సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ నుంచి ప్రధాన ఎత్తిపోతల పథకాలన్నీ నిర్వహణలోకి వస్తున్నందున వాటి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌కు వీలుగా ప్రభుత్వం బడ్జెట్‌లో భారీగా నిధుల కేటాయింపులు చేసిం ది. తొలిసారిగా సాగునీటి శాఖకు నిర్వహణ పద్దు కింద రూ. 7,446.97 కోట్లు కేటాయించింది. ఎత్తిపోతల పథకాల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే చూడాలని, దీనికి ప్రత్యేక బడ్జెట్ ఉండాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో ఆ మేరకు ప్రగతి పద్దుకు మించి నిర్వహణకు నిధుల కేటాయింపు భారీగా జరిగినట్లు నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎత్తిపోతల పథకాలకు ఈ ఏడాది నుంచి విద్యుత్ వినియోగం పెరగనుంది. దానికనుగుణంగా విద్యుత్ చార్జీలు తడిసిమోపెడు కానున్నాయి.
ఇప్పటివరకు 1,400 మెగావాట్ల మేర విద్యుత్ అవసరాలు ఉండగా ఈ ఏడాది జూన్ నుంచి 7 వేల మెగావాట్లకు చేరే అవకాశం ఉందని లెక్కగట్టారు. వాటికి రూ. 7,000–8,000 కోట్ల వరకు బిల్లులు చెల్లించే అవకాశం ఉంటుంది. మొత్తంగా కృష్ణా, గోదావరి బేసిన్‌ల పరిధిలో 700 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రణాళిక ఉంది. ఇందులో కాళేశ్వరం ద్వారానే 360 టీఎంసీలు ఎత్తిపోయనుండగా దానికి 6 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరానికి నిర్వహణ పద్దు కింద ఏకంగా రూ. 5,219 కోట్లు కేటాయించారు. పాలమూరు–రంగారెడ్డి నిర్వహణకు రూ.18.40 కోట్లు, సీతారామ ఎత్తిపోతలకు రూ. 21.04 కోట్లు, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా పథకాలకు మరో రూ. 62.93 కోట్లను నిర్వహణ పద్దు కింద కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment