krishna board
-
కరెంట్ కోసం ఖాళీ చేసేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ పోటీపడి జలవిద్యుదుత్పత్తి చేయడంతోపాటు సాగు, తాగునీటి అవసరాలకు రోజూ సగటున 40 వేల క్యూసెక్కుల నీటిని వాడుకుంటుండటంతో శ్రీశైలం జలాశయంలో నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. శనివారం ఉదయం 6 గంటలకు సేకరించిన నీటి వినియోగ లెక్కల ప్రకారం విద్యుదుత్పత్తి ద్వారా తెలంగాణ 35,315 క్యూసెక్కులను దిగువన సాగర్‌కు విడుదల చేస్తుండగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 8 వేల క్యూసెక్కులు, మల్యాల నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) కాల్వకు 1,688 క్యూసెక్కులను ఏపీ తరలిస్తోంది. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణ 1,600 క్యూసెక్కులను తోడుకుంటోంది. ప్రస్తుత నీటి సంవత్సరంలో శ్రీశైలం జలాశయానికి ఏకంగా 1,532.67 టీఎంసీల వరద వచి్చంది. జలాశయ గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకుగాను ప్రస్తుతం 149.42 టీఎంసీల నిల్వలు మాత్రమే మిగిలి ఉండటం గమనార్హం. కృష్ణా బోర్డు సూచనలు బేఖాతరు! మళ్లీ వర్షాకాలం వచ్చే వరకు శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లోని నిల్వలను సాగు, తాగునీటి అవసరాల కోసం సంరక్షించాలని కృష్ణా బోర్డు ఇరు రాష్ట్రాలకు ఇటీవల పలుమార్లు లేఖలు రాసింది. రెండు జలాశయాల్లో విద్యుదుత్పత్తిని తక్షణమే ఆపాలని కోరింది. దిగువ ప్రాంతాల్లో తాగు, సాగునీటి అవసరాలను తీర్చడానికే నీటిని తీసుకోవా లని సూచించింది. ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్–11లో జలవిద్యుత్‌కు అత్యల్ప ప్రాధా న్యత కల్పించిన విషయాన్ని గుర్తుచేసింది. అయితే బోర్డు సూచనలను ఇరు రాష్ట్రాలు బేఖాతరు చేస్తుండటంతో వేసవి ప్రారంభానికి ముందే శ్రీశైలం జలాశయంలో నిల్వలు అడుగంటిపోయే ప్రమాదముంది. అదే జరిగితే వేసవిలో సాగు, తాగు నీటి అవసరాలకు ఇబ్బందులు తప్పవు. గతేడాది తాగు, సాగునీటికి కటకట గతేడాది తీవ్ర వర్షాభావం నెలకొనడంతో శ్రీశైలం జలాశయం నిండలేదు. ఈ నేపథ్యంలో ఉన్న నిల్వలను తాగు, సాగునీటి అవసరాలకు పొదుపుగా వాడుకోవాలని.. జలవిద్యుదుత్పత్తి చేయొ ద్దని కృష్ణా బోర్డు కోరినా ఇరు రాష్ట్రాలు పోటాపోటీగా విద్యుదుత్పత్తి చేపట్టాయి. దీంతో గతేడాది సరిగ్గా ఇదే సమయానికి జలాశయంలో నిల్వలు 61.55 టీఎంసీలకు పడిపోయాయి. దీంతో గతే డాది వేసవిలో తాగు, సాగునీటికి రెండు రాష్ట్రాల్లోతీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి.నేడు కృష్ణా బోర్డు భేటీ.. హైదరాబాద్‌లోని జలసౌధలో సోమవారం కృష్ణా బోర్డు సమావేశం జరగనుంది. ఈ భేటీలో శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో విద్యుదుత్పత్తి అంశంపై ఇరు రాష్ట్రాల మధ్య వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. రెండు జలాశయాలను జలవిద్యుదుత్పత్తి అవసరాల కోసమే నిర్మించారని చాలా కాలంగా తెలంగాణ వాదిస్తోంది. రెండు జలాశయా ల్లోని తమ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి నిర్వహించాలని తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో)ను ఆదేశిస్తూ గత బీఆర్ఎస్ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసుపై విచారణ జరుగుతోంది. కృష్ణా బోర్డు భేటీలో ఇరు రాష్ట్రాలకు బోర్డు మళ్లీ కొత్త సూచనలు చేసే అవకాశం ఉంది. -
శ్రీశైలాన్ని ఖాళీ చేస్తున్నాపట్టించుకోరా?
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టుకు దిగువన తాగు, సాగు నీటి అవసరాలు ఉన్నప్పుడే బోర్డు కేటాయించిన నీటిని ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ తరలించాలన్నది విభజన చట్టం, కృష్ణా బోర్డు పెట్టిన నిబంధన. కానీ.. తెలంగాణ ప్రభుత్వం ఈ నిబంధనను తుంగలో తొక్కుతోంది. దిగువన ఎలాంటి నీటి అవసరాలు లేకున్నప్పటికీ శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్కో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలించేస్తోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 36,300 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. దాంతో ప్రాజెక్టులో నీటి మట్టం 874.4 అడుగులకు తగ్గిపోయింది. నీటి నిల్వ 160.91 టీఎంసీలకు పడిపోయింది. ఇదే కొనసాగితే శ్రీశైలం నీటి మట్టం 854 అడుగులకు దిగువకు చేరుకోవడానికి ఎంతో కాలం పట్టదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదే జరిగితే తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు కృష్ణా బోర్డు నీటిని కేటాయించినా వాడుకొనే అవకాశం ఉండదు. తద్వారా రాయలసీమ జిల్లాలు, నెల్లూరు జిల్లాలోని ప్రాజెక్టులకు నీళ్లందించలేని దుస్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం నోరు మెదపకపోవడంతో రైతులు, నీటి పారుదల రంగ నిపుణులు మండిపడుతున్నారు. ఆయకట్టులో పంటలు ఎండిపోతాయని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.తెలంగాణను నిలువరించని ప్రభుత్వంకృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను 2014లో తెలంగాణకు చంద్రబాబు తాకట్టు పెట్టిన పాపం ఇప్పటికీ వెంటాడుతోంది. తెలంగాణ ప్రభుత్వం బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తూ శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు కృష్ణా జలాలను తరలిస్తోంది. సాగర్ కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేయకుండా రాష్ట్ర హక్కులకు అడ్డుపడుతోంది. రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం 2021లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించి వివాదానికి తెర దించాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. దాంతో 2021 జూలై 15న కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దానికీ తెలంగాణ మోకాలడ్డుతుండటంతో రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడానికి 2023లో రాష్ట్ర భూభాగంలో ఉన్న సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్, స్పిల్ వే సగం అంటే 13 గేట్లను ఏపీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పుడు మళ్లీ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నా కూటమి ప్రభుత్వం నిలువరించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. రాష్ట్ర హక్కులు తెలంగాణకు తాకట్టువిభజన తర్వాత 2014లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటుచేసింది. బోర్డు పరిధిని నోటిఫై చేసే వరకూ ఉమ్మడి ప్రాజెక్టులలో శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలని కేంద్రం నిర్దేశించింది. కానీ.. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం తన భూభాగంలో ఉందంటూ తెలంగాణ సర్కారు అప్పట్లో దానిని తన ఆధీనంలోకి తీసుకుంది. ఇదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్, సాగర్ స్పిల్ వేలో 13 గేట్లను నాటి చంద్రబాబు సర్కారు స్వాధీనం చేసుకోలేదు. తెలంగాణలోనూ టీడీపీని బతికించుకోవాలనే రెండు కళ్ల సిద్ధాంతం.. ఆ తర్వాత ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను అప్పట్లోనే సీఎం చంద్రబాబు తెలంగాణకు తాకట్టు పెట్టేశారు. -
మాకు ‘సాగర్’ పగ్గాలివ్వాలి
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ పగ్గాలను తమకే అప్పగించాలని తెలంగాణ చేస్తున్న డిమాండ్‌తోపాటు ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీపై చర్చించడానికి డిసెంబర్ 3న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం జరగనుంది. హైదరాబాద్‌లోని జలసౌధలో జరగనున్న 19వ సమావేశం ఎజెండాలో మొత్తం 24 కీలక అంశాలను కృష్ణాబోర్డు చేర్చడంతో వీటిపై వాడీవేడీ చర్చ జరగనుంది. బోర్డు చైర్మన్, కన్వీనర్‌తోపాటు ఏపీ, తెలంగాణ అధికారులు హాజరు కానున్నారు. తెలంగాణ డిమాండ్లు ‘ఆనకట్టల భద్రత చట్టం 2021లోని సెక్షన్ 16(1ఏ) ప్రకారం నాగార్జునసాగర్ భద్రతకి సంబంధించిన నిఘా, 16(1బీ) ప్రకారంతనిఖీలు, 16(1సీ) ప్రకారం నిర్వహణ, పర్యవేక్షణ వంటి కార్యకలాపాలు తెలంగాణ పరిధిలోకే వస్తాయి. యావత్ జలాశయం కార్యకలాపాలన్నింటినీ తెలంగాణకే అప్పగించాలి. ఈ విషయంలో ఏపీ జోక్యానికి, తెలంగాణ విధుల ఆక్రమణకు తావులేదు. కృష్ణా బోర్డు సూచనల మేరకు రాష్ట్ర విభజన నాటి నుంచి సాగర్ డ్యామ్, కుడి, ఎడమ కాల్వల రెగ్యులేటర్ల నిర్వహణ, పర్యవేక్షణ తెలంగాణ చేతిలో ఉండగా, గతేడాది నవంబర్ 28న ఏపీ అధీనంలోకి తీసుకుంది. కుడికాల్వ రెగ్యులేటర్ నుంచి నీళ్లను విడుదల చేసింది. ఈ ఘటనకు పూర్వ స్థితిగతులను పునరుద్ధరించాలని కేంద్ర హోంశాఖ 2023 డిసెంబర్ 1న ఏపీని ఆదేశించింది’అనే అంశాలను తెలంగాణ సూచనల మేరకు ఎజెండాలో కృష్ణా బోర్డు పొందుపరిచింది. నో అన్న ‘అపెక్స్’.. మళ్లీ బోర్డుకు పంచాయతీ కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల వాటా నుంచి ఏపీ, తెలంగాణకు పంపకాలు జరగలేదు. రాష్ట్ర విభజన అనంతరం 2015లో కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశంలో 2015–16 అవసరాల కోసం ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను తాత్కాలికంగా కేటాయించారు. 2016–17లో సైతం ఇదే కేటాయింపులను కొనసాగించాలని 2016లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. దీని ఆధారంగానే 2017–18లో ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో నీటి పంపకాలు జరపాలని 2017లో కృష్ణా బోర్డు నిర్ణయించింది. 2021–22 వరకూ దీన్నే కొనసాగించారు. 2022–23లో దీని కొనసాగింపును తెలంగాణ వ్యతిరేకించింది. 50:50 నిష్పత్తిలో పంపిణీ జరపాలని తెలంగాణ కోరగా, 66:34 నిష్పత్తిలోనే కొనసాగించాలని ఏపీ పట్టుబట్టింది. తాత్కాలిక కోటాపై అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాన్ని కోరుతూ వివాదాన్ని కేంద్ర జలశక్తి శాఖకు కృష్ణా బోర్డు రెఫర్ చేయగా, అపెక్స్ కౌన్సిల్ నీటి పంపకాల జోలికి వెళ్లదని జలశక్తి శాఖ చెప్పింది. దీంతో వివాదం మళ్లీ కృష్ణా బోర్డుకు చేరింది. ఎజెండాలో కృష్ణా బోర్డు పొందుపరిచిన అంశాలివీ.. » కృష్ణా బోర్డు కార్యాలయం ఏపీకి తరలింపు. » గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం శ్రీశైలం, నాగార్జునసాగర్ నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగించాలి. » ఇరు రాష్ట్రాల్లోని అనధికార ప్రాజెక్టుల పనులను నిలుపుదల చేయాలి. » రెండో విడతలో 9 టెలీమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు నిధుల కేటాయింపు. తెలంగాణ ఇతర డిమాండ్లు » తాము వాడుకోకుండా నాగార్జునసాగర్‌లో పొదుపు చేసిన తమ వాటా జలాలను తదుపరి నీటి సంవత్సరంలో వాడుకోవడానికి అనుమతించాలి. » సాగర్ టెయిల్‌పాండ్ నుంచి విద్యుదుత్పత్తి ద్వారా ఏపీజెన్కో అనధికారికంగా 4 టీఎంసీలను విడుదల చేసింది. ఇప్పటికే కృష్ణా డెల్టాకు ఏపీ 117 టీఎంసీలను విడుదల చేసింది. ఇకపై టెయిల్‌పాండ్ విద్యుత్ కేంద్రం నుంచి వరదలున్నప్పుడే నీళ్లు విడుదల చేయాలి. సాగర్ టెయిల్‌పాండ్ డ్యామ్ గేట్ల నిర్వహణనూ తెలంగాణకే అప్పగించాలి. » ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునీకరణకు ఏపీ అడ్డుపడుతుండటంతో తమ వాటా జలాలను తీసుకోలేకపోతున్నాం. కృష్ణా ట్రిబ్యునల్–2 నీటి కేటా యింపులు జరిపే వరకు ఆర్డీఎస్ కుడికాల్వ పనులను కొనసాగించే అధికారం ఏపీకి లేదు. » ఏపీ నీటి వినియోగాన్ని లెక్కించడానికి శ్రీశైలం, సాగర్, ప్రకాశం, సుంకేశుల బరాజ్‌ల వద్ద టెలిమెట్రీ స్టేషన్లను ఏర్పాటు చేయాలి. » రాయలసీమ ఎత్తిపోతలతో సహా అనుమతుల్లేకుండా కృష్ణా బేసిన్లో ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులు, ఎస్ఆర్ఎంసీ కాల్వ లైనింగ్ పనులను నిలుపుదల చేయాలి. » శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్, తెలుగు గంగ, హెచ్ఎన్ఎస్, నిప్పులవాగు ఎస్కేప్ చానల్ ఇతర మార్గాల ద్వారా బేసిన్ వెలుపలి ప్రాంతాలకు కృష్ణా జలాలను ఏపీ చేపట్టరాదు. » శ్రీశైలం జలాశయం ప్లంజ్ పూల్‌కి ఏపీ అత్యవసర మరమ్మతుల నిర్వహించాలి. -
శ్రీశైలం, సాగర్‌ను ఖాళీ చేస్తారా?
సాక్షి, అమరావతి: శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో విద్యుదుత్పత్తిని నిలిపేసి, జలాలను సంరక్షించాలన్న తమ ఆదేశాలను ఏపీ తెలంగాణ రాష్ట్రాలు ఉల్లంఘించడంపై కృష్ణా బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు రాష్ట్రాలపై చర్యలకు ఉపక్రమించింది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో పోటీ పడి విద్యుదుత్పత్తి చేస్తూ జలాశయాలను ఖాళీ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు రాష్ట్రాల నీటి పారుదల అధికారులతో మళ్లీ రిజర్వాయర్ నిర్వహణ కమిటీ (ఆర్ఎంసీ) సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ ద్వారా శుక్రవారం ఈ సమావేశం నిర్వహిస్తామని బోర్డు సభ్యులు ఆర్ఎన్ శంఖ్వా ఇరు రాష్ట్రాలకు లేఖ రాయగా.. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తితో వాయిదా వేశారు. ఈ నెల 25 తర్వాత సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.ఏడాది తర్వాత ఆర్ఎంసీ సమావేశంశ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి నిల్వలపై సరైన పర్యవేక్షణ, జల విద్యుత్ కేంద్రాల నిర్వహణకు మార్గదర్శకాలను ఖరారు చేయడం ఆర్ఎంసీ ప్రధాన ఉద్దేశం. శ్రీశైలం, సాగర్ నిర్వహణకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) రూపొందించిన ముసాయిదా నిబంధనలను పరిశీలించి, అవసరమైన సవరణలతో తుదిరూపు ఇవ్వడం, జలాశయాలన్నీ నిండిన తర్వాత రెండు రాష్ట్రాలు జరిపే మిగులు జలాల వినియోగాన్ని లెక్కిల్లోకి తీసుకోకుండా మినహాయింపు కల్పించడంపైనా చర్చించి నిర్ణయం తీసుకోవాలని కూడా కృష్ణా బోర్డు ఆర్ఎంసీని కోరింది. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఆర్ఎంసీ పలు దఫాలుగా సుదీర్ఘ చర్చలు జరిపినా ఏకాభిప్రాయం కుదరలేదు. మళ్లీ ఏడాదికి పైగా విరామం తర్వాత కృష్ణా బోర్డు ఆర్ఎంసీ సమావేశాన్ని తలపెట్టడం గమనార్హం.21న కృష్ణా బోర్డు సమావేశంకృష్ణా బోర్డు 19వ సర్వ సభ్య సమావేశం ఈ నెల 21న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో జరగనుంది. బోర్డు చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వర రావు, తెలంగాణ నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ జి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొననున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య తాత్కాలిక కృష్ణా జలాల సర్దుబాటుతో పాటు ఇతర అంశాలపై చర్చించనున్నారు. -
హంద్రీ–నీవాకు నీళ్లిచ్చేదెప్పుడు?
సాక్షి, అమరావతి : శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తున్నా, మన రాష్ట్రంలోని హంద్రీ–నీవా ప్రాజెక్టు గురించి మాత్రం ఏపీ సర్కారు పట్టించుకోవడం లేదు. శ్రీశైలం ప్రాజెక్టులో గురువారం నాటికి నీటి మట్టం కనీస స్థాయికి అంటే 854 అడుగులకు పైగా చేరింది.. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి రెండు లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది.. కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండానే ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ 31,784 క్యూసెక్కులను ప్రాజెక్టు నుంచి దిగువకు తరలిస్తోంది.. జూన్ 3 నాటికి శ్రీశైలం ప్రాజెక్టులో 806.3 అడుగుల్లో 32.19 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీటి తరలింపు ప్రారంభించింది.. కానీ ఇప్పటికీ హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోయడంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.నైరుతి రుతు పవనాల ప్రభావం వల్ల రాయలసీమలోని అధిక ప్రాంతాల్లో చెదురుముదురు వర్షాలే కురిశాయి. హంద్రీ–నీవాలో అంతర్భాగమైన జలాశయాలు.. కాలువకు ఇరు వైపులా ఉన్న చెరువులు నీళ్లు లేక నోళ్లు తెరుచుకోవడం.. భూగర్భ జల మట్టం తగ్గిపోవడంతో తాగు, సాగునీటికి సీమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా జూన్ 3 నుంచే తెలంగాణ సర్కార్ నీటిని తరలిస్తున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం హంద్రీ–నీవాకు నీటిని విడుదల చేయక పోవడంపై రైతులు మండిపడుతున్నారు. రాయలసీమపై సీఎం చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో మరోసారి నిరూపితమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లూ రాయలసీమ సస్యశ్యామలం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 120 రోజుల్లో 40 టీఎంసీలను తరలించి ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మంది దాహార్తి తీర్చి.. రాయలసీమను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా రూ.6,850 కోట్లతో 2004లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించారు. 2009 నాటికే చాలా వరకు పనులు పూర్తవడంతో 2012–13 నుంచి హంద్రీ–నీవా ద్వారా రాయలసీమకు ప్రభుత్వం నీటిని తరలిస్తోంది. ప్రస్తుత డిజైన్ మేరకు హంద్రీ–నీవా ద్వారా 40 టీఎంసీలు ఎత్తిపోయాలంటే 120 రోజులపాటు రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున నీటిని ఎత్తిపోయాలి. తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తుండటంతో 120 రోజులు నీరు నిల్వ ఉండని పరిస్థితి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక 60 రోజుల్లోనే 40 టీఎంసీలను తరలించేలా హంద్రీ–నీవా సామర్థ్యం పెంచే పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూన్ రెండో వారం నుంచే 800 అడుగుల నుంచే నీటిని ఎత్తిపోయడం ద్వారా ఏటా సామర్థ్యం కంటే ఎక్కువ నీటిని తరలించి.. రాయలసీమలో చెరువులు, జలాశయాలను నింపారు. ప్రధాన కాలువ కింద, చెరువులు, జలాశయాల ఆయకట్టుతోపాటు భూగర్భ జల మట్టం పెరగడంతో రైతులు బోర్లు, బావుల కింద భారీ ఎత్తున పంటలు సాగు చేసి ప్రయోజనం పొందారు. దాంతో గత ఐదేళ్లూ సీమ సస్యశ్యామలమైంది.నాటి లానే నేడూ రాష్ట్రంలో 2014–19 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం హంద్రీ–నీవాకు నీటి విడుదలపై మీనమేషాలు లెక్కించింది. నీటి తరలింపును ఆలస్యంగా ప్రారంభించడం వల్ల ఎన్నడూ సామర్థ్యం మేరకు అంటే ఏటా 40 టీఎంసీలు తరలించిన దాఖలాలు లేవు. నీటి తరలింపును ఆలస్యంగా ప్రారంభించడం.. ఆలోగా శ్రీశైలం నీటి మట్టం తగ్గిపోవడం వల్ల ఏటా సగటున 27.46 టీఎంసీలను మాత్రమే అప్పట్లో చంద్రబాబు సర్కార్ ఇవ్వగలిగింది. కానీ.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక 2019–20, 20–21లో సామర్థ్యం కంటే అధికంగా నీటిని తరలించింది. 2021–22, 22–23లలో రాయలసీమలో భారీ వర్షాలు కురవడం.. చెరువులు నిండిపోవడం.. వరదలతో హంద్రీ–నీవా నీటి అవసరం పెద్దగా లేకపోయింది. 2023–24లో కృష్ణా బేసిన్లో తీవ్రమైన వర్షాభావంతో నీటి కొరత ఉన్నప్పటికీ.. హంద్రీ–నీవా ద్వారా 32.49 టీఎంసీలను తరలించి వైఎస్ జగన్ ప్రభుత్వం రాయలసీమ సాగునీటి సమస్య పరిష్కారంపై చిత్తశుద్ధిని చాటుకుంది. కానీ.. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మాత్రం హంద్రీ–నీవాకు నీటి విడుదలపై మళ్లీ మీనవేషాలు లెక్కిస్తోంది. -
15 నాటికి శ్రీశైలానికి కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్: ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో ఆశాజనక పరిస్థితులు నెలకొంటున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకల్లోని పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా ప్రధాన పాయలో వరద ఉధృతి పెరిగింది. ఆల్మట్టి డ్యామ్‌లోకి బుధవారం సాయంత్రం 6 గంటలకు 84,645 క్యూసెక్కులు చేరడంతో నీటి నిల్వ 81.44 టీఎంసీలకు చేరుకుంది. డ్యామ్ గరిష్ట నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, ఆపరేషన్ ప్రొటోకాల్ ప్రకారం వరద ముప్పును నివారించేందుకు నిల్వలు గరిష్ట స్థాయికి చేరకముందే గేట్లను ఎత్తి వరదను దిగువన విడుదల చేస్తారు. గతేడాది జూలై 27న నిల్వ 93.28 టీఎంసీలకు చేరిన వెంటనే ఆల్మట్టి డ్యామ్ గేట్లను పైకి ఎత్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిల్వలు 105 టీఎంసీలకు చేరే లోపే గేట్లను ఎత్తే అవకాశముంది. వర్షాలు, వరదలు కొనసాగితే మరో రెండు రోజుల్లోగా ఆల్మట్టి డ్యామ్ గేట్లను ఎత్తి నీళ్లను దిగువన విడుదల చేసే అవకాశముంది. ఆల్మట్టికి దిగువన ఉన్న నారాయణపూర్ డ్మామ్ గరిష్ట నిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 25.06 టీఎంసీల నిల్వలున్నాయి. ఆల్మట్టి డ్యామ్ గేట్లను ఎత్తిన ఒకటి రెండు రోజుల్లోనే నారాయణపూర్ డ్యామ్ గేట్లను ఎత్తి నీళ్లను విడుదల చేయనున్నారు. దీంతో తెలంగాణ భూభాగంలోని జూరాల జలాశయానికి వరద చేరుకోనుండగా, వెంటనే గేట్లను ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి నీళ్లను విడుదల చేయనున్నారు. జూరాల జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.72 టీఎంసీల నిల్వలున్నాయి. ఈ నెల 15 లేదా 16వ తేదీలోగా శ్రీశైలం జలాశయానికి వరదనీరు చేరుకోవచ్చని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుంగభద్రకు పెరిగిన వరద ప్రవాహం కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్ర బేసిన్లోనూ వర్షాలు కురుస్తుడడంతో తుంగభద్రలో వరద ప్రవాహం మరింత పెరిగింది. తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం బుధవారం ఉదయం 35వేల క్యూసెక్కులకు పెరిగి సాయంత్రానికి 27,544 క్యూసెక్కులకు తగ్గింది. జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 100.86టీఎంసీలు కాగా, ప్రస్తుతం 25.17 టీఎంసీల నిల్వలున్నాయి. వర్షాలు విస్తారంగా కురిస్తే మరో వారం రోజుల్లో తుంగభద్ర గేట్లను ఎత్తే అవకాశముంది. అప్పుడు తుంగభద్ర జలాలు కూడా సుంకేశుల బ్యారేజ్ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతాయి. సాగర్ నుంచి 5 టీఎంసీల విడుదలకు అనుమతించండి: ఏపీ విజ్ఞప్తి తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి కుడి ప్రధాన కాల్వ ద్వారా 5 టీఎంసీల నీళ్లను విడుదల చేసేందుకు అనుమతించాలని ఏపీ ప్రభుత్వం కృష్ణా నదియాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కి విజ్ఞప్తి చేసింది. ఈ నెల 15 నుంచి రోజుకు 5500 క్యూసెక్కుల చొప్పున 11 రోజుల పాటు నీళ్లను కుడి ప్రధాన కాల్వ రెగ్యులేటర్ ద్వారా విడుదల చేసుకుంటామని, పర్యవేక్షణ కోసం కృష్ణా బోర్డు సిబ్బందిని పంపించాలని కోరింది. నీటి విడుదలకు అనుమతివ్వాలని సీఆర్పీఎఫ్ బలగాలను సైతం కోరాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ఈ నెల 8న కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలను తీర్చే వేసవి నిల్వ ట్యాంకుల్లో నీటిమట్టం పడిపోయిందని, అందుకే నీటి విడుదల చేసుకుంటామని తెలిపారు. -
తెలంగాణకు 8.5 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: వేసవి తాగునీటి అవసరాలకు తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు కేటాయిస్తూ కృష్ణా బోర్డు ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది. కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ డీఎం రాయపురే నేతృత్వంలో ఈ ముగ్గు రు సభ్యుల కమిటీ శుక్రవారం జలసౌధలో ప్రత్యేకంగా సమావేశమైంది. తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డితో రాయపురే 2 గంటలకు పైగా చర్చించారు. తుదకు శ్రీశైలం రిజర్వాయర్‌లోని నీటి నిల్వలను వినియోగించుకోవద్దని నిర్ణ యించారు. సాగర్ రిజర్వాయర్‌లోని నీటి నిల్వలపై చర్చించారు. సాగర్ ఎండీడీఎల్ 510 ఫీట్లు కాగా, గతంలో 505 ఫీట్ల వరకు అందుబాటులో ఉన్న నీటిని లెక్కగట్టి ఆ మేరకు వినియోగించుకోవాలని నిర్ణయించారు. తాజా సమావేశంలో దీన్ని 500 అడుగులకు తగ్గించారు. సాగర్ ప్రస్తుత నీటిమట్టం 510.53 అడుగులు కాగా, 132.86 టీఎంసీలు అందుబాటులో ఉన్నా యి. అందులో 500 అడుగుల ఎండీడీఎల్ మేరకు మొత్తం 17.55 టీఎంసీలు ప్రస్తుతం వినియోగానికి అందుబాటు లో ఉన్నాయి. అందులో 3.55 టీఎంసీలను భవిష్యత్ అవసరాలకు మినహాయించి మిగతా 14 టీఎంసీలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. తదుపరి అవసరాలపై మేలో సమా వేశం కావాలని త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. రెండు రాష్ట్రాల విజ్ఞప్తితో.. మే మాసాంతం వరకు ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించిన అంశంపై కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ గత అక్టోబర్‌లో చివరి సారిగా సమావేశమైంది. శ్రీశైలం ప్రాజెక్టు కనీస మట్టం (ఎండీడీఎల్)ను 805 ఫీట్లు, సాగర్ ఎండీడీఎల్‌ను 505 ఫీట్లకు నిర్ణయించి, వేసవి ఆవిరి నష్టాలను కూడా లెక్కగట్టి రెండు జలాశయాల్లో 92.78 టీఎంసీలు అందుబాటులో ఉన్నట్టు నిర్ధారించింది. అయినప్పటికీ మే మాసాంతం వరకు మొత్తంగా రెండు ప్రాజెక్టుల్లో 82.78 టీఎంసీలనే వినియోగించాలని అప్పట్లో కమిటీ నిర్ణయించింది. అందులో 2.78 టీఎంసీలను జూన్, జూలై తాగునీటి అవసరాల కోసమని రిజర్వ్ చేసింది. మిగిలిన 80 టీఎంసీల్లో 35 టీఎంసీలను తెలంగాణకు, 45 టీఎంసీలను ఏపీకి కేటాయించిన విషయం విదితమే. కాగా కమిటీ నిర్ణయించిన కోటాకు మించి తెలంగాణ ఇప్పటికే 11 టీఎంసీలను వినియోగించుకుంది. ఏపీ కోటా మేరకు వినియోగించుకుంది. అయితే ఇరు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు అదనంగా జలాలను విడుదల చేయాలని బోర్డుకు విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలోనే కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుంది. సమావేశంలో సాగర్ సీఈ అజయ్‌కుమార్, ఈఈ విజయ్‌భాస్కర్, కృష్ణా బోర్డు డిప్యూటీ డైరెక్టర్ సల్లా విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏపీలో మంచినీటి కొరత ఎక్కువగా ఉంది: ఈఎన్సీ త్రిసభ్య కమిటీ సమావేశంలో కేవలం తాగునీటి అంశంపైనే చర్చించామని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి సమావేశానంతరం చెప్పారు. 2 రాష్టాల అంగీకారంతో నీటి వాటాల పంపిణీ జరిగిందని తెలిపారు. ఏపీలో మంచినీటి కొరత కొంత ఎక్కువగా ఉందని వివరించారు. -
సాగర్ కుడి కాలువకు మరో 3 టీఎంసీలు
సాక్షి, అమరావతి: ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడి కాలువకు మరో 3 టీఎంసీలు కేటాయించాలని కృష్ణా బోర్డుకు త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న త్రిసభ్య కమిటీ శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశమైంది. ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు. కేటాయించిన నీటి కంటే 8.66 టీఎంసీలు అధికంగా వాడుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ఏపీ హక్కులను కాలరాస్తోందని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంపై బోర్డుకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువకు ప్రస్తుతం విడుదల చేస్తున్న 5 టీఎంసీలకు అదనంగా మరో 3 టీఎంసీలు విడుదల చేయాలని ఈఎన్సీ నారాయణరెడ్డి చేసిన ప్రతిపాదనకు త్రిసభ్య కమిటీ కన్వీనర్ డీఎం రాయ్‌పురే అంగీకరించారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 8.5 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ ఈఎన్సీ చేసిన విజ్ఞప్తికి కూడా కమిటీ సానుకూలంగా స్పందించింది. త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా రెండు రాష్ట్రాలకు నీటిని విడుదల చేస్తూ బోర్డు ఉత్తర్వులు జారీ చేయనుంది. -
శ్రీశైలంలో మిగిలిన నీళ్లు మాకే ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాశయంలో నిల్వ ఉన్న 15.23 టీఎంసీల జలాలను అత్యవసర తాగు నీటి అవసరాల కోసం తెలంగాణకు ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తీవ్ర కరువు పరిస్థితి ఉన్నా కూడా శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ 51 టీఎంసీలను ఆ రాష్ట్రంలోని కృష్ణా బేసిన్ వెలుపలి ప్రాంతాలకు తరలించిందని పేర్కొంది. ఇతర నదీ బేసిన్లకు కృష్ణా జలాలను తరలించేందుకు కృష్ణా ట్రిబ్యునల్–1 అనుమతి లేదని గుర్తు చేసింది. ఇకపై శ్రీశైలం జలాశయం నుంచి నీళ్లు తీసుకోకుండా ఏపీని నిలువరించాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తాజాగా కృష్ణాబోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. తాగునీటి అవసరాలు ముఖ్యం తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలం జలాశయంలోని నీటి నిల్వలను తాగు అవసరాలకు కేటాయించడానికే ప్రాధాన్యత ఇవ్వాలని ఈ లేఖలో కోరారు. గత ఏడాది అక్టోబర్ 6న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో కూడా ఈ నిర్ణయం తీసుకు న్నట్టు గుర్తు చేశారు. అయినా ఏపీ ప్రభుత్వం సాగు అవసరాలకు సైతం నీటిని తరలించుకుందని ఆరో పించారు. కృష్ణా బేసిన్ పరిధిలో తెలంగాణ జనాభా 2 కోట్ల మంది అయితే.. ఏపీ జనాభా 78లక్షల మంది మాత్రమేనని తెలిపారు. 2011 నాటి లెక్కల ప్రకారమే.. తెలంగాణ తాగునీటి అవసరాలకు 46.4 టీఎంసీలు, ఏపీ తాగునీటి అవసరాలకు 18 టీఎంసీలు అవసరమని వివరించారు. కృష్ణా ట్రిబ్యునల్–2కు సమర్పించిన ప్రాజెక్టుల డీపీఆర్‌ల ప్రకారం చూస్తే.. తాగునీటి అవసరాల కోసం ఏపీకి 8.85 టీఎంసీలు, తెలంగాణకి 40 టీఎంసీలు అవసరమని స్పష్టం చేశారు. గత వానాకాలంలో తెలంగాణ వాడుకోకుండా మిగిల్చిన 18.7 టీఎంసీలను ఈ ఏడాది వాడుకోవడానికి అనుమతి ఇవ్వాలని కృష్ణా బోర్డును కోరారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలను పణంగా పెట్టి శ్రీశైలం నుంచి చెన్నై తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలను కేటాయించాలన్న నిబంధనేదీ లేదన్నారు. -
నాగార్జునసాగర్‌కు ఎన్డీఎస్ఏ బృందం
నాగార్జునసాగర్: ‘నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)’ బృందం మంగళవారం నాగార్జున సాగర్ ప్రాజెక్టును సందర్శించింది. తొలుత విజ యవిహార్ అతిథిగృహంలో తెలంగాణ, ఆంధ్ర ఇంజనీర్లతోపాటు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కృష్ణాబోర్డు (కేఆర్ఎంబీ) సభ్యులతో ఎన్డీఎస్ఏ అధికారులు సమావేశమయ్యారు. 2009లో వచ్చిన భారీ వరదల నుంచి డ్యామ్‌ను ఏవిధంగా కాపా డారు? వచ్చిన వరదను ఎలా విడుదల చేశారన్న అంశాలపై చర్చించారు. తర్వాత ప్రధాన డ్యామ్ ను, ప్రాజెక్టు లోపలి గ్యాలరీలను, అక్కడి సీపేజీ (జాలు నీరు)లను పరిశీలించారు. సీపేజీ నీటి మళ్లింపు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రా జెక్టు స్పిల్‌వేపై ఉన్న వాక్‌వే బ్రిడ్జి మీదుగా వెళ్లి స్పి ల్‌వేను పరిశీలించారు. ప్రాజెక్టు గేట్ల పరిస్థితి, స్పిల్ వేకు అవసరమైన మరమ్మతులు, నిర్వహణ వివ రాలను ఆరా తీశారు. స్పిల్‌వే దిగువన బకెట్ పో ర్షన్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఎన్డీఎస్ఏ బృందంలో సీడబ్ల్యూసీ డైరెక్టర్ రమేశ్‌కుమార్, రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్(ఎస్డీఎస్వో) సీఈ ప్రమీల, ఇత ర ఇంజనీర్లు ఉన్నారు. ఈ పరిశీలనలో తెలంగాణ నుంచి చీఫ్ ఇంజనీర్ వి.అజయ్‌కుమార్, డ్యామ్ ఎస్ఈ పీవీఎస్ నాగేశ్వర్రావు, ఇతర ఇంజనీర్లు పాల్గొనగా.. ఏపీ నుంచి చీఫ్ ఇంజనీర్ మురళీధర్ రెడ్డి, ఎస్ఈ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేడు విద్యుత్ కేంద్రం పరిశీలన ఎన్డీఎస్ఏ బృందం బుధవారం సాగర్ డ్యాం దిగు వన ఉన్న విద్యుత్ కేంద్రాన్ని సందర్శించనుంది. ఈ విద్యుత్ కేంద్రం ద్వారా విడుదలవుతున్న నీటి ని.. తిరిగి జలాశయంలోకి ఎత్తిపోసే సమయంలో నీరేమైనా వృథా అవుతుందా? సీజన్లో బయటికి ఎంతనీరు వెళుతుందనే అంశాలను పరిశీలించనున్నట్టు తెలిసింది. గురువారం కూడా సాగర్ ప్రాజెక్టు పరిధిలో పరిశీలన కొనసాగనుంది. -
ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతపై సుప్రీంకు
సాక్షి, అమరావతి: శ్రీశైలం, నాగార్జున సాగర్లను కృష్ణా బోర్డుకు అప్పగించకుండా తెలంగాణ సహాయ నిరాకరణ చేస్తే సుప్రీంకోర్టుకు నివేదించాలని కేంద్రం నిర్ణయించింది. గత నెల 17న కేంద్ర జల్ శక్తి శాఖ నిర్వహించిన సమావేశంలో నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాల అధికారులు అంగీకరించారు. కానీ, ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకోగానే తెలంగాణ అధికారులు మాటమార్చారు. ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింత విధి విధానాల ఖరారుకు ఈనెల 1న హైదరాబాద్‌లో జరిగిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలోనూ ఉమ్మడి ప్రాజెక్టులకు రెండు రాష్ట్రాల అధికారులు అంగీకరించినట్లు ప్రకటించినా, ఆ తర్వాత తెలంగాణ అధికారులు మరోసారి మాటమార్చారు. ఈ నేపథ్యంలో గత నెల 17న తీసుకున్న నిర్ణయాల అమలుపై ఈనెల 16న ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ అధికారులు అంగీకరించకపోయినా లేదా గైర్హాజరైనా అదే అంశాన్ని సుప్రీంకోర్టుకు నివేదించి, కోర్టు మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు 2021లో ఎగువ నుంచి వరద రాకుండానే తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి ప్రారంభించింది. ఇక్కడి నుంచి నీటిని సాగర్‌కు తరలించింది. ఇలా శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తుండటంతో సీఎం వైఎస్ జగన్ న్యాయ పోరాటానికి దిగారు. కృష్ణాబోర్డు పరిధిని నోటిఫై చేసి, అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడి చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో కృష్ణాబోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జల్ శక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది. శ్రీశైలం, సాగర్‌లో రాష్ట్ర భూభాగం పరిధిలోని ఆరు అవుట్లెట్లను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ సర్కారు మాత్రం తమ భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను అప్పగించేందుకు నిరాకరించింది. యథేచ్ఛగా తెలంగాణ జలచౌర్యం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గతేడాది అక్టోబర్ 6న కృష్ణా బోర్డు రాష్ట్రానికి కేటాయించిన 30 టీఎంసీల్లో 17 టీఎంసీలను ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు తెలంగాణ సర్కార్ తరలించింది. ఆ 17 టీఎంసీలను గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువ ద్వారా విడుదల చేయాలని రాష్ట్ర అధికారులు చేసిన వి/æ్ఞప్తులను తెలంగాణ పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని సీఎం వైఎస్ జగన్‌కు అధికారులు వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తే.. తెలంగాణ భూభాగంలో ఉందంటూ ఎడమ గట్టు విద్యుత్కేంద్రాన్ని తెలంగాణ సర్కారు అధీనంలోకి తీసుకుందని, అదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ స్పిల్ వే 13 గేట్లతోసహా కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను అధీనంలోకి తీసుకుని, నీటిని విడుదల చేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దాంతో నవంబర్ 30 తెల్లవారుజామున సీఈ మురళీనాథ్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర పోలీసులు, జలవనరుల అధికారులు సాగర్ స్పిల్ వేలో సగాన్ని, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాగు నీటి అవసరాల కోసం కుడి కాలువకు 2,300 క్యూసెక్కులు విడుదల చేశారు. దీనిపై తెలంగాణ సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దాంతో డిసెంబర్ 1న రెండు రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, సంయమనం పాటించాలని ఆదేశించారు. సాగర్‌పై నవంబర్ 30 నాటి యథాస్థితిని కొనసాగిస్తూ నిర్వహణ బాధ్యతను బోర్డుకు అప్పగించారు. ఈ వివాదాన్ని పరిష్కరించాలని కేంద్ర జల్ శక్తి శాఖను ఆదేశించారు. -
ఉమ్మడి ప్రాజెక్టులు బోర్డు నియంత్రణలోకి..
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నియంత్రణలోకి తీసుకెళ్లడానికి తెలంగాణ, ఏపీ నీటిపారుదల శాఖల ఈఎన్సీలు గురువారం హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో అంగీకరించారు. ఇకపై శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలను కేఆర్ఎంబీ ప్రత్యక్ష నియంత్రణలో జరపాలని, ఇందుకోసం రెండు ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతి కాంపొనెంట్ (విభాగం) వద్ద తెలంగాణ నుంచి ఒకరు, ఏపీ నుంచి మరొక ఉద్యోగిని పెట్టాలని నిర్ణయించారు. జలవిద్యుత్ కేంద్రాలు మినహా మిగిలిన 10 ఔట్లెట్లు (శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్‌వేతోపాటు రివర్ స్లూయిస్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్, నాగార్జునసాగర్ ఫ్లడ్ కెనాల్–హెడ్ రెగ్యులేటర్–పరిసరాలు, ఏఎంఆర్ ఎత్తిపోతల పథకం– పంప్‌హౌస్ పరిసరాలు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్పిల్‌వేతోపాటు రివర్, చూట్ స్లూయిస్, నాగార్జునసాగర్ రైట్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్)లను బోర్డు నియంత్రణలోకి తీసుకెళ్లడానికి ఇరువురు ఈఎన్సీలు అంగీకారం తెలిపారు. ఇరు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు కూడా 10 కాంపోనెంట్ల వద్ద మూడేసీ షిఫ్టులు (ఒక్కో షిప్టు 8 గం ఉండేలా ఇరు 30 మంది చొప్పున బోర్డు నియంత్రణలో పనిచేయడానికి అంగీకరించారు. అయితే నీటి విడుదల మాత్రం బోర్డుకు చెందిన త్రిసభ్య కమిటీ (బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయిపూరే, తెలంగాణ ఈఎన్సీ సి. మురళీధర్, ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి)ల నేతృత్వంలోని కమిటీ నిర్ణయం మేరకు జరుగుతుందనే అంగీకారం ఇరువురి మధ్య కుదిరింది. అయితే నాగార్జునసాగర్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) పనులు తెలంగాణ, శ్రీశైలం పనులను ఏపీ చేపట్టాలని నిర్ణయించారు. గంటన్నరపాటు సమావేశం... కేఆర్ఎంబీ చైర్మన్ శివనందన్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, అంతర్రాష్ట్ర విభాగం చీఫ్ ఇంజనీర్ మోహన్ కుమార్, నాగార్జున సాగర్ చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్, కృష్ణా బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.విజయకుమార్‌లు హాజరవగా ఏపీ నుంచి ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్సీ సి. నారాయణరెడ్డితోపాటు ఆ రాష్ట్ర అధికారులు హాజరయ్యారు. దాదాపు గంటన్నరపాటు సమావేశం జరిగింది. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించాలని తాము సమ్మతించినట్లు ఈ సమావేశం అనంతరం ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వెల్లడించారు. అప్పటిదాకా అప్పగింత కుదరదు: తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతపై మీడియాలో వార్తలు రావడంతో తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా రంగంలోకి దిగారు. నీటి వాటాలు తేలేదాకా, శ్రీశైలం, సాగర్ ఆపరేషనల్ ప్రొటోకాల్స్‌పై స్పష్టత వచ్చేదాకా ప్రాజెక్టులను అప్పగించేది లేదంటూ తేల్చిచెప్పారు. దీనిపై జనవరి 27న కేంద్ర జలశక్తి శాఖకు రాసిన లేఖను బహిర్గతం చేశారు. కేంద్ర జలశక్తి శాఖ జనవరి 17న ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ అంగీకరించకున్నా అంగీకరించినట్లు పేర్కొంటూ మినిట్స్ విడుదల చేసిందని ఆ లేఖలో ఆయన ఆరోపించారు. ఆ సమావేశంలో తాము లేవనెత్తిన పలు అంశాలను మినిట్స్‌లో పేర్కొనలేదని గుర్తుచేశారు. ఆ మినిట్స్‌ను సవరించాలని లేఖలో కోరారు. మరోవైపు కృష్ణా బోర్డు సమావేశం ముగిసిన వెంటనే ప్రాజెక్టుల అప్పాగింతకు సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. తొలుత భేటీకి వెళ్లరాదనుకొని... అసలు కృష్ణా బోర్డు సమావేశాలకు హాజరు కాకూడదని అధికారులు తొలుత భావించినప్పటికీ తెలంగాణ అభిప్రాయాలను స్పష్టంగా బోర్డుకు చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు స్వయంగా హాజరయ్యారు. అయితే లేఖకు కట్టుబడే ఉండాలని సమావేశంలో తెలంగాణ భావించగా తద్విరుద్ధంగా పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాగర్ పరిధిలో మొత్తం 8 కాంపోనెంట్లు ఉండగా అందులో 7 తెలంగాణ అదీనంలో ఉన్నాయి. వాటిలో ఐదింటిని అప్పగించడానికి, శ్రీశైలం పరిధిలో 7 కాంపోనెంట్లు ఉండగా అందులో తెలంగాణ అదీనంలో ఉన్న కాంపోనెంట్‌ను అప్పగించడానికి నిర్ణయం తీసుకున్నట్లు సమావేశం అనంతరం ఈఎన్సీ (జనరల్) సి. మురళీధర్ ప్రకటన చేశారు. దాంతో విస్తుపోవడం తోటి అధికారుల వంతైంది. ఈ విషయం ప్రసార, సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా జనవరి 27న కేంద్ర జలశక్తి శాఖకు రాసిన లేఖను నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా మీడియాకు విడుదల చేశారు. దాంతో అధికారులు ముక్కున వేలేసుకున్నారు. ఈఎన్సీ ఒకదారిలో నడుస్తుండగా నీటిపారుదల శాఖ కార్యదర్శి మరోదారిలో నడుస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. -
కృష్ణా బోర్డు ప్రాజెక్టుల నిర్వహణకు ఏపీ,తెలంగాణ అంగీకారం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల ఆపరేషన్‌కు ఏపీ, తెలంగాణ అంగీకారం తెలిపాయి. హైదరాబాద్‌లో కృష్ణా రివర్ బోర్డు సమావేశం గురువారం జరిగింది. అనంతరం మీడియాతో ఏపీఈఎన్‌సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ, బోర్డు పరిధిలో మొత్తం 15 కాంపోనెంట్స్‌లో 9 తెలంగాణ, 6 ఆంధ్రప్రదేశ్‌వి ఉన్నాయని, కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత పై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ‘‘ఆపరేషన్ కోసం ఇరు రాష్ట్రాల నుంచి స్టాప్ కేటాయింపు ఉంటుంది. వాటర్ కేటాయింపులపై త్రిసభ్య కమిటీ దే తుది నిర్ణయం. ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రోటోకాల్ త్రిసభ్య కమిటీ అప్పుడున్న పరిస్థితుల్లో తీసుకుంటారు. లెఫ్ట్ మెన్ కెనాల్ నుంచి రెండు టీఎంసీ, మార్చిలో రైట్ మెన్ కెనాల్ నుంచి మూడు టీఎంసీలు ఏపీకి విడుదలకు ఒప్పుకున్నారన్నారు. ఏప్రిల్ ఐదు టీఎంసీ లు ఏపీకి ముందుగానే ఉన్నాయి. ప్రాజెక్టుల ఆపరేషన్ కోసం తెలంగాణ ఒప్పుకుందని నారాయణరెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మాట్లాడుతూ, ప్రాజెక్టుల ఆపరేటింగ్ అంతా కేఆర్ఎంబీకి ఇచ్చామని, పవర్ స్టేషన్స్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. నాగార్జున సాగర్ తెలంగాణ, శ్రీశైలం ఏపీ చూసుకుంటుంది. ప్రాజెక్టులన్నీ ఇక నుంచి బోర్డు పరిధిలో నడుస్తాయి. మా డిమాండ్స్ అన్ని కేంద్రానికి లేఖలు రాశాం. ఇంకా అక్కడ నుంచి నిర్ణయం రాలేదు’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘నీటి వాటాల పంపకంపై త్రిసభ్య కమిటీనే నిర్ణయం తీసుకుంటుంది. ప్రాజెక్టుల వద్ద భద్రత అనేది పరిస్థితిని బట్టి బోర్డు కనుసన్నల్లో జరుగుతుంది. కేఆర్ఎంబీ పరిధిలో ఉన్న 15 హౌట్లెట్స్ బోర్డు పరిధిలోకి వెళ్తాయి. ప్రాజెక్టులను పూర్తిగా అప్పగించలేదు ఆపరేషనల్, నీటి విడుదల బోర్డు చూసుకుంటుంది. సీఆర్పీఎఫ్ సైతం కృష్ణా బోర్డు పరిధిలోనే ఉంటాయి. నిర్వహణ కోసం స్టాప్ కేటాయింపు 40: 45 కావాలని అడుగుతున్నారు’’ అని మురళీధర్ వివరించారు. -
నీటి వాటాలపైనా అడ్డం తిరిగిన తెలంగాణ
సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు కేంద్ర జల్ శక్తి శాఖ ఈనెల 17న నిర్వహించిన సమావేశంలో అంగీకరించి ఆ తర్వాత అడ్డం తిరిగిన తరహాలోనే.. కృష్ణా జలాల వాటాపైనా తెలంగాణ తొండాటకు దిగింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగా.. ఆంధ్రప్రదేశ్‌కు 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీల చొప్పున పంపిణీ చేస్తూ 2015 జూలై 18–19న కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక సర్దుబాటు చేసింది. దీనిని అంగీకరిస్తూ ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖల ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా కేంద్రం ఏర్పాటు చేసిన తాత్కాలిక సర్దుబాటుపై కృష్ణా బోర్డులో చర్చించి.. దాని ప్రకారమే రెండు రాష్ట్రాలు నీటిని వినియోగించుకుంటున్నాయి. మరోవైపు కృష్ణా జలాల్లో సగం వాటా కావాలని గతంలో తెలంగాణ సర్కార్ డిమాండ్ చేసినా.. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వెలువడే వరకూ పాత వాటాలే చెల్లుబాటు అవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఈ నీటి వాటాలపైనా అడ్డం తిరిగింది. కేంద్రం చేసిన తాత్కాలిక సర్దుబాటును అంగీకరించబోమని పేర్కొంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయాలని డిమాండ్ చేసింది. కానీ.. 1976 మే 31న బచావత్ ట్రిబ్యునల్ జారీ చేసిన అవార్డులో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసింది. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల్లో.. 1976కు ముందే పూర్తయిన ప్రాజెక్టులకు 749.16, ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84, శ్రీశైలం ఆవిరి నష్టాలకు 33 టీఎంసీల వాటా ఇచ్చింది. పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించింది. వాటి ఆధారంగానే రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తూ 2015లో కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. అంతరాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956లోని సెక్షన్–6(2) ప్రకారం.. కేడబ్ల్యూడీటీ–1 అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానం. దాన్ని పునఃసమీక్షించడం చట్టవిరుద్ధం. అందుకే కేడబ్ల్యూడీటీ–2 వాటి జోలికి వెళ్లలేదు. 65 శాతం లభ్యత కింద ఉన్న మిగులు జలాలు 194 టీఎంసీలను ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–2 అదనంగా కేటాయించింది. వీటిని పరిశీలిస్తే.. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చినా.. బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు మారబోవని జలవనరుల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతపై.. మళ్లీ అడ్డం తిరిగిన తెలంగాణ
సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణా బోర్డుకు అప్పగింతపై తెలంగాణ రాష్ట్రం మళ్లీ అడ్డం తిరిగింది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఈనెల 17న ఢిల్లీలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో కృష్ణా బోర్డుకు ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించేందుకు అంగీకరించిన తెలంగాణ నీటిపారుదల శాఖాధికారులు.. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకోగానే ప్లేటు ఫిరాయించి ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతకు తాము అంగీకరించలేదని బుకాయించారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చేవరకూ ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించబోమని తెలంగాణ సర్కార్ చెబుతోంది. కానీ.. ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించినట్లు సమావేశపు మినిట్స్‌లో స్పష్టంగా ఉంది. ఈ మినిట్స్‌పై ఏపీ అధికారులతోపాటు తెలంగాణ అధికారులు కూడా సంతకాలు చేశారు. అప్పుడూ ఇలాగే ప్లేటు ఫిరాయింపు.. గతంలో కృష్ణా బోర్డు 16వ సర్వసభ్య సమావేశంలో ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించిన తెలంగాణ అధికారులు.. ఆ మరుసటి రోజే అడ్డం తిరిగారు. ఇప్పుడూ అదే రీతిలో అడ్డం తిరగడంతో కేంద్ర జల్‌శక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది. మరోవైపు.. ఉన్నతస్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈనెల 24లోగా త్రిసభ్య కమిటీ సమావేశమై ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింత విధానాన్ని ఖరారు చేయాలి. ఈ సమావేశంలో తెలంగాణ తరఫున హాజరయ్యే నీటిపారుదల శాఖ ఈఎన్సీ స్పందనను బట్టి చర్యలు తీసుకోవడానికి కేంద్ర జల్‌శక్తి శాఖ సిద్ధమైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఏపీలో ఆరు.. తెలంగాణలో తొమ్మిది ఔట్లెట్లు.. నిజానికి.. విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు కేంద్రం కృష్ణాబోర్డును ఏర్పాటుచేసింది. ఈ బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021, జూలై 15న గెజిట్ నోటిఫికేషన్ జారీచేసిన కేంద్రం.. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని నిర్దేశించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఏపీ భూభాగంలోని ఆరు, తెలంగాణ భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను స్వాధీనం చేయాలని 16వ సర్వసభ్య సమావేశంలో రెండు రాష్ట్రాలను బోర్డు కోరింది. ఇందుకు రెండు రాష్ట్రాలు తొలుత అంగీకరించాయి. తెలంగాణ భూభాగంలోని అవుట్లెట్లను స్వాధీనం చేసుకుంటే.. తమ భూభాగంలోని అవుట్లెట్లను అప్పగిస్తామని ఏపీ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తంచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కానీ.. తెలంగాణ సర్కార్ తన భూభాగంలోని అవుట్లెట్లను బోర్డుకు అప్పగించబోమని అడ్డం తిరిగింది. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడానికి మన భూభాగంలోని సాగర్ స్పిల్ వే సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను జలవనరుల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమ నిర్వహణలో ఉన్న సాగర్‌ను ఏపీ అధికారులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారంటూ కేంద్రానికి తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. ఈ వివాదాన్ని పరిష్కరించడమే అజెండాగా ఈనెల 17న ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. -
తెలంగాణ గొంతుకోసిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్, శ్రీశైలం నీటి ప్రాజెక్టులపై పూర్తి అధికారాన్ని కృష్ణా నదీ యాజ మాన్య మండలి(కేఆర్ఎంబీ)కి అప్పగించి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ గొంతు కోసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించిన ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజలకు ఈ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టులపై అధికారాన్ని కేఆర్ ఎంబీకి అప్పగించడం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించారు. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటా తేలే దాకా ఏ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ఒప్పుకో మని నాటి కేసీఆర్ ప్రభుత్వం తేల్చిచెప్పిందని మాజీ మంత్రి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా అక్కడ మినిట్స్ రాసినట్లయితే వెంటనే ఆ విషయం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కేఆర్ఎంబీ అనుమతి లేకుండా ఆ డ్యాంల మీదికి అడుగు పెట్టే అవకాశం ఉండదన్నారు. తెలంగాణకు సాగునీళ్లు, తాగునీళ్లు ప్రశ్నార్థకం చేశారని ఆరోపించారు. రాష్ట్రం ఇక పూర్తిగా థర్మల్ విద్యుత్ కేంద్రంపైనే ఆధారపడేలా చేశారన్నారు. అలా అన్న వాళ్లే బొందలో కలిసిపోయారు తెలంగాణలో తన శిష్యుడు రాజ్యం ఏలుతున్నాడని చంద్రబాబు సంతోషపడుతున్నారని నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు శిష్యుడు విదేశాల్లో తిరుగుతూ కేసీఆర్ పార్టీని బొందపెడతానని అంటున్నారని, అలా అన్నవాళ్లు అందరూ బొందలో కలిసిపోయారన్నారు. గోదావరి బేసిన్లో రైతులకు సాగునీళ్లు ఇవ్వకుండా కాళేశ్వరం మీద దుష్ప్రచా రం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
నెలలోగా ప్రాజెక్టుల అప్పగింత
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను నెల రోజుల్లోగా కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కి అప్పగించేందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సమ్మతి తెలిపా యి. ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్ సీలు, కృష్ణా బోర్డు సమావేశమై.. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు సంబంధించిన 15 ప్రధాన కాంపోనెంట్లు/ఔట్ లెట్లను కృష్ణా బోర్డుకు అప్పగించడంలో అనుసరించాల్సిన విధివిధానాల(హ్యాండింగ్ ఓవర్ ప్రొటోకాల్స్)కు అంగీకారం తెలిపాయి. అదేవిధంగా పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణా ళికను వారం రోజుల్లోగా సిద్ధం చేస్తామని తెలిపా యి. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర జలశక్తి శాఖ తాజాగా ప్రకటించింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదాల పరిష్కారానికి ఈ నెల 17న ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాలు ఈ మేరకు అంగీకరించినట్టు సమావేశపు మినట్స్‌లో ఆ శాఖ పొందుపరిచింది. తెలంగాణ తరఫున రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ సి.మురళీధర్, ఏపీ తర ఫున ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణ రెడ్డితో పాటు కృష్ణా బోర్డు చైర్మన్ శివనందన్‌కుమార్, కేంద్ర జలసంఘం చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సాగర్ వద్ద నో ఎంట్రీ నాగార్జునసాగర్ డ్యామ్ పరిసరాల్లో సీఆర్పీఎఫ్ బలగాలు పటిష్ట బందోబస్తును కొనసాగించను న్నాయి. కృష్ణా బోర్డు నుంచి ముందస్తు అనుమతి లేకుంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇంజనీర్లు / అధికారులను సైతం ఇకపై డ్యామ్ పరిసరాల్లోకి అనుమతించరు. ఈ విషయంపై సైతం రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. నాగార్జునసాగర్ డ్యామ్ రెండు రాష్ట్రాల భూభాగాల పరిధిలో చెరి సగం వస్తుండగా, ఏదైనా మరమ్మతు పనులు చేపట్టేందుకు సంబంధిత భూభాగం పరిధిలోని రాష్ట్రం ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కృష్ణా బోర్డు పర్యవేక్షణలోనే ఈ పనులు చేయాల్సి ఉంటుంది. కేఆర్ఎంబీకి చెల్లించాల్సిన బకాయిలను సైతం తక్షణమే చెల్లిస్తామని రెండు రాష్ట్రాలు సమ్మతి తెలిపాయి. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలులో పురోగతిని సమీక్షించేందుకు 15 రోజుల తర్వాత మళ్లీ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ, ఏపీ వాదనలు ఇవే.. ఇతర అంశాలపై చర్చించి పరిష్కరించుకోవ డానికి ముందు నాగార్జునసాగర్ వద్ద 2023 డిసెంబర్ 28కి ముందు నెలకొని ఉన్న పరిస్థితులను పునరుద్ధరించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈ సమావేశంలో కోరారు. కృష్ణా జలాల్లో ఏపీ, తెలంగాణకు 50:50 నిష్పత్తిలో కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు. విద్యుదుత్పత్తి ద్వారా నీళ్లను తెలంగాణ కిందికి విడుదల చేస్తుండడంతో శ్రీశైలం జలాశ యంలో నిల్వలు అడుగంటిపోతున్నాయని ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశి భూషణ్‌కుమార్ సమావేశం దృష్టికి తీసుకె ళ్లారు. సాగర్ కుడికాల్వ ద్వారా ఏపీకి నీటి విడుదల కోసం కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చినా తెలంగాణ అధికారుల దయాదా క్షిణ్యాలపై ఆధారపడి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో తీసు కున్న నిర్ణయాలకు కట్టుబడి సాగర్ నుంచి నీటివిడుదలను నిలుపుదల చేశామని తెలిపారు. -
కృష్ణా బోర్డుకు సాగర్
-
కృష్ణా బోర్డుకు ‘సాగర్’
సాక్షి, అమరావతి/మాచర్ల/విజయపురిసౌత్: ఉమ్మడి ప్రాజెక్టు నాగార్జునసాగర్ నిర్వహణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం కృష్ణా బోర్డుకు అప్పగించింది. కేంద్ర హోంశాఖ, జల్ శక్తి శాఖల కార్యదర్శులు అజయ్ బల్లా, దేబశ్రీ ముఖర్జీ ఆదేశాల మేరకు తెలంగాణ భూభాగంలోని నాగార్జునసాగర్ సగం స్పిల్ వే, ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను సీఆర్పీఎఫ్ బలగాలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ భూభాగంలోని స్పిల్‌వే, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను కూడా అప్పగించాలన్న కేంద్ర జల్ శక్తి శాఖ విజ్ఞప్తికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ క్రమంలో ఏపీ భూభాగంలోని స్పిల్‌వే, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను రాష్ట్ర పోలీసులు ఆదివారం సీఆర్పీఎఫ్ బలగాలకు అప్పగించి నీటి విడుదలను నిలిపివేశారు. 13వ క్రస్ట్‌గేటు వద్ద ఏర్పాటు చేసిన కంచెను తొలగించారు. ఇకపై నాగార్జున సాగర్‌ను సీఆర్పీఎఫ్ బలగాల పహారాలో కృష్ణా బోర్డు నిర్వహించనుంది. ఉమ్మడి ప్రాజెక్టుల బాధ్యత బోర్డుకే.. కృష్ణాలో వరద ప్రారంభం కాకుండానే తెలంగాణ సర్కార్ 2021 జూలైలో బోర్డు అనుమతి తీసుకోకుండా అక్రమంగా ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేపట్టి నీటిని దిగువకు వదిలేసి శ్రీశైలాన్ని ఖాళీ చేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తుండటంపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ హక్కులను పరిరక్షించేలా కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరింది. ఈ కేసు విచారణలో ఉండగానే కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జల్ శక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డుకు అప్పగించాలని ఆదేశించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఆరు అవుట్లెట్లను ఏపీ ప్రభుత్వం, తొమ్మిది అవుట్లెట్లను తెలంగాణ సర్కార్‌కు అప్పగించేందుకు కృష్ణా బోర్డు 15వ సర్వ సభ్య సమావేశంలో అంగీకారం తెలిపాయి. తెలంగాణ సర్కార్ తన భూభాగంలోని అవుట్ లెట్లను అప్పగిస్తే తమ భూ భాగంలోని ఆరు అవుట్లెట్లను అప్పగించడానికి సమ్మతి తెలుపుతూ 2021 అక్టోబర్ 14న ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తన భూభాగంలోని 9 అవుట్లెట్లను అప్పగించకుండా తెలంగాణ సర్కార్ అడ్డం తిరగడంతో అప్పట్లో గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రాలేదు. తొమ్మిదేళ్లుగా తెలంగాణ సర్కార్ అనుసరిస్తున్న దుందుడుకు వైఖరితో ప్రజల్లో అసంతృప్తి పెల్లుబికి శాంతి భద్రతల సమస్యగా మారుతుండటంతో ఏపీ హక్కుల పరిరక్షణకు సాగర్ స్పిల్‌వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి రంగంలోకి దిగిన కేంద్రం నాగార్జునసాగర్‌ను కృష్ణా బోర్డుకు అప్పగించడం ద్వారా నోటిఫికేషన్ అమలుకు శ్రీకారం చుట్టింది. ఈనెల 6న ఢిల్లీలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి నిర్వహించే సమావేశంలో వెల్లడైన అంశాల ఆధారంగా శ్రీశైలాన్ని బోర్డుకు అప్పగించే అవకాశం ఉంది. ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించడం ద్వారా వివాదాలకు చరమగీతం పాడాలని కేంద్రం నిర్ణయించింది. నీటిపై నేడు త్రిసభ్య కమిటీ భేటీ నాగార్జునసాగర్ కుడి కాలువకు 5 టీఎంసీలు విడుదల చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం కృష్ణా బోర్డుకు ప్రతిపాదన పంపింది. దీనిపై త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని బోర్డును కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆదేశించారు. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సోమవారం సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. -
కరెంట్ పేరుతో 'శ్రీశైలం ఖాళీ'
సాక్షి, అమరావతి: ‘కృష్ణా బోర్డు అనుమతి లేకున్నా అక్రమంగా వాటాకు మించి నీటిని వినియోగించి తెలంగాణ రాష్ట్రం విద్యుదుత్పత్తి చేస్తూ.. నాగార్జునసాగర్‌కు తరలిస్తోంది. సాగర్ ఎడమ కాలువ రెగ్యులేటర్‌తోపాటు ఏపీ భూభాగంలో ఉన్న సాగర్ కుడి కాలువ రెగ్యులేటర్‌ను తన అధీనంలో ఉంచుకుంది. ఏపీకి హక్కుగా దక్కాల్సిన వాటా జలాలను దక్కినివ్వకుండా అడ్డుకుంటోంది. గత తొమ్మిదేళ్లుగా ఇదే రీతిలో తెలంగాణ సర్కార్ ఏపీ హక్కులను హరిస్తోంది. దీనిపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం ఉండటం లేదు’ అని ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. కృష్ణా బోర్డు పరిధి నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ అమలుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించిందని, ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లను బోర్డుకు అప్పగించడానికి ఒప్పుకున్నామని గుర్తు చేశారు. విభజన చట్టం, కృష్ణా బోర్డు ఆదేశాల మేరకు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను కర్నూలు సీఈ.. నాగార్జునసాగర్ నిర్వహణ బాధ్యతను ఆ రాష్ట్ర సీఈ 2014 నుంచి నిర్వహిస్తున్నారని చెప్పారు. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం తన భూభాగంలో ఉందని చెబుతూ.. దాన్ని తన అధీనంలోకి తీసుకుని తెలంగాణ సర్కార్ స్వేచ్ఛగా నిర్వహిస్తూ, అక్రమంగా నీటిని తరలిస్తోందని గణాంకాలతో సహా వివరించారు. తన భూభాగంలోని నాగార్జునసాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను గురువారం ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో రెండు రాష్ట్రాల మధ్య ఉత్పన్నమైన వివాదంతోపాటు కృష్ణా జలాల పంపకాలు, ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లను కృష్ణా బోర్డుకు అప్పగింతపై చర్చించడానికి కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ శనివారం రెండు రాష్ట్రాల సీఎస్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌కు విజయవాడలో క్యాంపు కార్యాలయం నుంచి ఏపీ సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డిలు హాజరయ్యారు. తెలంగాణ సీఎస్ శాంతికుమారి, ఆ రాష్ట్ర అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌కు గైర్హాజరయ్యారు. దాంతో వీడియో కాన్ఫరెన్స్‌లోనే తెలంగాణ సీఎస్ శాంతికుమారికి కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఫోన్ చేశారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం చేపట్టనుండటం వల్ల.. ఆ ఏర్పాట్లలో నిమగ్నమయ్యామని, దాని వల్లే వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాలేకపోతున్నామని ఆ రాష్ట్ర సీఎస్ శాంతికుమారి తెలిపారు. సమావేశాన్ని 5కు వాయిదా వేస్తే హాజరవుతామన్నారు. దీనిపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ స్పందిస్తూ.. ఈనెల 6న ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి రెండు రాష్ట్రాల సీఎస్‌లు, జల వనరుల శాఖ అధికారులు హాజరుకావాలని కోరారు. ఇందుకు రెండు రాష్ట్రాల సీఎస్‌లు అంగీకరించారు. తెలంగాణ సీఎస్ హాజరుకాలేని నేపథ్యంలో ఏపీ సీఎస్, అధికారులతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ తాజా పరిస్థితిని సమీక్షించారు. మా హక్కులను కాపాడుకోడానికే.. ‘తెలంగాణ సర్కార్ ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుతూ ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడం లేదు. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావం నెలకొందని.. శ్రీశైలం, సాగర్‌లలో లభ్యతగా ఉన్న నీటిని తాగునీటి కోసమే వాడుకోవాలని అక్టోబర్ 6న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఆ కమిటీ చేసిన సిఫార్సు మేరకు శ్రీశైలంలో 30 టీఎంసీలు, సాగర్‌లో 15 టీఎంసీలు ఏపీకి.. రెండు ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు 35 టీఎంసీలు కేటాయిస్తూ అక్టోబర్ 9న కృష్ణా బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను తుంగలో తొక్కుతూ ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తూ.. సాగర్‌కు తెలంగాణ నీటిని తరలించింది’ అని ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోవడం వల్ల.. కృష్ణా బోర్డు కేటాయించిన 30 టీఎంసీల్లో కేవలం 13 టీఎంసీలు మాత్రమే వాడుకోగలమని, మిగతా 17 టీఎంసీలు కోల్పోవాల్సి వచ్చిందని.. దీనికి తెలంగాణ సర్కార్ దుందుడుకు వైఖరి, కృష్ణా బోర్డు ప్రేక్షక పాత్ర వహించడమే కారణమని తెలిపారు. సాగర్‌లో కుడి కాలువకు కేటాయించిన 15 టీఎంసీలను ఇదే రీతిలో తెలంగాణ దక్కకుండా చేస్తుందేమోననే ఆందోళన ప్రజల్లో మొదలైందని.. ఇది శాంతిభద్రతల సమస్యకు దారితీస్తుండటంతో.. మా హక్కులను కాపాడుకోవడం ద్వారా దాన్ని నివారించడానికే మా భూభాగంలో ఉన్న సాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎల్ నినో ప్రభావం వల్ల గుంటూరు, పల్నాడు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో వర్షాభావం నెలకొనడంతో తాగునీటి అవసరాల కోసం కుడి కాలువకు నీటిని విడుదల చేశామని ఏపీ సీఎస్ స్పష్టం చేశారు. ఏపీ అధీనంలో స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ సీఆర్పీఎఫ్ బలగాల పహారాలో సాగర్ నిర్వహణ బాధ్యతను కృష్ణా బోర్డుకు అప్పగించాం కాబట్టి.. ఇక అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావని ఏపీ సీఎస్‌కు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే సాగర్‌లో సీఆర్పీఎఫ్ బలగాల మొహరింపుపై ఆ విభాగం అడిషనల్ డీజీ చారుసిన్హాను ఆరా తీశారు. సాగర్ స్పిల్ వే, ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలంగాణ పోలీసులు వెనక్కి వెళ్లారని, అక్కడ సీఆర్పీఎఫ్ బలగాలు మొహరించామని చారుసిన్హా చెప్పారు. ఏపీ పోలీసులు ఆ రాష్ట్ర భూభాగంలోని స్పిల్ వే, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్నారని.. పరిస్థితి శాంతియుతంగా ఉందన్నారు. ఏపీ వైపు స్పిల్ వే, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను సీఆర్పీఎఫ్కు అప్పగించాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి చేసిన సూచనను ఏపీ సీఎస్ సున్నితంగా తోసిపుచ్చారు. కుడి కాలువ కింద తమ రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే ముడిపడి ఉన్నాయని.. ఈ నేపథ్యంలో వాటిని తమ స్వాధీనంలో ఉంచుకుంటామని స్పష్టం చేశారు. ఏపీ సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి లేవనెత్తిన అంశాలపై కృష్ణా బోర్డు ఛైర్మన్‌ను కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ వివరణ కోరారు. సాగర్ కుడి కాలువకు నీటిని విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదన పంపకుండానే.. నీటిని విడుదల చేసుకున్నారని కృష్ణా బోర్డు ఛైర్మన్ చెప్పారు. కుడి కాలువకు 5 టీఎంసీలను విడుదల చేయాలని ప్రతిపాదన పంపామని ఏపీ సీఎస్ చెప్పారు. ఆ ప్రతిపాదనను పరిశీలించి.. ఈనెల 4లోగా నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని కృష్ణా బోర్డు ఛైర్మన్‌ను కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి ఆదేశించారు. కృష్ణా బోర్డు నీటి విడుదలపై నిర్ణయం తీసుకునే వరకూ అంటే 4వ తేదీ వరకు కుడి కాలువకు నీటి విడుదలను ఆపాలని ఆమె చేసిన సూచనకు ఏపీ సీఎస్ అంగీకరించారు. కృష్ణా జలాల వివాదంపై ఈనెల 6న ఢిల్లీలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శుల(సీఎస్)తో సమావేశం నిర్వహిస్తామని.. అప్పటిదాకా సంయమనం పాటించాలని రెండు రాష్ట్రాలకు ముఖర్జీ సూచించారు. విభజన చట్టం మేరకు కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించి.. రెండు రాష్ట్రాల హక్కులను పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ సమీక్షలో సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, కృష్ణా బోర్డు ఛైర్మన్ శివ్‌నందన్‌కుమార్, సీడబ్ల్యూసీ ఛైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరాలు పాల్గొన్నారు. రెండు గేట్ల ద్వారా కొనసాగిన నీటి విడుదల మాచర్ల / విజయపురిసౌత్: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన 13 క్రస్ట్ గేట్లు, హెడ్ రెగ్యులేటర్ స్వాధీన పర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి హక్కు కోసం పోరాటం కొనసాగుతూనే ఉంది. అందులో భాగంగా శనివారం సాగర్ కుడికాలువ రెండు గేట్ల ద్వారా 3,300 క్యూసెక్కులు విడుదల కొనసాగించారు. మూడు రోజులుగా ప్రజల తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా 5వ గేటు నుంచి 2వేల క్యూసెక్కులు, 2వ గేటు నుంచి 1300 మొత్తం 3300 క్యూసెక్కుల నీటిని బుగ్గవాగు రిజర్వాయర్‌కు పంపుతున్నారు. తద్వారా పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తున్నారు. జలవనరుల శాఖ అధికారులు, గుంటూరు రేంజి ఐజీ పాల్‌రాజ్, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. తుపాను నేపథ్యంలో సాయంత్రం నుంచి నీటి విడుదలను 2,550 క్యూసెక్కులకు తగ్గించారు. నాగార్జునసాగర్ డ్యాం ప్రధాన ముఖద్వారం వద్ద ఉన్న తెలంగాణ స్పెషల్ ప్రోటెక్షన్ ఫోర్స్ పోలీస్ గార్డ్ రూమ్ పేరును తొలగించి, ఆంధ్రప్రదేశ్ పోలీస్‌గార్డ్ రూమ్‌గా మార్చారు. కాగా, వివాదం నేపథ్యంలో శనివారం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సభ్యులు ఎస్ఈ అశోక్‌కుమార్, ఈఈ రఘునా««థ్, సెంట్రల్ వాటర్ కమిషన్ అసిస్టెంట్ డైరెక్టర్ వీఎన్‌రావు డ్యామ్‌ను సందర్శించారు. -
‘సాగర్’లో సగం ఏపీ స్వాధీనం
సాక్షి, అమరావతి/సాక్షి, నరసరావుపేట/మాచర్ల/విజయపురిసౌత్ :కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో నాలుగున్నరేళ్లుగా రాజీలేని పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రాష్ట్రానికి హక్కుగా దక్కిన జలాల వినియోగం విషయంలో ఇప్పుడు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ స్పిల్ వే 13 గేట్లతో సహా కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను ఆధీనంలోకి తీసుకుని, నీటిని విడుదల చేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. దీంతో గురువారం తెల్లవారుజామున సీఈ మురళీనాథ్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర పోలీసులు, జలవనరుల శాఖాధికారులు నాగార్జునసాగర్‌కు చేరుకున్నారు. అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు వాస్తవాలను వివరించి.. రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వే 13 గేట్లతో పాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాగునీటి అవసరాల కోసం కుడి కాలువకు 2,300 క్యూసెక్కులు విడుదల చేశారు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో సీఎం జగన్ రాజీలేని పోరాటం చేస్తున్నారనడానికి ఇది మరో తార్కాణమని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. తెలంగాణ తొండాట.. నిజానికి.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అక్టోబరు 6న కృష్ణా బోర్డు రాష్ట్రానికి 30 టీఎంసీలు కేటాయించింది. ఇందులో ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 15 టీఎంసీలను నాగార్జునసాగర్‌కు తెలంగాణ సర్కార్ తరలించింది. మాకు కేటాయించిన ఆ 15 టీఎంసీలను గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువ ద్వారా విడుదల చేయాలని ఏపీ అధికారుల విజ్ఞప్తులను తెలంగాణ సర్కార్ పట్టించుకోవడంలేదు. ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్‌కు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి. నారాయణరెడ్డిలు వివరించారు. వాస్తవానికి.. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తే.. తమ భూభాగంలో ఉందని ఎడమ గట్టు విద్యుత్కేంద్రాన్ని తెలంగాణ సర్కార్ తన ఆధీనంలోకి తీసుకుంది. ఇదే తరహాలో ఏపీ భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ స్పిల్ వే 13 గేట్లతో సహా కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను సీఎం జగన్ ఆదేశాలతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర హక్కులు తెలంగాణకు చంద్రబాబు తాకట్టు.. ♦ విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చేసేందుకు విభజన చట్టం ద్వారా 2014లో కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటుచేసింది. దీని పరిధిని నోటిఫై చేసేదాకా ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలంను ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్‌ను తెలంగాణ సర్కార్ నిర్వహించాలని నిర్దేశించింది. ♦ దీంతో సాగర్‌ను 2014–15లో పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్న తెలంగాణ సర్కార్.. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం తమ భూభాగంలో ఉందనే సాకు చూపి దాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. అదే సాకు చూపి పులిచింతల విద్యుత్కేంద్రాన్ని సైతం తన ఆధీనంలోకి తీసుకుంది. అయినాసరే.. నాటి సీఎం చంద్రబాబు ఇటు రాష్ట్రంలో.. అటు తెలంగాణలో టీడీపీని బతికించుకోవాలన్న రెండు కళ్ల సిద్ధాంతంతో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టారు. ♦ ఇక శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తరలించవచ్చు. నీటి మట్టం 854 అడుగుల స్థాయిలో ఉంటే ఆరేడు వేల క్యూసెక్కులు మాత్రమే తరలించడానికి సాధ్యమవుతుంది. అంతకంటే తగ్గితే.. శ్రీశైలంలో నీటి కోటా ఉన్నా సరే సీమ అవసరాల కోసం నీటిని వినియోగించలేని దుస్థితి. కానీ, శ్రీశైలం ప్రాజెక్టులో 796 అడుగుల నుంచే రోజుకు 4 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. దిగువన నీటి అవసరాలు లేకున్నా.. కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండానే ఎడమ గట్టు కేంద్రం నుంచి యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ.. శ్రీశైలంలో నీటిమట్టం తగ్గేలా తెలంగాణ సర్కార్ చేస్తోంది. తద్వారా శ్రీశైలంలో రాష్ట్ర వాటా జలాలు వినియోగించుకోకుండా చేస్తోంది. ♦ శ్రీశైలం నుంచి 2015లో ఇదే రీతిలో సాగర్‌కు తెలంగాణ తరలించిన నీటిని.. కుడి కాలువ కింద సాగు అవసరాల కోసం విడుదల చేయాలని అప్పటి రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ చేసిన విజ్ఞప్తిని తెలంగాణ అధికారులు తోసిపుచ్చారు. దీంతో రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో 13 గేట్లతోపాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకునేందుకు 2015, ఫిబ్రవరి 13న ఆదిత్యనాథ్ దాస్ పోలీసులతో కలిసి సాగర్‌కు చేరుకున్నారు. కానీ, తక్షణమే వెనక్కి రావాలని ఆదిత్యనాథ్ దాస్‌ను చంద్రబాబు ఆదేశించారు. తద్వారా కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను ఆయన తెలంగాణకు తాకట్టు పెట్టారు. ♦ శ్రీశైలం నుంచి 800 అడుగుల నుంచే రోజుకు రెండు టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలతోపాటు కల్వకుర్తి, నెట్టెంపాడుల సామర్థ్యం పెంచి.. సుంకేశుల బ్యారేజ్ జలవిస్తరణ ప్రాంతంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల, భక్తరామదాస ఎత్తిపోతలను తెలంగాణ సర్కార్ అక్రమంగా చేపట్టింది. కృష్ణా జలాలపై ఏపీ హక్కులను హరించి వేస్తున్నా ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు వాటిని తెలంగాణ సర్కార్‌కు చంద్రబాబు తాకట్టు పెట్టారు. సాగర్ నుంచి నీరు విడుదల గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో తీరనున్న తాగునీటి కష్టాలు రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల వలన తాగునీరు లేక మూడు జిల్లాల చెరువులు, భూగర్భ జలాలు తగ్గిపోయి ప్రజలు మంచినీటికి అల్లాడుతున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయం గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు ఊపిరిపోసింది. ఏపీ భూభాగంలోని 13 గేట్లను, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు స్వాధీనం చేసుకుని కుడికాలువ రెండు గేట్ల ద్వారా 2,300 క్యూసెక్కుల నీటిని గురువారం విడుదల చేశారు. అంతకుముందు.. భారీ స్థాయిలో ఏపీ పోలీసులు అక్కడ మోహరించారు. కుడికాలువపై పట్టు సాధించే క్రమంలో డ్యాంపై ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తెలంగాణ పోలీసులు ఏపీ జలవనరుల శాఖ అధికారులపై దౌర్జన్యానికి దిగారు. దీంతో ఏపీ పోలీసులు శాంతియుత వాతావరణంలోనే వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం.. సాగర్ డ్యాంపై ఏపీకి చెందిన భూభాగంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన గేట్లను దాటి సగభాగం వరకు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఏపీ పరిధిలోని 13 క్లస్టర్ గేట్ల వరకు బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఈ చర్యలతో నాగార్జునసాగర్‌లో ఏపీ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం పరిరక్షించినట్లయ్యింది. మరోవైపు.. నీరు విడుదల చేసి ప్రజల దాహార్తిని తీర్చేందుకు సీఎం జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఆ జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. హక్కుల పరిరక్షణకు సీఎం జగన్ రాజీలేని పోరాటం.. ఇక వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. తెలంగాణ సర్కార్ అక్రమ ప్రాజెక్టులను నిలిపేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాల కోసం తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌లోకి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తడంతో.. దాన్ని పరిష్కరించడానికి 2020, అక్టోబర్ 6న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రానికి హక్కుగా దక్కిన నీటిని వినియోగించుకోవడం కోసమే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని స్పష్టంచేసిన సీఎం జగన్.. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని డిమాండ్ చేయడమే కాక.. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ♦ శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం ప్రారంభం కాకుండానే 2021లో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి ప్రారంభించి.. సాగర్‌కు తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీచేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తుండటంతో సీఎం వైఎస్ జగన్ న్యాయపోరాటానికి దిగారు. కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేయడం ద్వారా అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడి చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ♦ దీంతో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021, జూలై 15న కేంద్ర జల్‌శక్తి శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది. శ్రీశైలం, సాగర్‌లలో రాష్ట్ర భూభాగం పరిధిలోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంకాగా.. తెలంగాణ నిరాకరించింది. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వే 13 గేట్లతోపాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను రాష్ట్రానికి అప్పగించాలని.. లేదంటే ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని జగన్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. 1,311 మంది పోలీసులతో బందోబస్తు ఇక నాగార్జునసాగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశమున్న నేపథ్యంలో.. ఏపీ పోలీసు శాఖ భారీ సంఖ్యలో పోలీసులను మోహరించింది. గుంటూరు రేంజ్ ఐజి పాల్‌రాజ్, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, ఎస్పీ రవీంద్రబాబుల ఆ«ధ్వర్యంలో 1,311 మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. సాగర్ వద్ద పరిస్థితులు చక్కబడే వరకు వీరు అక్కడే ఉండే అవకాశముంది. -
విశాఖకు కృష్ణాబోర్డు
సాక్షి, అమరావతి: కృష్ణాబోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అన్ని వసతులతో కూడిన భవనాన్ని సిద్ధం చేసింది. తక్షణమే హైదరాబాద్ నుంచి విశాఖకు కార్యాలయాన్ని తరలించాలని బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్‌కు జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ లేఖ రాశారు. కృష్ణా, గోదావరి నదీజలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు రాకుండా చూసేందుకు కృష్ణా, గోదావరి బోర్డులను విభజన చట్టం ద్వారా కేంద్రం ఏర్పాటుచేసింది. కృష్ణాబోర్డు కార్యాలయం ఆంధ్రప్రదేశ్‌లోను, గోదావరి బోర్డు కార్యాలయం తెలంగాణలోను ఏర్పాటుచేయాలని నిర్దేశించింది. ప్రస్తుతం రెండు బోర్డుల కార్యాలయాలు హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తున్నాయి. 2020లో కృష్ణాబోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలని కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి ఆదేశించారు. కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నారో అక్కడ భవనం, వసతులు కల్పిస్తే హైదరాబాద్ నుంచి తరలిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణాబోర్డు తెలిపింది. విశాఖపట్నంలో నార్త్‌కోస్ట్ సీఈ కార్యాలయం ప్రాంగణంలో నిర్మిం చిన భవనంలో ఒక అంతస్తును కృష్ణాబోర్డు కార్యాలయానికి ప్రభుత్వం కేటాయించి, బోర్డుకు తెలిపింది. -
5న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ
సాక్షి, అమరావతి: వర్షాభావ పరిస్థితులవల్ల దిగువ కృష్ణా బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో నీటి నిల్వలు కనిష్టంగా ఉన్న నేపథ్యంలో మే 31 వరకూ తాగునీటి అవసరాలపై చర్చించేందుకు హైదరాబాద్‌లో అక్టోబర్ 5న త్రిసభ్య కమిటీ సమావేశాన్ని కృష్ణా బోర్డు నిర్వహించనుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నుంచి మే 31 వరకూ తాగునీటి అవసరాలకు ఎన్ని నీళ్లు అవసరమో అక్టోబర్ 3లోగా ప్రతిపాదనలు పంపాలని రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు కోరింది. కమిటీలో సభ్యులందరూ ఈ సమావేశంలో తప్పనిసరిగా పాల్గొనాలని సూచించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే శుక్రవారం లేఖ రాశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో నీటి లభ్యతను బట్టి, రెండు రాష్ట్రాల అవసరాలను పరిగణలోకి తీసుకుని నీటి కేటాయింపులపై కృష్ణా బోర్డుకు సిఫార్సు చేయడానికి సభ్య కార్యదర్శి కన్వీనర్‌గా రెండు రాష్ట్రాల ఈఎన్సీలు సభ్యులుగా త్రిసభ్య కమిటీని కృష్ణాబోర్డు ఛైర్మన్ ఏర్పాటుచేశారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో మొదటిసారిగా జూలైలో సమావేశమైన త్రిసభ్య కమిటీ.. తాగునీటి అవసరాల కోసం రెండు ప్రాజెక్టుల నుంచి 12.7 టీఎంసీలను విడుదల చేయాలని సిఫార్సు చేయడంతో ఆ మేరకు నీటి విడుదల ఉత్తర్వులను జూలై 21న కృష్ణా బోర్డు జారీచేసింది. ఆ తర్వాత ఆగస్టు 21, 24న త్రిసభ్య కమిటీ రెండోసారి సమావేశమైంది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటినిల్వ తక్కువగా ఉన్న నేపథ్యంలో.. తాగునీటి అవసరాల కోసం నిల్వచేయాలని రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. తాగునీటి అవసరాల కోసం రెండు రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలపై సంప్రదింపులు జరపకపోవడంతో అప్పట్లో నీటి విడుదల ఉత్తర్వులను కృష్ణాబోర్డు జారీచేయలేదు. ఇదే అంశాన్ని కృష్ణా బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్ దృష్టికి సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే తీసుకెళ్లారు. తక్షణమే త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించి.. రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలను చర్చించి.. నీటి కేటాయింపులకు సిఫార్సు చేయాలని కృష్ణా బోర్డు చైర్మన్ ఆదేశించారు. దాంతో అక్టోబర్ 5న త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే తెలిపారు. -
కృష్ణా ప్రాజెక్టులపై గెజిట్‌ను రద్దు చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో పొందుపర్చిన ఆరు ప్రాజెక్టులకు రక్షణ కల్పిస్తూ గత ఏడాది జూలై 27న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోఫికేషన్‌కు చట్టబద్ధత లేదని, దానిని తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. బేసిన్ వెలుపల ఉన్న ఏపీలోని నాలుగు ప్రాజెక్టులకు ఎలాంటి నీటి కేటాయింపులు లేకున్నా.. అనుమతుల నుంచి మినహాయింపు కల్పించడం సరికాదని స్పష్టం చేసింది. నీటి కేటాయింపులు జరిపే అధికారం కేవలం ట్రిబ్యునల్‌కు మాత్రమే ఉందని పేర్కొంది. పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో పేర్కొన్న ప్రాజెక్టుల జాబితా అసంపూర్తిగా ఉందని.. 2002 నుంచే వినియోగంలో ఉన్న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును అందులో చేర్చలేదని వివరించింది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయాలను ప్రభావితం చేసేలా ఉన్న ఈ గెజిట్‌ను రద్దు చేయాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ తాజాగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. తెలంగాణకు అన్యాయం.. కృష్ణా జలాల వినియోగంలో ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు విభజన చట్టం కింద కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసింది. ఆ బోర్డుకు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో కృష్ణానదిపై తెలంగాణలోని కల్వ కుర్తి (అదనపు 15 టీఎంసీల సామర్థ్యం పెంపు), నెట్టెంపా డు (సామర్థ్యం పెంచనిది)తోపాటు ఏపీలోని తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ఎత్తిపోతల పథకా లను అనుమతి లేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చింది. వీటికి ఏడాదిలోగా అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలని పే ర్కొంది. కానీ కేంద్రం వీటిని విభజన చట్టంలో 11వ షెడ్యూ ల్లో పొందుపరిచి, పూర్తి చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో.. మళ్లీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లే దంటూ గత ఏడాది జూలై 27న సవరణ గెజిట్ జారీ చేసింది. అయితే.. ఇలా మినహాయింపు పొందిన ప్రాజెక్టుల్లో తెలంగాణలోని రెండే ప్రాజెక్టులు ఉండగా, ఏపీలోని 4 ప్రాజె క్టులు ఉండటంపై తెలంగాణ తాజాగా అభ్యంతరం తెలిపింది. కృష్ణా బేసిన్ పరిధిలో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను కోరుతూ కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపి స్తున్నామని.. ఈ సమయంలో బేసిన్ వెలుపల ఉన్న ఏపీలో ని 4 ప్రాజెక్టులకు మినహాయింపు ఇస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయమని ఆందోళన వ్యక్తం చేసింది. బేసిన్ పరిధిలోని పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులకు అ నుమతుల కోసం చేస్తున్న ప్రయత్నాలకు గెజిట్ నోటిఫికేషన్ అడ్డంకిగా మారే అవకాశం ఉందని పేర్కొంది. కృష్ణాలో 75 శాతం లభ్యత ఆధారంగా నీటి కేటాయింపులు కోరుతు న్నామని తెలిపింది. -
కృష్ణా బోర్డు & తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో మిగిలి ఉన్న కొద్దిపాటి నిల్వల పంపిణీ విషయంలో..తెలంగాణ రాష్ట్రం, కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) మధ్య వివాదం తీవ్రమైంది. తాగునీటి అవసరాల కోసం సెప్టెంబర్ 30 వరకు ఏపీకి 25.29 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 6.04 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయాలని ప్రతిపాదిస్తూ గత నెలలో ‘త్రిసభ్య కమిటీ’ పేరుతో రూపొందించిన వివాదాస్పద ముసాయిదా మినిట్స్‌ను ఆమోదించాలని తాజాగా కృష్ణా బోర్డు ఇరు రాష్ట్రాలను కోరినట్టు తెలిసింది. ఈ మేరకు ముసాయిదా మినిట్స్‌ను తాజాగా రెండు రాష్ట్రాలకూ కృష్ణా బోర్డు పంపించింది. ఇప్పటికే తెలంగాణ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినా బేఖాతరు చేస్తూ మినిట్స్‌ను కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలకు పంపించడం గమనార్హం. కృష్ణా బోర్డుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం... గత నెల 21న హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరగ్గా తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ గైర్హాజర య్యారు. కమిటీ కన్వీనర్ డీఎం రాయిపూరే, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి హాజ రై నీటి కేటాయింపులపై చర్చించారు. ఈ సమా వేశా న్ని వాయిదా వేయాలని అంతకుముందే తెలంగాణ లేఖ రాసినా, కృష్ణా బోర్డు సమావేశాన్ని నిర్వహించింది. సమావేశం నిర్ణయాల మేరకు ఏపీకి 25.29 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 6.04 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించాలని ప్రతిపాదిస్తూ.. ముసాయిదా మినిట్స్‌ను కృష్ణా బోర్డు రూపొందించింది. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ గైర్హాజరైనా, రాష్ట్రానికి అవసరమైన నీటి కేటాయింపులను కోరు తూ గతంలో ఆయన రాసిన లేఖను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. తెలంగాణకు నామమాత్రంగా నీటి కేటాయింపులు జరుపుతూ మినిట్స్‌ను రూపొందించినట్టు పత్రికల్లో వార్తలు రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. దీంతో ఈఎన్సీ సి.మురళీధర్ కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ కన్వీనర్ డీఎం రాయి పూరేను కలిసి మినిట్స్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు త్రిసభ్య కమిటీ సమావేశమే జరగలే దని, నీటి కేటాయింపులపై ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని, ఒకవేళ చేసినా తెలంగాణ సమ్మతి తెలపలేదని స్పష్టం చేస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. త్రిసభ్య కమిటీ సమావేశాన్ని సత్వరంగా నిర్వహించి నీటికేటాయింపులపై నిర్ణయం తీసుకోవాలని కృష్ణా బోర్డును కోరినట్టు వెల్లడించింది. మొత్తంగా.. తెలంగాణ అభ్యంతరాలను పట్టించుకోకుండా నీటి కేటాయింపుల ప్రతిపాదనలను కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలకు పంపించడం వివాదాస్పదంగా మారింది.