Telangana Genco
-
ఎన్టీపీసీ విద్యుత్ ఇక చాలు..!
సాక్షి, హైదరాబాద్: ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో 2,400 (3్ఠ800) మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన రెండో దశ తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంటే భవిష్యత్తులో అది రాష్ట్రానికి పెనుభారంగా మారే ప్రమాదముందని ప్రభుత్వం అభిప్రాయానికి వచ్చింది. ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి 5–8 ఏళ్ల సమయం పట్టనుందని, దీని ద్వారా వచ్చే విద్యుత్ ధర యూనిట్‌కు రూ. 8–9 ఎగబాకుతుందని రాష్ట్ర ఇంధన శాఖ అంచనా వేసింది. బహిరంగ మార్కెట్లో దీనికన్నా తక్కువ ధరకే విద్యుత్ లభిస్తుండగా ఇంత భారీ ధరతో 25 ఏళ్లపాటు విద్యుత్ కొనుగోలు చేసేందుకు దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంటే రాష్ట్ర ప్రజలపై రూ. వేల కోట్ల అనవసర భారం పడుతుందని తేల్చింది. ఈ నేపథ్యంలో ఎన్టీపీసీతో రెండో దశ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. సత్వరమే ఒప్పందం చేసుకోకుంటే ఇతర రాష్ట్రాలతో ఒప్పందం చేసుకొని విద్యుత్ కేంద్రం నిర్మిస్తామని ఎన్టీపీసీ ఇటీవల రాష్ట్రానికి అల్టిమేటం జారీ చేయడంతో దీనిపై సమీక్షించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయానికి వచ్చింది. విభజన చట్టం కింద ఏర్పాటు..: రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో విద్యుత్ కొరతను తీర్చడానికి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పునర్విభజన చట్టం–2014లో కేంద్రం హామీ ఇచ్చింది. అందులో తొలి దశ కింద 1,600 (2 ్ఠ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని ఇటీవల ఎన్టీపీసీ పూర్తి చేసింది. రెండో దశ కింద 2,400 మెగావాట్ల ప్లాంట్లను నిర్మించాల్సి ఉంది. తొలి దశ ప్లాంట్ విద్యుత్ ధర యూనిట్‌కు రూ. 5.90 ఉండగా ఒప్పందం కారణంగా కొనుగోలు చేయకతప్పని పరిస్థితి ఉంది. గత సర్కారు తప్పిదమే! రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన 4,000 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్‌లో 2,400 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి అందకపోవడానికి కారణం కూడా గత ప్రభుత్వ తప్పిదమేనని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రెండో దశ కింద 2,400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి వీలుగా ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకోకుండా పదేళ్లపాటు కాలయాపన చేయడమే దీనికి కారణమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అప్పట్లో ఒప్పందం చేసుకొని ఉంటే ఇప్పటికే నిర్మాణం పూర్తై తక్కువ ధరకు విద్యుత్ రాష్ట్రానికి వచ్చేదని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పడు ఒప్పందం చేసుకుంటే భవిష్యత్తులో రాష్ట్రానికి గుదిబండగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత సర్కారు అధిక ధరతో విద్యుత్ కొనుగోళ్లు చేయడంతోపాటు విచ్చలవిడి విధానాలను అనుసరించడం వల్ల గత పదేళ్లలో రాష్ట్ర విద్యుత్ సంస్థలు దివాలా తీశాయని కాంగ్రెస్ సర్కారు ఆరోపిస్తోంది. ఇక కొత్త థర్మల్ ప్లాంట్లకు స్వస్తి.. దామరచర్లలో తెలంగాణ జెన్కో నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నాలుగేళ్ల కిందే పూర్తికావాల్సి ఉండగా ఇంకా పనులు కొనసాగుతున్నాయి. ఈ జాప్యంతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మెగావాట్‌కు రూ. 6–10 కోట్లకు పెరిగింది. కాలంచెల్లిన సబ్–క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన భద్రాద్రి విద్యుత్ కేంద్రం వ్యయం సైతం భారీగా పెరగడంతో దాని విద్యుత్ ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్ల నిర్మాణంలో తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ సర్కారు న్యాయ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మళ్లీ కొత్త థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం జోలికి వెళ్లొద్దని ప్రభుత్వం ఓ అభిప్రాయానికి వచ్చింది. ప్రత్యామ్నాయంగా మార్కెట్లో రూ. 2–4కు యూనిట్ చొప్పున లభిస్తున్న పునరుద్పాదక విద్యుత్‌తో రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం సౌర, జల, పవన, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజీ విద్యుత్‌పై సర్కారు దృష్టిపెట్టనుంది. -
విద్యుదుత్పత్తిని ఆపేయండి
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని తక్షణమే నిలిపేయాలని తెలంగాణ జెన్కోను కృష్ణా బోర్డు ఆదేశించింది. నీటి కేటాయింపులు చేయాలని ఎలాంటి ప్రతిపాదన పంపకుండా, బోర్డు అనుమతి లేకుండా విద్యుదుత్పత్తి చేస్తూ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు తరలిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ జెన్కో సీఎండీకి కృష్ణాబోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్ శుక్రవారం లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తుండటం వల్ల రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని కృష్ణా బోర్డుకు బుధవారం ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి లేఖ రాశారు. తక్షణమే విద్యుదుత్పత్తిని ఆపేసేలా తెలంగాణ జెన్కోను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కృష్ణాబోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్ తక్షణమే విద్యుదుత్పత్తిని నిలిపేయాలని తెలంగాణ జెన్కోను ఆదేశించారు. కృష్ణాబేసిన్‌లో ఈ ఏడాది సగటు వర్షపాతం కంటే తక్కువగా కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేయడాన్ని ఎత్తిచూపారు. దాంతో కృష్ణానదిలో నీటిలభ్యత తగ్గుతుందని, ఆ మేరకు శ్రీశైలం ప్రాజెక్టులోను లభ్యత తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీటిని సంరక్షించుకుని తాగు, సాగునీటి అవసరాల కోసం వాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇకపై ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేయవద్దని తెలంగాణ జెన్కోను ఆదేశించారు. కానీ.. తెలంగాణ జెన్కో కృష్ణా బోర్డు ఆదేశాల భేఖాతరు చేస్తూ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 38,140 క్యూసెక్కులను దిగువకు వదలేస్తుండటం గమనార్హం. -
రాష్ట్ర కరెంటు కొనుగోళ్లపై కేంద్రం నిషేధం !
-
రాష్ట్ర కరెంటు కొనుగోళ్లపై కేంద్రం నిషేధం!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా విద్యుత్ క్రయ విక్రయాలు జరిగే ‘ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజీ (ఐఈఎక్స్)’నుంచి లావాదేవీలు జరపకుండా రాష్ట్రంపై కేంద్రం నిషేధం విధించింది. కరెంటు కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి వీలు లేదని, గురువారం అర్ధరాత్రి నుంచే దీన్ని అమల్లోకి తెస్తున్నామని పేర్కొంది. తెలంగాణ, ఏపీలతోపాటు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలకు చెందిన 29 విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఈ నిషేధం వర్తిస్తుందని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ (పొసోకో) ఆయా రాష్ట్రాలకు వర్తమానం పంపింది. రూ.1,380 కోట్ల బకాయిలు రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) రూ.104.6 కోట్లు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) రూ.197.67 కోట్లు, తెలంగాణ స్టేట్ పవర్ కోఆర్డినేషన్ కంపెనీ (టీఎస్పీసీసీ) రూ.1,078.69 కోట్లు కలిపి సుమారు రూ.1,380 కోట్ల మేర విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా చాలా విద్యుత్ సరఫరా సంస్థలు గడువు తీరి నెల రోజులైనా విద్యుదుత్పత్తి కంపెనీలకు బకాయిలు చెల్లించలేదని కేంద్ర విద్యుత్ శాఖ తన ‘ప్రాప్తి వెబ్ పోర్టల్‌లో ప్రకటించింది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 29 విద్యుత్ సంస్థల బకాయిలు రూ.5,085.30 కోట్లకు చేరాయని తెలిపింది. అవసరానికి కొనుగోళ్ల కోసం.. విద్యుత్ లభ్యతకు మించి డిమాండ్ ఉన్న రాష్ట్రాలు ఆ లోటును పూడ్చుకోవడానికి ఎనర్జీ ఎక్స్చేంజీ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తుంటాయి. అలాగే విద్యుత్ డిమాండ్ తగ్గి, మిగిలిపోయినప్పుడు దానిని ఎనర్జీ ఎక్స్చేంజీలో విక్రయిస్తుంటాయి. కేంద్రం తాజాగా నిషేధం విధించడంతో ఆయా రాష్ట్రాలు విద్యుత్ కొనుగోలు, అమ్మకాల అవకాశాన్ని కోల్పోనున్నాయి. తెలంగాణ బుధవారం ఎనర్జీ ఎక్స్చేంజీ నుంచి ఏకంగా 1980 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయడం గమనార్హం. ప్రధానంగా విద్యుత్ డిమాండ్ గరిష్టంగా ఉండే సమయాల్లో రాష్ట్రం కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం కేంద్రం విధించిన నిషేధంతో రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాపై ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కోల సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. ప్రాప్తి పోర్టల్‌లో పేర్కొన్న బకాయిలన్నింటినీ చెల్లించామని, తమపై నిషేధాన్ని తొలగించాలని ఆయన పోసోకోకు లేఖ రాశారు. ప్రస్తుతానికి ప్రభావం తక్కువే! రాష్ట్రంలో విస్తారంగా వానలు పడుతుండటంతో ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉంది. ఇదే సమయంలో కృష్ణా, గోదావరి నదులకు భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం, సాగర్, జూరాల, పులిచింతల ప్రాజెక్టుల్లో గణనీయంగా విద్యుదుత్పత్తి జరుగుతోంది. అందువల్ల ఎనర్జీ ఎక్స్చేంజీ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై నిషేధం ప్రభావం పెద్దగా కనబడే అవకాశం లేవు. వానలు తగ్గితే మాత్రం అక్కడక్కడా కోతలు విధించే పరిస్థితి ఎదురుకానుంది. ఇక బిల్లులు చెల్లించకుంటే రాష్ట్రాలకు కరెంట్ కట్ కేంద్ర ప్రభుత్వం గత జూన్‌లో అమల్లోకి తెచ్చిన లేట్ పేమెంట్ సర్‌చార్జీ రూల్స్–2022 ప్రకారం.. విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి కొనుగోలు చేసిన కరెంటుకు సంబంధించిన బిల్లులను 45 రోజుల గడువులోగా డిస్కంలు చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే సదరు డిస్కంలకు విద్యుత్ విక్రయించకుండా ఆపేస్తారు. గత వేసవిలోనూ నిషేధం ఆదానీ పవర్ కంపెనీ నుంచి కొన్న సౌర విద్యుత్ బిల్లులను గడువులోగా చెల్లించలేదంటూ.. కేంద్రం గత వేసవిలోనూ రాష్ట్రంపై నిషేధం విధించింది. అయితే ఆ నిషేధంపై హైకోర్టు స్టే ఇవ్వడంతో రాష్ట్రానికి ఊరట లభించింది. రాష్ట్రాలపై కేంద్రం కక్ష సాధింపు కేంద్రం మరోసారి రాష్ట్రాలపై కక్ష సాధింపు చర్యలకు పూనుకుంది. రాష్ట్ర విద్యుత్ సంస్థలను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. హైకోర్టు స్టే ఉన్నా ఐఈఎక్స్ లావాదేవీలపై నిషేధం విధించడం సరికాదు. దీనిపై సోమవారం హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తాం. ప్రజలు, వినియోగదారులు విద్యుత్ సంస్థలకు సహకరించాలి. – డి.ప్రభాకర్‌రావు, తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ -
తీరు మారని తెలంగాణ సర్కార్
సాక్షి, అమరావతి/విజయపురిసౌత్ (మాచర్ల): నాగార్జునసాగర్ పరిశీలనకు కృష్ణా బోర్డు సబ్ కమిటీని అనుమతించినట్లుగానే అనుమతించిన తెలంగాణ సర్కార్ ఆ తర్వాత యథావిధిగా అడ్డం తిరిగింది. ప్రధాన విద్యుత్ కేంద్రం, ఎడమ కాలువపై ఉన్న విద్యుత్ కేంద్రం పరిశీలనకు సబ్ కమిటీని అనుమతించేది లేదని తెలంగాణ జెన్కో అధికారులు తేల్చిచెప్పారు. సాగర్ నిర్వహణ నియమావళిని రూపొందించేందుకు క్షేత్రస్థాయి పర్యటనను సోమవారం సబ్ కమిటీ చేపట్టింది. సోమవారం కుడి కాలువ విదుŠయ్త్ కేంద్రం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను పరిశీలించిన సబ్ కమిటీ..మంగళవారం సాగర్ స్పిల్ వే, ఏఎమ్మార్పీ, ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్, వరద కాలువలను పరిశీలించింది. సాగర్ ప్రధాన విద్యుత్ కేంద్రం, ఎడమ కాలువపై ఉన్న విద్యుత్ కేంద్రం పరిశీలించేందుకు వెళ్లిన సబ్ కమిటీని తెలంగాణ జెన్కో అధికారులు అడ్డుకున్నారు. శ్రీశైలం, సాగర్ల నుంచి నేరుగా నీటిని వాడుకునే 15 ప్రాజెక్టులను బోర్డు స్వాధీనం చేయడానికి 2 రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకరించాయని..అందులో సాగర్ ప్రధాన విద్యుత్ కేంద్రం, ఎడమ కాలువపై ఉన్న విద్యుత్ కేంద్రం ఉన్నాయని.. వాటిని పరిశీలించడానికి అనుమతివ్వాలని సబ్ కమిటీ చైర్మన్ ఆర్కే పిళ్లై చేసిన సూచనను తెలంగాణ జెన్కో అధికారులు తోసిపుచ్చారు. గత నెల 26న శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం పరిశీలనకూ ఇదే తరహాలో అనుమతి ఇవ్వలేదని..వారం రోజుల్లోగా విద్యుత్ కేంద్రాల పరిశీలనకు అనుమతివ్వకపోతే అదే అంశాన్ని కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు నివేదిక ఇస్తామని చెప్పారు. తెలంగాణ జెన్కో సీఎండీతో చర్చించి తుది నిర్ణయం చెబుతామని అధికారులు చెప్పడంతో సబ్ కమిటీ వెనుతిరిగింది. ఆ తర్వాత సాగర్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశానికి తెలంగాణ జెన్కో సీఈ గైర్హాజరయ్యారు. దాంతో సాగర్ సీఈ, 2 రాష్ట్రాల ఎస్ఈలతో సబ్ కమిటీ సమీక్ష చేపట్టింది. సాగర్ కుడి కాలువకు సంబంధించిన కార్యాలయాలు, సిబ్బంది తదితర వివరాలను ఏపీ అధికారులు అందజేశారు. కానీ..ఎడమ కాలువ, ఏఎమ్మార్పీ, వరద కాలువ తదితర ప్రాజెక్టుల వివరాలను తెలంగాణ నీటిపారుదల అధికారులు మౌఖికంగా మాత్రమే చెప్పడంపై పిళ్లై అసంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డులను అందజేయాలని, అప్పుడే ప్రాజెక్టుల నిర్వహణ నియమావళి ముసాయిదాను రూపొందించడానికి అవకాశముంటుందని తేల్చిచెప్పారు. -
విద్యుత్ కేంద్రం పరిశీలనకు అనుమతించని తెలంగాణ
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించేందుకు అనుమతించే ప్రశ్నే లేదని కృష్ణా బోర్డు సమన్వయ కమిటీకి తెలంగాణ జెన్కో అధికారులు తేల్చిచెప్పారు. సమన్వయ కమిటీ భేటీకి సభ్యులైన తెలంగాణ అంతర్ రాష్ట్ర జల వనరుల విభాగం సీఈ, తెలంగాణ జెన్కో సీఈ గైర్హాజరయ్యారు. దాంతో ఆపరేషన్ ప్రోటోకాల్ తయారీపై సమన్వయ కమిటీ అధ్యయనం అసంపూర్తిగా ముగిసింది. మంగళవారం ఉదయం శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్‌వే, కుడి గట్టు విద్యుత్ కేంద్రాలను పరిశీలించిన కమిటీ మధ్యాహ్నం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాన్ని పరిశీలనకు వస్తున్నట్టు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, తెలంగాణ జెన్కో సీఈలకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే సమాచారం ఇచ్చారు. అందుకు అనుమతించబోమని తెలంగాణ అధికారులు తెగేసి చెప్పడంతోపాటు శ్రీశైలంలో జరిగే సమన్వయ కమిటీ భేటీకి హాజరు కాబోమని స్పష్టం చేశారు. అదే అంశాన్ని బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్‌కు వివరించిన సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే ఏపీ అంతర్ రాష్ట్ర జల వనరుల విభాగం సీఈ కేఏ శ్రీనివాసరెడ్డి, శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు, జెన్కో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్వహించడానికి ఎంత మంది సిబ్బంది అవసరం, ఏడాదికి నిర్వహణకు ఎంత వ్యయం అవుతుంది, సీఐఎస్ఎఫ్ భద్రతా బలగాలు ఏ మేరకు అవసరమనే అంశాలపై చర్చించారు. ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి, సాగు, తాగునీటి అవసరాలకు నీటి విడుదలపై చర్చించారు. క్షేత్ర స్థాయి పర్యటన, సమీక్ష సమావేశంలో వెల్లడైన అంశాల ఆధారంగా ప్రాజెక్టు ఆపరేషన్ ప్రోటోకాల్‌పై ముసాయిదా నివేదికను బోర్డుకు అందజేస్తామని సభ్య కార్యదర్శి తెలిపారు. -
ఛత్తీస్‌గఢ్ కరెంట్‌కు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం ఆ రాష్ట్రం నుంచి తెలంగాణకు సరఫరా కావాల్సిన 1000 మెగావాట్ల విద్యుత్‌కు బ్రేక్‌పడింది. ఛత్తీస్‌గఢ్‌లోని 1000 మెగావాట్ల మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రంలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కావడంతో కొన్ని నెలలుగా రాష్ట్రానికి అంతంత మాత్రమే విద్యుత్ సరఫరా జరుగుతోంది. కొంతకాలంగా 500 మెగావాట్ల లోపు మాత్రమే విద్యుత్ సరఫరా కాగా, తాజాగా అది కూడా పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుత పరిస్థితిలో విద్యుత్ సరఫరా చేయలేమని, సాంకేతిక సమస్యలను అధిగమించి విద్యుదుత్పత్తిని పునరుద్ధరించేందుకు కొంత సమయం కావాలని తెలంగాణ జెన్కో అధికారులకు ఛత్తీస్‌గఢ్ అధికారులు విజ్ఞప్తి చేశారు. దీనికి జెన్కో యాజమాన్యం సానుకూలంగా స్పందించింది. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి కరెంటు తెచ్చుకోవాల్సిన అవసరం లేకపోవడంతో సర్దుకుపోవాలని నిర్ణయించినట్లు తెలంగాణ జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు వెల్లడించారు. కరెంట్‌కు బదులు కరెంట్ : విద్యుత్ విషయంలో ఇతర రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిని తెలంగాణ జెన్కో ఈ ఏడాది కూడా అమలు చేస్తోంది. ఏకధాటి వర్షాలతో రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ తగ్గిపోవడం, జల విద్యుదుత్పత్తి కూడా ప్రారంభం కావడంతో రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ మిగిలిపోతోంది. రాష్ట్ర అవసరాలు తీరాక, మిగిలిన విద్యుత్‌ను జెన్కో కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలకు ‘ఇచ్చిపుచ్చుకునే విధానం’లో సరఫరా చేస్తోంది. జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రం నుంచి జెన్కో 240 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తోంది. రాష్ట్ర అవసరాలు పోగా, మిగిలిన 200 మెగావాట్లను కర్ణాటకకు, 500 మెగావాట్లను పంజాబ్‌కు సరఫరా చేస్తోంది. తమకు అవసరం వచ్చినప్పుడు తిరిగి పొందేలా కర్ణాటకతో ఒప్పందం కుదుర్చుకున్నామని ప్రభాకర్ రావు తెలిపారు. రెండేళ్లుగా ఇదే విధానం : నాలుగు రోజులుగా ఉత్పత్తి అయిన 200 మెగావాట్ల విద్యుత్తును కర్ణాటకకు ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉన్నప్పుడు దేశంలో ఏ రాష్ట్రానికి అవసరముంటే.. వారికి సరఫరా చేసి, వేసవిలో తెలంగాణకు డిమాండు ఉన్నప్పుడు తిరిగి పొందే విధానాన్ని జెన్కో గత రెండేళ్లుగా అవలంభిస్తున్నది. పవర్ బ్యాంకింగ్ విధానంగా పిలిచే ఈ పద్ధతి ద్వారా గతంలో రాజస్తాన్‌కు కూడా తెలంగాణ జెన్కో విద్యుత్ సరఫరా చేసింది. వేసవిలో రాజస్తాన్ నుంచి కరెంటు పొందింది. ఇప్పుడు పంజాబ్‌కు విద్యుత్ అందిస్తున్నట్లు ప్రభాకర్‌రావు చెప్పారు. ఇలా గరిష్ట డిమాండ్ ఉన్న సమయంలో ఎక్కువ ధరకు కొనాల్సిన అవసరం రాదని ప్రభాకర్ రావు వివరించారు. -
కేటీపీఎస్ 7వ దశ విద్యుదుత్పత్తి ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన కేటీపీఎస్ ఏడవ దశలో శనివారం రాత్రి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. శరవేగంగా నిర్మితమైన విద్యుత్ ప్రాజెక్టుగా దేశ విద్యుత్ రంగంలో ఈ ప్రాజెక్టు సరికొత్త రికార్డును సృష్టించింది. తెలంగాణ జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు పాల్వంచలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి పవర్ గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఈ కార్యక్రమంలో బీహెచ్ఈఎల్ ఈడీ ముఖోపాధ్యాయ, జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, జెన్కో డైరెక్టర్లు వెంకటరాజం, సదానందం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్వంచ ప్లాంట్‌లో అధికారులు, కార్మికులు పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రారంభించి, పూర్తి చేసిన మొదటి ప్రాజెక్టుగా కేటీపీఎస్ 7వ దశ 800 మెగావాట్ల ప్లాంటు చరిత్రలో నిలువనుంది. 5,700 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్లాంటు నిర్మాణ పనులను 2015 ఫిబ్రవరి 1న ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన మొదటి విద్యుత్ ప్లాంటు కూడా ఇదే. దేశంలో కొత్త విద్యుత్ కేంద్రం ప్రారంభించిన 48 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రీయ విద్యుత్ మండలి (సీఈఏ) నిబంధనలున్నాయి. అయితే ఈ ప్లాంటు నిర్మాణం అంతకన్నా తక్కువ వ్యవధిలోనే కేవలం 40 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసుకుని ప్లాంట్ల నిర్మాణంలో కొత్త చరిత్ర సృష్టించింది. దేశంలో మరెక్కడాకూడా ఇంత తక్కువ సమయంలో విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు నిర్మాణం జరగలేదు. కేటీపీఎస్ ఏడవ దశ అందుబాటులో వచ్చిన తర్వాత తెలంగాణకు అందుబాటులో ఉండే విద్యుత్ 16వేల మెగావాట్లు దాటింది. ఐడీసీ భారం తగ్గించేలా నిర్మాణం దేశంలో శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ప్లాంటుగానే కాకుండా ఐడీసీ భారం అధికంగా పడకుండా నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టుగా కూడా కేటీపీఎస్ చరిత్రలో నిలిచిపోనుంది. అగ్రిమెంటులో నిర్దేశించిన కాలవ్యవధిలోగా పని పూర్తి కాకపోతే ఇంట్రెస్ట్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ రూపంలో అదనపు వ్యయం అవుతుంది. ఈ అదనపు వడ్డీ భారాన్ని కూడా విద్యుత్ సంస్థలు భరించి, కొనుగోలు చేయాల్సి వస్తోంది. అంతిమంగా ఆ భారం ప్రజలపై పడుతోంది. అయితే నిర్ణీత సమయంకన్నా 8 నెలల ముందే నిర్మాణం పూర్తి కావడం వల్ల కేటీపీఎస్ 7నుంచి కొనుగోలు చేసే విద్యుత్తుకు ఐడీసీ భారం ఎక్కువగా పడదు. దీని వల్ల ఇక్కడి నుంచి వచ్చే విద్యుత్ కూడా చాలా తక్కువ ధరకు లభ్యమవుతుంది. దాదాపు 300 కోట్ల రూపాయల వరకు ఆర్థికంగా మేలు కలుగుతుంది. కేటీపీఎస్7వ దశలో విద్యుత్ ఉత్పత్తికి సింగరేణి బొగ్గునే వాడనున్నారు. దీనివల్ల సింగరేణికి లాభం జరగడంతో పాటు తెలంగాణ జెన్కోకు తక్కువ ధరకు బొగ్గు లభిస్తుంది. ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. ఇది సమష్టి కృషి: ప్రభాకర్‌రావు సీఎం కేసీఆర్ ప్రోత్సాహం, విద్యుత్ అధికారులు, సిబ్బంది చేసిన సమష్టి కృషి వల్లే రికార్డు సమయంలో ప్లాంటు నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించగలిగామని సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. ప్లాంటులో ఉత్పత్తిని ప్రారంభించిన ఆయన మాట్లాడారు. తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొన్న రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. ప్లాంటు నిర్మాణానికి కష్టపడిన అధికారులు, ఉద్యోగులకు, బీహెచ్ఈఎల్కు ప్రభాకర్‌రావు అభినందనలు తెలిపారు. జెన్కో పనితీరు ప్రశంసనీయం: సీఎం రికార్డు సమయంలో విద్యుత్ ప్లాంటును నిర్మించి ఉత్పత్తి ప్రారంభించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. జెన్కో కృషి ప్రశంసనీయం అన్నారు. పారదర్శకత, పనుల్లో వేగం సాధించారన్న లక్ష్యంతో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించామన్నారు. ఆ లక్ష్యాలు నెరవేరడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా పనిచేస్తున్న జెన్కో సీఎండీ, అధికారులు, సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు. -
తమిళనాడుకు మన ‘నల్ల బంగారం’
- టాన్ జెన్కోతో 10 లక్షల టన్నుల బొగ్గు ఒప్పందం - వచ్చే ఏడాది 30 లక్షల టన్నుల కొనుగోళ్లకు టాన్‌జెన్‌కో సంసిద్ధత సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 4 నెలల కాలంలో సిం గరేణి బొగ్గు గనుల సంస్థ నుంచి 10 లక్షల టన్నుల బొగ్గును కొనుగోలు చేసేందుకు తమిళనాడు విద్యుద్పుత్తి సంస్థ(టాన్ జెన్కో) ముందుకు వచ్చింది. సింగరేణి సంస్థ సీఎండీ ఇ.శ్రీధర్ సమక్షంలో టాన్ జెన్కో సీఈ సత్యశీలన్, సింగరేణి జీఎం బి.కిషన్‌రావు బుధవారం ఇక్కడ సింగరేణి భవన్లో ఒప్పం దపత్రాలపై సంతకాలు చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 30 లక్షల టన్నుల బొగ్గు కొనుగోలు చేసేందుకు తమిళనాడు జెన్కో ఉన్నతాధికారులు సింగరేణి యాజమాన్యం తో చర్చలు జరిపారు. ఇప్పటి వరకు తమిళ నాడులోని సిమెంట్, సిరామిక్స్ వంటి చిన్న పరిశ్రమలకు సింగరేణి కొద్ది మొత్తంలో బొగ్గు అమ్ముతున్నప్పటికీ ప్రభుత్వ అధీనంలోని విద్యుత్ రంగానికి భారీ మొత్తంలో బొగ్గును విక్రరుుంచడం ఇదే తొలిసారి. ఈ ఒప్పందం వల్ల రెండు సం స్థలకు ప్రయోజనం చేకూరనుం దని సింగరేణి యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. సిం గరేణికి ఈ ఏడాది నిర్దిష్టమైన మార్కెట్ లభించడం ఓ శుభ పరి ణామం కాగా, ఈ ఒప్పం దాల వల్ల సగటున తమిళనాడు జెన్ కోకు టన్నుకు రూ.1000 వరకు ఆదా కానుందని పేర్కొంది. ఒప్పందం ప్రకారం మణు గూరు, భూపాలపల్లి గనుల నుం చి తమిళనాడుకు బొగ్గు సరఫరా జరగ నుం ది. ఈ బొగ్గును తమిళనాడులోని మెట్టూర్ 1400 మెగావాట్ల పవర్ ప్లాంటులో విద్యుదు త్పత్తి కోసం వినియోగించనున్నారు. సింగ రేణి బొగ్గు వల్ల తమ సంస్థకు బొగ్గు రవాణా ఖర్చులు తగ్గుతాయని, ధర కూడా తక్కువగా ఉందని టాన్‌జెన్‌కో సీఈ సత్య శీలన్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు సుదూర ప్రాం తాల్లోని కోల్ ఇండియా కంపెనీల నుంచి, విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుం టున్నామని తెలిపారు. వచ్చేఏడాది 30 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి నుంచి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తాజాగా టాన్ జెన్కోతో ఒప్పందం పాటు కర్ణాటకలో కొత్త విద్యుత్ ప్రాజెక్టులకు 7 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా చేసేందుకు ఇప్పటికే సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్టీపీసీ, తెలంగాణ జెన్కో కొత్త ప్రాజెక్టులకు సింగరేణి బొగ్గు కేటారుుంపులు జరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది 70 మిలియన్ టన్నుల బొగ్గు విక్రరుుంచే అవకా శాలున్నా యని అధికారులు అంచనా వేస్తున్నారు. టాన్ జెన్కోతో జరిగిన ఒప్పందంలో సింగరేణి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(కోల్ మూమెంట్) ఎన్.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కృష్ణపట్నం కరెంటు మాకొద్దు!
♦ శాశ్వతంగా వదులుకోవాలని తెలంగాణ సర్కారు నిర్ణయం ♦ ఏపీ జెన్కోకు టీ జెన్కో లేఖ ♦ పీపీఏల నుంచి తమ డిస్కంలు వైదొలగుతున్నట్టు వెల్లడి సాక్షి, హైదరాబాద్: కృష్ణపట్నం విద్యుత్‌ను శాశ్వతంగా వదులుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నేలటూరులో 1600(2ఁ800) మెగావాట్ల సామర్థ్యంతో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ అభివృద్ధి సంస్థ లిమిటెడ్(ఏపీపీడీసీఎల్) నిర్మించిన కృష్ణపట్నం విద్యుత్ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటాలను వదులుకుంటున్నామని పేర్కొంటూ తెలంగాణ ట్రాన్స్‌కో యాజమాన్యం తాజాగా ఏపీ జెన్కో ఎండీ కావేటి విజయానంద్‌కు లేఖ రాసింది. కృష్ణపట్నం విద్యుత్‌పై ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) కుదుర్చుకోగా.. ఈ పీపీఏల నుంచి తెలంగాణ డిస్కంలు వైదొలగనున్నాయని లేఖలో స్పష్టం చేసింది. కృష్ణపట్నం ప్రాజెక్టు కోసమే అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికిల్‌గా ఏపీపీడీసీఎల్ను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు మూల ధనంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకూ వాటాలున్నాయి. మొదట్లో కరెంటు కోసం లొల్లి విభజన చట్టం ప్రకారం కృష్ణపట్నం విద్యుత్‌లో తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 46.11 శాతం విద్యుత్ వాటాలున్నాయి. ఈ లెక్కన తెలంగాణకు 862 మెగావాట్ల విద్యుత్ రావాల్సి ఉంది. అయితే రాష్ట్ర విభజన అనంతరం కృష్ణపట్నం, హిందూజా విద్యుత్ కేంద్రాల నుంచి తెలంగాణకు రావాల్సిన వాటాలను ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ససేమిరా అనడంతో వివాదం రేగింది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ వివాదాల పరిష్కారం కోసం గతేడాది కేంద్ర విద్యుత్ సంస్థ(సీఈఏ) చైర్మన్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వం తాత్కాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ద్వారా భారీ ఎత్తున విద్యుత్ కొనుగోళ్లను ప్రారంభించడంతో తాత్కాలికంగానైనా ఏడాది కాలంగా రాష్ట్రంలో విద్యుత్ కొరత తీరింది. కృష్ణపట్నం ప్రాజెక్టు తొలి యూనిట్ నుంచి వాణిజ్యపర విద్యుదుత్పత్తి గత ఏప్రిల్‌లో, రెండో యూనిట్ నుంచి ఆగస్టులో ప్రారంభమైంది. కృష్ణపట్నం నుంచి వాటాలు తీసుకుంటారో లేదో తెలపాలని దక్షిణ ప్రాంత విద్యుత్ లోడ్ డిస్పాచ్ కేంద్రం(ఎస్ఆర్ఎల్డీసీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా.. ఇప్పట్లో అవసరం లేదని గత ఏప్రిల్ 18న తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు లేఖ రాశారు. మారిన ఇరు రాష్ట్రాల వైఖరి కృష్ణపట్నం నిర్మాణ వ్యయం భారీగా పెరగడం, విదేశీ బొగ్గును వినియోగం వల్ల యూనిట్ విద్యుత్ వ్యయం రూ.5-6 మధ్య ఉండనుందని ప్రచారం జరిగింది. దీంతో అధిక ధరతో కృష్ణపట్నం విద్యుత్‌ను కొనుగోలు చేయకూడదని ఆర్నెల్ల కిందే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఏపీ విద్యుత్ తీసుకోమని సీఎం కేసీఆర్ అప్పట్లో అసెంబ్లీ వేదికగా ప్రకటన సైతం చేశారు. ఆ తర్వాత ఏపీ కూడా తన వైఖరి మార్చుకుని కృష్ణపట్నం విద్యుత్ ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. బదులుగా తెలంగాణలో నిర్మిస్తున్న 1,200 మెగావాట్ల సింగరేణి, 600 మెగావాట్ల కేటీపీపీ విద్యుత్ కేంద్రాల విద్యుత్‌లో వాటాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. సింగరేణి, కేటీపీపీ ప్రాజెక్టులకు అత్యంత సమీపంగా సింగరేణి బొగ్గు అందుబాటులో ఉండడంతో విద్యుత్ వ్యయం యూనిట్‌కు రూ.3-4 మధ్యే ఉండనుందని అంచనా. కృష్ణపట్నం విద్యుత్ ధరలతో పోల్చితే ఇది చాలా తక్కువ. కృష్ణపట్నం విద్యుత్‌ను తీసుకుంటే సింగరేణి, కేటీపీపీల విద్యుత్ ఇవ్వాల్సి వస్తుందని రాష్ట్ర సర్కారు తాజా నిర్ణయం తీసుకుంది. -
జల విద్యుత్‌పై మళ్లీ ఆశలు
సాక్షి, హైదరాబాద్/జూరాల: జల విద్యుత్‌పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. జలాశయాలకు వరద నీటి ప్రవాహం జోరందుకుంటోంది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో ప్రియదర్శని జూరాల జలాశయం పూర్తి సామర్థ్యం మేర నిండింది. దీంతో జలాశయం ఎగువ విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా గురువారం నుంచి విద్యుదుత్పత్తిని తెలంగాణ జెన్కో ప్రారంభించింది. 234 మెగావాట్ల సామర్థ్యమున్న ఈ కేంద్రంలో ప్రస్తుతం 4 టర్బైన్ల ద్వారా 156 మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేస్తూ 26 వేల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. జూరాలకు వరద ప్రవాహం 50 వేల క్యూసెక్కులకు పెరిగితే ఈ కేంద్రం ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి జరగనుంది. వాస్తవానికి గత జూలైలోనే విద్యుదుత్పత్తి ప్రారంభమవుతుందని, ఆగస్టుకి 1,000 మెగావాట్ల జల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని విద్యుత్ శాఖ ఆశలు పెట్టుకుంది. వర్షాభావం ఈ ఆశలను వమ్ము చేసింది. సీఎం కేసీఆర్ చైనా టూర్‌కు ముందు విద్యుత్ సరఫరాపై సమీక్ష జరిపి ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు జల విద్యుదుత్పత్తి ప్రారంభమవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జల విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి సైతం భవిష్యత్తులో ఉత్పత్తికి అవకాశం ఉందని జెన్కో అధికారుల అంచనా. ఖరీఫ్‌లో ఆలస్యంగా వేసిన పంటలు, రబీ పంటలకు విద్యుత్ సరఫరా అవసరాలు తీర్చడానికి జల విద్యుత్ కీలకం కానుంది. జూరాల రిజర్వాయర్ నీటిమట్టం 10.76 టీఎంసీలకు చేరడంతో ప్రధాన కాల్వల ద్వారా రిజర్వాయర్లు, చెరువులు నింపేందుకు వేయి క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆయకట్టు పంటలకు సాగునీటిని విడుదల చేయడం లేదు. దిగువ జూరాల జల విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణ పనులూ ముగింపు దశకు చేరుకున్నాయి. -
బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ కట్
తెలంగాణ జెన్కోకు ఏపీ జెన్కో ఎండీ లేఖ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జెన్కో తీరుపై ఆంధ్రప్రదేశ్ జెన్కో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయిల చెల్లింపులో మొండిగా వ్యవహరిస్తున్నారని మండిపడింది. కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఏమాత్రం గౌరవించకపోవడం భావ్యం కాదని పేర్కొంది. తమకు రావాల్సిన బకాయిలను చెల్లించకపోతే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి ఇవ్వాల్సిన విద్యుత్‌ను నిలిపివేయడం మినహా మరోమార్గం లేదని హెచ్చరించింది. ఈ మేరకు ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ, జెన్కోఎండీ విజయానంద్ ఈ నెల 20వ తేదీన తెలంగాణ జెన్కోకు లేఖ రాసినట్లు సమాచారం. బకాయిల చెల్లింపు అంశాన్ని కేంద్రం దృష్టికీ తీసుకెళ్లే యోచనలో ఉన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు 53.89, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం విద్యుత్ వాటాను కేటాయించారు. 2014 జూన్ నుంచి సదరన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఆర్ఎల్డీసీ) రెండు రాష్ట్రాల విద్యుత్ వాడకాన్ని షెడ్యూల్డ్ చేస్తోంది. తెలంగాణ కంటే ఏపీలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ఎక్కువ. దీంతో తెలంగాణ తీసుకునే విద్యుత్ ఎక్కువగాను, ఇచ్చే విద్యుత్ తక్కువగానూ ఉంటోంది. రెండు రాష్ట్రాల జెన్కోలు ఆయా రాష్ట్రాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌కు డబ్బులు లెక్కగట్టి ఇవ్వాలి. ఈ లెక్కన 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31 వరకూ ఏపీ జెన్కో తెలంగాణ జెన్కోకు రూ.1,393 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఏపీ జెన్కోకు తెలంగాణ జెన్కో చెల్లించాల్సిన మొత్తం రూ.2,426 కోట్లు. ఏడాది కాలంగా తెలంగాణ చెల్లించకపోవడంతో, ఏపీ కూడా చెల్లించలేదు. రెండు నెలల క్రితం ఈ విషయమై ఏపీ జెన్కో తెలంగాణ అధికారుల వద్ద ప్రస్తావించింది. తాము చెల్లించాల్సిన మొత్తాన్ని మినహాయించుకుని మిగతాది ఇవ్వాలని కోరింది. ఈ లెక్కన తెలంగాణ తమకు రూ.1,033 కోట్లు చెల్లించాలని ఏపీ జెన్కో లెక్కలేసి చెప్పింది. అయినా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఏపీ జెన్కో ఎండీ ఈ నెల 10న తెలంగాణ జెన్కోకు లేఖ రాశారు. దీనికి బదులివ్వకపోవడంతో 20వ తేదీన మరో లేఖ రాశారు. దీంతో తెలంగాణ జెన్కో శుక్రవారం రూ.50 కోట్లు చెల్లించింది. మిగిలిన సొమ్ము సంగతి తేల్చలేదు. తెలంగాణ డబ్బులు ఇవ్వకపోతే తమ జెన్కోను ఎలా నడిపించాలని ఏపీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. -
ఆర్ధిక సంక్షోభంలో తెలంగాణ జెన్కో
-
ముంచుకొస్తున్న విద్యుత్ కొరత
అడుగంటుతున్న జలాశయాలు సాక్షి, హైదరాబాద్: ఒకవైపు జలవిద్యుత్ ఉత్పత్తి ఆశలు సన్నగిల్లుతున్నాయి. మరోవైపు సర్కార్ నిర్లక్ష్యంతో సోలార్ విద్యుత్ వ్యవహారం టెండర్లలోనే మగ్గుతోంది. దీంతో వచ్చే వేసవిలో తెలంగాణలో చీకట్లు కమ్ముకునే ప్రమాదం ముంచుకొస్తోంది. జలవిద్యుత్‌కు కీలకమైన నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లో గత ఏడాదితో పోలిస్తే నీటి నిల్వలు ఆందోళన కలిగించే స్థాయికి పడిపోయాయి. తెలంగాణ జెన్కో గత వారంలోనే నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పాదన ఆపేసింది. శ్రీశైలం ఎడమగట్టున మాత్రం కొనసాగిస్తోంది. శనివారం 4.77 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయినట్టు జెన్కో వెల్లడించింది. గతమూడు రోజుల్లో 20.55 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసింది. ఆదివారం నాటి గణాంకాల ప్రకారం శ్రీశైలంలో నీటిమట్టం 851.3 అడుగులుంది. 82.9 టీఎంసీల నీరుంది. గత ఏడాది ఇదేరోజున శ్రీశైలంలో 882 అడుగుల నీటిమట్టం నమోదుతో 198.8 టీఎంసీల నీరుంది. అప్పటితో పోలిస్తే విద్యుత్ ఉత్పత్తి అవకాశాలు మూడో వంతుకుపైగా పడిపోయాయి. ఇప్పుడున్న నీరు 296.5 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పాదనకే సరిపోతుంది. నాగార్జునసాగర్‌లోనూ ఇదే విపత్కర పరిస్థితి కొనసాగుతోంది. ప్రస్తుతం 558.4 అడుగుల నీటిమట్టం ఉండగా, నిరుడు ఇదే తేదీన 569.4 అడుగుల నీటిమట్టం ఉంది. గత ఏడాది 678.7 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి సరిపడే నీరుంటే, ఇప్పుడు 533.5 మిలియన్ యూనిట్లకే సరిపోతుంది. దీంతో జలవిద్యుత్ అంచనాలు తలకిందులవుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లు మే, జూన్ నెలలు మినహా పదినెలలపాటు ఈ జలాశయాల్లో విద్యుత్ ఉత్పత్తి జరిగింది. ఇప్పుడున్న నిల్వల ప్రకారం రెండునెలలకు మించి ఉత్పత్తి చేయడం అసాధ్యమని నిపుణులంటున్నారు. ఈలోగా వర్షాలు కురిస్తే తప్ప పరిస్థితి మెరుగుపడదంటున్నారు. రేట్లు ఖరారు ఎప్పుడు ? దీనికి తోడు నిర్ణయాల విషయంలో సర్కార్ అతిజాప్యం అశనిపాతంగా మారనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ కొనుగోలుకు పిలిచిన టెండర్లకు ఆశించిన స్పందన రాలేదు. గతనెలలో తెరిచిన సోలార్ విద్యుత్ టెండర్లు ఇంకా ఖరారు దశలోనే ఉన్నాయి. 500 మెగావాట్ల సోలార్ విద్యుత్‌కు టెండర్లు పిలిస్తే, 1840 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 108 కంపెనీలు ముందుకువచ్చాయి. రేట్లు ఖరారు చేసి, ఇండెంట్ లెటర్లు పంపిస్తే ఈ నెలలోనే కంపెనీలతో ఒప్పందం జరిగేది. 15 నెలల్లో కంపెనీలు విద్యుత్ సరఫరా చేసేవి. అంటే 2016 మార్చినాటికి విద్యుత్ అందుబాటులోకి వచ్చేది. కానీ, నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం అవుతుండటంతో, సౌర విద్యుత్ అందడం మరింత జాప్యమవుతోంది. -
854.90 అడుగులకు శ్రీశైలం నీటిమట్టం
శ్రీశైలంప్రాజెక్టు: శ్రీశైలం జలాశయం నీటిమట్టం గురువారం సాయంత్రానికి 854.90 అడుగులకు చేరింది. ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో తెలంగాణ చేపడుతున్న విద్యుత్ ఉత్పాదన వల్ల నీటిమట్టం తగ్గింది. మరో 0.90 అడుగులకు నీటిమట్టం తగ్గితే మినిమం డ్రా డౌన్ లెవెల్ 854 అడుగులకు చేరుతుంది. అనంతరం కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తే రాయలసీమ రైతులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. తెలంగాణ జెన్కో..5,853 క్యూసెక్కుల నీటితో 2.730 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. -
కొత్త విద్యుత్ ప్లాంట్లపై బీహెచ్ఈఎల్, టీజెన్‌కో చర్చలు
* మొదటి దశలో కొత్తగూడెం ప్రాజెక్టు మూడేళ్లలో విద్యుత్ ఉత్పత్తి: సీఎండీ సాక్షి, హైదరాబాద్: కొత్తవిద్యుత్ కేంద్రాల నిర్మాణంపై తెలంగాణ జెన్కో, కేంద్రప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఈఎల్తో సంప్రతింపులు ప్రారంభించింది. ఇప్పటికే కుదిరిన ఒప్పందం ప్రకారం జెన్కో కొత్తగూడెంలో 800 మెగావాట్ల ప్రాజెక్టు, మణుగూరులో 1,080 మెగావాట్ల (270 మెగావాట్ల చొప్పున మూడు యూనిట్లు) విద్యుత్‌ప్లాంట్ల నిర్మాణాన్ని బీహెచ్ఈఎల్కు అప్పగించింది. ఈపీసీ విధానంలో చేపట్టే ఈ పనులకు సంబంధించి రేట్లు, కాంట్రాక్టు షరతులు, నిబంధనలపై చర్చలు జరిపేందుకు టీ-జెన్కో ఒక కమిటీని నియమించింది. జెన్కో డెరైక్టర్ (థర్మల్) ఎం.సచ్చిదానందం సారథ్యంలో చీఫ్ ఇంజనీర్ (థర్మల్), ఫైనాన్షియల్, కంపెనీ లా అడ్వయిజర్లు, ప్లాంట్ చీఫ్ ఇంజనీర్, సీఎండీ విభాగపు డివిజనల్ ఇంజనీర్ ఈ కమిటీలో ఉన్నారు. బీహెచ్ఈఎల్ కంపెనీ ప్రతినిధులు టీఎస్ జెన్కో సీఎండీ ప్రభాకరరావు, థర్మల్ డెరైక్టర్లను సోమవారం కలిశారు. తొలిదశలో కొత్తగూడెం 800 మెగావాట్ల ప్రాజెక్టు చేపట్టే అంశంపైనే చర్చలు జరిగినట్టు తెలిసింది. మరో రెండు,మూడు సమావేశాల అనంతరం రేట్లు, నిబంధనలు ఖరారవుతాయని అధికారవర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టును వీలైనంత వేగంగా పూర్తి చేసేందుకు బీహెచ్ఈఎల్ అంగీకారం తెలిపిందని.. ప్రారంభించిన నాటి నుంచి మూడేళ్ల వ్యవధిలో విద్యుదుత్పత్తి ప్రారంభమవుతుందని టీఎస్ జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. -
విద్యుదుత్పత్తిలో టీజెన్‌కో రికార్డు
79.21 శాతం పీఎల్ఎఫ్ నమోదు దేశంలోనే రెండో స్థానం ఏపీజెన్కోకు మూడో స్థానం నంబర్ వన్ స్థానంలో ఒడిశా సాక్షి, హైదరాబాద్: విద్యుత్తు ఉత్పత్తిలో తెలంగాణ జెన్కో రికార్డు నెలకొల్పింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని విద్యుత్తు ప్లాంట్ల సామర్థ్యాన్ని విశ్లేషిస్తూ సగటున 79.21 శాతం విద్యుత్తు ఉత్పత్తి జరిగినట్లు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నిర్ధారించింది. ఇటీవలే దేశవ్యాప్తంగా అన్ని థర్మల్ పవర్ ప్లాంట్ల ఉత్పత్తి ప్రగతి నివేదికలను అథారిటీ విడుదల చేసింది. ప్లాంట్ల వారీగా ప్రతి నెలా విద్యుత్తు ఉత్పత్తి గణాంకాల ఆధారంగా ఈ నివేదికను తయారు చేసింది. దీని ప్రకారం... ఒడిశా రాష్ట్రంలోని విద్యుత్తు ప్లాంట్లు ఉత్పత్తిలో నంబర్ వన్‌గా నిలిచాయి. అత్యధికంగా 81.71 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌తో ఒడిశా దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడు నెలల వ్యవధిలో దేశంలో సగటున ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 64.82 శాతంగా నమోదైంది. తెలంగాణ జెన్కో అంతకంటే 14.39 శాతం ఎక్కువ పీఎల్ఎఫ్ శాతం నమోదు చేయడం విశేషం. తెలంగాణ జెన్కో అధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న థర్మల్ విద్యుత్తు ప్లాంట్ల మొత్తం సామర్థ్యం 2082.5 మెగావాట్లు. కాగా, 76.90 శాతం పీఎల్‌ఎఫ్‌తో ఏపీ జెన్కో మూడో స్థానంలో ఉంది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు.. వరుసగా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నట్లు సీఈఏ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల అధ్వర్యంలో ఉన్న థర్మల్ విద్యుత్తు ప్లాంట్లకు సంబంధించి భూపాలపల్లిలోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ) దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 94.35 శాతంగా నమోదైంది. ప్రైవేటు, ప్రభుత్వరంగంలోని విద్యుత్తు ప్లాంట్లన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే కేటీపీపీ తొమ్మిదో స్థానంలో నిలిచింది. తెలంగాణలో విద్యుత్తు కొరతను అధిగమించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా అన్ని యూనిట్లలో ఉత్పత్తి సామర్థ్యం మెరుగుపడిందని, అందుకే రికార్డు స్థాయిలో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ సాధించగలిగామని టీఎస్జెన్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ప్రభాకర్‌రావు తెలిపారు. -
విద్యుత్ ప్రాజెక్టుల్లో మా వాటా ఇప్పించండి
షీలా బిడే కమిటీ దృష్టికి తెచ్చిన తెలంగాణ జెన్కో సాక్షి, హైదరాబాద్: అంతరాష్ట్ర విద్యుత్ ప్రాజెక్టుల్లో తెలంగాణకు వాటా రావాల్సి ఉందని షీలా బిడే కమిటీ దృష్టికి తెలంగాణ జెన్కో తీసుకువచ్చింది. ప్రభుత్వరంగ సంస్థల విభజనపై ఏర్పడిన ఈ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా మాచ్‌ఖండ్, తుంగభద్ర డ్యాం విద్యుత్ ప్రాజెక్టుల్లో తెలంగాణకు వాటా ఇవ్వలేదని టీ జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు కమిటీకి విన్నవించారు. అదేవిధంగా, నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ డ్యాం పవర్‌హౌస్ ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా.. ఇందులో 300 కోట్ల అప్పును తెలంగాణపై మోపారని సీఎండీ విమర్శించారు. ఈ రెండు సమస్యలను పరిష్కరించాలని కోరారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలకు సంబంధించి బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇచ్చిన తుది తీర్పును గెజిట్‌లో ప్రచురించరాదంటూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్ కానుంది. ఈ మేరకు బుధవారం తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలిసింది. ఇందుకోసం రాష్ట్రానికి చెందిన న్యాయవాదులు మంగళవారమే ఢిల్లీ వెళ్లారు. -
గోల గోల
కొత్తగూడెం/ పాల్వంచ రూరల్ : తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో పాల్వంచలో నిర్మించనున్న కేటీపీఎస్ ఏడో దశ నిర్మాణానికి పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ గందరగోళంగా సాగింది. కేటీపీఎస్ విద్యుత్ కళాభారతి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభకు వచ్చిన వారిని అడుగడుగునా తనిఖీ చేయడంతో ప్రారంభంలోనే పోలీసులకు - ప్రజలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వారి వైఖరి పట్ల సీపీఐ, సీపీఎం, టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారికి - పోలీసులకు మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. ఇక సభ ప్రారంభం కాగానే స్థానిక జెడ్పీటీసీ, సర్పంచ్‌లను వేదికపైకి పిలవకపోవడంతో వారు సభా ప్రాంగణం ఎదుటే బైఠాయించారు. అయితే వేదికపై స్థలం తక్కువగా ఉండడం వల్లే పిలువలేదని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ సముదాయించినా వారు శాంతించలేదు. దీంతో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకొని జెడ్పీటీసీ, సొసైటీ అధ్యక్షులను వేదికపైకి పిలవాలని కలెక్టర్‌కు సూచించారు. కాగా, తమను అవమానించారంటూ అప్పటికే వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం.. 6వ దశలో క్యాజువల్ లేబర్‌గా తీసుకుని ఇటీవల తొలగించడాన్ని నిరసిస్తూ గిరిజన సంఘాలు ప్లకార్డులతో నిరసన తెలిపాయి. ఇలా గందరగోళం మధ్యనే సభ కొనసాగింది. మూడేళ్లలో 10 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం : సీఎండీ విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రానికి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడిందని, వచ్చే మూడేళ్లలో 10,793 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని తెలంగాణ జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 4,365.26 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని, అందులో 2,282 మెగావాట్ల థర్మల్ పవర్, 2,081 మెగావాట్ల జల విద్యుత్, ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ వస్తోందని చెప్పారు. విద్యుత్ లోటు పూడ్చుకునేందుకు కొత్త ప్రాజెక్టులు నిర్మించాలని సీఎం కేసీఆర్ సూచించారని, వచ్చే మూడేళ్లలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశామని వివరించారు. దీంతోపాటు ఛత్తీస్‌గఢ్ నుంచి 2 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. విద్యుత్ కొరతతో ప్రస్తుతం గృహావసరాలతోపాటు చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో నిర్వాసితులయ్యే వారికి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. దీంతోపాటు సీఎస్ఆర్ పాలసీ కింద రూ.21 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు జెన్కో కట్టుబడి ఉందన్నారు. విద్యుత్ కొరతను అధిగమిస్తేనే బంగారు తెలంగాణ : పొంగులేటి ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రాజెక్టుల నిర్మాణం ఎంతో అవసరమని, వాటిని తమ పార్టీ ఎప్పటికీ వ్యతిరేకించదని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ సాధించుకోవాలంటే విద్యుత్ కొరతను అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ప్రాజెక్టుల నిర్మాణం ఎంత ముఖ్యమో, దానివల్ల నిర్వాసితులయ్యే వారికి, కాలుష్యం బారిన పడుతున్న వారికి న్యాయం చేయడం కూడా అంతే ముఖ్యమని సూచించారు. భూ నిర్వాసితుల కుటుంబాలకు కేటీపీఎస్‌లో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాలుష్య ప్రభావిత ప్రాంతాలలో సంస్థ ఆధ్వర్యంలో విద్య, వైద్య, మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా సీఎస్ఆర్ పాలసీని సక్రమంగా అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. కొత్త టెక్నాలజీని వినియోగించి కాలుష్యం ఎక్కువగా రాకుండా చూడాలని కోరారు. దీంతోపాటు యాష్పాండ్లు ఎక్కువగా నిర్మించి జల కాలుష్యం పెరగకుండా చూడాలన్నారు. 6 దశల ద్వారా కేవలం 1720 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేశారని, 7వ దశ ద్వారా 800 మెగావాట్ల ప్లాంటును నిర్మించడం అభినందనీయమన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అనంతరం విద్యుత్ ఇంజనీర్లకు, సిబ్బందికి శిక్షణ ఇచ్చే వీటీసీ విజయవాడకు వెళ్లిందని, దాన్ని కేటీపీఎస్‌లో ఏర్పాటు చేయాలని కోరారు. కొత్త ప్రాజెక్టులు రావడం వల్ల స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్నారు. కేటీపీఎస్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు దళారులు అమాయకులను మోసం చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేటీపీఎస్‌లోని 1 నుంచి మూడు యూనిట్ల కాలపరిమితి ముగిసిందని, వాటి స్థానంలో కొత్త ప్రాజెక్టులు నిర్మించాలని కోరారు. 6వ దశ నిర్మాణంలో తీసుకున్న 409 మంది క్యాజువల్ కార్మికులను పది నెలల తర్వాత తొలగించారని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేటీపీఎస్ కాలుష్యంతో కిన్నెరసాని నది కలుషితం అవుతోందన్నారు. మరిన్ని గ్రామాలను కేటీపీఎస్ దత్తత తీసుకొని అక్కడ సీఎస్ఆర్ పాలసీని అమలు చేయాలని కోరారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతంలో ప్రాజెక్టులను నిర్మిస్తునప్పటికీ ఆ వర్గాల వారికి మాత్రం ఉద్యోగాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోస్టర్ పద్ధతిని పటిష్టంగా అమలు చేసి గిరిజనులకు, దళితులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో కేటీపీఎస్ నిర్మాణ సమయంలో ప్రమాదవశాత్తు కొందరు మృతి చెందారని, వారి కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం చేయలేదని అన్నారు. వైరా ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు పర్యావరణ సమతుల్యత పాటించాలని కోరారు. కేటీపీఎస్ కాలుష్యంతో అనేక గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాల్సిన కేటీపీఎస్ అధికారులు.. ప్రస్తుతం లక్ష మొక్కలను మాత్రమే నాటుతామని చెప్పడం దారుణమని విమర్శించారు. సంస్థ ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ నారాయణ పాల్గొన్నారు.