సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టులను ఆయా బోర్డులకు అప్పగించే విషయం ఎటూ తేలడం లేదు. బోర్డుల భేటీలో నిర్ణయించిన మేరకు తొలిదశలో గుర్తించిన ప్రాజెక్టులను స్వాధీనం చేయాల్సి ఉన్నా తెలంగాణ తేల్చక పోవడంతో పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. గెజిట్ నోటిఫికేషన్ అమలుకు వీలుగా గోదావరి బేసిన్‌లోని పెద్దవాగును అప్పగిం చాలని తెలంగాణకు గోదావరి బోర్డు ఇప్పటికే లేఖ రాసింది.
కృష్ణా బేసిన్ ఔట్‌లెట్‌ల అప్పగింతపై ఒకట్రెండు రోజుల్లో కృష్ణా బోర్డు కూడా లేఖ రాయనున్నట్టు తెలిసింది. కృష్ణా బేసిన్‌లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లపై ప్రతిపాదించిన 15 ఔట్‌లెట్‌లలో 9 తెలంగాణ పరిధిలోనే ఉన్నాయి. అయితే ఇందులో శ్రీశైలం, నాగార్జున సాగర్‌పై ఉన్న 3 పవర్‌హౌస్‌లను అప్పగించేది లేదని తెలంగాణ తొలినుంచీ చెబుతోంది.
బచావత్ అవార్డుకు విరుద్ధం
ఈ ఔట్‌లెట్‌ల ఆపరేషన్ ప్రోటోకాల్‌పై రాష్ట్రం ఓ కమిటీని నియమించింది. కాగా ఆ కమిటీ ప్రాజెక్టుల స్వాధీనం, నిర్వహణకు సంబంధించి కృష్ణా బోర్డు తెరపైకి తెచ్చిన మార్గదర్శకాలు బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఉన్నాయని అభిప్రాయపడింది. కమిటీ అభిప్రాయాలను రాష్ట్రం బోర్డుకు తెలియజేసింది. కృష్ణా నీటి పంపిణీ, వినియోగం, ప్రాజెక్టుల ఆపరేషన్‌న్ ప్రొటోకాల్‌పై నిర్దిష్టమైన విధానాన్ని బచావత్ ఇప్పటికే స్పష్టీకరించిన నేపథ్యంలో దానినే బోర్డు అమలు చేయాలని డిమాండ్ చేసింది.
బోర్డు రూపొందించిన మార్గదర్శకాలు, నిర్వహణ విధానంలో అవసరమైన మార్పులు చేయాలని కోరింది. దీనిపై బోర్డులు ఎలాంటి వైఖరిని వెల్లడించలేదు. కానీ ఇటీవలే గోదావరి బేసిన్‌లోని పెద్దవాగు ప్రాజెక్టును అప్పగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి బీపీ పాండే తెలంగాణ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్‌కు లేఖ రాశారు. మరోవైపు ఔట్‌లెట్‌ల అప్పగింతపై కృష్ణా బోర్డు కూడా ఒకట్రెండు రోజుల్లో లేఖ రాయనున్నట్టు తెలిసింది.
అనంతరం తెలంగాణ స్పందించే తీరునుబట్టి తదుపరి కార్యాచరణను చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా గత బోర్డు భేటీలో తీర్మానించిన మేరకు ప్రాజెక్టులను తమకు అప్పగించాలనే అంశంపై సోమవారం బోర్డు సభ్య కార్యదర్శి, ఇతర సభ్యుల వద్ద కొంత కసరత్తు జరిగింది.
ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్‌ను బోర్డు పరిధిలోకి తెండి
రాజోలిబండ హెడ్‌వర్క్స్‌ను సైతం కృష్ణా బోర్డు పరిధిలోకి తేవాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ సోమవారం బోర్డుకు లేఖ రాశారు. గెజిట్ నోటిఫికేషన్ అమల్లో భాగంగా ప్రాజెక్టుల అప్పగింతపై కొన్ని ప్రాజెక్టులను గుర్తించినప్పటికీ అందులో తెలంగాణ, ఏపీలకు అవతలగా ఉందంటూ ఆర్డీఎస్ హెడ్ వర్క్స్‌ను బోర్డు పరిధి లోకి తేలేదని లేఖలో పేర్కొన్నారు.
ఆర్డీఎస్ కింద 15.90 టీఎంసీల మేర తెలంగాణ రాష్ట్రానికి వాడుకునే అవకాశం ఉందని, దీనిద్వారా 87,500 ఎకరాల ఆయకట్టు పారాల్సి ఉందని గుర్తు చేశారు. అయితే ఎన్నడూ తెలంగాణకు తగినంత నీరు రాలేదని, గడిచిన 15 ఏళ్లుగా కాల్వల ఆధునికీకరణ చేయాలని కోరుతున్నా.. ఏపీ సహకరించకపోవడంతో ఆ పనులు ముందుకు కదలడం లేదని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్రం వాటా ఇప్పించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment