సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ కనీస నీటి మట్టానికి పడిపోయింది. తెలుగు రాష్ట్రాలు తమ అవసరాలకోసం నీటిని వినియోగిస్తుండటంతో గురువారం ఉదయానికి ప్రాజెక్టు నిల్వలు కనీస నీటి మట్టం 834 అడుగులకు చేరింది. వేసవి ఇంకా పూర్తి స్థాయిలో ఆరంభం కాకముందే నిల్వలు తగ్గడం ఇరు రాష్ట్రాలకు మున్ముందు కష్టాలు తెచ్చిపెట్టే అవకాశాల నేపథ్యంలో మున్ముందు వినియోగంపై నియంత్రణ అవసరమని కృష్ణాబోర్డు ఇరు రాష్ట్రాలను హెచ్చరించింది.
సాగర్ ఒక్కటే దిక్కు..?
ఈ సీజన్‌లో విస్తారంగా కురిసిన వర్షాల నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టుకు 1,784 టీఎంసీల వరద వచ్చింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలు మొత్తంగా 675 టీఎంసీల నీటిని వినియోగించుకున్నాయి. ఇందులో ఏపీ 513, తెలంగాణ162 టీఎంసీల వినియోగం చేసినట్లు కృష్ణాబోర్డు లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం సైతం శ్రీశైలం ద్వారా వివిధ అవసరాల నిమిత్తం ఇరు రాష్ట్రాలు 3,591 క్యూసెక్కుల నీటిని వినియోగం చేసుకుంటున్నాయి. దీంతో గురువారం ఉదయానికి ప్రాజెక్టులో నీటి మట్టం 885 అడుగులకు గానూ కనీస నీటి మట్టం 834 అడుగులకు పడిపోయింది. నిల్వలు 215 టీఎంసీలకు గానూ 53.85 టీఎంసీలకు చేరాయి.
కనీస నీటి మట్టాలకు దిగువకు వెళ్లి నీటిని వినియోగించాలంటే కృష్ణాబోర్డు అనుమతి తప్పనిసరి. ఇప్పటికే బోర్డు, శ్రీశైలంలో రోజుకు 440 క్యూసెక్కుల మేర నీరు ఆవిరవుతోందని, దీంతో మట్టాలు మరింత వేగంగా తగ్గే అవకాశాలున్న దృష్ట్యా, శ్రీశైలం నుంచి నీటి విడుదలను తగ్గించాలని వారం కిందట సూచించింది. అయినప్పటికీ వినియోగం కొనసాగుతుండటంతో నిల్వలు కనీస నీటి మట్టానికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇకపై తాగు అవసరాలకు నాగార్జున సాగర్‌పైనే అధారపడాల్సి ఉంటుంది. సాగర్‌లో ప్రస్తుతం 590 అడుగులకు గానూ 551 అడుగుల్లో 212 టీఎంసీల నిల్వలున్నాయి. ఇందులో కనీస నీటి మట్టం 510 అడుగులకు ఎగువన వినియోగార్హమైన నీరు 86 టీఎంసీల మేర ఉంటుంది. ఈ నీటినే ఇరు రాష్ట్రాలు జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంది.
మిషన్ భగీరథ మట్టాల్లో మార్పులు..
మిషన్ భగీరథ కింద తాగు నీటి అవసరా లకు ఏటా 60 టీఎంసీల నీటి అవసరాలను అధికారులు గుర్తించి, దీనికి అనుకూలంగా కృష్ణాబేసిన్‌లోని 15, గోదావరి బేసిన్‌లోని 21 రిజర్వాయర్ల పరిధిలో తాగునీటిని తీసుకునేలా కనీస నీటి మట్టాలను గతంలో నిర్ధారించారు. ఈ ఏడాది మార్చి నుంచి జూలై వరకు తాగునీటికి 30 టీఎంసీల అవసరాలుంటాయని ఇప్పటికే సాగునీటి శాఖకు ప్రతిపాదించారు. ప్రాజెక్టుల్లో రెండు సీజన్‌లకు సరిపడేంత నీటి లభ్యత పెంచే ఉద్దేశంతో పలు ప్రాజెక్టుల పరిధిలో నీటి మట్టాలను పెంచాలని మిషన్ భగీరథ ఇంజనీర్లు ప్రతిపాదించారు. జూరాలలో కనీస నీటి మట్టాలు గతంలో 313.75 మీటర్లుగా ఉండగా, ప్రస్తుతం దాన్ని 315 మీటర్లకు పెంచాలని ప్రతిపాదించారు. ఎస్సారెస్పీలో గతంలో 320.35 మీటర్లు ఉండగా..322.67 మీటర్లకు, కడెంలో 204.21 మీటర్లకు గానూ 206.89 మీటర్లు, కొమరంభీమ్‌లో 234.60 మీటర్లకు గానూ 236.10 మీటర్లకు పెంచుతూ ప్రతిపాదించారు. ఇవి ప్రస్తుతం సాగునీటి శాఖ పరిశీలనలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment