సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలపై తలసరి అప్పు ఏటేటా పెరిగిపోతోంది. ప్రాధాన్య కార్యక్రమాలతో పాటు మూలధన వ్యయం కింద వెచ్చించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడి తీసుకొస్తున్న అప్పులు పెరిగి పోతుండటంతో తలసరి అప్పు పెరుగు తోందని బడ్జెట్ లెక్కలు చెపుతున్నాయి. 2020–21 బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్ర అప్పు రూ.2.29 లక్షల కోట్లకు చేరింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా 3,50,03,674తో భాగిస్తే ఇది రూ.65,480గా తేలింది. అంటే రాష్ట్రం లోని ప్రతి వ్యక్తిపై ఉన్న తలసరి అప్పు రూ.65,480 అన్నమాట. గతేడాది బడ్జెట్ లెక్కల ప్రకారం ఇది రూ.58,202 కాగా, ఈ ఏడాది మరో రూ.7,278 పెరిగింది. కాగా, రాష్ట్ర అప్పు జీఎస్‌డీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి)తో పోలిస్తే 20.74 శాతానికి చేరడం గమనార్హం.
రూ.1.87 లక్షల కోట్లు బహిరంగ మార్కెట్‌లోనే..
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న రుణాలను పరిశీలిస్తే బహిరంగ మార్కెట్‌లోనే ఎక్కువగా రుణాలు తీసుకుంటోంది. ఇప్పటివరకు బహిరంగ మార్కెట్‌లో రూ.1.87 లక్షల కోట్లకు పైగా రుణాలు సమీకరించగా, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.8,682 కోట్లు, స్వయం ప్రతిపత్తి గల ఇతర సంస్థల నుంచి 13,961 కోట్లు, బాండ్ల రూపంలో రూ.18,954 కోట్లు సమీకరించినట్టు బడ్జెట్ ప్రతి పాదనల్లో ప్రభుత్వం వెల్లడిం చింది. గత ఐదేళ్ల లెక్కలు పరిశీలిస్తే 2016–17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభు త్వానికి రూ.1.29 లక్షల కోట్ల అప్పుంటే 2020–21 నాటికి అది 2.29 లక్షల కోట్లకు పెరిగింది. అంటే గత ఐదేళ్లలో పెరిగిన రాష్ట్ర అప్పు అక్షరాల లక్ష కోట్ల రూపాయలన్నమాట.
తలసరి అప్పు 65,480
Published Mon, Mar 9 2020 3:31 AM | Last Updated on Mon, Mar 9 2020 5:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment