శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలిస్తున్న అధికారులు
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించేందుకు అనుమతించే ప్రశ్నే లేదని కృష్ణా బోర్డు సమన్వయ కమిటీకి తెలంగాణ జెన్‌కో అధికారులు తేల్చిచెప్పారు. సమన్వయ కమిటీ భేటీకి సభ్యులైన తెలంగాణ అంతర్ రాష్ట్ర జల వనరుల విభాగం సీఈ, తెలంగాణ జెన్‌కో సీఈ గైర్హాజరయ్యారు. దాంతో ఆపరేషన్ ప్రోటోకాల్ తయారీపై సమన్వయ కమిటీ అధ్యయనం అసంపూర్తిగా ముగిసింది. మంగళవారం ఉదయం శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్‌వే, కుడి గట్టు విద్యుత్ కేంద్రాలను పరిశీలించిన కమిటీ మధ్యాహ్నం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాన్ని పరిశీలనకు వస్తున్నట్టు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్, తెలంగాణ జెన్‌కో సీఈలకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే సమాచారం ఇచ్చారు.
అందుకు అనుమతించబోమని తెలంగాణ అధికారులు తెగేసి చెప్పడంతోపాటు శ్రీశైలంలో జరిగే సమన్వయ కమిటీ భేటీకి హాజరు కాబోమని స్పష్టం చేశారు. అదే అంశాన్ని బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్‌కు వివరించిన సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే ఏపీ అంతర్ రాష్ట్ర జల వనరుల విభాగం సీఈ కేఏ శ్రీనివాసరెడ్డి, శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు, జెన్‌కో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్వహించడానికి ఎంత మంది సిబ్బంది అవసరం, ఏడాదికి నిర్వహణకు ఎంత వ్యయం అవుతుంది, సీఐఎస్‌ఎఫ్ భద్రతా బలగాలు ఏ మేరకు అవసరమనే అంశాలపై చర్చించారు. ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి, సాగు, తాగునీటి అవసరాలకు నీటి విడుదలపై చర్చించారు. క్షేత్ర స్థాయి పర్యటన, సమీక్ష సమావేశంలో వెల్లడైన అంశాల ఆధారంగా ప్రాజెక్టు ఆపరేషన్ ప్రోటోకాల్‌పై ముసాయిదా నివేదికను బోర్డుకు అందజేస్తామని సభ్య కార్యదర్శి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment