Irrigation Department
-
ఇరిగేషన్ అధికారులపై మంత్రి ఉత్తమ్ అసహనం.. సీరియస్ వార్నింగ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇరిగేషన్ శాఖ అధికారులపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గంలోనే పనులు కాకపోతే రాష్ట్రంలో పరిస్థితి ఏంటని అధికారులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడ సమస్య వస్తుందో తెలుసుకొని వెంటనే పనులను మొదలు పెట్టాలని ఉన్నతాధికారులకు ఉకుం జారీ చేశారు ఉత్తమ్.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులపై మండిపడ్డారు. ఆయన సొంత నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టకపోవడంతో ఇంజనీర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అధికారులకు ఫోన్ చేసిన ఉత్తమ్.. వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారు. అలాగే, ఎక్కడ సమస్య వస్తుందో తెలుసుకొని పనులను మొదలు పెట్టాలని ఉన్నతాధికారులకు ఉకుం జారీ చేశారు. అయితే, పనులు మొదలు కాకపోవడం గురించి ఒకరిపై ఒకరు తోసిపుచ్చుకున్నారు జిల్లా అధికారులు. దీంతో, అధికారులపై మంత్రి ఫైరయ్యారు. సూర్యాపేట సీఈతో పాటు జిల్లా ఇరిగేషన్ అధికారులను వెంటనే హైదరాబాద్ ఆఫీస్‌కు రావాలని ఈఎన్సీకి ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో తన సొంత నియోజకవర్గంలోనే పనులు జరగకపోతే రాష్ట్రంలో పరిస్థితి ఏంటని అసహనం వ్యక్తం చేశారు.మరోవైపు.. మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ పథకాల్లో వేగం పెంచడమే కాకుండా.. పంచాయతీ ఎన్నికలను అతి త్వరలో నిర్వహిస్తాం. బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజలందరికీ అన్ని పథకాలు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. రాజకీయంగా నాకు ఒక క్రెడిబిలిటీ ఉంది. వరుసగా ఏడుసార్లు గెలిచిన వ్యక్తిని నేను. కేబినెట్ విస్తరణ సీక్రెట్.. ఇప్పుడే చెప్పలేం. ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభమని అన్నారు. ఇదే సమయంలో కేటీఆర్ అరెస్ట్‌పై మంత్రి ఉత్తమ్ స్పందించకపోవడం గమనార్హం.ఇదిలా ఉండగా.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మహిపాల్ రెడ్డి సెక్రటేరియట్‌గా వరుసగా మంత్రులను కలవడం ఆసక్తికరంగా మారింది. -
ఓఅండ్ఎం ఒప్పందం చేసుకోలేదు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల బరాజ్ నిర్మాణం 2021లో పూర్తయిందని, ఆ వెంటనే బరాజ్ పర్యవేక్షణ, నిర్వహణ (ఓ అండ్ ఎం) కోసం నీటిపారుదల శాఖ తమతో ప్రత్యేక ఒప్పందం చేసుకోవాల్సి ఉండగా చేసుకోలేదని బరాజ్ నిర్మాణ సంస్థ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ డైరెక్టర్ వై.రమేశ్ చెప్పారు. బరాజ్ వద్ద తమ కంపెనీ సిబ్బందితో పాటు నీటిపారుదల శాఖ సిబ్బంది ఉన్నారని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలు ఆరోపణలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గురువారం రమేశ్‌కు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. బరాజ్ నిర్వహణ, పర్యవేక్షణలో నిర్మాణ సంస్థ బాధ్యతల గురించి ప్రశ్నించింది. నీటిపారుదల శాఖ రూపొందించిన డిజైన్లతో పోల్చితే సుందిళ్ల బరాజ్ వాస్తవ షూటింగ్ వెలాసిటీ అధికంగా ఉండడంతోనే బరాజ్ దిగువన సీసీ బ్లాకులు కొట్టుకుపోయి బుంగలు ఏర్పడ్డాయని గతంలో సమర్పించిన అఫిడవిట్లో రమేశ్ పేర్కొనడాన్ని గుర్తు చేసింది. రెండు పర్యాయాలు బరాజ్‌కు బుంగలు ఏర్పడితే ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. చివరి బిల్లు చెల్లించడం లేదుతొలిసారి బుంగలు ఏర్పడినప్పుడు గ్రౌటింగ్ ద్వారా పూడ్చివేశామని రమేశ్ బదులిచ్చారు. 2022 వరదల్లో బరాజ్‌కి తీవ్ర నష్టం జరగగా, పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి పునరుద్ధరించామన్నారు. వర్క్ కంప్లిషన్ సర్టిఫికెట్‌ను శాఖ నుంచి తీసుకున్నట్టు ధ్రువీకరించారు. సుందిళ్ల బరాజ్‌లో లోపాలను గుర్తించడానికి పలు రకాల పరీక్షలను నిర్వహించాలన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనలతో.. నీటిపారుదల శాఖ అధికారుల సంతృప్తి మేరకు ఆ పరీక్షలన్నీ పూర్తి చేశామని వివరించారు. కాగా బరాజ్ నిర్మాణానికి సంబంధించిన చివరి బిల్లును ప్రభుత్వం తమకు చెల్లించడం లేదని కమిషన్‌కు రమేశ్ ఫిర్యాదు చేశారు.అనుబంధ ఒప్పందంతో కాంట్రాక్టు పునరుద్ధరణ జరగదుసుందిళ్ల నిర్మాణం 2021 డిసెంబర్లో పూర్తికాగా, 2023లో అదనపు పనులు చేసేందుకు నీటిపారుదల శాఖతో అనుబంధ ఒప్పందం చేసుకున్నామని నవయుగ ప్రాజెక్టు ఇన్చార్జి కె.ఈశ్వర్రావు తెలిపారు. అనుబంధ ఒప్పందంతో పాత కాంట్రాక్టు పునరుద్ధరణ జరగదని స్పష్టం చేశారు. సుందిళ్ల బరాజ్ దిగువన కొట్టుకుపోయిన సీసీ బ్లాకుల పునరుద్ధరణ పనులు పూర్తి చేశామని చెప్పారు. నవయుగ కంపెనీ మరో ప్రాజెక్టు ఇన్చార్జి చింతా మాధవ్ సైతం విచారణకు హాజరు కాగా, ఆయనకు కేవలం మెటీరియల్ కొనుగోళ్లతో మాత్రమే సంబంధం ఉండడంతో కమిషన్ ఆయన్ను ప్రశ్నించలేదు.కాపీ పేస్ట్‌లా అఫిడవిట్లునవయువ కంపెనీ డైరెక్టర్‌తో పాటు ఇద్దరు ప్రాజెక్టు ఇన్చార్జిలు దాఖలు చేసిన అఫిడవిట్లు కాపీ.. పేస్ట్ తరహాలో ఉన్నాయని కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. డైరెక్టర్ అఫిడవిట్‌కు కార్బన్ కాపీలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. -
Krishna River Water: మళ్లీ త్రిసభ్య కమిటీకే..
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల తాత్కాలిక సర్దుబాటు బాధ్యతను మళ్లీ త్రిసభ్య కమిటీకే అప్పగిస్తూ కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నిర్ణయం తీసుకుంది. దీనికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి. మంగళవారం హైదరాబాద్‌లోని జలసౌధలో బోర్డు చైర్మన్ అతుల్‌జైన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ తరఫున నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ఈఎన్సీ జి.అనిల్‌కుమార్, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఎస్ఈ విజయ్‌కుమార్, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, బోర్డుసభ్యకార్యదర్శి డీఎం రాయ్‌పురే పాల్గొన్నారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల వాటా ఉండగా, 66:34 నిష్పత్తిలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను తాత్కాలిక సర్దుబాటు పేరుతో 2015 జూన్‌లో కేంద్ర జలశక్తి శాఖ జరిపిన కేటాయింపులను ఇకపై కొనసాగించడానికి అంగీకరించమని రాహుల్ బొజ్జా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే త్రిసభ్య కమిటీ ఈసారి తెలంగాణకు కొంత వరకు కేటాయింపులు పెంచుతుందని బోర్డు చైర్మన్ హామీ ఇచ్చారని రాహుల్»ొజ్జా తెలిపారు. సమావేశానంతరం ఈఎన్సీ జి.అనిల్‌కుమార్‌తో కలిసి ఆయన మీడియాకు ఆ వివరాలు వెల్లడించారు. కృష్ణానది 71శాతం తెలంగాణలో విస్తరించి ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి 71శాతం, ఏపీకి 29 శాతం జలాలను కేటాయించాలని తాము కృష్ణా ట్రిబ్యునల్–2లో వాదనలు వినిపించిన అంశాన్ని బోర్డుకు వివరించామన్నారు. ట్రిబ్యునల్ నిర్ణయం వచ్చే వరకు 50:50 నిష్పత్తిలో తాత్కాలిక పంపిణీ జరపాలని డిమాండ్ చేశామని చెప్పారు. ఏపీ కొత్తగా ప్రతిపాదించిన గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు వివరాలను అందించాలని కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలకు కోరామన్నారు. ప్రతి చుక్కను లెక్కించాల్సిందే.. పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను ఇతర బేసిన్లకు తరలించడాన్ని అడ్డుకోవాలని బోర్డును కోరామని రాహుల్‌బొజ్జా తెలిపారు. చెన్నైకి తాగునీరు మాత్రమే సరఫరా చేయాలని, సాగునీటి అవసరాలకు తరలించడం అక్రమమని వాదించామన్నారు. ఏటా 200 టీఎంసీలకు పైగా కృష్ణా జలాలను ఏపీ బేసిన్ వెలపలి ప్రాంతాలకు తరలిస్తోందని అభ్యంతరం తెలిపారు. పోతిరెడ్డిపాడు, బనకచర్లతోపాటు ఏపీలోని మొత్తం 11 అవుట్ లెట్ల ద్వారా తరలిస్తున్న ప్రతీ చుక్కను పక్కాగా లెక్కించడానికి 11 టెలీమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని కోరామని రాహుల్ బొజ్జా తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి వంటి అనుమతి లేని ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేయగా, ప్రస్తుతం వీటికి నీటి కేటాయింపులు ట్రిబ్యునల్ పరిధిలో ఉందని బదులిచ్చామన్నారు. కృష్ణా ట్రిబ్యునల్–1 ప్రాజెక్టుల వారీగా కాకుండా గంపగుత్తగా నీళ్లు కేటాయించిందని, దీంతో తెలంగాణలోని ప్రాజెక్టులకు అవసరమైన నీళ్లను కేటాయించుకునే హక్కు తమకు ఉంటుందన్నారు. సాగర్‌పై సీఆర్పీఎఫ్ బలగాల ఉపసంహరణ నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలను ఉపసంహరించాలని తాము కోరగా, ఏపీ సైతం అంగీకరించిందని రాహుల్‌బొజ్జా తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పరిశీలించాక 2 నెలల తర్వాత ఉపసంహరిస్తామని బోర్డు చైర్మన్ హామీ ఇచ్చారన్నారు. కృష్ణా జలాల్లో వాటాలు తేలే వరకు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోని తమ కాంపోనెంట్లతోపాటు హైడల్ పవర్ ప్రాజెక్టులను ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. ప్రమాదంలో శ్రీశైలం జలాశయం : తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్ శ్రీశైలం జలాశయ ప్లంజ్‌పూల్ (నీళ్లు స్పిల్‌వే గేట్ల నుంచి దూకి కిందకు పడే ప్రాంతం) వద్ద 300–400 మీటర్ల లోతు వరకు భారీ గుంతలు ఏర్పడ్డాయని తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే మరమ్మతులు చేయాలని ఏపీని కోరామన్నారు. టెలీమెట్రీల ఏర్పాటుకు రూ.6 కోట్లను భరిస్తామని తెలియజేశామన్నారు. ఈ ఏడాది 780 టీఎంసీల కృష్ణా జలాల లభ్యత ఉండగా, ఇప్పటికే ఏపీ 500 టీఎంసీలు(76శాతం) వాడుకోగా, తెలంగాణ కేవలం 180 టీఎంసీలు మాత్రమే వాడిందన్నారు. ఏపీ అధిక వినియోగానికి తగ్గట్టూ తెలంగాణకు వాటాలు పెంచాలని కోరామని చెప్పారు. బచావత్ కేటాయింపులకు రక్షణ కల్పించాలి : ఏపీ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వర్లు బచావత్ ట్రిబ్యునల్ (కృష్ణా ట్రిబ్యునల్–1) కేటాయింపుల ఆధారంగా ఏపీకి 66 శాతం, తెలంగాణకి 34 శాతం కృష్ణా జలాలను పంపిణీ చేయాలని కోరామని ఏపీ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. కృష్ణా ట్రిబ్యునల్–2లో వాటాలు తేలే వరకు ఈ మేరకు కేటాయింపులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ట్రిబ్యునల్ నిర్ణయం వచ్చేవరకు త్రిసభ్య కమిటీ పరస్పర అంగీకారంతో నీళ్లను పంచుకుంటామన్నారు. టెలీమెట్రీల ఏర్పాటుపై తమ ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శ్రీశైలం జలాశయ ప్లంజ్‌పూల్‌కు మరమ్మతుల కోసం సీఎస్ఎంఆర్ఎస్ఈతో అధ్యయనం చేయిస్తున్నామని, కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) అధికారులతో చర్చించి మరమ్మతులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించాలని డిమాండ్ చేశారు. -
Telangana: సెక్షన్–3 ప్రకారమే.. కృష్ణా జలాల పునఃపంపిణీ!
సాక్షి, హైదరాబాద్: అందుబాటులో ఉన్న కృష్ణా జలాలు మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య పునఃపంపిణీకి మార్గం ఏర్పడింది. అలాగే తెలంగాణ కోరుతున్న విధంగా ఇప్పటికే వాడకంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదనల దశలో ఉన్న ప్రాజెక్టులకు సైతం నీటి కేటాయింపులను కృష్ణా ట్రిబ్యునల్ పరిశీలించేందుకు అవకా శం చిక్కింది. తొలుత అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం (ఐఎస్‌డబ్ల్యూడీఏ) 1956లోని సెక్షన్–3 కింద.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి 2023 అక్టోబర్ 6న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అదనపు రెఫరెన్స్ ప్రకారమే విచారణ నిర్వహించాలని జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాతే ఏపీ కోరిన విధంగా రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 కింద విచారణ నిర్వహిస్తామని తెలిపింది. తెలంగాణ దాఖలు చేసిన ఇంటర్‌లొక్యూటరీ అప్లికేషన్ (ఐఏ)పై గురువారం ఢిల్లీలో విచారణ నిర్వహించిన ట్రిబ్యునల్ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ట్రిబ్యునల్ విచా రణకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ట్రిబ్యు నల్ నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సమాంతర విచారణ జరపలేం ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్– 89 కింద రెండు రాష్ట్రాల సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ ముగియడంతో ట్రిబ్యునల్‌లో ఇకవిచారణను ప్రారంభించాల్సి ఉండగా, ఐఎస్‌డబ్ల్యూడీఏ చట్టంలోని సెక్షన్–3 కింద కేంద్రం అదనపు రెఫరెన్స్ జారీ చేసింది. దీంతో పాటు సెక్షన్–89 కింద కేంద్రం చేసిన రిఫరెన్స్ కూడా విచారణకు సిద్ధంగా ఉండగా, రెండింటినీ కలిపి విచారణ జరపాలని కోరుతూ తెలంగాణ ఐఏ దాఖలు చేసింది. దీనిపై ఏపీ అభ్యంతరం తెలిపింది. మరోవైపు సెక్షన్–3 కింద కేంద్రం జారీ చేసిన అదనపు రెఫరెన్స్‌ను సవాలు చేస్తూ ఏపీ సుప్రీం కోర్టులో వేసిన రిట్ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. అదనపు రెఫరెన్స్‌పై స్టే విధించాలని ఏపీ కోరగా, తమ తుది తీర్పునకు లోబడి ట్రిబ్యునల్ విచారణలో పాల్గొనవచ్చని ఆ రాష్ట్రానికి సుప్రీంకోర్టు సూచించింది. కాగా కేంద్రం జారీ చేసిన రెండు రెఫరెన్స్‌ల్లో కొన్ని అంశాలు ఒకేలా ఉండగా, మరికొన్ని అంశాలు లేవు. రెండు రిఫరెన్స్‌లను కలిపి విచారించి తాము ఒకే తీర్పు జారీ చేస్తే భవిష్యత్తులో సుప్రీంకోర్టులో ఏపీకి అనుకూలంగా తుది తీర్పు వస్తే ఇబ్బందులొస్తాయని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తాజాగా అభిప్రాయపడింది. అదే జరిగితే తమ తీర్పులోని నిర్ణయాలు, నిర్థారణకు వచ్చిన అంశాలను రెండు రెఫరెన్స్‌ల వారీగా విభజించడం ఇబ్బందికరంగా మారుతుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే రెండు రెఫరెన్స్‌లను కలిపి విచారించడం కంటే వేర్వేరుగా విచారించడమే మేలని తేల్చి చెప్పింది. తొలుత రెండో రిఫరెన్స్‌పై విచారణే సమంజసం అయితే తొలుత ఏ రెఫరెన్స్‌పై విచారణ జరపాలన్న ప్రశ్న తలెత్తింది. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి జారీ చేసిన రెండో రెఫరెన్స్‌పై తొలుత విచారణ నిర్వహించడమే సమంజసమని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. ‘ప్రాజెక్టుల వారీ’గా నీటి కేటాయింపులు జరపాలంటూ మొదటి రెఫరెన్స్‌లో ఉన్న అంశంతో పాటు మరికొన్ని ఇతర అంశాలతో రెండో రెఫరెన్స్‌కు సంబంధం ఉండడమే దీనికి కారణమని స్పష్టం చేసింది. అయితే మొదటి రెఫరెన్స్ కింద నిర్వహించిన సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్‌ను రెండో రెఫరెన్స్‌పై విచారణ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవడానికి ట్రిబ్యునల్ అంగీకరించింది. అయితే, రెండో రెఫరెన్స్ కింద నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్‌ను మొదటి రెఫరెన్స్ కింద పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది. ఇక ఆయా డాక్యుమెంట్లను పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అనే అంశంపై విచారణ సమయంలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. రెండు రెఫరెన్స్‌ల కింద ఏపీ, తెలంగాణ దాఖలు చేసిన అభ్యర్థనలు, సాక్ష్యాలు, డాక్యుమెంట్లను రెండు రెఫరెన్స్‌లకు ఉమ్మడి రికార్డులుగా పరిగణించాలని తెలంగాణ తన ఐఏలో కోరడంతో ట్రిబ్యునల్ ఈ మిశ్రమ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 19 నుంచి 21 మధ్య నిర్వహిస్తామని తెలిపింది. సెక్షన్– 89 ఏమిటి? ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్–89లోని క్లాజు(ఏ) కింద బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ గడువును కేంద్రం పొడిగించింది. గతంలో రాష్ట్రాల్లోని ‘ప్రాజెక్టుల వారీ’గా నిర్దిష్ట కేటాయింపులు జరిగి ఉండకపోతే ఇప్పుడు జరపాలని ఇందులో (తొలి రెఫరెన్స్) ట్రిబ్యునల్‌ను కోరింది. నీటి లభ్యత లేని సమయాల్లో ప్రాజెక్టుల వారీగా నీటి విడుదల విషయంలో అమలు చేయాల్సిన అపరేషన్స్ ప్రోటోకాల్స్‌ను సిద్ధం చేయాలని క్లాజు(బీ) కింద సూచించింది. ‘ప్రాజెక్టుల వారీ’గా అని సెక్షన్ 89 ఉండగా, అందులో ఏ ప్రాజెక్టు లొస్తాయన్న అంశంపై స్పష్టత కొరవడింది. సెక్షన్ –3 ఏమిటి ? తెలంగాణ విజ్ఞప్తి మేరకు ఐఎస్‌డబ్ల్యూడీఏ–1956లోని సెక్షన్–3 కింద జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్‌కు అదనపు రెఫరెన్స్ (మరిన్ని విధివిధానాలను) జారీ చేస్తూ 2023 అక్టోబర్ 6న కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్మాణం పూర్తైన ప్రాజెక్టులతో పాటు నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదన దశలోని ప్రాజెక్టులకు సైతం ప్రాజెక్టుల వారీగా కృష్ణా జలాలను పంపిణీ చేయాలని ఇందులో కేంద్రం ఆదేశించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్–89లోని క్లాజులు 89(ఏ), 89(బీ)లోని ‘ప్రాజెక్టుల వారీగా’ అనే పదానికి ఈ మేరకు విస్తృత అర్థాన్నిస్తూ గజిట్ నోటిఫికేషన్లో నిబంధన చేర్చింది. ఉమ్మడి ఏపీకి 75 శాతం నీటి లభ్యత ఆధారంగా కృష్ణా ట్రిబ్యునల్–1 గంపగుత్తగా 811 టీఎంసీలను కేటాయించగా, 65 శాతం లభ్యతతో 1005 టీఎంసీలను కృష్ణా ట్రిబ్యునల్–2 కేటాయించింది. ట్రిబ్యునల్ కేటాయించిన నీళ్లతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో నాగార్జునసాగర్ ఎగువన లభ్యతలోకి వచ్చిన కృష్ణా జలాలను కలిపి రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని అదనపు రిఫరెన్స్‌లో కేంద్రం ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలిస్తే, దానికి ప్రతిగా నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకోవడానికి గతంలో బచావత్ ట్రిబ్యునల్ వెసులుబాటు కల్పించింది. ఈ 80 టీఎంసీల్లో ఏ రాష్ట్రం వాడుకోని 45 టీఎంసీలను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాల్సి ఉంది. ఈ 45 టీఎంసీలకు 1005 టీంఎసీలను కలిపి మొత్తం 1050 టీఎంసీలను సెక్షన్–3 కింద కృష్ణా ట్రిబ్యునల్–2 రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంది. తాజాగా సెక్షన్–3 కిందే తొలుత విచారణ జరపాలని ట్రిబ్యునల్ భావించడంతో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వచ్చినట్టైంది. తెలంగాణలో ప్రతిపాదన/నిర్మాణం దశలోని పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎస్ఎల్బీసీ, నారాయణపేట–కొడంగల్ వంటి ప్రాజెక్టులకు సైతం నీళ్లు కేటాయించే అంశాన్ని ట్రిబ్యునల్ పరిశీలించడానికి వీలు కలిగింది. -
సాగర్‌కు ‘బొల్లపల్లి’ గండి!
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి వరద జలాలను కుడికాల్వ ద్వారా తరలించి గుంటూరు జిల్లాలో నిర్మించబోయే బొల్లపల్లి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తామని తాజాగా ఏపీ ప్రతిపాదించింది. ఇందుకోసం కుడికాల్వ(జవహర్ కాల్వ)ను 96.5 కి.మీ.ల వరకు వెడల్పు పెంచి అక్కడి నుంచి వరద జలాలను లిఫ్ట్ చేస్తామని ఏపీ చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తక్షణమే తమ వ్యతిరేకతను తెలపడంతోపాటు ఈ ప్రాజెక్టు చేపట్టే ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, గోదావరి, కృష్ణా బోర్డులకు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి లేఖలు రాయనున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని గోదావరి బోర్డుకు ఇప్పటికే ప్రభుత్వం లేఖ రాసింది. కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్ ద్వారా తరలింపు నాగార్జునసాగర్ కుడికాల్వ కింద ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11.18 లక్షల ఎకరాలు, ఎడమ కాల్వ కింద ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 10.39 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్‌కు 9 స్లూయిస్ గేట్లు ఉండగా, గేట్లన్నింటినీ 520 అడుగుల మేర పైకి లేపితే గరిష్టంగా 33,147 క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకోవచ్చు. ప్రస్తుతం కుడి కాల్వ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు మాత్రమే ఉంది. హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యం పెంచకుండానే కుడికాల్వ సామర్థ్యాన్ని 33 వేల క్యూసెక్కులకు పెంచుకున్నా, 11 వేల క్యూసెక్కులను యథాతథంగా ఆయకట్టుకు సరఫరా చేసి మిగిలిన 22 వేల క్యూసెక్కులను బొల్లపల్లి రిజర్వాయర్‌కు తరలించవచ్చని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. 2019 నుంచి 2024 వరకు గడిచిన ఆరేళ్లలో ఏకంగా ఐదేళ్లు కృష్ణానదిలో మిగులు జలాల లభ్యత ఉందని, ప్రకాశం బరాజ్ నుంచి సముద్రంలోకి నీరు వృథాగా పోయిందని కేంద్రానికి తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నుంచి బొల్లపల్లి రిజర్వాయర్‌కు నీటి తరలింపుతో పోల్చితే నాగార్జునసాగర్ నుంచి తరలిస్తేనే తక్కువ వ్యయం అవుతుందని స్పష్టం చేసింది. నీటి లభ్యత బాగా ఉన్న సమయాల్లో సాగర్ నుంచి (తమ వాటా) జలాలను తరలించి బొల్లపల్లి రిజర్వాయర్‌లో నిల్వ చేసుకుంటే వర్షాభావ సీజన్లలో క్యారీ ఓవర్ జలాలుగా వాడుకోగలమని తెలిపింది. కృష్ణా, గోదావరి పరీవాహకంలో చిట్టచివరి రాష్ట్రం కావడంతో తమకు రెండింటి మిగులు జలాలను వాడుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. రెండు నదుల మిగులు జలాలను నిల్వ చేసే సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు ఉంటుందని తెలియజేసింది. నికర జలాల తరలింపునకే ! వరదల సమయంలో నాగార్జునసాగర్ నుంచి మిగులు జలాలను బొల్లపల్లి రిజర్వాయర్‌కు తరలించడానికి మాత్రమే ఈ ప్రాజెక్టును ప్రతిపాదించినట్టు ఏపీ పేర్కొంటున్నా, నికర జలాలను సైతం తరలించుకుంటుందని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భవిష్యత్‌లో సాగర్ కుడికాల్వ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తోంది. నాగార్జునసాగర్ నిర్వహణ తెలంగాణ పరిధిలో ఉండగా, ఏడాది కింద ఏపీ సగం ప్రాజెక్టును తన అధీనంలోకి తీసుకోవడంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది. గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా సాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వాడుకుంటామని కేంద్రం ప్రతిపాదించగా, తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. మళ్లీ తాజాగా సాగర్‌ను బొల్లపల్లి రిజర్వాయర్‌తో అనుసంధానం చేయాలని ఏపీ ప్రతిపాదించడంతో భవిష్యత్‌లో సాగర్ కింద ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని 8.1 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రమాదంలో పడుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కృష్ణా, గోదావరి నుంచి ఏకకాలంలో తరలింపు గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును మూడు విభాగాల్లో (సెగ్మెంట్స్) వి భజించి ఏపీ ప్రతిపాదించింది. తొలి విభా గం కింద పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాల్వ సామర్థ్యాన్ని 17,500 నుంచి 38,000 క్యూసెక్కులకు, తాడిçపూడి ఎత్తిపోతల పథకం కాల్వ సామర్థ్యాన్ని 1,400 నుంచి 10,000 క్యూసెక్కులకు పెంచనుంది. అనంతరం పోలవరం ప్రాజెక్టు నుంచి ఈ రెండు కాల్వల ద్వారా నీటిని సమాంతరంగా తరలించి బుడమేరు డైవర్షన్ కెనాల్లోకి వేసి అక్కడి నుంచి కృష్ణా నదిలోకి విడుదల చేస్తామని ఏపీ తెలిపింది.రెండో సెగ్మెంట్ కింద కృష్ణాన ది నుంచి 28,000 క్యూసెక్కులను ఆరు దశల్లో మొత్తం 127 మీటర్లు లిప్ట్ చేసి బొల్లపల్లి రిజర్వాయర్‌కు తరలించనుంది. ఇందుకోసం 150 టీఎంసీల భారీ సామర్థ్యంతో బొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని ఏపీ ప్రతిపాదించింది. భవిష్యత్ అవసరాల ను తీర్చడానికి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 400 టీఎంసీలకు పెంచే వీలుందని తెలిపింది. ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా నా గార్జునసాగర్ కుడికాల్వ నుంచి బొల్లపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తామని మరో లింక్‌ను ప్రతిపాదించింది. ఇక మూడో సెగ్మెంట్ కింద బొల్లపల్లి రిజర్వాయర్ నుంచి 3 దశల్లో లిఫ్ట్ చేసి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలిస్తామని పేర్కొంది.ప్రాజెక్టు వ్యయం రూ.80 వేల కోట్లురోజుకు 2 టీఎంసీల చొప్పున 100 రోజుల్లో 200 టీఎంసీలను తరలించడానికి ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 40,500 ఎకరాల భూసేకరణ, 17,000 ఎకరాల అటవీ భూములు కావాలి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80,112 కోట్లు కాగా, లిఫ్టుల నిర్వహణకు 4,125 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. -
సాగర్ ఆయకట్టు పెంచుతాం
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ డ్యామ్ స్పిల్‌వేకి పడిన గుంతలను పూడ్చివేసి ప్రాజెక్టును పటిష్టపరిచి.. దాని కింద ఆయకట్టు పెంపుదలకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. డ్యామ్ మరమ్మతులపై ఐఐటీ రూర్కీ నిపుణులతో అధ్యయనం జరిపించాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. సాగర్ కెనాల్ నెట్‌వర్క్‌కు సైతం మరమ్మతులు నిర్వహించాలని సూచించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలోని ప్రాజెక్టుల పనుల పురోగతిపై మంగళవారం ఆయన జలసౌధలో కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. చిన్న లిఫ్టులతోనే అధిక ప్రయోజనం రాష్ట్రంలో ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ) పరిధిలోని 334 చిన్న ఎత్తిపోతల పథకాలు కింద 4,69,138 ఎకరాల ఆయకట్టు ఉండగా.. కొన్ని లిఫ్టులు పూర్తిగా, మరి కొన్ని పాక్షికంగా పనిచేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ తెలిపా రు. పూర్తి సామర్థ్యంతో సాగునీటి సరఫరా చేసేలా ఈ లిఫ్టులను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. చిన్న ఎత్తిపోతల పథకాలే రైతులకు ప్రయోజనం చేకూర్చుతాయని, వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నెల్లికల్లు ఎత్తిపోతల పథకం తొలి దశ పనులను సత్వరం పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ నాటికి ఆయకట్టుకు నీళ్లు అందించాలని ఆదేశించారు. రూ.664.8 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే 24,624 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లభిస్తుందని తెలిపారు. ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు తొలి దశ పనులు పూర్తి చేసి 7,600 ఎకరాలకు నీరందించాలని ఆదేశించారు. లోలెవల్ కాల్వకు మహర్దశ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగమైన హైలెవల్, లోలెవల్ కాల్వల మధ్య 15 కి.మీల లింక్ కాల్వ నిర్మాణం విషయంలో ముందుకు వెళ్లాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయించారు. మేడవార్మ్, పోతునూరు, సంగారం, పెద్దవూర, తుంగతుర్తి చెరువులను అనుసంధానం చేస్తూ లింక్ కాల్వను నిర్మిస్తామని చెప్పారు. రూ.62.26 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న లింక్ కాల్వ నిర్మాణానికి 65.02 ఎకరాల భూసేకరణ జరపాల్సి ఉండగా, ఇప్పటికే 43.31 ఎకరాల సేకరణ పూర్తయ్యిందని, తక్షణమే టెండర్లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రూ.125 కోట్ల అంచనా వ్యయంతో 0–63 కి.మీల లోలెవల్ కాల్వ లైనింగ్ పనులను చేపడుతామని తెలిపారు. అదనంగా లోలెవల్ కాల్వకు సంబంధించిన డీ–1 నుంచి డీ–27 వరకు డిస్ట్రిబ్యూటరీలకు 60 మి.మీల మందంతో కాంక్రీట్ లైనింగ్ వేసి కాల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. 90.43 కి.మీల పొడవైన ఈ డిస్ట్రిబ్యూటరీల లైనింగ్‌కు రూ.42.26 కోట్లతో అంచనాలు సిద్ధం చేశామని వెల్లడించారు. ఫ్లడ్ ఫ్లో కాల్వగా పేరొందిన లోలెవల్ కెనాల్ 80 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తోందని చెప్పారు. నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నల్లగొండ నియోజకవర్గాల్లోనే 50 వేల ఎకరాలకు నీరందిస్తోందని తెలిపారు. 19 చిన్న ఎత్తిపోతల పథకాల ద్వారా మరో 30 వేల ఎకరాలను స్థిరీకరిస్తుందని వివరించారు. అనుమలవారిగూడెం వద్ద శశిలేరు వాగుపై చెక్ డ్యామ్ నిర్మాణానికి మంత్రి అనుమతిచ్చారు. సాగర్ పరిధిలోని 39 ఐడీసీ లిఫ్టులకు మరమ్మతులు చేసి పునరుద్ధరించాలని ఆదేశించారు. సమీక్షలో నల్లగొండ ఎంపీ కె.రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జయవీర్ రెడ్డి, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు. -
పోలవరం ముంపుపై అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల గరిష్ట నీటిమట్టం (ఎఫ్ఆర్ఎల్) మేరకు నీళ్లను నిల్వ చేస్తే తెలంగాణ భూభాగంలో ఏర్పడనున్న ముంపు ప్రభావంపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందంతో సర్వే చేయించి నెల రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పోలవరం ముంపు అంశంపై శనివారం సీఎం రేవంత్ సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సమీక్షించారు. గోదావరికి 2022లో 27 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు భద్రాచలం ముంపునకు గురైందని అధికారులు సీఎంకు వివరించారు. పోలవరం వల్ల భద్రాచలం ఆలయానికి ఏర్పడే ముప్పుపైనా అధ్యయనం నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం కేంద్ర అనుమతుల్లేకుండానే కొత్తగా గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును చేపట్టిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ సీఎస్‌కు అభ్యంతరం తెలపాని సీఎం రేవంత్ ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే గోదావరి బోర్డుతోపాటు కేంద్ర జలశక్తి శాఖకు సైతం లేఖలు రాయాలని కోరారు. సమావేశంలో నీటిపారుదల శాఖ సలహాదారులు ఆదిత్యనాథ్‌దాస్, కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ(జనరల్) జి.అనీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. పరిమితంగానే ఉమ్మడి సర్వే అంటున్న ఏపీ పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణలో 950 ఎకరాలు ముంపునకు గురవుతాయని, దీనిపై సైతం జాయింట్ సర్వే చేయాల్సిందేనని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. కిన్నెరసాని, ముర్రెడువాగులతో పాటే మరో ఐదు వాగులకు ఉండనున్న ప్రభావంపై సైతం సర్వే నిర్వహించాలని కోరుతుండగా ఏపీ అంగీకరించడం లేదు. ఎన్జీటీ ఆదేశాల మేరకు ముర్రెడువాగు, కిన్నెరసానిలకే సర్వేను పరిమితం చేస్తామని ఏపీ అంటోంది. ఏపీ వాదనను తెలంగాణ అంగీకరించి కేవలం రెండు వాగులకే జాయింట్ సర్వే నిర్వహిస్తే మిగిలిన 5 వాగులకు ఉండనున్న ముంపుతో తెలంగాణ నష్టపోవాల్సి వస్తుందని విమర్శలు వచ్చాయి. సీఎం రేవంత్ శనివారం అధికారులతో సమీక్షలో ఈ అంశంపై వివరణ కోరినట్లు తెలిసింది. ప్రస్తుతం రెండు వాగులకు ముంపుపై సర్వే నిర్వహించాలని, మిగిలిన వాగులకు ముంపుపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జల సంఘం గతేడాది సాంకేతిక కమిటీ సమావేశంలో ఇరు రాష్ట్రాలను చెప్పిందని అధికారులు సీఎంకు వివరించినట్లు తెలిసింది. 18 తర్వాత ఉమ్మడి సర్వేకు సిద్ధం పోలవరంలో గరిష్ట నీటిమట్టం దాకా నీటిని నిల్వ చేస్తే కిన్నెరసాని, ముర్రేడువాగులు ఉప్పొంగి తెలంగాణ భూభాగంలో ముంపునకు గురికానున్న ప్రాంతాలను గుర్తించి డీమార్కింగ్ చేసేందుకు వీలుగా ఈ నెల 18 తర్వాత ఉమ్మడి సర్వేకు ఏపీ ప్రభుత్వం సంసిద్ధత తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖకు లేఖ రాసింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు ఇప్పటికే ఉమ్మడి సర్వే నిర్వహించగా తదుపరి క్షేత్రస్థాయిలో ముంపు ప్రాంతాన్ని గుర్తిస్తూ డీమార్కింగ్ చేయాల్సి ఉంది. -
పోలవరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో తెలంగాణపై పడే ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ టీంతో నివేదిక తయారు చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. శనివారం.. సీఎంతో నీటిపారుదల శాఖ అధికారులు భేటీ కాగా, నెల రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేయాలని తెలిపారు. పోలవరం నిర్మాణంతో భద్రాచలం ఆలయానికి ఏర్పడే ముప్పుపై సమగ్ర అధ్యయనం చేయాలంటూ సీఎం రేవంత్ ఆదేశించారు.2022లో 27 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినప్పుడు భద్రాచలం ముంపునకు గురైనట్లు సీఎంకి అధికారులు వివరించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్‌ను సీఎం రేవంత్ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ఆ ప్రాజెక్టుకు అనుమతులు లేవని తెలిపారు.వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్‌పైన ఇటీవల ఏపీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని అధికారులు వివరణ ఇచ్చారు. తమ అభ్యంతరాలను ఏపీ సీఎస్‌కు తెలియజేయాలన్న రేవంత్.. అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుతో పాటు కేంద్ర జల్‌శక్తి శాఖకు లేఖలు రాయాలంటూ ఆదేశించారు.ఇదీ చదవండి: చిట్టినాయుడు కేసులకు భయపడం: కేటీఆర్ -
నీటి శాఖ ఇక పటిష్టం!
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖను పటిష్టపరచడంతో పాటు ఇంజనీర్ల పనితీరు, సామర్థ్యం పెంపుదలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఓ వైపు ఇంజనీర్ల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూనే మరోవైపు బాధ్యతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పలు కీలక చర్యలకు శ్రీకారం చుట్టబోతోంది. ముఖ్యంగా గత పదేళ్లుగా తాత్కాలిక (అడ్‌హక్) పదోన్నతులే కల్పిస్తుండగా, ఇకపై ఈ విధానానికి శాశ్వతంగా ఫుల్స్టాప్ పెట్టనుంది. వచ్చే 10–15 రోజుల్లోగా అర్హులైన ఇంజనీర్లందరికీ సాధారణ పదోన్నతులు ఇవ్వడంతో పాటు బదిలీల ప్రక్రియ చేపట్టనుంది.తమ తుది తీర్పునకు లోబడి పదోన్నతులు కల్పించుకోవాలని ఇటీవల రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పదోన్నతులు, బదిలీలపై కసరత్తు ప్రారంభించింది. కమిటీ సిఫారసుల మేరకు.. ఏఈ నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు అందరికీ ప్రమోషన్లు కల్పించబోతోంది. పదోన్నతుల విషయంలో జోన్–5, జోన్–6 ఇంజనీర్లతో పాటు అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏఈ), అదనపు అసిస్టెంట్ ఇంజనీర్ల మధ్య సుదీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది. ఒక జోన్ వారికే పదోన్నతుల్లో ప్రాధాన్యత కల్పించడంతో తమకు అన్యాయం జరిగిందని మరో జోన్ ఇంజనీర్లు కోర్టును ఆశ్రయించారు. ఉద్యోగంలో చేరాక డిప్లమా చేసిన వారికి ఏఈలుగా పదోన్నతి కల్పిస్తుండడంతో ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో నియమితులైన ఏఈఈలు తమ పోస్టులను కోల్పోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదాల నేపథ్యంలో పదోన్నతులపై అధ్యయనం కోసం నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్, ఈఎన్సీ (ఓ అండ్ ఎం) విజయభాస్కర్ రెడ్డితో ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇవ్వనున్న సిఫారసుల ఆధారంగా ఈ నెలాఖరులోగా మెరిట్ కమ్ సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు, బదిలీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్న ఈఎన్సీ (జనరల్), ఈఎన్సీ (రామగుండం), ఈఎన్సీ (ఓ అండ్ ఎం) పోస్టులతో పాటు 9 సీఈ, 27 ఎస్ఈ, 26 ఈఈ పోస్టులను పదోన్నతులు, బదిలీల ద్వారా ప్రభుత్వం భర్తీ చేయనుంది. సీఈలు క్షేత్ర స్థాయిలోనే ఉండాలి నీటిపారుదల శాఖలో టెరిటోరియల్ చీఫ్ ఇంజనీర్లుగా కీలక పోస్టుల్లో ఉన్న కొందరు అధికారులు తమ పని ప్రదేశంలో ఉండకుండా హైదరాబాద్‌లో ఉంటున్నారని ప్రభుత్వ దృష్టికి వచ్చిoది. ఇంకొందరు సీఈలకు హైదరాబాద్‌లోని జలసౌధలో ప్రత్యేక క్యాంపు కార్యాలయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఈలందరూ ఇకపై క్షేత్ర స్థాయిలోనే తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండకపోవడం, విధుల్లో నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే మిర్యాలగూడ ఈఈని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇదే క్రమంలో ఇటీవల నియమితులైన కొత్త ఏఈఈలు కొంత కాలం పాటు క్షేత్ర స్థాయిలో పనిచేయాల్సిందేనని, బదిలీల్లో వీరికి స్థానచలనం కల్పించరాదని నిర్ణయం తీసుకుంది. వీరిలో బాగా పనిచేసే ఇంజనీర్లకు ప్రోత్సాహకంగా ప్రత్యేక పదోన్నతులు కల్పించే అంశాన్ని పరిశీలిస్తోంది. రిటైర్ అయితే ఇంటికే.. ఇకపై రిటైరైన ఇంజనీర్ల పదవీ కాలం పొడిగించరాదని ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత పదేళ్లలో కీలకమైన ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లుగా రిటైరైన ఇంజనీర్లే కొనసాగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలామంది రిటైర్డ్ ఇంజనీర్లను తొలగించింది. ఇటీవల కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన ఓ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక ఎక్స్టెన్షన్లో ఉన్న ఓ కీలక ఇంజనీర్ నీళ్లు నమిలారు. దీంతో మళ్లీ ఆయన పదవీకాలాన్ని పొడిగించరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ పోస్టులో మరో ఇంజనీర్‌ను అదనపు బాధ్యతల కింద నియమించింది. ఇదే సమయంలో మరో ఇంజనీర్ సైతం తన పదవీకాలం పొడిగింపునకు తీవ్ర ప్రయత్నాలు చేసుకున్నా ఫలించలేదు. -
ఏదుల నుంచే ‘డిండి’కి నీళ్లు!
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఏదుల (వీరాంజనేయ) రిజర్వాయర్ నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి నీళ్లను తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏదుల రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపల్లి చెక్‌డ్యామ్‌కు నీళ్లను తరలించే అలైన్మెంట్ పనులకు రూ.1,788.89 కోట్ల అంచనా వ్యయంతో నీటిపారుదల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ నెల 4న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుకు ఈ ప్రతిపాదనలు రానున్నాయి. మంత్రివర్గం ఆమోదించిన వెంటనే పనులకు పరిపాలనా అనుమతులు జారీచేసి, ఆ వెంటనే టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 27 కి.మీ.ల అనుసంధానం ఏదుల రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపల్లి చెక్‌డ్యామ్ కు గ్రావిటీ ద్వారా నీళ్లను తరలించేందుకు 800 మీటర్ల అప్రోచ్ కాల్వను.. ఆ తర్వాత వరుసగా 2.525 కి.మీ.ల ఓపెన్ కెనాల్, 16 కి.మీ.ల సొరంగం, 3.05 కి.మీల ఓపెన్ కెనాల్, 6.325 కి.మీల వాగు నిర్మాణం కలిపి మొత్తం 27.9 కి.మీ.ల పొడవున కాల్వలు, సొరంగం పనులు చేపడతారు.వనపర్తి జిల్లాలోని ఏదుల రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపల్లి చెక్‌డ్యామ్‌కు.. అక్కడి నుంచి ఉల్పర బరాజ్, డిండి, సింగరాజుపల్లి, ఎర్రపల్లి–గోకవరం, ఇర్వేన్, గొట్టిముక్కల, చింతపల్లి, కిస్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్లకు నీళ్లను తరలిస్తారు. 55 శాతం పనులు పూర్తి శ్రీశైలం జలాశయం ఫోర్‌షోర్ నుంచి రోజుకు 0.5 టీఎంసీ చొప్పున 60 రోజులపాటు మొత్తం 30 టీఎంసీల నీటిని తరలించి ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని దేవరకొండ, మునుగోడు, నాగార్జునసాగర్, నకిరేకల్, నల్లగొండ, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లో 3.61 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు డిండి ఎత్తిపోతల పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. రూ.6,190 కోట్ల అంచనాలతో 2015 జూన్ 11న ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు జారీ అయ్యాయి. ప్రాజెక్టు మొత్తంలో ఇప్పటివరకు రూ.3,441.89 కోట్ల విలువైన పనులు పూర్తి కాగా, మరో రూ.2,748.11 కోట్ల విలువైన పనులు చేపట్టాల్సి ఉంది. ఈ లెక్కన ఇప్పటివరకు 55 శాతం పనులు పూర్తయినట్టే. గతంలో రూ.3,929.66 కోట్లతో 7 ప్యాకేజీల పనులకు టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టర్లతో ఒప్పందం చేసుకున్నారు. మిగిలినపనులకు ఇంకా టెండర్లు నిర్వహించలేదు. ఇప్పటివరకు 12,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుబాటులోకి రాగా, ఇంకా 3,49,000 ఎకరాల ఆయకట్టుకు రావాల్సి ఉంది. మిగిలిన 45 శాతం పనులు పూర్తయితే మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. రిజర్వాయర్లకు భూసేకరణ సమస్య ఈ ప్రాజెక్టులో భూసేకరణ సమస్యలతో రిజర్వాయర్ల పనులు ముందుకు సాగడం లేదు. సింగరాజుపల్లి (85 శాతం), గొట్టిముక్కల (98 శాతం) రిజ ర్వాయర్ల పనులు దాదాపుగా చివరి దశలో ఉన్నాయి. కిస్టరాంపల్లి (70 శాతం), శివన్నగూడెం (70 శాతం) రిజర్వాయర్ల పనులు పురోగతిలో ఉన్నాయి. భూసే కరణ సమస్యలతో చింతపల్లి (0 శాతం), ఎర్రపల్లి–గోకవరం (26 శాతం) రిజర్వాయర్ల పనులు ప్రారంభ దశలోనే నిలిచిపోయాయి. ఇదే సమస్యతో ఇర్వేన్ రిజర్వాయర్ పనులు మొదలే కాలేదు. ప్రాజెక్టు అవసరాలకు 16,030 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు 12,052 ఎకరాలు సేకరించగా, మిగిలిన 3,977 ఎకరాలు సేకరించాల్సి ఉంది. వీడని పర్యావరణ చిక్కులు పర్యావరణ అనుమతులు లేకుండానే డిండి ప్రాజెక్టు పనులను చేపట్టినందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) 2022 డిసెంబర్ 12న రాష్ట్ర ప్రభుత్వానికి రూ.92.85 కోట్ల జరిమానా విధించడంతో పాటు పనులపై స్టే విధించింది. ఎన్జీటీ స్టే ఎత్తేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉంది. మరోవైపు పర్యావరణ అనుమతులు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. పర్యావరణ అనుమతులు సాధించే పనులను రూ.87.75 లక్షలతో ఎని్వరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఈపీటీఆర్ఐ)కు 2022 ఫిబ్రవరిలో ప్రభుత్వం అప్పగించినా, ఆశించిన ఫలితం కనిపించలేదు. -
పోలవరం అనుమతీ చెల్లదు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని సీతారామ– సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే అంశంపై నిర్వహించనున్న టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ (టీఏసీ) సమావేశానికి తమను పిలవలేదని, సీడబ్ల్యూసీ అంతర్గతంగా తీసుకునే నిర్ణయాలకు తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనను తెలంగాణ ప్రభుత్వం తిప్పికొట్టింది. అలా అయితే, గోదావరి పరీవాహక ప్రాంతంలోని మిగతా రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలను ఆహ్వానించకుండానే.. 2009లో టీఏసీ నిర్వహించి పోలవరం ప్రాజెక్టుకు ఇచి్చన అనుమతులూ చెల్లుబాటు కావు అని స్పష్టం చేసింది. సీతారామ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీలోని టీఏసీ అనుమతులకు సిఫార్సు చేస్తూ గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశంలో చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బోర్డుకు ఇటీవల ఏపీ లేఖ రాసింది. ‘ప్రస్తుతం 2017 మార్గదర్శకాలు అమల్లో ఉండగా, 1996 మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులివ్వడం సరికాదు’అని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ జి.అనిల్‌కుమార్ సోమవారం గోదావరి బోర్డుకు లేఖ రాశారు. ‘పోలవరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ 2009, 2011లో అనుమతులను 1996 మార్గదర్శకాల ప్రకారమే ఇచి్చంది. వీటి ఆధారంగానే తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో వ్యవహరిస్తోంది’అని బదులిచ్చారు. న్యాయస్థానానికి వెళ్లక తప్పని పరిస్థితి కల్పించారని ఏపీ పేర్కొనగా, తప్పుడు ఉద్దేశాలతో కేసులేసినా నిలబడవని తెలంగాణ కౌంటర్ ఇచి్చంది. గోదావరి ట్రిబ్యునల్ అవసరం లేదు అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టంలోని సెక్షన్ 3 కింద ఏపీ, తెలంగాణ మధ్య గోదావరి జలాల పంపకానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ఏపీ కోరగా, అది ఏమాత్రం అవసరం లేదని తెలంగాణ స్పష్టం చేసింది. తాము 531.908 టీఎంసీల గోదావరి జలాల వినియోగం కలిగి ఉన్నట్టు సీడబ్ల్యూసీ నిర్ణయించడం ఏకపక్షమన్న ఏపీ వాదనను కూడా తెలంగాణ తోసిపుచ్చింది. ‘రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఉమ్మడి ఏపీకి ఉన్న 1,486 టీఎంసీల నీటి వాటా నుంచి తెలంగాణకు 967.94 టీఎంసీలు, ఏపీకి 518.215 టీఎంసీలను కేటాయిస్తూ ఉమ్మడి రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ 2014 జనవరి 2న రాష్ట్ర ప్రణాళిక సంఘం కార్యదర్శికి లేఖ రాశారు. దానినే నాటి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వరద జలాలు/మిగులు జలాల ఆధారంగా చేపట్టిన పురుషోత్తపట్నం లిఫ్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, చింతలపూడి లిఫ్టు, గోదావరి–పెన్నా అనుసంధానం తదిత ర ప్రాజెక్టులకు నీటి హక్కులు సాధించుకునేందుకే ఏపీ తప్పుడు ఉద్దేశాలతో ట్రిబ్యునల్ ఏర్పాటును కోరుకుంటోంది. ఈ ప్రాజెక్టులకు నేటికీ సీడబ్ల్యూసీ నుంచి టెక్నో ఎకనామికల్ క్లియరెన్స్, టీఏసీ అనుమతి లేదు. దీంతో వీటిని రాష్ట్ర విభజన తర్వాత చేపట్టిన కొత్త ప్రాజెక్టులుగానే పరిగణించాల్సి ఉంటుంది. గోదావరి జలాల్లో ఏపీకి 531.908 టీఎంసీల న్యాయబద్ధమైన వినియోగం ఉన్నట్టు నిరూపించడంలో ఆ రాష్ట్రం విఫలమైంది’అని తెలంగాణ స్పష్టం చేసింది. ఏపీ అభ్యంతరాలను సీడబ్ల్యూసీ పరిగణనలోకి తీసుకుంది సీతారామ ప్రాజెక్టు వల్ల ఏపీ హక్కులకు ఎలాంటి నష్టం ఉండదని సీడబ్ల్యూసీ చెప్పడం సరికాదని ఆ రాష్ట్రం పేర్కొనగా.. ఏపీ అభ్యంతరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సీడబ్ల్యూసీ ఈ మేరకు తేల్చిందని తెలంగాణ వివరణ ఇచి్చంది. ఇచ్చంపల్లి ప్రాజెక్టు ద్వారా 85 టీఎంసీల వినియోగంపై గోదావరి ట్రిబ్యునల్ విధించిన ఆంక్షలు ఆ ప్రాజెక్టుకే పరిమితమని, సీతారామ ప్రాజెక్టుకు వర్తించవని తెలిపింది. 35 టీఎంసీలతో దేవాదుల, 195 టీఎంసీలతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడంతో ఆ 85 టీఎంసీలను తెలంగాణ వాడుకున్నట్టేనని, దీంతో సీతారామ ప్రాజెక్టుకు నీటి లభ్యత లేదన్న ఏపీ వాదనను తోసిపుచి్చంది. ట్రిబ్యునల్ మార్గదర్శకాలకు కట్టుబడే దేవాదుల, కాళేశ్వరంతో పాటు పోలవరం ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ అనుమతిలిచి్చందని తెలిపింది.పోలవరం ప్రాజెక్టుపై ప్రభావం ఉండదు‘పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే సమయంలో అక్కడ 991 టీఎంసీల నీటి లభ్యత ఉందని వ్యాప్కోస్ నిర్ధారించగా, 861 టీఎంసీలేనని సీడబ్ల్యూసీ కుదించింది. 2018 నాటి సీతారామ ప్రాజెక్టు డీపీఆర్ ప్రకారం పోలవరం వద్ద నీటి లభ్యత 460.7 టీఎంసీలకు తగ్గింది. సీతారామ డీపీఆర్ ప్రకారం అక్కడ నికర లోటు 13.64 టీఎంసీల నుంచి 151 టీఎంసీలకు పెరి గింది. గోదావరిలో మిగులు జలాల లభ్యత లేదని న దుల అనుసంధానం సందర్భంగా సీడబ్ల్యూసీ తేల్చింది. ఎగువ నుంచి ప్రవాహాలు తగ్గిన నేపథ్యంలో పోలవరం వద్ద నీటి లభ్యతపై తాజా అధ్యయనం జరపాలి’అని ఏపీ కోరింది. సీడబ్ల్యూసీలోని హైడ్రాలజీ డైరెక్టరేట్ పరీ వాహకంలోని అన్ని రాష్ట్రాల ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకుని పోలవరం ప్రాజెక్టుపై ఎలాంటి ప్రభా వం ఉండదని నిర్ధారించిందని తెలంగాణ బదులిచ్చింది. -
మళ్లీ సాగునీటి సంఘాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ సాగునీటి వినియోగదారుల సంఘాల వ్యవస్థను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సిఫార్సు చేసింది. ప్రతి చెరువుకు ఒక సాగునీటి సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. గతంలో సాగునీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు నిర్వహించి కమిటీని ఎన్నుకునేవారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేసింది. ఇప్పుడు ఎన్నికలకు బదులు ప్రభుత్వమే చెరువు కింద సాగుచేసే రైతులతో సాగునీటి వినియోగదారుల సంఘాన్ని ఏర్పాటు చేయాలని రైతు కమిషన్ సూచించింది. ఈ మేరకు కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి ఇటీవల రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. చిన్న నీటిపారుదల శాఖను ఏర్పాటు చేయండి నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణ పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్న నీటిపారుదల శాఖను నీటిపారుదల శాఖలో విలీనం చేసింది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్వహణకే నీటిపారుదల శాఖలోని యంత్రాంగం పరిమితం కావడంతో గత 10 ఏళ్లలో చెరువుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని రైతు కమిషన్ అభిప్రాయపడింది. రాష్ట్రంలో 46,531 చెరువులుండగా, వాటికింద 25.11 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. గత ప్రభుత్వం భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు చెరువులను అనుసంధానం చేసి.. వాటిని నింపినప్పటికీ, నిర్వహణను పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల పునరుద్ధరణ చేపట్టినా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. దీంతో మళ్లీ చెరువుల ఆక్రమణలు జరుగుతున్నాయని రైతు కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ నుంచి చిన్న నీటిపారుదల శాఖను విభజించి పాత విధానంలో చెరువుల నిర్వహణను పునరుద్ధరించాలని ప్రభుత్వానికి సూచించింది. చెరువుల సంవత్సరంగా 2025! 2025 ఏడాదిని చెరువుల సంవత్సరంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా రైతు కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది. చెరువుల తూములు, కట్టలు, కాల్వలకు మరమ్మతులు చేపట్టాలని సూచించింది. కాకతీయులు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల కాలంలో రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ ఉండేది.ఒక చెరువు నిండితే దాని కింద ఉన్న చెరువులను నింపుకుంటూ నీళ్లు ప్రవహించేవి. చెరువులు ఆక్రమణకు గురికావడం, లేఅవుట్లు రావడంతో గొలుసుకట్ట వ్యవస్థ దెబ్బతిన్నదని రైతు సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో 2025 సంవత్సరంలో చెరువుల పునరుద్ధరణ, మరమ్మతులకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని, వాటి కింద చివరి ఆయకట్టుకు కూడా సాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సిఫార్సు చేసింది. -
కృష్ణాలో తెలంగాణకు 70% వాటా దక్కాలి
సాక్షి, హైదరాబాద్: నది పరీవాహక ప్రాంతాన్ని ప్రామాణికంగా తీసుకుని నీటి కేటాయింపులు జరపాలని అంతర్జాతీయ నీటి సూత్రాలు స్పష్టం చేస్తున్నాయని.. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 70 శాతం ఉంటే.. ఏపీలో 30 శాతమే ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దీని ప్రకారం కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 1,005 టీఎంసీల వాటాలో 70 శాతం వాటా తెలంగాణకు దక్కేలా జస్టిస్ బ్రజేశ్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ శనివారం నీటి పారుదల శాఖపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలసి సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలిస్తే.. బదులుగా నాగార్జునసాగర్ ఎగువన 80 టీఎంసీల కృష్ణా జలాలను పరీవాహక రాష్ట్రాలు వినియోగించుకోవచ్చంటూ గతంలో జరిగిన ఒప్పందాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ 80 టీఎంసీల్లో మహారాష్ట్ర, కర్ణాటక 35 టీఎంసీలను వాడుకుంటుండగా.. మిగతా 45 టీఎంసీలపై సంపూర్ణ హక్కు తెలంగాణకే ఉందని చెప్పారు. సాగర్ ఎగువన తెలంగాణలోని ప్రాజెక్టుల ద్వారా ఈ నీటిని వినియోగించుకోవడానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరగొద్దు కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన వాటాలను సాధించుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు వీసమెత్తు నష్టం వాటిల్లకుండా కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట సమర్థవంతంగా వాదనలు వినిపించాలన్నారు. ఈ వాదనలను బలపరిచే సాక్ష్యాలు, రికార్డులు, ఉత్తర్వులను సిద్ధం చేసుకోవాలని సూచించారు. త్వరలో ట్రిబ్యునల్‌లో వాదనలు.. కృష్ణా ట్రిబ్యునల్–2 ఇప్పటివరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అభిప్రాయాలు, ఆధారాలను సేకరించిందని... త్వరలోనే ఇరు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాల్సి ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ఆ తర్వాత ట్రిబ్యునల్ నిర్ణయం వెలువడుతుందని తెలిపారు. అయితే కేంద్ర జలశక్తి శాఖకు ఇచి్చన నివేదికలన్నింటినీ వరుస క్రమంలో సిద్ధంగా ఉంచుకోవాలని, వాటి ఆధారంగా ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించాలని సీఎం సూచించారు. కృష్ణా బోర్డును ఎందుకు పట్టించుకోవాలి? తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీని కృష్ణా ట్రిబ్యునల్–2 పూర్తి చేయలేదని.. ఇక కృష్ణా బోర్డు నిర్ణయాలను తెలంగాణ ఎందుకు పట్టించుకోవాలని సీఎం రేవంత్ ప్రశ్నించారు. నీటి వాటాల పంపిణీ పూర్తయ్యే వరకు కృష్ణా బోర్డు జోక్యం ఉండకూడదంటూ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని అధికారులకు సూచించారు.ఇక ఏపీ కోటాకు మించి నీటిని తరలించుకుపోతోందన్న అంశం ప్రస్తావనకురాగా.. టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుతో దీనికి అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు పేర్కొన్నట్టు తెలిసింది. దీంతో శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ, బానకచర్ల క్రాస్ రెగ్యులేటరీ, తెలుగు గంగ, కేసీ కాల్వ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలుగోడు ప్రాజెక్టుల ద్వారా ఏపీ తరలిస్తున్న నీటి వివరాలను సేకరించి రికార్డు చేయాలని సీఎం సూచించినట్టు సమాచారం. నీటి వాటాల్లో అన్యాయంపై నివేదిక తయారు చేయాలిసీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీకి అవసరమైన అనుమతులను సాధించాలని.. మొత్తం ఆయకట్టుకు నీరందేలా పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులు, నీటి వాటాలకు సంబంధించి సమర్థంగా వాదనలు వినిపించేందుకు 2014 నుంచి ఇప్పటి వరకు ఉన్న జీవోలు, తీర్పులతోపాటు ఉమ్మడి రాష్ట్రంలోని జీవోలు, మెమోలు, డీపీఆర్‌లు, నాటి నుంచి నీటి వాటాల్లో తెలంగాణకు జరిగిన నష్టాలపై సమగ్రంగా నివేదిక తయారు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట తెలంగాణ తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది వైద్యనాథన్, అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, అదనపు ఏజీ రజనీకాంత్‌రెడ్డి, ప్రభుత్వం తరఫు న్యాయవాది ఖుష్ వోరా, అధికారులు పాల్గొన్నారు. -
HYD: ఇరిగేషన్లో 300 కోట్ల అవినీతి తిమింగలం.. మూడు ఫామ్ హౌస్‌లు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఏసీబీ అధికారుల సోదాల అంశం చర్చనీయాంశంగా మారింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ ఏఈ నికేష్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.వివరాల ప్రకారం.. నీటి పారుదల శాఖ ఏఈ నికేష్ కుమార్‌పై గత కొంత కాలంగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్టు ఆరోపణలు వస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. శనివారం ఉదయం నుంచి ఏక కాలంలో 30 చోట్ల తనిఖీలు చేపట్టారు. ఆయనతో పాటుగా బంధువుల ఇళ్లలో కూడా దాడులు కొనసాగుతున్నాయి. గతంలోనూ లంచం తీసుకుంటూ నికేష్ కుమార్ పట్టుబడ్డారు. ఇక, సోదాల్లో భాగంగా రూ.300 కోట్లకు పైగా ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. గండిపేట బఫర్ జోన్, ఎఫ్టీఎల్లో నిబంధనకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చినట్టు ఏసీబీ గుర్తించింది. ఇదే సమయంలో గండిపేట, హిమాయత్ సాగర్, నార్సింగి, మణికొండ, రాజేంద్రనగర్ పరిధిలో భారీగా అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. ఇక, నికేష్ పేరిట మూడు ఇల్లులు ఉండగా.. ఫామ్ హౌస్‌లు కూడా ఉన్నాయి. ఫామ్ హౌస్‌ల విలువ రూ.80 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇక, కొల్లూరులో ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మొయినాబాద్‌లో మూడు ఫామ్‌హౌస్‌లు ఉన్నట్టు నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. నికేష్ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. గతంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ నికేష్ ఏసీబీకి దొరికారు. -
మేడిగడ్డలో సాక్ష్యాధారాలు ధ్వంసం!
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి ఏర్పడిన బుంగలను పూడ్చడానికి ముందు, అక్కడి స్థితిగతులు తెలుసుకోవడానికి వరుస క్రమంలో నిర్వ హించాల్సిన పరీక్షలపై నిపుణుల కమిటీ చేసిన సి ఫారసులను రాష్ట్ర నీటిపారుదల శాఖ అమలు చే యకుండా నీరుగార్చింది..’అంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇరిగేషన్ శాఖ నిర్వాకంతో బరాజ్‌లు దెబ్బతినడానికి దారితీసిన కారణాల విశ్లేషణకు అవసరమైన కీలక సమాచారం, సాక్ష్యాధారాలు ధ్వంసమయ్యాయి..’అని తెలిపింది. నీటిపారుదల శాఖ సొంతంగా ఏర్పాటు చేసుకున్న మరో సాంకేతిక కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా ఆ శాఖ నిర్వహించిన మరమ్మతులు.. ఎన్డీఎస్ఏ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫారసుల్లో జోక్యం చేసుకునేలా ఉన్నాయి..’అని పేర్కొంది. ఈ మేరకు ఎన్డీఎస్ఏ డైరెక్టర్ (టెక్నికల్) గత నెల 11న ఇరిగేషన్ కార్యదర్శికి లేఖ రాశారు. కేంద్ర జలశక్తి శాఖ సల హాదారు వెదిరే శ్రీరామ్ బుధవారం కాళేశ్వరం బరాజ్‌లపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌కు అఫిడవిట్ సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్డీఎస్ఏ లేఖను మీడియాకు విడుదల చేశారు. బుంగల పూడ్చివేతతో స్థితిగతుల్లో మార్పులు ‘మేడిగడ్డ బరాజ్ ప్లింత్ శ్లాబుకి ఎగువ, దిగువన గ్రౌటింగ్ చేసి భూగర్భంలో ఏర్పడిన బుంగలను పూడ్చి వేయడంతో సికెంట్ పైల్స్, పారామెట్రిక్ జాయింట్స్ వద్ద స్థితిగతుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. బరాజ్ కుంగిన తర్వాత భూగర్భంలో ఉన్న వాస్తవ స్థితిగతులను అధ్యయనం చేయాల్సి ఉండగా, స్థితిగతుల్లో మార్పులతో ఆ అవకాశం లేకుండా పోయింది..’అని ఎన్డీఎస్ఏ లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ గతేడాది అక్టోబర్‌లో కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో బుంగలు ఏర్పడి నీళ్లు లీకైన విషయం తెలిసిందే. బరాజ్‌లలో లోపాలపై అధ్యయనం చేసి వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గత మే 1న మధ్యంతర నివేదికను సమర్పించింది. బరాజ్‌లకు మరింత నష్టం జరగకుండా వర్షాకాలం ప్రారంభానికి ముందే తీసుకోవాల్సిన అత్యవసర మరమ్మతులతో పాటు బరాజ్‌లలో లోపాలను నిర్ధారించడానికి నిర్వహించాల్సిన జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలు ఇందులో ఉన్నాయి. ఈ పరీక్షలు నిర్వహించక పోవడాన్ని ఎన్డీఎస్ఏ తప్పుబట్టింది. ఈ అధ్యయనాలు/పరీక్షలు ప్రారంభించడంలో జాప్యం చేయడం ద్వారా నీటిపారుదల శాఖ విలువైన సమయాన్ని కోల్పోయిందంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో కూడా..‘అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునాదుల కింద ఏర్పాటు చేసిన సికెంట్ పైల్స్ వాస్తవ స్థితిగతులను అధ్యయనం చేయడానికి ముందే కరై్టన్ గ్రౌటింగ్ చేసి భూగర్భంలో బుంగలను పూడ్చివేశారు. పునాదుల (ర్యాఫ్ట్‌లు) కింద బుంగలను పూడ్చడానికి సిమెంట్ మిశ్రమంతో గ్రౌటింగ్ చేశారు. గ్రౌటింగ్‌కు ముందే జియో టెక్నికల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, అలా చేయలేదు. ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తే ఎన్డీఎస్ఏ కమిటీకి అవసరమైన వాస్తవ సమాచారం లభించదు. దీనివల్ల ఎన్డీఎస్ఏ కమిటీ పని ప్రణాళికకు విఘాతం కలిగింది..’అని ఎన్డీఎస్ఏ లేఖలో స్పష్టం చేసింది. నీటిపారుదల శాఖ తాజాగా తీసుకోవాల్సిన చర్యలను, చేయాల్సిన పరీక్షలను సిఫారసు చేసింది. 160 టీఎంసీల లభ్యత లేదనడం అవాస్తవం: వెదిరే శ్రీరామ్ ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి వద్ద 75 డిపెండబిలిటీ ఆధారంగా 160 టీఎంసీల నీటి లభ్యత ఉందని సీడబ్ల్యూసీ నిర్ధారించిందని వెదిరే శ్రీరామ్ చెప్పారు. నీటి లభ్యత లేదని చెప్పి ప్రాజెక్టు రీఇంజనీరింగ్‌ను చేపట్టారని విమర్శించారు. వ్యాస్కోస్ వ్యాపార సంస్థ అని, ఎవరు పని అప్పగిస్తే వారి ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తుందని అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ కట్టి రూ.32 వేల కోట్లతో మొత్తం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేసి 16.4 లక్షల ఎకరాలకు నీరందించడానికి వీలుండగా, కేవలం రూ.2 లక్షల అదనపు ఆయకట్టు కోసం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని విమర్శించారు. ప్రస్తుతం దీని అంచనాలు రూ.1.27 లక్షల కోట్లకు ఎగబాకాయన్నారు. -
‘సీతారామ’ అంచనాలు మోపెడు!
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతల పథకం అంచనా వ్యయం మరింతగా పెంచేందుకు రంగం సిద్ధమైంది. 2016 ఫిబ్రవరి 18న రూ.7,926.14 కోట్ల అంచనా వ్యయంతో గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు నిర్మాణా నికి అనుమతులు జారీ చేసింది. ఆ తర్వాత 2018 ఆగస్టు 2న రూ.13,057.98 కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచింది. తాజాగా అంచనా వ్యయాన్ని రూ.19,800 కోట్లకు సవరిస్తూ పాలనాపర అనుమతులు జారీ చేయాలని ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్ ఎ.శ్రీనివాస్ రెడ్డి నీటిపారుదల శాఖకు ప్రతిపాదనలు సమర్పించారు. సరైన అనుమతులు లేకుండానే ప్రాజెక్టు డిస్ట్రి బ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు నీటిపారుదల శాఖ ఇటీవల రూ.1,842 కోట్ల అంచనాతో టెండర్లను ఆహ్వానించడంపై ఇటీవల అధికారుల మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెండర్లను ఆహ్వానించిన అనంతరం పాలనాపర అనుమతులు కోరుతూ ప్రతిపాదనలను సమర్పించడం గమనార్హం. 16 ప్యాకేజీలుగా కాల్వల పనులు 3,28,853 ఎకరాల కొత్త ఆయకట్టు, 3,45,534 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించడానికి సీతారామ ప్రాజెక్టును చేపట్టారు. ప్రాజెక్టులో భాగమైన పంప్‌హౌస్‌ల నిర్మాణం, ఇతర ప్రధాన పనులు పూర్తికాగా, డి్రస్టిబ్యూటరీ కాల్వల నిర్మాణం జరగాల్సి ఉంది. ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో సీతారామను చేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సత్వరంగా డి్రస్టిబ్యూటరీల పనుల పూర్తికి ఆదేశించింది. ప్రాజెక్టు కాల్వల పనులను 16 ప్యాకేజీలుగా విభజించగా, 1–8 ప్యాకేజీల కింద ప్రధాన కాల్వ, 9–12 ప్యాకేజీలుగా సత్తుపల్లి ట్రంక్ కాల్వ, 13–16 ప్యాకేజీలుగా పాలేరు లింక్ కాల్వ పనులను చేర్చారు. ఇక డిస్ట్రిబ్యూటరీల పనులను మరో 8 ప్యాకేజీలుగా విభజించి రూ.3,858.93 కోట్ల అంచనాలతో అనుమతుల కోసం ప్రతిపాదనలను సమర్పించారు. గతంలో నిర్వహించిన ఓ సమీక్షలో డిస్ట్రిబ్యూటరీల పనులకు తక్షణమే టెండర్లను జరపాలని ప్రభుత్వం ఆదేశించడంతో రూ.1,842 కోట్ల అంచనాలతో కొత్తగూడెం సీఈ టెండర్లను ఆహ్వానించారు. అందులో కేవలం రూ.768 కోట్లకే పరిపాలన అనుమతి ఉండగా, రూ.1,074 కోట్ల పనులకు అనుమతి లేకపోవడం వివాదంగా మారింది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన ఓ సమీక్షలో ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్, సీఈ ఎ.శ్రీనివాస్ రెడ్డి ఘర్షణకు దిగి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ప్రభుత్వం వారిద్దరిని మందలించి సంజాయిషీ కోరింది. దీంతో కొత్తగూడెం సీఈ శ్రీనివాస్ రెడ్డి ఎట్టకేలకు పాలనాపర అనుమతుల కోసం తాజాగా ప్రతిపాదనలు సమర్పించడం గమనార్హం. ప్రామాణిక ధరల పట్టిక 2024–25 ఆధారంగా అంచనాలను రూ.19,800 కోట్లకు పెంచాలని ఆయన కోరారు. స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ ఈ ప్రతిపాదనలను పరిశీలించి అనుమతుల కోసం సిఫారసు చేయాలా? వద్దా? అని నిర్ణయం తీసుకోనుంది. -
తక్షణమే సెలవుపై వెళ్లండి!
