు కేటాయించింది. 2018–19లో పురపాలక శాఖకు ప్రగతి పద్దు కింద రూ.4,680.09 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.1,262.21 కోట్లు కలిపి మొత్తం రూ.5,942.9 కోట్లు కేటాయించగా, తాజా కేటాయింపులు రెట్టింపు చేసింది. నిర్వహణ పద్దు కింద జల మండలికి నీటిసరఫరా, పారిశుధ్యం నిర్వహణ కోసం రుణాలను రూ.825 కోట్ల నుంచి రూ.900 కోట్లకు పెంచింది. కార్పొరేషన్లకు మళ్లీ కోత.. రాష్ట్ర ఆర్థిక సంఘానికి నిధుల కేటాయింపులను రూ.1,036.98 కోట్ల నుంచి రూ.889 కోట్లకు తగ్గించింది. రాష్ట్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ కింద కేటాయింపులను రూ.521.73 కోట్ల నుంచి రూ.889 కోట్లకు పెంచింది. వడ్డీ లేని రుణాల పథకం కింద మున్సిపల్ కార్పొరేషన్లకు కేటాయింపులను రూ.75.47 కోట్ల నుంచి రూ.226.41కోట్లకు పెంచింది. వరంగల్‌కు రూ.226.41 కోట్లు, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం నగరాలకు కలిపి మొత్తం రూ.301.88 కోట్లను 2017–18లో కేటాయించిన ప్రభుత్వం, వరుసగా రెండో ఏడాది వీటికి రిక్తహస్తం చూపించింది. అయితే తొలిసారిగా మిషన్ భగీరథ (అర్బన్) పథకానికి రూ.800 కోట్లను కేటాయించింది. ఆలయాలకు రూ.400 కోట్లు యాదగిరిగుట్ట ఆలయాభివృద్ధి సంస్థకు గతేడాది రూ.50 కోట్లు కేటాయించగా, తాజాగా రూ.350 కోట్లకు పెంచింది. వేములవాడ ఆలయాభివృద్ధి సంస్థకు కేటాయింపులను రూ.5 కోట్ల నుంచి రూ.50 కోట్లకు పెంచింది. -
విద్యాశాఖకు 12,127.55 కోట్ల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యాశాఖకు 12,127.55 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఆదివారం అసెం బ్లీలో ప్రకటించిన బడ్జెట్లో విద్యాశాఖకు రూ.12,144 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించినా, విభాగాల వారీగా చూస్తే రూ. 12,127.55 కోట్లుగా ఉంది. గతేడాది విద్యా శాఖకు రూ.9,899.12 కోట్లు మాత్రమే కేటా యించగా ఈసారి దానికి అదనంగా 2,238.43 కోట్లు ఇచ్చింది. విద్యాశాఖకు కేటాయించిన మొత్తం బడ్జెట్లో పాఠశాల విద్యకు రూ.10,405.29 కోట్లు, ఉన్నత విద్యకు రూ.1,452.03 కోట్లు, సాంకేతిక విద్యకు రూ.270.23 కోట్లను కేటాయించింది. ఇక ఈసారి అదనంగా ఇచ్చిన రూ.2,238.43 కోట్లలో పాఠశాల విద్యలోనే నిర్వహణ పద్దు కింద రూ.1,642.32 కోట్లను కేటాయించగా, ప్రగతి పద్దులో 598.82 కోట్లను కేటాయిం చింది. ప్రగతిపద్దులో ఈ మొత్తాన్ని సమగ్ర శిక్షా అభియాన్ కోసం కేటాయింపులు జరి పింది. వాస్తవానికి పాఠశాల విద్యకే రూ.14 వేల కోట్లకు పైగా బడ్జెట్ అవసరమని ప్రతిపాదనలను పంపించినా రూ.10,405.29 కోట్లకు ప్రభుత్వం కేటాయింపులు పరిమితం చేసింది. మరోవైపు ఈచ్ వన్ టీచ్ వన్‌కు రూ.100 కోట్లు కేటాయించింది. విభాగాల వారీగా కేటాయింపులివీ.. నిర్వహణ పద్దులో పాఠశాల విద్యకు కేటా యించిన రూ.9,113.10 కోట్లలో సాధారణ విద్యకు రూ.8,864.25 కోట్లు, ప్రభుత్వ పరీ క్షల విభాగానికి రూ.9.59 కోట్లు, వయోజన విద్యకు రూ.7.40 కోట్లు, ప్రభుత్వ గ్రంథాల యాలకు రూ.54.11 కోట్లు, జవహర్ బాలభ వన్‌కు రూ.2.99 కోట్లు, ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణాలయానికి రూ.34.49 కోట్లు, తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు రూ.135.99 కోట్లు కేటాయించిం ది. సమగ్ర శిక్షా అభియాన్‌కు రూ.135.4 కోట్లు, ఇతరాల కింద మిగతా నిధులను కేటా యించింది. అయితే ఈ నిధులన్నీ నిర్వహణ కు, వేతనాలకే సరిపోనున్నాయి. ఇక ప్రగతి పద్దులో రూ.1,292.19 కోట్లు ప్రభుత్వం కేటా యించింది. అయితే అవి పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఏమాత్రం సరిపోవని విద్యారంగ నిపుణులు, ఉపాధ్యాయ సంఘా లు అభిప్రాయపడుతున్నాయి. పాఠశాలల్లో మౌలిక వసతులు ఈ నిధులతో సాధ్యం కావని అంటున్నాయి. రెండేళ్ల కిందటితో పోల్చితే తక్కువే.. కేంద్ర ప్రాయోజిత పథకాలకు రెండేళ్ల కిందటి తో పోల్చితే ఈసారి చేసిన కేటాయింపులు తక్కువే. ఈ పథకాలకు రాష్ట్ర వాటాగా చెల్లిం చాల్సిన మొత్తం కింద గతేడాది రూ.491.56 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి రూ.1,239.46 కోట్లను కేటాయించింది. గతే డాదితో పోల్చుకుంటే ఇది రెండు రెట్లు పెరి గింది. అయితే అంతకుముందు సంవత్స రాల్లో చేసిన కేటాయింపుల కంటే ఈసారి తగ్గిపోయింది. సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ ఎస్ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ), ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, సివిల్ వర్క్స్ వంటి పథకాలకు 40 శాతం రాష్ట్ర వాటా తప్పనిసరి. వాటి కోసం 2017–18 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రూ. 1,876.42 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.1,546.39 కోట్లకు సవరించింది. 2019–20 ఆర్థిక సంవత్సరం లో ఈ పథకాల కోసం రూ. 491.56 కోట్లు మాత్రమే కేటాయించగా, 2020–21 కోసం రూ.1,239.46 కోట్లను కేటాయించింది. ఇక ఉన్నత విద్యలో కేంద్ర పథకాల కోసం రూ. 15.04 కోట్లను మాత్రమే కేటాయించింది. ప్రస్తుత బడ్జెట్లో 6.62 శాతమే.. రాష్ట్రంలో విద్యారంగానికి ప్రాధాన్యం తగ్గు తోంది. గతేడాది కంటే ఈసారి బడ్జెట్‌ను పెం చినా మొత్తం బడ్జెట్లో విద్యాశాఖ కేటాయిం పుల వాటా తక్కువే. రాష్ట్రంలోని పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, సాంకేతిక విద్యా సంస్థలకు రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు క్రమంగా పడిపోతున్నాయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో ఆదివారం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను పోల్చితే విద్యారంగానికి కేటాయింపులు 4.28 శాతం తగ్గిపోయాయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో విద్యాశాఖకు కేటాయించిన మొత్తం రాష్ట్ర బడ్జెట్లో 10.88 శాతం కాగా, ఇప్పుడు అది 6.62 శాతానికి పడిపోయింది. ఫీజులకు ఫుల్ బడ్జెట్ పోస్టుమెట్రిక్ విద్యార్థులకు రాష్ట్ర బడ్జెట్ ఫుల్ జోష్ ఇచ్చింది. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంతృప్తికర స్థాయిలో నిధులు కేటాయిస్తూ.. ఇకపై పాత బకాయిల ప్రస్తావన లేకుండా చేసింది. 2020–21 వార్షిక సంవత్సరంలో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల కింద రూ.2,650 కోట్లు కేటాయించింది. వాస్తవానికి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు ప్రతి సంవత్సరం సగటున రూ.2 వేల కోట్ల డిమాండ్ ఉంటుంది. పాత బకాయిలు, కొత్త వాటి చెల్లింపులకు సరిపడా నిధులు విడుదల కాకపోవడంతో గత కొన్నేళ్లుగా బకాయిలు పెండిం గ్లో ఉండేవి. ఈ క్రమంలో పాత బకాయిలు లేకుండా చూడాలని ఆర్థిక శాఖ స్పష్టం చేయడంతో అన్ని సంక్షేమ శాఖలు యుద్ధప్రాతిపదిక చర్యలు చేపట్టాయి. 2019–20 వార్షిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఏకంగా రూ.3 వేల కోట్ల చెల్లింపులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వీటిని పూర్తి స్థాయిలో చెల్లిస్తే 2019–20 వార్షిక సంవత్సరానికి సంబంధించి 75 శాతం చెల్లింపులు చేయవచ్చు. ఫీజులకు మిగులు నిధులు.. 2020–21 వార్షిక సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం కింద మిగులు నిధులు ఉంటాయని సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. వచ్చే వార్షిక సంవత్సరానికి సంబంధించి రూ.2,650 కోట్లు కేటాయింపులు జరపడంతో.. అప్పటి డిమాండ్ రూ.2,050 కోట్లు ఉంటుందని, 2019–20 లో రూ.450 కోట్ల మేర ఉండే బకాయిలన్నీ చెల్లించినప్పటికీ కొంత మేర నిధులు సంక్షేమ శాఖల వద్ద ఉండే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. -
వడ్డీ చెల్లింపులకు 14,615 కోట్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలకు సంబంధించిన రెవెన్యూ ఖాతా వ్యయ పట్టికలో రూ. 14,615 కోట్లను వడ్డీ చెల్లింపుల కింద ప్రభుత్వం చూపింది. వర్తమాన ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్లో వడ్డీ చెల్లింపుల కింద రూ. 14,574 కోట్లు ఉండగా, సవరించిన అంచనాల ప్రకారం రూ. 14,385 కోట్లు చెల్లించారు. ఇప్పుడు కూడా కాస్త అటూ ఇటుగానే వడ్డీ చెల్లింపులు చూపెట్టారు. అయితే, వడ్డీలకు తోడు రుణాలు, అడ్వాన్సుల అసలు చెల్లింపుల కింద రూ. 15,662 కోట్లు ప్రతిపాదించారు. దీంతో అప్పుల అసలు, వడ్డీల చెల్లింపులు రూ. 30 వేల కోట్లు దాటాయి. సరిగ్గా రెండేళ్ల క్రితం 2017–18 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ చెల్లింపులు రూ. 10,835 కోట్లు ఉండగా మూడేళ్లలో అది రూ. 3,780 కోట్ల మేర పెరిగిపోయినట్టు లెక్కలు చెబుతున్నాయి. తప్పని అప్పుల తిప్పలు.. ఇక, ఈ ఏడాదీ పెద్దఎత్తున రుణాలు అవసరమవుతాయని బడ్జెట్ అంచనా లెక్కలు చెబుతున్నాయి. ఏ రూపంలో అయినా రూ. 35,500 కోట్ల మేర అప్పుల ద్వారా సమీకరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. గత ఏడాదితో పోలిస్తే 2,600 కోట్ల రుణం ఎక్కువగా ప్రతిపాదించింది. ఇందులో ఓపెన్‌మార్కెట్ రుణాల కింద రూ.34 వేల కోట్లు సేకరించాలని, కేంద్రం నుంచి రూ.400 కోట్లు, ఇతర రుణాలు రూ.1000 కోట్లు సమీకరించాలని ప్రతిపాదించారు. అదే 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.32,900 కోట్ల రుణాలు అంచనా వేయగా, రూ. 31,800 కోట్లు సమీకరించారు. కేంద్రం నుంచి రూ.800 కోట్లు వస్తాయని అంచనా వేస్తే కేవలం రూ.200 కోట్లే వచ్చాయి. ఇక, ఇతర రుణాల కింద రూ.1000 కోట్లు సమీకరించాలనే ప్రతిపాదన ఉన్నా రూ.500 కోట్లు మాత్రమే కార్యరూపంలోకి వచ్చాయి. మూలధన వ్యయం పెరిగింది.. కాగా, ఈ ఏడాదితో పోలిస్తే మూల ధన వ్యయాన్ని పెంచుతూ బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేశారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 17,274 కోట్ల మూల ధన వ్యయాన్ని ప్రతిపాదించగా, సవరించిన అంచనాల ప్రకారం రూ. 13,165 కోట్లు ఖర్చయింది. ఇక, 2020–21 ఆర్థిక సంవత్సరానికి వర్తమాన ఏడాదితో పోలిస్తే దాదాపు రూ.8 వేల కోట్లు అధికంగా రూ. 22,061 కోట్లు మూల ధన వ్యయంగా ప్రతిపాదించారు. అదే 2018–19 ఆర్థిక సంవత్సరంలో మూల ధన వ్యయం 33,369 కోట్లు ప్రతిపాదించగా, సవరించిన అంచనాల ప్రకారం అది రూ. 22,640 కోట్లకు తగ్గింది. ఇక, ఈసారి అంచనాల్లో ప్రతిపాదించిన మొత్తంలో ఎంత వ్యయం సంపద సృష్టికి జరుగుతుందనేది ఆర్థిక సంవత్సరం ముగిశాక తేలనుంది. -
పీఆర్సీ, ఐఆర్ ఈసారి కష్టమే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న పీఆర్సీ కోసం ఇంకొన్నా ళ్లు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. బడ్జెట్లో పీఆర్సీ అమలు కోసం నిధులను కేటాయిం చకపోవడంతో ఉద్యోగులు ఆందోళనలో పడ్డా రు. ప్రస్తుత బడ్జెట్లో ఆ ప్రస్తావన లేకపోవ డంతో కొంత ఆందోళనకు గురయ్యారు. మధ్యం తర భృతి (ఐఆర్) ప్రస్తావన కూడా లేక పోవడంతో తీవ్ర నిరాశ చెందారు. రాష్ట్రంలోని 2.62 లక్షల మంది ఉద్యోగులు, 2.68 లక్షల మంది పెన్షనర్లకు పీఆర్సీ అమలు చేయాల న్నా, ఐఆర్ ఇవ్వాలన్నా రూ.వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ మొత్తం వెచ్చించే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం ఈ అంశానికి బడ్జెట్లో చోటు క ల్పించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థి క సంవత్సరం బడ్జెట్లోనే పీఆర్సీ అమలు అంశా న్ని చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఉద్యో గుల రిటైర్మెంట్ వయసును 61 ఏళ్ల కు పెంచే అంశాన్ని కూడా ప్రభుత్వం సీరియస్‌గానే ఆలోచిస్తోంది. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకోవడం ద్వా రా ఉద్యోగులను కొంత శాంతపరిచే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. -
ఆరోగ్యమస్తు
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యరంగానికి ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం రూ. 6,185.97 కోట్లు కేటాయించింది. 2019–20 ఆర్థిక సంవ త్సరంలో రూ. 5,694 కోట్లు కేటాయించగా, ఈసారి అదనంగా రూ. 491 కోట్లు కేటాయించడం విశేషం. మొత్తం వైద్య ఆరోగ్య బడ్జెట్లో రూ. 2,361.81 కోట్లు ప్రగతి బడ్జెట్ కాగా, 3,824.16 కోట్లు నిర్వహణ బడ్జెట్ కావడం గమనార్హం. ఈ ప్రగతి బడ్జెట్లో అత్యధికంగా ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలో అమలయ్యే పథకాలకు అధికంగా రూ.1185 కోట్లు కేటా యించారు. గత బడ్జెట్లో రూ.886.49 కోట్లు కేటా యించగా, ఈసారి మరింతగా పెంచడం గమనార్హం. ఆయుష్ విభాగానికి గత బడ్జెట్లో రూ. 6.86 కోట్లు ఇవ్వగా, ఈసారి 33.25 కోట్లు కేటాయించారు. అంటే గతం కంటే ఏకంగా రూ. 26.39 కోట్లు అదనం కావడం విశేషం. ఇక ఎంతో ప్రాధాన్యం కలిగిన కేసీఆర్ కిట్‌కు గత బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించగా, ఈసారి 443 కోట్లకు తగ్గింది. ఈజేహెచ్ఎస్ స్కీంకు గతంలో రూ. 417 కోట్లు కేటా యించగా, ఈసారి 410.35 కోట్లు దక్కాయి. ఆరోగ్యశ్రీకి గతంలో రూ. 720. 12 కోట్లు కేటాయిం చగా, ఈసారీ అదే స్థాయిలో ఉంది. ఇక ఔషధాల కోసం గత బడ్జెట్లో రూ.236.14 కోట్లు కేటాయిస్తే ఈసారి రూ.262.41 కోట్లు ఇచ్చారు.ఇక ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసు పత్రికి గతంలో రూ.20 కోట్లు కేటాయిస్తే, ఇప్పుడూ అంతే ఇచ్చారు. ఆ వ్యాధుల నిర్ధారణకు కార్యాచరణ... కంటి వెలుగు తరహాలోనే చెవి, ముక్కు, గొంతు, దంత సంబం«ధిత వ్యాధుల నిర్ధారణ కోసం త్వరలో ప్రత్యేక కార్యాచరణను ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. తెలంగాణ లోని ప్రతీ పౌరుడికి వైద్య పరీక్షలు నిర్వహించి తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ రూపొందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో 118 బస్తీ దవాఖానాలు పేదలకు వైద్య సేవలు అందిస్తున్నాయి . వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. వాటి సంఖ్యను 350కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది . ఇప్పుడు నడుస్తున్న వాటితో పాటు, మరో 232 ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించాలని బడ్జెట్లో ప్రకటించారు.ప్రతీ డివిజన్లో కనీసం రెండు బస్తీ దవాఖానాలు ఏర్పాటుతో పాటు ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో అదనంగా ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలోని ప్రజల కంటి సంబంధ సమస్యలను పరిష్కరించడానికి కంటి వెలుగు పేరుతో ప్రపంచంలోనే అతి భారీ ఐ స్క్రీనింగ్ డ్రైవ్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. 1.54 కోట్ల మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచితంగానే మందులు, అద్దాలు పంపిణీ చేశారు. కరోనాపై ప్రస్తావన... రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి ప్రస్తావించారు. వేసవిలో ఉండే ఎండ వేడికి వైరస్ మనుగడలో ఉండే అవకాశమే లేదని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎండాకాలం ప్రారంభమైనందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సర్కారు స్పష్టం చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ప్రజలు కరోనా వైరస్‌పై చెలరేగే వదంతులను నమ్మవద్దని బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం ప్రజలకు విన్నవించింది. ఇదిలావుండగా కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం రూ. 100 కోట్లు ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. -
తలసరి అప్పు 65,480
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలపై తలసరి అప్పు ఏటేటా పెరిగిపోతోంది. ప్రాధాన్య కార్యక్రమాలతో పాటు మూలధన వ్యయం కింద వెచ్చించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం చట్టానికి లోబడి తీసుకొస్తున్న అప్పులు పెరిగి పోతుండటంతో తలసరి అప్పు పెరుగు తోందని బడ్జెట్ లెక్కలు చెపుతున్నాయి. 2020–21 బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్ర అప్పు రూ.2.29 లక్షల కోట్లకు చేరింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా 3,50,03,674తో భాగిస్తే ఇది రూ.65,480గా తేలింది. అంటే రాష్ట్రం లోని ప్రతి వ్యక్తిపై ఉన్న తలసరి అప్పు రూ.65,480 అన్నమాట. గతేడాది బడ్జెట్ లెక్కల ప్రకారం ఇది రూ.58,202 కాగా, ఈ ఏడాది మరో రూ.7,278 పెరిగింది. కాగా, రాష్ట్ర అప్పు జీఎస్డీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి)తో పోలిస్తే 20.74 శాతానికి చేరడం గమనార్హం. రూ.1.87 లక్షల కోట్లు బహిరంగ మార్కెట్లోనే.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న రుణాలను పరిశీలిస్తే బహిరంగ మార్కెట్లోనే ఎక్కువగా రుణాలు తీసుకుంటోంది. ఇప్పటివరకు బహిరంగ మార్కెట్లో రూ.1.87 లక్షల కోట్లకు పైగా రుణాలు సమీకరించగా, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.8,682 కోట్లు, స్వయం ప్రతిపత్తి గల ఇతర సంస్థల నుంచి 13,961 కోట్లు, బాండ్ల రూపంలో రూ.18,954 కోట్లు సమీకరించినట్టు బడ్జెట్ ప్రతి పాదనల్లో ప్రభుత్వం వెల్లడిం చింది. గత ఐదేళ్ల లెక్కలు పరిశీలిస్తే 2016–17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభు త్వానికి రూ.1.29 లక్షల కోట్ల అప్పుంటే 2020–21 నాటికి అది 2.29 లక్షల కోట్లకు పెరిగింది. అంటే గత ఐదేళ్లలో పెరిగిన రాష్ట్ర అప్పు అక్షరాల లక్ష కోట్ల రూపాయలన్నమాట. -
పల్లెకు ప్రగతి
సాక్షి, హైదరాబాద్: పల్లె ప్రగతికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్ర బడ్జెట్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు దండిగా నిధులు కేటాయించింది. గ్రామీణ వికాసానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్న సర్కారు.. అదే ఒరవడిని కొనసాగించేలా బడ్జెట్‌ను ప్రతిపాదించింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.23,005.35 కోట్లను కేటాయించింది. గతేడాదితో పోలిస్తే ఇది ఏకంగా రూ.7,880.46 కోట్లు అధికం. కాగా, ఈ ఏడాది బడ్జెట్లో రూ.4,701.04 కోట్లు నిర్వహణ పద్దు కాగా, రూ.18,304.31 కోట్లు ప్రగతి పద్దు. వ్యవసాయం తర్వాత అత్యధిక నిధులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు దక్కడం విశేషం. ఆసరా పింఛన్లకు రూ.11,758 కోట్లు అసహాయులైన పేదలకు ఆసరా పింఛన్లతో అండగా నిలుస్తున్న ప్రభుత్వం.. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను ఆసరా పథకం కింద రూ.11,758 కోట్లను ప్రతిపాదించింది. గతేడాది రూ.9,402 కోట్లు కేటాయించగా.. ఈసారి అదనంగా మరో రూ.2,356 కోట్లను బడ్జెట్లో పొందుపరిచింది. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించనుండటంతో లబ్ధిదారుల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద 39.41 లక్షల మందికి ఆసరా పింఛన్ అందుతుండగా.. అర్హత వయసు తగ్గింపుతో మరో ఏడెనిమిది లక్షల మంది అదనంగా పింఛన్‌కు అర్హత సాధించే అవకాశముంది. దండిగా ఆర్థిక సంఘం నిధులు.. గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టింది. ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులతో పంచాయతీలకు నిధుల కొరత తీరనుంది. ఇప్పటికే ప్రతినెలా రూ.339 కోట్లు కేటాయిస్తున్న సర్కారుకు ఈ నిధుల రాకతో వెసులుబాటు కలుగనుంది. ఈ నేపథ్యంలో 2020–21లో గ్రామ పంచాయతీలకు రూ.1,393.93 కోట్ల ఆర్థిక సంఘం నిధులను అందించనుంది. గతేడాది కేవలం రూ.819.44 కోట్లు కేటాయించగా.. ఈ సారి అదనంగా రూ.574.49 కోట్లు పెంచింది. వడ్డీలేని రుణాల్లో కోత డ్వాక్రా మహిళలకు ఇచ్చే వడ్డీ రుణాలకు స్వల్పంగా కోత పెట్టింది. గతేడాది రూ.680.49 కోట్లు కేటాయించగా.. ఈ సారి 679.23 కోట్లు ప్రతిపాదించింది. అలాగే, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో జరిగే పనులకు రూ.54 కోట్లు కేటాయించింది. 2019–20తో పోలిస్తే రూ.13 కోట్లు అదనం. శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద రూ.15.09 కోట్లు కేటాయించింది. ఇది గతేడాది కంటే రూ.11 కోట్లు అధికం. -
మాంద్యంలోనూ ప్రగతిబాట
సాక్షి, హైదరాబాద్: ‘‘గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు వరకు అన్ని ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రతి ఎన్నికలోనూ ప్రజలు మాపై సంపూర్ణ విశ్వాసం ప్రదర్శించారు. మేం ఎంచుకున్న బాట సరైందని, మేం అవలంభిస్తున్న వ్యూహాలు సఫలమవుతున్నాయని తేల్చిచెప్పారు. మా పంథా ఇకపైనా కొనసాగించే నిర్ణయంతో వచ్చే నాలుగేళ్ల రాష్ట్ర భవిష్యత్తు పురోగతికి ప్రణాళిక రచన చేశాం. ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలపై స్పష్టమైన అవగాహనతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రజల ముందుంచుతున్నాం. ఇది కేవలం వార్షిక బడ్జెట్ ధృక్పథంతో కాకుండా ప్రజలే కేంద్రంగా ప్రగతిశీల బడ్జెట్ రూపొందించాం’’అని 2020–21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. గత ఆరేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలు స్వాగ తిస్తున్నారని, అదే ఉత్సాహంతో వచ్చే నాలుగేళ్ల కాలానికి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేసే ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అందులో వచ్చే సంవత్సరానికి వాస్తవిక, ప్రగతిశీల బడ్జెట్‌ను రూపొందించినట్లు వెల్లడించారు. అసెంబ్లీలో 62 నిమిషాలపాటు ఆయన బడ్జెట్ ప్రసంగం సాగింది. తన ప్రసంగం ప్రారంభానికి ముందు సీఎం చాంబర్లో, ప్రసంగం ముగించాక సభలో హరీశ్‌రావు సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. హరీశ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... సంక్షేమంలో కోత లేదు.. ‘‘సంక్షేమ కార్యక్రమాల నిధుల్లో ఎక్కడా కోత విధించలేదు. పైగా లబ్ధిదారుల సంఖ్యను పెంచుతూ కావాల్సిన నిధులను ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎంతటి నిబద్ధతతో పనిచేస్తోందో ఈ బడ్జెట్ అంకెలే చాటిచెబుతున్నాయి. ఆర్థిక మాంద్యానికి విరుగుడు ప్రజల కొనుగోలు శక్తిని పెంచటమే.ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం, పెట్టుబడి వ్యయానికి నిధులు వినియోగించడం అనే ద్విముఖ వ్యూహంతో ప్రభుత్వం ఆర్థికాభివృద్ధిని సాధిస్తోంది. ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా.. దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొన్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది. గత ఐదేళ్లలో రాష్ట్ర సొంత రాబడి సగటు వృద్ధి రేటు 21.5 శాతం ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరి మాసాంతానికి 6.3 శాతం తగ్గి 15.2 శాతం వద్ద నిలిచింది. ఇక 2014 మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రూ. లక్షలోపు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేశాం. గత ఎన్నికల్లో కూడా ఆ హామీ ఇచ్చాం. ఆర్థిక మాంద్యం ముందరి కాళ్లకు బంధం వేస్తునప్పటికీ దాని అమలుకు శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్రమే టాప్.. తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే చాలా ఎక్కువగా ఉంది. 2019–20 నాటికి తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2,28,216గా ఉంటే దేశ తలసరి ఆదాయం రూ. 1,35,050గా ఉంది. ఇది మన ప్రగతికి స్పష్టమైన సంకేతం. అంబేడ్కర్ మాటలు మననం చేసుకుంటూ... సమాజ వికాసానికి నిజమైన కొలమానం మహిళాభివృద్ధి స్థాయేనని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ అన్నారు. ఆయన మాటలను మననం చేసుకుంటూ మహిళా సంక్షేమానికి కృషి చేస్తున్నాం. ఆరోగ్య లక్ష్మి, అమ్మ ఒడి , కేసీఆర్ కిట్ పథకాలతో మహిళల సంక్షేమానికి ఈ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. మహిళలపై అకృత్యాలను అరికట్టేందుకు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఈ బడ్జెట్లో మహిళా స్వయం సహకార సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం రూ. 1,200 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 57 ఏళ్లు నిండితే వృద్ధాప్య పింఛన్.. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచే 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధా ప్య పింఛన్లు అందించబోతున్నాం. దీనివల్ల 39,41,976 ఆసరా పెన్షన్ల సంఖ్య భారీ గా పెరగనుంది. గత బడ్జెట్లో ఆసరా పెన్షన్లకు రూ. 9,402 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్లో ఆ కేటాయింపులను రూ. 11,758 కోట్లకు పెంచాం. కాళేశ్వరం వెనుక కేసీఆర్ ఉక్కు సంకల్పం.. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం మూడేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకంగా రూపొంది రికార్డు సృష్టించేందుకు సీఎం కేసీఆర్ ఉక్కు సంకల్పమే కారణం. ఫలితంగా గోదావరి 150 కి.మీ. మేర జీవధారగా మారింది. ఇది తెలంగాణ అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్‌గా ఉపయోగపడుతుంది. ఇదే స్ఫూర్తి తో పాలమూరు–రంగారెడ్డి, సీతారామ తదితర ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. కొద్ది కాలంలోనే రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ల నిర్మాణం పూర్తవుతుంది. వృద్ధిరేటుకు పన్నుల వాటా ఎసరు.. 2019–20లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా, బడ్జెట్లో వేసుకున్న అంచనాల కంటే రూ. 3,731 కోట్ల మేర తగ్గింది. రాష్ట్రానికి కేంద్రం నంంచి రావాల్సిన ఐజీఎస్టీ, జీఎస్టీ పరిహారంలో నిధులు సకాలంలో అందడం లేదు. దీంతో రాష్ట్ర రెవెన్యూ వృద్ధిరేటు 2018–19లో 16.10 శాతం ఉంటే 2019–20 ఫిబ్రవరి చివరి నాటికి 6.3 శాతానికి తగ్గింది. 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ప్రకారం తెలంగాణకు వచ్చే పన్నుల వాటా 2.43 శాతం నుంచి 2.13 శాతానికి తగ్గింది. -
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి 26,306 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి కేటాయింపులు భారీగా పెరిగాయి.2019–20 వార్షిక సంవత్సరం బడ్జెట్‌తో పోల్చితే 2020–21 సంవత్సరం కేటాయింపుల్లో ఏకంగా 6,721.17 కోట్లు అధికంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆదివారం అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ.26,306.25 కోట్లు కేటాయించారు. ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) చట్టం ప్రకారం జనాభా ప్రాతిపదికన ఈ నిధులు కేటాయించారు. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.16,534.97 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.9,771.28 కోట్లు వంతున బడ్జెట్ ప్రవేశపెట్టారు. గతేడాది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్, ఆర్థిక పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం... గతేడాది సెప్టెంబర్ 9న 2019–20 వార్షిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర బడ్జెట్ భారీగా తగ్గడంతో ప్రత్యేక అభివృద్ధి నిధి యాక్టు కింద ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ కేటాయింపులు భారీగా తగ్గాయి. తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2020–21 వార్షిక సంవత్సరం బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ కేటాయింపులు భారీగా పెరిగాయి. నిధుల కేటాయింపుల్లో జోరు పెరగడంతో సంక్షేమ పథకాల అమలులో వేగం పుంజుకోనుంది. పెండింగ్ పనులకు లైన్ క్లియర్... ప్రత్యేక అభివృద్ధి నిధి కేటాయింపులు భారీగా పెరగడంతో ఆయా శాఖల ద్వారా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి. 2019–20 వార్షిక సంవత్సరంలో కేటాయింపులు భారీగా తగ్గడంతో ముందస్తుగా అనుకున్న పలు కార్యక్రమాలను ఆయా శాఖలు వాయిదా వేసుకున్నాయి. ముఖ్యంగా నిర్మాణ పనులు చాలావరకు నిలిపేశారు.ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా మండల, డివిజన్ స్థాయిలో నిర్మించాలనుకున్న అంబేడ్కర్ భవనాలు, ఎస్సీ, ఎస్టీ వాడల అభివృద్ధి కాస్త నెమ్మదించింది. తాజాగా భారీగా నిధులు ప్రవేశపెట్టడంతో వాయిదా పడ్డ పనులన్నీ వేగంగా పూర్తికానున్నాయి. ఎస్డీఎఫ్ కింద కేటాయించిన బడ్జెట్‌ను దాదాపు 42శాఖలు సమన్వయంతో ఖర్చు చేస్తాయి.ఈ నేపథ్యంలో ఎస్డీఎఫ్ కింద కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ప్రభుత్వ శాఖలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని భావిస్తున్నాయి. -
బడ్జెట్లో భారీగా కేటాయింపులు
ఇది పూర్తి సమతుల్యత బడ్జెట్. సంక్షేమ తెలంగాణ కోసం రచించిన ప్రగతిశీల బడ్జెట్. రాష్ట్ర ఆదాయ వనరులు, ప్రజల అవసరాలకు మధ్య సమతుల్యత సాధించిన వాస్తవిక బడ్జెట్. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఎవరి ఊహలు, అంచనాలకు అందని విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్లో భారీ ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, పన్ను వృద్ధి రేటు తగ్గుదల, ఆర్థిక మాంద్యం, కోవిడ్ ప్రభావం, కేంద్ర సాయం వంటి అంశాలను అస్సలు ఖాతరు చేయలేదు. రైతు, పల్లె, పట్టణం అభివృద్ధే లక్ష్యంగా.. సంక్షేమమే పరమావధిగా 2020–21 సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రతిపాదించింది. రాష్ట్రంలోని ప్రతి రైతునూ రాజును చేసేవరకు నిద్రపోమంటూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానమిచ్చిన సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు అనుగుణంగానే ఈసారి బడ్జెట్లో అన్నదాతకు అగ్రతాంబూలమిచ్చింది. విద్యకు చదివింపులు ఘనంగా జరిపింది. ఆరోగ్య‘మస్తు’అనిపిం చింది. సంక్షేమానికీ సై అంది. ఆదివారం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న ఆర్థికమంత్రి హరీశ్‌రావు పింఛన్లకు పెద్ద మనసుతో నిధులిచ్చింది. పల్లె ప్రగతికి, పట్నం వృద్ధికి ప్రాధాన్యత కనబర్చింది. వెరసి.. పరిస్థితులు సహకరించకున్నా రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయంలో ఏమాత్రం రాజీపడలేదు. రైతు, పల్లె, పట్నం కేంద్రంగా అన్ని వర్గాలు, అన్ని శాఖలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆదివారం ఆర్థికమంత్రి హరీశ్‌రావు తొలిసారిగా శాసనసభలో ప్రవేశపెట్టారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శాసనమండలిలో బడ్జెట్ సమర్పించారు. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలూ లేనప్పటికీ, ఎన్నికల బడ్జెట్ తరహాలోనే అన్ని వర్గాలనూ సంతృప్తిపరిచే విధంగా బడ్జెట్లో కేటాయింపులు జరిపింది. 2019–20 బడ్జెట్ అంచనాలతో పోలిస్తే తాజా బడ్జెట్ ఏకంగా 25 శాతం మేర పెరిగింది. ఓటాన్ అకౌంట్‌తో సమానంగా.. అన్ని రకాల అంచనాలు, ఖర్చులు, కేటాయింపులను పెంచుతూ 2020–21 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. 2019–20 ఓటాన్ అకౌంట్ అంచనాలకు సమానంగా రూ.1.82 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. గతేడాది 1.82 లక్షల కోట్ల మేర ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టగా.. గతేడాది సెప్టెంబర్ 9న ప్రవేశపెట్టిన 2019–20 సాధారణ బడ్జెట్ అంచనాలు 1.46 లక్షల కోట్లకు తగ్గిపోయాయి. సవరించిన అంచనాల ప్రకారం అది రూ.1.42 లక్షల కోట్లకు తగ్గింది. ఈ నేపథ్యంలో ఆ మొత్తానికి రూ.40వేల కోట్లను కలిపి రూ.1.82 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా రాష్ట్ర ఆర్థిక పరపతి మెరుగ్గానే ఉన్నట్టు చూపించింది. పెరిగిన పన్ను అంచనాలు 2020–21 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను చూస్తే అన్ని రకాల పన్ను అంచనాలు పెరిగాయి. ఆర్థిక మాంద్యం ప్రభావం కారణంగా రాష్ట్ర పన్నుల రాబడితోపాటు కేంద్రం నుంచి వచ్చే వాటా తగ్గుతుందనే అంచనాలను తలకిందులు చేస్తూ పన్ను అంచనాలను భారీగా పెంచుతూ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ముఖ్యంగా పన్నేతర ఆదాయాన్ని 150శాతం వరకు పెంచింది. 2019–20 సవరించిన అంచనాల్లో రూ.12వేల కోట్లకు పైగా పన్నేతర ఆదాయం రాగా, ఈసారి దాన్ని ఏకంగా రూ.30,600 కోట్లకు పెంచింది. కేంద్ర పన్నుల్లో వాటా, జీఎస్టీతో కలిపి రాష్ట్ర పన్నులు, గ్రాంట్ ఇన్ఎయిడ్, అమ్మకపు, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ ఆదాయం, ఇతర పన్నులు.. ఇలా అన్ని కేటగిరీల్లోనూ పెద్ద ఎత్తున రాబడులను ఆశిస్తూ ప్రతిపాదనలు చేసింది. పన్నుల ద్వారా మొత్తం రూ.85,300 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేసింది. ఈసారి రెవెన్యూ రాబడి రూ.1.43 లక్షల కోట్లకు పైగా ఉంటుందని, ఇందులో 1.38 లక్షల కోట్ల వ్యయం పోగా రూ.4,482 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని లెక్కగట్టింది. అయితే, ద్రవ్యలోటు మాత్రం భారీ పెరిగింది. 2019–20లో ద్రవ్యలోటు రూ.24వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేయగా, సవరించిన అంచనాల్లో అది రూ.21,913 కోట్లకు తగ్గింది. అయితే, 2020–21 ఆర్థిక సంవత్సరానికి అది రూ.33,191.25 కోట్లకు పెరిగింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల కంటే ఇది దాదాపు రూ.11వేల కోట్లు ఎక్కువ. ఆదాయమార్గాల కోసం అన్వేషణ... పరిస్థితులు సానుకూలంగా లేకున్నా భారీ బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కూడా అప్పులు, భూములు, నిరర్థక ఆస్తులపైనే ఆశలు పెట్టుకుందని అర్థమవుతోంది. హరీశ్‌రావు బడ్జెట్ ప్రసంగంలోనూ, ఆ తర్వాత విలేకరులతో మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని నర్మగర్భంగానే వెల్లడించారు. ఆదాయ పెంపు మార్గాలను అన్వేషిస్తున్నామని, ‘దిల్’సంస్థను తెరపైకి తెస్తున్నామని, భూముల అమ్మకాలకు సిద్ధంగా ఉన్నామని, రాజీవ్ గృహకల్ప వంటి నిరర్థక ఆస్తులను విక్రయిస్తామని, సొంత రాబడులను పెంచుకునే మార్గాలపై దృష్టి పెడతామని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగానే 2019–20లో రూ.12వేల కోట్లకు పైగా ఉన్న పన్నేతర ఆదాయాన్ని రూ.30,600 కోట్లకు పెంచినట్టు అర్థమవుతోంది. ఈ రెండేళ్ల ప్రతిపాదనల మధ్య ఉన్న దాదాపు రూ.18వేల కోట్ల వ్యత్యాసాన్ని భూములు, నిరర్థక ఆస్తుల అమ్మకం ద్వారానే సమకూర్చుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రైతన్నే రారాజు.. ఎన్నికల్లో కీలక హామీ అయిన రైతు రుణమాఫీ అమలుకు ఈ బడ్జెట్లో సర్కారు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.6,200 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. రైతుబంధు సాయాన్ని రూ.12వేల కోట్ల నుంచి రూ.14వేల కోట్లకు పెంచింది. రైతుబీ మాను పెంచడంతో పాటు మార్కెట్ స్థిరీకరణ నిధిని కూడా పక్కాగా కేటాయించడం ద్వారా రైతన్నకు జైకొట్టింది. ఇక పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలకు రూ.25వేల కోట్ల మేర కేటాయింపులు జరిపింది. ఇప్పటివరకు అమలవుతున్న అన్ని పథకాలను కొనసాగిస్తూనే కొత్తగా 57 ఏళ్లు నిండిన వారికి ఆసరా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. పింఛన్లకు దాదాపు రూ.12వేల కోట్లు ప్రతిపాదనలు చేసింది. హైదరాబాద్‌కు ప్రత్యేకంగా రూ.10వేల కోట్లు కేటాయించడం ద్వారా విశ్వనగర అభివృద్ధికి బాటలు వేసింది. జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూ.26వేల కోట్లకు పైగా నిధులు కేటాయించిన ప్రభుత్వం.. డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణ అవసరాలకు అనుగుణంగా గృహ నిర్మాణశాఖకు రూ.11వేల కోట్లకు పైగా నిధులు ప్రతిపాదించింది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇప్పటివరకు ఉన్న బకాయిలను కూడా కలిపి రూ.2,600 కోట్ల మేర నిధులు కేటాయించింది. మొత్తం బడ్జెట్ రూ. 1,82,914.42 కోట్లు ప్రగతి పద్దు రూ. 1,04,612.62 కోట్లు నిర్వహణ పద్దు రూ. 78,301.80 కోట్లు బడ్జెట్ అంచనాలివే.. (రూ.కోట్లలో) రెవెన్యూ రాబడి 1,43,151.94 రెవెన్యూ వ్యయం 1,38,669.82 పన్ను రాబడి 85,300.00 పన్నేతర రాబడి 30,600.00 కేంద్రం వాటా 16,726.58 గ్రాంట్లు 10,525.36 రుణాలు 35,500 మూలధన వ్యయం 22,061.18 రెవెన్యూ మిగులు 4,482 ద్రవ్యలోటు 33,191.25 రూ. 65,480 తలసరి అప్పు.. రాష్ట్ర ప్రజలపై పెరిగిన అప్పుల భారం -
ద్రవ్య లోటును అధిగమిస్తాం
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లా కేంద్రాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పుంజుకున్నందున డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ద్వారా ఇతర రూపాల్లో ప్రభుత్వ భూములు, నిరర్థక ఆస్తులు, రాజీవ్ స్వగృహ ఇళ్లు విక్రయించి ఆదాయ సామర్థ్యాన్ని పెంచుకుంటామని మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. ఆదివారం బడ్జెట్ సమర్పణ అనంతరం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర అధికారులతో కలసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భూముల అమ్మకంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావిస్తోందని, ఇందుకు అనుగుణంగానే సుప్రీంకోర్టు ద్వారా రాష్ట్రానికి చెందిన విలువైన భూములు తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు. రెండు నెలల క్రితం మద్యం ధరలు పెరిగినందున, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ మేరకు ఎక్సైజ్ ఆదాయం కూడా పెరిగే అవకాశాలున్నాయని వెల్లడించారు. దీంతో పాటు ద్రవ్య లోటును సొంత ఆదాయం పెంచుకోవడం, వ్యవస్థలోని లోపాలను పూడ్చుకోవడం, ఇతరత్రా రూపాల్లో భర్తీ చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుందని, హైదరాబాద్‌లో రియల్ వ్యాపారానికి భారీగా డిమాండ్ ఉన్నందున, ఆదాయం కోసం భూములను అమ్మేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. అనుకున్న ఫలితాలు సాధిస్తాం.. భవిష్యత్‌లో ఎలాంటి ఎన్నికలు లేనందున, ఇకపై పూర్తిగా కేబినెట్, అధికార యంత్రాంగం పరిపాలనపై పూర్తి దృష్టి పెట్టి అనుకున్న ఫలితాలను సాధిస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ చెప్పారు. కేంద్రం నుంచి టాక్స్ డివల్యూషన్ కింద 2019–20లో రాష్ట్రానికి రావాల్సింది భారీగా తగ్గిందని, 15వ ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు 2020–21లో రావాల్సిన మేర గ్రాంట్లు, వనరులు రాలేదన్నారు. జీఎస్టీ చెల్లింపుల్లో భాగంగా కేంద్రం నుంచి రూ. 2,600 కోట్లే వచ్చాయని, ఇంకా రూ. 933 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కేంద్రం నుంచి జీఎస్టీ కంపన్సేషన్ రావాల్సిన నిధుల కోత ఉన్నా, గతేడాదితోపాటు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా సంక్షేమానికి కోతలు పెట్టలేదన్నారు. సంక్షేమానికి నిధుల కేటాయింపుతోపాటు ఈ బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు పెట్టాలనేది పెద్ద నిర్ణయమన్నారు. కాళేశ్వరం వల్ల 150 కి.మీ. పొడవునా గోదావరి పారుతున్నందున రూ. 300 కోట్లతో గోదావరి రివర్ ఫ్రంట్ టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్రమంత్రే ఆ విషయాన్ని చెప్పారు.. ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే తెలంగాణ అప్పులు తీసుకుందని ఇటీవల లోక్‌సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొనడాన్ని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఇప్పటికే భారీగా అప్పులు చేశారని, ఇంకా చేస్తున్నారని రాజకీయంగా వస్తున్న విమర్శలకు ఇదే తగిన సమాధాన మన్నారు. ఐజీఎస్టీ సెటిల్మెంట్ సరిగా జరగలేదని కాగ్ తెలిపిందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. అన్ని రాష్ట్రాలకు పంపిణీ తప్పుగా జరిగిందని, తెలంగాణకు రూ.2,300 కోట్ల మేర అన్యాయం జరిగినట్లు వెల్లడించిందన్నారు. ఈ విషయమై కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ ఇప్పటికే లేఖలు రాసినందున,ఈ మేరకు రాష్ట్రానికి డబ్బు వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించారు. -
లిక్కర్ ‘లిక్విడ్’పై అంచనా.. 16 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మద్యం ఆదాయంపై భారీ అంచనాలే పెట్టుకుందని బడ్జెట్ ప్రతిపాదనలు చెబుతున్నాయి. 2019–20 సంవత్సరంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.10,637 కోట్లు వస్తాయని అంచనా వేయగా, ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.12,600 కోట్లు ఆదాయం వస్తుందని సవరించిన అంచనాల్లో పేర్కొన్నారు. దీంతో 2020–21కి దీనికి దాదాపు 30 శాతం అదనంగా రూ.16 వేల కోట్ల అంచనాలను ప్రతిపాది ంచారు. అలాగే అన్ని రకాల పన్ను అంచనాలు కూడా ఈసారి పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. పన్నుల్లో కేంద్ర వాటాతో సహా రాష్ట్ర పన్నులు (జీఎస్టీతో కలిపి), అమ్మకపు పన్ను, వాణిజ్య పన్ను, ఇతర పన్నులను కూడా పెంచుతూ 2020–21 బడ్జెట్ అంచనాలు ప్రతిపాదించారు. పన్ను ఆదాయంతో పాటు పన్నేతర ఆదాయంపై కూడా ప్రభుత్వం భారీగానే ఆశలు పెట్టుకుంది. 2019–20 సంవత్సరంలో పన్నేతర ఆదాయం కింద రూ.10,007 కోట్ల ఆదాయం అంచనా వేయగా, సవరించిన అంచనాల్లో రూ.12,275 కోట్లుగా పేర్కొంది. అయితే అంచనాలకు అందని విధంగా ఈసారి 2020–21 బడ్జెట్లో పన్నేతర ఆదాయ అంచనాను రూ.30,600 కోట్లుగా చూపెట్టింది. ఆదాయ పెంపు మార్గాలపై ప్రభుత్వం స్పష్టతకు వచ్చిందని, అందుకే పన్నేతర ఆదాయాన్ని 150 శాతం వరకు పెంచిందని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర పన్నులపై ఆశ.. ఇటు కేంద్ర పన్నులపై కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆశ తగ్గలేదు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి రూ.18,560 కోట్లు కేంద్రం నుంచి వస్తాయని అంచనా వేయగా, సవరించిన అంచనాల్లో అది రూ.15,987 కోట్లు మాత్రమే వచ్చింది. దీనికి కొంత అదనంగా 2020–21 బడ్జెట్లో కేంద్ర పన్నుల వాటా కింద రూ.16,726 కోట్లు ప్రతిపాదించింది. ఇక కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్‌లో 2019–20 సవరించిన అంచనాల కంటే తక్కువగానే 2020–21 సంవత్సరానికి అంచనా వేసింది. -
అన్నదాతకు అందలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అగ్రస్థానం కల్పించింది. బడ్జెట్ కేటాయింపుల్లో వ్యవసాయం, అనుబంధ శాఖలకు పెద్దపీట వేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 25,811.78 కోట్లు కేటాయించింది. గతం కంటే ఈసారి బడ్జెట్లో వ్యవసాయ, అను బంధ రంగాలకు అత్యంత ప్రాధాన్యం కల్పించడం విశేషం. అందులో ప్రగతి పద్దు రూ. 23,405.57 కోట్లు కాగా మిగిలిన రూ. 2,406.21 కోట్లు నిర్వహణ పద్దు. మొత్తం వ్యవసాయ అనుబంధ శాఖల బడ్జెట్లో ప్రగతి పద్దు కింద కేవలం వ్యవసాయ రంగానికి రూ. 23,221.15 కోట్లు కేటాయించగా సహకార, మార్కెటింగ్‌శాఖలకు రూ. 7.42 కోట్లు, పశుసంవర్థక శాఖకు రూ. 177 కోట్లు కేటాయిం చింది. వ్యవసాయ రంగానికి కేటాయించిన ప్రగతి పద్దు బడ్జెట్లో రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీలకే అగ్రస్థానం కల్పిం చారు. రైతు బంధు పథకం అమలు కోసం రూ. 14 వేల కోట్లు కేటా యించారు. 2018–19 బడ్జెట్లో రూ. 12 వేల కోట్లు కేటాయించగా దానికి అదనంగా రూ. 2 వేల కోట్లు కేటాయించడం గమనార్హం. కొత్త పాస్‌పుస్తకాలు మంజూరు కావడం వల్ల రైతు బంధు లబ్ధిదారుల సంఖ్య వచ్చే ఏడాది పెరగనుండటంతో పెరిగే లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా బడ్జెట్లో రూ. 2 వేల కోట్లు అదనంగా పెంచినట్లు సర్కారు తెలిపింది. అంతేగాకుండా సాగునీటి ప్రాజెక్టులు పూర్తికా వడం, పంటల సాగు విస్తీర్ణం పెరగడం వల్ల కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రైతుబంధుకు గత బడ్జెట్లో కేటాయించిన సొమ్ముకు 1.20 కోట్ల ఎకరాలను పరిగణనలోకి తీసుకోగా ఈసారి కొత్త పాస్‌పుస్తకాల సంఖ్య పెర గడం, ప్రాజెక్టులు, జలాశయాల ద్వారా మొత్తంగా 20 లక్షల ఎకరాల ఆయకట్టు అదనంగా పెరిగిందన్న అంచనాతో 1.40 కోట్ల ఎకరాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం కేటాయింపులు చేసింది. రైతుబంధు ద్వారా 2018–19 ఖరీఫ్‌లో రూ. 5,235 కోట్లు, రబీలో రూ. 5,244 కోట్లు పంపిణీ చేయగా 2019–20లో ఎకరానికి రూ. 10 వేల చొప్పున రూ. 12 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించారు. రైతు రుణమాఫీకి రూ. 6,225 కోట్లు... గత ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రకటించడం తెలిసిందే. అయితే గతంలో చేసిన రుణమాఫీకి, ఇప్పుడు రుణమాఫీకి కాస్త తేడా ఉంది. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో రూ. లక్షలోపు ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని టీఆర్ఎస్ ప్రకటించి అందుకు అనుగుణంగా రూ. 16,124 కోట్లను నాలుగు విడతల్లో మాఫీ చేసింది. ఈసారి బడ్జెట్లో రూ. 6,225 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో రూ. 25 వేలలోపు రుణాలున్న రైతులు 5,83,916 మంది ఉండగా వారందరి రుణాలను నూరు శాతం ఒకే దఫాలో మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం కొత్త నిర్ణయం. గతానికి ఇప్పటికీ ఇదే ప్రధాన తేడా. ఒకేసారి వారందరికీ రూ. 1,198 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ రుణమాఫీ మొత్తాలను ప్రతి రైతుకు వ్యక్తిగతంగా చెక్కుల రూపంలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా అందజేస్తారు. అది కూడా ఈ నెలలోనే ఇస్తారు. ఇక రూ. 25 వేల నుంచి రూ. లక్షలోపు ఉన్న రుణాలు రూ. 24,738 కోట్లుగా ఉండగా ఆయా రైతుల సంఖ్య ఎంతనేది వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. ఈ సొమ్మును మాత్రం నాలుగు విడతలుగా అందజేస్తారు. అంటే నాలుగేళ్లలో క్లియర్ చేసే అవకాశముంది. వాటిని కూడా చెక్కుల రూపంలో ఎమ్మెల్యేల చేతుల మీదుగానే అందిస్తారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్‌కు రూ. 1,000కోట్లు ఈ బడ్జెట్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కోసం ఏకంగా రూ. వెయ్యి కోట్లు కేటాయించడం విశేషం. కేంద్ర ప్రభుత్వం ప్రతిసారీ మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన పంటల విష యంలో పరిమితి విధిస్తుండటంతో రైతులు దళారులను ఆశ్రయించే పరిస్థితి తలెత్తుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వరి, పత్తి, మొక్కజొన్న, కందులు తదితర పంటల కొనుగోలుకు పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు సరైన ధర వచ్చేలా చేయాలనేది సర్కారు ఉద్దేశం. ఈ ఏడాది పండిన కందులలో కొద్ది శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. కంది రైతులను ఆదుకునే లక్ష్యంతో ఎంత ఖర్చయినా సరే మొత్తం కందులను కొనుగోలు చేయాలని బడ్జెట్లో స్పష్టం చేసింది. అలాగే ఈ ఏడాది రూ.600 కోట్లతో మైక్రో ఇరిగేషన్ కార్యక్రమాలను అమలు చేయాలని నిర్ణయించింది. రైతు బీమాకు రూ. 1,141 కోట్లు.. రైతు బీమాకు ప్రస్తుత బడ్జెట్లో రూ. 1,141 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో ఏ రైతు, ఏ కారణంతో మరణించినా ఆ కుటుంబానికి వెంటనే రూ. 5 లక్షలు అందించడమే దీని ఉద్దేశం. 18 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న ప్రతి రైతుకూ బీమా సదుపాయం కల్పిస్తారు. ప్రతి రైతు పేరిట రూ. 2,271.50 ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే ఎల్ఐసీ సంస్థకు క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. రైతు చనిపోయిన 10 రోజుల్లోపే వారి కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షలు బీమా పరిహారం చెల్లిస్తుంది. ఒక్కో రైతు వేదికకు రూ. 12 లక్షలు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 5 వేల ఎకరాల క్లస్టర్‌కు ఒకటి చొప్పున రైతు వేదికలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఒక్కో రైతు వేదికను రూ. 12 లక్షలతో నిర్మించాలని బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించింది. అందుకోసం మొత్తం రైతు వేదికల నిర్మాణానికి ఈ బడ్జెట్లో రూ. 350 కోట్లు కేటాయించింది. పాడి రైతులకు అందించే ప్రోత్సాహకం కోసం ఈసారి బడ్జెట్లో రూ. 100 కోట్లు, పశుపోషణ, మత్స్యశాఖకు రూ. 1,586.38 కోట్లు కేటాయించారు. వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయశాఖ భావించినా బడ్జెట్లో మాత్రం నిరాశే ఎదురైంది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ. 304.34 కోట్లు కేటాయించగా ఈసారి మాత్రం కేటాయింపులు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రైతులకు విత్తన సరఫరా కోసం రూ. 55.51 కోట్లు కేటాయించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి గత బడ్జెట్లో రూ. 20 కోట్లు కేటాయించగా ఇప్పుడు రూ. 25 కోట్లు కేటాయించారు. విత్తనాల సబ్సిడీకి రూ. 142 కోట్ల మేర కేటాయింపులు చేశారు. రైతు బడ్జెట్ ఇది రైతు బడ్జెట్ అని మళ్లీ నిరూపితమైంది. బడ్జెట్లో అగ్రభాగం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించడం సంతోషకరం. రైతుబంధు పథకానికి అదనంగా రూ. 2 వేల కోట్లు కేటాయించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. లక్షలోపు రైతు రుణాల మాఫీ కోసం రూ. 6,225 కోట్లు కేటాయించారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు పంటల కొనుగోళ్ల కోసం రూ. 1,000 కోట్లు కేటాయించడం సాహసోపేతమైన చర్య. – నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి -
మైక్ ఇవ్వండి.. రూం కేటాయించండి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజల సమస్యలను ప్రస్తావించేందుకు తమకు మైక్ ఇచ్చే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్‌ను కోరారు. ఆదివారం సభ వాయిదా పడిన అనంతరం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చాంబర్‌కు వెళ్లి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంపై సద్విమర్శలు చేస్తూ ప్రజా సమస్యలను సీఎం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే ప్రతిపక్షంగా తమ బాధ్యత అని, ఈ విషయంలో తమకు సహకరించాలని కోరారు. అసెంబ్లీ లాబీల్లో కాంగ్రెస్ సభ్యులు కూర్చుని మాట్లాడుకునేందుకు కనీసం గది కూడా లేదని, వెంటనే తమకు ప్రత్యేక రూం కేటాయించాలని స్పీకర్‌ను కోరారు. -
ఇది అవాస్తవ బడ్జెట్: పొన్నాల
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ (2020-21) పూర్తిగా అవాస్తవ బడ్జెట్ అని టీపీసీసీ మాజీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆర్థిక మాంద్యం అంటూ అసెంబ్లీలో అవాస్తవ బడ్జెట్ ప్రవేశ పెట్టారని విమర్శించారు. 2014 ఎన్నికల ముందు ఇచ్చిన మూడు ప్రధాన హామీలను బడ్జెట్లో ప్రస్తావించలేదని మండిపడ్డారు. దళితులకు మూడెకరాల భూమి గురించి బడ్జెట్లో ఎందుకు ప్రస్తావించలేదని పొన్నాల ప్రశ్నించారు. కొన్ని వేల ఎకరాలను పేదలకు పంచిన చరిత్ర కాంగ్రెస్‌దేనని తెలిపారు. బడ్జెట్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదని ధ్వజమెత్తారు. బడ్జెట్ ప్రసంగంలో లో 2 లక్షల ఇళ్లు ఇచ్చామని అబద్ధాలు చెబుతున్నారని నిప్పులు చెరిగారు. రాజ్యాంగ పరంగా గిరిజనులకు రావాల్సిన రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓట్లు అడిగే ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి.. ఈ ఏడాది ఇవ్వలేమంటూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని పొన్నాల డిమాండ్ చేశారు. -
రాష్ట్ర బడ్జెట్ జనరంజకంగా ఉంది
సాక్షి, హైదరాబాద్ : ఆదివారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ బడ్జెట్ ప్రతిపాదించారన్నారు. సంక్షేమ, వ్యవసాయ రంగాలకు ఈ బడ్జెట్లో ప్రముఖ స్థానం కల్పించారని సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. పేద, మద్య తరగతి వర్గాలకు ఈ బడ్జెట్ ఆశాజనకంగా ఉందని నోముల నర్సింహయ్య పేర్కొన్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక సామాజిక ఇంజనీర్ లాగా ఆలోచించి బడ్జెట్‌ను రూపొందించారని, దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నా సంక్షేమ రంగంలో ఎలాంటి కోతలు విదించకపోవడం వెల్లడించారు. ఇరిగేషన్‌కు 11వేల కోట్లు కేటాయించడం కాంగ్రెస్‌కు చెంపపెట్టన్నారు. పాలమూరు-రంగారెడ్డి విషయంలో మా ప్రభుత్వం దృడ నిశ్చయంతో ఉందని తెలిపారు. 57 సంవత్సరాల వారందరూ పెన్షన్‌కు అర్హులని చెప్పిన సీఎం వారికి రూ.2016 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా లేని పథకాలు తెలంగాణలో ఉన్నాయని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. -
తెలంగాణ రైతులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. రూ.25వేల లోపు ఉన్న రుణాలను ఈ నెలలోనే మాఫీ చేస్తామని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2020-21ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆదివారం శాసన సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రూ. 25 వేల రూపాయల లోపు ఉన్న రుణాలు ఉన్న రైతులు...5 లక్షల 83 వేల 916 మంది ఉన్నారని తెలిపారు. వీరి రుణాలను ఒకే దఫా కింద మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. (చదండి : తెలంగాణ బడ్జెట్ 2020-21 హైలైట్స్) ఈ నెలలోనే రూ.25వేల లోపు ఉన్న రుణాలు మాఫీ చేయడానికి రూ.1,198 కోట్లు విడుదల చేయబోతున్నామని తెలిపారు. ఈ రుణమాఫి మొత్తాన్ని చెక్కుల రూపంలో ఎమ్మెల్యేలు రైతులకు అందిస్తామని చెప్పారు. 25 వేల నుంచి లక్ష లోపు ఉన్న రుణాలను మొత్తం రూ. 24 వేల 738 కోట్లు ఉన్నాయన్నారు. నాలుగు విడతలుగా ఎమ్మెల్యేలు చెక్కుల రూపంలో అందించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది రైతు రుణమాఫీ కోసం రూ. 6 వేల 225 కోట్లను ప్రతిపాదించామన్నారు. ఎంత ఖర్చైనా కందులను కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. -
లక్షా 82 వేల కోట్ల తెలంగాణ బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఆదివారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌రావు 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను శాసనసభలో ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్దే లక్ష్యంగా వాస్తవిక కోణంలో బడ్జెట్ రూపొందించినట్టు హరీష్ తెలిపారు. ఆయన ప్రసంగిస్తూ.. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుంటుంది. బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. బడ్జెట్ అంటే కాగితాల లెక్కలు కాదు.. సామాజిక స్వరూపం’అని మంత్రి పేర్కొన్నారు. 2020-21 ఆర్థిక ఏడాదికి గాను రాష్ట్ర బడ్జెట్ 1,82,914.42 కోట్లుగా హరీష్‌రావు పేర్కొన్నారు. అదేవిధంగా రెవిన్యూ వ్యయం 1,38,669.82 కోట్లు, క్యాపిటల్ వ్యయం 22,061.18 కోట్లు, ఆర్ధిక లోటు 33,191.25 కోట్లుగా మంత్రి వెల్లడించారు. ఇక ఆర్థిక మంత్రి హోదాలో హరీష్‌రావు తొలిసారి శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగా.. మండలిలో శాసనసభా వ్యవహా రాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. హరీష్‌రావు ప్రసంగం హైలైట్స్: గతేడాది నుంచి దేశవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ప్రభావం ఉంది కేంద్రం నుంచి జీఎస్టీ రావడం లేదు 2019-20 వృద్ధి రేటు 6.5శాతంగా ఉంది గత బడ్జెట్లో ప్రవేశపెట్టిన అంచనాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి నాటికి ఖర్చు రూ.1.36 లక్షల కోట్లు 2018-19లో 14.3% ఉన్న జీఎస్డీపీ 19-20కి 12.6% తగ్గింది తెలంగాణ ఆర్థిక బడ్జెట్ 2020-21 ఏడాదికి గాను 1,82,914.42 కోట్లు రెవిన్యూ వ్యయం 1,38,669.82 కోట్లు క్యాపిటల్ వ్యయం 22,061.18 కోట్లు ఆర్ధిక లోటు 33,191.25 కోట్లు సవరించిన అంచనా ప్రకారం.. 2019-20కి చేసిన అంచనా వ్యయం 1,42,152.28 కోట్లు రూ.25వేలు రుణం ఉన్న రైతులకు ఏకకాలంలో మాఫీ ఈనెలలోనే రుణమాఫీ పూర్తి చేస్తాం రూ.25వేల నుంచి లక్ష లోపు ఉన్న రుణాలు 4 విడతలుగా పంపిణీ చెక్కులను స్థానిక ఎమ్మెల్యేలు రైతులకు అందిస్తారు ఎంత ఖర్చైనా సరే కందులను కొనుగోలు చేస్తాం రైతుబంధు పథకానికి రూ.14వేల కోట్లు కేటాయింపు మూసీ రివర్‌ఫ్రంట్ కోసం రూ.10వేల కోట్లు కేటాయింపు మున్సిపల్‌శాఖకు 14,809 కోట్లు కేటాయింపు హైదరాబాద్ అభివృద్ధి కోసం వచ్చే ఐదేళ్లలో రూ.50వేల కోట్లు పాఠశాల విద్య కోసం రూ.10,421 కోట్లు ఉన్నత విద్యాశాఖకు రూ.1,723 కోట్లు హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాలు 118 నుంచి 350కి పెంపు వైద్య రంగానికి రూ.6,156 కోట్లు పంచాయతీరాజ్ శాఖకు రూ.23,005 కోట్లు కల్యాణలక్ష్మీ పథకానికి రూ.1,350 కోట్లు కేటాయింపు గృహ నిర్మాణానికి రూ.11,917 కోట్లు మైనారిటీల కోసం రూ.1,518 కోట్లు ఎస్సీ సంక్షేమం కోసం రూ.16534.97 కోట్లు ఎస్టీ సంక్షేమం కోసం రూ.9,771.27 కోట్లు ఆసరా పెన్షన్ల కోసం రూ.11,750 కోట్లు సాగునీటి రంగానికి రూ.11,054 కోట్లు రవాణా, రోడ్లుభవనాలశాఖకు రూ.3494 కోట్లు పోలీస్‌శాఖకు రూ.5,852 కోట్లు కేటాయింపు విద్యుత్‌శాఖకు రూ.10,416 కోట్లు కేటాయింపు అటవీశాఖకు రూ.791 కోట్లు కేటాయింపు పారిశ్రామిక రంగ అభివృద్ధికి రూ.1,998 కోట్లు ఎస్డీపీ నిధుల కోసం రూ.480 కోట్లు కేటాయింపు మైక్రో ఇరిగేషన్ కోసం రూ.600 కోట్లు కేటాయింపు పాడిరైతుల ప్రోత్సాహం కోసం రూ.100 కోట్లు మహిళలకు వడ్డీ లేని రుణాల కోసం రూ.1,200 కోట్లు పశుపోషణ, మత్స్యశాఖకు రూ.1,586.38 కోట్లు వచ్చే విద్యా సంవత్సరం నుంచి 71 మైనారిటీ జూనియర్ కళాశాలలు ఏర్పాటు ఈ ఏడాది నుంచి 55 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్ రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా రాయదుర్గం - శంషాబాద్ బీహెచ్ఈఎల్-లక్డీకాపూల్ వరకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి రాష్ట్రంలో 2,72,763 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి దేశంలో తలసరి విద్యుత్ వినియోగం 1181 కాగా రాష్ట్రంలో 1896 యూనిట్లు హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాలు 118 నుంచి 350కి పెంపు మరో 232 దవాఖానాలు త్వరలో ప్రారంభిస్తాం తెలంగాణలో కరోనా వైరస్ లేదు ఇప్పటి వరకు 12,427 పరిశ్రమలకు అనుమతులిచ్చాం 14 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్లకు పెంపు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బోర్డు హరీష్‌రావు బడ్జెట్ ప్రసంగం ముగియడంతో శాసనసభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. -
సైగలతో సస్పెండ్ చేశారు..
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు. శాంతి భద్రతలు అసలే లేవు. వేలిసైగలు, కంటిచూపుతో సభ నుంచి ప్రతిపక్షాన్ని బయటకు పంపించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉరకలు పెడుతోందని ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంలో చెప్పించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా ఉరకలు పెడుతోందో అసెంబ్లీ ద్వారా ప్రజలకు చెబుదామనుకుంటే మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేశారు’అని రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. శనివారం అసెంబ్లీ నుంచి సస్పెం డైన అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు డి.శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి, సీతక్క, పొడెం వీరయ్యతో కలసి ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. మార్క్‌ఫెడ్ డైరెక్టర్‌గా నామినేషన్ వేసేందుకు వెళ్లిన కాంగ్రెస్‌కు చెందిన మునుగోడు పీఏసీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డిపై మంత్రి నిరంజన్‌రెడ్డి, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి దౌర్జన్యం చేశారని భట్టి ఆరోపించారు. 150 మంది గూండాలను పెట్టుకుని శ్రీనివాస్‌రెడ్డి చేతిలో ఐడీ కార్డులు లాక్కుని, అసభ్య పదజాలంతో దూషించి, బట్టలు చించి, పిడిగుద్దులు గుద్ది నామినేషన్ వేయకుండా చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని సభలో చెప్పాలని ప్రయత్నిస్తే మైక్ ఇవ్వకుండా సస్పెండ్ చేశారన్నారు. సభా నాయకుడు సైగలు చేస్తే అసెంబ్లీ వ్యవహారాల మంత్రి సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టారని, ఒక్క సభ్యుడి పేరుతో తీర్మానం ప్రవేశపెట్టి అందరినీ సస్పెండ్ చేశారని దుయ్యబట్టారు. నిజాలు బయటపడతాయనే భయంతోనే.. ప్రతిపక్షం చెప్పే నిజాలు బయటకు వెళ్తే తమ బండారం బయటపడుతుందనే భయంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ సభ్యులందరినీ సస్పెండ్ చేసిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. మున్సిపల్ మంత్రిగా, రెగ్యులటరీ అథారిటీ అధిపతిగా కేసీఆర్ కుమారుడు కేటీఆర్.. జీవో 111కి విరుద్ధంగా వ్యవహరించారని విమర్శించారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వందల, వేల ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారని ఆరోపించారు. కేటీఆర్‌కు మంత్రిగా కొనసాగే అర్హత లేదని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
సీఎం.. ఏ ప్రాంతానికి?: రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో శనివారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరి గింది. ఒకదశలో సహనం కోల్పోయిన ఇరువురు నేతలు నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో సవాలు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరంపై ఉన్న శ్రద్ద పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై లేదని, ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రా లేదా ఓ ప్రాంతానికా అనేది అర్థం కావడం లేదని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఎర్రబెల్లి జోక్యం చేసుకుని రాజగోపాల్‌రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత అసహనానికి లోనైన రాజగోపాల్‌రెడ్డి తెలంగాణ ద్రోహులను తెచ్చి నెత్తిన పెట్టుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఎదురుదాడికి దిగారు. సీఎం కేసీఆర్ దర్శన భాగ్యం దొరకడం లేదని, మంత్రులు ఎవరెక్కడ ఉన్నారో తెలియడం లేదని ఆరోపించారు. దీంతో ఎర్రబెల్లి.. ఇలాగే మాట్లాడితే పరుగెత్తించి కొడతారంటూ రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. గడచిన 13 నెలల నుంచి సీఎం దర్శనం దొరకడంలేదని రాజగోపాల్‌రెడ్డివిమర్శించారు. వందమంది కౌరవులకు ఐదుగురు చాలు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ– ‘తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు. శాసనసభలో వందమంది ఉన్నారని టీఆర్ఎస్ విర్రవీగుతోంది. వందమంది కౌరవులను ఐదుగురు పాండవులు ఏం చేశారో గుర్తుంచుకోవాలి. డబ్బుతో రాజకీయాలను భ్రష్టు పట్టించారు. ప్రభుత్వం కార్పొరేట్ ఆస్పత్రులకు దాసోహమవుతూ.. ప్రభుత్వాస్పత్రులను నిర్వీర్యం చేస్తోంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎర్రవెల్లి, గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో నిర్మిస్తే సరిపోతుందా?. ఇంటింటికీ నల్లానీరు రాకపోతే ఓట్లడగనని ఎన్నికల్లో హామీనిచ్చారు. ఆరేళ్లయినా నల్లా నీళ్లు రాలేదు. నా నియోజకవర్గంలో 14 నెలలైనా క్యాంపు ఆఫీసు నిర్మించలేదు. ఏ పనికీ ప్రభుత్వం బిల్లులు చెల్లించట్లేదు. పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలకు దోచిపెట్టేందుకే కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోంది’అని ధ్వజమెత్తారు. -
కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో సీఎం ప్రసంగానికి అడ్డు తగిలినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై శనివారం సస్పెన్షన్ వేటు పడింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా కాంగ్రెస్ ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆయన ప్రసంగాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్‌కి చెందిన పీఏసీఎస్ చైర్మన్‌ను టీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేశారం టూ ఆరోపించారు. దీంతో రాజగోపాల్‌రెడ్డితోపాటు మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, పోడెం వీరయ్య, సీతక్కను ఒక రోజు సస్పెండ్ చేయాలంటూ సభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రతిపాదించిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. ఆ వెంటనే వారు సస్పెండ్ అయినట్లు స్పీకర్ ప్రకటించారు. అంతకుముందు నల్లగొండ జిల్లాకు చెందిన పీఏసీఎస్ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి మార్క్‌ఫెడ్ డైరెక్టర్‌గా నామినేషన్ వేయడానికి ప్రయత్నించినప్పుడు టీఆర్ఎస్ నాయకులు కిడ్నాప్ చేశారంటూ మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన విఫలయత్నం చేశారు. తనకు మైక్ ఇవ్వాలని స్పీకర్‌ను కోరగా తోసిపుచ్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానం ఇవ్వాలని సీఎంని కోరారు. ముఖ్యమంత్రి లేచి మాట్లాడుతుండగా రాజగోపాల్‌రెడ్డి నల్లగొండ జిల్లా పీఏసీఎస్ చైర్మన్ వ్యవహారంపై గట్టిగా అరుస్తూ చెప్పే ప్రయత్నం చేశారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా రాజగోపాల్‌రెడ్డికి తోడుగా లేచి నిలబడ్డారు. అత్యవసర అంశాన్ని ప్రస్తావించేందుకు ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని పదేపదే కోరారు. సీఎం ప్రసంగంపై వివరణలకు సమయం ఇస్తామని స్పీకర్ చెప్పినా కాంగ్రెస్ సభ్యులు పట్టువీడలేదు. ఈ సమయంలో కోమటిరెడ్డి బిగ్గరగా అరుస్తూ ఏదో చెప్పబోతుంటే సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా నిబంధనలు తెలియవా..?: సీఎం ‘అటు నలుగురే. ఇటు ఎంతమంది ఉన్నారో చూడండి. మీకంటే రెట్టింపు అరవగలం. సభా సంప్రదాయానికి కట్టుబడి ఉన్నాం. ప్రజాతీర్పును గౌరవించరు. వెళ్లాలంటే వెళ్లిపోండి. ఈ రాద్ధాంతం ఎందుకు? సభలో సభా నాయకుడు ప్రసంగిస్తున్నారనే సంస్కారం కూడా మీకు లేదు. సీఎం ప్రసంగం వినే ఓపిక కూడా మీకు లేదు.’’అని కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. సభలో సీఎం మాట్లాడేందుకు లేచినప్పుడు అడ్డుకోరాదనే సభా నిబంధనలు కూడా తెలియదా? లేక తెలిసే అడ్డుకోవాలని అనుకుంటున్నారా? ఇదేం పద్ధతి? సస్పెండ్ చేయాలంటూ సీఎం అనడంతో శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి లేచి సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. -
1.58లక్షల కోట్ల పద్దు!
సాక్షి, హైదరాబాద్: గతేడాది ఓటాన్ అకౌంట్ తో పోలిస్తే సాధారణ బడ్జెట్‌కు భారీగా కోత పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఆర్థిక ఏడాదికి కూడా వాస్తవిక కోణంలోనే బడ్జెట్ అంచనాలను ప్రతిపాదించనుంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) పెరుగుదల అంచనాలను పరిగణనలోకి తీసుకుని గతేడాది బడ్జెట్ అంచనాల కన్నా 8% పెరుగుదలతో రూ. 1.58 లక్షల కోట్ల వరకు 2020– 21 వార్షిక బడ్జెట్‌ను ప్రతిపాదించనున్న ట్లు తెలుస్తోంది. ఆర్థిక మాంద్యం ప్రభావం వచ్చే ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికం వరకు ఉంటుందనే అంచనాలు, కోవిడ్ ప్రభావంతో పారిశ్రామిక రంగ ఆదాయం పడిపోతుందేమోననే భయం ఉన్నా ప్రస్తుత ఆర్థిక ఏడాది రాబడులు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గానే ఉండటంతో ఈ మేరకు బడ్జెట్ అంచనాలకు వెళ్లవచ్చనే నిర్ధారణకు ఆర్థికశాఖ వర్గాలు వచ్చాయని సమాచారం. దీంతో గతేడాది రూ.1.46 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించగా, మరో రూ.12 వేల కోట్ల వరకు కలిపి మొత్తం రూ.1.58 లక్షల కోట్ల మేర బడ్జెట్ అంచనాలను అసెంబ్లీ ముందుం చేందుకు సిద్ధమయిందని సమాచారం. ఆర్థిక మంత్రి హోదాలో హరీశ్‌రావు తొలిసారి ఆది వారం ఉదయం 11:30 గంటలకు 2020– 21 వార్షిక బడ్జెట్‌ను శాసన సభలో ప్రవేశపెట్టనున్నారు. మండలిలో శాసనసభా వ్యవహా రాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు. కీలక రంగాలకు అదే ప్రాధాన్యం.. ఈసారి బడ్జెట్ లో కీలక రంగాలకు ప్రాధాన్యత మేరకు నిధులు కేటాయించనున్నారు. ప్రస్తు తం అమలవుతున్న అన్ని పథకాలను కొనసాగిస్తూనే విద్య, వైద్యం, సాగునీటి శాఖలతో పాటు ఈసారి గృహ నిర్మాణానికి (డబుల్ బెడ్ రూం ఇళ్లు) ఎక్కువ నిధులు కేటాయించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై ప్రతిపక్షాలు చేస్తు న్న విమర్శలకు తాళం వేసేందుకు బడ్జెట్లో నిధులు పెంచాలని, ఆ మేరకు ఇళ్లు కట్టి చూపించాలని, ఇంటి స్థలం ఉన్న వారికి ఇళ్లు కట్టుకునేందుకు రూ.6 లక్షలు ఇవ్వాలన్న హామీకి కూడా నిధులు కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గృహ నిర్మాణ శాఖకు నిధులు పెరగనున్నాయి. సాగునీటి శాఖకు ఈ సారి రూ.8,500 కోట్లు కేటా యించే అవకాశముంది. గతేడాది కన్నా రూ.1000 కోట్లు అధికంగా కేటాయించడంతో పాటు మరో రూ.15 వేల కోట్ల వరకు అప్పులు ప్రతిపాదించడం ద్వారా మొత్తం రూ.23,500 కోట్ల వరకు వచ్చే ఏడాది సాగునీటి రంగంపై ఖర్చు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక విద్య, వైద్యానికి గత ఏడాది కన్నా కేటాయింపులు పెంచనున్నారు. ఆపద్బంధు, కుట్టుమిషన్ల పంపిణీ బాధ్యతలను కూడా సంక్షేమ శాఖలకే అప్పగించనున్నారు. సగం రుణమాఫీకి యోచన... వ్యవసాయ రంగానికి కూడా నిధులు అంచనాలకు అనుగుణంగానే కేటాయించనున్నారు. ఈసారి రైతు రుణమాఫీకి గతేడాది కేటాయిం చిన రూ.6 వేల కోట్లతో పాటు మరో రూ.6 వేల కోట్లు ప్రతిపాదిస్తారని, మొత్తం రుణమాఫీ అమలుకు రూ.24వేల కోట్లు అవసరమవుతాయనే లెక్కల్లో సగం కేటాయించడం ద్వారా వచ్చే ఏడాది రెండు దఫాల్లో రైతుల రుణాలను సగం మేర మాఫీ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. అదే విధంగా రైతు బీమాకు గత ఏడాది కేటాయించిన రూ.700 కోట్లను రూ.1000 కోట్ల వరకు పెంచనున్నారు. ఆసరా పింఛన్లకు రూ.12 వేల కోట్లు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుకు రూ.7,500 కోట్ల వరకు ఖర్చు కానున్నాయి. ఇక, జీతభత్యాలు, అప్పులకు వడ్డీల చెల్లింపులు, సబ్సిడీలు, విద్యుత్ రాయితీలకు కలిపి మరో ప్రణాళికేతర పద్దుల కింద రూ.50 వేల కోట్ల వరకు అవసరం కానున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానానికి సమాధానమిచ్చిన సీఎం కేసీఆర్ ఆదివారం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను బట్టి ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, నిరుద్యోగ భృతి లాంటి హామీలు ఈ ఏడాది ఆగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాము మాట ఇచ్చింది వాస్తవమేనని, అయితే వీటి అమలుకు తమకు సమయం ఉందని సీఎం వ్యాఖ్యానించిన నేపథ్యంలో వాటికి ఈసారి బడ్జెట్లో కేటాయింపులు లేవనే తెలుస్తోంది. తెలంగాణ ఏర్పడినప్పుడు జీఎస్డీపీ రూ.4 లక్షల కోట్లుందని, గత ఏడాది రూ.8.6 లక్షల కోట్లుండగా, ఈ సారి రూ.9.5 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని కాగ్ లెక్కలు చెబుతున్నాయని సీఎం అసెంబ్లీలో చెప్పారు. దీని ఆధారంగా వివిధ శాఖల అవసరాలను క్రోఢీకరించి రూ.1.58 లక్షల కోట్ల వరకు ఈసారి అంచనాలు ప్రతిపాదించవచ్చనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. ఇదిలా ఉండగా, అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లోనూ కోత పడే అవకాశం ఉంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో నేరుగా గ్రామాలకు, మున్సిపాలిటీలకు ప్రభుత్వం నిధులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.3 కోట్లుగా ఉన్న ఏసీడీఎఫ్ నిధులను రూ.1.5 కోట్లకు పరిమితం చేయనున్నట్లు సమాచారం. బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదముద్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి శనివారం రాత్రి ప్రగతి భవన్లో సమావేశమై 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తూ శాసనసభలో ప్రవేశపెట్టనున్న తీర్మానం ప్రతిపై సైతం మంత్రివర్గ సమావేశంలో క్షుణ్ణంగా చర్చించినట్లు తెలిసింది. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీల విషయంలో శాసనసభలో ప్రభుత్వం అవలంబించాల్సిన వైఖరిపై ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం. -
నిరుద్యోగ భృతి లేదు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది కూడా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తామిచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ఐదేళ్ల సమయం ఉందని, వచ్చే ఏడాది లేదా ఆ తర్వాతి ఏడాది చూస్తామన్నారు. ఆర్థిక మాంద్యం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సాధ్యం కాదన్నారు. శనివారం మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సీఎం సమాధానమిస్తూ.. కేంద్రం తీసుకొచ్చిన చట్టం ప్రకారం రాష్ట్రంలో కూడా 10% ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. భైంసాలో అల్లర్లలో నిజమైన బాధితుల వివరాలు అందజేస్తే సాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణలో 70 శాతానికి పైగా బలహీనవర్గాల వారు ఉన్నందున రిజర్వేషన్ల పెంపుపై కేంద్రంతో పోరాడతామని, కేబినెట్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తామని చెప్పారు. పీఆర్సీ కమిటీ గడువు ముగిసినా కొనసాగిస్తామని, సర్వీసు బుక్స్, ఇతర అంశాలను పూర్తిస్థాయి లో ప్రక్షాళన చేయాల్సి ఉందని పేర్కొన్నారు. వేతన సవరణ కోసం పీఆర్సీ ఆగలేదని స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణకు కేటాయించిన నీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటామన్నారు. గతం లో ఏపీ సీఎం కక్ష పూరితంగా వ్యవహరించారని, తాము మహారాష్ట్ర సీఎంతో ఏడుసార్లు భేటీఅయి ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. సంక్షేమ రంగంలో రూ.45 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఐకేపీ ఉద్యోగుల క్రమబద్ధీకరణ 57 ఏళ్ల వయసు దాటిని వారికి వృద్ధాప్య పింఛన్లు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తామని తెలిపారు. నిరుద్యోగం ఉంటుందని, అయితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వివిధ ఉద్యోగ అవకాశాలు పొందేలా ఎస్టీ, ఎస్సీ, బీసీలకు స్టడీసర్కిళ్ల ద్వారా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాగా, ఐకేపీ కింద ఉన్న మూడు, నాలుగు వందల మంది ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. త్వరలో కోటి ఎకరాలకు నీరు.. ఏడాదిన్నర రెండేళ్లలోనే పూర్తిస్థాయిలో పాలమూరు, సీతారామ, దేవాదుల, కాళేశ్వరం పూర్తిస్థాయిలో పూర్తయితే కోటి ఎకరాలకు నీటిని అందిస్తామన్నారు. రైతు బీమా గొప్ప పథకమని, ఏ రైతు ఏ కారణంతో చనిపోయినా బీమా కల్పిస్తామని, ఈ పథకానికి ప్రీమియం మొత్తం రూ.600 కోట్ల నుంచి రూ.1,300 కోట్లకు పెరిగిందని, రైతుల సంఖ్య ఇంకా పెరిగినా ప్రభుత్వమే ఆ మొత్తాన్ని చెల్లిస్తుందని పేర్కొన్నారు. రైతు మరణించిన 10 రోజుల్లోగా అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. బతికున్నంత కాలం ఉచిత కరెంట్ కేసీఆర్ బతికున్నంత కాలం రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని, రైతుబంధు, రైతుబీమా, కోటిఎకరాలకు నీరందించేలా నీటిపారుదల ప్రాజెక్టులు చేపడతామన్నారు. కల్తీలేని ఎరువులు,విత్తనాలు అందించేందుకు కఠినచర్యలు తీసుకుంటామని, కల్తీకి పాల్పడే దుర్మార్గులపై పీడీయాక్ట్ పెట్టి జైలుకు పంపుతామని తెలిపారు. మహిళల ఆత్మగౌరవానికి చిహ్నమైన డబుల్ బెడ్రూం ఇళ్లను 2.76 లక్షల మేర నిర్మాణం పూర్తిచేసి అందజేస్తామన్నారు. -
సీఏఏ అంటే రాజ్యాంగంపై దాడే
సాక్షి, హైదరాబాద్: కేంద్రం తీసుకొ చ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పూర్తిగా రాజ్యాంగం మీద చేసిన దాడిగా ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ అభివర్ణించారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లు ముస్లింలకే కాదు.. దేశంలోని మొత్తం పేద ప్రజలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. ‘దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. జాతీయ వృద్ధి రేటు పడిపోతోంది. నిరుద్యోగం పెరుగుతోంది. జీఎస్టీ బకాయిలు పేరుకుపోతున్నాయి. వీటిపై కేంద్రానికి చీమ కుట్టినట్లయినా లేదు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లనే పట్టుకొని వేలాడుతోంది’అని ఒవైసీ దుయ్యబట్టారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. తమ హక్కుల కోసం కొట్లాతూనే ఉంటామని, హక్కుల సాధనలో ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. సీఏఏను తిప్పికొట్టే పోరాటానికి సీఎం కేసీఆర్ నాయకత్వం వహించాలని కోరారు. దేశంలో లౌకికత్వాన్ని కాపాడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు తాము సహకరిస్తామని తెలిపారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అల్లర్లలో చనిపోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఏఏతో పాటు, కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని ఈ సమావేశాల్లోనే తీర్మానం చేయాలని సూచించారు. మైనార్టీల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషిని ఆయన అభినందించారు. అయితే వాటి అమలులో వేగం పెంచాలని కోరారు. ముస్లిం రిజర్వేషన్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. -
తీసి అవతల పారేద్దామా?
సాక్షి, హైదరాబాద్: ‘సభలో అబద్ధాలు చెప్పే వారు అవసరమా? తీసి అవతల పారేద్దామా? అబద్ధాలతో ప్రజ లను తప్పుదోవ పట్టించేవారు సభలో ఉండటానికి అర్హులా?’అని రాజగోపాల్‌రెడ్డి సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయి లో మండిపడ్డారు. సభలో అసత్య ఆరోపణలు చేసే వారిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చపై సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ‘శాసనసభలో ఏదిపడితే అది మాట్లాడటం కరెక్టు కాదు. కొత్త రూల్ అవసరమే. సింగపూర్‌లో ఒక చట్టం ఉంది. ఆరోపణ చేస్తే నిరూపించాలి. మన దగ్గర అలాంటి అవకాశం ఉందో పరిశీలించండి. ఇలాంటి వాటికి ఎక్కడో ఒక దగ్గర చరమగీతం పాడాలి. లేకపోతే అది రాష్ట్రానికి మంచిది కాదు. ఎవరికీ మంచిది’అని సీఎం పేర్కొన్నారు. ఆధారం లేకపోతే మాది అరణ్య రోదనే కదా! ‘మిషన్ భగీరథ వంటి ప్రతిష్టాత్మక పథకంపై పిచ్చి కూతలు కూసే కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గంలోనే 334 ఆవాసాలకు నీళ్లు ఇచ్చాం. గ్రామ పంచాయతీల తీర్మానాలు ఉన్నాయి. నీళ్లు వచ్చాయని ఆయనే సంతకం చేశారు. మళ్లీ అబద్ధాలు చెబు తున్నారు. అంటే ఆయన సంతకం చేసింది అబద్ధమా? ఇదిగో ఆ పత్రం.. మీ దగ్గరే పెట్టం డి.. ఆయనపై ఏం యాక్షన్ తీసుకుంటారో ఆలోచించండి. మినిస్టర్‌ను తిట్టారు. ఈ రుజువు లేకపోతే మా పరిస్థితేంటి.. అరణ్య రోదనే కదా.. గతంలో ఆయన అన్న గవర్నర్‌పై మైక్ విసిరారు. ఈ అరాచకం మంచిది కాదు. ఎక్కడో చోట దెబ్బ కొట్టాలి. మీరు సీరియస్‌గా తీసుకోవాలి. సహించొద్దు. గుణపాఠం చెప్పాల్సిందే. మీరే నిర్ణయం తీసుకోండి. ఈ విషయంలో నివేదిక తెప్పించుకొని చర్యలు చేపట్టండి’ అని పేర్కొన్నారు. ఫ్లోరోసిస్‌కు అడ్డుకట్ట వేశాం ‘మిషన్ భగీరథ పథకంతో నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌కు అడ్డుకట్ట వేశాం. ఇది అద్భుత పథకమని యావత్ దేశం ప్రశంసించింది. ఈ పథకం కోసం ఇప్పటికే రూ.41 వేల కోట్లు ఖర్చు చేశాం. మరో రూ.3 వేల కోట్లు అవసరం అవుతాయి. మిషన్ భగీరథ వల్ల నల్లగొండలో ఫ్లోరోసిస్ సమస్య పోయిందని స్వయంగా కేంద్ర జల శక్తి శాఖనే ప్రకటించింది. భగీరథతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని ఇస్తున్నాం. అవికాకుండా అదనంగా రూ.90 లక్షలు కావాలని రాజగోపాల్‌రెడ్డి అడిగారు’ అని సీఎం వివరించారు. వస్తామన్నా వద్దని వారించా ‘మా పార్టీ తరఫున 88 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించారు. ఉప ఎన్నికల్లో మరొ కటి, ఒకరు నామినేటెడ్ ఎమ్మెల్యే. మొత్తం 90 మంది ఉన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది టీఆర్ఎస్లోకి వస్తామంటే నేనే వద్దని చెప్పా. రాజ్యాం గం ప్రకారం నడుచుకోవాలని చెప్పా. దానిపై తప్పుడు ప్రచారం చేయొద్దు. రాజ్యాంగం ప్రకారం మూడింట రెండొంతుల ఎమ్మెల్యేలు విలీనం అయ్యారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీలు బీజేపీలో విలీనం అయ్యారు’ అని కేసీఆర్ తెలిపారు. కాగా, కాంగ్రెస్ సభ్యుడు విలీనంపై చేసిన ఆరోపణను పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని స్పీకర్‌ను సీఎం కోరారు. అనంతరం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ అంతటోళ్లే ఓడిపోయారు.. ‘ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ అంతటివాళ్లే ఓడిపోయారు. కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఢిల్లీలో కాంగ్రెస్‌కు 4 శాతం ఓట్లే వచ్చాయి. ప్రజాస్వామ్యంలో సహనం అవసరం. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఎవరు పని చేస్తారనుకుంటే ప్రజలు వారినే గెలిపిస్తారు. గొంతు ఉంది కదా అని అసత్య ఆరోపణలు చేయొద్దు. ఎన్నికల్లో ప్రజలు ఓడించినా కాంగ్రెస్‌కు బుద్ధి రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ అన్నారు. బ్యాలెట్‌తో జరిగిన జెడ్పీల్లో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంటే మాట లేదు. గెలుపోటములపై కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. కేసుల మీద కేసులు వేస్తూ కాంగ్రెస్ నేతలు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. కేసులేసేది వాళ్లే.. నీళ్లు రావడం లేదని ఆరోపించేదీ వాళ్లే. ఉమ్మడి రాష్ట్రంలో అదే. ఇప్పుడు అదే పరిస్థితి. తెలంగాణపై మాట్లాడితే కేసులు పెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ది. మాపై ఎన్నో కేసులు పెట్టి తెలంగాణను అడ్డుకోవాలని చూశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా కాంగ్రెస్, బీజేపీ కుట్రలు ఆగలేదు. కాంగ్రెస్ నేతలు ఎంత నీచానికైనా దిగజారుతారు. ఏడు మండలాలు, సీలేరు ప్రాజెక్టు దక్కకుండా బీజేపీ కుట్రలు చేసింది. అభివృద్ధికి సహకరించకుండా ప్రతి దాన్ని రాజకీయం చేస్తోంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంది’అని కేసీఆర్ దుయ్యబట్టారు. -
జై కిసాన్: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి రైతును రాజును చేసేదాకా నిద్రపోమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. అరుపులు, పెడబొబ్బలతో ఎవరు అడ్డుపడినా, అడ్డంకులు సృష్టించినా ఆగేది లేదని, స్థిర సంకల్పంతో పని చేస్తామన్నారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ అనంతరం సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో రైతుబంధు కొనసాగుతుందని, 24 గంటల ఉచిత విద్యుత్‌ను ఆపేది లేదన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యాయని, కాళేశ్వరం నీళ్లు వారం పది రోజుల్లో సిద్దిపేటకు రాబోతున్నాయన్నారు. కోదాడ వరకు కాకతీయ కాలువలో 120 రోజుల నుంచి నీళ్లు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో నీటి లభ్యత ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు వ్యవసాయ రంగాన్ని ఎంత నాశనం చేశారో ప్రజలకు తెలుసునన్నారు. వారి విధానాల వల్ల కరెంటు, నీటి సమస్యలు ఉన్నాయని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సన్నరకం సోనా వెరైటీని తయారు చేసిందని, అది షుగర్ ఫ్రీ వరి అని, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ బియ్యాన్ని బేషుగ్గా తినవచ్చని వెల్లడించారు. దేశవ్యాప్తంగా సన్నబియ్యానికి అత్యధిక డిమాండ్ ఉందని, రాష్ట్రంలో రైతులు ఎక్కువగా సన్న రకమే పండించేలా రైతులను జూన్ నాటికి సిద్ధం చేస్తామన్నారు. వరి సాగు విస్తీర్ణం కోటి ఎకరాలైనా అందులో పండే పంటను సద్వినియోగపరిచేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తామన్నారు. రైతు పండించే ప్రతి గింజను కొంటామన్నారు. ఈ ఏడాది వానాకాలంలో 40 లక్షల ఎకరాలు, యాసంగిలో 38 లక్షల ఎకరాల్లో వరి వేశారని, దాన్నుంచి 225 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, అందులో 100 లక్షల టన్నులు మనం తినడానికే అవుతుందని, మిగిలిన 125 లక్షల టన్నులు ఎఫ్ఐసీ తీసుకోవడానికి సిద్ధంగా ఉందన్నారు. సన్న బియ్యం రకం పంట విస్తీర్ణం పెరిగితే రాష్ట్రంలోని మిల్లులకు ప్రోత్సాహం అందించడం ద్వారా ఎగుమతి చేయవచ్చన్నారు. రైతులకు దుఃఖాన్ని కల్పిస్తున్న రెవెన్యూ చట్టాన్ని మారుస్తామని, కొత్త చట్టాన్ని తెస్తామన్నారు. ఈ సందర్భంగా సీఎం వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే.. ఆ ఒక్క ఘటన తప్ప అంతా బాగు.. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. దిశ రేప్ కేసు విషయంలో అందరం బాధపడ్డాం. మనందరి ఇళ్లలో తల్లులు, భార్య బిడ్డలున్నరు. ఎంత ఖండించినా తక్కువే. అదొక్కటే దురదృష్టకరమైన సంఘటన. దేశం మొత్తంలో ఉన్న సీసీటీవీల్లో 66 శాతం తెలంగాణలో ఉన్నాయి. 6 లక్షల సీసీటీవీ కెమెరాలను తెలంగాణ వచ్చాక ఏర్పాటు చేశాం. ఇక ఐటీ ఎగుమతుల్లో సూపర్ డూపర్‌గా ఉన్నాం. ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల జాతీయ వృద్ధిరేటు 7–8 శాతం ఉంటే రాష్ట్రంలో 16 శాతం ఉంది. సామాజిక సమతూకం పాటించే విషయంలో ముందుకు వెళ్తున్నాం. అన్ని రంగాల్లో అన్ని వర్గాల ప్రజల ప్రాతినిధ్యం పెరిగితేనే కడుపునిండినట్లు ఉంటది. అందరికీ అవకాశాలు రానప్పుడు ఆక్రోశం ఉంటది. అది మంచిది కాదు. ముస్లిం కోటాపై ఆందోళన వద్దు.. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణపట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో ఈ కేసును వాదించేందుకు సీనియర్ న్యాయవాదిని నియమించాం. ప్రత్యేక ఉర్దూ డీఎస్సీ నిర్వహణ, ఆలేరు ఎన్‌కౌంటర్‌పై సిట్ దర్యాప్తు నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టాలని అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన విజ్ఞప్తులపై సానుకూల నిర్ణయం తీసుకుంటాం. పాతబస్తీ లాల్‌దర్వాజ మహంకాళి ఆలయ విస్తరణ చేపట్టాలని అక్బరుద్దీన్ విజ్ఞప్తి చేయడం సంతోషం. మాస్క్‌లు ఎందుకు? రాష్ట్రంలో కరోనా వైరస్ లేదు. దానిపై అసత్యాలు, దుష్ప్రచారాలు చేయడం సరికాదు. కరోనా రావొద్దని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. రాష్ట్రానికి కరోనా వైరస్ రాదు.. రానివ్వం. ఈ వైరస్ ఇక్కడ పుట్టింది కాదు. ఒకవేళ వచ్చినా రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టయినా అడ్డుకుంటాం. మాస్కులు లేకుండానే పని చేస్తాం. 130 కోట్ల మంది ఉన్న దేశంలో 31 మందికే కరోనా వచ్చింది. అందులో ఒకరు దుబాయ్ పోయి వచ్చిన వ్యక్తి రాష్ట్రానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన కూడా బాగానే ఉన్నారు, బతుకుతాడు. రాష్ట్రంలో కరోనా లేనప్పడు మాస్క్‌లు ఎందుకు? సభలో ఇంత మంది ఉన్నాం. మాస్క్‌లు లేకపోతే సచ్చిపోతామా? 22 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే కరోనా వైరస్ బతకదు అని ఒక సైంటిస్ట్ చెప్పారు. మన దగ్గర 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. అలాంటప్పుడు అది బతకదు. పైగా కరోనాకు ఒక్క పారాసిటమాల్ టాబ్లెట్ సరిపోతుందని వైద్యులు చెప్పారు. అవసరమైతే కరెంట్, ఆర్టీసీ చార్జీలు పెంచుతాం.. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థాపక సామర్థ్యాన్ని పెంచుకున్నాం. తలసరి విద్యుత్ వినియోగం పెరిగింది. ఇది రాష్ట్రానికి గర్వకారణం. కరెంటు మంచిగా ఇస్తే కాంగ్రెస్‌కు బాధగా ఉంది. 24 గంటల కరెంటు అవసరం లేదట. అప్పులు తెచ్చి విద్యుత్ ఇస్తున్నారు.. చార్జీలు పెంచుతారా? అని అంటున్నారు. పెంచుతాం.. ప్రజలకు పరిస్థితిని వివరిస్తాం. గత ఆరేళ్లలో ఒక్కసారే ఆర్టీసీ, కరెంట్ చార్జీలను స్వల్పంగా పెంచాం. మరోసారి పెంచాల్సి వస్తే పెంచుతాం. ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా సంస్థల మనుగడ కోసం కొంత మేరకు పెంచుతాం. ప్రజల దగ్గర నుంచి వసూలు చేసే పన్నుల ద్వారానే ప్రభుత్వాలు నడుస్తాయి. అయితే ఆ పన్నులు రీజనబుల్‌గా ఉండాలి. ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా దోఖా చేస్తే వచ్చేదేంటి? అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే మరోలా అలవాటు అయిపోయింది. ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తే చార్జీలు తగ్గిస్తుందా? అదేం దోఖా? ఎంతకాలం ఈ ఆత్మవంచన, ప్రజావంచన. ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా అబద్ధాలు చెప్పి దోఖా చేస్తే వచ్చేదేంటి? నాకే బర్త్ సర్టిఫికెట్ లేదు.. ఎక్కడ తేవాలి? పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) వ్యవహారాలు దేశ గౌరవానికి చెందిన అంశాలు. మిగతా రాష్ట్రాల్లాగే సీఏఏను వ్యతిరేకిస్తూ మన అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేసి పంపిద్దాం. తమ పౌరసత్వాన్ని నిరూపించుకొనేందుకు ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారు. నేను మా ఊళ్లో సొంతింట్లో పుట్టాను. అప్పుడు దవాఖానాలు లేవు. నాకే బర్త్ సర్టిఫికెట్ లేదు. నువ్వెవరు అంటే ఏం చెప్పాలి? హౌ డూ ఐ ప్రూఫ్? ఆ కాలంలో పెద్దలు ఊళ్లో ఉన్న అయ్యగారిని పిలిపించి జన్మనామ పత్రిక అని రాయించేవాళ్లు. అదే బర్త్ సర్టిఫికెట్. దానికి అధికారిక ముద్ర ఉండదు. ఇప్పటికి కూడా నా జన్మనామం పత్రిక నా భార్య దగ్గర ఉంది. ఆ రోజున ఆసుపత్రులు, ఈ రికార్డులు లేవు. నాదే దిక్కులేదంటే, ‘మీ నాయనది తీసుకురమ్మంటే’ నేను చావాల్నా? మాకు 580 ఎకరాల భూమి, పెద్ద కుటుంబం ఉంది. అలాంటి కుటుంబంలో పుట్టిన నాకే బర్త్ సర్టిఫికెట్ లేకపోతే దళితులకు, నిరుపేదలకు ఎక్కడిది? వివరాలు తెమ్మంటే యాడ తేవాలి? దీనికి బదులు నేషనల్ ఐడెంటి కార్డు పెట్టాలి. సీఏఏపై ఓ రోజంతా సభలో చర్చిద్దాం. పోడు భూములకు రైతుబంధు వర్తించదు.. పోడు భూములకు రైతుబంధు వర్తించదు. సీఎస్, నేను, మంత్రులు అంతా ఒకసారి వెళ్లి ప్రజాదర్బార్ పెట్టి పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తాం. గతంతో పోలిస్తే రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. ఆత్మహత్యలే జరగవద్దు. దురదృష్టవశాత్తూ జరిగితే ఇతర రాష్ట్రాల కంటే మనం మెరుగైన పరిహారం ఇస్తున్నాం. ఇళ్ల పథకాల్లో వారు తిన్నారు.. ఇళ్ల పథకాల్లో వారు (కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి) తిన్నారు. మేం తినము. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తాం. వారి పాలనలో 70–80 లక్షల ఇళ్లు కట్టామని చెప్పారు. అవన్నీ ఏమయ్యాయి.. ఎక్కడ పోయాయి? వారు ఇళ్లు కట్టలేదు... తినేశారు. 3 ఎకరాల భూమి పథకం నిరంతరం.. దళితులకు 3 ఎకరాల భూమి పథకం నిరంతరం కొనసాగుతుంది. ఎంత మంది వస్తే అంత మందికి ఇస్తాం. భూమి ఉంటే కొనుగోలు చేసి ఇస్తాం. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో విదేశాలకు వెళ్లిన వారిని, హైదరాబాద్‌లో స్థిరపడిన వారితో మాట్లాడితే భూమి కొనుగోలు చేసి ఇస్తాం. త్వరలో ఏపీలో కూడా 25 జిల్లాలు.. స్వాతంత్య్రం వచ్చాక అనేక రాష్ట్రాలు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాయి. అప్పట్లో ఉమ్మడి ఆం«ధ్రపదేశ్, పశ్చిమ బెంగాల్ మాత్రమే చేసుకోలేదు. తెలంగాణ వచ్చాక 33 జిల్లాలు చేశాం. ఏపీ సీఎం మాట్లాడిన దానిని బట్టి త్వరలో ఏపీలో కూడా 25 జిల్లాలు చేయబోతున్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామనలేదు.. మేం ఇంటికో ఉద్యోగం ఇస్తామనలేదు. యువతను తప్పుదారి పట్టించకండి. మా మెనిఫెస్టోలో చూపిస్తారా? మేం అనని విషయాలను అన్నట్లుగా అబద్ధాలు చెప్పకండి. 60 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయి. తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకే వస్తాయని చెప్పాం. పోలీసులు, ఇతర ఉద్యోగాలు కలుపుకుంటే 80 వేలు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు వేలల్లో ఉంటే ప్రైవేటు ఉద్యోగులు లక్షల్లో ఉన్నారు. ఒక్క ఐటీలోనే 7 లక్షలు, పరిశ్రమల్లో 8 లక్షలు, భవన నిర్మాణ రంగంలో 18 లక్షల మంది ఉన్నారు. ఈ టర్మ్ పూర్తయ్యేలోగా మూసీ ప్రక్షాళన.. ఈ టర్మ్ పూర్తయ్యేలోగా మూసీ ప్రక్షాళన చేస్తాం. చౌటుప్పల్‌లో కాలుష్యం మేం తెచ్చామా? మేం పరిశ్రమలకు అనుమతులు ఇస్తే పక్కాగా వ్యవహరిస్తున్నాం. కొన్ని మినహా ఇతర పరిశ్రమల్లో 90 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని చెప్పాం. త్వరలో రాతపూర్వకంగా తెలియజేస్తాం. సుస్థిరాభివృద్ధిలో మనం భేష్.. సుస్థిరాభివృద్ధిలో తెలంగాణ భేష్ అని నీతి ఆయోగ్ చెప్పింది. ‘కాగ్’ లెక్కల ప్రకారం కాంగ్రెస్ హయాంలో స్థూల మూల వ్యయం రూ. 59 వేల కోట్లు ఉంటే ఈ ఐదేళ్లలో రూ. 1.6 లక్షల కోట్లకు చేరింది. ఈ లెక్కలు ‘కాగ్’లో అందరూ చూడవచ్చు. 2014 నాటికి జీఎస్డీపీ రూ. 4 లక్షల కోట్లు ఉంటే అది ఇప్పుడు రూ. 8.6 లక్షల కోట్లకు చేరింది. 2020–21లో 9.5 లక్షల కోట్లు అవుతుందని కాగ్ అంచనా వేసింది. పాతబస్తీకి మెట్రో.. పాతబస్తీకి మెట్రో రైల్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం. ఇప్పటికే అలైన్మెంట్ సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఆ పనులను ప్రారంభించి యుద్ధప్రాతిపదిక కొనసాగించాలని మున్సిపల్ శాఖ మంత్రిని ఆదేశిస్తున్నా. పాతబస్తీ ఎమ్మెల్యేలు, ఎంఐఎం ఎంపీ సహకరిస్తారు. పాతబస్తీకి తాగునీటి సమస్యను తీరుస్తాం. ఓల్డ్ సిటీలో ఆసుపత్రి కడతాం. ధూల్‌పేటకు కచ్చితంగా వస్తా.. రాష్ట్రంలో 6,299 గుడుంబా తయారీ కుటుంబాలకు రూ. 125.99 కోట్లతో పునరావాసం కల్పించాం. ధూల్‌పేటలో 859 మందికి రూ. 2 లక్షల చొప్పున ఇచ్చాం. ధూల్‌పేటకు వస్తానని పోలేదు. నిజమే ఒప్పుకోవాలి. నేను, సిటీ ఎమ్మెల్యేలు, మంత్రులం కచ్చితంగా వస్తాం. ఇంకా ఏమైనా సాయం కావాలన్నా చేస్తాం. పీఆర్సీ, రిటైర్మెంట్ వయసు పెంపు అమలు చేస్తాం. అందుకు సమయం, సందర్భం ఉంటుంది. సంస్కరణలు తేవాలి.. తప్పించుకోం.. తప్పకుండా చేస్తాం. కాంగ్రెస్ దుష్ట పాలనలోనే వచ్చిన దరిద్రం నిరక్షరాస్యత. వారు పట్టించుకోకపోవడం వల్ల అక్షరాస్యతలో దిగువ నుంచి మూడో స్థానంలో ఉన్నాం. అందుకే ‘ఈచ్ వన్ టీచ్ వన్’ కార్యక్రమం గురించి చెప్పాను. ఎమ్మెల్యేలు అందులో చురుగ్గా పాల్గొనాలి. అందుకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తాం.’’ -
నేటితో బడ్జెట్ సమావేశాల ముగింపు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 9న ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆదివారం శాసనసభ, శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం అనంతరం వాయిదా పడనున్నాయి. ఈ నెల 9న 2019–20 వార్షిక బడ్జెట్‌ను సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన తర్వాత.. 14వ తేదీకి వాయిదా పడింది. 14న తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ వివిధ శాఖల పద్దులపై ఎనిమిది రోజులుగా చర్చించి ఆమోదం తెలిపింది. బడ్జెట్ సమావేశాల చివరి రోజున శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిన అనంతరం సభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేస్తారు. శాసనమండలి కూడా బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ నెల 9న ప్రారంభం కాగా, ఆర్థిక మంత్రి హోదాలో హరీశ్‌రావు బడ్జెట్‌ను సమర్పించారు. ఆదివారం పలు బిల్లులను ఆమోదించాక నిరవధికంగా వాయిదా పడనుంది. సభా కమిటీలపై ప్రకటన.. శాసనసభ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా శాసనసభ కమిటీలను ప్రకటించనున్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అంచనాల కమిటీ, అండర్ టేకింగ్స్ కమిటీ వంటి ఆర్థిక కమిటీలతో పాటు అసెంబ్లీలో మొత్తం 21 కమిటీ లు ఉంటాయి. కీలకమైన ప్రజా పద్దులు (పీఏసీ) కమిటీ పదవిని శాసనసభలో రెండో అతిపెద్ద పక్షంగా ఉన్న ఎంఐఎం ఆశిస్తోంది. ఆ పార్టీ శాసనసభ పక్షం నేత అక్బరుద్దీన్ ఒవైసీ పీఏసీ చైర్మన్ పదవి చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంచనాల కమిటీ చైర్మన్‌గా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి మరోమారు అవకాశం దక్కనుంది. మంత్రులుగా, విప్‌లుగా అవకాశం దక్కని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చైర్మన్లుగా, కమిటీ సభ్యులుగా అవకాశం దక్కనుంది. -
చాయ్ తాగుతవా? అని అడుగుతోంది!
సాక్షి, హైదరాబాద్: ఆసరా పింఛన్లపై సభ్యులు బాల్క సుమన్, గొంగిడి సునీత అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓ సన్నివేశాన్ని చెప్పా రు. ‘మా జిల్లాలో రాయ్‌పర్తి గుండా వెళ్తుంటే ఎప్పుడూ ఓ ముసలావిడ నాకు అడ్డువచ్చేది. కలిసినప్పుడల్లా రూ.100, రూ.200 ఇస్తుండే వాణ్ని. ఈ మధ్య అలా ఇస్తుంటే తీసుకోలే. కేసీఆర్ నా కొడుకు లెక్క పింఛన్ ఇస్తుండు. ఇప్పటిదాకా నన్ను పలకరించని నా కోడలు అత్తా చాయ్ తాగుతవా? కాఫీ తాగుతవా? అని అడుగుతోంది’ అని చెప్పిందన్నారు. ఇలా ఆసరా పింఛన్లతో వృద్ధుల్లో కొత్త ఆశలు వచ్చాయన్నారు. రాష్ట్రం పింఛన్లపై రూ.9,192.88 కోట్లు, కేంద్రం రూ.209.60 కోట్లు ఖర్చు చేస్తున్నాయని వెల్లడించారు. హైకోర్టును తరలించం: ఇంద్రకరణ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టును తరలించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో పద్దులో జరిగిన చర్చలో ఎంఐఎం సభ్యుడు మొయినుద్దీన్ లేవనెత్తిన అంశంపై మంత్రి స్పందించారు. ప్రభుత్వం వద్ద అలాంటి ప్రతిపాదనలేవీ లేవని ఆయన వివరించారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటైన నేపథ్యంలో 23 కొత్త జిల్లాలకు కొత్తగా జిల్లా కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయన్నారు. కింది కోర్టుల్లో ఖాళీగా ఉన్న మినిస్టీరియల్ ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకున్నామని, 1,554 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు సైతం ఇచ్చామన్నారు. -
సచివాలయం ఫైళ్లన్నీ భద్రం
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలోని ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ఫైళ్లన్నీ భద్రంగా ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. అసెంబ్లీలో పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. సచివాలయం తరలింపులో భాగంగా ఫైళ్లను జాగ్రత్త చేసేందుకు ప్రతి శాఖకు ఓ కస్టోడియన్ అధికారిని నియమించామని, ఫైళ్లన్నీ భద్రపర్చేందుకు అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్, వయోపరిమితి పెంపు అంశం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరిశీలనలో ఉందన్నారు. బాషా పండితులు, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడేషన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఇప్పటివరకు 1.49 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, 1.17 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీకి చర్యలు తీసుకున్నట్లు వివరించారు. కొన్ని కోర్టు కేసుల నేపథ్యంలో ఉద్యోగ ప్రకటనలు ఇవ్వలేకపోయినట్లు తెలిపారు. పోటీ పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్‌లోనే కాకుండా ఉర్దూలో కూడా నిర్వహించాలని ఎమ్మెల్యే ఖాద్రీ ప్రభుత్వాన్ని కోరగా.. మంత్రి స్పందిస్తూ టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహిస్తున్న పరీక్షలను ఉర్దూలో కూడా నిర్వహించినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు గతంలో 42 శాతం పీఆర్సీ అడిగితే కేసీఆర్ 43 శాతం ఇచ్చి రికార్డు సృష్టించారని తెలిపారు. ఈసారి కూడా తప్పకుండా ఉద్యోగులు సంతృప్తిపడేలా ఫిట్మెంట్ ఇస్తారని హామీ ఇచ్చారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా భారీ మొత్తంలో వేతనాలు పెంచారని తెలిపారు. 2018 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 130 ఏసీబీ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. -
అందరికీ నాణ్యమైన విద్య: సబిత
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రతి విద్యార్థి బడిలో ఉండాలి, వారికి నాణ్యమైన విద్యను అందించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో మోడల్ స్కూళ్లు, గురుకులాలు, టెన్త్ వరకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లు వదిలి గురుకులాల్లో చేరుతున్న పరిస్థితి ఉందన్నారు. నూతన విద్యా విధానం ముసాయిదా బిల్లుపై చర్చించేందుకు కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలో జరిగిన అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల సమావేశంలో సబిత పాల్గొన్నారు. బిల్లుకు సంబంధించి రాష్ట్రం తరఫున పలు సూచనలు చేశారు. ప్రైమరీ స్కూళ్లలో మాతృభాషలో బోధించాలని బిల్లులో ప్రతిపాదించారని, అయితే ప్రైవేటు పాఠశాలల్లోనూ దాన్ని అమలు చేయాలని, అప్పుడే ప్రభుత్వ స్కూళ్లు మనుగడ సాధిస్తాయని మంత్రి చెప్పారు. -
ప్రభుత్వ ఘనత దేశమంతా తెలియాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనత దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలిసేందుకే పొరుగు రాష్ట్రాల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నట్లు మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. అసెంబ్లీలో పద్దులపై జరిగిన చర్చలో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు లేవనెత్తిన అంశంపై మంత్రి వివరణ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఐదు సంవత్సరాల్లోనే అద్భుత ప్రగతి సాధించిందన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆలోచనా విధానాన్ని దేశవ్యాప్తంగా ప్రశంసిస్తున్నారన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు, రైతు బీమా పథకాలను పలు రాష్ట్ర ప్రభుత్వాలేగాక, కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టిందన్నారు. దేశవ్యాప్తంగా ఈ పథకంపై విస్తృత ప్రచారం కల్పించినందుకే పలు రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతోందని, దేశంలోని వివిధ రైతులు లబ్ధి పొందుతున్నారన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు రాష్ట్ర పరిస్థితిని పరిశీలిస్తారని, ప్రగతిని అంచనా వేస్తారన్నారు. ప్రభుత్వమిచ్చే పత్రికా ప్రకటనలు కూడా పెట్టుబడిదారులను ఆకర్షిస్తాయన్నారు. శాసనసభ్యులు, జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. అది పరిష్కారమైతే ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు మార్గం సుగమమవుతుందన్నారు. కానీ స్థానిక నాయకత్వం చొరవ తీసుకుంటే ఇబ్బంది లేదని, ఇప్పటికే పది జిల్లాల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లకు స్థల కేటాయింపు అధికారాలను పరిశీలిస్తామని చెప్పారు. దేశంలో ఏరాష్ట్రం కూడా జర్నలిస్టులకు అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం వెనక్కు తగ్గదన్నారు. అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్లలో కూడా ఏమాత్రం తగ్గమని స్పష్టం చేశారు. ఐదేళ్లలో యాభై ఏళ్ల ప్రగతి ఐటీ రంగంలో యాభై ఏళ్లలో సాధిం చిన ప్రగతిని కేవలం రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఐదేళ్లలోనే సాధించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ఐదేళ్లలో ఐటీ ఎగుమతులు 1.90లక్షల కోట్లకు చేరుకున్నాయని వెల్లడించారు. ఐటీలో హైదరాబాద్ త్వరలోనే బెంగళూరును దాటిపోతుందని అన్నారు. శాసనసభలో శనివారం ప్రశ్నోత్తరాల సందర్భంగా కాంగ్రెస్‌పక్ష నేత భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చా రు. ఫేస్బుక్, ఆపిల్, గూగుల్, అమెజాన్ వంటి కంపెనీలు బెంగళూరును కాదని టీఆర్ఎస్ సర్కార్ సమర్థతతో హైదరాబాద్ కు తరలివచ్చాయన్నారు. ఈ రంగంలో కొత్త గా 2.50 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. బీజేపీ, యూపీఏ ప్రభుత్వాలు ఐటీఐఆర్ ప్రాజెక్టుకు నయాపైసా ఇవ్వలేదన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టును కొనసాగించమని మోదీ సర్కార్ తేల్చిచెప్పిందని, కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా తమ పని తాము చేసుకు పోతున్నామన్నారు. అందుకే దేశంలో ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందన్నారు. -
భవిష్యత్తులో ఉచితంగా అవయవ మార్పిడి
సాక్షి, హైదరాబాద్: పేదరోగులకు ఓ శుభవార్త. అవయవమార్పిడి చికిత్సను ఉచితంగా అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కిడ్నీ, లివర్, తలసేమియా చికిత్సలతోపాటు అవయవమార్పిడి సేవలకు ప్రభుత్వాసుపత్రుల్లో వసతులు కల్పించనున్నట్టు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆ మేరకు ప్రభుత్వాసుపత్రులను మెరుగుపరిచే చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశంలోనే తొలిసారి ప్రభుత్వాసుపత్రుల్లో ఫెర్టిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. పేదలకు ఆ సేవలు ఉచితంగా అందుతాయన్నారు. పద్దులపై చర్చలో భాగంగా గురువారం వైద్య, ఆరోగ్య శాఖపై ఆయ న సమాధానమిచ్చారు. ఒక్కో మెడికల్ కాలేజీలో ఒక్కో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి వస్తుందని, అది ఒక్కోటి గాంధీ ఆసుపత్రితో సమంగా ఉంటుందన్నారు. వ్యాధులు ప్రబలకుండా ముందుజాగ్రత్త చర్యగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా సాయంత్రంవేళ ఓపీ సేవలు నిర్వహిస్తున్నామని, 541 హెల్త్ క్యాంపులు నిర్వహించామన్నారు. వైద్యులు సెలవులు రద్దు చేసుకున్నారని, రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారని, ఈ సందర్భంగా సిబ్బంది సేవలకు అభినందనలు తెలుపుతున్నానన్నారు. ఒక్కో బెడ్‌పై ఇద్దరుండటం శుభసూచకమా? మంత్రి మాటలపై కాంగ్రెస్ పక్షనేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఒక్కో బెడ్‌పై ఇద్దరుండటం శుభసూ చకం కాదని, రోగుల సంఖ్య విపరీతంగా ఉందని అర్థమన్నారు. మానవీయ కోణంలో ఆలోచించే వ్యక్తిగా పేరున్న ఈటల చేతికి వైద్యశాఖ వస్తే తీరు మారుతుందని జనం సంతోషించారని, కానీ బడ్జె ట్ చూస్తే పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని అన్నారు. వానాకాలం రాకముందే ప్రభుత్వం అప్రమత్తమై ఉంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం వ్యాధిగ్రస్థమై ఉండేది కాదన్నారు. సాయంత్రం వేళ ఓపీ నిర్వహించటం గొప్ప కాదని కొట్టిపడేశారు. -
ఏసీ బస్సుకన్నా మెట్రో ధర తక్కువే
సాక్షి, హైదరాబాద్ :నగరంలో మెట్రో రైలు టికెట్ ధరలు ఆర్టీసీ నడుపుతున్న ఏసీ బస్సుల టికెట్ ధరల కన్నా తక్కువేనని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.ఏసీ బస్సుల్లో కనిష్ట ధర రూ.15, గరిష్ట ధర రూ.80 ఉంటే మెట్రోలో కనిష్ట ధర రూ.10, గరిష్ట ధర రూ.60గా ఉందని వెల్లడించారు. ఐదేళ్ల కింద ఆరంభించిన చెన్నై మెట్రోలో రోజుకు 70వేల మంది ప్రయాణిస్తుంటే, హైదరాబాద్ మెట్రోలో 3లక్షల మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు.గురువారం శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క, డి.శ్రీధర్‌బాబులు దీనిపై ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో అసెంబ్లీ భవనం, సుల్తాన్ బజార్ల మీదుగా మెట్రో ప్రతిపాదనలు వద్దన్న టీఆర్ఎస్ ప్రభుత్వం, మళ్లీ అదే ప్రాంతాల నుంచి ఎందుకు నిర్మాణం చేసిందని అడిగారు. దీనికి తోడు టికెట్ ధరలు ఎందుకు పెంచారని, ప్రాజెక్టు ఆలస్యం కావడంతో వ్యయభారం పెరిగింది వాస్తవమేనా అని ప్రశ్నించారు.దీనికి మంత్రి కేటీఆర్ బదులిస్తూ, ‘గతంలో గన్‌పార్క్‌ను పడగొడుతూ అలైన్మెంట్ ప్రతిపాదించడంతో టీఆర్ఎస్ సైతం వ్యతిరేకించింది.ఇప్పుడు అమరవీరుల స్తూపానికి నష్టం వాటిల్లకుండా 20మీటర్ల దూరం నుంచి మెట్రో వెళుతోంది. ఇక సుల్తాన్‌బజార్‌లోనూ వ్యాపారులతో మాట్లాడి, వారి ఆమోదంతో దుకాణ సముదాయాలకు నష్టం రాకుండా నిర్మాణం చేశాం. పాతబస్తీకి పాత అలైన్మెంట్ ప్రకారమే మెట్రో నిర్మిస్తాం’ అని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాజెక్టుపై 370 కేసులుంటే, సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుని రెండేళ్లలో∙360 కేసులు పరిష్కరించారన్నారు. -
గోదారి తడారదు : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజె క్టుతో అన్నీ అద్భుతాలే జరుగుతున్నాయని, ఇకపైనా అద్భుతమే జరుగుతుందని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజె క్టుతో ఆరునూరైనా 45 లక్షల ఎకరాల ఆయ కట్టుకు నీరందిస్తామని, గోదావరి నదిని సజీవం చేస్తామని తెలిపారు. ఇప్పటికే గోదా వరి 250 కిలోమీటర్లు ఉల్టా నడుస్తోందని, వరద కాల్వ అంతా పెద్ద రిజర్వాయర్‌గా మారిందని పేర్కొన్నారు. కాళేశ్వరం నీళ్లతో చెరువులు నింపుతుండటంతో ప్రజలంతా పండుగ చేసుకుంటున్నారని చెప్పారు. పున రుజ్జీవ పథకంతో ఎస్సారెస్పీ కింద 7 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అయినట్లేనని, ప్రస్తుతం సగం టీఎంసీ నీటిని తీసుకునేలా పంపులు సిద్ధం చేయగా, మరో 30 రోజుల్లోనే ఒక టీఎంసీ నీటిని ఎస్సారెస్పీకి తరలించే చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎమ్మెల్యే కె.విద్యాసాగర్‌రావు, బాల్క సుమన్ అడిగిన ప్రశ్నలకు సీఎం బదులిచ్చారు. ఎస్సారెస్పీకి టీఎంసీ నీరు.. ‘పునరుజ్జీవ పథకంలో ఇప్పటికే 0.5 టీఎంసీల నీటిని తరలించేలా ఐదేసి మోటార్లు సిద్ధమ య్యాయి. దీంతో ఎస్సారెస్పీ కింద 7 లక్షల ఎకరాలు స్థిరీకరణ అయినట్లే. ఇప్పటికే వరద కాల్వ.. రిజర్వాయర్‌గా మారడంతో 35 చెరు వులు నిండాయి. ఒక టీఎంసీ నీటిని మరో నెలలో ఎస్సారెస్పీకి తరలించే వ్యవస్థ సిద్ధమైతే, ఈ ఆయకట్టంతా సురక్షితమే’అని సీఎం కేసీఆర్ వివరించారు. గోదావరిలో సెప్టెంబర్ తర్వాత నీళ్లుండవని, అక్టోబర్‌లో 170 టీఎంసీలు, నవం బర్లో 40 నుంచి 50 టీఎంసీల లభ్యత ఉంటుం దని పేర్కొన్నారు. ప్రస్తుతం మరో 15 రోజులు ఉధృతంగా వర్షాలుండే అవకాశలుండటంతో.. కరెంటు ఖర్చు కావొద్దని ప్రస్తుతం కాళేశ్వరం పంపులు నడపట్లేదని తెలిపారు. ‘ఇప్పటికే మేడారంలో 129 మెగావాట్లు, గాయత్రి పంప్‌హౌజ్‌లో 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 బాహుబలి మోటార్లలో 5 మోటార్లు సిద్ధమయ్యాయి. పదిహేను, ఇరవై రోజుల్లో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది. మరో 15 రోజుల్లోనే రోజుకు 2 టీఎంసీల నీటిని తీసుకునేలా వ్యవస్థ సిద్ధమవుతుంది. ఇందులో ఒక టీఎంసీని ఎంఎండీ, ఎల్ఎండీలకు తరలించి కోదాడ వరకు ఉన్న ఆయకట్టుకు నీరందిస్తాం’అని ఆయన చెప్పారు. అప్పులు సద్వినియోగం.. కాళేశ్వరం కోసం చేసిన అప్పులను సద్వినియోగం చేస్తున్నామని, ఈ ప్రాజెక్టుతో నిజాం సాగర్, సింగూరు ప్రాంతాలకు నీరిస్తామని తెలిపారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు పూర్తయితే సింగూరు, నిజాం సాగర్ ప్రాజెక్టుల్లో ఎప్పుడూ నీరు లభ్యతగా ఉంటుందని వివరించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని రేగొండ మండల పరిధిలో సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఊరికి కాళేశ్వరం జలాలు వచ్చాయని, ఆయన సైతం దీనిపై హర్షం వ్యక్తం చేసినట్లు గుర్తు చేశారు. తమ్మిడిహెట్టి బ్యారేజీని 148 మీటర్ల ఎత్తులో నిర్మించి.. ఆదిలాబాద్ జిల్లలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిస్తామని, ఇక్కడ లభ్యతగా ఉన్న 40 నుంచి 45 టీఎంసీల నీటిని పూర్తి స్థాయిలో వినియోగిస్తామని వివరించారు. అలాగే కుఫ్టి రిజర్వాయర్‌ను పూర్తి చేస్తామని చెప్పారు. వీక్లీ ఆఫ్‌పై త్వరలో నిర్ణయం.. పోలీసులకు వీక్లీ ఆఫ్ఫై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ వెల్లడించారు. 10 రోజులకు ఓసారి ఆఫ్ ఇవ్వడమా.. లేదా వారానికోసారి ఇవ్వడమా... అన్న దానిపై డీజీపీ, హోం శాఖ కార్యదర్శి చర్చిస్తున్నట్లు తెలిపారు. విపత్తుల నిర్వహణ, విపత్తుల నివారణను ఏకకాలంలో ఒకేచోట నుంచి పరిశీలించి అధ్యయనం చేసేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉపయోగపడుతుందని మరో ప్రశ్నకు తెలిపారు. -
అందుకే గిరిజన వర్సిటీ ఆలస్యం: సత్యవతి రాథోడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లులోనే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు అంశం ఉందని గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతంలోనే ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. ములుగు నియోజకవర్గం జాకారంలో స్థలాన్ని కేటాయించిందన్నారు. ప్రత్యేకంగా యూత్ ట్రైయినింగ్ సెంటర్ భవనాన్ని సైతం కేటాయించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనుమతులివ్వకపోవడంతో వర్సిటీ కార్యక్రమాలు ప్రారంభం కాలేదని తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం జరిగిన పద్దు లపై చర్చలో సత్యవతి రాథోడ్ మాట్లాడారు. వారి సమస్యలు నాకు తెలుసు.. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఒక మహిళకు బాధ్యత అప్పగించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజనులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలేంటో తనకు బాగా తెలుసని, వాటిని పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని చెప్పారు. సోమవారం డీఎస్ఎస్ భవన్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. -
కల్తీకి కొత్త చట్టంతో చెక్!
సాక్షి, హైదరాబాద్: ఆహార కల్తీ నియంత్రణకు కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఇప్పటికే అమలులో ఉన్న కేంద్ర చట్టానికి అనుబంధంగా దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. దీని ప్రకారం ప్రస్తుతం విధిస్తున్న జరిమానాలను పదింతలు చేస్తామన్నారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఆహారభద్రత పర్యవేక్షణపై మజ్లిస్ సభ్యులు ముంతాజ్ అహ్మద్ ఖాన్, జాఫర్‌హుస్సేన్ తదితరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి..ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆహారనాణ్యతకు పెద్దపీట వేస్తున్నామని, త్వరలోనే 26 ఫుడ్ ఇన్స్పెక్టర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. వారు ఒక్కొక్కరు నెలకు 150 నమూనాలను సేకరించి పరిశీలిస్తున్నారని, ఈ భారాన్ని తగ్గించేందుకు ఇటీవల సంచార ఆహార ప్రయోగశాలను ఏర్పాటు చేశామన్నారు. మార్చినాటికీ టీ హబ్–2 రాయదుర్గంలో రూ.276 కోట్లతో మూడెకరాల్లో నిర్మిస్తున్న టీ హబ్–2 వచ్చే ఏడాది మార్చినాటికి అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యేలు వివేకానంద్, బాల్క సుమన్, బిగాల గణేశ్ అడిగిన ప్రశ్న కు కేటీఆర్ తెలిపారు. ఇది దేశంలోనే విజయవంతమైన ఇంక్యుబేటర్ కాగా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా టీహబ్–2 నిలుస్తుందన్నారు. 3.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రతిపాదించిన ఈ ఇంక్యుబేటర్ రాకతో వేయి అంకుర ప రిశ్రమలకు అవకాశం కలుగుతుందన్నారు. గోవా, ఢిల్లీ, అసోం రాష్ట్రాలకు సాంకేతిక సహకారం అం దిస్తున్నామన్నారు. టీహబ్‌కు ఆర్బీఐ, నీతి ఆయోగ్‌లాంటి సంస్థల నుంచి ప్రశంసలందాయని, ఐటీ దిగ్గజ కంపెనీల అధినేతల అభినందనలు అందు కున్నామన్నారు. టీహబ్–2తో 4 వేల మందికి ఉపాధి లభిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతంలోని ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఐదేళ్లలో మైనింగ్ ఆదాయం 130% గనుల ద్వారా 2008–2014 వరకు రూ.7,376 కో ట్ల ఆదాయం రాగా.. అప్పటి నుంచి గత నెలనాటికి రూ.16,937 కోట్ల రాబడి లభించిందని కేటీఆర్ తెలిపారు. ఇది గతంతో పోలిస్తే 130% అధి కమన్నారు. కొత్త ఇసుక తవ్వక విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఆదాయం పెరిగిందని చెప్పారు. గత పాలకుల హయాంలో ఈ ఆదాయం ఎక్కడకు పోయిందో కాంగ్రెస్ సభ్యులు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ములుగులో గిరిజనుల పేరిట గిరిజనేతరులు కాంట్రాక్టులు దక్కించుకునేవారని, దానికి ముకుతాడు వేసి గిరిజన సహకార సంఘాలకు ఇసుక కాంట్రాక్టులు ఇవ్వడం ద్వారా 11.30 వేల కుటుంబాలకు రూ.83 కోట్ల ప్రయోజనం కలి గిందని కేటీఆర్ అన్నారు. డీఎంఎఫ్ నిధులను ఆ యా ప్రాంతాల్లోనే ఖర్చుపెట్టేలా విధానపర నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఇద్దరికి కూడా విద్యానిధి ఓవర్సీస్ విద్యానిధి కింద కుటుంబంలో ఒకరికే స్కాలర్షిప్ మంజూరు చేస్తున్నప్పటికీ, దరఖాస్తు చేసుకుంటే ఇద్దరికి కూడా ఆర్థిక సాయం చేయనున్నట్లు బాల్కసుమన్, హరిప్రియానాయక్, శంకర్‌నాయక్ అడిగిన ప్రశ్నకు మంత్రి కొప్పుల జవాబిచ్చారు. ఎంబీబీఎస్ విద్యార్థులు కూడా విదేశా ల్లో ఈ స్కాలర్షిప్ కింద చదువుకునేందుకు వెసులుబాటు కల్పించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. తాటిచెట్లు ఎక్కేందుకు యంత్రాల పరిశీలన తాటిచెట్లు ఎక్కడానికి ట్రీ క్లైంబింగ్ మెషీన్లు అనువు కాదని పరిశీలనలో తేలిందని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. అనువైనవి అందుబాటులో ఉంటే కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. గుడుంబా నిర్మూలన, దాని తయారీదారులకు పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. -
‘పోడు వ్యవసాయం చేసేవారికీ రైతు బీమా’
సాక్షి, హైదరాబాద్: పోడు వ్యవసాయం చేసుకునేవారికి కూడా రైతు బీమాను వర్తింపచేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. ఈ అంశంలో సాధ్యాసాధ్యాలు పరిశీలించి చెప్పాలని సీఎం ఆదేశించినట్టు వెల్లడించారు. ఆదివారం ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి ఈ వివరాలు తెలిపారు. టీఆర్ఎస్ సభ్యులు వెంకటేశ్వరరెడ్డి, బాల్క సుమన్, సతీశ్‌కుమార్‌లు రైతుబీమా గురించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యురాలు సీతక్క పోడు వ్యవసాయం చేసుకుంటున్నవారి గురించి అడిగారు. ఆ రైతులకు కూడా రైతు బీమాను వర్తింపచేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని, వారికి కూడా అండగా ఉంటామని మంత్రి సమాధానం చెప్పారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని సీతక్క గట్టిగా పేర్కొంటుండటంతో, పురాణగాథల్లో సహనానికి మారుపేరుగా ఉన్న సీతమ్మ తరహాలో, ఆపేరుతో ఉన్న సీతక్క కూడా ఓపికగా ఉంటే అన్నింటికి సమాదానాలు వస్తాయని మంత్రి చమత్కరించారు. రైతు బీమా లబ్ధి అందటం లేదన్న అంశానికి ఆయన వివరణ ఇస్తూ, శాసనసభా సమావేశాలు ముగిసిన తర్వాత ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఏడాది 31 లక్షల మంది రైతులు ప్రీమియం చెల్లించారని తెలిపారు. కొత్తగా ఏర్పడ్డ 164 మండలాల్లో కూడా గోదాముల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. -
మాకు ప్రతిపక్ష హోదా కల్పించండి
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీలో తమ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించి విపక్ష హోదాను కల్పించాలని శాసనసభాపతికి మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై స్పీకర్‌కు ఎంఐఎం శాసనసభాపక్షం ఒక లేఖను ఇటీవల అందజేసింది. కాంగ్రెస్ శాసనసభాపక్షానికి చెందిన 12 మం ది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో విలీనమైన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.సభలోని మొత్తం సభ్యుల్లో కనీసం పదిశాతం బలం లేకపోతే నిబంధనల మేరకు ఆ పా ర్టీకి ప్రతిపక్షంగా గుర్తింపు, అలాగే దాని నేతకు విపక్షనేత హోదాను ఇవ్వడం సాధ్యం కాదని శాసనసభా వర్గాలు స్పష్టంచేశాయి. 1994లో కాంగ్రెస్‌పార్టీ నుంచి 26 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో అప్పుడు కూడా పి.జనార్ధనరెడ్డికి ప్రతిపక్షనేత హోదా ఇవ్వలేదని, సీఎల్‌పీనేతగానే ఆయన వ్యవహరించారని ఉటంకిస్తున్నాయి. శాసనసభలో వివిధ అం శాలపై చర్చ, ప్రసంగాలకు అవకాశమిచ్చే సందర్భంలో మాత్రం సం ఖ్యాబలం దృష్ట్యా ఎంఐఎంకే తొలి అవకాశం లభిస్తుందని తెలిపాయి. అందుకు తగ్గట్టుగానే గురువారం అసెంబ్లీలో పలు బిల్లులపై చర్చ సందర్భంగా ఎంఐఎంకే అవకాశం దక్కిన విషయం తెలిసిందే. -
టీడీపీ ఎమ్మెల్యేలతో టచ్‌లోకి.. టీడీఎల్పీ విలీనం దిశగా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో అధికారాన్ని నిలబెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) శాసనసభలో పరిపూర్ణ మెజారిటీ దిశగా వేగంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. శాసనమండలిలో అనుసరించిన వ్యూహాన్నే శాసనసభలోనూ అనుసరించి విపక్ష సభ్యులను అధికారికంగా విలీనం చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలియవచ్చింది. నూతన అసెంబ్లీ తొలి సమావేశాలకు ముందే ఈ ‘ఆపరేషన్’ను పూర్తి చేసి కాంగ్రెస్, టీడీపీలకు భారీ షాక్ ఇచ్చేలా వ్యూహాలకు పదును పెట్టాలనేది పార్టీ పెద్దల ఆలోచనగా ఉందని సమాచారం. తద్వారా లోక్‌సభ ఎన్నికల నాటికి ఆ పార్టీలను రాజకీయంగా మరింత దెబ్బతీయడంతోపాటు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే మొదలైనట్లు తెలిసింది. టీడీపీ ఎమ్మెల్యేలతో చర్చలు షురూ... అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకునేలా టీఆర్ఎస్ వ్యూహాలు ఇప్పటికే మొదలైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీని ప్రకారం... గత శాసనసభలో తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకున్నట్లుగానే ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి), మెచ్చా నాగేశ్వర్రావు (అశ్వారావుపేట)లను ఒకేసారి పార్టీలో చేర్చుకొని ఈ ప్రక్రియకు ముగింపు పలకాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటికే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలతో ఈ దిశగా మొదలైన సంప్రదింపులు కీలక దశకు చేరుకున్నాయని తెలిసింది. అసెంబ్లీ తొలి సమావేశాలకు ముందే టీడీఎల్పీ విలీనం దిశగా నిర్ణయాలు జరగనున్నాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే ఎమ్మెల్యేల ప్రమాణానికి ముందే తెలంగాణలో టీడీపీ ప్రాతినిధ్యం పూర్తిగా లేకుండా పోనుంది. కాంగ్రెస్ అడ్రస్ గల్లంతే లక్ష్యంగా... కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలోనూ ఇదే వ్యూహంతో ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. శాసనమండలిలో కాంగ్రెస్ పక్షాన్ని విలీనం చేయడంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా రద్దయింది. ఇదే తరహాలో అసెంబ్లీలోనూ జరిగే అవకాశం ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాల్లో గెలిచింది. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున గెలిచిన కోరుకంటి చందర్ (రామగుండం), స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన లావుడ్యా రాములు నాయక్ (వైరా) టీఆర్ఎస్లో చేరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 19 స్థానాలకే పరిమితమైంది. అయితే ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో 12 మంది తమతో కలిసేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని టీఆర్ఎస్ అధిష్టానం ముఖ్యులు చెబుతున్నారు. వారిలో ఎనిమిది మంది ఏ క్షణమైనా టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని అంటున్నారు. సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ ఆలస్యానికి ఇది కూడా ఒక కారణమని చెబుతున్నారు. టీఆర్ఎస్ ముఖ్యులు చెబుతున్న దాని ప్రకారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీతో కలసి పని చేసేందుకు నిర్ణయం తీసుకుంటే అసెంబ్లీలోనూ శాసనమండలి పరిస్థితులే పునరావృతం కానున్నాయి. ఏమిటీ గులాబీ వ్యూహం..? జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ అసెంబ్లీలో పరిపూర్ణ మెజారిటీ కోసం వ్యూహాలు అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 ఎంపీ సీట్లకుగాను 16 స్థానాల్లో (మిత్రపక్షమైన మజ్లిస్ పోటీ చేసే ఒక సీటు మినహా) గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్క ఎమ్మెల్యే స్థానం నుంచి గణనీయ స్థాయిలో లోక్‌సభ స్థానాల్లో మెజారిటీ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్ఎస్... ఇందుకోసం ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలియవచ్చింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌లో ఒకరకమైన నైరాశ్యం నెలకొంది. లోక్‌సభ ఎన్నికల వరకు కుదురుకోవాలని ఆ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఆదేశాలతో లోక్‌సభ ఎన్నికలకు టీపీసీసీ సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఎమ్మెల్యేలను చేర్చుకునే వ్యూహంతో కాంగ్రెస్‌ను మరోసారి దెబ్బ కొట్టాలని, ఎమ్మెల్యేల చేరికలు సైతం నలుగురైదుగురితో సరిపెట్టకుండా కాంగ్రెస్ కోలుకోకుండా చేయాలనే వ్యూహంతో టీఆర్ఎస్ ఉన్నట్లు కనిపిస్తోంది. మండలిలో కాంగ్రెస్‌కు విపక్ష హోదా రద్దు శాసనమండలిలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా రద్దయింది. కాంగ్రెస్ శాసనమండలిపక్ష నేతగా ఉన్న షబ్బీర్ అలీ హోదాను రద్దు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వి. నర్సింహాచార్యలు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ శాసనమండలిపక్షం టీఆర్ఎస్లో విలీనమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలిలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు. మరో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ... వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం ఖాళీ అయినట్లు అసెంబ్లీ కార్యదర్శి మరో ఉత్తర్వు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు తన పదవికి చేసిన రాజీనామాను శాసనమండలి చైర్మన్ వి.స్వామిగౌడ్ ఆమోదించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
అసెంబ్లీలో తగ్గిన ‘యువ’ ప్రాతినిథ్యం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభలో యువతకు ప్రాతినిధ్యం తగ్గింది. 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసుగల ఎమ్మెల్యేలు 2014 సభలో 12 మంది ఉండ గా, కొత్త శాసనసభలో వీరి సంఖ్య 5కు తగ్గింది. పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ ఈ మేరకు గురువారం ఒక నివేదిక విడుదల చేసింది. ఐదు రాష్ట్రాలకు కొత్త శాసనసభలు కొలువుదీరనున్న నేపథ్యంలో ఆయా గణాంకాలు విశ్లేషించింది. 61 శాతం ఎమ్మెల్యేలు తిరిగి ఎన్నికయ్యారని వివరించింది. గత సభలోని వారు 73 మంది తిరిగి ఎన్నికవగా 46 మంది కొత్తగా ఎన్నికయ్యారని తెలిపింది. 2014లో 9 మంది మహిళలు ఎన్నికవగా ఈసారి ఆ సంఖ్య 5 మాత్రమే. ఇక 41–55 మధ్య వయస్కుల్లో 2014లో 67 మంది ఎన్నికవగా.. ఈ సభలోనూ 67 మంది ఎమ్మెల్యేలు ఇదే కేటగి రీలో ఉన్నారు. 56–70 మధ్య వయస్కులు పాత సభలో 40 మంది ఉండగా, ఈసారి 45 మంది ఉన్నారు. 71 ఏళ్ల వయసు పైబడినవారు గత సభలో ఎవరూ లేరు. ఈసారి ఇద్దరు ఉన్నారు. విద్యకు సంబంధించిన గణాంకాలు పరిశీలిస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్, ఆపైన విద్యార్హత ఉన్న వారి సంఖ్య 19 నుంచి 26కు పెరి గింది. డిగ్రీ విద్యార్హత కలిగిన వారి సంఖ్య 60 నుంచి 43కు తగ్గింది. 12వ తరగతి వరకు విద్యార్హత కలిగిన వారి సంఖ్య 37 నుంచి 45కు పెరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో 25–40 మధ్య వయçస్కుల్లో గత సభలో కేవలం ఆరుగురు ఉండగా.. ఈసారి 25కు పెరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో మహిళల ప్రాతినిధ్యం 10 నుంచి 13కు పెరి గింది. 90 స్థానాలకు 13 మంది మహిళల ప్రాతిని థ్యం ఉండటం విశేషం. మిజోరంలో మాత్రం గత సభలో ఒక మహిళా సభ్యురాలు ఉండగా ఈసారి ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం. -
అసెంబ్లీలో పాముల సయ్యాట
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో రెండు పాములు కలకలం సృష్టించాయి. అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ సమీపంలో శుక్రవారం రెండు పాముల సయ్యాట బెంబేలెత్తిచింది. దాదాపు అరగంటలపాటు పాములు పెనవేసుకున్నాయి. ఈ సమయంలో మీడియా హాలులో ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతున్నారు. పాముల సయ్యాటను చూసిన కొంతమంది స్నేక్ సొసైటీకి సమాచారం అందించారు. స్నేక్ సొసైటీ సభ్యులు వచ్చి పాములను పట్టుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే అసెంబ్లీ అవరణలో తరచూ పాములు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. (పాములను పట్టుకున్న స్నేక్ సొసైటీ సభ్యులు) -
తెలంగాణ అసెంబ్లీలో పాముల సయ్యాట
-
ఈసీని కలిసిన కోమటిరెడ్డి, సంపత్
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఓపీ రావత్‌ను కలిశారు. ఈ సందర్భంగా శాసన సభ్యత్వాల రద్దును కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులను అందచేశారు. అప్రజాస్వామిక రీతిలో తెలంగాణ ప్రభుత్వం తన సభ్యత్వాలను రద్దు చేసిన తీరు, హైకోర్టు ఆ ఉత్తర్వులను రద్దు చేయడాన్ని ఈసీకి వివరించారు. రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని వారు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి, సంపత్తో పాటు మర్రి శశిధర్ రెడ్డి కూడా ఉన్నారు. -
అనర్హత చెల్లదు..
సాక్షి, హైదరాబాద్: న్యాయ పోరాటంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌లు విజయం సాధించారు. వీరిద్దరిని బహిష్కరిస్తూ ఈ ఏడాది మార్చి 13న అసెంబ్లీ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను, వారి స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. వారి బహిష్కరణ పూర్తిగా సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా జరిగిందని స్పష్టంచేసింది. బహిష్కృతులకు వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వకపోవడం, బహిష్కరణ ప్రొసీడింగ్స్‌ను అందజేయకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. నల్లగొండ, అలంపూర్ అసెంబ్లీ స్థానాలకు వారిద్దరూ ఎమ్మెల్యేలుగా కొనసాగుతారని, అయితే వారిపై ఎవరైనా క్రిమినల్ చర్యలు తీసుకుని ఉన్నా, తీసుకోవాలని భావిస్తున్నా అందుకు ఏదీ అడ్డంకి కాదని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు మంగళవారం తీర్పునిచ్చారు. వీరిద్దరి విషయంలో రాజ్యాంగంలోని సమానత్వపు హక్కుతోపాటు వారి ప్రాథమిక హక్కులను సైతం హరించారని న్యాయమూర్తి తన 172 పేజీల తీర్పులో వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున గవర్నర్ ప్రసంగం సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలియచేశాయి. ఈ సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి విసిరిన హెడ్‌ఫోన్ వల్ల మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయమైందని అధికార పార్టీ ఆరోపించింది. కోమటిరెడ్డితో పాటు సంపత్‌కుమార్‌ను సభ నుంచి బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. అంతేగాక వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ, అలంపూర్ నియోజకవర్గాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ కోమటిరెడ్డి, సంపత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హెడ్‌ఫోన్ విసరడం వల్లే స్వామిగౌడ్ కంటికి గాయమైనట్లు ఆరోపణలు వచ్చినందున అందుకు సంబంధించిన వీడియో ఫుటేజీలను కోర్టు ముందుంచేలా అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలని వారు తమ వ్యాజ్యంలో కోర్టును కోరారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు విచారణ జరిపి ఇటీవల తీర్పును వాయిదా వేశారు. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు తీర్పు వెలువరించారు. వాస్తవానికి మంగళవారం విచారణ కేసుల జాబితాలో ఈ కేసు ప్రస్తావన లేదు. అయితే అకస్మాత్తుగా 1.30 గంటలకు తీర్పు వెలువరించనున్నారని, పిటిషనర్, ప్రతివాదుల తరఫు న్యాయవాదులు హాజరు కావాలన్న సమాచారంతో కోర్టు డిస్ప్లే బోర్డుల్లో స్క్రోలింగ్ వచ్చింది. దీంతో కోర్టు న్యాయవాదులతో కిటకిటలాడింది. తీర్పు పూర్తి పాఠం ఇదీ.. అసలు సభ తీర్మానమే అవసరం లేదు ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న న్యాయ, శాసన వ్యవహారాల కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శుల తరపున తాను హాజరవుతున్నట్లు అడ్వొకేట్ జనరల్ చెప్పారు. అంతేకాక వీడియో ఫుటేజీలను సమర్పించాలంటూ ఆదేశాలివ్వాల్సిన అవసరం లేదని, వీడియో ఫుటేజీ ఒరిజినల్ రికార్డులను సమర్పిస్తామని హామీ ఇచ్చారు. పూర్తి వివరాలతో కౌంటర్లు కూడా దాఖలు చేస్తామన్నారు. ఏజీ హామీని, కౌంటర్ల దాఖలు చేస్తామన్న విషయాన్ని కూడా మా ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నాం. కౌంటర్ల దాఖలుకు రెండుసార్లు గడువు కూడా తీసుకున్నారు. దీన్ని ఈ కేసు ప్రొసీడింగ్స్‌లో అసెంబ్లీ కార్యదర్శి పాలుపంచుకున్నట్లు మా డాకెట్ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. అయితే అసెంబ్లీ కార్యదర్శి ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా.. ఈ కేసులో వాదనలు వినిపించకూడదని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వీడియో ఫుటేజీలు ఉండి కూడా వాటిని సమర్పించకుంటే, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ ఫుటేజీలోని అంశాలకు మీకు (అసెంబ్లీ కార్యదర్శికి) వ్యతిరేకంగా ఉన్నట్లు భావించాల్సి ఉంటుందని కూడా చెప్పాం. అయినా వీడియో ఫుటేజీని సమర్పించ లేదు. వీడియో ఫుటేజీ సమర్పణకు సభ తీర్మానం అవసరమని వాదనల సమయంలో అదనపు ఏజీ రామచంద్రరావు చెప్పారు. వాస్తవానికి ఏదైనా డాక్యుమెంట్ సమర్పణకు సభ తీర్మానం ఎంత మాత్రం అవసరం లేదు. సభ నిర్వహణ రూల్స్‌లోని 351 రూల్ ప్రకారం.. సభకు సంబంధించిన అన్ని రికార్డులు, డాక్యుమెంట్లు, ఇతర పేపర్లన్నీ కూడా అసెంబ్లీ కార్యదర్శి కస్టడీలో ఉంటాయి. స్పీకర్ అనుమతి లేకుండా వీటిలో దేన్ని కూడా బహిర్గతం చేయడానికి వీల్లేదని నిబంధనలు చెబుతున్నాయి. అంటే అసెంబ్లీ కార్యదర్శి కస్టడీలో ఉన్న దేనినైనా ఆయన బయటపెట్టాలంటే స్పీకర్ అనుమతిస్తే చాలు. స్పీకర్ రాతపూర్వక అనుమతి కూడా అవసరం లేదు. కేవలం మౌఖిక అనుమతి సరిపోతుంది. అయితే వీడియో ఫుటేజీ సమర్పణకు సభ తీర్మానం అవసరమని అదనపు ఏజీ ఎలా చెప్పారో మాకు అర్థం కాకుండా ఉంది. అలా చేయడం హక్కుల ఉల్లంఘనే హెడ్‌ఫోన్ విసిరిన ఘటన గవర్నర్ ప్రసంగం రోజున జరిగింది. గవర్నర్ ప్రసంగం అసెంబ్లీ కార్యకలాపాల కిందకు రాదు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా సభ హుందాతనానికి భంగం కలిగేలా వ్యవహరించడం, సభా కార్యకలాపాలకు విఘాతం కలిగించడం వంటి కారణాలను తెలియచేస్తూ నోటీసులు ఇవ్వడం కూడా చేయలేదు. బహిష్కరణకు ముందు వివరణ కోరలేదు. వాదన వినలేదు. బహిష్కరణ తీర్మానంలో ఎక్కడా కారణాలు చెప్పలేదు. ఎటువంటి వివరాలు లేకుండా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. 11 రోజుల తర్వాత తీర్మానాన్ని అప్లోడ్ చేశారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాతే ఇది జరిగింది. సభలో వాదనలు వినిపించే అవకాశం ఇవ్వలేదు. బహిష్కరణ తర్వాత అందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ కాపీని అందచేయలేదు. కోర్టు జోక్యం చేసుకోకుండా ఉండేందుకు ఇదంతా కేవలం వి«ధానపరమైన లోపమని చెప్పడం సరికాదు. హైకోర్టుకు వీడియో ఫుటేజీ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఈ మొత్తం వ్యవహారంలో కోమటిరెడ్డి, సంపత్‌లను బలి పశువులను చేశారు. బహిష్కరణ అన్నది సభ్యుడికి కఠినమైన శిక్ష. ఈ శిక్ష వల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యే లేకుండా పోతాడు. ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఒక్క కలం పోటుతో వీరిద్దరినీ అనర్హులుగా చేసేశారు. దీన్ని కేవలం విధానపరమైనలోపంగా కాక, రాజ్యాంగపరమైన హక్కుల ఉల్లంఘనగా భావిస్తున్నాం. పిటిషనర్ల ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించారు. కాబట్టి అసెంబ్లీ కార్యదర్శి జారీ చేసిన ప్రొసీడింగ్స్ చట్ట ప్రకారం చెల్లవు. సభా కార్యకలాపాల్లో జోక్యం చేసుకోరాదని చెప్పిన సుప్రీంకోర్టు, సభ జారీ చేసిన ప్రొసీడింగ్స్ చట్ట విరుద్ధంగా ఉన్నప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చునని చెప్పింది. ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదన్న ఏజీ వాదన సరికాదు. ఈ వ్యాజ్యంలో న్యాయ, శాసన వ్యవహారాల కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల కమిషనర్లను ప్రతివాదులుగా చేర్చారు. వివాద నేపథ్యాన్ని చూస్తే సరైన వారినే ప్రతివాదులుగా చేర్చారు. రాజీనామా చేయించిన ఆ హామీ కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌పై బహిష్కరణ మొదలు.. తీర్పు వరకు ఈ కేసులో పలు మలుపులు చోటుచేసుకున్నాయి. బహిష్కరణపై కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. వీడియో ఫుటేజీ సమర్పించాలని ఆదేశాలు జారీ చేసేందుకు జడ్జి సిద్ధమయ్యారు. దీంతో ప్రభుత్వం, అసెంబ్లీ తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి స్పందిస్తూ.. ఆదేశాలు అవసరం లేదని, సీల్డ్ కవర్లో వీడియో ఫుటేజీలు సమర్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని న్యాయమూర్తి నమోదు చేసుకున్నారు. ప్రకాశ్‌రెడ్డి ఇచ్చిన ఈ హామీ ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం చెప్పింది. ఆయనపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. దీంతో ప్రకాశ్‌రెడ్డి ఏజీ పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. ఏజీ రాజీనామా అటు ప్రభుత్వ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో సంచలనమైంది. ఆ తర్వాత ఈ కేసులో హాజరవుతున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. ఏజీ హామీతో తమకు సంబంధం లేదన్నారు. వీడియో ఫుటేజీ ఇవ్వాలంటే సభ తీర్మానం అవసరమని, తీర్మానం లేదు కాబట్టి ఫుటేజీ ఇచ్చే అవకాశం లేదన్నారు. ఆ తర్వాత తాను, ఏజీ కలిసే హామీ ఇచ్చామని ఓసారి, తన సూచనతోనే వీడియో ఫుటేజీ సమర్పిస్తానని ఏజీ హామీ ఇచ్చారని మరోసారి చెప్పారు. ఇలా పరస్పర విరుద్ధమైన ప్రకటనలపై న్యాయమూర్తి సైతం విస్మయం వ్యక్తం చేశారు. ఏఏజీ ప్రకటనలు న్యాయ వర్గాల్లోనూ సంచలనంగా మారాయి. చివరకు అసెంబ్లీతో తనకు సంబంధం లేదని, కేవలం ప్రభుత్వం తరఫునే వాదనలు వినిపిస్తున్నామంటూ.. మూడు పేజీలతో కౌంటర్ దాఖలు చేశారు. కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల బహిష్కరణతో తమకు సంబంధం లేదని మూడు పేరాల్లో తేల్చి చెప్పేశారు. తీర్పును అమలు చేస్తారా? హైకోర్టు ఇచ్చిన తీర్పును అసెంబ్లీ వర్గాలు అమలు చేస్తాయా? లేదా? అన్న విషయంపై అటు రాజకీయ వర్గాల్లో, ఇటు న్యాయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో అసెంబ్లీ అనుసరించిన తీరును చూస్తుంటే తీర్పును అమలు చేసేలా కనిపించడం లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. న్యాయవర్గాలు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అదే నిజమైతే దాని పర్యవసానాలు రెండు వ్యవస్థల మధ్య ఘర్షణ పూరిత వాతావరణానికి దారి తీసే అవకాశం ఉంటుంది. కోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం కేసీఆర్ మంగళవారం రాత్రి న్యాయ నిపుణులతో చర్చించారు. బహిష్కరణకు భయపడ లేదు: సంపత్ ‘‘అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరించి నన్ను బహిష్కరణతో భయపెట్టాలని చూసింది. అయినా నేను భయపడలేదు.. వెనక్కి తగ్గలేదు. ఈ రోజు హైకోర్టు తీర్పు నాకు అనుకూలంగా రావడానికి ప్రజల ఆశీర్వాదంతో పాటు భగవంతుని అనుగ్రహమే కారణం. ఈ తీర్పు నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ఇక నుంచి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రెట్టించిన ఉత్సాహంతో పోరాడుతా ప్రభుత్వ పతనానికి నాంది: కోమటిరెడ్డి ‘‘దేశంలో కాంగ్రెస్ పార్టీ, దేవుడున్నంత కాలం వంద మంది కేసీఆర్‌లు వచ్చినా నన్ను ఏమీ చేయలేరు. కాంగ్రెస్ ఇచ్చిన అండదండలు, రాష్ట్ర ప్రజలు ఇచ్చిన మనోధైర్యంతో ప్రభుత్వ ఆగడాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. ఈ న్యాయ పోరాటానికి ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ అందించిన సహకారం, తోడ్పాటు మరువలేనిది. ఆయన బలంతో నిరంకుశ టీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు పోరాటం చేస్తా. మా సభ్యత్వాలను రద్దు చేయడం ద్వారా సీఎం కేసీఆర్ తన గోతిని తానే తవ్వుకున్నట్లయింది. ప్రభుత్వ పతనానికి ఈ తీర్పు నాంది కాబోతోంది. -
కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు చెల్లదు
-
ఎమ్మెల్యేల బహిష్కరణ; హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష కాంగ్రెస్ శాసనసభ్యుల సభ్యత్వాలను రద్దు చూస్తూ తెలంగాణ అసెంబ్లీ జారీ చేసిన గెజిట్ నోటిషికేషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు నిర్ణయం చెల్లుబాటు కాదని, సదరు గెజిట్ నోటిషికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న ఈ కేసులో మంగళవారం తుది తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి.. ‘కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్‌లు యధావిధిగా తమ పదవుల్లో కొనసాగొచ్చ’ని పేర్కొన్నారు. అదేసమయంలో నల్లగొండ, ఆలంపూర్ శాసన సభ స్థానాల్లో ఖాళీ ఏర్పడిందంటూ ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లేఖ కూడా చెల్లుబాటు కాదని అన్నారు. ఈ మేరకు సుదీర్ఘ తీర్పును వెల్లడించారు. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ వర్గాలు హర్షాతిరేకం వ్యక్తం చేశాయి. అది అసెంబ్లీ లోపలి వ్యవహారం కాదు: సాధారణంగా అసెంబ్లీ వ్యవహారాలకు సబందించిన కేసుల్లో జోక్యానికి నిరాకరించే హైకోర్టు.. కోమటిరెడ్డి, సంపత్ కుమార్ల పిటిషన్‌పై మాత్రం భిన్నంగా తీర్పు చెప్పింది. ‘మార్చి 12 నాటి సంఘటన అసెంబ్లీ లోపలి వ్యవహారం కాదు. అసెంబ్లీ బయటి వ్యవహారం. కాబట్టే మేము స్పష్టమైన స్పష్టమైన తీర్పు ఇస్తున్నాం’ అన్న న్యాయమూర్తి.. ఇది దేశానికి దిశానిర్దేశం చేసే తీర్పుల్లో ఒకటని వ్యాఖ్యానించడం గమనార్హం. అసలేం జరిగింది?: మార్చి 12న బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడారు. విపక్ష కాంగ్రెస్ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డి.. హెడ్‌సెట్‌ను పోడియం వైపు విసరడం, దీనికి మరో ఎమ్మెల్యే సంపత్ కుమార్ సహకరించడం తదితర దృశ్యాలు వీడియోల్లో రికార్డయ్యాయి. ఆ తర్వాత విపక్ష ఎమ్మెల్యేల తీరును గర్హించిన ప్రభుత్వం.. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దుచేయాలని, మిగతా వారిని సస్పెండ్ చేయాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. దానికి స్పీకర్ ఆమోదం తెలపడంతో ఈ మేరకు అసెంబ్లీ ఒక గెజిట్ నోట్‌ను విడుదలచేసింది. అయితే, గవర్నర్ ప్రసంగం సందర్భానికి సభా నియమాలు వర్తించవని, ఆ సమయంలో జరిగిన ఘటనలపై నిర్ణయం తీసుకోవాల్సింది గవర్నరేగానీ, స్పీకర్ కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాదించారు. ఆ మేరకు నోటిఫికేషన్ రద్దును కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. వాదోపవాదాలు విన్న ధర్మాసనం.. మార్చి 12 నాటి అసెంబ్లీ వీడియోలన్నీ కోర్టుకు సమర్పించాలని కోరగా, అందుకు ప్రభుత్వం వెనుకడుగువేసింది. చివరికి కాంగ్రెస్ సభ్యులకు ఊరటనిస్తూ తీర్పు వెలువరించింది. -
హక్కుల పరిరక్షణే చట్టసభల కర్తవ్యం
సాక్షి, న్యూఢిల్లీ : సమాజంలో అసమానతల్లేకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధి విధానాలు రూపొందించి చట్టాలను అమలు చేయడమే చట్టసభల ప్రధాన కర్తవ్యమని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. సోమవారం ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన జరిగిన కామన్వెల్త్ పార్లమెంటరీ సమీక్షలో పలు రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లు, మండలి చైర్మన్లు పాల్గొన్నారు. ప్రజల హక్కులను పరిరక్షించేందుకు సభలను నడపాలని మధుసూదనాచారి పేర్కొన్నారు. గత కామన్వెల్త్ పార్లమెంటరీ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుపై సమావేశంలో చర్చించారు. తదుపరి సమావేశం జూన్ 2న ముంబైలో నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో రాష్ట్ర అసెంబ్లీ పనితీరు ప్రశంసనీయమని సుమిత్రా మహాజన్ కొనియాడినట్లు పేర్కొన్నారు. చట్టసభల్లో ఎదురవుతున్న సమస్యలు, ఇతర అంశాల పరిష్కారానికి ఇలాంటి సమావేశాలు ఉపయోగపడుతాయని మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. అన్ని రాష్ట్రాల స్పీకర్లు, మండలి చైర్మన్లతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించాలని కోరడంపై సుమిత్రా మహాజన్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. సమాజంలోని అసమానతల తొలగింపునకు విశేష కృషి చేసి దేశానికి దశ, దిశ చూపిన మహనీయులు జ్యోతిబా పూలే, బీఆర్ అంబేడ్కర్ అని మధుసూదనాచారి, స్వామిగౌడ్ కొనియాడారు. తెలంగాణ పూలే బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే, అంబేడ్కర్ల జయంతి వేడుకలను ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. -
‘వాళ్లు చిన్నపిల్లల్లా పారిపోయారు’
సాక్షి, యాదాద్రి: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా కాంగ్రెస్ నేతలు చిన్న పిల్లల్లా పారిపోయారని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారం యాదాద్రిలో మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ అప్పుల ఊబిలో ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కానీ రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వడానికే ఈ అప్పులని స్పష్టం చేశారు. రైతులను బలోపేతం చేయడానికే రైతు సమన్వయ సమితిల ఏర్పాటు చేశమన్నారు. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను మూడేళ్ళలోనే నెరవేర్చామని తెలిపారు. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని ఆయన వెల్లడించారు. అవి టీఆర్ఎస్ సమావేశాలు: కాంగ్రెస్ అసెంబ్లీ సమావేశాలను టీఆర్ఎస్ పార్టీ సమావేశాలుగా నిర్వహించారని సీఎల్పీ ఉపనేత సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. పంచాయితీ చట్టం మార్పుల ద్వారా గ్రామ సభలకు కోరలు తీసేసి కలెక్టర్లకు అధికారాలు కట్టబెట్టారన్నారు. ప్రైవేటు యూనివర్సిటీలను తీసుకురావడం కార్పొరేట్‌ను ప్రోత్సహించడమేనని తెలిపారు. కాగ్ రిపోర్ట్ కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదన్నారు. రాష్ట్రంలో ఆర్థిక నియంత్రణ లేదని రిపోర్టు స్పష్టం చేసిందన్నారు. -
అసెంబ్లీ నిరవధిక వాయిదా
-
టెంట్లే లేవు.. కానీ ఫ్రంట్‌లా!: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతున్న ఫ్రంట్ గురించి మాట్లాడుతూ.. టెంట్లే లేవు.. కానీ ఫ్రంట్ల గురించి మాట్లాడుతున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం శాసనసభ సమావేశాలు పెడితే సీఎం కేసీఆర్ మాత్రం ఫ్రంట్ల గురించి మాట్లాడటం తగదన్నారు. బడ్జెట్ సమావేశాలు చాలా నిరుత్సాహంగా, ఓ తంతులాగా జరిగాయన్నారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా తర్వాత మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సభ నిర్వహణలో పాలకపార్టీ టీఆర్ఎస్ తీరు విచిత్రంగా ఉందని, తాము లేవనెత్తిన అంశాలపై మాట్లాడనివ్వకుండానే పద్దులపై చర్చ తూతూ మంత్రంగా ముగించారని చెప్పారు. ద్రవ్యవ వినిమయ బిల్లుపై వివరణ ఇవ్వకుండానే పాస్ చేయించుకోవడం టీఆర్ఎస్కే సాధ్యమన్నారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో మిగులు రాష్ట్రమే కానీ ఇప్పుడు అప్పుల రాష్ట్రం. గొప్పలకు పోయి రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల్లోకి నెట్టారని విమర్శించారు. ఈ బడ్జెట్ సమావేశాలను టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికే పెట్టారని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడే కేంద్రంలో తాము కూడా అప్పుడే వచ్చామన్నారు. తాను అడిగిన అంశంపై ప్రభుత్వం అజ్ఞానమా, అధికారమా టీఆర్ఎస్ ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. ఎఫ్ఆర్బీఎంలో 3.8 కంటే ఎక్కువ పెరగకూడదని ఉంది కానీ ఇష్టా రాజ్యంగా నిధులు పెంచి ఖర్చు పెట్టారని చెప్పారు. 2016-17లో కాగ్ ఇచ్చిన రిపోర్ట్ రికార్డ్ స్థాయిలో 5.46కి పెరిగిందన్నారు. ఆడిట్ రిపోర్టులో వచ్చిన నిజాలపై, తాను చేసిన ఆరోపణలపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దొంగ యూసీలు ఇచ్చిందని కాగ్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. 'ఏదైనా అడిగితే సమాధానం చెప్పకుండా కేంద్రం, బీజేపీ పాలిత రాష్ట్రాల గురించి మాట్లాడుతూ మా గొంతు నొక్కారు. ఒకరోజు ముందు బిల్లు ప్రతులు బీఏసీలో ప్రవేశపెట్టాలి. తెలుగు తప్పనిసరి బిల్లును కేవలం రెండు నిమిషాల ముందు ఇచ్చి చర్చ ప్రారంభించారు. సబను 13 రోజులకే పరిమితం చేసి పంచాయతీ రాజ్ బిల్లు రాత్రికి రాత్రే ఇచ్చారని' బీజేపీ నేత కిషన్ రెడ్డి వివరించారు. -
అసెంబ్లీ నిరవధిక వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ గురువారం నిరవధిక వాయిదా పడింది. పదమూడు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో మొత్తం 11 బిల్లులకు ఆమోదం లభించింది. వీటిలో పంచాయతీ రాజ్ బిల్లు కూడా ఆమోదం ఉంది. మొత్తం 60 గంటల 58 నిమిషాల పాటు సభ కొనసాగింది. అసెంబ్లీలో పార్టీ బలాబలాలపై తీర్మానం ప్రవేశపెట్టారు. అందులో 82 మంది టీఆర్ఎస్ సభ్యులు, 17 మంది కాంగ్రెస్, ఏడుగురు ఎంఐఎం, ఐదు మంది బీజేపీ, ముగ్గురు టీడీపీ, వామపక్షపార్టీల సభ్యులు ఇద్దరు, ఓ ఇండిపెండెంట్, ఓ నామినేటేడ్ ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్లపై సస్పెన్షన్ వేటు పడటంతో రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. అయితే విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించిన ప్రైవేటు యూనివర్శిటీల బిల్లును కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే సభ ఆమోదించింది. బుధవారం విద్యార్థి సంఘాలు ప్రైవేటు యూనివర్శిటీ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన సంగతి తెలిసిందే. -
కేసీఆర్‌ను కలిసిన ప్రకాష్‌రాజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గురువారం సినీనటుడు ప్రకాష్‌రాజ్ కలిశారు. కేసీఆర్‌తో కలిసి అసెంబ్లీకి వచ్చిన ప్రకాష్‌రాజ్ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. జాతీయస్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టి.. దేశంలో గుణాత్మక మార్పుల కోసం ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ రావాలంటున్న సీఎం కేసీఆర్ ఇటీవలే కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ కేసీఆర్‌తో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చ జరిపినట్టు తెలుస్తోంది. కాగా, నిన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిసి రాజకీయ పరిణామాలు, ఫెడరల్ ఫ్రంట్ నిర్మాణానికి అనుసరించాల్సిన వ్యూహం వంటి వాటిపై చర్చించారు. కాగా, తాను మోదీ వ్యతిరేకనని ఇప్పటికే ప్రకటించిన ప్రకాష్‌రాజ్, కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ
-
అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ వరాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా గౌడ కులస్థులపై వరాలు కురిపించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం ఆయన కులవృత్తిపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈత, తాటి చెట్లపై పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. 5 ఎకరాల్లో రూ.5 కోట్లతో గౌడభవన్ నిర్మాణం ఏర్పాటు చేస్టున్నట్టు తెలిపారు. కల్లుగీత కార్మికుల ఫెన్షన్‌ను రూ.5 వేలకు పెంచుతున్నట్టు చెప్పారు. అదే విధంగా సొసైటీల రెన్యువల్ గడువును ఐదు నుంచి పదేళ్లకు పెంచుతున్నమన్నారు. కులవృత్తిని నమ్ముకున్న వారిలో గౌడ కులస్థులు ముఖ్యులని, గత పాలకులు గీత కార్మికులకు అన్యాయం చేశారని తెలిపారు. గడిచిన మూడేళ్లలో రూ. 6.38 కోట్ల పరిహార బకాయిలు చెల్లించినట్లు వెల్లడించారు. హరితహారంలో భాగంగా చెరువు గట్లు, వాగులు, నదీ ప్రవాహానికి ఇరువైపుల కోటి 70 లక్షల తాటి, ఈత మొక్కలు నాటినట్లు సీఎం పేర్కొన్నారు. -
కేసీఆర్ ...చావుకు భయపడేవాడిని కాదు..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ దొరలాగా పోలీసులను నమ్ముకొని బతుకుతుంటే...తాను దమ్మున్న గుండెని, ప్రజలను నమ్ముకున్నానని ఆయన అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ....‘నాకు గన్మెన్లను తీసివేసి నన్ను హత్య చేయించాలని చూస్తున్నావా?. నాకు ఏమైనా జరిగితే కేసీఆర్‌తో పాటు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. చావుకు భయపడే వ్యక్తిని కాదు. నేను చనిపోతే నా కొడుకు దగ్గరకు వెళతాను అంతే. ఇక బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకేసులో కాల్ డేటాలో 26సార్లు మాట్లాడినవారిపై ఇంతవరకూ చర్యలు తీసుకోలేదు. నాలాంటి వాళ్లను భూమి మీద లేకుండా చేయాలని చూస్తున్నారు. నీలాంటి పిరికిపందలాగా ఆస్పత్రిలో పోరాటం చేయలేదు. రోడ్డుమీద నిరాహార దీక్ష చేశాను. కోమాలోకి పోతానని తెలిసి కూడా భయపడకుండా దీక్ష చేశాను. కేసీఆర్ నియంతలాగా వ్యవహరిస్తున్నారు. అకారణంగా మా సభ్యత్వం రద్దు చేశారు. స్వామిగౌడ్‌పై దాడి చేసినందుకు మా సభ్యత్వం రద్దు చేశామని చెప్పారు. దేశంలో ఎక్కడా, ఎప్పుడు ఇలా ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయడం జరగలేదు. కానీ కోర్టులో మాత్రం ప్లేట్ ఫిరాయించారు.గతంలో హరీశ్ రావు గవర్నర్ మీద దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. దానిపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ ...అందరినీ పిలిపించి మాట్లాడి.. వారం పాటు సస్పెండ్ చేశారు. ఇప్పటి ప్రభుత్వం మాత్రం నిబంధనలు అనుసరించకుండా నా అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. హైకోర్టులో ప్రభుత్వం తరపు న్యాయవాది మాత్రం స్వామిగౌడ్‌కు మైక్ తగిలినందుకు కాదు, గవర్నర్ అడ్రస్‌ను అడ్డుకున్నందుకు ...మా సభ్యత్వం రద్దు చేశామని చెబుతున్నారు. నాకున్న నలుగురు గన్మెన్లను తీసివేశారు. పీఏని ఉపసంహరించారు. కావాలనే పాత కేసులను రీ ఓపెన్ చేయించి అరెస్ట్ వారెంట్ జారీ చేశారని తెలిసింది.’ అని మండిపడ్డారు. -
'అలాంటి అదృష్టం నాకే దక్కింది'
-
ఆ అదృష్టం నాకే దక్కింది : ఈటల
సాక్షి, హైదరాబాద్ : కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టే అదృష్టం తనకే దక్కిందని, అందుకు చాలా సంతోషంగా ఉందని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తాను నేడు ఐదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నానని చెప్పారు. గురువారం తెలంగాణ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్ ఏవిధంగా ఉండబోతుందనే విషయంపై స్వల్ప వివరణ ఇచ్చారు. అంతా ఐదో బడ్జెట్ ఎన్నికల బడ్జెట్‌గా ఉండబోతుందని, ఆకర్షణీయంగా ఉంటుందని అనుకుంటున్నారని అవన్నీ ఊహాగానాలేనని ఈటల చెప్పారు. ఎన్నికలకు ముడిపెట్టి బడ్జెట్‌ను అంత చిన్న చూపు చూడొద్దని అన్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, తెలంగాణ వెళ్లాల్సిన మార్గం దృష్టిలో పెట్టుకొనో గత బడ్జెట్లు ఉన్నాయని, ఇప్పుడు కూడా బడ్జెట్ అలాగే ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ అణగారిన వర్గాలకు నిలయం అని, వారి సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంగా ఉంటుందని అన్నారు. తమ తొలి ప్రాధాన్యత ఎప్పటికీ సంక్షేమమే ఉంటుందని స్పష్టం చేశారు. రెండో ప్రాధాన్యత వ్యవసాయానికి, నీటిపారుదల రంగానికి ఇచ్చామని, తర్వాత విద్యావైద్యరంగం దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు. ప్రపంచ పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడులకు నిలయంగా హైదరాబాద్ మారుతోందని, అందుకు అనుగుణంగా కూడా బడ్జెట్లో కేటాయింపులు ఉండబోతున్నాయని ఈటల చెప్పారు. -
తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే
-
కాంగ్రెస్ పార్టీని చీల్చిచెండాడిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మరోసారి కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీయే నంబర్ వన్ విలన్ అని అభివర్ణించారు. తెలంగాణ వినాశనానికి కాంగ్రెస్సే కారణమని, ఆ పార్టీ ఇక్కడి ప్రజల జీవితాలతో ఆడుకుందని ధ్వజమెత్తారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ సభ్యత్వాలపై వేటు నేపథ్యంలో సీఎం కేసీఆర్ బుధవారం తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడారు. అసెంబ్లీలో కఠినంగా వ్యవహరిస్తామని, తప్పు చేస్తే ఎవరినీ సహించమని ఆయన తేల్చి చెప్పారు. అనుమతి ఇచ్చిన ప్రదేశాల్లోనే ధర్నాలు, ఆందోళనలు చేయాలని ప్రతిపక్ష సభ్యులకు సూచించారు. ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు చేస్తామంటే అంగీకరించబోమన్నారు. తమ హయాంలో అప్పులు పెరిగాయని ప్రతిపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నాయని, తాము అధికారంలోకి వచ్చిననాడు రాష్ట్ర అప్పు రూ. 72వేల కోట్లు ఉండగా.. అది ఇప్పుడు రూ. 1.42 లక్షల కోట్లకు చేరిందని వివరించారు. అభివృద్ధి పనుల కోసమే అప్పు చేశామని అన్నారు. ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ అసాధ్యమని, అందుకు ఆర్బీఐ ఒప్పుకోకపోవడంతోనే నాలుగు విడతల్లో రుణమాఫీ చేపట్టామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు హైకమండ్‌ను చూస్తే వణుకు అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. హైకమాండ్ ఒత్తిడికి తలొగ్గి కాంగ్రెస్ నేతలు నాగార్జున సాగర్‌లో తెలంగాణకు అన్యాయం చేశారని, కాంగ్రెస్ నేతల తీరువల్లే సాగర్‌లో మన వాటా తగ్గిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పొరుగు రాష్ట్రాలతో గొడవలు ఉండేవని, కానీ, టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని సజావుగా ప్రాజెక్టులు చేపడుతున్నామని వివరించారు. భక్త రామదాసు ప్రాజెక్టు వల్ల లక్ష ఎకరాలకు సాగునీరు అందుతోందని తెలిపారు. 3,283 మెగావాట్ల సోలార్ విద్యుత్‌తో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 60వేలకుపైగా డబుల్ బెడ్రూ ఇళ్లను నిర్మిస్తున్నామని, ఒక్క హైదరాబాద్‌లోనే లక్ష డబుల్ బెడ్రూ ఇళ్లను కడుతున్నామని తెలిపారు. ప్రతి మండలానికి ఒక బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఈ ఏడాది నుంచే రైతులకు ఎకరాకు రూ. 8వేలు పెట్టుబడి సాయం ఇస్తామని తెలిపారు. ఇచ్చిన హామీలను వందశాతం అమలుచేస్తామని, ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తామన్నారు. -
సెమీ ఫైనల్‌కు సిద్ధం; కోమటిరెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: తన శాసనసభ సభ్యత్వాన్ని నేరుగా రద్దు చేసే అధికారం అసెంబ్లీ స్పీకర్‌కు లేదని నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ వ్యవహారంలో నిర్ణయం తీసుకోవాల్సింది గవర్నరేనని, ఒకవేళ ఆయన కూడా తమపై అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికకూ సిద్ధమేనని ప్రకటించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు, సస్పెన్షన్లను నిరసిస్తూ సంపత్‌కుమార్‌తో కలిసి గాంధీభవన్‌లో ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ దీక్ష చేస్తోన్న ఆయన బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. సెమీస్‌కు సిద్ధం : ‘కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు. సభలో ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం లేకుండా చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా మాపై వేటు వేశారు. దీనిపై గవర్నర్ విచారణ చేయాలి. ఒకవేళ అక్కడ కూడా వ్యతిరేక నిర్ణయం వస్తే ప్రజల దగ్గరికెళ్లి తేల్చుకుంటాం. ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేస్తామంటోన్న టీఆర్ఎస్.. ఉప ఎన్నికలంటూ హడావిడి చేస్తోందికదా, వాళ్లకిదే నా సవాల్.. మేం సెమీ ఫైనల్స్ కు సిద్ధంగా ఉన్నాం. 2019లో జరిగే ఫైనల్స్‌లో 100కుపైగా సీట్లు సాధిస్తాం’ అని కోమటిరెడ్డి అన్నారు. పోలీస్ రాజ్యమిది : షబ్బీర్ ఫైర్ తమ ఎమ్మెల్యేలు సంపత్, కోమటిరెడ్డిల దీక్షకు సంఘీభావం తెలిపేందుకు గాంధీభవన్‌కు వెల్లువలా వస్తోన్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారని షబ్బీర్ అలీ మండిపడ్డారు. ‘కేసీఆర్ పోలీసుల రాజ్యాన్ని నడిపిస్తున్నారు. అన్యాయంగా మమ్మల్ని సస్పెండ్ చేయడమేకాక, ఎక్కడికక్కడ కార్యకర్తల్ని అడ్డుకుంటున్నారు’ అని ఆయన మండిపడ్డారు. -
నల్లగొండ ఉపఎన్నిక.. బరిలో భూపాల్‌రెడ్డి!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు నిబంధనల ప్రకారమే జరిగిందా లేదా అనే చర్చ కొలిక్కిరాకముందే, ఈ వ్యవహారంపై ఈసీ నిర్ణయం తీసుకోకముందే అధికార పార్టీలో ఉప ఎన్నికల హడావిడి మొదలైంది. ‘సంపత్ కుమార్ ప్రాతినిధ్యవ వహిస్తున్న ఆలంపూర్ శాసనసభ స్థానం, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న నల్లగొండ స్థానాలు రెండూ ఖాళీ అయిన’ట్లు తెలంగాణ ప్రభుత్వం మంగళవారమే ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందించింది. దీంతో ఉప ఎన్నికపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ వ్యవహారంపై ఈసీ ఇంకా స్పందిచనప్పటికీ టీఆర్ఎస్లో మాత్రం టికెట్ల వ్యవహారం తారాస్థాయికి చేరింది. ఆశావాహుల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. టికెట్ ఆశిస్తున్నవారిలో ఉద్యమకారుల కంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం. 20న ప్రకటన? : నల్లగొండ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ తరఫున కంచర్ల భూపాల్‌రెడ్డి పోటీచేస్తారని కొద్ది గంటలుగా పెద్ద ఎత్తునప్రచారం సాగుతోంది. భూపాల్‌రెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(కాంగ్రెస్)పై పోటీ చేసి ఓడిపోయారు. ఆతర్వాత ఆయన గులాబీ గూటికి చేరారు. నాటి ఎన్నికల్లో భూపాల్ గణనీయంగా ఓట్లు సాధించడంతో టీఆర్ఎస్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆయనకున్న ప్రజాదరణను బట్టి పార్టీలో చేర్చుకోవడమేకాక నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గానూ బాధ్యతలు కట్టబెట్టారు టీఆర్ఎస్ పెద్దలు. ఇప్పటికే నల్లగొండలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీఆర్ఎస్ ఈ నెల 20న ప్రగతి సభను నిర్వహించాలని భావిస్తున్నది. ఆ సభలోనే భూపాల్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఆలంపూర్ నియోజకవర్గ అభ్యర్థిపై తర్జనభర్జన నడుస్తున్నట్లు సమాచారం. ఉప ఎన్నిక, అభ్యర్థుల ఎంపికలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటనలు లేవు. -
కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వం రద్దు
సాక్షి, హైదరాబాద్ : గవర్నర్ ప్రసంగం సందర్భంగా శాసనసభలో జరిగిన ఘటనలకు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్లగొండ), ఎస్ఏ సంపత్‌కుమార్ (అలంపూర్)లపై వేటు పడింది. సభా హక్కుల ఉల్లంఘన, సభ గౌరవానికి భంగం కలిగించడం వంటి చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలతో.. వారిద్దరి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మంగళవారం అసెంబ్లీ తీర్మానించింది. ప్రస్తుత అసెంబ్లీ ముగిసే వరకు వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌కు చెందిన మిగతా 11 మంది ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేసింది. మరోవైపు శాసనమండలిలోనూ ఆరుగురు కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. దురదృష్టకరమైన ఘటన.. సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నర్సింహన్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు గవర్నర్ ప్రసంగ ప్రతులను చించి విసిరేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్‌ఫోన్స్ సెట్‌ను విసిరేయగా.. అది తగిలి శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ గాయపడ్డారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న అధికారపక్షం.. నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మంగళవారం ఉదయం శాసనసభ సమావేశం కాగానే ఈ అంశాన్ని లేవనెత్తింది. స్పీకర్ మధుసూదనచారి వచ్చి సభాధ్యక్ష స్థానంలో కూర్చున్న అనంతరం దీనిపై మాట్లాడారు. ‘‘గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో దుర్మార్గమైన, దురదృష్టకమైన, అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంది. సభకు నా తీవ్ర మనస్తాపాన్ని తెలియజేస్తున్నా.. నాలుగేళ్లుగా దేశంలోనే గొప్పగా, గౌరవంగా సభను నిర్వహిస్తున్నాం. నేను తీవ్రంగా మనస్తాపం చెందాను. దాడితో దెబ్బతిన్న స్వామిగౌడ్‌ను చూసి షాక్‌కు గురయ్యాను..’’అని పేర్కొన్నారు. సభా నిబంధనల మేరకు.. తర్వాత శాసనసభ వ్యవహారాల మంత్రి టి.హరీశ్‌రావు మాట్లాడారు. ‘‘నిన్నటి అరాచక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ ఘటన ప్రజాస్వామ్యానికే మాయని మచ్చను మిగిల్చింది. మీ (స్పీకర్) తీవ్ర మనోవేదనకు, ఆవేదనకు అనుగుణంగా అసెంబ్లీ నిబంధనల (240 పేజీలోని సబ్ రూల్ 2) ప్రకారం.. కాంగ్రెస్ సభ్యులు కె.జానారెడ్డి, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జె.గీతారెడ్డి, టి.జీవన్‌రెడ్డి, జి.చిన్నారెడ్డి, డి.కె.అరుణ, టి.రామ్మోహన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, ఎన్.పద్మావతి, దొంతి మాధవరెడ్డిలను బడ్జెట్ సమావేశాల కాలానికి సస్పెండ్ చేయాలని ప్రతిపాదిస్తూ తీర్మానం ప్రవేశపెడుతున్నాను. నిన్న జరిగిన దాడి చాలా చాలా తీవ్రమైనది. చట్టసభలను అవమానపరిచేలా, రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసేలా జరిగింది. ఈ విషయంలో శాసనసభ తీవ్ర వేదనకు గురైంది. శాసనసభ నిబంధనలను ఉల్లంఘించి, సభా మర్యాదలకు భంగం కలిగించడానికి కారణమైన వారిపై పార్లమెంటరీ నిబంధనల (120 పేజీలోని 7.1 పేరా, రాజ్యాంగంలోని 194లో మూడో సెక్షన్) ప్రకారం.. కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌ల సభ్యత్వాలను ప్రస్తుత శాసనసభ కాలం ముగిసేవరకు రద్దు చేయాలని ప్రతిపాదిస్తూ తీర్మానం ప్రవేశపెడుతున్నాను..’’అని తెలిపారు. ఈ తీర్మానాలను పరిగణనలోకి తీసుకున్న స్పీకర్.. సభ ఆమోదం కోరారు. అనంతరం తీర్మానాలను ఆమోదించినట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం అప్రజాస్వామికమని కాంగ్రెస్ సభ్యులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టి.జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అప్పటికే మార్షల్స్ సభలోకి ప్రవేశించారు. అందులో మహిళా మార్షల్స్ ఎక్కువ సంఖ్యలో వచ్చారు. తొలుత వారు పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి వద్దకు వచ్చి బయటికి తీసుకెళ్లబోయారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆగారు. కొద్దిసేపటి తర్వాత కాంగ్రెస్ సభ్యులంతా బయటికి వెళ్లిపోయారు. ఆ తర్వాతే ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలోకి రావడం గమనార్హం. మండలిలో గందరగోళం.. శాసన మండలిలోనూ ఆరుగురు కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన గందరగోళానికి బాధ్యులను చేస్తూ వారిని బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. మంగళవారం శాసన మండలి ప్రారంభమైన వెంటనే.. కాంగ్రెస్ సభ్యులు విపక్ష నేత షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సంతోష్, దామోదర్‌రెడ్డి, ఆకుల లలిత, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలను సస్పెండ్ చేయాలని ప్రతిపాదిస్తూ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తీర్మానాన్ని ప్రతిపాదించారు. దానిని పరిగణనలోకి తీసుకున్న మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్.. తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండైన సభ్యులు సభను వీడి వెళ్లాలని సూచించారు. అయితే కాంగ్రెస్ సభ్యులు బయటికి వెళ్లకుండా ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సస్పెండైన సభ్యులకు సభలో మాట్లాడే అవకాశం ఉండదని, బయటకు వెళ్లిపోవాలని డిప్యూటీ చైర్మన్ స్పష్టం చేశారు. అయినా కాంగ్రెస్ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో సభలో గందరగోళం నెలకొంది. చివరికి మార్షల్స్‌ను రప్పించి.. కాంగ్రెస్ సభ్యులను బయటకు పంపారు. ఈ సమయంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.