సాక్షి, హైదరాబాద్: పరిపాలనపరమైన అనుమతుల్లే కుండానే సీతారామ ఎత్తిపోతల పథకం డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, అనుబంధ పనులకు టెండర్ల నిర్వహణలో జరిగిన తప్పిదాలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సీతారామ ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్ ఎ.శ్రీనివాస్‌రెడ్డిని తక్షణమే సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించినట్టు సమాచారం. అలాగే నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి. అనిల్‌కుమార్‌కు సంజాయిషీ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆ శాఖ కార్యదర్శిని కోరినట్టు తెలిసింది. సీతారామ ప్రాజెక్టుపై ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి శనివారం జలసౌధలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా మంత్రి వారిపై మండిపడినట్టు తెలిసింది. డిస్ట్రిబ్యూటరీలు, ఇతర పనులకు పరిపాలనపరమైన అనుమతుల కోసం ప్రతిపాదనలు సమర్పించినా సహకరించడం లేదని ఈఎన్సీపై సీఈ శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించగా, అసలు ఇప్పటివరకు తనకు డిటైల్డ్ ఎస్టిమేట్లు (సవివర అంచనాలు) సమర్పించలేదని ఈఎన్సీ అనిల్‌కుమార్ బదులిచ్చినట్టు తెలిసింది. డిటైల్డ్ ఎస్టిమేట్లు లేకుండా అనుమతులిచ్చేస్తే తర్వాత పనుల అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇద్దరు అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంత్రుల ఆదేశాల మేరకే..!వాస్తవానికి డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు పాలనాపరమైన అనుమతులు జారీ చేయాలని కోరుతూ కొత్తగూడెం సీఈ గత నెలలో నీటిపారుదల శాఖకు ప్రతిపాదనలు పంపించారు. అయితే డిటైల్డ్ ఎస్టిమేట్లతో పాటు డిజైన్లు, డ్రాయింగ్లు కూడా లేకపోవడంతో వాటిని సమర్పించాలని కోరుతూ ఈఎన్సీ ఆ ప్రతిపాదనలను తిప్పి పంపించారు. ఇప్పటివరకు డిటైల్డ్ ఎస్టిమేట్లతో పాటు డిజైన్లు, డ్రాయింగ్స్‌ను సమర్పించలేదు. మరోవైపు గత నెలలో నిర్వహించిన ఓ సమీక్షలో మంత్రులు ఆదేశించడంతో ప్రాజెక్టు అధికారులు తొందరపడి టెండర్లను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అయితే తక్షణమే టెండర్లు నిర్వహించాలని మంత్రులు ఆదేశించిట్టు మీటింగ్ మినట్స్‌లో సైతం ఉందని, అందుకే ఆహ్వానించట్టు బాధ్యులైన అధికారులు పేర్కొంటున్నారని సమాచారం. కాగా పాలనాపరమైన అనుమతులే కాకుండా ఆర్థిక శాఖ ఆమోదం కూడా లేకుండా టెండర్లను ఆహ్వానించడం నిబంధనల తీవ్ర ఉల్లంఘనే అని నీటిపారుదల శాఖలో చర్చ జరుగుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నాగార్జునసాగర్ కాల్వకు గండ్లుపడగా, పాలనాపరమైన అనుమతుల జారీ తర్వాతే అత్యవసర మరమ్మతులు చేపట్టారని, అనుమతుల విషయంలో మినహాయింపు ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. అనుమతుల్లేకుండా బిడ్లను ఎలా తెరుస్తారు ?డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు సంబంధించిన ఆరు టెండర్లకు ఈ నెల 8తో, ఒక టెండర్‌కు ఈ నెల 4తో బిడ్ల దాఖలు గడువు ముగియనుంది. కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ)లోని చీఫ్ ఇంజనీర్ల కమిటీ బిడ్లను పరిశీలించి ఎల్–1 బిడ్డర్‌ను ఖరారు చేయాల్సి ఉంటుంది. అయితే సంబంధిత పనులకు పాలనాపరమైన అనుమతులు, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా బిడ్లను తెరిచి పరిశీలించడానికి నిబంధనలు ఒప్పుకోవని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నారో పరిశీలించి ముందుకు వెళ్లాల్సి ఉంటుందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు.టెండర్లపై రాజకీయ రగడ– ఇప్పుడు మీపై ఏ కమిషన్ వేయాలి?: కేటీఆర్పాలనాపరమైన అనుమతుల్లేండానే సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీలు, ఇతర పనులకు అధికారులు టెండర్లను ఆహ్వానించినట్టు వెలుగులోకి రావడంతో రాజకీయ రగడ ప్రారంభమైంది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 మధ్య ఏడు పనులకు రూ. 1,842 కోట్ల అంచనాతో నీటిపారుదల శాఖ టెండర్లను ఆహ్వానించగా, అందులో రూ. 1,074 కోట్ల పనులకు పాలనాపరమైన అనుమతుల్లేవంటూ ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. వార్తా కథనాన్ని షేర్ చేస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల మీద పగబట్టి హాహాకారాలు చేస్తూ బురదజల్లిన వారు..అనుమతి లేకుండానే రూ.1,074 కోట్ల పనులకు టెండర్లు ఎలా పిలుస్తారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజాపాలన అని రోజుకు పదిమార్లు ప్రగల్భాలు పలికేటోళ్లు ఇలా ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఒక సమావేశంలో త్వరగా టెండర్లు పిలవాలని ఆదేశించి, మరో సమావేశంలో ఇదేంటి అంటూ నంగనాచి మాటలు మాట్లాడడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు పూర్తయ్యి కోటి ఎకరాలకు జీవం పోస్తున్న కాళేశ్వరంపై కమిషన్ వేసి విచారణ జరిపిస్తున్న మీపై.. ఇప్పుడు ఏ కమిషన్ వేయాలని ప్రశ్నించారు. ఢిల్లీ నేస్తం..అవినీతి హస్తంకాళేశ్వరంపై కక్షగట్టి రైతుల పొట్టగొట్టారని, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల మీద పగబట్టి మళ్లీ వలసలకు పచ్చజెండా ఊపారని కేటీఆర్ మండిపడ్డారు. ఢిల్లీ నేస్తం–అవినీతి హస్తం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ.7,926.14 కోట్ల అంచనాతో 2016 ఫిబ్రవరి 18న పాలనాపరమైన అనుమతులివ్వగా, ఆ తర్వాత 2018 ఆగస్టులో అప్పటి ప్రభుత్వం రూ.13,057 కోట్లకు అంచనాలను సవరించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దీనిని తప్పుబడుతూ రాష్ట్ర మంత్రులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే విషయాన్ని ఇప్పుడు గుర్తుచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. -
అనుమతి లేకున్నా రూ. వెయ్యి కోట్ల ‘సీతారామ’ టెండర్లు!
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా పరిపాలనా అనుమతుల్లేకుండానే సుమారు రూ. 1,074 కోట్ల అంచనా వ్యయంతో డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు ప్రాజెక్టు అధికారులు టెండర్లను ఆహ్వానించడం నీటిపారుదల శాఖలో వివాదస్పదంగా మారింది. సెపె్టంబర్ 28 నుంచి అక్టోబర్ 5 మధ్య ఏడు పనులకు రూ. 1,842 కోట్ల అంచనాతో నీటిపారుదల శాఖ టెండర్లను ఆహ్వానించింది. అయితే వాటిలో సుమారు రూ. 768 కోట్లు విలువ చేసే పనులకే ఆర్థిక శాఖ ఆమోదం తెలపగా ఆ మేరకు నీటిపారుదల శాఖ పరిపాలనా అనుమతులు జారీ చేసింది. మిగిలిన రూ. 1,074 కోట్ల పనులకు ఆమోదం తెలపడంపై నిర్ణయాన్ని ఆర్థిక శాఖ పెండింగ్‌లో ఉంచింది. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఈ పనులకు ప్రాజెక్టు అధికారులు టెండర్లను ఆహ్వానించారు. ఈ ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శనివారం చేపట్టిన సమీక్షలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. పరిపాలనా అనుమతుల్లేకుండానే టెండర్లు పిలిచి ప్రభుత్వాన్ని తప్పుదోవపట్టించారని సంబంధిత చీఫ్ ఇంజనీర్‌పై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలో మంత్రులు నిర్వహించిన ఓ సమీక్షలో వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించగా.. ప్రాజెక్టు అధికారులు అనుమతులు పొందకుండానే తొందరపాటుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ప్రభుత్వం సత్వరమే టెండర్లు పిలవాలని ఆదేశిస్తే దానర్థం అనుమతుల్లేకుండానే టెండర్లు ఆహ్వానించాలని కాదని, అనుమతులన్నీ తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదేనని ఉన్నతాధికారులు అంటున్నారు. అనుమతులు రాకుంటే ఏం చేస్తారు? అన్ని ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖల ఈఎన్సీలు/చీఫ్ ఇంజనీర్లతో కూడిన కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ) కమిటీ ఆమోదించాకే రూ. 10 కోట్లు, ఆపై విలువగల పనుల టెండర్లను ఖరారు చేయాల్సి ఉంటుంది. పనులకు అన్ని రకాల అనుమతులు ఉంటేనే సీఓటీ కమిటీ టెండర్లను ఆమోదిస్తుంది. అనుమతుల ఉత్తర్వుల్లో పేర్కొన్న పదాల్లో స్వల్ప తేడాలున్నా మళ్లీ కొత్త ఉత్తర్వులతో వస్తేనే ఆమోదముద్ర వేస్తుంది. ప్రస్తుతం సీతారామ ప్రాజెక్టు డి్రస్టిబ్యూటరీలకు సంబంధించిన ఆరు టెండర్లకు బిడ్ల దాఖలు గడువు ఈ నెల 8తో ముగియనుండగా మరో టెండర్ గడువు 4తో ముగియనుంది. ఆ తర్వాత ఈ బిడ్లను సీఓటీ కమిటీ పరిశీలించి ఆమోదించాల్సి ఉంది. అయితే అనుమతుల్లేకుండానే టెండర్లు జారీ కావడంతో సీఓటీ కమిటీ నుంచి వాటికి ఆమోదం లభించే అవకాశం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ అనుమతులు లభించకపోతే టెండర్లను రద్దు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. కాగా, టెండర్లను ఆహ్వానించిన తర్వాత అనుమతుల్లేని పనులకు ర్యాటిఫికేషన్ (క్రమబద్ధీకరణ అనుమతులు) జారీ చేయాలని కోరుతూ నీటిపారుదల శాఖకు ప్రాజెక్టు అధికారులు విజ్ఞప్తి చేయగా అంచనాలను సమర్పించాలని నీటిపారుదల శాఖ ఆదేశించింది. ఇప్పటికే సీతారామపై వివాదాలు... సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ. 7,926.14 కోట్ల అంచనాతో 2016 ఫిబ్రవరి 18న ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చిoది. ఆ తర్వాత 2018 ఆగస్టులో రూ. 13,057 కోట్లకు అంచనాలను పెంచింది. ఈ ప్రాజెక్టు కింద 3,28,853 ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు 3,45,534 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే పంప్‌హౌస్‌ల పనులు పూర్తవగా డిస్ట్రిబ్యూటరీలు, ఇతర పనులు జరగాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఈ పనుల అంచనాలను భారీగా పెంచారని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇదే సమయంలో పరిపాలనా అనుమతుల్లేకుండానే అధికారులు టెండర్లను నిర్వహిస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ అంశంపై ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు. -
‘కొడంగల్’ లిఫ్టుపై మీమాంస
సాక్షి,హైదరాబాద్: నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం టెండర్లకు కమిషనర్ ఆఫ్ టెండర్స్(సీఓటీ) ఆమోదముద్ర లభించలేదు. పలు ఇంజనీరింగ్ శాఖల పనులకు సంబంధించిన టెండర్లపై శనివారం నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) జి.అనిల్‌కుమార్ నేతృత్వంలోని సీఓటీ సమావేశమై చర్చించింది. ఈ సమావేశంలో నారాయణపేట–కొడంగల్ టెండర్లపై ప్రధానంగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌తోపాటు నారాయణపేట నియోజకవర్గంలో లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి రూ.4,350కోట్లతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది.టెండర్ల ఆమోదంపై నిర్ణయం తీసుకోని సీఓటీప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా విభజించి గత నెల లో టెండర్లను ఆహ్వానించారు. ప్యాకేజీ–1 కింద రూ.1,134.62 కోట్ల అంచనాలతో టెండర్లను పిల వగా, 3.9% అధిక ధరను కోట్ చేసి రాఘవ–జ్యోతి జాయింట్ వెంచర్ ఎల్–1గా నిలిచింది. 4.85% అధిక ధరను కోట్ చేసి ఎల్–2గా మేఘా ఇంజనీ రింగ్ నిలిచింది. రూ.1,126.85 కోట్ల అంచనాలతో రెండో ప్యాకేజీ పనులకు టెండర్లను పిలవగా 3.95% అధిక ధరను కోట్ చేసి ఎల్–1గా మేఘా ఇంజనీరింగ్, 4.8% అధిక ధరను కోట్ చేసిన ఎల్–2గా రాఘవ కన్స్ట్రక్షన్స్ నిలిచాయి. ఈ టెండర్లను సీఓటీ ఆమోదించాల్సి ఉండగా, ఇప్పటికే పలుమార్లు సమావేశమైన సీఓటీ ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. 21న జరిగే సమావేశంలోనైనా...ప్యాకేజీ–1 టెండర్ల విషయంలో సీఓటీలోని కొందరు చీఫ్ ఇంజనీర్లు కొన్ని అంశాలపై కొర్రీలు వేసినట్లు సమాచారం. ఈ నెల 21న జరగనున్న సీఓటీ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సూర్యాపేట జిల్లా నాగార్జునసాగర్ ఆయకట్టు స్థిరీకరణకు రూ.360 కోట్లతో చేపట్టిన ఎత్తిపోతల పథకం పనులకు సీఓటీ ఆమోదముద్ర వేసింది. రూ.14 కోట్లతో చేపట్టిన సదర్మట్ బరాజ్ విద్యుదీకరణ పనులకు సైతం అనుమతిచ్చింది. -
Telangana: బుల్డోజర్లకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: వరుసగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో కలకలం రేపిన ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)’కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇటీవలి పరిణామాలు, సంస్థాగత లోపాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. కనీసం 3 నెలలపాటు కూల్చివేతల జోలికి వెళ్లవద్దని సూచించింది. దీనితో హైడ్రా తమ విభాగం అంతర్గత నిర్మాణంపై దృష్టి పెట్టనుంది. మరోవైపు హెచ్ఎండీఏ, రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు చెరువులు, కుంటలపై విస్తృత సర్వే చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఏర్పడటానికి ముందు నుంచే కూల్చివేతలతో..చెరువుల ఆక్రమణల తొలగింపు కోసం హైడ్రా ఏర్పడటానికి ముందే.. జీహెచ్ఎంసీ అధీనంలో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ‘విజిలెన్స్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం)’రూపంలో కూల్చివేతలు ప్రారంభించారు. జూన్ 27న ఫిల్మ్‌నగర్ కో–ఆపరేటివ్ సొసైటీలో తొలి ఆపరేషన్ చేపట్టారు. నార్నే గోకుల్ ఆక్రమించిన లోటస్ పాండ్‌లోని 0.16 ఎకరాలకు విముక్తి కల్పించారు. తర్వాత ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి, ఓఆర్ఆర్ వరకు పరిధిని కల్పిస్తూ జూలై 19న ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి దాదాపు 20 చోట్ల అక్రమ నిర్మాణాలను తొలగించారు. 50 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి, చెరువులను పరిరక్షించారు.విరామానికి కారణాలెన్నో..హైడ్రా ప్రభావంతో రాష్ట్రంలో, ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింది. ఇళ్లు, స్థలాల క్రయవిక్రయాలు పడిపోయాయి. మరో వైపు అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతల వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. నది వెంట ఇళ్ల సర్వే, ఖాళీ చేయించడం, కూల్చివేయడం వంటి చర్యలు చేపట్టింది. మూసీ ప్రాజెక్టుతో హైడ్రాకు సంబంధం లేకపోయినా.. రెండింటి కూల్చివేతలపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ కారణాల నేపథ్యంలో ప్రభుత్వం హైడ్రా కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది.‘హైడ్రా’వ్యవస్థ నిర్మాణంపై ఫోకస్కనీసం మూడు నెలల పాటు హైడ్రా ఆపరేషన్లు నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ సమయంలో హైడ్రాకు సంబంధించిన పలు అంశాలను చక్కదిద్దనున్నట్టు సమాచారం. ప్రస్తుతం హైడ్రాకు పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. ఇటీవలే వివిధ విభాగాల నుంచి 169 మందిని డిప్యూటేషన్‌పై నియమించారు. కానీ పోలీసు విభాగం నుంచి వచ్చిన 20 మంది మినహా మరే ఇతర విభాగాల సిబ్బంది హైడ్రా విధుల్లో చేరలేదు. మరోవైపు హైడ్రాలో చేరేందుకు ఆసక్తి చూపుతూ కొందరు ఉద్యోగులు దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే వారిని రిలీవ్ చేయడానికి పలువురు శాఖాధిపతులు విముఖత చూపుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం హైడ్రా వినియోగిస్తున్న కార్యాలయంతోపాటు సిబ్బందిలో దాదాపు అంతా జీహెచ్ఎంసీకి సంబంధించిన వారే. ఈ విషయంలో అటు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు, ఇటు హైడ్రాకు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సంస్థాగత అంశాలు, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టనున్నారు.జల వనరుల ‘లెక్క’తేల్చేలా..జల వనరుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా హైడ్రాను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. తొలిదశలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలకు సంబంధించిన ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్)లో ఉన్న ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ చేపట్టడానికి ముందు ఆయా చెరువులు, వాటి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తికాకపోవడాన్ని ఇటీవల న్యాయస్థానం సైతం ప్రశ్నించింది. దీనికోసం రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాలతోపాటు హెచ్ఎండీఏ ఉమ్మడిగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. తొలుత ప్రాథమిక, ఆపై తుది నోటిఫికేషన్లు జారీ చేయాలి. హెచ్ఎండీఏ లెక్కల ప్రకారం హైదరాబాద్‌తోపాటు శివారు జిల్లాల్లో కలిపి 2,688 జలవనరులు ఉన్నాయి. వీటిలో 2,364 ప్రిలిమినరీ నోటిఫికేషన్ స్థితి దాటగా, 324 మాత్రమే తుది నోటిఫికేషన్ దాకా వెళ్లాయి. 95 చెరువులకు హైడ్రా ఏర్పడిన తర్వాతే ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ క్రమంలో వచ్చే మూడు నెలల్లో అన్ని చెరువుల సర్వే పూర్తి చేసి, తుది నోటిఫికేషన్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
తప్పు చేయకూడదనే దానికి ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నీటి పారుదల శాఖ లో కొత్తగా నియమకమైన 700 మంది ఏఈఈలకులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. ఎర్రమంజిల్‌లో జలసౌధలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ఇరిగేషన్‌ను ప్రపంచానికి చాటేలాగా అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. జలవివాదాలు కారణంగా ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. తెలంగాణలో ప్రాజెక్టులు ఎందుకు ఆలస్యం అయ్యాయో గత పది ఏళ్లలో చేశామని, ఆ పరిస్థితి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల రూపాయలు ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశామని తెలిపారు.‘నీళ్లు, నియామకాల ఆకాంక్షల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నీళ్లు మన సంస్కృతిలో భాగస్వామ్యం.. అలాంటి శాఖకు మీరు ప్రతినిధులుగా నియామకమవుతున్నారు. తెలంగాణ ఏర్పడిన దశాబ్దం తరువాత నియామకాల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇది మీకు ఉద్యోగం కాదు.. ఇది మీకు ఒక భావోద్వేగం. తెలంగాణ ప్రజల భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉంది. వారి భావోద్వేగాలకు అనుగుణంగా నీళ్లను ఒడిసిపట్టి ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఏ వృత్తిలోనైనా క్షేత్ర స్థాయిలో అనుభవం ఉన్నవాళ్లే రాణిస్తారు. రాజకీయాల్లోనూ క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన వారే ఎక్కువ రాణిస్తారు.పీవీ నరసింహారావు, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నీలం సంజీవ రెడ్డి లాంటి వారు సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రులు, ప్రధానులుగా ఎదిగారు. నేను కూడా జిల్లా పరిషత్ మెంబర్ స్థాయి నుంచే సీఎం స్థాయికి వచ్చా. గతంలో ఇంజనీర్లు ఉదయం 5 గంటలకే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లేవారు. ఫీల్డ్ విజిట్ చేసాకే రిపోర్టులు రాసే వారు. కానీ ఈ మధ్య క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లే వారు తగ్గిపోయారు. మేం అధికారంలోకి వచ్చాక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందేనని ఆదేశించాం. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు లక్ష కోట్లు ఖర్చు చేస్తే.. కట్టడం కూలడం రెండూ జరిగాయి. అధికారులు జీవితంలో ఎలాంటి తప్పు చేయకూడదో దానికి ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు. దీనికి ఎవరిని బాధ్యులను చేయాలో మీరే చెప్పాలి. అధికారులనా? రాజకీయ నాయకులనా?.మీ మోడల్ స్టడీకి కాళేశ్వరమే సరైన ఉదాహరణ. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోండి. కాళేశ్వరం విషయంలో అందరిపై చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంటే ఉండదు. చర్యలు తీసుకోకపోతే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈఈ చెప్పారని ఒకరు, ఎస్ఈ చెప్పారని ఇంకొకరు.. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు తీసుకునే తప్పుడు నిర్ణయాలను అమలు చేయకుండా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అయ్యేవి కాదు. లక్ష కోట్లు ఖర్చు చేసినా లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు.పదేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం ఏమిటో గమనించండి. 2లక్షల కోట్లు ఖర్చు చేసినా తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు. భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కావొద్దు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో నీళ్లు అత్యంత కీలకం.ప్రాజెక్టుల పూర్తికి క్షేత్ర స్థాయిలో పని చేయాలి. రికమెండేషన్‌తో వచ్చే వారికి సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చి పనిష్మెంట్ ఇవ్వండి. పని మీద శ్రద్ధ పెట్టండి.. పోస్టింగ్‌ల మీద కాదు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తే తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలబడుతుంది. క్షేత్రస్థాయిలో పని చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి.’ అని పేర్కొన్నారు. -
కాంట్రాక్టర్లకు బిల్లుల కోసమే ‘కాళేశ్వరం’ కార్పొరేషన్!
సాక్షి, హైదరాబాద్: బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొంది కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం కోసమే కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటైందని నీటిపారుదల శాఖ చీఫ్ అకౌంట్స్ అధికారి పద్మావతి, కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ అధికారి కొమర్రాజు వెంకట అప్పారావు వెల్లడించారు. కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. బుధవారం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న ముగ్గురు అధికారులను వేర్వేరుగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. నాటి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ ఆదేశాలతో కార్పొరేషన్ రుణాలను సమీకరించిందని ఓ ప్రశ్నకు సమాధానంగా కొమర్రాజు వెంకట అప్పారావు తెలిపారు. కాళేశ్వరం కార్పొరేషన్‌కు స్వతహాగా ఆదాయం ఏమీ లేదన్నారు. రుణా లు మంజూరైన వెంటనే కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరపకుండా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని.. వాటిపై వచ్చే వడ్డీలతో కార్పొరేషన్ నిర్వహణ జరుగుతోందని చెప్పారు. కాంట్రాక్టర్ల బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీలను సైతం కార్పొరేషన్ అవసరాలకు వాడుకుంటున్నామని వివరించారు. పూర్తయిన పనులన్నింటినీ కార్పొరేషన్ ఆస్తులుగానే పరిగణిస్తామని తెలిపారు. రామగుండం ఫెర్టిలైజర్, ఎనీ్టపీసీ నుంచి నీటి విడుదలకు సంబంధించిన బిల్లులు 2023 నుంచి వస్తున్నాయని వివరించారు. కొలతలు చూశాకే బిల్లులు ఇస్తారా? అని కమిషన్ ప్రశ్నించగా.. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సిద్ధం చేసిన బిల్లులను పేఅండ్‌అకౌంట్స్ విభాగం పరిశీలించి కార్పొరేషన్‌కు పంపిస్తుందని, తర్వాత చెల్లింపులు చేస్తామని బదులిచ్చారు. కాగ్ అభ్యంతరాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు.మిమ్మల్ని మీరే రక్షించుకోవాలినీటి పారుదల శాఖ బడ్జెట్ రూపకల్పనలో మీ పాత్ర ఏమిటని ఆ శాఖ చీఫ్ అకౌంట్స్ అదికారి పద్మావతిని కమిషన్ ప్రశ్నించగా.. చీఫ్ ఇంజనీర్ల నుంచి వివరాలను సేకరించి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపిస్తానని ఆమె బదులిచ్చారు. కార్పొరేషన్ రుణాల తిరిగి చెల్లింపు కోసం ప్రభు త్వం బడ్జెట్లో నిధులు కేటాయిస్తోందని తెలిపారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ అభ్యంతరాల విషయంలో మీ అభిప్రాయమేంటి? రుణాలపై నిర్వహించిన సమావేశాల్లో గత ప్రభుత్వంలోని సీఎంఓ అధికారులు పాల్గొన్నారా? ప్రాజెక్టుతో ఆర్థికభారం పడే అవకాశం ఉండటంతో ఆర్థిక క్రమశిక్షణ కోసం సలహాలు ఏమైనా ఇచ్చారా?’ కమిషన్ ప్రశ్నించగా.. ఆమె సమాధానం దాటవేసినట్టు తెలిసింది. ‘కాళేశ్వరం ప్రాజెక్టుతో పడే ఆర్థిక భారం? దీనికి మీ సమర్థన ఉందా? రాష్ట్రంపై ఈ భారం రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది? మీ బాధ్యతగా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారా?’ అన్న ప్రశ్నలకు తాను జవాబు చెప్పలేనని పేర్కొన్నట్టు సమాచారం. ఇక ఆర్థిక క్రమశిక్షణ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకున్నదెవరని ప్రశ్నించగా.. అది చాలా విస్తృతమైన అంశమని, దానిపై తానేమీ చెప్పలేనని చెప్పినట్టు తెలిసింది. దీంతో కమిషన్ కొంత ఘాటుగా స్పందిస్తూ.. ‘‘విచారణ సందర్భంగా ఎవరినో రక్షించే ప్రయత్నం చేయవద్దు. మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. విచారణలో వాస్తవాలనే తెలపాలి. దాపరికాలు వద్దు’’ అని పేర్కొన్నట్టు సమాచారం. మరోవైపు బిల్లులను పరిశీలించి చెల్లింపులకు సిఫారసు చేయడమే తన బాధ్యత అని వర్క్ అకౌంట్స్ డైరెక్టర్ ఫణిభూషణ్ శర్మ కమిషన్‌కు వివరించారు. కాగ్ నివేదికలోని ఒకటి రెండు విషయాలు మాత్రమే వాస్తవాలని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచి్చందని తెలిపారు. -
‘దుర్గం చెరువు’ దోషులు అధికారులే!
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: ‘‘హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హుడా) అనుమతులు ఇచ్చిందంటే ప్రభుత్వం ఇచ్చినట్టే కదా! నీటి పారుదల శాఖ ఇచ్చిన నిరభ్యంతర పత్రాల(ఎన్వోసీ) మేరకే ఇళ్లు, భవనాలు నిర్మించాం. 30 ఏళ్లు దాటింది. ఇప్పుడు ఏకంగా 204 నిర్మాణాలు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయంటూ నోటీసులు ఇచ్చారు. ఇక్కడ దోషులెవరు? ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఈ లేఅవుట్లు ఉన్నట్టు అప్పుడే నిర్ధారిస్తే.. ఇప్పుడు కూల్చివేతలు ఉండేవి కాదు కదా’’.. .. దుర్గం చెరువు సమీపంలోని నెక్టార్ గార్డెన్‌కు చెందిన ఓ ఇంటి యజమాని ఆందోళన ఇది. ఆయనే కాదు.. గత 30 ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్న చాలా మంది తమ ఇళ్లు, భవనాలు చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఉన్నాయంటూ నోటీసులు ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క దుర్గం చెరువు ప్రాంతంలోనే కాదు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, నాలాలను ఆనుకొని నిర్మించిన విల్లాలు, అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలకు ఇరిగేషన్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, తదితర ప్రభుత్వ విభాగాలు అనుమతులు ఇచ్చాయి. ఇప్పుడేమో అధికారులు ఆ ఇళ్లు ఎఫ్టీఎల్ పరిధిలో, బఫర్‌జోన్‌లో ఉన్నట్టు నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. నోటీసులు ఇచ్చిన తహసీల్దార్ దుర్గం చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఇళ్లు నిర్మించారంటూ.. శేరిలింగంపల్లి తహసీల్దార్ వెంకారెడ్డి ఈ నెల 5న వాల్టా చట్టం కింద అమర్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, కావూరిహిల్స్, నెక్టార్ గార్డెన్లలో ఉన్న 204 నిర్మాణాలకు నోటీసులు ఇచ్చారు. 30 రోజుల్లో నిర్మాణాలను తొలగించుకోవాలని పేర్కొన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చే నిర్మాణాలకు ‘ఎఫ్’అని.. కొంతభాగం ఎఫ్టీఎల్లోకి వస్తే ‘ఎఫ్/పీ’అని.. బఫర్‌జోన్‌లోకి వచ్చే నిర్మాణాలపై ‘బీ’అని గోడలపైన రాశారు. రాజకీయ, సినీ ప్రముఖులు, ఉన్నతాధికారులు కూడా ఈ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. ఓ పర్యావరణవేత్తకు చెందిన ఇల్లు కూడా ఉన్నట్టు సమాచారం. అమర్ సొసైటీలో సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు కూడా ఉంది. ఎకరా రూ.వంద కోట్లపైనే..! దుర్గం చెరువు ప్రాంతంలో ఆక్రమణకు గురైన భూముల ప్రస్తుత మార్కెట్ విలువ ఎకరానికి రూ.వంద కోట్లపైనే ఉంటుందని అంచనా. చదరపు గజం విలువే రూ.2 లక్షలపైన ఉంటుంది. హైటెక్‌సిటీని ఆనుకొని ఉన్న దుర్గం చెరువు ప్రాంతం రియల్టర్లకు, బిల్డర్లకు హాట్‌కేక్‌లా మారింది. దాంతో రెండు, మూడు దశాబ్దాల క్రితం నుంచే కబ్జాల పర్వం మొదలైంది. ఈ అక్రమ నిర్మాణాలకు అందరూ బాధ్యులే. అప్పటి ప్రభుత్వ పెద్దలు, రాజకీయ ప్రముఖుల నుంచి అక్రమ లేఅవుట్లకు అడ్డగోలుగా అనుమతులిచ్చిన హుడా అధికారులు.. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు ఆక్రమణకు గురవుతున్నట్టు తెలిసినా ఎన్వోసీలు ఇచ్చిన నీటిపారుదల, రెవెన్యూ అధికారులు కూడా బాధ్యులే. నిజాం కాలంలో నిర్మించిన దుర్గం చెరువు రెండు గుట్టల మధ్య సుమారు 160.7 ఎకరాలకుపైగా విస్తరించి ఉండేది. రాయదుర్గం పాయెగాలో 62ఎకరాలు, మాదాపూర్ సర్వే నం.63, 64లలో 28 ఎకరాలు, గుట్టల బేగంపేట్ సర్వే నంబర్లు 42 నుంచి 61 వరకు 70.7 ఎకరాల విస్తీర్ణంలో దుర్గంచెరువు ఉండేది.హుడా ఆమోదంతో నిర్మాణాలు.. ఈ ప్రాంతంలో 1991లో మొదట అమర్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సోసైటీ 15 ఎకరాల విస్తీర్ణంలో 150 ప్లాట్లతో లేఅవుట్ చేసింది. అయితే చెరువు చుట్టూ 30 అడుగుల పరిధిలో స్థలాన్ని గ్రీన్‌బెల్ట్ కోసం కేటాయించిన హుడా.. 130 ప్లాట్లకు 1995లో తుది ఆమోదం ఇచ్చింది. ఈ క్రమంలోనే వరుసగా కావూరి హిల్స్, నెక్టార్ గార్డెన్ గేటెడ్ కమ్యూనిటీలకు కూడా హుడా ఆమోదం లభించింది. నెక్టార్ గార్డెన్ పూర్తిగా, కావూరి హిల్స్‌లోని కొంత భాగం దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉంది. గతంలో భారీ వర్షాలు వచ్చినప్పుడు కావూరి హిల్స్, నెక్టార్ గార్డెన్, అమర్ సొసైటీలలోకి వరద నీరు చేరేది. దీనితో దుర్గంచెరువు పూర్తిగా నిండకుండా, ఎప్పటికప్పుడు నీటిని కిందికి వదిలేస్తూ.. ఎఫ్‌టీఎల్‌పై ఫోకస్ పడకుండా చేశారు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఒత్తిడి తీసుకొచ్చి వర్షాకాలంలో దుర్గం చెరువు గేట్లు మూసివేయ కుండా చూసుకుంటూ వస్తున్నారు. అయితే చెరువు సుందరీకరణ పేరిట చుట్టూ వాకింగ్ ట్రాక్ వేయడంతో.. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వారికి అదో రక్షణ గోడగా మారిపోయింది.అధికారులు ఏమంటున్నారు? 2013లో సుమారు 160.7 ఎకరాల్లో దుర్గం చెరువు విస్తీర్ణాన్ని గుర్తిస్తూ ఎఫ్టీఎల్ను నిర్ధారించామని ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. నీటిపారుదల, రెవెన్యూ శాఖల నుంచి వచ్చిన ఎన్వోసీల మేరకు అనుమతులను ఇచ్చినట్లు హెచ్ఎండీఏ అధికారులు అంటున్నారు. ఇక ‘‘ప్రభుత్వం ఆమోదించిన మాస్టర్ ప్లాన్‌ను పరిగణనలోకి తీసుకుంటాం. చాలా చోట్ల కాలువలను పూర్తిగా మూసివేయడం వల్ల బ్యాక్ వాటర్ వచ్చి చేరుతుంది. దీంతో ఎఫ్టీఎల్ నిర్ధారణలో శాస్త్రీయత లోపిస్తోంది’’అని హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగానికి చెందిన అధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం.అక్రమమైతే కూల్చేయండి.. వాల్టా చట్టం రాకముందే 1995లో లేఅవుట్‌కు ఆమో దం లభించింది. హుడా అనుమతితోనే ఇళ్లు నిర్మించారు. 2016లో 600 చదరపు గజాల స్థలంలో ఇల్లు కొనుగోలు చేశాం. ఈ ప్రాంతం చెరువు పరిధిలోకి వస్తుందన్న సమాచారమేదీ లేదు. ఇప్పుడు బఫర్ జోన్లోకి వస్తుందంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్రమ మైతే కూల్చేయండి, ముఖ్యమంత్రి నా ఒక్కడి కోసం పనిచేయడం లేదు కదా! బీఆర్ఎస్ నాయకులు నా ఇంటి విషయంలో రాజకీయం చేస్తున్నారు. – సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిభయభ్రాంతులకు గురిచేయొద్దు 1995లో హుడా అనుమతి ఇవ్వడంతోనే ప్లాట్లు కొనుగోలు చేసి ఇ ళ్లు కట్టుకున్నాం. ఇప్పటికీ ఈఎంఐలు కట్టేవారు ఉన్నారు. 2023 లో జీహెచ్ఎంసీ హైపవర్ కమిటీ ఈ ప్రాంతం ఎఫ్టీఎల్లోకి రాదని తేల్చింది. ప్రభుత్వాలు మారితే ఎఫ్టీఎల్ మారుతుందా? – అమర్ కో–ఆపరేటివ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి గోపాల కృష్ణారెడ్డిఇళ్లు కట్టాలంటే ఏ అనుమతులు ఉండాలిగ్రీన్బెల్ట్ను వదిలి అమర్ సొసైటీ లేఅవుట్‌కు హుడా అధికారులు ఆమోదం తెలిపారు. అనుమతి ఉన్న లేఅవుట్లో ప్లాట్ తీసుకొని, ఇంటి నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ అనుమతి తీసుకున్నాం. హైదరాబాద్‌లో ఇళ్లు కట్టుకోవాలంటే ఇంకా ఏమేం అనుమతులు తీసుకోవాలో చెప్పండి. – పోలవరపు శ్రీనివాస్, అమర్ సొసైటీ వాసి -
‘కృష్ణా’లో సిరుల పంట
సాక్షి, హైదరాబాద్: కృష్ణా ప్రాజెక్టుల కింద ఈ ఏడాది సిరుల పంట పండనుంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కృష్ణా నది పరీవాహకంలోని చిన్నా, పెద్దా అన్ని ప్రాజెక్టుల కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేసేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ సిద్ధమైంది. కృష్ణా ప్రాజెక్టుల కింద ఉన్న 14.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు 125 టీఎంసీలు.. గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల కింద 17.95లక్షల ఎకరాల ఆయకట్టుకు 188 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. శనివారం జలసౌధలో నీటి పారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్ నేతృత్వంలో రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) సమావేశమైంది. కృష్ణా, గోదావరి బేసిన్ల లోని జలాశయాల్లో ప్రస్తుత నీటి లభ్యత, సమీప భవిష్యత్తులో రానున్న వరద ప్రవాహాల అంచనాపై విస్తృతంగా చర్చించింది. రాష్ట్రంలోని భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల కింద.. ప్రస్తుత ఖరీ ఫ్లో మొత్తం 33లక్షల ఎకరాలకు 314 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయాలని తీర్మానించింది. ఈ ప్రతిపాదనలను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించి ఆమోదం పొందనుంది. సమావేశంలో ఈఎన్సీ (ఓఅండ్ఎం) బి.నాగేందర్రావుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చీఫ్ ఇంజనీర్లు పాల్గొని తమ పరిధిలోని ప్రాజెక్టుల పరిస్థితి, ఆయకట్టుకు సాగునీటి సరఫరా కోసం ప్రతిపాదనలు సమరి్పంచారు. కృష్ణాలో ముగిసిన క్రాప్ హాలిడే.. గత ఏడాది కృష్ణా బేసిన్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నీళ్లు లేక వెలవెలబోయాయి. దీనితో గత రబీలో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల కింద క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వచ్చింది. ప్రస్తుతం బేసిన్ పరిధిలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, మూసీ తదితర ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీటి లభ్యత ఉండటంతో.. అన్ని ప్రాజెక్టుల కింద పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందనుంది. జూన్‌లో వర్షాకాలం మొదలవగా.. రెండు నెలల్లోనే శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నిండిపోయాయి. ఎగువ నుంచి కృష్ణాలో భారీ వరద కొనసాగుతోంది. దీనితో పరీవాహక ప్రాంతంలో ఆయకట్టుకు ఈ ఏడాది ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. నీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారమే నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు సాగునీటి విడుదలను ప్రారంభించడం గమనార్హం. సాగర్ నుంచి ఇంత ముందే నీళ్లు విడుదల చేయడం గత పదేళ్లలో ఇది రెండోసారి. 2021లో సైతం ఆగస్టు 2వ తేదీనే సాగర్ నుంచి సాగునీటి విడుదల ప్రారంభించారు. గోదావరిలో లోయర్ మానేరు దిగువన కష్టమే..! గోదావరి నదిలో పైనుంచి వరదలు పెద్దగా రాక.. ఎగువన ఉన్న ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఆశించిన మేరకు లేకుండా పోయింది. ఈ క్రమంలో లోయర్ మానేరు ప్రాజెక్టు వరకు ఉన్న ఆయకట్టు వరకే నీటి సరఫరాపై స్కివం కమిటీ నిర్ణయం తీసుకుంది. దాని దిగువన ఉన్న ప్రాజెక్టులతోపాటు సింగూరు ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటి సరఫరాపై మరో 15 రోజుల తర్వాత సమావేశమై.. అప్పటి నీటి లభ్యత ఆధారంగా నిర్ణయాలు తీసుకోనున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 42.81 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఎగువ నుంచి కాస్త వరద కొనసాగుతోంది. దీనితో ఈ ప్రాజెక్టు కింద మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆనికట్‌కు నీళ్లను తరలించి దాని కింద ఉన్న 21వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. -
పంపింగ్ ప్రారంభం.. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలు షురూ
సాక్షి, హైదరాబాద్/రామగుండం/ధర్మారం: అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన పంప్‌హౌస్‌ల ద్వారా నీటి పంపింగ్ ప్రక్రియను శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోని నీళ్లను నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా నందిమేడారం, మిడ్‌మానేరు జలాశయాల్లోకి ఎత్తిపోస్తున్నారు. ఆగస్టు 2లోగా కాళేశ్వరం పంప్‌హౌస్‌లను ఆన్ చేయకుంటే 50వేల మంది రైతులతో కలిసి తామే ఆన్ చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో పంపింగ్ ప్రారంభం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు దెబ్బతిని ఉండడంతో వాటిలో నీటి నిల్వలు చేయరాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ కోరిందని, దీంతో ఈ మూడు జలాశయాల నుంచి నీళ్లను పంపింగ్ చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలించడం సాధ్యం కాదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బదులిచి్చన విషయం తెలిసిందే. అయితే, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్‌మానేరుకు, అక్కడి నుంచి అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌కు నీటిని తరలిస్తామని ప్రకటించారు. మంత్రి ప్రకటన మేరకు నీటిపారుదల శాఖ శనివారం నుంచే పంపింగ్ ప్రారంభించింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా భారీ వర్షాలతో వస్తువన్న వరదలతో శనివారం 17.34 టీఎంసీలకు నిల్వలు చేరాయి. 14,358 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. నంది, గాయత్రి పంపుహౌస్‌ల ద్వారా శనివారం ఎత్తిపోతలు ప్రారంభించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు గ్రావిటీ కాలువ ద్వారా తరలివస్తున్న నీటిని ధర్మారం మండలం నందిమేడారం వద్ద ఉన్న నంది పంప్‌హౌస్ ద్వారా నందిమేడారం రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నారు. మొత్తం 7 పంపులు ఉండగా, 4 పంప్‌లను ఆపరేట్ చేస్తూ 13,076 క్యూసెక్కులను తరలిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఒక మోటారును ఆన్‌చేసిన అధికారులు.. సాయంత్రం 6గంటల వరకు మరో మూడు విద్యుత్ మోటార్లు రన్ చేశారు. నందిమేడారం రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తి రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద గల గాయత్రి పంప్‌హౌస్‌లోకి అంతే స్థాయిలో 13,076 క్యూసెక్కులను తరలిస్తున్నారు. గాయత్రి పంప్‌హౌస్‌లోని నాలుగు బాహుబలి పంపుల ద్వారా నీళ్లను గ్రావిటీ కాల్వలోకి ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి ఆ నీళ్లు మిడ్‌మానేరుకు తరలిపోతున్నాయి. నీటి పంపింగ్ ప్రారంభం కావడంతో మడుగు, గంగాధర, బోయినపల్లి మండలాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మంత్రి ఉత్తమ్ ఆదేశాలతో మధ్యమానేరుకు నీటిని ఎత్తిపోస్తున్నామని, దీనిని రైతులు సది్వనియోగం చేసుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు.